పేజీలు

31, జనవరి 2013, గురువారం

స్త్రీ కోరిక...? (తప్పక చదవాల్సిన కథ )

                                                                                                                                          
'ఆడది కోరుకునే వరాలు రెండే రెండు ... పచ్చని సంసారం , చక్కని సంతానం...' అంటూ ఆవిడ కోరికలకు హద్దులు గీసారొక సినీకవి. ఇందులో ఆయన తప్పేమీలేదు. ఎందుకంటే ఆదినుంచీ 'కార్యేషు దాసీ ...' అంటూ మొదలెట్టి నువ్విలాగే ఉండాలి, నువ్వు చేయాల్సిన పనులివే, నీకు కావలసినవి ఇవే అంటూ ... స్త్రీ మనసుకు అడ్డుగోడలు కట్టారు. దాంతో ఆమె కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి నాకు కావాల్సింది ఇంతే అనుకుంటూ బ్రతకసాగింది. ఇప్పటికీ దాదాపు అలాగే బతుకీడుస్తోంది. అందుకే పై పాటల్లాంటివి పుట్టుకొచ్చాయి.

'గాలికదుపు లేదు, కడలికంతు లేదు, గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా ? ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా?...' 
అంటూ తొలి రోజుల్లో స్వేచ్ఛను కోరుకున్న అమ్మాయిలు సైతం, ఆ తర్వాత భర్త కనుసైగల్లొ ఒదిగిపోక తప్పని పరిస్థితులు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉన్నాయి, ఉంటాయి. కానీ స్త్రీ నిజంగా ఏం కోరుకుంటుంది అనేది ఈ కథ స్పష్టంగా చెప్తుంది. అందుకే స్త్రీ, పురుషులు ఇద్దరూ తప్పనిసరిగా ఈ ఆసక్తికరమైన కథను చదవాలి, చదివించాలి అని నాకనిపించింది.
ఇ - మెయిల్ ద్వారా ఓ ఫ్రెండ్ ఆంగ్లంలో పంపిన పిట్టకథ ఇది. నాకు బాగా నచ్చి,  నా బ్లాగులో ఉంచాలనిపించి తెలుగులో ఇంకాస్త ఆసక్తికరంగా ఉండేలా , విస్తరించి అనువాదం చేస్తున్నాను.

కథ :
అనగనగా ఒక యువరాజు. శత్రుదేశపు రాజు చేసిన దండయాత్రలో రాజ్యాన్ని పోగొట్టుకుని, అతని చేతికి బందీగా చిక్కాడు. అలా తన చేతికి చిక్కిన యువరాజును శత్రుశేషం లేకుండా చంపేద్దామనే అనుకున్నాడు శత్రురాజు. కానీ ఆ యువరాజుకు అశేష అభిమానులు ఉన్నారు. అప్పటికే  ప్రజల్లో తిరుగుబాటు సంకేతాలు కనబడుతున్నాయి. అందుకని ఒక షరతు పెట్టాడు శత్రురాజు.

షరతు ప్రకారం రాజు అడిగే ఒక క్లిష్టమైన ప్రశ్నకు యువరాజు సమాధానం చెప్పాలి. వెంటనే చెప్పక్కరలేదందోయ్. కఠినమైన ప్రశ్న కాబట్టి, ఒక సంవత్సరం గడువు కూడా ఇచ్చాడు. పైగా మరో వెసులుబాటు కూడా ఉంది. ఫోన్ ఎ ఫ్రెండ్ లాంటి అవకాశమే.  కాకపోతే అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి  రాజ్యమంతా కలియతిరుగుతూ ఆప్తులను, మేధావులను, పండితులను, అనుభవజ్ఞులను ఎవరినైనా సంప్రదించి సలహా తీసుకోవచ్చు. సంవత్సరం తర్వాత ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే యువరాజుకు ప్రాణాలతో పాటు, స్వేచ్ఛ కూడా లభిస్తుంది. చెప్పలేకపోతే మరణదండన తప్పదు. ఈ షరతుకు యువరాజుతో పాటు, ప్రజలందరూ అంగీకరిస్తారు. అప్పుడు శత్రురాజు ప్రశ్నేంటో చెప్పాడు.

ప్రశ్న: స్త్రీ నిజంగా కోరుకునేదేంటి?   

మొదట ఓసింతేనా అనిపించిన ప్రశ్న కాస్తా, ఆలోచించేకొద్దీ  జటిలమనిపించింది. 'అవును! కష్టమైన ప్రశ్నే' అన్నారు మేథావులు. 'ఊహకు అందడం కష్టం' అన్నారు కవులు. ఇంక లాభం లేదని యువరాజు ఊరు మీద పడ్డాడు. ఏకంగా ఆడవాళ్ళనే అడిగి చూసాడు. చర్చాగోష్టులు నిర్వహించాడు. అయినా సరైన సమాధానం దొరకలేదు. మరోవైపు సమయం మించి పోతోంది. చివరికి ఎవరో పెద్దమనిషి సలహా ఇచ్చాడు. ఆ రాజ్యంలో జనావాసాలకు దూరంగా నివసించే మంత్రగత్తె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలదు అన్నాడు. ఆమె గురించి తెలిసిన వాళ్ళంతా ఔను నిజమే అంటూ అతనితో ఏకీభవించారు. యువరాజు కూడా ఆమె గురించి గతంలో విన్నాడు. అయితే  ఆమెతో లావాదేవీలు చాలా కష్టం. భారీ ప్రతిఫలాన్ని కోరుతుంది. అసలే రాజ్యం పోగొట్టుకుని ఉన్న తాను ఆమె కోరినంత ఇవ్వడం అయ్యేపని కాదు. అందుకని ఆ ప్రయత్నాన్ని చేయలేదతను.

ఇక ఆఖరు రోజు రానే వచ్చింది. మరణదండన తప్పేట్టులేదు.  ఏం చేయడమా అని ఆలోచిస్తుంటే అతని ప్రాణ స్నేహితుడు వచ్చాడు. అతను గతంలో యువరాజు సైన్యంలో ఒక ముఖ్యుడుగా ఉండేవాడు. అతను అందగాడు, ధీరుడు. వీరుడు, నవయవ్వనుడు.

'ఉన్న ఒకే ఒక అవకాశం మంత్రగత్తెను కలవడం. అసలామెను కలిస్తేనే కదా ఆమె అడిగే ప్రతిఫలం గురించి తెలిసేది. అంతగా ఆమె అడిగింది మనం ఇవ్వలేనప్పుడు చూద్దాం. ముందు వెళ్దాం పద!' అన్నాడు.
ఇద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళారు. ప్రశ్న విన్న ఆమె సమాధానం చెప్పడానికి అంగీకరించింది. అయితే ప్రతిఫలంగా డబ్బుకు బదులు మరొకటి అడిగింది. అదేమిటంటే యువరాజుతో పాటుగా వచ్చిన  స్నేహితుడు ఆమెను పెళ్ళి  చేసుకోవాలి.
ఉలిక్కిపడ్డాడు యువరాజు. పళ్ళన్నీ రాలిపోయిన పండు ముసలిది. చూస్తేనే అసహ్యం వేసే కురూపి. దానికి తోడు మాటకు మాటకు మధ్య ఏదో జబ్బువల్ల నోటినుంచి వస్తున్న జుగుప్సాకరమైన శబ్దాలు.  శరీరం నుంచి భరింప లేనంతగా దుర్వాసన. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకోమని ఎలా అనగలడు? తన ప్రాణం కోసం స్నేహితుడి జీవితాన్ని నరకంలోకి తోయాలా? 
'కుదరదు' అంటూ  వెనుతిరిగాడు యువరాజు. స్నేహితుడు ఆపాడు. 
'నీ ప్రాణం కంటే నాకేదీ ఎక్కువ కాదు. నీకు సాయం చేయగల అవకాశం వచ్చాక కూడా, దాన్ని వదులుకుంటే, నా స్వార్థం నేను చూసుకుంటే, స్నేహానికి విలువేంటి?' అన్నాడు.  
'అలాగని ఆమె షరతును అంగీకరించడం నా స్వార్థం చూసుకున్నట్టు అవుతుంది.' అన్నాడు యువరాజు.  
పట్టుపట్టాడు స్నేహితుడు.
'అలాగైతే ఒక షరతు. నీ జవాబు సరైనది అయి నాకు మరణశిక్ష తప్పిన తర్వాతే మీ పెళ్లి.' అన్నాడు యువరాజు.
మంత్రగత్తె అందుకు అంగీకరించి సమాధానం చెప్పింది.

జవాబు : ఏ స్త్రీ అయినా నిజంగా కోరుకునేది ఒక్కటే. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తన చేతుల్లోనే ఉండాలి. 

అదే సమాధానాన్ని శత్రురాజుకు చెప్పాడు యువరాజు. మరణదండన తప్పింది. యువరాజుకు స్వేచ్ఛ లభించింది. అంతేకాదు వారి స్నేహానికి ముచ్చటపడిన శత్రురాజు, రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేసాడు. మంత్రగత్తెకు ఇచ్చిన మాట ప్రకారం వారిద్దరికీ ఘనంగా వివాహం జరిపించాడు యువరాజు.

మొదటిరాత్రి...
తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తోన్న ఓ భయంకర అనుభవాన్ని తలచుకుని యువరాజు లోలోన కుమిలిపోతుండగా , స్నేహితుడు మాత్రం చిరునవ్వుతో శోభనపు గదిలోకి అడుగుపెట్టాడు.
ఆశ్చర్యం!
అక్కడ పడక మీద ఓ అద్భుత సౌందర్యరాశి అతనికి స్వాగతం పలికింది. ఏమిటిదని అడిగాడు.
'నీ స్నేహితుడైన యువరాజు ప్రాణాలను కాపాడడం కోసం నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం... నీ భార్యగా నాకు సగం దక్కింది. అందుకే నాకీ రూపం ప్రాప్తించింది. అయితే ఈ అందం రోజులో సగకాలం మాత్రమే ఉంటుంది. మిగిలిన అర్థకాలం నేను నా అసలు రూపంతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనెప్పుడు ఏ రూపంతో ఉండాలి.
పగలు అందగత్తెగా  కనిపిస్తే... 
గొప్ప అందగత్తెకు భర్తగా నీకు గౌరవం ఉంటుంది. కానీ రాత్రి వేళ ఒక కురూపితో కాపురం చేయాల్సి ఉంటుంది. 
రాత్రిళ్ళు అందగత్తెగా కనిపిస్తే ...
ప్రతి రాత్రీ స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. కానీ పగటిపూట ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉండే కురూపిని చూసి అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు.నిర్ణయం నీది. నీకు ఎలా కావాలో చెప్పు.' అంది మంత్రగత్తె.

(మంత్రగత్తె తన ముందుంచిన రెండు అవకాశాలలో అతడు ఏం కోరుకున్నాడో తర్వాతి బ్లాగులో చెప్తాను.)

ఇది చదివిన మగవారికి ఓ ప్రశ్న...
అతని స్థానంలో మీరుంటే ఏం  కోరుకుంటారు?

ఆడవారికి...
స్త్రీ కోరిక విషయంలో మంత్రగత్తె చెప్పింది ఎంతవరకు నిజం?
మీరైతే ఏం సమాధానం చెప్ప్తారు?

మీ సమాదానాలని రాయండి. బయటపడడం ఎందుకనుకుంటే, జవాబును మనసులో అట్టేపెట్టుకుని తర్వాతి బ్లాగులో ఇచ్చే జవాబుతో (స్నేహితుడు చెప్పినదాంతో) పోల్చిచూసుకోండి. ఈ కథను ఇదివరకే విన్నవాళ్ళు కూడా మీ స్పందనను, కథా వివరాలను తెలపవచ్చు. 



30, జనవరి 2013, బుధవారం

వ్యధ నిండిన హృదయంతో ...

దేశంలో కొందరికే భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందా? అందరికీ ఉండదా?
ఉండదనే అనిపిస్తుంది ఈ మధ్య జరుగుతున్న సంఘటనల గురించి వింటే. బాల్ థాకరే మరణించినప్పుడు ఇద్దరు యువతులు తమ అభిప్రాయాలను సోషల్ నెట్ వర్కులో పంచుకున్నందుకు వారిని అరెస్టు చేయడంతో పాటు, వారి ఇళ్ళపై దుండగులు దాడి చేసే వరకు వెళ్ళింది. కారణం ఆ రాష్ట్రంలో శివసేన ఒక బలమైన రాజకీయ శక్తి .

అలాగే ఇప్పుడు తమిళనాట జయలలిత కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.  విశ్వరూపం సినిమా కోసం కమల్ తన సృజనాత్మక శక్తితో పాటు, ఆర్థికంగా తనకున్న శక్తినంతా పణంగా పెట్టాడు. అందులో ఏదీ వృధా కాలేదన్న విషయం సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. అంత బాగా ఉంది సినిమా. ఇలాంటి సినిమా తీసి భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి  చాటిచెప్పిన కమల్ హాసన్ను మనమందరం అభినందించాలి. కాని దురదృష్టవశాత్తూ అలా జరగడంలేదు. ఆయనపై కత్తి కట్టినట్టు జయలలిత పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ సినిమా విడుదలను అడ్డుకుంటోంది. కోర్టు తీర్పులను సైతం సవాలు చేస్తోంది. మరోవైపు ఆ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లపై దాడులు జరుగుతున్నాయి. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని వేరే చెప్పనక్కరలేదు.

వ్యధ నిండిన హృదయంతో (ఎద నిండిన హృదయంతో ... అన్న క్యాప్షన్తో విశ్వరూపం పోస్టర్లు వెలిశాయి.) కమల్ హాసన్ మీడియా ముందుకు వచ్చి కంట తడి పెట్టారు. సొంత గడ్డపై తాను ఎదుర్కొంటున్న కష్టాలను పాత్రికేయులతో పంచుకున్నారు. ఆయన చేసిన తప్పేంటి? ఉన్నదున్నట్టు  చూపిస్తూ ఒక సినిమాను నిర్మించడమా? అయినా అందులో భారతీయ ముస్లింలను కించపరిచే ఎలాంటి దృశ్యాలూ లేవు. ఒక వేళ ఉంటే ఆ కత్తిరింపు ఏదో సెన్సార్ బోర్డు చేసున్డాలి. ఇంకా అభ్యంతరాలుంటే ఆయా సన్నివేశాలను తొలగించమని సామరస్య ధోరణిలో అడగవచ్చు. అలా కాకుండా ఏకంగా సినిమానే నిషేధిస్తే నిర్మాతగా ఆయనేం కావాలి. ఇక్కడ సానుభూతితో  అనడంలేదు. భావప్రకటనా స్వేచ్ఛ ఆయనకు లేదా అని ప్రశ్నిస్తున్నా.

ఎన్నాళ్ళీ లౌకిక సన్నాయి నొక్కులు? ఎవరి ప్రయోజనాల కోసం? రాజకీయ లబ్ధి ఉంటె చాలా? దానికోసం ఎంత ఘోరానికైనా సిద్ధపడతారా? ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనే చత్రపతి శివాజీ, పృధ్వీరాజ్ చౌహాన్ వంటి వీర గాధలను తెరకెక్కించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు  చివరికి మహాత్మా గాంధీ జీవితచరిత్రను సైతం పరాయి దేశం వాళ్ళే తెరకెక్కించ వలసివచ్చింది. ఎందుకీ దురవస్థ? ఎన్నాళ్ళీ సంకెళ్ళు? ఇలాంటి పరిస్తితుల్లో హొమ్ మంత్రి షిండే  చేసిన వాఖ్యలు కొంత ఆశావహంగా ఉన్నాయి. ఆయనే కాదు ఈ దశలో భారతీయ చలనచిత్రరంగం మొత్తం కమల్ హాసన్ కు  అండగా నిలవాల్సిన అవసరం ఉంది. చిత్రం కోసం మాత్రమే కాదు. మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా!

దర్శకుడిగా, నటుడిగా కమల్ 'విశ్వరూపం'

ప్రతీదీ వివాదమౌతున్న ఈరోజుల్లో కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన విశ్వరూపం సినిమా కూడా అనేక వివాదాలను ఎదుర్కొంటూ వచ్చింది. థియేటర్లతో పాటు డీటిహెచ్ ప్రసారానికీ అనుమతించడం ఒక వివాదానికి దారితీస్తే, ముస్లింలకు వ్యతిరేకంగా చిత్రకథ ఉందంటూ మరో వివాదం. ఈ నేపథ్యంలో తమిళనాట విడుదలకు నోచుకోని ఈ చిత్రం తెలుగునాట మాత్రం విడుదలైంది.అదీ ఆచితూచీ కొన్ని థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించినా, మాట్లాడినా సహించలేని పరిస్థితులు, కళారంగాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రతీదీ రాజకీయ ప్రయోజన కోణంలో ఆలోచించే సమాజంలో ఇకపై ఇలాంటి ప్రయోగాలను మరెవ్వరూ చేసి చేతులు కాల్చుకోరేమో! ఆరు పాటలు, ఐదు పోరాటాలు, అందాల ఆరపోతల చిత్రాలే ఇక మనకు గతి.

ఇక విశ్వరూపం చిత్రం విషయానికి వస్తే, కమల్ పట్ల ఉన్న భారీ అంచనాలతో ప్రేక్షకులు కూడా భారీగానే థియేటర్లకు వచ్చారు. వారిలో చాలామందికి నచ్చని (పట్టని) కథాంశం కావడంతో ఆదిలోనే నిరాశతో కూడిన ఎన్నో నిట్టూర్పులు. అదే సమయంలో కాస్తోకూస్తో హాలీవుడ్ సినిమాలు చూసిన ప్రేక్షకులు మాత్రం కన్నార్పకుండా కమల్ వెంట తన్మయత్వంతో పరుగులు తీశారు. రెండున్నర గంటలు దాటినా, ఇంకా చూడడానికి ప్రేక్షకుడు సిద్ధంగా  ఉంటాడు. అలాంటి సమయంలో టక్కున ముగుస్తుంది సినిమా. విషయం ఏంటంటే, ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండోభాగం కూడా మరోచిత్రంగా రానుందని చివర్లో చెప్పారు. ఇది కూడా కొంతమందిని నిరాశపరుస్తుంది. ఏది ఏమైనా మన భారతీయ చలనచిత్ర పరిశ్రమ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించగలిగే చిత్రం.

కథాంశానికి వస్తే, అమెరికాలో ప్రముఖ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో డాక్టరుగా పనిచేస్తున్న నిరుపమ (పూజా కుమార్ మాథుర్ ) తన బాస్ తో (అక్రమ)సంబంధాన్ని కలిగిఉంటుంది. (భారతీయ చిత్రం కాబట్టి దీన్ని మరీ లోతుగా తీసుకువెల్లకుండా, ప్రారంభదశలోనే  పక్కదారిపట్టించారు). ఈ విషయం బయటపడితే తన తప్పును కప్పిపుచ్చుకోడానికి వీలుగా ఉంటుందన్న ఉపాయంతో, భర్తకు కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయేమో ఆరాతీయడానికి ఒక డిటెక్టివ్ ను నియమిస్తుంది నిరుపమ.  కథక్ కళాకారుడైన ఆమె భర్త (కమల్ హాసన్) ఇంటిపట్టునే ఉంటూ ఔత్సాహికులకు కథక్  నేర్పుతుంటాడు. ఇలాఉండగా ఒకరోజు నిరుపమ భర్తను అనుసరిస్తూ  వెళ్ళిన  డిటెక్టివ్, తప్పుదారిపట్టి ఒక  వేర్ హౌస్ లోకి అక్రమంగా ప్రవేశించబోతాడు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది.

అల్ ఖైదా పోరాటాలకు సంబంధించిన కథ. జీహాదీలకు ఇచ్చే శిక్షణ, వారి జీవనవిధానం, కుటుంబ నేపథ్యాలు, కరడుకట్టిన మతవాదం, అమలుచేసే శిక్షలు... ఇలాంటి అంశాలపై ఎంతో లోతైన పరిశోధనలు చేశారనిపిస్తుంది. ఆఫ్ఘన్ పర్వతపానువుల్లో చిత్రీకరించబడిన యుద్ధ దృశ్యాలు అద్భుతం. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోవు. స్పృశించిన సన్నివేశాలు సున్నితమైనవి. అయినా వాస్తవానికి దగ్గరగా,మనసుకు హత్తుకునేలా చూపించారు.  హింసాత్మక దృశ్యాలు ఉన్నప్పటికీ కథకు అనుగుణంగానే, అవసరంమేరకే  ఉన్నాయి. ఒకే ఒక పాట. మరో పాట బ్యాక్ డ్రాప్లో వస్తూంటుంది. కథక్ నేర్పుతూ సాగే ఆ ఒక్క పాటనూ అద్భుతంగా చిత్రీకరించారు. దిల్ తో పాగల్ హై, దేవదాస్ వంటి హిందీ చిత్రాలకు పనిచేసిన  పండిట్ బిర్జూ మహారాజ్ ఈ పాటకు నృత్య దర్శకత్వం చేశారు. కథక్ నాట్యాచార్యునిగా కమల్ చూపిన హావభావాలు మనోహరం. ఇదే పాత్ర మరో పాత్రగా రూపాంతరం చెందే క్రమంలో ఒక ఫైట్ ఉంటుంది. కుర్ర హీరోలు కూడా అంత ఎనర్జీతో చేయలేరేమో! ఈ ఒక్క సీన్ చాలు దర్శకుడిగా, నటుడిగా కమల్ విశ్వరూపాన్ని చాటడానికి.

హిందీలోని ఎన్నో హిట్ చిత్రాలకు, తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి సంగీతం అందించిన శంకర్-ఎహసాన్ -లాయ్ త్రయం ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

చివరగా చెప్పేదేంటంటే ఇది తప్పకచూడాల్సిన సినిమా. అది కూడా థియేటర్లో.