పేజీలు

27, జూన్ 2014, శుక్రవారం

నవభారత నిర్మాత పీవీ నరసింహరావు



        భారత రాజకీయ నాయకులలో మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించబడి, అంతే సమానంగా విస్మరించబడిన
వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు. పేద, ధనిక అన్న తేడా లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందంటే, కిరాణా దుకాణం నుంచి సాఫ్ట్ వేర్ సంస్థల వరకు కనీసం ఒక కంప్యూటర్ లేకుండా పని జరగడం లేదంటే,
దానికి కారణం, నిస్సందేహంగా పివి నరసింహారావే. కేవలం పాముల్ని ఆడించే దేశంగానే ప్రపంచ ప్రజలకి తెలిసిన
భారత దేశాన్ని ఐ టి హబ్ గా, తిరుగులేని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దింది ఈ పాములపర్తి నరసింహారావే. ఇంకా చెప్పాలంటే
దేశానికి రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చింది 1947లో అయితే, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది 1991లో , అంటే పీవీ ప్రధాని అయ్యాకే.

విప్లవ యోధుడు పివి :

ఈ తెలుగు బిడ్డ పుట్టింది తెలంగాణ గడ్డ మీదే. 1921 జూన్ 28న నాటి హైదరాబాదు రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో పుట్టిన  పీవీ, నాగపూర్ యూనివర్సిటీ  న్యాయవాద పట్టా పుచ్చుకున్నాడు . తనకు వరుసకు అన్న అయ్యే పాములపర్తి సదాశివరావుతో కలిసి 'జయ-విజయ' అన్న కలం పేరుతో నాటి కాకతీయ పత్రికలో వ్యాసాలు రాసేవారు. అనంతరం నాటి ఉద్యమాలకు ఆకర్షితుడై నిజాం కు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం కూడా చేశానని, తమ మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు  ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే తాము మాత్రం సైన్యం కురిస్తున్న బుల్లెట్ల వర్షం నుండి తప్పించుకుంటూ, ప్రాణరక్షణకై  పరుగులుదీస్తూ ఒక అడవిలో తలదాచుకున్నట్టు తన స్వీయ చరిత్ర గురించి రాసుకున్నారాయన. 

ఇందిర విధేయుడు :

స్వాతంత్ర్యం తరువాత జాతీయ కాంగ్రెస్ లో చేరిన పివి, ఇందిర విధేయుడిగా పేరు పడ్డాడు. 1969 లో కాంగ్రెస్ లో చీలిక వచ్చినప్పుడు కూడా అయన ఇందిరనే అంటిపెట్టుకుని ఉన్నాడు. 1970 లో భూదానోద్యమ బాధ్యతను పూర్తిగా ఆయనకు అప్పచెప్పింది ఇందిరమ్మ. ఆ ఉద్యమ నేపథ్యంలో ఆయన తన వారసత్వ భూములను సైతం జాతికి ఇచ్చేసాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతటి విధేయుడే ఆ తర్వాత గాంధీ- నెహ్రూ కుటుంబ వారసత్వపాలనను  బహిరంగానే వ్యతిరేకించి కాంగ్రెస్ నాయకులంతా ' ఎంత ధైర్యం' అంటూ  నోటి మీద వేలేసుకునేలా చేశారు.  ఆ రకంగా వాఖ్యానించి కూడా కాంగ్రెస్ లోనే కొనసాగ గలిగిన మొదటి ధీశాలి పీవీనే.

దేశ ప్రధాని పీవీ  :

13 భాషల్లో ప్రావీణ్యం, సామాజిక, రాజకీయ, ఆర్థిక  విషయాలలో  అద్భుత మేధాశక్తితో పాటు కష్టపడే తత్వం ఉన్న పీవీని  అనేక పదవులు అయాచితంగానే  వరించాయి . ఒకానొక దశలో జ్ఞానీ జైల్ సింగ్ తర్వాత రాష్ట్రపతి పదవికి జరిగిన రేసులో కూడా పీవీ పేరు వినవచ్చింది.  ఆ పదవులన్నీ రావడానికి కారణం, ఆయన ఇందిర కుటుంబానికి సన్నిహితుడు కావడమే అని కొందరు కాంగ్రెస్ వాదుల అభిప్రాయం. బహుషా ఆయన ప్రధానిగా కాకపోయినట్లయితే  ఆ అభిప్రాయం అలాగే ఉండిపోయేదేమో!

నాటి రాజకీయ పరిణామాల వల్లే కాని, ఆయనకున్న ఇతర సాహిత్యపరమైన వ్యాపకాల వల్లే కాని,  1991 నాటికి పీవీ దాదాపు రాజకీయరంగ విరమణకు దగ్గరలో ఉన్నారు.  మరోవైపు ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ అప్పటికీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. అనేక అభియోగాల మధ్య కూరుకుపోయిన పార్టీ, మళ్ళీ అధికారం కోసం రాజీవ్ అధ్యక్షతన పోరాడుతోంది. కానీ అంతలోనే రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం, దేశమంతా చెలరేగిన సానుభూతి పవనాలు, కాంగ్రెస్ ఘన విజయం ... అనీ చకచకా జరిగిపోయాయి. రాజకీయ పగ్గాలు చేపట్టేందుకు సోనియా సుముఖంగా లేకపోవడం వల్ల ప్రధాని పదవికి నెహ్రూ కుటుంబేతర నాయకుల్లో పోటీ ఏర్పడింది. శరద్ పవార్ గట్టి పోటీని ఇచ్చినప్పటికీ,  సహజంగానే అన్ని అర్హతలతో పాటు, మృదుస్వభావి, సౌమ్యుడు అన్న పేరున్న పీవీ నరసింహరావును ప్రధాని పదవి వరించింది. ఆ వెంటనే
పార్లమెంటు సభ్యత్వ అర్హత కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని నంధ్యాల పార్లమెంటు నియోజకవర్గం నుండి ఉపఎన్నికలో  పోటీచేశారు. తమ రాష్ట్రం నుండి ఒక తెలుగువాడు, అది కూడా ఉత్తరాది ఆధిపత్యాన్నీ నిలువరిస్తూ ఒక దక్షిణాది నాయకుడు,  తొలిసారిగా నెహ్రూ కుటుంబేతర వ్యక్తి భారతదేశ ప్రధాని కాబోతున్నాడన్న అభిమానంతో తెలుగు ప్రజలు ఆయన్ని 5. 8 లక్షల ఆధిక్యంతో గెలిపించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ  పోటీ నుంచి విరమించింది. అంతటి ఆధిక్యం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా చోటు చేసుకుంది.

 దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం :

పీవీ ప్రధాని అయ్యేనాటికి కేవలం 2. 3 % వృద్ధిరేటుతో  దేశ ఆర్థిక స్థితి దారుణస్థాయిలో ఉంది.  ఎంత దారుణం అంటే దేశ అవసరాల కోసం 47 టన్నుల బంగారాన్ని తాకట్టుపెట్టి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి అప్పు తెచ్చుకోవలిసి వచ్చింది. వీటన్నిటికీ కారణం అప్పటిదాకా ప్రభుత్వాలు అనుసరించిన ఓటు బ్యాంకు పోకడలు. అనవసర సబ్సిడీలు.  సంస్థలన్నిటినీ జాతీయం చేసుకుపోయేసరికి పని అనేది రాజకీయం అయ్యింది. ఉత్పాదకత తగ్గింది.  సరిగ్గా ఆ సమయంలో పగ్గాలు చేపట్టిన పీవీ ప్రముఖ ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని ఆయనకు సర్వాధికారాలను, పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఫలితంగానే ఐ టి అన్నది భారతదేశంలోకి కాలు మోపింది. టెలికాం సంస్థలు తమ సాంకేతిక నెట్వర్క్ ను భారత్ కూ విస్తరింపచేశాయి. పలు దేశీయ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పని సంస్కృతి అభివృద్ధికరంగా మారింది. నాణ్యతలో, సేవలలో పోటీ తత్వం పెరిగింది. ఒకప్పుడు మన దేశం నుండి ఇతర దేశాలకు తరలిపోయిన మేథో సంపత్తి, పారిశ్రామిక వర్గాలు తిరిగి స్వదేశానికి రావడం (రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ ) మొదలయ్యింది. పీవీ, మన్మోహన్ అనే ఇద్దరు మేధావుల కలయిక మొత్తం దేశ గతినే మార్చేసింది. కొద్ది రోజుల్లోనే భారతదేశం ఆర్థిక సంక్షోభం నుండి తేరుకుని అనతికాలంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. అందుకే మేధావులు అంటారు దేశానికి ఆర్థిక స్వతత్ర్యాన్ని తెచ్చింది పీవీ నరసింహారావు అని.

ముందు దేశం, ఆ తర్వాతే పార్టీ:

పీవీ ఏది చేసినా మొదటి ప్రాధాన్యత దేశ అభ్యున్నతికే ఇచ్చారు. ఆ తర్వాతే పార్టీ అన్నారు. అదే కాంగ్రెస్ వారికి మంటపుట్టించింది. ముఖ్యంగా సోనియా గాంధీకి. ప్రతి విషయం తనకు చెప్పే చేయాలని ఆమె, తెలియని విషయాలు చెప్పి ప్రయోజనం ఏంటి అన్నట్టు ఈయన, మధ్యలో చెంచాగాళ్ళ ఎగదోపుడు మాటలు.... ఇవన్నీ కలిసి పీవీకి కాంగ్రెస్ లోనే శత్రువులను పెంచాయి. పార్టీకి దూరం చేశాయి. ఆ ద్వేషాలు, దూరాలు ఆయన చనిపోయేవరకూ తరగలేదు. పైగా ఆయనకు మరిన్ని అపవాదులు ఆపాదించారు. ఇక మీడియా అయితే పార్టీనే పట్టించుకోని ఆయనను మేమెందుకు పట్టించుకోవాలని అనుకుంది. ఆయన బ్రతికుండగానే చనిపోయారని వార్తలు రాసేదాకా నిర్లక్ష్యం చూపింది. చనిపోయిన తర్వాతా ఆయనపై ప్రతీకారం తీర్చుకునే నీచ స్థాయికి దిగజారింది కాంగ్రెస్.

పార్టీని పట్టించుకోకుండా ముందుకెళ్ళాడు కాబట్టే పీవీకి ఆ అవస్థ అనుకున్నాడేమో, మన మన్మోహన్ సింగ్ గారు పార్టీ చెప్పినట్టు నడుచుకుని అపఖ్యాతిని మూట కట్టుకున్నారు. ఆ రకంగా చూస్తే పీవీ అనుసరించిన పంథానే సరి. అలా చేయగల సత్తా ఒక తెలుగు బిడ్డకే సాధ్యమేమో!     

తెలంగాణ రాష్ట్ర పండుగగా పీవీ జయంతి :

పీవీ చనిపోయినప్పుడు జరిగినవన్నీ చూసి కాంగ్రెస్ ను ఈసడించుకోని తెలుగు వాడు ఉండడేమో. ఉంటె వాడు తెలుగువాడు కాదనుకోవాలి, ఇంకా చెప్పాలంటే చేసిన మేలు మరచి పోయే కృతఘ్నుడు అని అనుకోవాలి. వై ఎస్ ఆర్ సరే కాంగ్రెస్ మనిషి, కాని తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే కెసిఆర్ కు ఏమయ్యింది? అని అనుకున్నా ఆనాడు.
కానీ ఇప్పుడు పీవీ జయంతిని రాష్ట్ర పండుగగా చెయ్యడం, తెలంగాణ రాజకీయ రాజధాని వరంగల్ లో పీవీ విగ్రహాన్ని నెలకొల్పడం చూస్తుంటే 'వాహ్ ! కెసిఆర్' అనిపించింది. ఆలోచన ఆయనదైనా, మరెవరిదైనా అభినందించతగినది. ఆనందించతగినది. పీవీని గౌరవించడం అంటే తెలుగు జాతిని గౌరవించుకోవడం.