పేజీలు

20, ఆగస్టు 2016, శనివారం

ఈ విజయం ఎవరిది?




గెలుపును పంచుకోడానికి అందరూ వస్తారు. అదే ఓటమి భారాన్ని మాత్రం మనం మాత్రమే మోయాలి.  

పి.వి. సింధు సాధించిన విజయం దేశానికి గర్వకారణం అనడంలో మరోమాట లేదు. ఈ విజయం ఆమె గెలవాలని కోరుకున్న ప్రతి భారతీయుడికీ చెందుతుంది. ఇంతటి విజయం తరవాత సింధు అందరి అమ్మాయి అయ్యింది. రజనీతో సహా  అమితాబ్ నుండి సల్మాన్ వరకు ఆమె ఫాన్స్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ ఆమెకు కోట్లు ఇచ్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలయ్యేటప్పటికీ సింధు మా అమ్మాయంటే కాదు మా బిడ్డ అని పంచుకుంటున్నారు.  సింధుకు శిక్షణనిచ్చిన గోపీచంద్ అందరివాడు అయ్యాడు. మరి వారు ఇన్నేళ్ళు  పడిన కష్టం సంగతి ఏంటి? తమ ఆటను, ఆశయాన్నీ  బ్రతికించుకొనేందుకు వారు తపిస్తున్న వేళలో, చేయూత కోసం ఎదురుచూస్తున్న వేళలో వారిని ప్రోత్సహించింది ఎవరు?
ఉదయం రెండున్నరకు లేచి కూతురికి అన్నీ సమకూర్చిన సింధు కన్నతల్లి. ప్రతిరోజూ దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సింధుకు శిక్షణ ఇప్పించిన తండ్రి, ప్రతి రోజూ ఉదయం మూడు గంటలకే లేచి శిక్షణ ఇచ్చే గురువు గోపీచంద్, రోజుకు ఏడు  గంటలు ప్రాక్టీస్ చేసిన సింధు...  వీళ్ళందరూ ఏళ్ళ తరబడి కష్టపడితే దక్కిన ఫలమిది. ఇప్పుడు ఈ విజయాన్ని ఎవరికి వారు పంచేసుకోడానికి వస్తే ఏమనాలి?               

అయితే  ఈనాటి వీరి  విజయాల  వెనుక దార్శనిక పాలకుడు నారా చంద్రబాబు నాయుడి ప్రోత్సాహం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇదే విషయాన్ని చంద్రబాబు విశాఖలో అనగానే  సామాజిక మాధ్యమంలో కొంతమంది జోకులు పేల్చారు. ఇలాంటి వాళ్ళే సింధు కులం ఏంటి అని కూడా గూగుల్ లో వెదికారు. కానీ జాతి ప్రజల ఒలింపిక్ కలలు సాకారం చేసేందుకు కారణమైన గోపీచంద్ అకాడమీ పుట్టు పూర్వోత్తరాలకు చంద్రబాబుకు సంబంధం ఉంది.   

ఒలింపిక్ విజయం ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదు. రాళ్ళలో వజ్రాలను గుర్తించి సానపెట్టిన శ్రమ ఒక్కనాటిది కాదు. తన అకాడమీ ద్వారా జాతి రత్నాలను అందించాలనే  గోపీచంద్ ఆశయం...  'గోపీచంద్ అకాడమీ' రూపుదాల్చడానికి చంద్రబాబునాయుడే కారణం. ఎలా అంటే...   

2002లో 32వ నేషనల్ గేమ్స్, 2003లో మొదటి ఆఫ్రో-ఆసియన్ గేమ్స్ ను హైదరాబాదులో నిర్వహించి నగరానికి క్రీడా రాజధానిగా ప్రపంచ గుర్తింపు తెచ్చారు చంద్రబాబు. అందువల్లే 2010 లో కామన్వెల్త్ క్రీడలను ఢిల్లీ లో నిర్వహించే అవకాశం మనకొచ్చింది. కానీ అందులోనూ అవినీతికి పాల్పడి దేశానికి అపఖ్యాతిని మిగిల్చింది కాంగ్రెస్. అది వేరే సంగతి. 

ఆఫ్రో ఆసియన్ గేమ్స్ ను నిర్వహించడం ద్వారా ఎందరో క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు చంద్రబాబు. గోపీచంద్ 2001లో 'ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్' గెలుచుకుని వచ్చినప్పుడు అతనిని నగదు పురస్కారంతో సత్కరించడమే కాకుండా... అకాడెమీ పెట్టుకోడానికి భూమిని కూడా కేటాయించారు చంద్రబాబు. అకాడమీ ద్వారా గోపీచంద్ లాంటి క్రీడాకారులు మరింతమంది పుట్టుకురావాలని ఆయన ఉద్దేశ్యం. ఆయన అనుకున్నట్టుగానే ఆ తర్వాత అకాడెమీ నుంచి ఒక సైనా నెహ్వాల్, ఒక సింధులాంటివాళ్లు తయారయ్యారు. 

గోపీచంద్ మూలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఆయన క్రీడాకారుడిగా గుర్తింపు పొందక ముందు ఏపీఎస్ ఆర్టీసీలో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లోనూ పనిచేశారు. అప్పట్లో గోపీచంద్ కు శిక్షణ ఇచ్చిన ఏపీ బాడ్మింటన్ అకాడమీలోని కోచ్ మొహమ్మద్ ఆరీఫ్ ను కూడా నాడు చంద్రబాబు అభినందించారు. ప్రభుత్వం తరపున గోపీచంద్ కు 25లక్షల రూపాయలు ఇచ్చారు. దాంతో పాటు హైద్రాబాదులో ప్రపంచ స్థాయి బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచెయ్యమని ప్రోత్సహిస్తూ భూమిని కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన వై ఎస్ సర్కారు గోపీచంద్ ను నానా ఇబ్బందులు పెట్టింది. చంద్రబాబు ఇచ్చిన స్థలం తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయమని ఒత్తిడి తెచ్చింది. దానిపై గోపీచంద్ హై కోర్ట్ వరకు వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు నేరుగా వై ఎస్ ను కలిసి భూమికోసం ప్రాధేయపడాల్సి వచ్చింది.   

అకాడమీ కోసం, ఆశయం కోసం గోపీచంద్  ఇంత పోరాటం చేశాడు కనుకనే ఒలింపిక్ 2012, 2016 లలో మన దేశానికి పతకాలు వచ్చాయి. నేడు మనం సాధించిన ఈ పతకాల వెనుక ఇంత పెద్ద కథ ఉంది. గోపీచంద్ లాంటి గురువు, చంద్రబాబులాంటి దార్శనిక నేత లేకపోతే ఈనాడు ఒక సైనా లేదు. ఒక సింధు లేదు. పారుపల్లి  కశ్యప్, కిదాంబి శ్రీకాంత్ వంటి క్రీడాకారులు లేరు.   ఈ పతకాలు లేవు. సాధారణంగా రాజకీయ నేతలు క్రీడల మీద ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి అప్పటికి అప్పుడు ఫలితాలను ఇవ్వవు. అందువల్ల ఓట్లు రాలవు. క్రీడాకారులు రాటుదేలి పతకాలు తెచ్చేందుకు కనీసం 10-15 ఏళ్ళు పడుతుంది. ఈ లోపు సదరు ప్రభుత్వం పదవిని కోల్పోతుంది. ఆ నేతలు చేసిన మంచిని జనం మర్చిపోతారు. ఒకవేళ ఆ నేతలే గుర్తుచేస్తే  ఇప్పుడు చంద్రబాబు మీద జోకులేసుకున్నట్టే వేసుకుంటారు. అసలు వై ఎస్ ప్రభుత్వం భూమిని లాగేసుకుని ఉంటే ఈ అకాడెమీ ఉండేది కాదు. ఈ సింధు ఉండేది కాదు. పతకాలు ఉండేవి కావు. చంద్రబాబుకు చెప్పుకోవాల్సిన అవసరమూ వచ్చేది కాదు.

కానీ చంద్రబాబు అలా కాదు.  2001లో ఆయన అందించిన ప్రోత్సాహం... 15 ఏళ్లపాటు గోపీచంద్ పడిన కష్టం,ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఫలితాలను ఇచ్చాయి. దీన్నే దార్శనికత అంటాం. భారతదేశానికి ఇలాంటి పతకాలు ఇంకా రావాలంటే చంద్రబాబులాంటి రాజకీయ నాయకులు, గోపీచంద్ లాంటి అంకితభావం కలిగిన కోచ్ లు ఇంకా కావాలి.