పేజీలు

1, నవంబర్ 2015, ఆదివారం

స్వచ్ఛమైన ప్రకృతి సోయగం... మున్నార్

                                                                                                

'మూన్ను ఆరు' అంటే స్థానిక భాషలో  మూడు సెలయేళ్ళు అని అర్థంముత్తిరపూజ, నల్లతాని, కుందాళ అనే మూడు నదులున్న ప్రదేశమే 'మున్నారు' అని  కొందరు, మట్టుపెట్టి, నల్లతాని, పెరియవరు నదుల వల్ల పేరొచ్చిందని కొందరు అంటారు. నైరుతి ఋతుపవనాలు భారతదేశాన్ని తాకినప్పుడు...  అంటే  వర్షాకాలపు తొలి చినుకులు మున్నార్ లోనే పడతాయి. మాటకొస్తే  సంవత్సరమంతా ఇక్కడ వర్షం కురుస్తునేవుంటుంది. మున్నార్ లోయల్లో బద్దకంగా కదలాడే మేఘాలు, ఎప్పుడు పడితే అప్పుడు వర్షిస్తాయి. అప్పటికప్పుడు అలసి తెరపినిస్తాయి
మున్నార్ పట్టణం 

కేరళ 

'గాడ్స్ ఓన్ కంట్రీ' అని కేరళ రాష్ట్రానికి రాష్ట్ర పర్యాటక శాఖ ప్రచారం కోసం పెట్టుకున్న పేరు. పశ్చిమ కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్యన ఉన్న కేరళ రాష్ట్రం...  ప్రకృతి సౌందర్యానికి, విభిన్న సంస్కృతికి, సంపూర్ణ అక్షరాస్యతకు పేరు. 'కథాకళి' నృత్య నాటక కళా రీతికి,  ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడ  'కలరిపయట్టు'కు ప్రత్యేకం. మలయాళంలో 'కేర' అంటే  కొబ్బరి అని, 'ఆళం' అంటే నేల అని అర్థం. కేరళ అంటే 'కొబ్బరి చెట్ల ప్రాంతం' అని అర్థం
భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4 వంతు, అంటే దాదాపు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు సొంతం. సుమారు 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధిమొక్కలు సైతం అక్కడ పెరుగుతున్నాయి 

కేరళ పర్యటన 

పద్నాలుగు జిల్లాలతో కూడిన కేరళ రాష్ట్రంలో పర్యటించాలనుకుంటే...  రాష్ట్రంలో కొచ్చిన్, మున్నార్ హిల్ స్టేషన్, తెక్కేడి, అల్లెప్పి/కుమరకోమ్, త్రివేండ్రం, అనంతపద్మనాభ స్వామి దేవాలయం,  కోవలం బీచ్, కన్యాకుమారి(తమిళనాడు) , అతిరిపల్లీ వాటర్ ఫాల్స్, చేరి బీచ్, గురువాయూర్ టెంపుల్...అనేవి  ప్రధాన సందర్శనీయ స్థలాలు. అన్నిటినీ చూడాలంటే నెల రోజులు కావాలి. అదెలాగూ కుదిరేపని కాదు కాబట్టి వారం నుంచి పది రోజుల చిన్న చిన్న ట్రిప్పులు వేసుకోవడం మంచిది. హైదరాబాద్ నుంచి రైలులో కేరళ వెళ్ళాలంటే శబరీ ఎక్స్ ప్రెస్ ఒక్కటే మార్గం. రోజు మధ్యాహ్నం  బయలుదేరి రేపు ఉదయం కోయంబత్తూరు, మధ్యాహ్నానికి కొచ్చిన్, సాయంత్రం ఆరుకు త్రివేండ్రం చేరుకుంటుంది. అంటే రెండు రోజులు. రానుపోను నాలుగు రోజులు. ఇలా నాలుగు రోజులు పోను మిగిలేది ఎన్నిరోజులో లెక్కేసుకుని టూర్ ప్లాన్ చేసుకోవాలి.  ఫ్లైట్ అయితే త్రివేండ్రం, కొచ్చిన్, కోయంబత్తూరు, కాలికట్ విమానాశ్రయాలకు హైదరాబాదు నుంచి రెండు - రెండున్నర గంటల ప్రయాణం. కాస్త బడ్జెట్ ఎక్కువుంటే మాత్రం విమానంలో వెళ్ళడం మంచిది. రెండు రోజులు కలిసొస్తాయి.  

కేరళలోఎక్కడికి వెళ్ళాలి? 

మీ టూర్ లో  కోవలం బీచ్, కన్యాకుమారి ఉంటే  త్రివేండ్రం వెళ్ళాలివాయనాడ్ ఉంటే కాలికట్ వెళ్ళాలి. మున్నార్ హిల్ స్టేషన్ లేదా అలెప్పీ బోటు హౌసులు కావాలంటే కొచ్చిన్ వెళ్ళాలి.  కేవలం మున్నార్, తేక్కడి అయితే మాత్రం కోయంబత్తూరు వెళ్ళడం మంచిది. ఎందుకంటే రైలులో వెళ్ళేటప్పుడు  నాలుగు గంటల ముందుగా ఉదయం 8.30 గంటలకే  కోయంబత్తూరు వస్తుంది.  అక్కడి నుంచి 156కి. మీ. దూరంలో ఉన్న మున్నార్ కు  నాలుగు- ఐదు గంటలలో  చేరుకోవచ్చు. 130కిమీ దూరంలో ఉన్న  కొచ్చిన్ నుంచి మున్నార్ కు రావడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఏదయినా ఒక్కటే. మున్నార్ కు కోయంబత్తూర్ నుంచి గానీ కొచ్చిన్ నుంచి గానీ బస్సులు ఉంటాయి. కారులో వెళ్ళే పనైతే కోయంబత్తూరు నుంచి రూ.3,500/- లుకొచ్చిన్ నుంచి  రూ.2,500/-లు తీసుకుంటారు. హోటళ్ళలో మధ్యాహ్నం 12 గంటలకు చెక్ ఇన్, చెక్ అవుట్ ఉంటాయి. కాబట్టి సమయానికల్లా మనం అనుకున్న ప్రదేశంలో ఉండేలా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవాలి 

మా మున్నార్ పర్యటన 
 

పిల్లలకు దసరా సెలవులు ఇస్తుండటంతో నెల రోజుల ముందే టూర్ గురించి ఆలోచించాం. ఎప్పటి నుంచో మున్నార్ గురించి వింటూ ఉండటంతో అందరం అక్కడికే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మూడు నాలుగు రోజుల కన్నా ఎక్కువ రోజులు సెలవు దొరికే వీలు లేదు కాబట్టి, ఆదివారాన్ని కూడా కలుపుకున్నాం. ఒకరోజు కలిసొచ్చింది. రైలులో రెండు రోజుల ప్రయాణం కాబట్టి, ఒకవైపు ప్రయాణాన్ని విమానంలో చేద్దామనుకున్నాం. విమాన ప్రయాణం రెండు గంటలే కాబట్టి మరో రెండు రోజులు కలిసొచ్చాయి. అలా కొయంబత్తూరుకు ఆదివారం ఉదయం 5. 45 గంటల స్పైస్ జెట్ విమానానికి, తిరుగు ప్రయాణం బుధవారం మధ్యాహ్నం 4. 30 గంటలకు కొయంబత్తూరు జంక్షన్ నుండి బయలుదేరే శబరి ఎక్స్ ప్రెస్ కు టికెట్లు బుక్ చేసుకున్నాం
ఇక హోటళ్ళు... వాటి గురించి ఆన్ లైన్లో వెదుకుతుండగా  స్టే జిల్లా, పారడైజ్ హాలిడేస్, స్పైస్ హాలిడేస్ వంటి ప్యాకేజి టూర్ నిర్వహించే సంస్థలు మాకు టచ్ లోకి వచ్చాయి. వాళ్ళకు మా టూర్ గురించి చెప్పగానే రకరకాల సలహాలు ఇస్తూ మెయిల్స్ పంపించారు. వాటితో పాటే ప్యాకేజి ధరలు సూచిస్తూ కొటేషన్లు పంపించారు. మున్నార్ తో పాటు తెక్కెడి వెళ్ళమని స్పైస్ హాలిడేస్ ఇచ్చిన సూచన, టూర్ ప్లానింగ్ మాకు నచ్చింది. కోయంబత్తూరు విమానాశ్రయం నుంచి మమ్మల్ని (నేను, మా ఆవిడ, మా ఇద్దరు పిల్లలు)  రిసీవ్ చేసుకున్న దగ్గర్నుంచి మున్నార్, తేక్కడిలలో హోటళ్ళలో ఉంచడం, ప్రదేశాలు చూపించడం, తిరిగి మమ్మల్ని కోయంబత్తూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో దింపే వరకు ప్యాకేజి కిందికి వస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను అక్కడి ప్రతి హోటల్ ఉచితంగా అందిస్తుంది. గది అద్దెలో గాని, ప్యాకేజీలో గానీ అది కూడా కలుపుకుని ఉంటుంది. ఇక మధ్యాహ్నం, రాత్రి భోజనాలు మన డబ్బులతో చేయాలి. వెళ్ళిన చోట ప్రవేశ రుసుములు, కెమెరా టికెట్లు, రైడింగులు వంటి వాటికీ మనమే పెట్టుకోవాలి. షాపింగ్ మన ఇష్టం.

కోయంబత్తూరు - తేక్కడి  

కోయంబత్తూరు తమిళనాడులో ఉంది. అక్కడి విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 7. 30కు  దిగగానే స్పైస్ హాలిడేస్ కు చెందిన కారు డ్రైవర్ మమ్మల్ని రిసీవ్ చేసుకుని తేక్కడి బయలుదేరాడు. ఎయిర్ పోర్ట్ బయటే హోటల్లో టిఫిన్ చేశాం.  మాటల సందర్భంలో తెలిసిందేమంటే స్థానికంగా ఉన్న ట్రావెలింగ్ సంస్థకు కొచ్చిన్ లో ఉన్న స్పైస్ హాలిడేస్ వాళ్ళు మా ప్యాకేజీని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారంట. సంస్థ తాలూకు డ్రైవరే ఇతను. నేరుగా వీళ్ళతోనే  ప్యాకేజీ మాట్లాడుకుంటే ఇంకా తక్కువ పడుతుందని డ్రైవరు చెప్పాడు. కానీ పర్యటన సాగినన్నాళ్ళూ బాధ్యతగా ప్రతి రోజూ ఫోను చేసి సమాచారాన్ని తెలుసుకునేవారు స్పైస్ హాలిడేస్ వాళ్ళు
కోయంబత్తూరు నుంచి పల్లాడం - ధారాపురం - దిండిగుల్ దగ్గర ఉన్న చిన్నల్పట్టి - థేని వరకు తమిళనాడు రాష్ట్రంలోనే  సాగింది ప్రయాణం. తమిళనాడు కేరళ రాష్ట్రాల సరిహద్దు గుండా 280 కిమీల పొడవున సాగుతుంది ప్రయాణం. కుమ్లి వద్ద కేరళ రాష్ట్రంలోకి వస్తాం. తేక్కడి చేరుకునే సరికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. ప్యాకేజీలో ఎంపిక చేసుకున్న టైగర్ రోర్ హోటల్ http://www.tigersroarperiyar.com/కు వెళ్ళాం. చిన్నగా ఉన్నా గదుల నిర్వహణ చాలా బాగుంది. అందులోనే ఉన్న రెస్టారెంట్లో భోజనం చేశాం. బాగానే ఉంది. తెక్కెడి లోని హోటళ్ళలో తాగేందుకు మూలికలు ఉడికించిన నీళ్ళను  ఇస్తారు
గంటపాటు విశ్రాంతి తీసుకున్నాక కారులోనే హోటల్ కు కొద్ది దూరంలో ఉన్న థియేటర్లకు వెళ్లాం. అంటే అవి సినిమా హాళ్ళు కావు. కథాకళి నృత్య రూపకాన్ని, కలరిపయట్టు అనే యుద్ధ కళను ప్రదర్శించే వేదికలు.   6-7, 
7-8 ప్రదర్శన వేళలు. ఒక గంట కథాకళి చూపిస్తే, ఒక గంట కలరిపయట్టు చూపిస్తారు.  ఒక్కోదానికి ఒక్కొక్కరికి రెండు వందలు టిక్కట్టు. వేరు వేరుగా టిక్కట్లు తీసుకోవాలిమేము కలరిపయట్టు చూశాం. వర్త్ ఫుల్ అనిపించింది

ప్రాచీన కేరళ యుద్ధకళ...   కలరిపయట్టు 

కలరిఅంటే పాఠశాల,‘పయట్టుఅంటే యుద్ధం. ప్రపంచంలోని అతి ప్రాచీన మార్షల్ ఆర్ట్గా కళకు గుర్తింపు ఉంది. చోళ రాజుల కాలంలో విద్య పాఠశాలల్లో కలారిగా నేర్పబడేది. అప్పటి సైన్యాధ్యక్షతను, రాజ్యాధికారాన్ని కూడా విద్యే నిర్ణయించేదంట . విద్యను నేర్పే గురువులను నాయర్ లేదా ఇలావార్ అంటారు.
కలరిపయట్టు ప్రదర్శనా ప్రాంగణం 

దీంట్లో మల్లయుద్ధం, కత్తి యుద్ధం, గదా యుద్ధం, ఉరుమి, కర్రసాము.. ముఖ్యమైనవి. ఉరుమి అన్న పేరుతో సినిమా కూడా వచ్చింది. సినిమాలో పోరాటాలు కలరిపయట్టువే. ఆయుధాలు లేకుండాను, కత్తి-డాలుతోను, పరిగ లాంటి బరువైన వస్తువులతోనూ, కొరడా లాంటి లోహపదార్థ ఆయుధంతోనూ, కర్రలతోనూ శిక్షణ పొందుతారు. 'సెవెంత్ సెన్స్' సినిమాలోనూ యుద్ధకళ ప్రస్తావన వుంటుంది

కళ్ళ ముందు జరిగే ఫైటింగ్ సీన్స్ ను పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. షో అయిపోయాక   కళాకారులు ఓపిగ్గా అందరితోనూ ఫోటోలు దిగుతారు. వాళ్ళతో యుద్ధం చేస్తున్నట్టు ఫోజిచ్చి పిల్లలు ఫోటోలు దిగారుకథాకళి కూడా చూద్దామనుకుని వాయిదా వేశాం. తర్వాత కుదరలేదు. చూసి ఉంటే బాగుండేది. మున్నార్ వెళ్ళిన వాళ్ళు రెండు షోలను తప్పక చూడాలి. ఎందుకంటే ఇవి కేరళ ప్రత్యేకతలు. సంస్కృతీ ఆనవాళ్ళు
బయటకు వచ్చాక కాసేపు తేక్కడి వీధుల్లో తిరిగాం. ఎక్కడ చూసినా కేరళ మసాజ్ సెంటర్లే. ముఖం నుంచి కాళ్ళ వరకు ఒక్కో అవయవానికి ఒక్కో రేటు. 600 నుంచి 4000 రూపాయల ప్యాకేజీలు ఉన్నాయి. మాసాజ్ చేయించుకోడానికి సరదాపడ్డాము కానీ కనీసం ఒక గంట గడపాల్సి ఉంటుంది. పిల్లలు నిద్రకు ఆగేలా లేరు
కరిమీను వేపుడు 
అందుకని భోజనానికి  వెళ్లాంఅక్కడి హోటళ్ళలో చేప వంటకాలు ప్రత్యేకం. వంజిరం చేపను ముక్కలుగా వండుతారు. ఒక్కో ముక్క ఖరీదు రూ. 250 నుంచి 400 వరకు ఉంటుంది. అలాగే కరిమీను వేపుడు. చాలా రుచికరంగా, ఒకే ముల్లుతో ఉంటుందిఅక్కడి హోటళ్ళలో సర్వర్లు ఇంగ్లీష్ మాట్లాడతారు
మరుసటి రోజు (సోమవారంఉదయం 6 గంటలకల్లా సిద్ధమై కారు దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఉదయం 7. 30 కి పెరియార్ సరస్సులో బోటింగ్ ఉంది. తర్వాత కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఉదయాన్నే వెళ్తే అడవి జంతువులు కనపడే అవకాశం ఉంటుందనడంతో టైంకు టిక్కట్లు హైదరాబాదు నుంచే ఆన్ లైన్లోనే బుక్ చేసుకున్నాం. లేకపోతే పొద్దున్నే అక్కడ పెద్ద క్యూ ఉంటుంది http://www.periyarfoundation.org/ లో ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక్కొక్కరికీ  రూ. 150/-లుపెరియార్ టైగర్ రిజర్వ్ ప్రవేశ ద్వారం దగ్గర చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఒక్కొక్కరికి 25 రూపాయలు. వాహనానికి కూడా టికెట్  ఉంటుంది. బోటింగ్ టికెట్ కాకుండా ఇవి అదనం. వీడియో కెమరా ఉంటే రూ. 300/-లు.

ముల్లపెరియర్ డ్యామ్  
కేరళలోని పడమటి కనుమలలోని కార్డమామ్హిల్స్లో  పెరియార్నది పశ్చిమాభిముఖంగా అరేబియన్సముద్రంలోకి ప్రవహిస్తూ వుంటుంది. కొండలకు ఇవతల నుండి తమిళనాడు ప్రారంభమవుతుంది. మధురైకు సాగునీటి సమస్యను తీర్చేందుకు బ్రిటిషువారు 1887-95 మధ్య 176 అడుగుల ఎత్తున్న యీ డామ్కట్టి, పెరియార్నదీ  ప్రవాహాన్ని తూర్పు ముఖంగా మళ్లించి, నాలుగు జిల్లాల దాహార్తిని తీర్చారు. ముల్లయార్‌, పెరియార్నదులు కలిసే చోట డ్యామ్కట్టారు కాబట్టి ముల్లపెరియార్డ్యామ్అన్నారు. ఉండడం కేరళలో వున్నా, దాని నిర్వహణ  అంతా తమిళనాడుదే. మొదట్లో ఇరిగేషన్కు మాత్రమే వుపయోగించినా తర్వాతి రోజుల్లో జలవిద్యుత్కు కూడా వాడుకుంటున్నారు. డ్యాం విషయమై కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య తగాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. డ్యాం వల్ల ఏర్పడిందే పెరియార్ సరస్సు.    



పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం మరియు నేషనల్ పార్క్/ పెరియార్ సరస్సు 
 తేక్కడి అటవీ ప్రాంతంలోని జంతువుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1978 సంవత్సరంలో పెరియార్శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందుకోసం అటవీ ప్రాంతంలోని సరస్సుకు ఇరువైపులా 777 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న అడవినంతటినీ వన్యప్రాణులకు ఆవాసంగా మార్చివేసింది. అధికారికంగా 1982 లో నేషనల్ పార్క్ గా  అప్ గ్రేడ్  చేయబడిందితర్వాత  టైగర్ రిజర్వ్ గా ప్రకటించబడింది. అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం పెరియార్శాంక్చురీలో సుమారుగా 600 ఏనుగులు, 450 జింకలు, 550 ఎలుగుబంట్లు, 180 పొడవైన నీలగిరి కోతులు, 45 పులులు, 15 చిరుత పులులు, పెద్ద సంఖ్యలో నక్కలు, ఎగిరే ఉడతలు, రంగు రంగుల పక్షులు... ఉన్నాయి.  
పెరియార్సరస్సులో పడవమీద ప్రయాణిస్తూ... దానికి ఇరువైపులా ఉండే అడవిలో సంచరించే జంతువులను, వాటి ప్రవర్తనను  చూడడానికే బోటింగ్ ప్రక్రియ.   సరస్సులో తేలియాడే చెట్టు కొమ్మలపై వాలే వివిధ రకాల పక్షులు కనులకు ఇంపుగా అనిపిస్తాయి.  

అయితే మాకు కొన్ని జింకలు, అడవి ఉడతలు, లంగూర్ లు, అడవి దున్నలు మాత్రమే కనిపించాయి. వేసవిలో అయితే అడవుల్లో నీరు దొరకదు కాబట్టి పులుల్లాంటి  జంతువులన్నీ  నీటి కోసం సరస్సు దగ్గరకు వస్తాయంట.  మేము అక్టోబర్ లో వెళ్ళడం చేత రెగ్యులర్ గా  కనబడే ఏనుగుల గుంపు కూడా కనబడలేదు. కానీ ప్రయాణం ఆహ్లాదంగా ఉంది. ప్రశాంతత  మన పాపి కొండలను గుర్తుకు తెచ్చిందిలోనికి వెళ్ళే కొద్దీ చలి అనిపించినా మనోహర దృశ్యాలు చూస్తూ మైమరచిపోయాం. మున్నార్ వెళ్ళిన వాళ్ళు తేక్కడి తప్పనిసరిగా వెళ్ళి పెరియార్ సరస్సులో బోటు విహారం చేయాల్సిందే. ఇంకా ఆసక్తి ఉంటే జీప్ లో అరణ్యంలోకి వెళ్ళొచ్చు. కాకపోతే ఒక రోజంతా పడుతుంది. తీరా వెళ్ళాక జంతువులు కనపడతాయనే నమ్మకం లేదు. పైగా ఒక్కొక్కరికీ వెయ్యి నుంచి యాక్టివిటీ బట్టి నాలుగేసి వేలు తీసుకుంటారు. మీ ఇష్టం మరి.
   
     
పెరియార్ సరస్సులో  2009లో  ఒకసారి బోటు ప్రమాదం జరిగింది.   ప్రమాదంలో సుమారు 35మంది జలసమాధి  అయ్యారంట.  సుమారు 76 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న 'జలకన్యక' అనే పడవ  సరస్సులో సాయంత్రం 5 గంటలా 15 నిమిషాలకు ప్రమాదానికి గురయింది.  దానికి గుర్తుగా 'జలకన్యకపడవను ఒడ్డునే ఉంచారు. సరస్సు లోతు  మేము వెళ్ళినప్పుడు 116 అడుగులు ఉంది

తేక్కడి నుంచి మున్నార్

పెరియార్ సరస్సు బోటింగ్ అయిపోగానే 10 గంటల కల్లా తిరిగి హోటల్ చేరుకున్నాం.  బ్రేక్ ఫాస్ట్ సిద్దంగా ఉంది.  బ్రెడ్ జామ్ నుంచి పండ్ల ముక్కల వరకు ఏడెనిమిది రకాల టిఫిన్లు ఉంచారు. కొబ్బరి చట్నీ బాగుంది.  తర్వాత హోటల్ రూం ఖాళీ చేసి మున్నార్ కు బయలుదేరాం. తెక్కెడి నుంచి మున్నార్ 85 కిలోమీటర్లు. ఘాట్ రోడ్ కావడంతో 3గంటల ప్రయాణం అవుతుంది
నిజానికి తేక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో మంగళాదేవి ఆలయం ఉందంట. కానీ విషయం మాకు ముందుగా తెలీదు. డ్రైవర్ కూడా చెప్పలేదు. అలాగే తేక్కడి నుంచి మున్నార్ వెళ్ళే దారిలో  రామక్కల్ మేడు అనే వ్యూ పాయింట్ ను కూడా మిస్సయ్యాం. అందుకే ఏదైనా టూర్ కి వెళ్ళేటప్పుడు వివరాలన్నీ తెలుసుకుని వెళ్ళాలి.   
మున్నార్ కు వెళ్ళే దారిలోనే మమ్మల్ని ఎలిఫెంట్ రైడింగ్ కు తీసుకువెళ్ళాడు డ్రైవర్. 20 నిమిషాల పాటు తిప్పేందుకు ఒక్కొక్కరికి 350 రూపాయలు. మా చిన్నోడు సరదాపడటంతో నేను వాడికి తోడు వెళ్ళాను. తర్వాత దార్లో ఉన్న స్పైస్ గార్డెన్ కు తీసుకు వెళ్ళాడు. ఎలిఫెంట్ రైడ్ గానీ, స్పైస్ గార్డెన్ గానీ, షాపింగ్ స్పాట్ లు గానీ చాలా ఉన్నప్పటికీ డ్రైవర్ కు వాళ్లతో ఉన్న పరిచయాలు, ఒప్పందాలు, కమీషన్లను బట్టి ఒక్కో డ్రైవర్ ఒక్కోచోటికి తీసుకువెళ్తాడు.  కొత్త ప్రదేశాలలో మనకేమీ తెలీదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళడం మంచిది. కావాలంటే మన ఖర్చులను నియంత్రించుకోవడం ఉత్తమం
పెరియార్  స్పైస్ గార్డెన్

తెక్కెడి నుంచి మున్నార్ దారిలో చాలా స్పైస్ గార్డెన్లు ఉన్నాయి. వందనమేడు అనే పల్లెలో ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన అతి పెద్ద ఏలకులు తోట ఉంది. ఇక్కడకు ప్రతి సంవత్సరం లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ప్రతి గార్డెన్ చూడడానికి ప్రవేశ రుసుము ఉంటుంది. లోపల ఒక గైడ్ ను మనకు అప్పచెబుతారు. కేరళ రాష్ట్రం సుగంధ ద్రవ్యాలకు, ఆయుర్వేద వనమూలికలకు, ఔషధాలకు పెట్టింది పేరు. రకరకాల సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, మిరియాలు, పచ్చిపోకలు, యాలక్కాయలు, దాల్చిన చెక్కల చెట్లు పెరుగుతుంటాయి. ఇక్కడ నాణ్యత కలిగి ఉన్న మసాలా దినుసులను కొనుక్కోవచ్చు.   ఇక్కడ పండే మసాలా దినుసులు అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఇక్కడ వీచే గాలిలోనే మనం  సువాసనలను ఆస్వాదించవచ్చు.   
మమ్మల్ని డ్రైవర్ వందనమేడు లోనే ఉన్న పెరియార్  స్పైస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్ కు తీసుకువెళ్ళాడు. ప్రవేశ రుసుము మనిషికి 100 రూపాయలు. మేము ఎక్కడి వాళ్ళమో తెలుసుకుని టిక్కెట్ పైన తెలుగు అని వ్రాసారు. అంటే లోపలికి వెళ్ళాక తెలుగులో మాట్లేడే గైడ్ ను మనకు అప్పచెబుతారన్న మాట. మాకు గైడ్ గా నియమించిన మలయాళీ అమ్మాయి కడపలో కొన్నాళ్ళు టీచర్ గా పనిచేశానని చెప్పింది. చక్కని తెలుగులో ప్రతి మొక్క దగ్గరికి తీసుకువెళ్ళి దాని పేరు, ఉపయోగాల గురించి చెప్పింది. యాలకులు ఎలా తీస్తారు. లవంగం ఎలా వస్తుంది. సర్పగంధిని ఆయుర్వేద చికిత్సలో దేనికి వాడుతారు...  ఇలా దాదాపు ముప్పావు గంట వరకు చెప్పింది. తర్వాత మసాలా దినుసులు, ఆయుర్వేద ఔషదాలు అమ్మే షాపులోనికి తీసుకువెళ్ళి మా చేత చాలా కొనిపించింది. ఇంకోలా చెప్పాలంటే  మేమే చాలా కొన్నాం
మళ్ళీ మున్నార్ ప్రయాణం. దారిలో రోడ్డు పక్కన టీ తాగాం. మసాలా టీ. అదిరిపోయింది. చిన్న షాపులో దాదాపు పదిహేను రకాల టీలు అమ్ముతున్నాడు. ప్రతి టీకి తేడా ఏంటంటే కప్పులో ఒక చిన్న బాటిల్ నుంచి ఒక చుక్క ఫ్లేవర్ కలుపుతున్నాడు. ఒక్కో ఫ్లేవర్ కు ఒక్కో బాటిల్ నుంచి కలుపుతున్నాడుఅమృతాంజనం సీసా పరిమాణంలో ఉండే ఫ్లేవర్ ధర 220 రూపాయలంట. టీ ఖరీదు 20 రూపాయలు


చినకానల్  వ్యూ 
దారిలో మూడు నాలుగు వ్యూ పాయింట్లు ఉన్నాయి. ప్రతి చోట నుంచి ప్రకృతి మనోహరంగా కనిపించింది. అయితే వాన చినుకులు మాతో దోబూచులాడాయి. మేఘాలు ఆట పట్టించాయి. అయినా సరే మేము మేఘాలు కదిలి ముందుకు వెళ్ళే వరకు ఆగి ఫోటోలు తీసుకున్నాం. పవర్ హౌస్ జలపాతం దగ్గర వాన కురిసి మా కెమెరాలను తడిపేసింది. అయితే జలపాతం మాత్రం బాగుంది. మిగిలిన హిల్ స్టేషన్లకు మున్నార్ కు నేను గమనించిన తేడా ఏంటంటే ఇక్కడ చాలా జలపాతాలు ఉన్నాయిదారిపొడుగునా చిన్న చిన్న  నీటి ప్రవాహాలు కొండల మీది నుంచి గల గల శబ్దం చేస్తూ కిందికి జారుతుంటాయి.
పవర్ హౌస్ జలపాతం 
 


మున్నార్ సమీపిస్తున్న కొద్దీ కొండల మీద పచ్చని గళ్ళ తివాచీ పరచినట్టు టీ తోటలు కనిపించాయి. అసలు మున్నార్ ప్రధాన ఆదాయ వనరు తేయాకు పంట, తోటలను చూడడానికి వచ్చే పర్యాటకులే. సాయంత్రం నాలుగున్నర కల్లా ఎల్సియం గార్డెన్ హిల్ రిసార్ట్ http://www.elysiumgarden.com/  కు చేరుకున్నాం. దూరం నుంచే హోటల్ చాలా స్పెషల్ గా కనిపించింది. గదులు కూడా విశాలంగా బాగున్నాయి. హోటల్ కు వెళ్ళగానే మా ఆవిడకు వణుకుతో కూడిన చలి జ్వరం వచ్చింది. డ్రైవర్ కు చెబితే మున్నార్ లో ఉన్న చిన్న క్లినిక్ కు తీసుకువెళ్ళాడు. ట్రీట్ మెంట్ బాగానే ఉంది.  టూరిస్టులమని చెప్పగానే హోటల్లో ఉంటున్నారని అడిగి, అవసరమైతే వేళయినా ఫోన్ చెయ్యమని చెప్పారు డాక్టర్.   రాత్రి మున్నార్ సిటీ లోనే భోజనం చేశాం

ఇక మంగళ వారం... మా ప్రయాణంలో మూడో రోజు... ఉదయం తొమ్మిదిన్నరకి హోటల్లో బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని మున్నార్ లోకల్ సైట్ సీయింగ్ కు బయలుదేరాం. ముందుగా ఎరావికులం నేషనల్ పార్కు. ఇక్కడే ఒక పూట పడుతుంది


ఎరావికులం నేషనల్ పార్క్ http://eravikulam.org/

మున్నారు నుంచి 15కిలోమీటర్ల దూరంలోని కన్నన్దేవన్హిల్స్లో 97 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం 'ఎరావికులం నేషనల్ పార్క్'. మనకు మున్నార్ సైట్ సీయింగ్ ప్లేసెస్ లో రాజమల అని ఇంకో పేరు చెప్తారు. నిజానికి రెండూ ఒక్కటే. దక్షిణ భారతదేశపు పర్వత గొర్రె అయిన  నీలగిరి  తాహెర్కు, షోలా గడ్డిమైదానాలకు ఆవాసం అయిన ఎరావికులం  నేషనల్పార్కు, మూడు ప్రాంతాలుగా.. కోర్ఏరియా, బఫర్ఏరియా మరియు టూరిస్ట్ఏరియాగా విభజించబడింది. సందర్శకులను రాజమలలోని టూరిస్ట్ఏరియా వరకు మాత్రమే అనుమతిస్తారు.  ఫారెస్ట్డిపార్ట్మెంట్వారు తమ వాహనాల్లో రాజమల వరకు తీసుకెళ్ళి  గ్రాస్లాండ్ఎకో సిస్టమ్స్ను పరిచయంచేస్తారు.

నిజం చెప్పాలంటే ఇక్కడ పర్వతపు గొర్రె లేదా మేక తప్ప ఇంకేమీ కనపడవుడిపార్ట్ మెంటు వాళ్ళ బస్సు దిగాక దాదాపు కిలోమీటరు వరకు ఘాట్ రోడ్డులో నడవాలి. ఏదో చూద్దామన్న ఆశతో వెళితే రెండు మేకలు తప్ప ఏవీ కనపడలేదు. కాకపోతే పై నుంచి మున్నార్ లోయ అద్భుతంగా కనిపిస్తుంది. బాగా ఎత్తునుంచి లోయను చూడొచ్చు.  వీడియో కెమెరా పైకి తీసుకెళ్ళాలంటే రూ. 300 లు. ఇక పార్కులో ప్రవేశానికి పెద్దలకు 90, పిల్లలకు 65 రూపాయలుగా టిక్కెట్ ధరలుంటాయి.  ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకే ప్రవేశం.   ఫిబ్రవరి, మార్చి నెలల్లో మేకలు ఈనే కాలం కాబట్టి రెండు నెలలు ఎరావికులం పార్కుకు అనుమతించరు.  ఒక పూట సమయం మిగుల్చుకోవాలను కుంటే దీన్ని స్కిప్ చేయవచ్చు

కురింజిపూలు

 కొండ ప్రాంతంలో కురింజి అనబడే  ఒక రకమైన నీలిరంగు పూలు  పన్నెండేళ్ళకి ఒకసారి సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో మాత్రమే పూస్తాయి.  ఒకసారి పూస్తే సంవత్సరమంతా అలాగే నిలిచిపోయే అందాలు ఒక్క కురింజి పూలకే సొంతం. కురింజిపూలు పూచినప్పుడు కొండంతా నీలంరంగులో ఉంటుంది.   ఏడాది మున్నార్ వెళితే కనులపండుగే. అపురూప దృశ్యం జనమంతా గుర్తుండి పోతుంది.           
 టీ ఫ్యాక్టరీ 
ఎరావికులం పార్కు నుంచి మమ్మల్ని టీ ఫ్యాక్టరీ కి తీసుకువెళ్ళాడు డ్రైవర్. అయితే అది మూసి ఉందిమేము వెళ్ళినప్పుడు మున్నారులో తేయాకు కార్మికుల సమ్మెను ఉదృతంగా నిర్వహిస్తున్నారు. అందువల్లే ఫ్యాక్టరీ మూసి ఉంది. అయితే మేము ఇలాంటి టీ ఫ్యాక్టరీని ఊటీ లోనూ చూశాం. కాబట్టి తేలిగ్గా  తీసుకున్నాం. అయితే మా ఆవిడ మాత్రం టీ పొడి కొనే చాన్సు పోయిందని బాధపడుతోంటే, డ్రైవర్ తిన్నగా కృష్ణా స్టోర్ కు తీసుకువెళ్ళాడు. అక్కడ టీపొడి, మసాలాలు, కాఫీ పొడులు అన్నీ ఉన్నాయి. అగరొత్తులు బ్రహ్మాండం. పక్క షాపులోనే హోం మేడ్ చాక్లెట్లు, హల్వా, అరటికాయ చిప్స్ ఉన్నాయి. మున్నారు పట్టణ నడిబొడ్డున ఉంటుందీ స్టోర్. ఇది ప్రైవేటు వాళ్ళది. దీనికి సమీపంలోనే ప్రభుత్వ స్టోర్ ఉంటుంది. కాకపోతే డ్రైవర్లు మనలను అక్కడికి తీసుకెళ్ళరు. ఎందుకంటే అక్కడ వీరికి కమీషన్ ఇవ్వరు కదా!
షాపింగ్ పూర్తయ్యాక దగ్గరలోనే ఉన్న గురు రెస్టారెంట్ కు భోజనానికి వెళ్ళాం. కరి మీను అన్న వేయించిన  చేప చాలా బాగుంది. భోజనం కూడా బాగుంది. కాకపోతే బిల్లు మాత్రం 200 రూపాయలు ఎక్కువ వేశాడు. అది మేము తరవాత చూసుకున్నాం

భోజనం అయ్యేటప్పటికే మధ్యాహ్నం రెండు దాటింది. మరోవైపు చినుకులు పడుతున్నాయి. అక్కడినుండి టాప్ స్టేషన్ వెళ్ళే రోడ్డులో వెళ్తుంటే మధ్యలో KFDC వారి ఫ్లోరి కల్చర్ సెంటర్ కనిపించింది. అక్కడ రంగురంగుల  పూల మొక్కలను  చూశాం. సరదాపడి కొన్ని పూల విత్తనాలను కూడా కొన్నాం. ఫ్లవర్ పార్కును కేరళ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ప్రవేశ రుసుము మనిషికి 20 రూపాయలు. ఇక్కడ ఉన్న స్టాల్ లో మంచి తేనె, నాణ్యమైన  శాండల్ వుడ్ ఆయిల్ దొరుకుతాయి.     
ఫోటో పాయింట్ 
దారి పక్కగా కారాపి ఫోటో పాయింట్ అన్నాడు డ్రైవర్. కిందికి దిగి చూస్తే రోడ్డు పక్కగా తేయాకు తోటలు ఉన్నాయి. చుట్టూ కంచె ఉంది. అయితే అక్కడ నిలబడి ఫోటో దిగితే బ్యాక్ గ్రౌండ్లో తేయాకు తోటలు బాగా కనిపిస్తాయిఆడవాళ్ళు ముచ్చట పడితే అక్కడున్న ఫోటోగ్రాఫర్లు అప్పటికప్పుడు తలకు ఒక గుడ్డ కట్టి, వీపుకు ఒక బుట్ట తగిలించి తేయాకు కోసే స్థానిక మహిళలా మిమ్మల్ని తయారుచేసి ఫోటో తీస్తారు. అప్పటికప్పుడు ఇచ్చే ఫోటోకు 30 రూపాయలు తీసుకుంటారు



మట్టుపట్టి డ్యాం

మట్టుపట్టి నదిపై కట్టిన ఆనకట్ట, దాని వల్ల ఏర్పడిన జలాశయం ఉన్నాయిక్కడ. జలాశయం వ్యూ బాగుంది. ఇక్కడ ఇండో స్విస్ డైరీ ఫారం ఉందంట. సమయం చిక్కితే చూడొచ్చు. ఇక్కడి నుండి కాస్త దూరం వెళితే మట్టుపట్టి జలాశయంలో బోటు షికారు చేసేందుకు డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ ( DTPC)  ఏర్పాట్లు చేసింది. పిల్లలు ఆసక్తి చూపకపోవడంతో మేము వెళ్ళలేదు
ఎకో పాయింట్ 
టాప్ స్టేషన్ కు వెళ్లేదారి లోనే ఎకో పాయింట్ అని ఉంది. అక్కడ ఒక సరస్సు, చుట్టూ కొండలు ఉన్నాయి. అక్కడ నిలబడి పెద్దగా అరిస్తే, అరుపు మరెక్కడినుంచో మళ్ళీ వినిపిస్తుంది. ప్రతిధ్వనిని పిల్లలు బాగా ఆస్వాదించారు. కావాలంటే ఇక్కడ కూడా బోటింగ్ చేయొచ్చు
కుందాల డ్యాం 
కున్దాళ నదిపై కట్టిన ఆనకట్ట, దానివల్ల ఏర్పడిన జలాశయం ఉన్నాయి. డ్యాం పై వెళ్ళాలంటే చాలా ఇరుకైన దారి ఉంది. ఇటునుంచి ఒక కారు వెళ్ళాలంటే అటు నుంచి వచ్చే కారు ఆనకట్టకు అవతలి పక్కే ఆగిపోవాలి. వర్షం జోరుగా కురుస్తుండటంతో కిందికి దిగి చూడలేక పోయాం.


  తరవాత ముఖ్యమైన టాప్ స్టేషన్ వెళ్ళాలి. ఎందుకంటే మున్నార్ - కొడైకెనాల్ దారిలో ఉండే టాప్ స్టేషన్ నుండి ఒక పక్క అరేబియా సముద్రం, మరో పక్క తమిళనాడు మైదాన భూములు కనిపిస్తాయి. అదీకాక మబ్బులు కమ్మిన లోయ మొత్తాన్నీ టాప్ స్టేషన్ నుండి చూస్తుంటే మేఘాల పైన స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అయితే అప్పటికే ఐదు గంటలు కావస్తుంది. పైగా వర్షం కూడా పడుతుంది. నిజమో కాదో తెలీదుగానీ కుందల లేక్ నుండి 7 కిలోమీటర్లు వెళ్ళాక మరో మూడు కిలోమీటర్లు నడిస్తేనేగాని టాప్ స్టేషన్ రాదన్నాడు. పిల్లలు కూడా వర్షం కురుస్తుంది హోటల్ కు వెళ్ళిపోదామన్నారు. పిల్లలు మాట అనగానే డ్రైవర్ ముఖం వెలిగిపోయింది. వెంటనే తిరిగి మున్నార్ వైపు పరుగులుతీసాడు. రాత్రి హోటల్ లోనే భోజనం చేశాం
ఇక మా మున్నార్ పర్యటనలో ఆఖరి రోజు, బుధవారం... 
నిజానికి రోజు కూడా మున్నార్ లోనే ఉండిపోతే బాగుండేది. ఎందుకంటే మున్నార్ నుంచి కొచ్చి వెళ్ళేదారిలో పశ్చిమ కనుమల లోనే ఎత్తైన  అనైముడి వ్యూ పాయింట్,  చైపార, వాలార జలపాతాలు, రోజ్ గార్డెన్ వంటి ప్రదేశాలు ఉన్నాయి
మున్నార్ రోడ్ మ్యాపును పరిశీలిస్తే మూడు ప్రధాన దారులు ఉంటాయి. ఒకటి కోయంబత్తోర్ వెళ్తుంది. దారిలోనే ఎరావికులం నేషనల్ పార్క్ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రెడ్ శాండల్ ఫారెస్ట్ ఉంటుంది. ఇక మరో దారి తెక్కేడికి వెళ్ళేది. దారిలో కొన్ని వ్యూ పాయింట్స్, స్పైస్ గార్డెన్ లు ఉంటాయి. మూడో దారి కొచ్చి వెళ్తుంది. మూడూ కాకుండా మరో దారి ఉంది అదే టాప్ స్టేషన్ రోడ్డు. మున్నార్ లోని టూరిస్ట్ స్పాట్ లన్నీ దారిలోనే ఉంటాయి 
ఉదయాన్నే అన్నీ సర్దుకుని,  హోటల్లో బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని, కాసేపు హోటల్ బయట ఫోటోలు దిగి తొమ్మిదిన్నరకు కారులో కోయంబత్తూరు బయలుదేరాం. సాయంత్రం నాలుగున్నరకు శబరీ ఎక్స్ ప్రెస్ అందుకోవాలి.  ఉడుమల్ పేట్, పోలాచ్చిల మీదుగా 156 కిలోమీటర్లు, 5 గంటల ప్రయాణం... అంటే మధ్యాహ్నం రెండున్నర కల్లా కోయంబత్తూరు రైల్వే స్టేషన్ లో ఉంటాం

మున్నార్ నుంచి కోయంబత్తూర్ 

నిన్నటి వరకు వర్షపు జల్లుల్లో తడిసిన మున్నారు ఇప్పుడు లేయెండలో ఆరుతోంది. చౌరస్తాలో తేయాకు కార్మికుల సమ్మె శిబిరం మరింత సందడిగా మారింది. వాళ్లకు సంఘీభావం తెలిపేందుకు ఎవరో నాయకులు వస్తున్నారంట. మున్నార్ స్వచ్చతను మనసారా ఆస్వాదిస్తూ వెళ్తున్నాం. పచ్చని కొండలు మళ్ళీ రమ్మంటున్నాయి. వాటి మీదకు వాలిపోతూ మబ్బులు మాకు చేతులు ఊపుతున్నాయి. సైడ్ వ్యూ మిర్రర్ లోంచి వెనక్కు చూస్తే..   దట్టమైన తేయాకు తోటలు పాక్కుంటూ మమ్మల్ని అనుసరించి వస్తున్నాయా అన్నట్టు దారిని కమ్మేస్తున్నాయి.  ఒకచోట ఆగి తేయాకు తోటల మధ్యలోకి వెళ్ళి ఫోటోలు దిగాం.
అలా మరో రెండు స్పాట్ల వద్ద కారును ఆపితే తనివితీరా తేయాకు లేత చిగుళ్ళ సోయగాలను చూసి ఆనందించాం. ఒక దగ్గర ఆగి ఫోటోలు దిగుతుంటే...  కాంగ్రెస్ జెండాలు, కమ్యూనిస్ట్ జెండాలు కట్టిన జీపులు  పదుల సంఖ్యలో ఒకదాని వెంట ఒకటిగా పరుగులు పెడుతూ మున్నార్ వైపు సాగిపోతున్నాయి. దూరంగా తేయాకు తోటల మధ్య నుంచి అవి వరుస పెట్టి దూసుకుపోతుంటే సినిమాలోని మంచి యాక్షన్ సీన్ లా అనిపించింది. అవన్నీ రాజకీయ నాయకుల, వాళ్ళ అనుచరుల జీపులు. మున్నార్ లో జరుగుతున్న తేయాకు కార్మికుల సమ్మెను ఉదృతం చేయడానికి వెళుతున్నారు వీళ్ళంతా. కొంత దూరం పోయాక లక్కం జలపాతం చేరుకున్నాం. ఇక్కడ స్నానాలు చేయనిస్తారని డ్రైవర్ ముందుగానే చెప్పడంతో అందుకు తగిన దుస్తులను చిన్న బ్యాగులో సిద్ధంగా ఉంచుకున్నాం.

లక్కం జలపాతం 

మున్నార్ చుట్టుపక్కల చాలా జలపాతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అట్టుకల్, న్యాయమకాడ్, చిన్నక్కల్, కుతుమ్కల్, చీయప్పరా, వలారా, తూవనం జలపాతాలు. లక్కం జలపాతం మున్నార్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి జలపాతాలు అన్నీ ధారాళమైన నీటి ప్రవాహాలతో సందడి చేస్తున్నాయి. మరి వేసవిలో ఎలా ఉంటాయో తెలీదు
ఎరావికులం కొండల నుంచి జాలువారే జలపాతం మేము వెళ్ళినప్పుడు ఉదృతంగా ఉంది. అయితే పక్కనే చాలామంది స్నానాలు చేస్తూ, ఈత కొడుతున్నారు. ప్రవేశరుసుము ఒకరికి 20 రూపాయలు. మా చిన్నాడు కాసేపు నీళ్ళలో ఆడుకున్నాడు . మన వస్తువులను, బట్టలను భద్రపరచుకోడానికి అక్కడ లాకర్లను అద్దెకిస్తారు. బట్టలు మార్చుకునేందుకు గదులు కూడా ఉన్నాయి. బయటకు వచ్చి అక్కడే ఉన్న చిన్న దుకాణంలో కొబ్బరి బొండాం తాగాం. కేరళ కొబ్బరి కాయలో తాగే కొద్దీ నీళ్ళు. ఒక్క బొండాం తాగే సరికి కడుపు నిండిపోయింది.  ఇప్పుడు మా ప్రయాణం చిన్నార్ అటవీ సంరక్షణ ప్రాంతానికి.             
  
  దారిని ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకూ మూసేస్తారని డ్రైవర్ చెప్పాడు. ఎందుకంటే సమయంలో జంతువులు రోడ్డుమీదకు వస్తాయంట. అంత ప్రమాదకరమా అనుకున్నాం. కానీ చాలా మంది బైక్ మీదే ఒంటరిగా వెళ్తున్నారు. కారులో ఉన్న టీవీలో ధనుష్ నటించిన 'మారి' అనే తమిళ సినిమా ప్లే చేశాడు. పిల్లలు ఇంక సినిమా చూడడంలో నిమగ్నమై పోయారు. నేను మాత్రం అడవిదారిలో ఏవైనా జంతువులు కనిపిస్తే కెమెరాలో బంధించాలని హండీ కామ్ ను సిద్ధంగా ఉంచుకున్నానుఒక దగ్గర అడవి ఉడుతలు కనిపించాయి. కుందేళ్ళ సైజులో ఉన్నాయవి. మరో దగ్గర లంగూర్ అనబడే కోతులు కనిపించాయి. ఇక్కడ కూడా ట్రెక్కింగ్, జంగల్ సఫారీ, జంగల్ వాక్ వంటి యాక్టివిటీస్ కు వీలుంది. అడవిలో ఉండాలనుకుంటే ఒక ట్రీ హౌస్ లో మకాం కూడా చెయ్యొచ్చు. ఇన్ని చేసినా మీరు ఆశించిన జంతువులు కనబడతాయన్న భరోసా తక్కువ. వైల్డ్ ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉంటే వేరేవిషయం
మమ్మల్ని మాత్రం ఇక్కడ అద్భుతాలను అశించవద్దని ముందే చెప్పి మానసికంగా సిద్ధం చేశాడు డ్రైవర్. అతనికి వీలైనంత త్వరగా కోయంబత్తూర్ చేరి ఇంటికి వెళ్ళాలని ఉంది

మధ్యలో ఒక దగ్గర ఆపి దూరంగా కొండల్లో కనిపిస్తున్న జలపాతాన్ని చూపించాడు. మామూలు కంటితో చూస్తే చిన్నగానే అనిపించింది. కెమెరా లెన్స్ ను జూమ్ చేసి చూస్తే చాలా ఉదృతంగా దూకుతున్న వెడల్పాటి పెద్ద జలపాతం అది. అక్కడికి వెళ్ళడం కుదరదన్నాడు డ్రైవర్. అది   జలపాతమో, అక్కడికి ఎందుకు వెళ్ళలేరో  అతను మాకు చెప్పలేదు.

 
ఒక చెక్ పోస్టు దగ్గర కారు ఆపి దిగుతూ, కారు తలుపులు తెరవకండి అని చెప్పాడు. అతనలా చెక్ పోస్ట్ కేబిన్ దగ్గరికి వెళ్ళాడో లేదో ఒక కోతుల గుంపు వచ్చి మా కారు మీదికి ఎక్కింది. ఒక్కో కిటికీ దగ్గర ఒక్కోటి నిలబడి లోపలికి వచ్చేందుకు దారి వెదుకుతున్నాయి. కాస్తంత భయపడినా థ్రిల్లింగ్ గా  పిల్లలు ఎంజాయ్ చేశారు. డ్రైవర్ మామూలుగా వచ్చి వాటిని అదిలించి లోన కూర్చున్నాడు

దారి మధ్యలో అదిగో చిన్న చిన్న ఆకులతో కనిపించే చెట్లే ఎర్ర చందనం చెట్లన్నాడు. నిజానికి మున్నార్ సైట్ సీయింగ్ అనగానే చాంతాడంత జాబితా చెబుతారు కానీ వాటిలో సగం...  దారిలో అలా వెళ్తూ, ఇలా చూపించేవే. సరిగా చెప్పాలంటే కలరి పయట్టు, కథాకళి షోలను చూశాక పెరియార్ బోటింగ్, టాప్ స్టేషన్ రోడ్డులోని ప్రదేశాలు, అనైముడి వ్యూ పాయింట్ లను చూసి, టైముంటే ఎరావికులం చూస్తే మున్నార్ ట్రిప్ అయిపోయినట్టే

అడవి దాటాక ఒక దగ్గర హైవేలో ఒక దగ్గర భోజనానికి ఆపాడు. తమిళనాడు భోజనం చాలా బాగుంది. అప్పటికి రెండున్నర దాటింది. ఇక అప్పుడు మొదలయ్యింది కారు రేసు. రైలు ఎక్కేందుకు చాలా సమయం ఉంది కదా అని మేమనుకున్నాం. తీరా చూస్తే సమయానికి అక్కడికి వెళ్లగలమా లేదా అన్న కంగారులో అతనున్నాడు. ఎలాగైతేనేం చాలా టెన్షన్ పడి కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కు చేరేసరికి శబరీ ఎక్స్ ప్రెస్ లోపలికి వస్తోంది. అక్కడ రెండు నిమిషాలే ఆగుతుంది. అందుకని ఉరుకులు పరుగుల మీద వెళ్ళి ఎలాగోలా బోగీలో కూర్చున్నాం. రెండు నిముషాలు ఆలస్యం అయ్యుంటే ప్లానింగ్ దెబ్బతినేది. బుధవారం మధ్యాహ్నం నాలుగున్నరకు బయలుదేరితే, గురువారం మధ్యాహ్నం ఒకటిన్నరకు సికింద్రాబాద్ చేరుకున్నాం

ఇవీ మా మున్నార్ పర్యటన విశేషాలు. తెక్కెడిలో మరో రోజు, మున్నార్ లో మరో రెండు రోజులు గడిపితే బాగుండునని ఇప్పుడు అనిపిస్తోంది మాకు


    

6 కామెంట్‌లు: