పేజీలు

20, జులై 2015, సోమవారం

అందాల పోగు .. ముక్కుపోగు !


పొందికైన ముక్కుకు ఒక్క లోహపు పోగు తగిలిస్తే ముఖంలోని అందమంతా అక్కడే పోగు పడుద్ది. నచ్చిన మగ హృదయాన్ని కొల్లగొట్టాలంటే, ముక్కెర పెట్టిన ముక్కే ఎర. అందుకే దాన్ని ముక్కెర అన్నారేమో. 
ఎప్పుడూ పోష్ గా కనిపించే మన హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడూ ఒక సినిమాలోనో, ఒక పాటలోనో ముక్కుకు ముక్కెరతో కనిపించి యువహృదయాలకు గిలిగింతలు పెడతారు. 
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో...  ముక్కుకు ముత్యాన్ని తగిలించి, మూతిని సున్నాలా చుట్టి..  త్రిష ఫ్లైయింగ్ కిస్ ఇచ్చే షాట్ చూసిన రసహృదయాలు దాదాపు పదేళ్ళపాటు త్రిష పేరును కలవరించాయి. 
శబ్ద్ సినిమాలో 'లో షురూ అబ్ చాహతోం కా సిల్సిలా... ' అన్న శృంగార గీతంలో ముక్కుపోగు పెట్టుకున్న ఐశ్వర్యారాయ్ హావభావాలను చూసిన వాళ్ళకు శ్వాస వేడెక్కకుండా ఉంటుందా?  

అసలు ముక్కుపోగు అనగానే దానికి బ్రాండ్ అంబాసిడర్ అనదగ్గ అమ్మాయి టెన్నీస్ స్టార్ సానియా మీర్జా. తనతోనే ఈ మధ్య అమ్మాయిల్లో ముక్కుపోగుకు క్రేజ్ ఏర్పడింది. కాన్స్ ఫెస్టివల్ లో విద్యాబాలన్, సోనం కపూర్ లాంటి వాళ్ళు ముక్కెరతో మెరిసి, ప్రపంచ ఫోటోగ్రాఫర్లను ఆకట్టుకున్నారు. సోనాక్షీ సిన్హా నుండి నయనతార, శ్రీయ, సమంతా వరకు ఒక్కో సినిమాలో ముక్కెరతో కనిపించి అందాలు చిందించిన వారే. ఇక ఐటమ్ సాంగ్స్ వద్దకు వస్తే, ఈ మధ్యే వచ్చిన బాహుబలి సినిమాలో సైతం, మన హాట్ భామలు అంతా ఈ ముక్కెరలతో మురిపించిన వారే. స్త్రీ అలంకరణలలో ముక్కెరకు అంత ప్రత్యేకత ఉంది.

సర్వాభరణాలు:  

మెడలో కంఠాభరణం, శతమాన/మంగళసూత్రం, నల్లపూసలు...  దండచేతికి వంకీ, చేతులకు గాజులు, చేతి వేళ్ళకు ఉంగరం,..  చెవులకు దిద్దులు/ కమ్మలు/ బుట్టలు, చెంపస్వరాలు/ మాటీలు...  ముక్కుకు  పుడక, అడ్డబాస..  నడుముకు వడ్డాణం...  కాళ్ళకు పట్టాలు/ కడియాలు, కాలివేళ్ళకు మట్టెలు... స్త్రీలు అలంకరించుకునే  వీటన్నిటినీ  సర్వాభరణాలు అంటాం. ఈ సర్వాభరణాల లోనూ ముక్కెరకే విశిష్ట స్థానం. అంత విశిష్టత ఎందుకంటే ముక్కు వల్లే. 
ముఖానికి కళ్ళు అందమంటారు గానీ, శృంగారానికి ముక్కందమే ముఖ్యం. ముద్దుకు ముందుకొచ్చేది ముందుగా ముక్కే. మనిషిని గుర్తుపెట్టుకోడానికీ ముక్కే కీలకం. అందుకే తెలియని వ్యక్తి అనడానికి 'ముక్కూమొహమూ తెలియని వాడు' అంటాం.      

అన్ని ముక్కులూ ఒకలా ఉండవు.. 

ఒక్కొక్క ముక్కూ ఒక్కోలా ఉంటుంది. దేని ప్రత్యేకత దానిదే. దేని అందం దానిదే. కొందరివి సన్నగా పొడుగ్గా కొసదేరి ఉంటాయి. చివర కొంచెం వంగి  ఉండే ముక్కును కోటేరేసిన ముక్కు అంటాం (కోటేరంటే నాగలి). కొన్ని చిలుక ముక్కులు. కొన్ని వెదురు బొంగులు.  కొన్ని చప్పిడి ముక్కులు. 
కొన్ని జయప్రద ముక్కులు. కొన్ని శ్రీదేవి పదహారేళ్ళ నాటి గుండ్రటి ముక్కులు. కొన్ని ఇలియానా లాంటి కత్తి ముక్కులు, కొన్ని సమంతా లాంటి పొట్టి ముక్కులు. ప్రియాంకా గాంధీ నుండి దీపికా పడుకోన్ వరకు ప్రతి ముక్కుకూ ఒక్కో ప్రత్యేకత... ఒక్కో ముక్కుకూ వేరు వేరు అభిమానులు.  


ముక్కు సాముద్రికం: 

హస్త సాముద్రికంతో చేతిని చూసి భవిష్యత్తు చెప్పినట్టే, ముక్కును చూసి విషయం చెప్పే నాసికా సాముద్రికం కూడా ఉందంట. శతావధాని  సి.వి. సుబ్బన్న గారు ముక్కు సాముద్రికాన్ని ఇలా చెప్పారు.  అయితే అమ్మాయిల గురించే చెప్పారు సుమా! 
నాసిక దీర్ఘమై భాసిల్లుచుండిన
మగువ తా గోరిన మగని బొందు,
( పొడుగైన ముక్కున్న అమ్మాయి తను కోరుకున్న వాడిని పొందుతుంది. నిజమే కదా! పొడుగు ముక్కున్న భామకు అభిమానులు ఎక్కువమంది ఉంటారు కాబట్టి, వాళ్ళలో తనకిష్టమైన వాడిని ఎంచుకోవచ్చు.)     
నాసిక వట్రువై భాసిల్లు చుండిన
సతి యాధికారిక ప్రతిభ గొఱలు,
(వట్రువు అంటే గుండ్రని ముక్కు ఉంటే వ్యవహారాలు బాగా చక్కబెడతారు. డామినేటింగ్ స్వభావం) 
నాసిక శుకరీతి భాసిల్లు చుండిన
భామిని సుఖరీతి బరిఢవిల్లు,
(శుకము అంటే చిలుక ముక్కు ఉన్న అమ్మాయి సుఖ సౌఖ్యాలను పొందుతుంది)  
నాసిక చప్పిడై భాసిల్లుచుండిన
వికటస్వభావయై సకియ బొగులు,
(చప్పిడి ముక్కున్న అమ్మాయి హాస్య స్వభావంతో అందరితో స్నేహంగా, కలుపుగోలుగా ఉంటుంది) 
ప్రాగుపార్జిత పుణ్య సౌభాగ్య యైన
లేమ నాసిక గంధపలి వలె వెలయు,
(లేమ అంటే స్త్రీ, గంధఫలి అంటే సంపెంగ. పుణ్యవతి, సౌభాగ్యవతి అయిన స్త్రీ ముక్కు, సంపెంగ పువ్వులా ఉంటుందట)   
నని చికిత్సదీర్చికొనిన యంతమాత్ర
జక్కదనమబ్బునేమొ ప్రశస్తి రాదు.   
(అలాగని షేపు మార్పించుకుంటే చూడడానికి బాగుంటుందేమో గాని ఫలితాలు మారవు)


నాసికా సౌందర్యం: 

ముక్కు అందం గురించి మాట్లాడగానే సంపెంగ పువ్వు లాంటి ముక్కు అని వర్ణిస్తారు. ఎందుకలా అంటారో తెలీదు కానీ సంపెంగ పువ్వు రేకులు రేకులుగా విచ్చుకుని ఉంటుంది. ముక్కుకూ దానికీ పోలిక ఏంటో తెలీదు. ఇలా సంపెంగ పువ్వులాంటి ముక్కు అనడమే కాదు, అలా ఎందుకంటారో దానికో కథ కూడా చెప్పారు వసుచరిత్రలో... 
నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే :
లా నన్నొల్ల దటంచు గంధ ఫలి బల్కాకం దపంబంది, యో 
షా నాసాకృతి చూచి, సర్వ సుమన స్సౌరభ్య సంవాసమై :
పూనెం ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజము నిర్వంకలన్ .
వివిధ పుష్పాల మీద వాలి మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద నా దగ్గరకెందుకు రాదు? అని తెగ బాధపడిన సంపెంగపువ్వు, ఒక మండు వేసవికాలంలో తపస్సు చేసిందట. ఆ తపస్సు ఫలితంగా..  స్త్రీయొక్క ముక్కు ఆకారాన్ని పొంది అన్ని పువ్వుల యొక్క సువాసనలకు నిలయమై ఉండు అన్నాడట దేవుడు. అలా అయితే తుమ్మెదలు నా దగ్గరకు వస్తాయా అని అడిగింది సంపెంగ.  ఒకటి కాదు, రెండు తుమ్మెదల్ని నీకు రెండుపక్కలా నిత్యం ఉండే ఏర్పాటు చేశాను అన్నాడంట దేవుడు. వెంటనే ఆ సంపెంగ స్త్రీ యొక్క ముక్కువలె జన్మనెత్తింది. మరి దాని కోరిక ఎలా తీరింది? ముక్కుకు రెండువైపులా ఉండే నల్లని కాటుక కళ్ళే ఆ తుమ్మెదలంట. ఇది వసుచరిత్రలో రామరాజభూషణుడు అని పిలువబడే భట్టుమూర్తి (రాయలవారి అష్టదిగ్గజాలలో ఒకడు) చెప్పిన ముక్కు సంగతి.  “నువ్వు పువ్వన నవ్వు జవ్వని నాసిక” అని కథానాయిక ముక్కును నువ్వు పువ్వుతో పోల్చాడు చేమకూర వేంకట కవి. 
నా మటుకు నాకు అమ్మాయి ముక్కును లిల్లీ పువ్వుతో పోల్చాలనిపిస్తుంది. సన్నగా, పొడుగ్గా, చివరల చిన్నగా విచ్చుకున్న ముక్కు పుటాలతో అందంగా ఉండే ముక్కులన్నీ నాకు లిల్లీ పువ్వులా కనిపిస్తాయి.
ఇంకో విషయం ఏంటంటే అందరూ అమ్మాయి ముక్కునే పొగడుతారు కానీ, మగవారి ముక్కుకూ అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. 

ఎన్టీఆర్ ముక్కుకు సాటి టాలీవుడ్ లో మరో ముక్కు కానరాదు. ఆయన ఏ పాత్ర ధరించినా అంతగా నప్పడానికి కారణం ఆయన ముక్కే. అమితాబ్ బచ్చన్, స్వర్గీయ రాజీవ్ గాంధీల  ముక్కులకు కూడా చాలా మంది ఆడ అభిమానులు ఉండేవారు.   
ముక్కెర విశిష్టత: 
అలంకరణ అన్నది మానవ నాగరికతలో చోటుచేసుకున్నప్పటి నుండీ ముక్కెరకు విశిష్ట స్థానం ఉంది. 'కస్తూరీ తిలకం... ' అని మొదలుపెట్టి 'నాసాగ్రే నవ మౌక్తికం...' అంటూ కృష్ణుడి రూపాన్ని పొగడుతాం. అంటే కృష్ణుడు కూడా ముక్కుకు ముత్యాన్ని అలంకారంగా పెట్టుకున్నాడంట. దీన్నిబట్టి స్త్రీలే కాదు పురుషులూ ముక్కుకు ఆభరణం ధరించేవారని తెలుస్తుంది. 
  
ఇక ముక్కెర విషయానికి వస్తే 7-8 శతాబ్దాల కాలంలో ఆది శంకరాచార్యులు తన సౌందర్యలహరిలో అమ్మవారి ముక్కెర గురించి ఒక శ్లోకంలో ఇలా వర్ణించారు.                              
అసౌ నాసావంశ - స్తుహినగిరివంశధ్వజపటి! 
త్వదీయో నేదీయః - ఫలతు ఫలమస్మాక ముచితమ్, | 
వహత్యన్త ర్ముక్తా - శ్శిశిరకర నిఁశ్వాస గళితం 
సమృద్ధ్యా య త్తాసాం - బహిరపి స ముక్తామణిధరః || - శ్లో     

అసౌ నాసా వంశ అంటే  వెదురును పోలిన ముక్కు అని అర్థం. అమ్మవారు శ్వాసిస్తున్నప్పుడు, ఆమె బయటకు వదిలే గాలి ముక్కుకు వెలుపల ఘనీభవించి ముత్యమయ్యిందంట.

చరిత్రలో ముక్కెర గురించిన ప్రస్తావనలు చాలా ఉన్నాయి. అంతేకాదు చరిత్రలో కొందరు మహానుభావుల జీవన గమనాన్ని మార్చినవి కూడా ఈ ముక్కెరలే. 
14వ శతాబ్దంలో జీవించిన  వేమన విరాగిగా మారడానికి కారణం ముక్కెరే. ఇదే శతాబ్దంలో శ్రీనివాస నాయకుడు అనే వ్యాపారి భక్త పురందర దాసుగా మారి, దాదాపు నాలుగు లక్షల సంకీర్తనలు గానం చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది ఈ ముక్కెరే. 17వ శతాబ్దంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో బెజవాడ కనకదుర్గ ముక్కెర గురించి వ్రాశారు. అంటే సృష్టి మొదలు, అంతమూ ముక్కెర తోనే ముడిపడి ఉన్నాయన్నమాట.
  

ఒకప్పుడు మన సమాజంలో ముక్కుకు ముక్కు పుడక లేని స్త్రీలు ఉండేవారు కాదు. మన మగువల సౌందర్యాభిలాష అలాంటిది. వివిధ ప్రాంతాలలో ఈ ముక్కు పోగుకు రకరకాల పేర్లు, ఆకారాలు  ఉన్నాయి.  అడ్డకమ్మ, అడ్డబాస, దోటిముక్కర, నత్తు, బులా(కి)(కు), బేసరి, ముంగర, ముక్కఱ, ముక్కుపుడక, ముక్కుపోగు, వెడల్పాటి భుర్యా (ముక్కుపోగు )...  ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా వీటిని ధరిస్తారు. ఆ మధ్యన ఇది కనుమరుగై ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటుంది.



ముక్కుపుడక ఎందుకు?  

 స్త్రీలు చాలా త్వరగా ఉద్వేగానికి లోనవుతారు. ఆ సమయంలో ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని ముక్కుపుడక గ్రహిస్తుంది. స్త్రీలు సూర్య, చంద్రుల ఆకారంతో తయరూచేసిన మక్కుపుడక ధరిస్తారు. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు కుడి, ఎడమ సుషుమ్నాలు ఆధ్యాత్మిక  శక్తిని వికసింప జేస్తాయి. వజ్రంతో తయారు చేసిన ముక్కు పుడక ధరించడంవల్ల ఉష్ణం సమతులనమౌతుందట.








ఎవరికి ఎలాంటి ముక్కు పోగు:

ముక్కుపుడక బాగుంటుంది కదా ఏదో ఒక ముక్కుపుడక కొనేసి పెట్టుకుంటే అందం అటుంచి, అమ్మోరిలా కనపడే ప్రమాదం ఉంది. ప్రతి ముక్కుకూ ముక్కెర అవసరం లేదు. జయప్రద ముక్కుకు ముక్కుపుడక అవసరమా?  కొందరికి ముక్కుపోగు నప్పితే, కొందరికి ముక్కుపుడక బాగుంటుంది. ప్రత్యేకంగా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, పండుగలప్పుడు ప్రత్యేక అలంకారంతో పాటు ముక్కెర బాగుంటుంది. ముక్కుపోగు అనేది కొందరికి అందంగా ఉంటే, ఇంకొందరికి సెక్సీగా ఉంటుంది. కాబట్టి ఎంపికకు ముందు ఒక్కోదాన్ని కొన్ని రోజులు వాడి ప్రయోగాలు చేసి చూడాలి. దేనికి ఎక్కువ కాంప్లిమెంట్లు వస్తే దాన్ని ఫిక్స్ చేసుకోడం బెటర్. సానియా లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్ ల సలహా తీసుకుంటారు. అది మామూలు ఆడపిల్లకు కుదిరేపని కాదుగా. 
     

మగని మనసుకు గుర్తు మగువ ముక్కుపుడక...   

ముక్కుపుడక మీద ఏకంగా ఓ సినిమా తీసేసి అందులో ఓ పాట ఇలా పెట్టారు. స్త్రీకి ముక్కుపుడక అనేదాన్ని ఆమె మేనమామ లేకపోతే పెళ్ళయ్యాక మొగుడే ఇవ్వాలంట. వేరేవారు ఇస్తే తీసుకోవడం తప్పంట. ఎందుకంటే ముక్కును  అందంగా చూసుకోవాలి అనుకునేవాడే ముక్కెర కొనివ్వాలి అనుకుంటాడు. ముక్కును అందంగా చూసుకోవడం అంటే ఆమెను ఇష్టపడుతున్నట్టు లెక్కేగా. అలాంటివాడి నుండి ముక్కెర తీసుకోవడం అంటే ఆమె కూడా అతన్ని ఇష్ట పడటమే. అంతుంది కథ. అందుకని మొగుడు పెళ్ళాన్ని ఎంత ఇష్టపడేదీ ముక్కుపుడకే చెప్తుంది.



శృంగారంలో ముక్కుపుడక:

ఇష్టపడ్డ మగాడు ముందు నిలచినా, లేక అతని ఆలోచనలు మనసును కమ్ముకున్నా ఆమె ఉచ్వాస, నిశ్వాసల వేగం పెరుగుతుంది. దాంతో లలన నాసికా పుటాలు అంటే స్త్రీ ముక్కుపుటాలు అప్రయత్నం గానే పెద్దవి అవుతాయి.  తీవ్ర మైన ఉత్తేజం పొందితే, ఇట్లా జరుగుతుంది. అప్పుడు ఆ ముక్కుకు ఉన్న ఆభరణం కూడా కదులుతూ, కాంతిలో మెరుస్తూ, కొత్త అందాన్ని తెస్తుంది. 
అందుకే అంటున్నా అందాల పోగు... ముక్కుపోగు అని.      










          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి