పేజీలు

29, డిసెంబర్ 2012, శనివారం

కళంకిత చరిత్ర

ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ? అంటూ నిర్వేదాన్ని ప్రకటించాడు మహాకవి. ఆయన ఇప్పుడుంటే బహుషా  రాసేందుకు మాటలు దొరక్క కలం ముడుచుకు కూర్చునే వాడేమో. ఎందుకంటే  రక్తంతో తడిసిన పుటలు లేకుండా ఏ చరిత్ర పుస్తకమూ ఉండక పోవచ్చు, కానీ ఇంత నీచమైన, అమానవీయమైన సంఘటన గురించి రాసుకోవాల్సిన దుస్థితి భారతదేశ చరిత్రకే దక్కింది. అమరవీరుల స్మారక స్థూపాల సరసన, మహామహుల సమాధుల పక్కన ఇప్పుడు మరో స్మారక చిహ్నాన్ని ఉంచాల్సిన అవసరం ఏర్పడింది.

అవును! ఢిల్లీ ఘటన బాధితురాలు చనిపోయింది. ఇప్పుడేంటి... పదమూడు రోజుల క్రిందటే జీవచ్చవమైనది. ఇప్పుడా జీవాన్ని తన దగ్గరకు రప్పించుకున్నాదు ఆ దయగల దేవుడు. బ్రతికి వుంటే ఎంత నరకాన్ని అనుభవించవలసి వచ్చేదో! ఎన్నో ఘోరమైన ఘటనలను చూసి, మనుషులను యంత్రాల మాదిరిగా భావించి చికిత్స చేసే వైద్యుల కళ్ళు కూడా చెమర్చాయంటే ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉండిందో అర్ధం చేసుకోగలం.

అలాంటి పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. ప్రముఖులంతా సంతాపాలు ప్రకటించేసారు. బొత్స లాంటి వాళ్ళు ఇలాంటి 'చిన్న' విషయాలని మర్చిపోయి రాజకీయాలలో తలమునకలై ఉండి ఉంటారు. సామాన్య ప్రజలు ప్రస్తుతానికి 'అయ్యో' అని నిట్టూరుస్తున్నా, రెండు రోజులు మాత్రమే. మరో రెండు రోజుల్లో రాబోయే కొత్త సంవత్సరాన్ని నూతన ఆకాంక్షలతో జరుపుకుంటాడు. కొన్ని సంవత్సరాల పాటు విచారణ కొనసాగి నిందితులకు ఏదో ఒక శిక్ష పడుతుంది. అంతే? సమాజం బాధ్యత, పాలకుల బాధ్యత, న్యాయస్థానాల బాధ్యత అయిపోతుంది. ఓ ఘటన మరుగున పడిపోతుంది. చాలా? మన చరిత్ర పవిత్రమైనదే అనుకుని భావితరాలు మురిసిపోయేటందుకు అర్హత లభించినట్టేనా?
ఇలాంటి ఘటనలు ఇక పునరావృతం కానట్టేనా?

జలియన్ వాలా బాగ్ లాంటి మారణహోమాన్ని ఈ చరిత్ర చూసింది. మహాత్ముల హత్యను చూసింది.మత విధ్వంసాలను, మహా స్కాములను, వేర్పాటు ఉద్యమాలను, మహనీయ త్యాగాలను ఈ చరిత్ర రాసుకుంది. వాటిని మరచిపోకుండా ఉండటానికి వీలైన చోట్ల స్మారక భవనాలు, స్థూపాలు, సమాధులు కట్టించి మా చరిత్రలో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని అనుకుంటూ ఉంటాం. అలాగే ఈ ఘటన లాంటివి కూడా మళ్ళీ జరగడానికి వీల్లేదు. ఎవరూ మర్చిపోడానికి వీల్లేదు. అందుకే ఒక స్మారక చిహ్నం దేశ రాజధానిలో ఆమె పేరున నెలకొల్పబడాలి. దాన్ని చూసిన వారెవరయినా ఇలాంటివి జరగకుండా మీరేం చర్యలు తీసుకున్నారు అని అడిగితే, సమాధానం చెప్పగలిగే స్థాయిలో మనమున్నామా లేదా అని మన పాలకులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. మా చరిత్రకు కళంకం అంటితే మేమిలా తుడిచేసాం అని దేశం చెప్పుకోగలిగేలా ఉండాలి. అలా జరగాలంటే ఆమె పేరున ఒక స్మారకాన్ని నెలకొల్పాలి. అంతేకాదు ఇలాంటివి జరగడానికి కారణాలేంటి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాల గురించి చర్చలు జరగాలి. మేధావులు, సామాజికవేత్తలు, మానసికనిపుణులు, రక్షణ విభాగం , పాలనా యంత్రాంగం అందరూ దీని గురించి ఆలోచించాలి. అందుకే ఆమె స్మారక చిహ్నం అవసరం. 

   


శుభాకాంక్షలు

18, డిసెంబర్ 2012, మంగళవారం

తెలుగు పీతలు

ఒకానొక చోట పీతల ప్రదర్శన జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి రకరకాల పీతలను తెచ్చి, పెద్దపెద్ద గిన్నెలలో ఉంచి వాటి మీద గాజు మూతలను ఉంచారు. ప్రదర్శనకు వచ్చిన ఒకాయన, 'గిన్నెలపై మూతలెందుకు ఉంచార'ని దుకాణా యజమానిని  అడిగాడు.
'మూతలు పెట్టకపోతే పీతలు గిన్నె గోడలను ఎగబ్రాకుతూ పైకి వచ్చి పారిపోతాయి' అని యజమాని బదులిచ్చాడు.
అక్కడే కాసేపు నిలబడి, అన్నీ చూసిన ఆ సందర్శకుడు, ఒక గిన్నె మీద మూత లేకపోవడం గమనించి, అదే విషయాన్ని యజమానికి చెప్పాడు. అతనా విషయాన్ని తేలికగా తీసుకుంటూ 'మరేం పరవాలేదులెండి' అన్నాడు. 'అదేంటీ... పీతలన్నీ బయటకు వెళ్లి పొతాయిగా?'
'అబ్బే! ఆ పీతల విషయంలో అలాంటిదేం జరగదులెండి'
'ఎందుకని? వాటికి కాళ్ళు లేవా ? లేకపోతే పైకి వచ్చే సామర్థ్యం లేదా?'
'అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే అవి తెలుగు పీతలు. ఒకటి పైకి రావడం మరోదానికి ఇష్టం ఉండదు. అందుకని పైకి పాకే పీత కాలిని పట్టుకుని మిగతావి కిందికి లాగేస్తాయి.' అంటూ ఎక్కడలేని ధీమాను వ్యక్తం చేసాడు దుకాణం యజమాని.
పీతల్లో తెలుగు పీతలు అంటూ ఒక తరగతి లేకపోయినా తెలుగు ప్రజల నైజం ఎలా ఉంటుందన్న దాని గురించి అల్లిన, బాగా ప్రాచుర్యం పొందిన కథ ఇది. ఇది విన్నాక తెలుగు సోదరులకు రోషం పొడుచుకు వస్తే వచ్చింది కాని, ఏ రోజు వార్తా పత్రిక చదివినా, మనలో మనకు ఐక్యత లేదని, మన వాళ్ళ గొప్పదనాన్ని మనమే గుర్తించట్లేదని ఇట్టే గ్రహించగలం.
మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ వాదాలు ఉన్నప్పటికీ భాష దగ్గరకు వచ్చేసరికి అందరూ కలసికట్టుగా నిలవడం కనిపిస్తుంది. కానీ మనకున్న తెగులు వేరు. టాంకుబండ్  విగ్రహాల దగ్గర్నుంచి ఎన్టీరామారావు విగ్రహం వరకు అన్నీ గొడవలే. ఫలానా కవి మా ప్రాంతం వాడంటే మా ప్రాంతం వాడని పంపకాలే. బహుముఖ ప్రజ్ఞాశాలి, అసమాన పాలనా సమర్థుడు, ప్రధాని పదవికి అన్నివిధాలా  అర్హతలున్న ఒక తెలుగు వ్యక్తి, అనుకోకుండానే ప్రధాని అయినప్పటికీ, ఆ పదవికే వన్నె తెచ్చి దేశాన్ని అభివృద్ది బాటలో నడిపించాడన్నది కాదనలేని సత్యం. కాని ఆ సత్యాన్ని ఒప్పుకునే తెలుగు వాడెవ్వడూ మనకు కనిపించడు. ఈ ఘనతంతా ఇందిర కుటుంబానిదే అంటూ భజన చేస్తూ, మోచేతి కింది నీళ్ళు తాగే వాళ్ళను మన తెలుగు వాళ్ళని చెప్పుకోగలమా?
విగ్రహాల ఏర్పాటులో మా ప్రాంతం వాళ్లకి ప్రాముఖ్యత ఏదీ అని ప్రశ్నించే వాళ్ళు, తమ ప్రాంతానికే చెందిన పీవీకి పరాభవం జరిగినప్పుడు, మరణం అనంతరం కూడా ఆయన వివక్షకు గురయినప్పుడు   మాట్లాడకపోవడం సంగతి అటుంచితే, ఆ తర్వాతయినా పీవీ ఘనతను, ప్రతిభనూ స్మరించుకోక పోవడం, మావాడని చెప్పుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణం నుంచి చూస్తూ, ఇందులో మనకెంత? అని ఆలోచించే సంస్కృతి ఉన్నచోట ఇతర సంస్కృతులు ఎంత గొప్పవైనా వెలిగిపోవడం సంగతి అటుంచి, కనీసం మనగలగడం కష్టం.
భాషా ఉత్సవాల విషయంలోనూ అనేక వివాదాలు. ఇందుకు కారణం బడ్జెట్ కేటాయింపులు. ప్రభుత్వానికి తెలుగు భాష ఉత్సవాలు, కాకతీయ ఉత్సవాలు వేరు వేరుగా ఎందుకు కనిపించాయో, అందుకు కారణాలు ఏంటో తెలీదు కానీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం విమర్శలకు దారి తీసింది. ఏతావాతా అది తెలుగు భాష ఉత్సవాలు మాకు సంబంధించినవి కాదు అని ఒక ప్రాంతం వారు భావించేందుకు దారి తీసింది. ఐలయ్య గారు ఇంకాస్త ముందుకెళ్ళి తెలుగు భాషలో భోధించాలనడం అగ్రకులాల కుట్ర అనేదాకా వెళ్ళింది. తమిళనాడు మాదిరిగా తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తే ఇలాంటి వాదనలు వినిపించవేమో!?
బాపు లాంటి కళాకారుడికి పద్మ అవార్డు రాక పోయినా, ఎన్టీఅర్ కు భారతరత్న ఇవ్వక పోయినా , అసలా వాదనలను ముందుకు తెచ్చి తెలుగు నాయకులు ఎవ్వరూ మాట్లాడే ధైర్యం చేయకపోయినా , ఆ జాతి రత్నాలకు పోయేదేమీ లేదు. వాళ్ళు తెలుగు సంస్కృతీ చిహ్నాలు. సామాన్య తెలుగువాడి  గుండెల్లో పదిలంగా వెలుగుతున్న  దివ్వెలు.