పేజీలు

4, ఏప్రిల్ 2013, గురువారం

కర్మభూమి నుండి జన్మభూమికి... వేంచేస్తోన్న 'లలితా'రాణి

సినీతారలకు ప్రజాసేవ చేయాలనిపించడం మన అదృష్టం. 
ఎందుకంటే అప్పటివరకూ అందనంత ఎత్తులో ఉండే తారలు, రాజకీయాలలోకి వచ్చినప్పటినుంచీ నుంచి నేల మీద, అదీ మన మధ్యే  ఉంటారన్నమాట. మొబైల్ ఫ్యానులూ, ఎయిర్ కూలర్ల మధ్య, గ్లామర్ గొడుగు నీడలో ఉంటూ, పండ్ల రసాలతో నోరుతడుపుకుంటూ ఎండకన్ను ఎరగరేమో అన్నంత సుకుమారంగా గడిపిన వెండితెర వేలుపులు, మండుటెండల్లో ప్రజలు నడిచే సాధారణ బాటల్లో నడుస్తారు. అప్పటివరకు మన ఇంటి గోడ మీద క్యాలెండరులో వేలాడుతూ మన్మథ బాణాలు సంధించి, సమరం చేసిన దేవతలు, ఏకంగా మన ఇళ్ళల్లోకి నడిచొచ్చి మన లోగిళ్ళను పావనం చేస్తారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని ఇంద్ర కుమార్తెలా వీళ్ళంతా అమృతం తాగి బతుకుతారేమో అని అనుకుంటూ ఉండగనే, మనలని ఆశ్చర్యపరుస్తూ మనం తినే కంచాల్లోనే మనం తినే పెరుగు ముద్దనే ఆబగా, లాగేసుకుని మరీ తింటారు. అలా కష్టపడుతున్న ఆ దేవుళ్ళను చూసి మన మనసు కరిగి, ఓట్ల వర్షం కురిపిస్తాం. అంతే! మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంతవరకు ఆ దేవుళ్ళు, దేవతలు మనకు కనబడరు. ఉంగరం దొరకబుచ్చుకున్న వెంటనే స్వర్గానికి చెక్కేసిన ఇంద్రజలా, వీళ్ళూ వాళ్ళ వాళ్ళ లోకాలకు తిరిగెల్లిపోతారు. క్యూలో కొట్టుకు సచ్చి, లేదంటే బ్లాకులో బోలెడన్ని డబ్బులు తగలేసి టికట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళాక సినిమా చెత్తగుంటే ఏం చెయ్య గలుగుతున్నాం? ఎవరిని అడుగుతున్నాం? మరో సినిమా విడుదలయ్యేంత వరకూ ఎదురుచూడట్లేదా? ఇదీ అంతే! అసలు విషయానికి వస్తే...

పదునాలుగేళ్ళ వయసులో భూమికోసం(1976) చిత్రం ద్వారా జయప్రదగా వెండితెర అరంగేట్రం చేసిన రాజమండ్రికి చెందిన నాట్యకళాకారిణి లలితా రాణి, జయప్రదంగా  300పై చిలుకు చిత్రాలలో నటించారు.   దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలలో నటించి ఇటు దక్షిణాది ప్రేక్షకులను, హిందీ, బెంగాలీ చిత్రాల ద్వారా అటు ఉత్తరాది ప్రేక్షకులను తన అందచందాలతో ఉర్రూతలూగించారు. ప్రతిభతో రాణించి సమకాలీన గ్లామర్ నటీమణులకు  గట్టిపోటీనిచ్చారు. సినీరంగంలో ఉండగానే పెళ్ళిచేసుకుని జయప్రద నహతా అయ్యారు.  అంతవరకూ  బాగానే ఉంది. కళాసేవ పూర్తయ్యాక సహజంగానే ప్రజాసేవ చేయాలనిపించింది రాణిగారికి. అంటే జయప్రదగా సుప్రసిద్దురాలైన లలితారాణి గారికి.  అదే సమయంలో ఎన్టీ రామారావు గారి ఆహ్వానం అందడం,ఆయన స్ఫూర్తితో సినీజీవితాన్ని త్యాగం చేసి తెలుగు దేశం పార్టీలో చేరిపోవడం చకచకా జరిగి పోయాయి.

ఇక్కడ త్యాగం అనగానే అప్పటివరకూ సంపాదించినదంతా ధారపోస్తారని అమాయకంగా అనుకునేరు. త్యాగం అంటే... ఇకపై సినిమాల్లో వచ్చే సంపాదనని వదులుకోవడం అన్నమాట. 'అసలు ఇక్కడ అవకాశాలు తగ్గాక కదా అటు వెళ్ళేది' అని గడుసుగా అనకండి. అది త్యాగం... అంతే!  ఇలా వీరి త్యాగంతో, పార్టీలో అసలు త్యాగాలు మొదలవుతాయి. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడిపడగానే, అప్పటివరకూ పార్టీని నమ్ముకుని ఉన్న అసలయిన నాయకులు వాళ్ళ పదవులనీ, అవకాశాలనీ త్యాగం చేసి, ఈ రాలి పడ్డ తారలకి  చోటివ్వాలి. గౌరవం ఇవ్వాలి. వారి వెంట జెండా మోసుకుంటూ తిరగాలి. అందుకే కొన్నాళ్ళు  వాడుకున్నాక, అంటే పార్టీకి సేవలను చేయనిచ్చాక ఇలాంటి వాళ్ళందరినీ ఢిల్లీకి పంపించేస్తుంటాయి పార్టీలు.

ఆ క్రమంలోనే జయప్రద కూడా  ఢిల్లీ వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలో కలకలం రేగడంతో భవిష్యత్తును బేరీజు వేసుకుని చంద్రబాబు వెన్నంటి ఉన్నా, ఎందుకనో అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ లోపు  ఢిల్లీ రాజకీయ పరిచయాలు కలసివచ్చి లలితా రాణి కాస్తా రాంపూర్ కి రాణి అయ్యింది. ''ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి అయితే, ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి''  అంటూ అక్కడి ఓటర్లను ఆకట్టుకుంది.

తారాజువ్వ నింగిలోకి దూసుకుపోతున్నంత సేపూ నేల గురించి ఆలోచించదు. పవరు తగ్గాక తిరిగి నేల వైపు చూస్తుంది. అలాగే ఇప్పుడు జయప్రద చూపు ఆంధ్రప్రదేశ్ పైకి మళ్ళింది. కర్మభూమి నుంచి జన్మభూమికి వస్తానని, స్వరాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని అంటోంది. ఆమె సేవలను అందుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నదీ లేనిదీ ఎన్నికలప్పుడు తేలిపోతుంది. అయితే ఆమె సేవలను ఏ పార్టీ వాడుకుంటుంది అనేది మాత్రం ఆమెకే తెలీడం లేదు. ఎందుకయినా మంచిదని నాలుగు స్టేట్మెంట్లు నాలుగు రకాలుగా వినిపించి, తన పురాగమన తేదీని కూడా ప్రకటించి రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఆఫర్ ఇచ్చారు రాణి గారు. ఇప్పుడు రాణి గారికి ప్రజాసేవ చేసే నిమిత్తం ఒక సీటు కావాలి. రాజమండ్రి అయితే మరీ మంచిది. అయితే ఈ రాలిపడే తారాజువ్వ  తమ నెత్తిన ఎక్కడ పడుతుందో అని, అన్ని పార్టీల నాయకులూ బెంబేలెత్తి పోతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి సీటును ఆశిస్తున్న వారంతా ఎలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుందో అని నీరుగారి పోతున్నారు. మిగతా సిత్రాన్ని రాష్ట్ర రాజకీయ తెరపై సూడండి.