పేజీలు

29, నవంబర్ 2013, శుక్రవారం

ప్రతి మదిలోని తెహల్కా ... ఈ ప్రేమలేఖ!

                                                                      ప్రియమైన నీకు, నేను వ్రాయునది...
'నేను' అంటే 'నువ్వెవరు?' అని ప్రశ్నించవని నాకు తెలుసు. ఎందుకంటే నేనీ మనుషుల మధ్య ఎప్పటినుంచో ఉంటున్నా, నా ఉనికిని తొలిసారిగా గుర్తించింది నువ్వే. నేను అనబడే నాకున్న లక్షణాల్నీ, అవలక్షణాల్నీ రూపించి చూపించిందీ, అనుమతించి స్వాగతించింది నువ్వే. ఎటొచ్చీ చిక్కంతా ఏంటంటే అంతటితో నీ పని అయిపోయినట్టుగా నువ్వు గమ్మున ఉండిపోయావు. గుండె వాకిట వరకూ స్వాగతించిన నువ్వు, నీ హృదయాంతరాల లోనికి ఆహ్వానించవెందుకో! మన మధ్య ఉన్నదేంటని అడిగితే 'జస్ట్ కొలీగ్స్' అంటావు. అంతేనా అన్నట్టు దిగులుగా కనిపిస్తే 'యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్' అంటావు. అంతకంటే ఎక్కువ కాదా అన్నట్టు నిరాశగా చూస్తే, ఏమీ తెలీనట్టు 'ఏమైంది అలా ఉన్నావు?' అని అడుగుతావు.  మనం ఒకరినొకరు చూసుకున్న మొదటి క్షణంలోనే నువ్వన్నావ్, 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది' అని. నాక్కూడా అలాగే అనిపించింది. అంటే విడివడని బంధమేదో మన మధ్య ముడివడబోతోందని సూచనేమో అది.
అసలీ లేఖ రాయడం ఎందుకంటే రాత్రి నువ్వు నా కలలోకి వచ్చావు. గదిలో నేనడుగు పెట్టేసరికి నువ్వొక కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నావు. మానిటర్ మీద ఒక హృదయం బొమ్మ. ఎంతో ఏకాగ్రతతో దానికి మెరుగులు దిద్దుతున్నావు. ఆ హృదయం నాదే అని గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు నాకు. తీరిగ్గా, ఓపిగ్గా, నీకు నచ్చినట్టుగా మలచుకుంటూ... నా హృదయాన్ని తదేకంగా చూస్తూ, నీ కళ్ళనిండా వెలుగును నింపు కుంటున్నావు. ఈ హృదయం ఇక నాదే, నా స్వంతమే అన్నట్టుగా నీ పెదవులపై విజయ దరహాసం. అది నేను గమనించేలోగా, నా ఉనికి నీకు తెలిసిపోయి, నీ గుట్టు నేను పసిగట్టాననే తత్తరబాటుతో, కోపం నటిస్తూ... విసురుగా ఏదో బటన్ నొక్కేసరికి ఏకంగా కంప్యూటరే పేలిపోయింది. గది నిండా చెల్లాచెదురుగా పడివున్న నా హృదయపు తునకలు. వాటిని నీ హై హీల్స్ చెప్పులతో పక్కకి తోసేస్తూ విసవిసా నడచి బయటకు వెళ్లిపోతుంటే, వెనుకనుంచి నీ ఎతైన పిరుదుల లాస్యాన్నీ, నునుపైన నీ నకుము మడతలో మెరిసి మాయమవుతున్న కాంతిని చూసి చెదరిన నా హృదయం బాధగా నిట్టూర్చింది.
అప్పుడో వెలుగు. ఏంటా అని చూస్తే బ్రహ్మ దేవుడు. నన్ను సానుభూతితో చూస్తూ ''పిచ్చివాడా! ఈ పాటి విరహానికే నీకంత బాధగా ఉంటే, మనసు పెట్టి అపురూపంగా  నేను మలచిన ఆ రూపాన్ని భూమ్మీదకు పంపాల్సిన విధిని నిర్వర్తించే సమయంలో ఆ శాశ్వత విరహానికి నేనెంత బాధపడి ఉంటానో ఊహించు'' అన్నాడు. అప్పుడు చూశాను ఆయన ఎనిమిది కళ్ళలోనూ 27 ఏళ్ల విరహం నింపిన నైరాశ్యపు నీడల్ని. ఆయన అంతర్ధానంతో మెలకువ వచ్చి, మళ్ళీ నిద్ర పట్టలేదు. రాత్రంతా నీ తలపుల వేదనే.
ప్రతి రోజూ ఆఫీసుకు రాగానే నీ జాడ కోసమే వెదుకుతాను.  నువ్వు కనిపిస్తే గాని ఆ రోజుకు పని చేసే శక్తి సమకూరదు నాకు. సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్తూ 'బై బై' అంటూ చేతుల్ని తిప్పుతూ వీడ్కోలు చెపుతున్నపుడు,
నీ చూపులలో చిక్కుపడిన నా చూపులు క్షణకాలపు పరిష్వంగనలో ఆదమరిచి ఉండగా, నిర్దయగా నీ చూపుల్ని వెనక్కి లాగేసుకుని నువ్వు వెళ్లిపోతుంటే, నీ వెంటే పరుగులిడి, నువ్వు కనుమరుగైన చోట కాసేపటి వరకు అలాగే నిలబడి, నీరసంగా వెనక్కి తిరిగి వచ్చి, నా కళ్ళలోని చీకటి కుహరాల్లోకి చేరి సొమ్మసిల్లిపోతాయి.
చాలా సార్లు నువ్వన్నావు, ''రాత్రి నీ గురించి ఆలోచించాను'' అని. అలోచించి నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావో మాత్రం చెప్పవు. మొదట్లో దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత ఉండేది. కాని ఇప్పుడు నీ నిర్ణయం తెలుసుకోవడం మీది ఆసక్తి కన్నా, 'నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు' అన్న నిజమే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది.
ఎప్పుడైనా కన్నార్పకుండా నిన్నే చూస్తున్నప్పుడు, 'ఏంటలా చూస్తున్నావ'ని అడుగుతావు. ఏం లేదని అనగానే 'పిచ్చి' అంటూ గలగలా నవ్వేస్తావు. ఒక మనోహర దృశ్యాన్ని చూస్తున్నట్టుగా నవ్వుతున్న నిన్ను చూస్తుంటే, చటుక్కున నవ్వును ఆపి, నా కళ్ళలో కళ్ళు పెట్టి నిశ్శబ్దంగా రెండు క్షణాలు చూసి, చూపుల్ని నేలమీదికి వాల్చేస్తావు. మౌనంగా ఉండిపోతావు. ఆ క్షణాల్లో నీ పెదవుల వణకు, నీ పొడవాటి ముక్కు చివరన అదరుతున్న ముక్కుపుటాలు, శ్వాస ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెలమీది అవయవాలలో కదలికలు... ఇలా అన్నిటినీ గుర్తిస్తాయి నా చూపులు. ఆ సంకేతాల అర్థాన్ని తెలుసుకున్న రక్తం వేడెక్కి పరవళ్ళు తొక్కుతూ, నా నరనరాల్లో తీపి బాధని నింపుతుంది. ఆ వెంటనే ఒక్క ఉదుటున లేచి వెళ్ళిపోతూ నాలుగడుగులు వేసి, వెనక్కి తిరిగి నువ్వు చూసే చూపు ... 'హా!!!'  ఎందుకింత బాధ? ఎంతకాలం మోయాలీ బరువును? మనకు మనమే బందీలుగా ఉండటం ఎందుకు? చెప్పు! ఒక్క మాట. ''నువ్వు నాకు కావాలి.'' అని చెప్పు. పోనీ... "నేను నీకు కావాలా?" అని అడుగు. కాలాన్ని నమ్మకు. అది ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చేస్తుందో తెలీదు. ఈ లేఖ నీ మౌనాన్ని భంగపరుస్తుందని ఆశిస్తూ...
నీ
నేను

(ఇలా లేఖలు రాసుకోవడం ఇప్పుడు లేకపోవచ్చు. పొట్టి సందేశాలు (SMS) పంపుకునే ఈ ఫాస్ట్ జనరేషన్ సైతం ఇలాంటి సాగతీత ప్రణయ బాధను అనుభవిస్తోంది. ప్రతి ఆఫీసులోనూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక జంట ఇలా అవ్యక్త అనుబంధంతో వేగిపోతూ ఉంటుంది. వారిద్దరూ అవివాహితులు కావచ్చు. లేదా ఇద్దరిలో ఒకరికి పెళ్లై ఉండవచ్చు. లేదా ఇద్దరూ పెళ్ళయిన వాళ్ళు కావచ్చు. ఎటూ తేలని ఈ బంధం కొన్నాళ్ళ తర్వాత అక్రమసంబంధంగా జనం నోళ్ళలో నానడం జరగవచ్చు. లేదా తెహల్కా మాదిరిగా పనిచేసే చోట లైంగిక వేధింపుల కేసుగా మీడియాకు సంబరం చేయొచ్చు.  లేదా వీళ్ళు ఉద్యోగ రీత్యా విడిపోయి దూరం కాగానే ఒకరికొకరు జ్ఞాపకాలుగా మిగిలిపోవచ్చు.  ఏది ఏమయినా ఇదంతా సహజం. అవడానికి అది ఆఫీసు లవ్ అయినా అది వ్యక్తిగతం అని మర్చిపోవద్దు.  ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే వరకూ బయటపడక పోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఎందుకంటే రెండువైపులా ఉండే ప్రేమలో నాన్చుడు ఉండదు. వ్యవహారం సాగుతుందంటే అది వన్ సైడ్ అని అర్థం.  ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం అమృతం కిందే లెక్క.)       

8, ఆగస్టు 2013, గురువారం

తెలిసీ పలికిన విలువేగా...!

'పేదరికం...  ఒక మానసిక స్థితి మాత్రమే '
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యపై స్పందిస్తూ 'పేదలను అవమానించారు' అంటూ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ యువరాజును తెగ విమర్శిస్తోంది. పత్రికలు కూడా అదో విడ్డూరం అన్నట్టు విస్తుపోతున్నాయి.  అలా విమర్శించే ముందు అతనే సందర్భంలో ఆ మాట అన్నాడో కూడా పట్టించుకోవట్లేదు. అయినదానికీ కానిదానికీ రాద్ధాంతం చేయడమే రాజకీయం కాబట్టి, ప్రతిపక్షాలు వాటికి అవసరం అయినంత మేరకే ఆలోచిస్తాయి. ఏదో ఒకటి జరిగితే దాన్ని సంచలనం చేయడమే పత్రికల పని.

పేదరికాన్ని స్వయం శక్తితో  అధిగమించిన స్వయం సహాయక సంఘాల గురించి ప్రస్తావిస్తూ, 'ఆత్మవిశ్వాసంతో తమంతట తాముగా  పేదరికం నుండి బయటపడే ప్రయత్నం చేయనంతవరకూ, ఏ ప్రభుత్వం ఏం చేసినా ప్రయోజనం ఉండద'ని అర్థం వచ్చేలా అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ఇలా మాట్లాడం  తప్పే. అయితే ఆ తప్పు  వల్ల కాంగ్రెస్ పార్టీకి ముప్పు. రాహుల్ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు. అంతే కానీ దేశానికి, ప్రజలకు, పేదలకు మాత్రం కనువిప్పు కలిగించే మాటలవి. ఎంతో పరిణితితో కూడిన, నిజాయితీ కలిగిన , సంస్కర్త మాట్లాడినట్లుగా ఉంది. ముఖ్యంగా జనాకర్షక పథకాలకు పెట్టిన పేరు కాంగ్రెస్. అందునా నగదు బదిలీ వంటి ప్రత్యక్ష ప్రయోజనాల ఆలోచన చేసిన రాహుల్ నోటి వెంట ఈ మాట రావడం విస్మయం కలిగించేదే. అయినా స్వాగతించ తగిన పరిణామం. 

గత 65 సంవత్సారాల నుంచి ఇప్పటివరకు  పేదల పేరు చెప్పి బొక్కసం ఖాళీ చేస్తూ, వీధి నాయకుల నుంచి దేశ నాయకుల వరకు అందరూ ప్రజాధనం బొక్కి  బొజ్జలు పెంచారే తప్ప, పేదోడి డొక్క నిండలేదు. పేదల బ్రతుకులు మారనూలేదు. నానాటికీ పేదలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. నిజానికి పేదల కోసం ప్రభుత్వాలు ఇళ్ళు కట్టిస్తున్నాయి. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఏ మార్కెట్లోనూ దొరకనంత తక్కువ రేటుకు బియ్యం మరియు వంట సరకులు ... ఇలా ఒక్కో లబ్ది దారుడికి సుమారుగా నెలకు 300 రూపాయలు(మన ముఖ్యమంత్రిగారి తాజా లెక్కల ప్రకారమే 230 రూపాయలు)  అందిస్తున్నాయి. అయినా 8.46 కోట్ల జనాభా కలిగిన మన రాష్ట్రంలో  2. 3 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వ ప్రకటనలు చెబుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2. 08 కోట్ల  కుటుంబాలు మాత్రమే ఉంటే తెల్ల కార్డులున్న కుటుంబాలు 2. 3 కోట్లు ఉండటం గణిత శాస్త్రానికే సవాలు విసిరే అంశం.  ప్రభుత్వ ఖజానా నుండి బయటికి వచ్చే సంక్షేమ నిధులు లబ్దిదారుడిని చేరే లోపు మంచు గడ్డలా కరుగుతూ కరుగుతూ  ఎంత మంది నాయకుల, అధికారుల ధనదాహాన్ని తీరుస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఖరీదయిన స్కార్పియో వాహనంలో వచ్చి, తెల్ల కార్డును చూపించి ఆరోగ్య శ్రీ కింద కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుకుంటున్న వైనం గురించి పత్రికలలో చదివి కూడా అసలైన పేదను గుర్తించే ఏ ప్రయత్నమూ, ఏ ప్రభుత్వమూ చేయదు. ఎందుకంటే ఆ కార్డులతో ప్రయోజనం పొందే వాళ్ళల్లో పార్టీ నాయకులూ,   వారి అనుచరగణమే  ఎక్కువ. వారికి ఆ ప్రయోజనాలు అందకపోతే పార్టీని మట్టి కరిపించేస్తారు. అందుకే...  వారిని మేపే నిరంతర ప్రక్రియలో భాగంగానే ఇలాంటి పేదల పథకాలను ఎప్పటికప్పుడు వినూత్నంగా  తమ ఎన్నికల అజెండాలో చేరుస్తుంటాయి రాజకీయ పార్టీలు. అంతే కానీ నిజంగా పేదలను ఉద్ధరించే లక్ష్యం ఏ పార్టీకీ లేదు. 

 చాన్నాళ్ళ క్రితం గుడిపాటి వెంకటాచలం తన రచనల్లో ఒక చోట ఇలా రాస్తే, చదివినట్టు గుర్తు. ''కడుపు నిండా తిని, తాంబూలం నములుతూ పేదోడి ఆకలి కష్టాల గురించి తమ రచనల్లో తెగ రాసేస్తుంటారు రచయితలు. నిరుపేద జీవితం చాలా దుర్భరమైనదని అనిపించేలా  వర్ణిస్తారు. సానుభూతిని కురిపించేస్తారు.  నిజానికి మనం అనుకుంటున్నంత దుర్భరంగా ఉండదు పేదోళ్ళ జీవితం. శ్రమించి పనిచేయడం వాళ్ళకి కష్టం అనిపించదు. ఉన్నంతలోనే ఆనందాన్ని వెదుక్కుంటూ, మరొకరి సాయం ఆశించకుండా ఆత్మగౌరవంతో బ్రతకడం వాళ్లకి  తెలిసినంతగా వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళకి తెలియదు.''

ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది కూడా అదే. రోజుకు ఇంత సంపాదించే వాడు, నెలకు ఇంత ఖర్చు చేసేవాడు పేదవాడు  అనే లెక్కలన్నీ భౌతికపరమైన అంశాలు మాత్రమే. సంతృప్తితో కూడిన మానసిక స్థితిని పొందనంత వరకూ, వాడు పేద కిందే లెక్క. కోట్ల ఆస్తి ఉండి కూడా డబ్బు కోసం నానాగడ్డి కరిచే వాడు,  సలక్షణమైన ఉద్యోగం చేస్తూ కూడా పై ఆదాయం ఆశించేవాడు ఎప్పటికీ నిరుపేద కింద లెక్కే.  రాహుల్ చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం. పేదరికం అన్నది ఒక మానసిక స్థితి. ఆ స్థితి నుంచి బయటపడాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం ఉండాలి. ప్రతి పేదకూ కావలసింది అదే.  గాలివాటుగా కాకుండా   కాబోయే ప్రధాని అభ్యర్థిగా ఒక స్పష్టమైన దృక్పథం ఉండి ఈ మాటను అని ఉంటే... రాహుల్ గాంధీని ప్రధానిగా ఆహ్వానించ వచ్చు.              

4, ఏప్రిల్ 2013, గురువారం

కర్మభూమి నుండి జన్మభూమికి... వేంచేస్తోన్న 'లలితా'రాణి

సినీతారలకు ప్రజాసేవ చేయాలనిపించడం మన అదృష్టం. 
ఎందుకంటే అప్పటివరకూ అందనంత ఎత్తులో ఉండే తారలు, రాజకీయాలలోకి వచ్చినప్పటినుంచీ నుంచి నేల మీద, అదీ మన మధ్యే  ఉంటారన్నమాట. మొబైల్ ఫ్యానులూ, ఎయిర్ కూలర్ల మధ్య, గ్లామర్ గొడుగు నీడలో ఉంటూ, పండ్ల రసాలతో నోరుతడుపుకుంటూ ఎండకన్ను ఎరగరేమో అన్నంత సుకుమారంగా గడిపిన వెండితెర వేలుపులు, మండుటెండల్లో ప్రజలు నడిచే సాధారణ బాటల్లో నడుస్తారు. అప్పటివరకు మన ఇంటి గోడ మీద క్యాలెండరులో వేలాడుతూ మన్మథ బాణాలు సంధించి, సమరం చేసిన దేవతలు, ఏకంగా మన ఇళ్ళల్లోకి నడిచొచ్చి మన లోగిళ్ళను పావనం చేస్తారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని ఇంద్ర కుమార్తెలా వీళ్ళంతా అమృతం తాగి బతుకుతారేమో అని అనుకుంటూ ఉండగనే, మనలని ఆశ్చర్యపరుస్తూ మనం తినే కంచాల్లోనే మనం తినే పెరుగు ముద్దనే ఆబగా, లాగేసుకుని మరీ తింటారు. అలా కష్టపడుతున్న ఆ దేవుళ్ళను చూసి మన మనసు కరిగి, ఓట్ల వర్షం కురిపిస్తాం. అంతే! మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంతవరకు ఆ దేవుళ్ళు, దేవతలు మనకు కనబడరు. ఉంగరం దొరకబుచ్చుకున్న వెంటనే స్వర్గానికి చెక్కేసిన ఇంద్రజలా, వీళ్ళూ వాళ్ళ వాళ్ళ లోకాలకు తిరిగెల్లిపోతారు. క్యూలో కొట్టుకు సచ్చి, లేదంటే బ్లాకులో బోలెడన్ని డబ్బులు తగలేసి టికట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళాక సినిమా చెత్తగుంటే ఏం చెయ్య గలుగుతున్నాం? ఎవరిని అడుగుతున్నాం? మరో సినిమా విడుదలయ్యేంత వరకూ ఎదురుచూడట్లేదా? ఇదీ అంతే! అసలు విషయానికి వస్తే...

పదునాలుగేళ్ళ వయసులో భూమికోసం(1976) చిత్రం ద్వారా జయప్రదగా వెండితెర అరంగేట్రం చేసిన రాజమండ్రికి చెందిన నాట్యకళాకారిణి లలితా రాణి, జయప్రదంగా  300పై చిలుకు చిత్రాలలో నటించారు.   దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలలో నటించి ఇటు దక్షిణాది ప్రేక్షకులను, హిందీ, బెంగాలీ చిత్రాల ద్వారా అటు ఉత్తరాది ప్రేక్షకులను తన అందచందాలతో ఉర్రూతలూగించారు. ప్రతిభతో రాణించి సమకాలీన గ్లామర్ నటీమణులకు  గట్టిపోటీనిచ్చారు. సినీరంగంలో ఉండగానే పెళ్ళిచేసుకుని జయప్రద నహతా అయ్యారు.  అంతవరకూ  బాగానే ఉంది. కళాసేవ పూర్తయ్యాక సహజంగానే ప్రజాసేవ చేయాలనిపించింది రాణిగారికి. అంటే జయప్రదగా సుప్రసిద్దురాలైన లలితారాణి గారికి.  అదే సమయంలో ఎన్టీ రామారావు గారి ఆహ్వానం అందడం,ఆయన స్ఫూర్తితో సినీజీవితాన్ని త్యాగం చేసి తెలుగు దేశం పార్టీలో చేరిపోవడం చకచకా జరిగి పోయాయి.

ఇక్కడ త్యాగం అనగానే అప్పటివరకూ సంపాదించినదంతా ధారపోస్తారని అమాయకంగా అనుకునేరు. త్యాగం అంటే... ఇకపై సినిమాల్లో వచ్చే సంపాదనని వదులుకోవడం అన్నమాట. 'అసలు ఇక్కడ అవకాశాలు తగ్గాక కదా అటు వెళ్ళేది' అని గడుసుగా అనకండి. అది త్యాగం... అంతే!  ఇలా వీరి త్యాగంతో, పార్టీలో అసలు త్యాగాలు మొదలవుతాయి. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడిపడగానే, అప్పటివరకూ పార్టీని నమ్ముకుని ఉన్న అసలయిన నాయకులు వాళ్ళ పదవులనీ, అవకాశాలనీ త్యాగం చేసి, ఈ రాలి పడ్డ తారలకి  చోటివ్వాలి. గౌరవం ఇవ్వాలి. వారి వెంట జెండా మోసుకుంటూ తిరగాలి. అందుకే కొన్నాళ్ళు  వాడుకున్నాక, అంటే పార్టీకి సేవలను చేయనిచ్చాక ఇలాంటి వాళ్ళందరినీ ఢిల్లీకి పంపించేస్తుంటాయి పార్టీలు.

ఆ క్రమంలోనే జయప్రద కూడా  ఢిల్లీ వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలో కలకలం రేగడంతో భవిష్యత్తును బేరీజు వేసుకుని చంద్రబాబు వెన్నంటి ఉన్నా, ఎందుకనో అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ లోపు  ఢిల్లీ రాజకీయ పరిచయాలు కలసివచ్చి లలితా రాణి కాస్తా రాంపూర్ కి రాణి అయ్యింది. ''ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి అయితే, ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి''  అంటూ అక్కడి ఓటర్లను ఆకట్టుకుంది.

తారాజువ్వ నింగిలోకి దూసుకుపోతున్నంత సేపూ నేల గురించి ఆలోచించదు. పవరు తగ్గాక తిరిగి నేల వైపు చూస్తుంది. అలాగే ఇప్పుడు జయప్రద చూపు ఆంధ్రప్రదేశ్ పైకి మళ్ళింది. కర్మభూమి నుంచి జన్మభూమికి వస్తానని, స్వరాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని అంటోంది. ఆమె సేవలను అందుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నదీ లేనిదీ ఎన్నికలప్పుడు తేలిపోతుంది. అయితే ఆమె సేవలను ఏ పార్టీ వాడుకుంటుంది అనేది మాత్రం ఆమెకే తెలీడం లేదు. ఎందుకయినా మంచిదని నాలుగు స్టేట్మెంట్లు నాలుగు రకాలుగా వినిపించి, తన పురాగమన తేదీని కూడా ప్రకటించి రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఆఫర్ ఇచ్చారు రాణి గారు. ఇప్పుడు రాణి గారికి ప్రజాసేవ చేసే నిమిత్తం ఒక సీటు కావాలి. రాజమండ్రి అయితే మరీ మంచిది. అయితే ఈ రాలిపడే తారాజువ్వ  తమ నెత్తిన ఎక్కడ పడుతుందో అని, అన్ని పార్టీల నాయకులూ బెంబేలెత్తి పోతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి సీటును ఆశిస్తున్న వారంతా ఎలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుందో అని నీరుగారి పోతున్నారు. మిగతా సిత్రాన్ని రాష్ట్ర రాజకీయ తెరపై సూడండి.

                

                           

15, మార్చి 2013, శుక్రవారం

మి(మ)ధ్య తరగతి

'జాతీయ ఇల్లు హక్కు బిల్లు -2013'ను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వార్త. అంటే 'విద్యాహక్కు చట్టం' మాదిరిగానే 'ఇల్లు హక్కు చట్టం' అన్నమాట.  విద్యాహక్కు చట్టం ప్రకారం దేశంలోని 6-14 సంవత్సరాల వయసున్న పిల్లలంతా ఉచితంగా , అంటే ఎలాంటి ఫీజు కట్టనవసరం లేకుండా బడిలో చదువుకుంటూ ఉండాలి. అది ఎంత వరకు అమలవుతుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వచ్చేది 'ఇల్లు హక్కు చట్టం'.  ఇది మాత్రం అందరికి  కాదండోయ్. కేవలం గ్రామీణ పేదలకు మాత్రమే అట. మరి పట్టణ పేదల సంగతి ఏంటో?

విద్యా హక్కు చట్టం ఉన్నా దానిని ఉపయోగించుకోడానికి పేదలు ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే వారి దృష్టిలో పిల్లలంటే ఆదాయ వనరుల కింద లెక్క. వాళ్ళు పనికి కాకుండా బడికి పోయి కూర్చుంటే పూటకింత బువ్వ, రాత్రికింత మందు దొరికేదేట్టా? కానీ ఇప్పుడీ ఇల్లు హక్కు అనగానే అందరూ ముందుకొచ్చే వాళ్ళే. ఎందుకంటే 10 సెంట్ల (484 గజాల) భూమి అంటే ఊరకనే వస్తుందా?  ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు, జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం కింద ఇల్లు, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు,... ఇలా ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇళ్ళు చాలా ఉన్నాయి. అవన్నీ పేదలకే అని చెప్తున్నా, ముఖ్యమంత్రి పేరుమీద కూడా  ఈ ఇళ్ళు మంజూరయిన వింతలు చూస్తుంటే అవి ఎవరికి అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దర్జాగా స్కార్పియోలో వచ్చిన  ఆసామి ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ వైద్యం అందుకున్నా, నాలుగు అంతస్తుల ఇంటికి యజమాని అయ్యుండీ, నెలకు నలభై వేల అద్దెలు తీసుకుంటున్న వ్యక్తి, కనీసం తీసుకుంటున్న అద్దెకు రశీదు కూడా ఇవ్వకుండా ఆదాయపు పన్ను నుంచి తప్పించుకుంటున్న వ్యక్తి తెల్లకార్డును కలిగివున్న పేదగా చలామణి అవుతున్నా, ప్రభుత్వం మాత్రం ప్రతి పథకం పేదల గురించే రూపొందిస్తుంది. పేదలంటే ప్రభుత్వాలకి అంత ప్రేమ మరి.

ప్రభుత్వాలకి డబ్బున్న పెద్దలంటే మరీ మరీ ప్రేమ. పేదలకు ఉచితంగా భూములిచ్చినట్టే, డబ్బులున్న పేదలకు  కూడా  ప్రభుత్వం అతి ఖరీదైన భూముల్ని కారు చవకగా , ఒక్కోసారి అప్పనంగా అప్పగించేస్తుంది. పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉద్యోగాలు ... అని ఇలా అనేక కారణాలు చెప్పి రాయతీలిస్తుంది.

అటు పేదలకు, ఇటు ధనికులకూ కూడా ఈ ఉదార పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి డబ్బునిచ్చేది మాత్రం మధ్య తరగతి ప్రజలు. వాళ్ళకు పరువే ముఖ్యం. నియమాలను అతిక్రమించడం వాళ్లకు తెలీదు. చట్టం అంటే గౌరవం. పోలీసంటే భయమ్. అందుకే పస్తులుండి అయినా పన్నులు  కడతారు. అద్దె ఇంట్లో ఉంటూ కూడా ఆదాయపు పన్ను కడతారు. ప్రతి పైసాకు లెక్క చెప్తారు. అయినా ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు వాళ్ళు లెక్క లోకి రారు.
పన్నులు పెరిగినా, ధరలు పెరిగినా, చార్గీలు పెరిగినా ఏ  రాయితీ లేకపోవడం మూలంగా అన్ని భారాలను చచ్చినట్టు మోసే మధ్య తరగతి వాడంటే అందరికీ లోకువే. అందుకే ఇల్లు హక్కు అనేది వీళ్ళకు వర్తించదు. ఆరోగ్య పథకాలు వర్తించవు. విద్య ఉద్యోగాలలో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు.  ఆ మాటకొస్తే వీళ్ళు జనాభా లెక్కల్లోనూ ఉండరు. ఎలాగంటారా? ఉదాహరణకు మన రాష్ట్ర జనాభా 8. 46 కోట్లు. మన రాష్ట్రంలో ఉన్న తెల్ల కార్డులు 2. 3 కోట్లు. అంటే 2. 3 కోట్ల నిరుపేద కుటుంబాలలో, ఇంటికి కనీసం నలుగురు చొప్పున నిరుపేదలే 8. 12 కోట్ల మంది ఉన్నారన్న మాట. ( మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత ఈ అరవై ఏళ్ళలో సాధించిన ఘనత ఇదే ) మిగిలినవాళ్ళు  కచ్చితంగా మిలియనీర్లే. నీకెలా తెల్సని అడుగుతారేమో! రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రముఖులు, రాజకీయ నాయకులు, వీరి సేవలో నిత్యం తరించే అయ్యాఎస్ లు... ఇలా లెక్కేస్తే, నా లెక్క సరిపోతుంది. ఇక మధ్యతరగతి వాళ్ళెక్కడ ఉన్నారు చెప్పండి? అందుకే మన ప్రభుత్వాలు ఈ మిధ్యాతరగతి గురించి ఏమీ ఆలోచించవు. మొన్నటికి మొన్న...  ఆదాయపు పన్ను పరిమితిని పెంచమని అడిగితే, మన ఆర్థిక మంత్రి చిదంబరం గారు కొంపలు మునిగి పోతాయన్నంత భావాన్ని ఒలికించారు. ఆయనకూ తెలుసు. పైనోడు ఖర్చులు చూపించి తప్పుకుంటాడు. కిందోడు లెక్కే చూపించడు. ఇక బొక్కసాన్ని నింపేది మధ్యోడే. పరిమితి పెంచేసి వాడికి వెసులుబాటునిస్తే  మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా? లక్ష కోట్ల కుంభకోణాలకి ఆస్కారమివ్వడం ఎలా?     

పేదోడి దగ్గర ఓటు ఉంది. అది అధికారాన్ని ఇస్తుంది. పెద్దోడి దగ్గర నోటు ఉంది. అది ఓటును కొనుక్కోడానికి, అధికారంలో కోట్లు కూడేసు కోడానికీ వ్యక్తిగతంగా  పనికొస్తుంది. అంచేత రాజకీయాలన్నీ పేదోడిని మచ్చిక చేసుకోడానికి, పెద్దోడిని  ప్రసన్నం చేసుకోడానికి చూస్తాయి. మధ్య తరగతోడు అటు ఓటేయడానికి రాడు. ఇటు డైరెక్ట్ గా నోటు ఇవ్వడు. అందుకే వాడికి ఎలాంటి  హక్కూ ఉండదు. నిత్యం సమస్యల సమరంలో కొట్టుకుసచ్చే మధ్యతరగతి  వాడు విడిగా ఉద్యమాలు చెయ్యగలడా? అది కూడా చాతకాదు కాబట్టే ఇంత అలుసు.  


అయ్యా! గౌరవనీయమైన పాలకులూ! ప్రజాసేవలో పునీతమవుతున్న నాయకులూ! అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అన్న సామెత ఉంది కాబట్టి  అడుగుతున్నాం. పేదోడు అడగకపోయినా వరాలు కురిపిస్తారు. పెద్దోడు అడగగానే ఆఘమేఘాల మీద పనిచేసి పెడతారు. అలాగే మధ్య తరగతోడి మీదా కాస్త దయచూపండి. త్రిశంకు స్వర్గం లాంటి బతుకులను కాస్త దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళూ మనుషులేనని...  సారీ!  ఓటర్లేనని  గుర్తుంచుకోండి. వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోండి. వాళ్ళకూ తలదాచుకునేందుకు నీడ కావాలి. ఆ ఇళ్ళ గురించీ ఆలోచించండి.కనీసం ఇంటి స్థలమైనా ఇవ్వండి.  ధరల గురించి ఆలోచించండి. మధ్య తరగతి పించన్ల గురించీ ఆలోచించండి.  వారికీ సామాజిక భద్రత  ఇవ్వండి. అయ్యా! మధ్య తరగతిని రక్షించండి!                                  

27, ఫిబ్రవరి 2013, బుధవారం

సత్కారమా? అవమానమా?... ఆలోచించుకోడానికి 'ఆస్కార'మిది!

'లైఫ్ అఫ్ పై' చిత్రం నాలుగు ఆస్కార్ అవార్డులు కొట్టేసిందనేసరికి భారత మీడియా తెగ సంబరపడిపోయింది. ఆ నాలుగు అవార్డులూ దక్కించుకున్న వాళ్ళల్లో మన భారతీయులెవరూ లేరు. మరెందుకింత ఉత్సాహం అంటే ఆ సినిమాకీ భారత దేశానికీ చాలా సంబంధం ఉందంట. కథ - పాండిచేరికి చెందిన ఒక భారతీయ కుటుంబానికి  సంబంధించినది.  నటీనటులు- ముఖ్యపాత్రధారి సూరజ్ శర్మ దగ్గరనుంచి టబు, ఆదిల్ హుస్సేన్, ఇర్ఫాన్ ఖాన్ ... ఇలా అందరూ మనవాళ్ళే . ఇక అందరినీ మురిపించి, మైమరపింప చేసిన 'రిచర్డ్ పార్కర్' అనే పులిరాజు మన బెంగాలీ బాబే. ఆ బెంగాలీ పులికి డిజిటల్ రూపాన్నిచ్చి, ప్రాణం పోసిన వాళ్ళల్లో మన తెలుగు కుర్రాళ్ళు ఉన్నారంట. అవును! హైదరాబాదులోని రిథమ్ & హూస్ స్టూడియోస్ ఈ చిత్రానికి అద్భుతమైన యానిమేషన్ ను అందించింది. ఆ ఘనత అంతా ఆ సంస్థలో పనిచేస్తున్న తెలుగు వాళ్ళ సృజాత్మకతకే దక్కుతుంది.
ఈ విషయాలను కాసేపు పక్కన పెడదాం. మన దేశానికి చెందిన మహాత్ముని గురించి సినిమా తీస్తే, దానికి 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. మన ముంబై మురికివాడల నేపథ్యంలో తీసిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడీ పై.  అంటే మన సంస్కృతి, మన చరిత్ర, మన జీవన విధానం అంతగా ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి అన్నమాట.   

పై హిందువుగా పుట్టినా కైస్తవ, మహమ్మదీయ మతాల సారాన్ని వంటపట్టించుకున్నవాడు. భారత దేశంలో ఉన్న లౌకిక సమాజానికి ఇది అద్దం పట్టింది. అలాగే తండ్రి బోధించిన తార్కిక తత్వం కూడా పై ని ఆలోచింప చేస్తుంది.   అందువల్లే సర్వస్వాన్ని పోగొట్టుకుని, బ్రతకడానికి క్షణక్షణం పోరాడవలసిన క్లిష్ట పరిస్థితులను కూడా తట్టుకుని, 227 రోజులు నడిసముద్రంలో, జీవనపోరాటం చేయగలిగాడు పై. అది కూడా పదహారేళ్ళ పిన్న వయసులో.  మన దేశంలో సామాన్యులే ధీరోదాత్త హీరోలు. అదే విదేశీయులను అంతగా ఆకట్టుకుంటుంది. అమీర్ ఖాన్ నిర్మించిన లగాన్ కూడా ఆస్కార్ బరిలో నిలబడి హోరాహోరీ పోరాడ గలగడానికి కారణం కూడా అదే. 

మన జానపద కథలకు గాని, మహాభారత, రామాయణ ఇతిహాసాలకు గాని, భారత దేశ చరిత్రకు గాని మరే ఇతర దేశాలు కనీసం పోల్చుకోలేనంత ఘనత ఉంది. అయినా ఈ దేశం విదేశీయులను ఆకర్షించినంతగా, స్వదేశీయులను ఎందుకు ఆకర్షించదనే నా ప్రశ్న. ఎంతసేపూ ఒక భాషలో ఆదరణ పొందిన కాపీ కథలనే, ఇంకో భాషలోకి  తర్జుమా చేసుకోవడం,  ఒక సినిమాలో పేరు తెచ్చుకున్న వాళ్ళ ఇంటి చుట్టూనే బారులు తీరడం, ఇన్ని కోట్లు ఖర్చు చేసాం అంటూ బాకాలు ఊదడం, ఆడియో కార్యక్రమాలు, జైత్రయాత్రలు, గత వైభవాన్ని తవ్వుకునే సంభాషణలు, తప్పనిసరి పాటలు, పోరాట సన్నివేశాలు, ఏ మాత్రం ఆసక్తి పుట్టించని కథా కథనాలు... ఇదేనా మన సినిమా?

మన భారతీయ ప్రతిభను ప్రపంచమంతా 'వాడుకుంటుంటే' మనమేం చేస్తున్నట్టు? ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకుంటూ 'సూరజ్! ఎక్కడున్నావ్?' అంటూ అంగ్ లీ, పై పాత్రధారి సూరజ్ శర్మను గుర్తుచేసుకున్నాడంటే, అతని మనసులో 'ఈ విజయానికి కారణం నువ్వే' అన్న భావన ఉందన్నమాట. అలాంటప్పుడు అతను ఉత్తమ నటుడి విభాగంలో ఎందుకు నామినేట్ కాబడలేదో అంతుబట్టని విషయం. 

అయినా ఆస్కార్ అవార్డుల కోసం మనం అర్రులు చాచే కంటే, ఆ అవార్డులే మనల్ని వెదుక్కుంటూ వచ్చేలా మనం చిత్రాలను తీయలేమా? మరి ఒక్కో సినిమాకి ఇన్నేసి కోట్లు ఖర్చు పెట్టి ఎవర్ని ఉద్ధరిస్తున్నట్టు. హీరో గారి ఇమేజికి, హీరోయిన్ గారి గ్లామర్ కీ అన్ని కోట్లు సమర్పించి, పనికిమాలిన కథను తీసుకొచ్చి జనం నెత్తిన రుద్దడమే విజయం అనుకుందామా? అదే మన అభిరుచి అని  చంకలు గుద్దుకుందామా? కాస్త ఆలోచిద్దాం! ఇంతకూ మీరు 'లైఫ్ అఫ్ పై' సినిమాని చూశారా? తప్పక చూడండి! మీ పిల్లలకు కూడా తప్పక చూపించండి.  అవార్డులోచ్చాయని కాదు,  బతుకువిలువ తెలుసుకోడానికి.                                  

తెలుగింటి ఆటలు

మనందరం చిన్నప్పుడు ఆటలాడుతూనే పెరిగాం.  అయితే ఏయే ఆటలు ఆడారో చెప్పగలరా? నాకు గుర్తున్న కొన్ని ఆటలు... దాగుడుమూతలు, ఏడు పెంకులాట, వంగుళ్ళు-దూకుళ్ళు, అష్టా-చెమ్మ, వైకుంఠపాళి, గచ్చకాయలు, అచ్చనగండ్లు, కబడ్డీ, తొక్కుడు బిళ్ళ... ఊ ... ! ఇంకా  ఏవో ఏవో...! పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంకా రకరకాల ఆటలు ఆడి ఉంటారు.

అయితే మన పిల్లలు వీటిల్లో ఎన్ని ఆటలు ఆడి ఉంటారో ఎప్పుడైనా గమనించారా? అసలు ఇలాంటి ఆటలు ఉంటాయని వాళ్లకు తెలుసా? తెలియక పోతే వచ్చే నష్టమేంటి? అసలు ఆటలాడే తీరిక వాళ్ళకు ఎక్కడిది అంటారా? ఎప్పుడైనా కాస్తంత తీరిక దొరికితే టీవి చూడడం, లేదా సిస్టం లోనో, మొబైల్ లోనో గేమ్స్ ఆడుతూనే ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఆడటం అన్నది వారి సహజగుణం. అయితే ఈ ఆటలకి, మనం ఆడిన ఆటలకి ఎంతో తేడా ఉంది. ఇప్పుడు పిల్లలు ఆడుతున్న ఎలక్ట్రానిక్ ఆటలన్నీ మరొకరి తోడు అవసరం లేనివి. శరీరానికి అలసట నివ్వనివి. పిల్లలను సమాజంలోనికి పంపడానికి బదులు, వాళ్ళకు ఏమాత్రం పరిచయం లేని ప్రపంచాన్ని ఇంట్లోకే తెప్పించేవి. అందుకే ఈనాటి పిల్లలకి పోటీని తట్టుకునే మానసిక స్థైర్యం గాని, అపజయాన్ని అంగీకరించే స్ఫూర్తి గాని, మన చుట్టూ ఉన్న మనుషులతో కలుపుగోలుతనంతో మాట్లాడి పనులు నెరవేర్చుకోవడం గాని తెలియడం లేదు.
ఈ విషయాలను పక్కన పెట్టి పాయింటుకు వస్తున్నా.


ఒక పదానికి అర్థం కావలసి వచ్చి ఆంధ్ర భారతి వెదుకుతుంటే అనుకోకుండా ఈ జాబితా కనబడింది. ఇవ్వన్నీ బాల్యక్రీడలంట. ఆచార్య జి. ఎన్. రెడ్డి గారి తెలుగు పర్యాయపద నిఘంటువులో ఈ జాబితాను ఇచ్చారు. తెలుగునాట ఇన్ని ఆటలు ఉన్నాయా? అని ఆశ్చర్యమేసింది. మీరు ఓసారి చదవండి. వాటిల్లో మీరు ఆడినవి, మీకు తెలిసినవి ఉంటే వాటి గురించి మీ పిల్లలకు చెప్పి ఇవి కూడా ఆడుకోవచ్చు అని చెప్పండి.        
                

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

సొగసు చూడ తరమా...

పద్మశ్రీ  బాపు రూపుదిద్దిన దృశ్యకావ్యం 'మిస్టర్ పెళ్ళాం' సినిమా. అందులో కథానాయికగా నటి ఆమని చాలా సొగసుగా నటించింది. సినిమాలో నాయిక అందాలను పొగడుతూ ఒక పాట ఉంది.

అందాన్ని పొగడడం అంటే కొన్ని పాటలలోలాగా కొలతలు చెప్పకుండా, తిట్టకుండా, రోడ్డు మీద పోయే అమ్మాయిని ఒక పోకిరి అల్లరి చేసినట్టుగా కాకుండా, తను మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీని, ఆరాధనాభావంతో మెచ్చుకోవడం లేదా కీర్తించడంలా ఉంటుంది ఈ పాట. కేవలం బాహ్య అందాలనే కాకుండా, వివిధ సందర్భాలలో  ఆమెలో కలిగిన భావోద్వేగాలు, ఆ సమయాలలో బహిర్గతమైన స్త్రీ సహజ హావభావ సౌందర్యాన్ని స్వర్గీయ వేటూరి సుందర రామ్మూర్తి అద్భుతంగా ఆవిష్కరించగా, కీరవాణి స్వరకల్పనలో, 'సొగసు చూడ తరం కాదేమో గానీ, ఇంత సొగసుగా  పాడడం నా ఒక్కడి తరమే' అన్నట్టుగా బాలు పాడారు. ఇక బాపు గురించి వేరే చెప్పాలా! ఆమని అంత అందంగా మరే సినిమాలోనూ కనబడలేదు. అంతేకాదు ఆ సినిమా చూసిన ప్రతి మొగుడికీ 'అరరే... ఇన్నాళ్ళూ నా భార్యలోనూ దాగున్న ఈ అందాన్ని నేనెందుకు గమనించలేక పోయానబ్బా?' అని అనిపించి ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో.

ఇలాంటి పాటనే నేటితరం అమ్మాయి విషయంలో పాడవలసి వస్తే, ఆ పాట ఎలా ఉంటుందన్న ఆలోచనతో సరదాగా ఇది రాశాను.  చదివి (అదే శైలిలో పాడుకుని) చూడండి. ఈ పాటకు కరాకే ట్రాక్ కూడా అంతర్జాలంలో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ పదాలతో పాడుకుని మీ వద్ద సంక్షిప్తం చేసుకోండి. 

పల్లవి:

అతను:  సొగసు చూడ తరమా
ఆమె:     ఆ ఆహా ...
అతను:  సొగసు చూడ తరమా
ఆమె :    అ ఆ ...
అతను:  నీ సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా

అనుపల్లవి:

అతను:  ఆ సోగ కన్నుల్లు, అవి పంపే పిలుపుల్లు
              ఆ మూతి విరుపుల్లు, అవి తెలిపే అలకల్లు
              అందమే సుమా !
              సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా

చరణం 1:

అతను:  జీన్స్ ప్యాంటు వేసుకుని
              హై హీల్స్ తో నడిచేవేళ
              లతలాగా ఊగే తనువును
              తనివి తీరగ చూస్తుంటే

              చురుకుమన్న చూపు సెగకు
              అడుగులు తడబడి, చూపులు ముడివడి
              సిగ్గుతోన చెమర్చిన చెక్కిలి కెంపుల
              సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా

చరణం 2:

అతను:  చూసిచూడనట్టి చూపుల్తో ఎదను గుచ్చి
              ఉత్తుత్తి కోపాల విసురులతో ఫోజుకొట్టి
              ఇరకాటపు మాటలతో ఎటుతేల్చక నన్ను చంపి
              మనసునొచ్చి నేనుంటే కవ్వింపుగ నవ్వినపుడు
              పకపకమని నవ్వినపుడు
ఆమె:     హహహ్హ!
అతను:  ఆ  సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా

చరణం 3:

అతను:  లైవ్ చాట్ కు నను పిలచి ఊసులాడుతున్నపుడు
ఆమె:     ఊ ఊ ఊ ...
అతను:  చిరుకోరిక బైటపెట్టి,   'ఓకేనా' అన్నపుడు
              తీపితిట్టు తిట్టి, సిస్టమాపుచేసి
              సెల్ఫోనులో, ఇంగ్లీషులో
              యమపీకుడు పీకినపుడు
ఆమె:     యూ...!!!
అతను:  ఆ ఉడుకు చూడతరమా
              నీ దుడుకునాపతరమా

చరణం 4:


అతను:  పగలంతా ఆఫీసులో పరుగులు తీసి, అలసిసొలసి  ఇంటికిచేరి
              పొడుగుగౌనుతో  వంటింట్లో వండీ వార్చి, అలుపే తీరగ తానాలాడి
              శ్రీదేవియై శ్రీవారికై ఎదురుచూచు విరహాలలో
              నీ అలసిన కనుల, ఆ చెదరిన ముంగురుల
              కళను పొగడతరమా
              నీ సొగసునోప తరమా


              వెచ్చని పరువాలు పూసుకున్న పరిమళాలు
              ఎర్రని పెదవి రంగు అదిరేటి ముక్కు సిరలు

              అందమే సుమా !
              సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా




                     


1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

స్త్రీ కోరిక (తప్పక చదవాల్సిన కథ - ముగింపు)


(నిన్నటి బ్లాగులో ...జరిగిన కథ )

యువరాజు ప్రాణాలను కాపాడేందుకు ఒక ముదుసలి మంత్రగత్తెను వివాహం చేసుకునేందుకు సిద్ధపడతాడు యువరాజు స్నేహితుడు. అప్పుడు యువరాజు ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి అతనికి మరణశిక్షను తప్పిస్తుంది మంత్రగత్తె.

ప్రశ్న: స్త్రీ నిజంగా కోరుకునేది ?
జవాబు: తనకు సంబంధించిన ఏ విషయమైనా తన చేతుల్లోనే ఉండాలనే ప్రతి స్త్రీ కోరుకుంటుంది.

ఇచ్చినమాట ప్రకారం మంత్రగత్తెను  పెళ్ళిచేసుకున్నాడు స్నేహితుడు.

మొదటిరాత్రి...
తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తోన్న ఓ భయంకర అనుభవాన్ని తలచుకుని యువరాజు లోలోన కుమిలిపోతుండగా , స్నేహితుడు మాత్రం చిరునవ్వుతో శోభనపు గదిలోకి అడుగుపెట్టాడు.

ఆశ్చర్యం!
అక్కడ పడక మీద ఓ అద్భుత సౌందర్యరాశి అతనికి స్వాగతం పలికింది. ఏమిటిదని అడిగాడు.
'నీ స్నేహితుడైన యువరాజు ప్రాణాలను కాపాడడం కోసం నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం... నీ భార్యగా నాకు సగం దక్కింది. అందుకే నాకీ రూపం ప్రాప్తించింది. అయితే ఈ అందం రోజులో సగకాలం మాత్రమే ఉంటుంది. మిగిలిన అర్థకాలం నేను నా అసలు రూపంతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనెప్పుడు ఏ రూపంతో ఉండాలి?

పగలు అందగత్తెగా  కనిపిస్తే... 
గొప్ప అందగత్తెకు భర్తగా నీకు గౌరవం ఉంటుంది. కానీ రాత్రి వేళ ఒక కురూపితో కాపురం చేయాల్సి ఉంటుంది. 
రాత్రిళ్ళు అందగత్తెగా కనిపిస్తే ...
ప్రతి రాత్రీ స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. కానీ పగటిపూట ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉండే కురూపిని చూసి అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు.నిర్ణయం నీది. నీకు ఎలా కావాలో చెప్పు.' అంది మంత్రగత్తె.

(ముగింపు... )

'ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. నా భార్యగా నీకు కూడా సంబంధించినది. ఏ స్త్రీ అయినా తనకు సంబంధించిన విషయాలపై తనే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటుందని నువ్వే చెప్పావు. అలాంటి సహజసిద్ధమైన స్త్రీ కోరికను నీ విషయంలో నేను తీర్చాలనుకుంటున్నాను. భర్తగా అది నా బాధ్యత కూడా. కాబట్టి ఈ విషయంలో నువ్వే నిర్ణయం తీసుకో. దానికి నేను మనస్పూర్తిగా కట్టుబడి ఉంటాను.' ఏమాత్రం తడబడకుండా  అన్నాడు.

మంత్రగత్తె మనసు ఉప్పొంగిపోయింది. 'నీ స్నేహితుడి ప్రాణాలను కాపాడడం కోసం నా లాంటి కురూపిని  పెళ్లి చేసుకోడానికి సిద్ధపడితే, అది కేవలం త్యాగమే కదా అనుకున్నాను. పెళ్లి అయిన తర్వాత నన్ను భార్యగా గౌరవిస్తావో లేదో అన్న సందేహం కలిగింది. అందుకే ఈ విధమైన ప్రశ్న నీ ముందుంచాను. భార్య రూపంతో నిమిత్తం  లేకుండా ఆమెను స్త్రీగా గౌరవించే నీ లాంటి భర్తను పొందాక నాకీ మంత్రశక్తులతో పనేముంది? నా జీవితమంతా తపించింది నీలాంటి భర్తకోసమే. అందుకే నేను అన్ని వేళల్లోనూ సౌందర్యవతి గానే, యవ్వనంతో ఉండేందుకు  నా శక్తులన్నీ ధారపోస్తున్నాను.' అన్నదామె.

(కథ సమాప్తం.)

ఈ కథ చెప్పొచ్చేదేంటంటే ...

పై రూపంతో సంబంధం లేకుండా ప్రతి స్త్రీ మనసూ మంత్రగత్తె మనసును పోలివుంటుంది. భర్త నుంచే కాదు, సమాజం నుంచి కూడా ఆమె ఆశించేది ఒక్కటే . తన జీవితం తన చేతుల్లో ఉండాలి. ఆ స్వేచ్ఛను ఆమెకు ఇవ్వనప్పుడే పరిస్థితులు వికృతంగా మారతాయి.




31, జనవరి 2013, గురువారం

స్త్రీ కోరిక...? (తప్పక చదవాల్సిన కథ )

                                                                                                                                          
'ఆడది కోరుకునే వరాలు రెండే రెండు ... పచ్చని సంసారం , చక్కని సంతానం...' అంటూ ఆవిడ కోరికలకు హద్దులు గీసారొక సినీకవి. ఇందులో ఆయన తప్పేమీలేదు. ఎందుకంటే ఆదినుంచీ 'కార్యేషు దాసీ ...' అంటూ మొదలెట్టి నువ్విలాగే ఉండాలి, నువ్వు చేయాల్సిన పనులివే, నీకు కావలసినవి ఇవే అంటూ ... స్త్రీ మనసుకు అడ్డుగోడలు కట్టారు. దాంతో ఆమె కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి నాకు కావాల్సింది ఇంతే అనుకుంటూ బ్రతకసాగింది. ఇప్పటికీ దాదాపు అలాగే బతుకీడుస్తోంది. అందుకే పై పాటల్లాంటివి పుట్టుకొచ్చాయి.

'గాలికదుపు లేదు, కడలికంతు లేదు, గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా ? ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా?...' 
అంటూ తొలి రోజుల్లో స్వేచ్ఛను కోరుకున్న అమ్మాయిలు సైతం, ఆ తర్వాత భర్త కనుసైగల్లొ ఒదిగిపోక తప్పని పరిస్థితులు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉన్నాయి, ఉంటాయి. కానీ స్త్రీ నిజంగా ఏం కోరుకుంటుంది అనేది ఈ కథ స్పష్టంగా చెప్తుంది. అందుకే స్త్రీ, పురుషులు ఇద్దరూ తప్పనిసరిగా ఈ ఆసక్తికరమైన కథను చదవాలి, చదివించాలి అని నాకనిపించింది.
ఇ - మెయిల్ ద్వారా ఓ ఫ్రెండ్ ఆంగ్లంలో పంపిన పిట్టకథ ఇది. నాకు బాగా నచ్చి,  నా బ్లాగులో ఉంచాలనిపించి తెలుగులో ఇంకాస్త ఆసక్తికరంగా ఉండేలా , విస్తరించి అనువాదం చేస్తున్నాను.

కథ :
అనగనగా ఒక యువరాజు. శత్రుదేశపు రాజు చేసిన దండయాత్రలో రాజ్యాన్ని పోగొట్టుకుని, అతని చేతికి బందీగా చిక్కాడు. అలా తన చేతికి చిక్కిన యువరాజును శత్రుశేషం లేకుండా చంపేద్దామనే అనుకున్నాడు శత్రురాజు. కానీ ఆ యువరాజుకు అశేష అభిమానులు ఉన్నారు. అప్పటికే  ప్రజల్లో తిరుగుబాటు సంకేతాలు కనబడుతున్నాయి. అందుకని ఒక షరతు పెట్టాడు శత్రురాజు.

షరతు ప్రకారం రాజు అడిగే ఒక క్లిష్టమైన ప్రశ్నకు యువరాజు సమాధానం చెప్పాలి. వెంటనే చెప్పక్కరలేదందోయ్. కఠినమైన ప్రశ్న కాబట్టి, ఒక సంవత్సరం గడువు కూడా ఇచ్చాడు. పైగా మరో వెసులుబాటు కూడా ఉంది. ఫోన్ ఎ ఫ్రెండ్ లాంటి అవకాశమే.  కాకపోతే అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి  రాజ్యమంతా కలియతిరుగుతూ ఆప్తులను, మేధావులను, పండితులను, అనుభవజ్ఞులను ఎవరినైనా సంప్రదించి సలహా తీసుకోవచ్చు. సంవత్సరం తర్వాత ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే యువరాజుకు ప్రాణాలతో పాటు, స్వేచ్ఛ కూడా లభిస్తుంది. చెప్పలేకపోతే మరణదండన తప్పదు. ఈ షరతుకు యువరాజుతో పాటు, ప్రజలందరూ అంగీకరిస్తారు. అప్పుడు శత్రురాజు ప్రశ్నేంటో చెప్పాడు.

ప్రశ్న: స్త్రీ నిజంగా కోరుకునేదేంటి?   

మొదట ఓసింతేనా అనిపించిన ప్రశ్న కాస్తా, ఆలోచించేకొద్దీ  జటిలమనిపించింది. 'అవును! కష్టమైన ప్రశ్నే' అన్నారు మేథావులు. 'ఊహకు అందడం కష్టం' అన్నారు కవులు. ఇంక లాభం లేదని యువరాజు ఊరు మీద పడ్డాడు. ఏకంగా ఆడవాళ్ళనే అడిగి చూసాడు. చర్చాగోష్టులు నిర్వహించాడు. అయినా సరైన సమాధానం దొరకలేదు. మరోవైపు సమయం మించి పోతోంది. చివరికి ఎవరో పెద్దమనిషి సలహా ఇచ్చాడు. ఆ రాజ్యంలో జనావాసాలకు దూరంగా నివసించే మంత్రగత్తె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలదు అన్నాడు. ఆమె గురించి తెలిసిన వాళ్ళంతా ఔను నిజమే అంటూ అతనితో ఏకీభవించారు. యువరాజు కూడా ఆమె గురించి గతంలో విన్నాడు. అయితే  ఆమెతో లావాదేవీలు చాలా కష్టం. భారీ ప్రతిఫలాన్ని కోరుతుంది. అసలే రాజ్యం పోగొట్టుకుని ఉన్న తాను ఆమె కోరినంత ఇవ్వడం అయ్యేపని కాదు. అందుకని ఆ ప్రయత్నాన్ని చేయలేదతను.

ఇక ఆఖరు రోజు రానే వచ్చింది. మరణదండన తప్పేట్టులేదు.  ఏం చేయడమా అని ఆలోచిస్తుంటే అతని ప్రాణ స్నేహితుడు వచ్చాడు. అతను గతంలో యువరాజు సైన్యంలో ఒక ముఖ్యుడుగా ఉండేవాడు. అతను అందగాడు, ధీరుడు. వీరుడు, నవయవ్వనుడు.

'ఉన్న ఒకే ఒక అవకాశం మంత్రగత్తెను కలవడం. అసలామెను కలిస్తేనే కదా ఆమె అడిగే ప్రతిఫలం గురించి తెలిసేది. అంతగా ఆమె అడిగింది మనం ఇవ్వలేనప్పుడు చూద్దాం. ముందు వెళ్దాం పద!' అన్నాడు.
ఇద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళారు. ప్రశ్న విన్న ఆమె సమాధానం చెప్పడానికి అంగీకరించింది. అయితే ప్రతిఫలంగా డబ్బుకు బదులు మరొకటి అడిగింది. అదేమిటంటే యువరాజుతో పాటుగా వచ్చిన  స్నేహితుడు ఆమెను పెళ్ళి  చేసుకోవాలి.
ఉలిక్కిపడ్డాడు యువరాజు. పళ్ళన్నీ రాలిపోయిన పండు ముసలిది. చూస్తేనే అసహ్యం వేసే కురూపి. దానికి తోడు మాటకు మాటకు మధ్య ఏదో జబ్బువల్ల నోటినుంచి వస్తున్న జుగుప్సాకరమైన శబ్దాలు.  శరీరం నుంచి భరింప లేనంతగా దుర్వాసన. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకోమని ఎలా అనగలడు? తన ప్రాణం కోసం స్నేహితుడి జీవితాన్ని నరకంలోకి తోయాలా? 
'కుదరదు' అంటూ  వెనుతిరిగాడు యువరాజు. స్నేహితుడు ఆపాడు. 
'నీ ప్రాణం కంటే నాకేదీ ఎక్కువ కాదు. నీకు సాయం చేయగల అవకాశం వచ్చాక కూడా, దాన్ని వదులుకుంటే, నా స్వార్థం నేను చూసుకుంటే, స్నేహానికి విలువేంటి?' అన్నాడు.  
'అలాగని ఆమె షరతును అంగీకరించడం నా స్వార్థం చూసుకున్నట్టు అవుతుంది.' అన్నాడు యువరాజు.  
పట్టుపట్టాడు స్నేహితుడు.
'అలాగైతే ఒక షరతు. నీ జవాబు సరైనది అయి నాకు మరణశిక్ష తప్పిన తర్వాతే మీ పెళ్లి.' అన్నాడు యువరాజు.
మంత్రగత్తె అందుకు అంగీకరించి సమాధానం చెప్పింది.

జవాబు : ఏ స్త్రీ అయినా నిజంగా కోరుకునేది ఒక్కటే. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తన చేతుల్లోనే ఉండాలి. 

అదే సమాధానాన్ని శత్రురాజుకు చెప్పాడు యువరాజు. మరణదండన తప్పింది. యువరాజుకు స్వేచ్ఛ లభించింది. అంతేకాదు వారి స్నేహానికి ముచ్చటపడిన శత్రురాజు, రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేసాడు. మంత్రగత్తెకు ఇచ్చిన మాట ప్రకారం వారిద్దరికీ ఘనంగా వివాహం జరిపించాడు యువరాజు.

మొదటిరాత్రి...
తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తోన్న ఓ భయంకర అనుభవాన్ని తలచుకుని యువరాజు లోలోన కుమిలిపోతుండగా , స్నేహితుడు మాత్రం చిరునవ్వుతో శోభనపు గదిలోకి అడుగుపెట్టాడు.
ఆశ్చర్యం!
అక్కడ పడక మీద ఓ అద్భుత సౌందర్యరాశి అతనికి స్వాగతం పలికింది. ఏమిటిదని అడిగాడు.
'నీ స్నేహితుడైన యువరాజు ప్రాణాలను కాపాడడం కోసం నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం... నీ భార్యగా నాకు సగం దక్కింది. అందుకే నాకీ రూపం ప్రాప్తించింది. అయితే ఈ అందం రోజులో సగకాలం మాత్రమే ఉంటుంది. మిగిలిన అర్థకాలం నేను నా అసలు రూపంతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనెప్పుడు ఏ రూపంతో ఉండాలి.
పగలు అందగత్తెగా  కనిపిస్తే... 
గొప్ప అందగత్తెకు భర్తగా నీకు గౌరవం ఉంటుంది. కానీ రాత్రి వేళ ఒక కురూపితో కాపురం చేయాల్సి ఉంటుంది. 
రాత్రిళ్ళు అందగత్తెగా కనిపిస్తే ...
ప్రతి రాత్రీ స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. కానీ పగటిపూట ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉండే కురూపిని చూసి అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు.నిర్ణయం నీది. నీకు ఎలా కావాలో చెప్పు.' అంది మంత్రగత్తె.

(మంత్రగత్తె తన ముందుంచిన రెండు అవకాశాలలో అతడు ఏం కోరుకున్నాడో తర్వాతి బ్లాగులో చెప్తాను.)

ఇది చదివిన మగవారికి ఓ ప్రశ్న...
అతని స్థానంలో మీరుంటే ఏం  కోరుకుంటారు?

ఆడవారికి...
స్త్రీ కోరిక విషయంలో మంత్రగత్తె చెప్పింది ఎంతవరకు నిజం?
మీరైతే ఏం సమాధానం చెప్ప్తారు?

మీ సమాదానాలని రాయండి. బయటపడడం ఎందుకనుకుంటే, జవాబును మనసులో అట్టేపెట్టుకుని తర్వాతి బ్లాగులో ఇచ్చే జవాబుతో (స్నేహితుడు చెప్పినదాంతో) పోల్చిచూసుకోండి. ఈ కథను ఇదివరకే విన్నవాళ్ళు కూడా మీ స్పందనను, కథా వివరాలను తెలపవచ్చు. 



30, జనవరి 2013, బుధవారం

వ్యధ నిండిన హృదయంతో ...

దేశంలో కొందరికే భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందా? అందరికీ ఉండదా?
ఉండదనే అనిపిస్తుంది ఈ మధ్య జరుగుతున్న సంఘటనల గురించి వింటే. బాల్ థాకరే మరణించినప్పుడు ఇద్దరు యువతులు తమ అభిప్రాయాలను సోషల్ నెట్ వర్కులో పంచుకున్నందుకు వారిని అరెస్టు చేయడంతో పాటు, వారి ఇళ్ళపై దుండగులు దాడి చేసే వరకు వెళ్ళింది. కారణం ఆ రాష్ట్రంలో శివసేన ఒక బలమైన రాజకీయ శక్తి .

అలాగే ఇప్పుడు తమిళనాట జయలలిత కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.  విశ్వరూపం సినిమా కోసం కమల్ తన సృజనాత్మక శక్తితో పాటు, ఆర్థికంగా తనకున్న శక్తినంతా పణంగా పెట్టాడు. అందులో ఏదీ వృధా కాలేదన్న విషయం సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. అంత బాగా ఉంది సినిమా. ఇలాంటి సినిమా తీసి భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి  చాటిచెప్పిన కమల్ హాసన్ను మనమందరం అభినందించాలి. కాని దురదృష్టవశాత్తూ అలా జరగడంలేదు. ఆయనపై కత్తి కట్టినట్టు జయలలిత పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ సినిమా విడుదలను అడ్డుకుంటోంది. కోర్టు తీర్పులను సైతం సవాలు చేస్తోంది. మరోవైపు ఆ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లపై దాడులు జరుగుతున్నాయి. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని వేరే చెప్పనక్కరలేదు.

వ్యధ నిండిన హృదయంతో (ఎద నిండిన హృదయంతో ... అన్న క్యాప్షన్తో విశ్వరూపం పోస్టర్లు వెలిశాయి.) కమల్ హాసన్ మీడియా ముందుకు వచ్చి కంట తడి పెట్టారు. సొంత గడ్డపై తాను ఎదుర్కొంటున్న కష్టాలను పాత్రికేయులతో పంచుకున్నారు. ఆయన చేసిన తప్పేంటి? ఉన్నదున్నట్టు  చూపిస్తూ ఒక సినిమాను నిర్మించడమా? అయినా అందులో భారతీయ ముస్లింలను కించపరిచే ఎలాంటి దృశ్యాలూ లేవు. ఒక వేళ ఉంటే ఆ కత్తిరింపు ఏదో సెన్సార్ బోర్డు చేసున్డాలి. ఇంకా అభ్యంతరాలుంటే ఆయా సన్నివేశాలను తొలగించమని సామరస్య ధోరణిలో అడగవచ్చు. అలా కాకుండా ఏకంగా సినిమానే నిషేధిస్తే నిర్మాతగా ఆయనేం కావాలి. ఇక్కడ సానుభూతితో  అనడంలేదు. భావప్రకటనా స్వేచ్ఛ ఆయనకు లేదా అని ప్రశ్నిస్తున్నా.

ఎన్నాళ్ళీ లౌకిక సన్నాయి నొక్కులు? ఎవరి ప్రయోజనాల కోసం? రాజకీయ లబ్ధి ఉంటె చాలా? దానికోసం ఎంత ఘోరానికైనా సిద్ధపడతారా? ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనే చత్రపతి శివాజీ, పృధ్వీరాజ్ చౌహాన్ వంటి వీర గాధలను తెరకెక్కించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు  చివరికి మహాత్మా గాంధీ జీవితచరిత్రను సైతం పరాయి దేశం వాళ్ళే తెరకెక్కించ వలసివచ్చింది. ఎందుకీ దురవస్థ? ఎన్నాళ్ళీ సంకెళ్ళు? ఇలాంటి పరిస్తితుల్లో హొమ్ మంత్రి షిండే  చేసిన వాఖ్యలు కొంత ఆశావహంగా ఉన్నాయి. ఆయనే కాదు ఈ దశలో భారతీయ చలనచిత్రరంగం మొత్తం కమల్ హాసన్ కు  అండగా నిలవాల్సిన అవసరం ఉంది. చిత్రం కోసం మాత్రమే కాదు. మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా!

దర్శకుడిగా, నటుడిగా కమల్ 'విశ్వరూపం'

ప్రతీదీ వివాదమౌతున్న ఈరోజుల్లో కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన విశ్వరూపం సినిమా కూడా అనేక వివాదాలను ఎదుర్కొంటూ వచ్చింది. థియేటర్లతో పాటు డీటిహెచ్ ప్రసారానికీ అనుమతించడం ఒక వివాదానికి దారితీస్తే, ముస్లింలకు వ్యతిరేకంగా చిత్రకథ ఉందంటూ మరో వివాదం. ఈ నేపథ్యంలో తమిళనాట విడుదలకు నోచుకోని ఈ చిత్రం తెలుగునాట మాత్రం విడుదలైంది.అదీ ఆచితూచీ కొన్ని థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించినా, మాట్లాడినా సహించలేని పరిస్థితులు, కళారంగాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రతీదీ రాజకీయ ప్రయోజన కోణంలో ఆలోచించే సమాజంలో ఇకపై ఇలాంటి ప్రయోగాలను మరెవ్వరూ చేసి చేతులు కాల్చుకోరేమో! ఆరు పాటలు, ఐదు పోరాటాలు, అందాల ఆరపోతల చిత్రాలే ఇక మనకు గతి.

ఇక విశ్వరూపం చిత్రం విషయానికి వస్తే, కమల్ పట్ల ఉన్న భారీ అంచనాలతో ప్రేక్షకులు కూడా భారీగానే థియేటర్లకు వచ్చారు. వారిలో చాలామందికి నచ్చని (పట్టని) కథాంశం కావడంతో ఆదిలోనే నిరాశతో కూడిన ఎన్నో నిట్టూర్పులు. అదే సమయంలో కాస్తోకూస్తో హాలీవుడ్ సినిమాలు చూసిన ప్రేక్షకులు మాత్రం కన్నార్పకుండా కమల్ వెంట తన్మయత్వంతో పరుగులు తీశారు. రెండున్నర గంటలు దాటినా, ఇంకా చూడడానికి ప్రేక్షకుడు సిద్ధంగా  ఉంటాడు. అలాంటి సమయంలో టక్కున ముగుస్తుంది సినిమా. విషయం ఏంటంటే, ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండోభాగం కూడా మరోచిత్రంగా రానుందని చివర్లో చెప్పారు. ఇది కూడా కొంతమందిని నిరాశపరుస్తుంది. ఏది ఏమైనా మన భారతీయ చలనచిత్ర పరిశ్రమ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించగలిగే చిత్రం.

కథాంశానికి వస్తే, అమెరికాలో ప్రముఖ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో డాక్టరుగా పనిచేస్తున్న నిరుపమ (పూజా కుమార్ మాథుర్ ) తన బాస్ తో (అక్రమ)సంబంధాన్ని కలిగిఉంటుంది. (భారతీయ చిత్రం కాబట్టి దీన్ని మరీ లోతుగా తీసుకువెల్లకుండా, ప్రారంభదశలోనే  పక్కదారిపట్టించారు). ఈ విషయం బయటపడితే తన తప్పును కప్పిపుచ్చుకోడానికి వీలుగా ఉంటుందన్న ఉపాయంతో, భర్తకు కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయేమో ఆరాతీయడానికి ఒక డిటెక్టివ్ ను నియమిస్తుంది నిరుపమ.  కథక్ కళాకారుడైన ఆమె భర్త (కమల్ హాసన్) ఇంటిపట్టునే ఉంటూ ఔత్సాహికులకు కథక్  నేర్పుతుంటాడు. ఇలాఉండగా ఒకరోజు నిరుపమ భర్తను అనుసరిస్తూ  వెళ్ళిన  డిటెక్టివ్, తప్పుదారిపట్టి ఒక  వేర్ హౌస్ లోకి అక్రమంగా ప్రవేశించబోతాడు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది.

అల్ ఖైదా పోరాటాలకు సంబంధించిన కథ. జీహాదీలకు ఇచ్చే శిక్షణ, వారి జీవనవిధానం, కుటుంబ నేపథ్యాలు, కరడుకట్టిన మతవాదం, అమలుచేసే శిక్షలు... ఇలాంటి అంశాలపై ఎంతో లోతైన పరిశోధనలు చేశారనిపిస్తుంది. ఆఫ్ఘన్ పర్వతపానువుల్లో చిత్రీకరించబడిన యుద్ధ దృశ్యాలు అద్భుతం. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోవు. స్పృశించిన సన్నివేశాలు సున్నితమైనవి. అయినా వాస్తవానికి దగ్గరగా,మనసుకు హత్తుకునేలా చూపించారు.  హింసాత్మక దృశ్యాలు ఉన్నప్పటికీ కథకు అనుగుణంగానే, అవసరంమేరకే  ఉన్నాయి. ఒకే ఒక పాట. మరో పాట బ్యాక్ డ్రాప్లో వస్తూంటుంది. కథక్ నేర్పుతూ సాగే ఆ ఒక్క పాటనూ అద్భుతంగా చిత్రీకరించారు. దిల్ తో పాగల్ హై, దేవదాస్ వంటి హిందీ చిత్రాలకు పనిచేసిన  పండిట్ బిర్జూ మహారాజ్ ఈ పాటకు నృత్య దర్శకత్వం చేశారు. కథక్ నాట్యాచార్యునిగా కమల్ చూపిన హావభావాలు మనోహరం. ఇదే పాత్ర మరో పాత్రగా రూపాంతరం చెందే క్రమంలో ఒక ఫైట్ ఉంటుంది. కుర్ర హీరోలు కూడా అంత ఎనర్జీతో చేయలేరేమో! ఈ ఒక్క సీన్ చాలు దర్శకుడిగా, నటుడిగా కమల్ విశ్వరూపాన్ని చాటడానికి.

హిందీలోని ఎన్నో హిట్ చిత్రాలకు, తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి సంగీతం అందించిన శంకర్-ఎహసాన్ -లాయ్ త్రయం ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

చివరగా చెప్పేదేంటంటే ఇది తప్పకచూడాల్సిన సినిమా. అది కూడా థియేటర్లో.