పేజీలు

6, మే 2015, బుధవారం

ప్రజల అవస్థల కంటే సల్మాన్ కేసు ముఖ్యం!



రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వాళ్ళడిగే దాంట్లో న్యాయం ఉందా, ప్రభుత్వాలు ఇవ్వననడంలో అన్యాయం ఉందా అన్న విషయాలు పక్కన పెడితే సగటు జీవులు అటు ఆఫీసులకు సెలవులు పెట్టలేక, ఇటు ఆటోలకు వందలు పెట్టలేక నలిగిపోతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న ప్రభుత్వాలు మాట వరకే పరిమితం అయిపోయాయి. మంత్రులకు, అధికారులకు సొంత వాహనాలు, అధికారిక వాహనాలు కుప్పలుగా ఉంటాయి కాబట్టి వారికి సామాన్యుడి సణుగుడు వినపడదు సరే. మీడియాకు కూడా ఈ విషయం పట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకు సల్మాన్ సొద ముఖ్యమైంది. 
 తను కొట్టి హింసించిన ప్రియురాలు, మరొకరి అండ చేరేసరికి తట్టుకోలేక, తప్పతాగి ఇష్టం వచ్చినట్టుగా, నిర్లక్ష్యంగా కారు నడిపి, నాలుగు పేద కుటుంబాల బతుకుల్ని చిధ్రం చేసిన ఒక ప్రముఖుడికి పదమూడేళ్ళ తర్వాత శిక్ష ఖరారైతే ఎవరికి వారు ఇంతగా బాధ పడిపోవడం విడ్డూరంగా అనిపిస్తోంది. ఇంకా పై కోర్టులున్నాయిగా అంటూ చిరంజీవి గారు ధైర్యం చెపుతున్నా మీడియా బాధ పడిపోతూనే ఉంది. బాలీవుడ్ లో కొంత మంది మాట్లాడుతూ... 'నిరాశ్రయులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే వాళ్ళు ఫుట్ పాత్ మీద పడుకోవాల్సి వస్తుందని, ఈ తప్పంతా ప్రభుత్వాలదే' అని అంటుంటే డబ్బున్నోడికి అంత బలుపు ఎందుకు వస్తుందో అర్థమైంది. ఫుట్ పాత్ మీద నడుస్తున్న వాళ్ళను గుద్ది చంపేసి ఉంటే ఏమనేవారో!  సారు వారు కారు నడుపుతున్నారు కాబట్టి రోడ్డు మీద ఎవరూ ఉండకూడదు అని వీళ్ళ భావం కాబోలు. ఈ మాటలనే వాళ్ళంతా ఈ పదమూడు ఏళ్ళ పాటు ఫుట్ పాత్ మీద పడుకునే వాళ్ళకోసం  ఏం చేసినట్టు!    
ఇప్పటికైనా మీడియా కాస్త ప్రజల కష్టాల మీద ఫోకస్ పెడితే మంచిది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి