పేజీలు

6, మార్చి 2012, మంగళవారం

రైలు చార్జీలు పెంచాల్సిందేనా?


గత ఎనిమిదేళ్లుగా రైలు చార్జీలు పెంచలేదు కాబట్టి ఈసారి పెంచాల్సిందేనని, లేకపోతే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి రైల్వే శాఖ దగ్గర నిధులు ఉండవని గౌరవ పార్లమెంటు సభ్యులు ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చారట. రైల్వే మంత్రి దినేష్ త్రివేది అధ్యక్షతన సోమవారం డిల్లీలో జరిగిన సంప్రదింపుల కమిటి సమావేశంలో పాల్గొన్న వారంతా ఈ తీర్మానం చేసాని వార్తలు. అందులో మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా ఉన్నారా లేదా అన్న ప్రశ్న పక్కన పెడితే, పార్లమెంటులో మన ఎంపీల సంఖ్యా తక్కువేమీ కాదు. ఇంకా చెప్పాలంటే కేంద్రంలో మన మద్దతుతోనే ప్రభుత్వం నిర్భయంగా పాలన కొనసాగిస్తోంది. అయినా ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో మన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. మనమడిగిన రైళ్ళూ ఇవ్వరు. కొత్త రైలు మార్గాల అభివృద్ధికి నిధులూ ఇవ్వరు. అయినా మనం చాలా వినయంగా తలాడించి వచ్చేస్తాం. కనీసం రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి ఒక గరీభి రధ్ వేయమని కూడా అడగం. ప్రస్తుతం రెండేరెండు గరీభి రథ్ లు , ఒకటి బెంగళూరుకి, ఇంకొకటి వైజాగుకి ఉన్నాయి. ఇతర రాష్ట్రాలను కలుపుతూ మరో గరీబ్ రథ్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక రైల్వే వారు ప్రయాణీకులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మాట్లాడుకుందాం. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి తెస్తామని, తెచ్చామని అనడం, మనం వినడం తప్పిస్తే, మనకెక్కడా నాణ్యమైన , రుచ్చికరమనిన తిండి దొరకనే దొరకదు. నీళ్ళ కాఫీ, చల్లబడిన టిఫినీలు, చప్పగా ఉండే బిర్యానీలు, అట్ట ముక్కల్లాంటి పూరీలు... ఇది రైల్వే స్టేషన్లో గాని, రైలులో గాని మనకు దొరికే ఆహారం. దీని మీద కంప్లైంట్ చేసే అధికారం కూడా లేదు. టాయిలెట్ పంపు నీళ్ళతో కాఫీ చేయడాన్ని, ఫోటోలతో సహా ఫేసుబుక్లో పెడితే చూసి తరించాం.
ఇక రిజర్వేషన్ చేయించుకుని రైలేక్కితే, రాత్రి వేళ కొన్ని గంటలు తప్పా మిగిలిన అన్ని సమయాల్లోనూ కాళ్ళ దగ్గర ఒకరు, నెత్తి దగ్గర ఒకరు ఎవరెవరో కూర్చుంటారు. వారిని మనం ఏమీ అనలేం. గొడవయితే ఎవరికీ కంప్లైంట్ చెయ్యలేం. సర్దుకు పోవాల్సిందే. వాళ్ళదీ తప్పు లేదు. ఎందుకంటే రైలుకు ముందొకటి, వెనుక ఒకటి పేరుకు మాత్రంగా రెండు జనరల్ భోగీలు ఉంటాయి. ప్రయాణీకుల రద్దీ ఆ రూట్లో ఎలా ఉంటుందో అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా సాధారణ బోగీలు వేయాలనే ఆలోచన ఎవరికీ రాదు. ఎందుకంటే మన ఎంపీలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ క్లాస్ లో పాస్ మీద ఉచిత ప్రయాణం చేస్తుంటారు కాబట్టి, వాళ్లకి ఈ కష్టాలు తెలీవు.
చేతిలో చిన్న పిల్లలను ఎత్తుకుని, మరో చేత్తో సామాను మోసుకుంటూ ఆడా, మగా అన్న తేడా లేకుండా ప్రయాణం చేస్తున్న ఆడపడుచుల గురించి ఎవరాలోచిస్తారు? ఒకసారి ఏ గోదావరి ఎక్ష్ప్రెస్స్ లోనో జనరల్ భోగీలో ప్రయాణించి చూస్తే తెలుస్తుంది. టాయిలెట్లో సైతం ముగ్గురు ఆడవాళ్ళు నిల్చొని ప్రయాణం చేస్తున్న దుస్థితి. డబ్బులిచ్చీ సౌకర్యాలకు నోచుకోక పోవడం అంటే ఇదే . ఇది అన్యాయమా, మోసమా...? రైల్వే వారే చెప్పాలి.
ముందు సౌకర్యాల మీద ద్రుష్టి పెట్టండి. డిమాండుకు తగ్గ రైళ్ళను వేయండి. ప్రతి రైలుకు డబ్బులు కురిపించే రిజర్వేషన్ బోగీలను తగ్గించైనా సరే జనరల్ బోగీలను పెంచండి. భద్రత కల్పించండి. సమయపాలన పాటించండి. అప్పుడు గౌరవ ఎంపీ గారు సెలవిచ్చినట్టుగా ప్రయాణీకులు చార్జీలు పెంచినా భరిస్తారు.