పేజీలు

20, జులై 2010, మంగళవారం

బాబ్లీ సమస్య ఎవరిది?

బాబ్లీ విషయంలో బాబుది ఓవర్ యాక్షన్ అని రాజకీయ వ్యాఖ్యలు. ఉప ఎన్నికల దృష్ట్యా లాభ పడేందుకే ఈ రభస అని విశ్లేషకుల అభిప్రాయం కూడా. అయితే అసలు ఈ సమస్య తెలంగాణా రైతులది అన్న విషయం అన్ని పార్టీలు , వార్త చానెళ్ళు, మేధావులు మర్చిపోయినట్టున్నారు.
తెలంగాణా తన సొత్తు అని భావించే కేసీఆర్ బాబ్లీ గురించి పట్టించుకోకపోవడం విడ్డూరం. రాజకీయం కోసమే తెలంగాణా వాదం తప్ప ప్రజల మేలు కోసం కాదన్నది ఆ పార్టీ పాలసీ ఏమో!
ఇక మా పార్టీ హయాంలో తెలంగాణా ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి తెలంగాణా ప్రజలు మమ్మల్నే గెలిపించాలి అని పిలుపు నిచ్చే కాంగ్రెస్స్, బాబ్లీ గురించి ఎనాడైన పట్టించుకుని ఉంటె సమస్య ఇంత దాక వచ్చేదే కాదు. ఇప్పుడు కూడా చంద్రబాబుని ఆడిపోసుకోవడం తప్ప ఆ విషయం మాకు సంబంధించింది కానే కాదు అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఈ విషయంలో కేంద్రం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇది రెండు రాష్ట్రాల సమస్య అట. రాష్ట్రం నుంచి ముడుపులు కావాలి. రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు కావాలి. తెలంగాణా విషయంలో వేలు పెట్టి లబ్ది పొందాలి. కాని బాబ్లి దగ్గరికి వచ్చే సరికి మీరు మీరూ చూసుకోండి అని తప్పించుకుంటారు. కారణం రెండు రాష్ట్రాల్లో ఉన్నది మన పార్టీనే మరి. అందుకే ఇలా మొహం చాటేయడం. అదే ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట వేరే పార్టీ అధికారంలో ఉంటె ఇలాగే మాట్లాడే వారా? పెద్ద రగడ చేసేవారు కాదా? కేంద్ర రాజకీయం మరి!
ఇక కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేని స్థితిలోనే ఉంటుంది. బాబు గొడవతో చిరు చేసిన ఏడుకొండల పాద యాత్ర పబ్లిసిటీకి నోచుకోకుండా పోయింది. సమైక్య నినాదంతో తెలంగాణలో పోగొట్టుకున్న అభిమానాన్ని బాబ్లి విషయంలో చంద్ర బాబుకు మద్దతివ్వడం ద్వారా సంపాదిన్చుకున్దామా అంటే, ఈ మధ్యే కాంగ్రెస్స్ తో కొత్త దోస్తాన కలిసిన్దాయే. వారి మాటే వీరి మాట, వారి బాటయే వీరి బాటగా పరిస్థితి ఉంది. అందుకని వారేమి మాట్లాడే స్థితిలో లేరు.
ఇక వామపక్షాలు కూడా బాబ్లీ విషయంలో చురుకుగా ఏమీ లేరు. కారణం ఏంటో?
ఇలా పార్టీలన్నీ స్వలాభాలే చూసుకుంటుంటే అసలు సమస్య తీరేదెప్పుడు? ఎలాగూ ఏదో కారణంతో బాబు విషయాన్ని ఇంతదాకా లాక్కొచ్చాడు కాబట్టి , పైగా ఇది రాష్ట్ర రైతులందరి సమస్య కాబట్టి, పార్టీలన్నీ భేషజాలను , స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలి. ఇది పార్టీల సమస్య కాదు. ప్రజల సమస్య. రాష్ట్ర సమస్య. అంతకన్నా మించి ఇది మన ఐక్యతను , ఆత్మగౌరవాన్ని చాటే సందర్భం. మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా వాటిని పక్కన పెడదాం. నిజమైన ప్రజా సమస్య గురించి పోరాడదాం.
కొసమెరుపు: మన రాజకీయ నాయకులకు కటిక నేలపై , దోమల మద్య, సరైన సౌకర్యాలు లేని చోట నిద్రించడం అంటే ఏమిటో , ఇలాంటి జీవితాన్ని నిత్యం ఎంత మంది ప్రజలు ఎలా నెట్టుకు వస్తున్నారో అర్థం అయ్యే అవకాశం కలింగించిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకందుకు అభినందించాల్సిందే. మహిళా నాయకులూ ! ఈ మాత్రం దానికే కంటినుండి నీళ్ళు వచ్చాయే మీకు. మీ నియోజక వర్గాల్లో ఎంత మంది మహిళలు ఇలాంటి ప్రత్యక్ష నరకంలో జీవిస్తున్నారో ఇకనైనా ఆరా తీసి, వారి కోసం ఏమైనా చెయ్యగలరా?