పేజీలు

26, మే 2010, బుధవారం

నా సిమ్లా పర్యటన

వేసవికాలం సమీపిస్తోంది. సమ్మర్ టూర్ కోసం ప్లాన్ చేసుకోవలసిన సమయం ఇది. అందుకే నా టూర్ అనుభవాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. చదువరులకు కొంతలో కొంత బ్లాగు ఉపయోగపడుతుందని నా ఆలోచన.

ప్రతి వేసవిలోనూ ఏదో ఒక పర్యాటక కేంద్రానికి, ముఖ్యంగా హిల్ స్టేషన్లకి వెళ్ళడం మాకు ఇష్టం , అలవాటు కూడా. ఎప్పటినుంచో సిమ్లాకి వెళ్లాలని కోరిక. కోరిక క్రిందటి వేసవిలో తీరింది. నాలుగు నెలల ముందుగానే ప్రణాళికలు మొదలయ్యాయి. ముందుగా బడ్జెట్ అంచనా వేస్తే ఎనభై వేల దాకా తేలింది. ఎందుకంటే అంత దూరం వెళ్తున్నాం కాబట్టి పలానా ప్రదేశాన్ని కూడా చూసొద్దాం అంటూ ఒక్కో ప్రదేశాన్ని కలుపుకుంటూ పోయే సరికి అంత బడ్జెట్ తేలింది. మా ఆవిడ ప్రభుత్వోద్యోగి కావడంతో రెండు బ్లాకుల ఎల్టీసిని పర్యటన కోసం వాడుకోవాలనుకున్నాం. అలాగే సిమ్లా, మనాలిలలో ఉన్న వాళ్ళ హాలిడే హోమ్స్ లో గదులను బుక్ చేసాం. .పి. ఎక్స్ ప్రేస్సుకు వెళ్ళేటప్పుడు సెకండ్ ఏసిలో , వచ్చేటప్పుడు థర్డ్ ఎసి లో టికెట్లు బుక్ చేసాం. అన్నీ ఫిబ్రవరిలోనే.
అంత ముందుగా బుక్ చేసుకున్నా కన్ఫర్మ్ కావడానికి మూడు నాలుగు రోజులు పట్టింది. అందుకే సమ్మర్ టూర్ ను ఎప్పుడూ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. డిల్లీ నుంచి మిగతా టూర్ కోసం సిక్స్ సీటర్ వెహికిల్ బుక్ చేసాం. కిలోమీటరుకు తొమ్మిది రూపాయలు చొప్పున మాట్లాడుకున్నాం. నిజానికి ఢిల్లీ నుంచీ షిమ్లా వరకు రైలు సౌకర్యం ఉంది. అయితే లగేజిని, మా బృందంలో ఉన్న పెద్దలు, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని టాక్సీ లో వెళ్ళాలనుకున్నాం. అదెంత పొరబాటో తర్వాత తెలిసింది.
టూరుకు వెళ్ళేంత వరకు రోజుకో ఆలోచన. రోజుకో ప్రణాళిక. ఎంతో ఉత్సుకత. అక్కడి ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు స్వీప్ పనోరమ సౌకర్యం ఉన్న సైబర్ షాట్ కెమెరాను కొన్నాం. దాదాపు ప్రతిరోజు టూర్ గురించి కాంత డిస్కషన్. అంతకు ముందే వెళ్లి వచ్చిన వాళ్ళు తగిన సజెషన్స్ ఇచ్చారు. నేనైతే ఇంటర్నెట్లో బోలెడంత సమాచారాన్ని సేకరించాను. అయితే టూమచ్ ఇన్ఫర్మేషన్ కూడా కాస్త కన్ఫ్యూషన్ను తెచ్చి పెడుతుంది. ముందుగా మేమనుకున్న రూట్ ఇది.
హైదరాబాద్ -డిల్లీ- చండీఘర్-సిమ్లా-కులు-మనాలి-భాక్రానంగల్ డ్యాం-చండీఘర్ -డిల్లీ-హైదరాబాద్

ఆదివారం ఉదయం ఎపి ఎక్స్ ప్రెస్ ఎక్కి డిల్లీకి బయలుదేరడంతో మా ప్రయాణం మొదలైంది.
మొదటి రోజు: రైలు ప్రయాణంతోనే గడిచింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1670కి.మీ. వేసవికాలమే అయినా ఎసి కోచ్ కాబట్టి ప్రయాణం హాయిగానే సాగింది.
రెండవ రోజు: ఉదయం తొమ్మిదిన్నరకు న్యూడిల్లీ చేరుకున్నాం. అక్కడ మా ఆవిడ కొలీగ్ ఒకాయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ట్రావెల్స్ వాళ్ళ వెహికిల్ ను మాట్లాడి పెట్టింది ఆయనే. వాహనాన్ని కూడా వెంట పెట్టుకోచ్చిన ఆయన ముందుగా వాళ్ళ ఆఫీసుకు తీసుకువెళ్ళి మర్యాద చేసి మమ్మల్ని చండీఘర్ కు సాగనంపారు.

డిల్లీ నుంచి చండీఘర్ కు మా ప్రయాణం ఉదయం పదకొండున్నరకు మొదలైంది. మా డ్రైవర్ పేరు తివారి. ఎసి వెయ్యమంటారా అని అడిగాడు. వేస్తే కిలోమీటరుకు మరో రూపాయి అదనంగా ఇవ్వాలి. ఎలాగు వెళ్తోంది చల్లటి ప్రదేశానికి కదా, వద్దులే అన్నాం. డిల్లీ పొలిమేరలకు వచ్చే సరికి వడగాడ్పుల సెగలు మొదలయ్యాయి. హైదరాబాద్ చాలా నయమనిపించింది. నిజానికి మేము హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయానికి అక్కడ ఎండలు అదర కొడుతున్నాయి. తప్పించుకుని వెళ్తున్నాం కదా అనుకుంటే ఢిల్లీ ఇంకా ఘోరంగా ఉంది. హైవే మాత్రం సూపర్. స్ట్రైట్ లైన్ మాదిరిగా తిన్నగ్గా , విశాలంగా ఉంది. ఇది ఒకటవ నంబర్ జాతీయ రహదారి. పానిపట్,కురుక్షేత్ర, అంబాల, అమృతసర్ మీదుగా వెళ్తుంది.

కురుక్షేత్ర చూస్తారా అడిగాడు తివారి. మా ప్లాన్నింగ్ లో కురుక్షేత్రం, పానిపట్టు ఉన్నాయి కాబట్టి ముందుగా పానిపట్టుచూస్తాం అన్నాం. భారతదేశ చరిత్రలో చాలా ప్రాధాన్యత కలిగిన మూడు యుద్ధాలు జరిగాయి అక్కడ. అయితే ఇప్పుడుఅక్కడ చూసేందుకు ఒక మ్యూజియం తప్ప ఇంకేమీ లేవు అని డ్రైవరు చెప్పడంతో పానిపట్టు సందర్శన కాన్సిల్అయ్యింది. తరువాత కురుక్షేత్రం. మహాభారత యుద్ధ భూమి. గీతాసారం భోధించిన పవిత్ర స్థలం. ఎవరికైనాచూడాలనిపిస్తుంది కదా! డిల్లీ నుంచి కురుక్షేత్రం 166 కిలో మీటర్లు.
(మిగతాది 'కురుక్షేత్ర' శీర్షికతో ఉన్న బ్లాగులో చదవండి)