పేజీలు

13, ఏప్రిల్ 2017, గురువారం

వాట్సప్ పంచ్

మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా పుణ్యమాని ముఖాముఖి మాటలకు బదులు చాటింగ్ లు, బంధుత్వ పలకరింపులకు బదులు లైకింగ్ లు, అభిరుచి వ్యక్తీకరణకు లేదా భావ ప్రకటనకు షేరింగులు అలవాటయిపోయాయి. వ్యక్తులు ఎదురుపడితే మాట్లాడటానికి తెగ మొహమాట పడిపోయి, బింకంగా సిగ్గుపడుతూ, ముడుచుకు పోయే వారు సైతం సోషల్ మీడియాలో విభిన్న ఫోజుల్లో సెల్ఫీలు పెడతారు. 'lol' అంటూ డైనమిక్ గా మాట్లాడతారు.  రాబోయే రోజుల్లో మానవ సంబంధాలు ఎలా ఉంటాయో ఊహిస్తూ ఇదే సోషల్ మీడియాలో కొన్ని జోకులు కూడా వైరల్ (వైరల్ అంటే అదేదో జబ్బు అనుకునేరు... బాగా వ్యాప్తి పొందుతోంది అని చెప్పడానికి షార్ట్ కట్ అన్నమాట) అవుతున్నాయి. అందులో ఒకటి ఇలా ఉంది. 

ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి చేరిన బంధువులు అతనితో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతని మంచిని గురించి నాలుగు మాటలు చెప్పుకోవడం పరిపాటి. అలా చెప్పుకుంటున్నప్పుడు ఇదివరకు ఎలా మాట్లాడుకునేవారో మనందరికీ అనుభవమే. కాకపోతే భవిష్యత్తులో ఎలా చెప్పుకుంటారో విందాం. 

రాబోయే రోజుల్లో ఎవరయినా పొతే ఆ వ్యక్తి గురించి కామెంట్లు ఇలా ఉంటాయి ....

 • పాపం! చాలా మంచిమనిషి. ఎపుడూ ఆన్ లైన్ లో ఉండేవాడు.. నిన్న రాత్రి గూడా పేస్ బుక్ లో మా చిన్నోడి ఫోటో పెడితే లైక్ కొట్టాడు. ఇంతలో ఏంటో ఇలా.   
 • ఎంత మర్యాదస్తుడని... !  ఇంటికి ఎవరన్నా అతిథి రాగానే, “మీ మొబైల్ ఛార్జింగ్ లో పెట్టమంటారా..?” అని అడిగేవాడు. 
 • అంతేనా “Wi-fi పాస్ వర్డ్ ఇమ్మంటారా..?” అని అడిగిమరీ ఇచ్చేవాడు. 
 • అందరి పోస్టులకు లైక్ లు కొట్టేవాడు..
 • కరెంట్ లేకున్నా ఛార్జింగ్ తగ్గకుండా పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసేవాడు..
 • అతను చేసే కామెంట్స్ ఎంత హుందాగా ఉండేవని... 
 • పాపం రోజు ప్రొఫైల్ ఫోటో మార్చేవాడు..
 • జీవితాంతం ఒకే అకౌంట్  మీద బ్రతికాడు..

2, నవంబర్ 2016, బుధవారం

నవంబర్ కాదు మొవంబర్
అది 1999వ సంవత్సరం. దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ ప్రాంతంలో ఓ రాత్రి పబ్ లో కూర్చున్నారు కొంతమంది మిత్రులు. వారి మాటల్లో పుట్టింది 'మొవంబర్' అన్న పదం. నవంబర్ నెల పొడుగునా మీసాలను కత్తిరించకుండా పెంచి, తద్వారా మిగిలిన డబ్బులతో పాటు, మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బుల్ని స్వచ్ఛందంగా ఒక సామాజిక కార్యక్రమం కోసం దానమివ్వాలి. అదీ 'మొవంబర్' లక్ష్యం. అంతే అప్పటికప్పుడు 80 మంది సభ్యులతో 'మొవంబర్ కమిటీ' ఏర్పడింది. RSPCA అంటే 'రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ అఫ్ క్రూయల్టీ టు ఏనిమల్స్' కోసం వారంతా ప్రత్యేకమైన నినాదాలతో కూడిన టి షర్టులను అమ్మి తద్వారా పోగైన నిధిని సంస్థకు అందించారు. త్వరలోనే ఇది దేశవ్యాప్త చర్చ అయ్యింది. నవంబర్ నుంచి 'ఎన్' అనే అక్షరాన్ని తీసి 'ఎమ్' అనే అక్షరాన్ని చేర్చడానికి కారణం ఆంగ్లంలో మీసాలను 'moustache' అంటాం. అలా నవంబర్ కాస్తా 'మొవంబర్' అయ్యింది. 
   

 మొవంబర్ ఫౌండేషన్


ఇది జరిగిన కొన్నాళ్లకు 2004లో విక్టోరియా లోని మెల్బోర్న్ ప్రాంతానికి చెందిన 30 మంది మగవారితో కూడిన మరో బృందం మగవారిలో ప్రోస్టేట్ కాన్సర్ పట్ల అవగాహన కలిగించడానికి, మానసిక కృంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడుతోన్న మగవారిలో స్థయిర్యం నింపేందుకు నవంబర్ నెల 30 రోజులూ మీసాలు పెంచడమే కాకుండా పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బృందమే తరువాతి కాలంలో 'మొవంబర్ ఫౌండేషన్ చారిటీ'గా పేరుపొందింది.        

కాన్సర్ అవగాహన కార్యక్రమాలను మామూలుగా నిర్వహిస్తే సరిపోతుంది కదా. మీసాలు గడ్డాలు పెంచడం దేనికి అనేగా మీ సందేహం! కాన్సర్ సోకిన వారికి అందించే రేడియేషన్ చికిత్స వల్ల వారి వెంట్రుకలు రాలిపోతాయి. రూపురేఖలు మారిపోతాయి. అందువల్ల వారికి సంఘీభావం తెలపడానికే మొవంబర్ సభ్యులు మీసాలు, గడ్డాలు పెంచుతారు. ముఖాలలో మార్పుతో పాటు సమాజంలో మార్పు కనబడాలనేది వారి సిద్ధాంతం. 'మగవారి ఆరోగ్య చిత్రాన్ని మార్చండి' ( change the face of men's health) అన్నది వారి నినాదం. 

ఈ మొవంబర్ ఫౌండేషన్ సంస్థ కార్యకలాపాలు దక్షిణాఫ్రికా, యూరోప్ దేశాల మీదుగా 2006లో ఉత్తర అమెరికాకు విస్తరించాయి. అక్కడి నుంచి ఇది మరింత ఉద్యమ రూపుదాల్చింది. 2012లో ఒక్క యునైటెడ్ స్టేట్స్ లోనే 11లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్క ఆ ఏడాదిలోనే 95 మిలియన్ డాలర్ల నిధులను మొవంబర్ ఫౌండేషన్ కు అందించారు. 

ఇందులో పాల్గొనే వారిని 'మొ బ్రోస్' (Mo Bros) అని పిలుస్తుంది మొవంబర్ ఫౌండేషన్. అన్నట్టు 'మొ సిస్టా'లు కూడా అంటే ఆడవారు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ ఏడాది ' Grow a Mo, save a Bro' అన్న నినాదంతో ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చింది MOVEMBER FOUNDATION. మగవారిలో ప్రోస్టేట్ కాన్సర్, టెస్టిక్యూలర్ కాన్సర్, మెంటల్ హెల్త్ అండ్ సూసైడ్ ప్రివెన్షన్ అన్న విషయాలపై పోరాడుతూ తోటి మగవారిని చిన్న వయసులోనే మరణించకుండా ఆపేందుకు గత 13 సంవత్సరాలుగా దాదాపు 1200 కార్యక్రమాలను చేపట్టింది మొవంబర్ ఫౌండేషన్. మీరు కూడా ఈ మొవంబర్ కార్యక్రమంలో పాల్గొనాలంటే 30 రోజుల పాటు మీసం పెంచండి, ఏదో ఒక కార్యక్రమాన్ని వ్యక్తిగతంగానో, జట్టుగానో చేపట్టి విరాళాలు పోగుచేయండి.  మొవంబర్ ఫౌండేషన్ కు పంపండి. అంత చేయలేం అనుకుంటే కనీసం మొవంబర్ ఫౌండేషన్ విరాళాల కోసం అమ్ముతున్న మొవంబర్ టి షర్టులను, టోపీలను, జేబు రుమాళ్ళను కొనవచ్చు. వీటన్నిటి కంటే ముందు www. movember.com  కు వెళ్లి మీ పేరు నమోదు చేసుకోండి. 

 

ద ఇంటర్నేషనల్ మాన్ ఆఫ్ మొవంబర్ 


మొవంబర్ కార్యక్రమాల్లో 21 దేశాల నుంచి 50 లక్షల మంది పాల్గొంటారు. ప్రతి దేశం నుంచి ఒక 'నేషనల్ మాన్ ఆఫ్ మొవంబర్' ను ఆ దేశ మొ బ్రోస్ ఎన్నుకుంటారు. అలా ఎంపికైన 21 మంది నుండి 'ఇంటర్నేషనల్ మాన్ ఆఫ్ మొవంబర్' ను ఎంపికచేసి ఒక కిరీటాన్ని ఇస్తుంది మొవంబర్ ఫౌండేషన్. ఏడాది పాటు ఆ వ్యక్తి ఈ కిరీటాన్ని ధరించ వచ్చు. 

ఇకపొతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నటులు, క్రీడాకారులు ఎందరో మొవంబర్ ఫౌండేషన్ కు మద్దతునిస్తూ 'మొ బ్రోస్' గా మారారు. భారతదేశానికి సంబంధించి క్రికెటర్ రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, నటుడు రణవీర్ సింగ్ లు మొవంబర్ ఫౌండేషన్ మద్దతుదారులే.                   

22, సెప్టెంబర్ 2016, గురువారం

వాట్సప్ పంచ్నిను వీడని నీడను నేనే... !  


ఒక మారుమూల అందమైన ప్రదేశానికి పని మీద వెళ్ళిన ఒకతను అప్పుడే హోటల్లో దిగాడు. భార్య కూడా ఆ ప్రదేశం చూస్తే బాగుండు అనుకున్నాడు. ఎలాగూ కొద్ది రోజులుగా ఇద్దరికీ కీచులాటలతో మనసు చికాకుగా ఉంది. ఈ ఊరికి వచ్చేటప్పుడు కూడా ఒకరినొకరు అరచుకున్నారు. ఈ సమయంలో ఇలాంటి చోట ఇద్దరం గడిపితే చికాకులు తొలగిపోతాయి. మనసులు ప్రేమతో రీఛార్జ్ అవుతాయి. సంసారంలో మళ్ళీ నూతన ఉత్తేజం కలుగుతుంది. 

కానీ ఎలా? ఫోన్ చేసి రమ్మంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాననే అంటుంది. అందుకని మరుసటి రోజే ఆమె అక్కడుండేలా టిక్కట్ల దగ్గర్నుంచి అన్ని ఏర్పాట్లు భార్యను అడక్కుండానే చేసేశాడు. ఆ తర్వాత కూడా ఫోను చెయ్యకుండా భార్యను ఇంకా సర్ ప్రైజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో  ఇదే విషయాన్నీ ఆమెకు మెయిల్ పెట్టాడు. అయితే ఆ ఎగ్జైట్ మెంట్ లో భార్య మెయిల్ అడ్రెస్ ను తప్పుగా టైప్ చేశాడు. 

కట్ చేస్తే...  

ఒకామె భర్త అకస్మాత్తుగా చనిపోయాడు. భర్త అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికి తిరిగి వచ్చిన ఆమె మెయిల్ బాక్స్ తెరచి ఎవరెవరి నుంచి సంతాప సందేశాలు వచ్చాయో చూద్దామనుకుంది. పరధ్యానంగా మొదటి మెయిల్ తెరచి చదివింది. దాన్ని చదువుతూనే స్పృహ తప్పి కింద పడిపోయింది. శబ్దం విని ఆ గదిలోకి పరుగున వచ్చిన ఆమె కొడుకు కంప్యూటర్ ఆన్ లో ఉండటం, మెయిల్ కూడా తెరచి ఉండటంతో విషయం తెలుసుకుందామని చదివాడు. అందులో ఇలా ఉంది...      
''నా ప్రియమైన శ్రీమతికి... 
ఎలా ఉన్నావు?  నాకు తెలుసు ఈ సమయంలో నా దగ్గర నుంచి మెయిల్ అనగానే నువ్వు ఆశ్చర్యపోతావు. నేనిప్పుడే ఇక్కడకు చేరుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ కంప్యూటర్లు కూడా ఉన్నాయి. పైగా మీ వాళ్ళకు మెయిల్ చేసుకునే వాళ్ళు చేసుకోండి అని కూడా మాకు వీళ్ళు ఆఫర్ ఇస్తూ వై ఫై పాస్ వర్డ్ చెప్పారు. పిల్లలెలా ఉన్నారు? ఇదో కొత్త లోకంలా ఉంది. కానీ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒంటరిగా ఉండటం నా వల్ల కావట్లేదు. అందుకే నిన్ను కూడా ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశాను. ప్రియా! రేపు ఈ వేళకు నువ్వు ఇక్కడ... ఈ కొత్త లోకంలో నాతో పాటు ఉంటావు. పిల్లల గురించి బెంగపడకు. మీ అమ్మ ఉందిగా చూసుకుంటుంది. ఆలస్యం చేయకు వచ్చేసేయ్. నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను.'' 

20, ఆగస్టు 2016, శనివారం

ఈ విజయం ఎవరిది?
గెలుపును పంచుకోడానికి అందరూ వస్తారు. అదే ఓటమి భారాన్ని మాత్రం మనం మాత్రమే మోయాలి.  

పి.వి. సింధు సాధించిన విజయం దేశానికి గర్వకారణం అనడంలో మరోమాట లేదు. ఈ విజయం ఆమె గెలవాలని కోరుకున్న ప్రతి భారతీయుడికీ చెందుతుంది. ఇంతటి విజయం తరవాత సింధు అందరి అమ్మాయి అయ్యింది. రజనీతో సహా  అమితాబ్ నుండి సల్మాన్ వరకు ఆమె ఫాన్స్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ ఆమెకు కోట్లు ఇచ్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలయ్యేటప్పటికీ సింధు మా అమ్మాయంటే కాదు మా బిడ్డ అని పంచుకుంటున్నారు.  సింధుకు శిక్షణనిచ్చిన గోపీచంద్ అందరివాడు అయ్యాడు. మరి వారు ఇన్నేళ్ళు  పడిన కష్టం సంగతి ఏంటి? తమ ఆటను, ఆశయాన్నీ  బ్రతికించుకొనేందుకు వారు తపిస్తున్న వేళలో, చేయూత కోసం ఎదురుచూస్తున్న వేళలో వారిని ప్రోత్సహించింది ఎవరు?
ఉదయం రెండున్నరకు లేచి కూతురికి అన్నీ సమకూర్చిన సింధు కన్నతల్లి. ప్రతిరోజూ దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సింధుకు శిక్షణ ఇప్పించిన తండ్రి, ప్రతి రోజూ ఉదయం మూడు గంటలకే లేచి శిక్షణ ఇచ్చే గురువు గోపీచంద్, రోజుకు ఏడు  గంటలు ప్రాక్టీస్ చేసిన సింధు...  వీళ్ళందరూ ఏళ్ళ తరబడి కష్టపడితే దక్కిన ఫలమిది. ఇప్పుడు ఈ విజయాన్ని ఎవరికి వారు పంచేసుకోడానికి వస్తే ఏమనాలి?               

అయితే  ఈనాటి వీరి  విజయాల  వెనుక దార్శనిక పాలకుడు నారా చంద్రబాబు నాయుడి ప్రోత్సాహం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇదే విషయాన్ని చంద్రబాబు విశాఖలో అనగానే  సామాజిక మాధ్యమంలో కొంతమంది జోకులు పేల్చారు. ఇలాంటి వాళ్ళే సింధు కులం ఏంటి అని కూడా గూగుల్ లో వెదికారు. కానీ జాతి ప్రజల ఒలింపిక్ కలలు సాకారం చేసేందుకు కారణమైన గోపీచంద్ అకాడమీ పుట్టు పూర్వోత్తరాలకు చంద్రబాబుకు సంబంధం ఉంది.   

ఒలింపిక్ విజయం ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదు. రాళ్ళలో వజ్రాలను గుర్తించి సానపెట్టిన శ్రమ ఒక్కనాటిది కాదు. తన అకాడమీ ద్వారా జాతి రత్నాలను అందించాలనే  గోపీచంద్ ఆశయం...  'గోపీచంద్ అకాడమీ' రూపుదాల్చడానికి చంద్రబాబునాయుడే కారణం. ఎలా అంటే...   

2002లో 32వ నేషనల్ గేమ్స్, 2003లో మొదటి ఆఫ్రో-ఆసియన్ గేమ్స్ ను హైదరాబాదులో నిర్వహించి నగరానికి క్రీడా రాజధానిగా ప్రపంచ గుర్తింపు తెచ్చారు చంద్రబాబు. అందువల్లే 2010 లో కామన్వెల్త్ క్రీడలను ఢిల్లీ లో నిర్వహించే అవకాశం మనకొచ్చింది. కానీ అందులోనూ అవినీతికి పాల్పడి దేశానికి అపఖ్యాతిని మిగిల్చింది కాంగ్రెస్. అది వేరే సంగతి. 

ఆఫ్రో ఆసియన్ గేమ్స్ ను నిర్వహించడం ద్వారా ఎందరో క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు చంద్రబాబు. గోపీచంద్ 2001లో 'ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్' గెలుచుకుని వచ్చినప్పుడు అతనిని నగదు పురస్కారంతో సత్కరించడమే కాకుండా... అకాడెమీ పెట్టుకోడానికి భూమిని కూడా కేటాయించారు చంద్రబాబు. అకాడమీ ద్వారా గోపీచంద్ లాంటి క్రీడాకారులు మరింతమంది పుట్టుకురావాలని ఆయన ఉద్దేశ్యం. ఆయన అనుకున్నట్టుగానే ఆ తర్వాత అకాడెమీ నుంచి ఒక సైనా నెహ్వాల్, ఒక సింధులాంటివాళ్లు తయారయ్యారు. 

గోపీచంద్ మూలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఆయన క్రీడాకారుడిగా గుర్తింపు పొందక ముందు ఏపీఎస్ ఆర్టీసీలో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లోనూ పనిచేశారు. అప్పట్లో గోపీచంద్ కు శిక్షణ ఇచ్చిన ఏపీ బాడ్మింటన్ అకాడమీలోని కోచ్ మొహమ్మద్ ఆరీఫ్ ను కూడా నాడు చంద్రబాబు అభినందించారు. ప్రభుత్వం తరపున గోపీచంద్ కు 25లక్షల రూపాయలు ఇచ్చారు. దాంతో పాటు హైద్రాబాదులో ప్రపంచ స్థాయి బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచెయ్యమని ప్రోత్సహిస్తూ భూమిని కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన వై ఎస్ సర్కారు గోపీచంద్ ను నానా ఇబ్బందులు పెట్టింది. చంద్రబాబు ఇచ్చిన స్థలం తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయమని ఒత్తిడి తెచ్చింది. దానిపై గోపీచంద్ హై కోర్ట్ వరకు వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు నేరుగా వై ఎస్ ను కలిసి భూమికోసం ప్రాధేయపడాల్సి వచ్చింది.   

అకాడమీ కోసం, ఆశయం కోసం గోపీచంద్  ఇంత పోరాటం చేశాడు కనుకనే ఒలింపిక్ 2012, 2016 లలో మన దేశానికి పతకాలు వచ్చాయి. నేడు మనం సాధించిన ఈ పతకాల వెనుక ఇంత పెద్ద కథ ఉంది. గోపీచంద్ లాంటి గురువు, చంద్రబాబులాంటి దార్శనిక నేత లేకపోతే ఈనాడు ఒక సైనా లేదు. ఒక సింధు లేదు. పారుపల్లి  కశ్యప్, కిదాంబి శ్రీకాంత్ వంటి క్రీడాకారులు లేరు.   ఈ పతకాలు లేవు. సాధారణంగా రాజకీయ నేతలు క్రీడల మీద ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి అప్పటికి అప్పుడు ఫలితాలను ఇవ్వవు. అందువల్ల ఓట్లు రాలవు. క్రీడాకారులు రాటుదేలి పతకాలు తెచ్చేందుకు కనీసం 10-15 ఏళ్ళు పడుతుంది. ఈ లోపు సదరు ప్రభుత్వం పదవిని కోల్పోతుంది. ఆ నేతలు చేసిన మంచిని జనం మర్చిపోతారు. ఒకవేళ ఆ నేతలే గుర్తుచేస్తే  ఇప్పుడు చంద్రబాబు మీద జోకులేసుకున్నట్టే వేసుకుంటారు. అసలు వై ఎస్ ప్రభుత్వం భూమిని లాగేసుకుని ఉంటే ఈ అకాడెమీ ఉండేది కాదు. ఈ సింధు ఉండేది కాదు. పతకాలు ఉండేవి కావు. చంద్రబాబుకు చెప్పుకోవాల్సిన అవసరమూ వచ్చేది కాదు.

కానీ చంద్రబాబు అలా కాదు.  2001లో ఆయన అందించిన ప్రోత్సాహం... 15 ఏళ్లపాటు గోపీచంద్ పడిన కష్టం,ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఫలితాలను ఇచ్చాయి. దీన్నే దార్శనికత అంటాం. భారతదేశానికి ఇలాంటి పతకాలు ఇంకా రావాలంటే చంద్రబాబులాంటి రాజకీయ నాయకులు, గోపీచంద్ లాంటి అంకితభావం కలిగిన కోచ్ లు ఇంకా కావాలి. 

20, జులై 2016, బుధవారం

వాట్సప్ పంచ్ (తనదాకా వస్తే గానీ... )

తనదాకా వస్తే గానీ...    
 
టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోసామి ఒక రైతును ఇంటర్వ్యూ చేస్తున్నాడు. 

అర్నబ్: మీ మేకలకు ఏం మేపుతారు?

రైతు: ఏ మేకకు? తెల్లదానికా? నల్ల మేకకా?

అర్నబ్ : తెల్ల మేకకు ఏం పెడతారు?

రైతు: పచ్చగడ్డి 

అర్నబ్ : మరి నల్ల మేకకు?

రైతు : దానికి కూడా పచ్చగడ్డే పెడతాను. 

అర్నబ్ : మేకలను ఎక్కడ కట్టేస్తారు?

రైతు : తెల్ల మేకనా? నల్ల మేకనా?

అర్నబ్ : తెల్ల మేకను ఎక్కడ కడతారు? 

రైతు : షెడ్డులో

అర్నబ్ : అయితే నల్ల మేకను బయట కట్టేస్తారన్నమాట 

రైతు : కాదు. నల్లమేకను కూడా షెడ్డులోనే కట్టేస్తా. 

అర్నబ్ : రోజూ మేకలను శుభ్రం చేస్తారా?

రైతు : ఆ చేస్తాంగా. 

అర్నబ్ : ఎలా శుభ్రం చేస్తారు ?

రైతు : తెల్ల మేకనా ? నల్ల మేకనా ?

అర్నబ్ : ముందు తెల్ల మేక గురించి చెప్పండి 

రైతు : నీళ్ళతో కడుగుతా. 

అర్నబ్ : మరి నల్ల మేకని?

రైతు : దాన్ని కూడా నీళ్లతోనే కడుగుతా.

అర్నబ్ కు చిర్రెత్తుకొచ్చింది. తానొక జర్నలిస్టునని, చేస్తున్నది లైవ్ ప్రోగ్రామని కూడా మర్చిపోయాడు.
 
అర్నబ్ : ఒరే తెలివితక్కువ సన్నాసి! రెండింటికీ ఒకే జవాబు చెబుతున్నప్పుడు, ప్రతి ప్రశ్నకీ నల్లదా, తెల్లదా అని ఎందుకు అడుగుతున్నవురా?  

రైతు : ఎందుకంటే తెల్ల మేక నాది. 

అర్నబ్ : ఓహో అదా సంగతి. మరి నల్ల మేక ఎవరిది?

రైతు : నల్ల మేక కూడా నాదే. 

అర్నబ్ కళ్ళుతిరిగి పడిపోయాడు. రైతు లేచెళ్ళి అర్నబ్ మొహం మీద నీళ్ళు చల్లి లేపి...  
''ఇప్పుడు అర్థం అయ్యిందా? మీరు టీవీల్లో చెప్పిన విషయమే పది సార్లు, రకరకాలుగా చెప్పి మమ్మల్ని ఎలా విసిగిస్తున్నారో! అందుకే నీకీ ట్విస్ట్ ఇచ్చా.'' అన్నాడు. అంతే!  ప్రత్యర్థుల మీదికి నోరేసుకు పడిపోయే అర్నబ్ కు మాట పెగల్లేదు.                       
   
               

3, మే 2016, మంగళవారం

వాట్సప్ పంచ్

వాట్సప్ పంచ్

ఓ పెద్దాయన హెయిర్ కటింగ్ సెలూన్ కు వెళ్ళాడు.  ఆయనకు అప్పటికే తలమీది వెంట్రుకలన్నీ రాలిపోయి కేవలం 8 వెంట్రుకలు మిగిలాయి. 'వీటిని ఏం చెయ్యమంటారు... కత్తిరించాలా, లెక్క పెట్టాలా ?' వెటకారంగా అడిగాడు బార్బర్. 'కాదోయ్! రంగేయాలి.' తాపీగా చెప్పాడు పెద్దాయన. 'తలలు బోడులైన తలపులు బోడులా' అన్న సామెత గుర్తుకు రావట్లేదూ?!
          

30, డిసెంబర్ 2015, బుధవారం

వాట్సప్ పంచ్ ( రాంబాబు -సోంబాబు)

వాట్సప్ పంచ్  ( రాంబాబు -సోంబాబు) 
  
1
కిరాయి హంతకులైన రాంబాబు, సోంబాబులు ఇద్దరూ ఒక  కారుకు బాంబు ఫిక్స్ చేస్తున్నారు. రాంబాబు ఫిక్స్ చేస్తుండగా సోంబాబు వాడికి సహాయం చేస్తూ అడిగాడు.. 
''ఒక వేళ మనం ఫిక్స్ చేస్తున్నప్పుడే ఈ బాంబు  పేలిపోతే ఏం చేస్తావు?''
''మరేం పర్వాలేదు. నా దగ్గర ఇంకోటి ఉంది''  రాంబాబు సమాధానం.  

2
రాంబాబు: ''కారు కొన్నావంట. ఏ కారు?''
సోంబాబు: ''పేరూ... ఊహు గుర్తుకురావట్లేదు... మొత్తానికి టీతో స్టార్ట్ అవుతుంది''
రాంబాబు: ''వావ్! టీతో స్టార్ట్ అవుతుందంటే.. సూపర్ కారు కొన్నావు. మిగతా కార్లన్నీ పెట్రోల్ పోస్తే గాని స్టార్టవ్వవు.''

3
రాంబాబుకు ఆఫీసులో మొదటి రోజు. రాత్రి పది గంటల వరకూ పని చేస్తున్న రాంబాబును చూసి మేనేజర్ చాలా ముచ్చట పడ్డాడు. వెళ్లి పలకరిద్దామనుకున్నాడు గానీ అతని ఏకాగ్రత చూసి చెడగొట్టడం ఇష్టం లేక ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారి ఆఫీసుకు వచ్చేసరికి రాంబాబు ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి ''గుడ్! రాంబాబు. నీలా రాత్రింబవల్లు పని చేసేవారంటే నాకు చాలా ఇష్టం. ఇంతకూ రాత్రంతా ఏం చేశావు? ''  
'' ఏంలేదు సర్! నాకిచ్చిన కంప్యూటర్ కీ బోర్డులో ఎబిసిడీలన్నీ ఒక ఆర్డర్లో లేవు. రాత్రంతా కూర్చుని సరి చేశా.'' 

4
ఒక మ్యూజియంకు వెళ్ళిన సోంబాబు అక్కడున్న ఒక మట్టి గిన్నెను పట్టుకు చూస్తుంటే కిందపడి అది కాస్తా పగిలిపోయింది. పరుగెత్తుకు వచ్చిన క్యూరేటర్ ''ఎంత పని చేశావయ్యా! అది 5000 ఏళ్ళనాటి పాత్ర. దాని విలువెంతో తెలుసా?'' అన్నాడు. 
''ఓసి అంత పాతదా? ఇంకా నయం కొత్త గిన్నె అనుకుని హడలి చచ్చా. '' అన్నాడు సోంబాబు. 

5
ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగితే చూడ్డానికి వెళ్ళాడు రాంబాబు. అతనికి దగ్గరలో ఒకతను భోరున ఏడుస్తుంటే జాలేసింది. వెళ్ళి ఓదార్చాలనుకున్నాడు. ''ఊరుకోండి''
''ఏడవకుండా ఎలా ఉండను సార్? ప్రమాదంలో నా చెయ్యి పోయింది.'' అంటూ మళ్ళీ ఏడుపు అందుకున్నాడు ఆ క్షతగాత్రుడు. 
''భలేవారే. చెయ్యి కోసమే మీరింతలా ఏడుస్తున్నారు. అతన్ని చూడండి. ఏకంగా తలే తెగిపడింది. అయినా అసలు ఏడవట్లేదు చూడండి?''  
టక్కున ఏడుపాగిపోయింది.    

22, డిసెంబర్ 2015, మంగళవారం

వాట్సప్ పంచ్

                                                           కొరడా దెబ్బలు 

ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 50 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు. వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా, శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు. “ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు. కాబట్టి మీకు శిక్ష విధించబోయే ముందుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంది” అన్నాడు. మొదటగా అమెరికన్ వంతు వచ్చింది. అతను కొద్దిసేపు ఆలోచించి తన వీపుకు ఒక దిండును కట్టమన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ­ అది ఇరవై దెబ్బలకే చినిగిపోయింది. మిగతా దెబ్బలు పూర్తయ్యేసరికి రక్తం కారి గాయాలయ్యాయి. తరువాత పాకిస్థానీ వంతు వచ్చింది. తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు. అతని దురదృష్టం కొద్దీ అదికానీ అవి ముప్పైదెబ్బల వరకే నిలబడ్డాయి. ఆ తర్వాత వీపు విమానం మోత మోగింది.  
చివరగా భారతీయుడి వంతు వచ్చింది. అతను ఏమీ అనకముందే షేక్ “మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు” అన్నాడు. 
“మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నా మొదటి కోరిక ఏంటంటే నాకు యాభై కాదు నూరు కొరడాదెబ్బలు కావాలి” అన్నాడు. 
ఆశ్చర్యపోయిన షేక్ “చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా ­ కనిపిస్తున్నావు. ఎంతయినా భారతీయుడివి కదా. సరే! నీ రెండో కోరిక ఏమిటి?” అడిగాడు.
“ఆ పాకిస్థాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.” అన్నాడు భారతీయుడు. 

19, నవంబర్ 2015, గురువారం

వాట్సప్ పంచ్ - భారతీయుడు

 

భారతదేశం గురించి అధ్యయనం చేసి రమ్మని కొన్ని  ఏలియన్ లను భూమ్మీదకి పంపించారు గ్రహాంతర వాసులు. భారతీయుల సామాజిక లక్షణాలపై అధ్యయనం చేసిన ఒక ఏలియన్ తన నివేదికను ఇలా గమ్మత్తుగా ఇచ్చింది. 

(గమనిక: ఇది కేవలం నవ్వుకోడానికే సుమా! ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వాట్సప్ ను తిట్టుకోండి. ఎందుకంటే ఇది వాట్సప్ లో సర్క్యులేట్ అవుతోంది మరి. నేను కేవలం అనువాదకుడిని మాత్రమే )   

1. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వ్యక్తి వచ్చాడు. వాళ్ళను చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ముంబైలో అంతే. ముంబైలో అంతే        
2. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వ్యక్తి వచ్చాడు. వారిద్దరికీ సర్ది చెప్పబోయాడు. మొదటి ఇద్దరూ ఏకమై మూడోవాడిని చితక్కొట్టారు. ఇది చెన్నై సంగతి.     
3. ఇద్దరు కొట్టుకుంటున్నారు. అక్కడే ఉన్న ఇంట్లోంచి మూడో వ్యక్తి వచ్చాడు. ''ఏయ్! నా ఇంటి ముందు ఏంట్రా గొడవ. అవతలికి పొండి!'' అని అరిచి మళ్ళీ తలుపేసుకున్నాడు.  సాఫ్ట్ వేర్ సంస్థలు, రాత్రి ఉద్యోగాలు కదా! నమ్మ బెంగుళూరు.         
4. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వ్యక్తి బీరు బాటిళ్ళ కేసుతో వచ్చాడు. ముగ్గురూ కూర్చుని బాగా తాగారు. ఒకరిని ఒకరు బాగా తిట్టుకున్నారు. తర్వాత స్నేహితుల్లా కలిసిపోయి ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిందంటే మీరు గోవాలో ఉన్నట్టు. 
5. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆగారు. ఫోన్లు బయటికి తీశారు. ఎవడి స్నేహితులను వాడు పిలుచుకున్నాడు. కట్ చేస్తే 50 మంది కొట్టుకుంటున్నారు. అంటే మీరు స్నేహానికి ప్రాణమిచ్చే పంజాబ్ లో ఉన్నారన్నమాట.                
6. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వాడు వచ్చి ఇద్దరినీ కాల్చిపడేశాడు. ఇలాంటి సంస్కృతి బీహార్ సొంతం. 
7. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వాడు వచ్చి వాళ్ళ కులాల గురించి ఆరా తీశాడు. తన కులం వాడితో చేయికలిపి, వేరే కులం వాడ్ని చావబాదాడు. ఆంధ్రా వాళ్ళకు మరీ ఇంత కులాభిమానమా!? ఏమో మరి.       
కొసమెరుపు:  ఇద్దరు కొట్టుకుంటున్నారు. వారి గొడవను చూడడానికి జనం పోగయ్యారు. ఒకడు తాపీగా వచ్చి అక్కడికక్కడ టీ కొట్టు తెరిచాడు. కేరళానా మజాకా!