పేజీలు

5, మార్చి 2011, శనివారం

ముద్దు-ముచ్చట






'
మ్మ్ మ్మ్ ముద్దంటే చేదా!... నీకా ఉద్దేశం లేదా?...'అని హీరోని అడుగుతుంది హీరోయిన్ ఒక పాటలో. ముద్దు ఇవ్వాలంటే 'ఆ' ఉద్దేశం ఉండాలనో, లేక 'ఆ ' ఉద్దేశం ఉంటే ముద్దుతో మొదలుపెట్టమనో కవి గారి భావం అన్నమాట. పెదవులు ముడి పడ్డాయంటే (లిప్స్ లాక్ జరిగిందంటే ) శృంగారానికి తలుపులు తెరచుకున్నట్టే. అసలు రతీక్రీడలో స్త్రీ పురుషుల శారీరక కలయిక అన్నది రెండు చోట్లే ప్రధానంగా జరుగుతుంది. ఒకటి నాభికి క్రింది భాగంలో మర్మావయాల దగ్గర అయితే, మరొకటి నాభి పై భాగంలో పెదవుల దగ్గర. పెదవి పెదవి కలిసిందంటే సగం శారీరక కలయిక జరిగినట్టే. అందుకేనేమో 'ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు' అని హీరో అంటే 'ఇవ్వనిది అడగ వద్దు' అంటూ అభ్యంతరం చెప్పుతూ, పెళ్లి దాకా ఆగమంటుంది ముందు జాగ్రత్త గల హీరొయిన్ 'ప్రేమ' అనే సినిమాలో. అలాగే 'సపది మద నానలో దహతి మమ మానసం, దేహి ముఖ కమల మధుపానం' అంటూ నాయికను బ్రతిమిలాడతాడు జయదేవుని అష్టపదిలోని నాయకుడు. ముఖ కమలంలో మధువు ఎక్కడ ఉంటుందో తెలిసిందేకదా. మదన తాపాన్ని తట్టుకోలేక అడ్వాన్సుగా ముద్దిచ్చి ఆదుకోమని అడుగుతున్నాడన్నామాట.

తొలిముద్దు: నిజానికి తొలిముద్దును ఇచ్చేది అమ్మ. పాలిచ్చి ఆకలి తీర్చాక బిడ్డ నిద్ర పోతుంటే అమ్మతనం అనే భాగ్యాన్ని తనకిచ్చిన ముద్దుల పాపడిని సంతృప్తితో ముద్దు పెడుతుంది. అక్కడినుంచి నవ్వితే ముద్దులు, ఊసులాడితే ముద్దులు, కేరింతలు కొడితే ముద్దులు... ఇలా పెరిగే పాపాయికి అమ్మానాన్నల ముద్దులే టానిక్కులు.

అయితే
ముద్దులేవీ పెద్దయ్యాక గుర్తుండవు. కౌమార దశలోనో లేక అది దాటి యవ్వనంలోకి అడుగుపెట్టిన సమయంలోనో , మనసు మరో రకమైన స్పర్శ కావాలని కోరుకుంటున్న ప్రాయాన 'ఛీ పాడు' అన్న చీదరింపుల మద్యన , 'ఉండు, మా వాళ్ళకు చెప్తాను' అనే బెదిరింపుల మధ్య , 'వద్దు, తప్పు' అనే వారింపుల మధ్య, ఇంట్లో తలుపు చాటునో, పెరట్లో చెట్టు చాటునో, పొలంలో గడ్డి వాము చాటునో... పెదవి పై పంటి గాటు పడినప్పడు 'స్స్ స్స్ స్స్...'మంటూ తీపి బాధను జివ్వుమంటున్న నరాలకు అందిస్తూ పొందిన 'తొలిముద్దు' అనుభవం తొంభై ఏళ్ల జీవితకాలం గుర్తుండి పోతుంది. మొదట 'ఛీ ఎంగిలి యాక్' అనిపించినా తలచుకున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ కావాలనిపించి ముద్దులోని తీపిని కనుగొనేవరకు అనుభవం వెంట పరుగులు తీయిస్తుంది. అనుభవం గురించి మగాడైతే బాహాటంగా చెప్పుకోగలడు గాని, అమ్మాయి మాత్రం అలా చెప్పుకోలేదు. కాని ఇద్దరి మనసుల్లో నాటి తొలి ముద్ర పది కాలాల పాటు చెరిగిపోకుండా ఉంటుందనేది కాదనలేని సత్యం. మనలో మన మాట. తొలిముద్దు అనుభవం చాలా మందికి పెళ్ళికి ముందే ఎదురవుతుంది అంటే పచ్చి నిజమే అవుతుంది తప్ప అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. కావాలంటే మీ గతాన్ని త్రవ్వి చూడండి.
ముద్దు-ఒక భావ ప్రకటన:
'
బలిపీటం' సినిమాలో ఒక పాట ఉంది. కుశలమా..అని సాగే పాటలో అతను అడుగుతాడు'చిన్న తల్లి ఏమంది?' అని. 'నాన్న ముద్దు కావాలంది.' అంటుందామె. 'పాలుకారు చెక్కిలి మీద పాపాయికి ఒకటి, తేనెలూరు పెదవుల మీద దేవి గారికొకటి.' అని ముద్దుల్ని పంచుతాడతను. 'ఒకటేనా, ఒకటేనా' అని గోముగా అంటుందామె. 'ఎన్నైనా ...' అంటూ బుజ్జగిస్తాడతను. ఇదెందుకు చెపుతున్నానంటే ముద్దిచ్చే పెదవులు ఒకటే అయినా ముద్దు ఎవరికి ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తున్నాం, ఎక్కడ పెడుతున్నాం అన్న విషయాల మీద ఆధారపడి ముద్దు రకరకాల భావాలను వ్యక్తం చేస్తుంది.

చేయి పట్టుకుని వేళ్ళ మీద ముద్దు పెడితే అది అవతలి వారి మీది అభిమానాన్ని, గౌరవాన్ని చాటుతుంది. 'మీరు నాకు ప్రత్యేకమైన వారు. నా వ్యక్తిగత వలయంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను' అని ముద్దుకు అర్థం.నుదుటి మీద పెట్టె ముద్దు 'నీకు నేనున్నాను' అన్న భరోసా ఇస్తుంది. బాధల్లో ఉన్న సహచరిని ఓదార్చేందుకు ముద్దును పెడతాం. అంతే కాదు 'ప్లేటోనిక్ లవ్' అదే 'అమలిన శృంగారం' అంటామే అలాంటిది ఉన్నవారి మధ్య ఇలాంటి ముద్దులే తప్ప విషయం అంతకన్నా ముందుకు పోదు.బుగ్గపై ముద్దు ఇష్టాన్ని,కోరికని చెపుతుంది. పెదవులపై పెట్టే ముద్దు ఆపుకోలేని బలీయమైన కోరికను చెపుతుంది. చెవులు, ముక్కు, కను రెప్పల పై పెట్టె ముద్దులు 'ఇంతకంటే ఎక్కువగా నేను నిన్ను దగ్గరవ్వమని అంటున్నాను' అని వ్యక్తం చేస్తాయి. ఇక శృంగారంలో ముద్దులకు హద్దులు, పద్దులు, నియమాలు ఏవీ ఉండవు. శరీరంలోని ప్రతి భాగమూ ముద్దుకు అర్హమే అన్నట్టు ఉంటుంది పరిస్థితి.అసలు ముద్దుకు ఎందుకింత ప్రాధాన్యత అంటే పెదవుల మూలంగానే. పెదవుల నిర్మాణమే ముద్దు కోసం అన్నట్టు ఉంటుంది. అదీ గాక పెదవుల చుట్టూ ఉండే స్పర్శ నాడుల చివరలన్నీ పెదవుల వద్ద ముడిపడి కట్ట కట్టినట్టు ఉంటాయి. అందుకే మనసులో ఏమాత్రం ఉద్వేగాలు చోటు చేసుకున్నా పెదవులు ముందుగా బయట పడతాయి. సిగ్గేసినప్పుడు, కోరికను దాచుకున్టున్నప్పుడు, వలపును చెప్పకనే చెప్పాలనుకున్నప్పుడు అమ్మాయిలు పెదవులను కొరుక్కుంటూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు విషయాన్ని వణికే పెదవులు బయట పెడతాయి. దాహం వేస్తే, దేన్నయినా తినాలనిపిస్తే ముందుగా తడుపుకునేది పెదవులనే.ముద్దుపై పరిశోధన: అన్ని విషయాలపైనా పరిశోధనలు జరిగినట్టే ముద్దుపైనా పరిశోధనలు జరిగాయి.
  • ముద్దు పెట్టుకున్నప్పుడు 'డోపమిన్' అనే రసాయనంఎక్కువగా విడుదలై ఆకలిమందగించడం, నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు కలుగుతాయంట. వీటిని మనం ప్రేమ లక్షణాలు అంటాం.
  • అలాగే 'ఆక్సిటోసిన్' అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల శృంగారవాంఛ రెట్టింపవుతుంది.
  • న్యూరోట్రాన్స్ మీటర్స్ అనేవి మెదడులోఉత్పన్నమవటం మూలంగా హార్ట్ బీట్ పెరుగుతుంది.
  • ప్రతిఒక్కరు తమ జీవితంలో 20,160 నిమిషాలు ముద్దుపెట్టుకోవడంలో గడుపుతారట. (అందరూకాదేమో!)
  • ఒక్క నిముషం ముద్దుతో గడిపితే 20 కేలరీలు ఖర్చవుతాయి. (మీరు ఎన్ని కాలరీలు తగ్గించుకోవాలనుకుంటున్నారో లెక్కేసుకుని ప్రొసీడ్ అవ్వండి మరి. )
  • ముద్దు గురించి తెలిపే శాస్త్రాన్ని 'ఫైల్మేతాలజీ' అంటారు.
  • ముద్దు పెడుతున్నప్పుడు 34 ముఖ కండరాలకు పనిపడుతున్దంట్.
ముద్దు-ముప్పు: ముద్దు తో లాలాజలం ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం వుంది. అందుకని మనం ఎవరిని ముద్దు పెడుతున్నాం అనేది కూడా ముఖ్యం. ఎవరు పడితే వారు మన ముద్దుకు అర్హులు కారన్న విషయం గుర్తుంచుకోండి. 'ముద్దుపై ముద్దు పెట్టు...'అంటూ వెంటపడ్డారు కదా అని రెచ్చిపోతే రోమాన్స్ లోని తీపి ముద్దు కాస్తా చేదు అనుభవాలను మిగులుస్తుంది. అంతే కాదు ముద్దోస్తున్నారు కదా అని పసిపాపలను అదే పనిగా ఎవరు పడితే వారు ముద్దు పెట్టుకో కూడదు. దాని వాళ్ళ వారికి మేలు కన్నా హాని జరిగే అవకాశమే ఎక్కువ.
ముద్దు కోసం సంసిద్ధత: సాధారణంగా చాలామందికి ముద్దు అనేది ప్లానింగ్ ప్రకారమే ఉంటుంది. సమయం సందర్భం ముందే ఫిక్సయి ఉంటాయి కాబట్టి, అందుకు కాస్తంత ప్రిపరేషన్ అవసరం. శరీరం నుంచి గాని, నోటి నుంచి గాని దుర్వాసన రాకుండా చూసుకోవాలి. ఇద్దరికీ అది తొలి ముద్దు అయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ముద్దు పెట్టె అవకాశం ఎప్పుడు దొరుకుతుందో తెలీదు కాబట్టి, ఎల్లప్పుడూ నోటి శుబ్రత పాటించండి. సిగరెట్లకూ, మందుకూ దూరంగా ఉండండి.
ముద్దు-రికార్డ్: ప్రతి సంవత్సరం ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14 వ తేదీకి ముందు రోజును 'ప్రపంచ ముద్దుల దినం' గా జరుపుకుంటారు. రోజున కొన్ని దేశాలలో ముద్దుల పోటీని కూడా నిర్వహిస్తారు. ఇలాంటి పోటీలో ఒక జర్మనీ జంట ఏకంగా 32 గంటల 7 నిమిషాల 14 సెకన్ల పాటు ముద్దు పెట్టుకుని గిన్నీస్ రికార్డ్స్ బుక్ లోకి ఎక్కింది. మొన్న మొన్నటి వరకు ఇదే రికార్డ్. అయితే 2011లో బాంగ్ కాక్ లో జరిగిన పోటీలో ఒక థాయ్లాండ్ కు చెందిన జంట 46 గంటల 24 నిమిషాల 9 సెకన్ల పాటు ముద్దేట్టుకుని పాత రికార్డుని తుడిపేశారు. (ఫోటోలో జంటను చూడండి)
సినిమా ముద్దు: మనం చూసే సినిమాలలో తొంభై శాతం సినిమాలు ప్రేమ కొంగట్టుకుని తిరిగేవే. మరలాంటప్పుడు ముద్దు సీన్ లేకుండా ఎలా ఉండగలవు చెప్పండి. ఒకప్పుడంటే హీరోయిన్లు హీరోకి అల్లంత దూరంలో ఉండి తెరపై ప్రేమను ఒలక పోసేవారు. కాని ఇప్పుడు క్రియేటివ్ డిరెక్టర్లు , సహజ నటనను కురిపించే నటీ నటులు, కథ డిమాండ్ చేస్తే ఎంతకైనా తెగించి సెన్సేషన్ సృష్టించే హీరోయిన్లు వచ్చేశాక ముద్దు సీన్లకు కొదవ లేకుండా పోయింది.
ఎన్ని ముద్దు సీన్లను చూసినా 'దయావాన్' సినిమాలో వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ చుమ్మా సీన్ ముందు అన్నీ దిగతుడుపే అనిపిస్తాయి. మాధురీ తన కెరీర్ మొదట్లో మాత్రం తెగించి ఉండక పోతే తన టాలెంట్ మొత్తం తెర మరుగున పడిపోయేదే. సినిమా హిట్ కాకపోయినా ఈనాటికీ యు ట్యూబ్ వీడియోలలో ముద్దు సీనుదే పై చేయి.నయనతార, తమిళ హీరో శింభూల మధ్య ప్రేమాయణం సాగుతోంది అని పుకార్లు పుట్టడానికి కారణం ఒక సినిమాలో వారిద్దరూ పాల్గొన్న ముద్దు సీనే.
తెలుగు సినిమాల దగ్గరకు వచ్చేసరికి గీతాంజలి సినిమాలో నాగార్జున, గిరిజల పై ఒక పాట మొత్తాన్ని ముద్దు తోనే లాగించేశారు. 'నాని' సినిమాలో అలాంటి సీనేమీ లేకపోయినా మహేష్ బాబు , అమీషా పాటిల్ ముద్దు స్టిల్ల్స్ ని పబ్లిసిటీ కోసం బాగా వాడుకున్నారు. మధ్య 'ఏం మాయ చేసావే' సినిమాలో ముద్దు సీన్ హీరో కన్నా హీరోయిన్కే బాగా ఉపయోగ పడింది. 'ఇష్కియా' సినిమాలో విద్యాబాలన్, '16 డేస్' సినిమాలో చార్మీ... ఇలా చెప్పుకుంటూ పోతుంటే దాదాపు ముద్దిచేందుకు హీరోయిన్లందరూ పోటీలు పడుతున్నారు. ఎంతైనా తరం సినిమా ప్రేక్షకులు అదృష్టవంతులు మరి.

'అడగక ఇచ్చిన మనసే ముద్దు, అందీ అందని అందమే ముద్దు...' అన్నారు ఓ సినీ కవి. నిజమే! ముద్దు కావాలనుకున్నప్పుడు, అవతలి వారు అడక్కుండా ఇచ్చేంత వరకూ ఆగాల్సిన పనిలేదు కాని, ముద్దు పెట్టే ముందు వారి ఇష్టానికి ప్రాథాన్యత ఇవ్వాల్సిందే. లేదా ఆ ఇష్టం తెలిసే వరకు ఆగాల్సిందే. తొందర పడితే ముప్పే సుమా!

4 కామెంట్‌లు:

  1. చంద్రమోహన్ !
    ముద్దు పురాణం చాలా వివరంగా, మంచి సమాచారంతో బావుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. అయ్యబాబోయ్ ఇంత ముద్దు సమాచారాన్ని సేకరించారా. భలే భలే. నాకు బోలెడన్ని విషయాలు తెలిసిపోయాయి ఇది చదివాక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమాచారాన్ని సేకరించాను కానీ మధువులూరే అందమైన పెదవులను మీలా పొదివి పట్టుకోలెకపొయాను. కవితకు తగ్గ చిత్రాన్ని అందించడంలో ఎంత ఓపికండీ మీకు!

      తొలగించండి