పేజీలు

13, జూన్ 2012, బుధవారం

రోటి,కపడా ఔర్ మొబైల్..!


'జియే తో జియే కైసేబిన్ ఆప్ కే ...
లగ్ తా నహి దిల్ కహీ, బిన్ ఆప్ కే ...
కైసే కహూ, బినా తెరే జిందగీ యే క్యా హోగీ...'

ఒకరికి ఒకరు దూరమైన ప్రేయసి ప్రియులు, ఒకరిని తలచుకుని ఒకరు పాడుకునే పాట ఇది. కాని, రోజుల్లో ఇదే పాట ఎవరైనా పాడుతుంటే వారి సెల్ ఫోన్ కనపడటం లేదని అర్థం.

'రోటి, కపడా ఔర్ మకాన్ ' అనేది ఒకప్పుడు మన నాయకుల నోట బాగా నానిన మాట. అయితే రోజు భారత దేశంలో పేదలకు కావలసిన కనీస అవసరాల ప్రాధాన్యత మారింది. రోటీ (కూడు) , కపడా (గుడ్డ) తర్వాతి స్థానం మకాన్ (గూడు) కాకుండా మొబైల్ ఫోన్ అయ్యింది. చెట్టు కింద, ఫుట్ పాత్ పైన, మునిసిపాలిటీ పైపుల్లో... ఇలా ఎక్కడ నివాసం ఉన్నా, పని చేస్తున్నా చేతిలో మొబైల్ ఉండాల్సిందే.

మనిషి సంఘజీవి. సంఘటితంగా జీవించాలంటే... తోటి మనిషితో సంబంధాలు ఏర్పరుచుకోవాలి. భావ వ్యక్తీకరణకు  సమాచార మార్పిడి జరగాలి. అందుకే సమాచార సాధనాలకు ఇంత ప్రాథాన్యత. భారతదేశ జనాభా 121 కోట్లయితే, అందులో సెల్ ఫోన్ వినియోగదారులు దాదాపు 92 కోట్ల మంది. అంటే మార్చి 2012 నాటి ఈ లెక్కల ప్రకారం దేశంలోని 76% మంది ప్రజలు సెల్ ఫోన్ వాడుతున్నారన్నమాట. మానవ నాగరికత ఆరంభం నుండి కూడా మనిషి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాడు. అందుకు ఎన్నో మార్గాలను, సాధనాలను ఉపయోగించుకున్నాడు. అయితే ఈ స్థాయిలో మాత్రం ఏ సమాచార సాధనాన్నీ వాడలేదు మనం. ఎందుకని? సెల్ ఫోన్ ప్రత్యేకత ఏంటి? తెలుసుకోవాలంటే అంతకు ముందున్న సమాచార సాధనాల గురించి కాస్త తెలుసుకోవాలి.

సమాచార సాధనాల సమాచారం 
ఒకప్పుడు దూరంగా ఉన్నవారితో సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలంటే ప్రత్యేకంగా ఒక దూతను పంపే వారు. పావురాయి వంటి పక్షులతో కూడా సమాచారాన్ని చేరవేసేవారని విన్నాం. 'కాకి చేత కబురు పెట్టు చాలు' అన్న జాతీయం దీనిమూలన్గానే వచ్చింది. తర్వాత పోస్టల్ నెట్ వర్క్ ఏర్పాటయింది.

ప్రియమైన నీకు... 
 'ప్రియమైన...' అంటూ మొదలుపెట్టి, 'ఇట్లు, మీ...' అంటూ ముగిస్తూ రాసుకున్న లేఖలు మనుష్యుల మధ్య సంబంధాలని, ప్రేమలని ఎంతో కాలం మోసాయి.  క్రీ.శ. 1774లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 'కంపెనీ డాట్' పేరిట భారత దేశంలో మొదటిసారిగా  తపాలా సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అదే సంవత్సరం  ఏప్రిల్ 1న కలకత్తాలో దేశంలోని మొట్టమొదటి జి.పి.ఓ. ప్రారంభించబడింది. నాటి నుంచి దాదాపు రెండు వందల ఇరవై ఏళ్ళ పాటు ఉత్తరాలు పల్లెపల్లెకు రెక్కలు కట్టుకుని ఎగిరెళ్ళుతూ పెత్తనాలు చేశాయి. ఆత్మీయుల గురించిన క్షేమసమాచారం, పెళ్లి కుదిరందనో,మనవడు పుట్టాడనో చెప్పే శుభవార్తలు, ఉద్యోగం వచ్చిందన్న తీపి కబురు, ప్రేమలేఖలు,విరహబాధలు... ఇలా ఎన్నిటినో మోసుకొచ్చే ఉత్తరాలను అందించే పొస్టుమేన్ ప్రతి ఇంటికీ ఒక ఆత్మీయుడు అప్పట్లో.


స్టార్ట్ ఇమ్మీడియట్లీ ...   
ఇంటి తలుపు తట్టి 'టెలిగ్రాం' అనగానే , ఆ ఇంట్లో వాళ్లకు గుండెలు జారి పోయేవి. టెలిగ్రాంలో 'ఫలానా వాళ్ళు సీరియస్. స్టార్ట్ ఇమ్మీడియట్లీ' అన్న సందేశాలే ఎక్కువగా ఉండేవి. సీరియస్ అని టెలిగ్రాం వచ్చిందంటే, ఆ ఫలానా వాళ్ళు టపా కట్టేసారని అర్థమన్న మాట. అందుకే టెలిగ్రాం వచ్చిందంటే అంత భయపడేవాళ్ళు.

ఈ టెలిగ్రాఫ్ విధానాన్ని కనుగొన్నది శ్యామ్యూల్ మోర్స్  అనే అమెరికన్.1835లో ఎలెక్ట్రో మాగ్నటిక్ టెలిగ్రాఫ్ పరికరాన్ని, అలాగే దాని ద్వారా సందేశాన్ని పంపించడానికి 'డాష్ అండ్ డాట్' (గీతలు మరియు చుక్కలు )లతో కూడిన ఒక కోడ్ ను కూడా రూపొందించాడు మోర్స్. ఈ టెలిగ్రాఫ్ పరికరం ద్వారా 1838, జనవరి 11న ప్రపంచంలో మొట్టమొదటి టెలిగ్రాఫ్ సందేశం పంపబడింది. ఆ తర్వాత ఏడేళ్లకు అంటే 1845 నుండి ప్రజలందరికి  అందుబాటులోకి వచ్చింది టెలిగ్రాం సౌకర్యం.

మన భారత దేశంలో కలకత్తా నుండి డైమండ్ హార్బర్ వరకు మొదటి టెలిగ్రాఫ్ లైన్ వేయబడింది. అయితే అది బ్రిటిష్ ఈస్టిండియా వారి ప్రయోజనాలకే  పరిమితమయ్యింది.  ఆ తర్వాత 1853లో కలకత్తా నుండి ఆగ్రాకు టెలిగ్రాఫ్ లైన్ వేసాక ప్రజలకు టెలిగ్రాం సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. 1902లో వైర్ లెస్ టెలిగ్రాఫ్ సిస్టం అమలులోకి వచ్చింది.

బూచాడమ్మా బూచాడు... బుల్లి పెట్టెలో ఉన్నాడు...
మొదట చేతి రాతల (పోస్టల్ ) ద్వారా, ఆ తర్వాత కోడ్ (టెలిగ్రాఫ్ ) ద్వారా అందుకున్న సందేశాలను, 1870లలో బెల్ మహాశయుడు టెలిఫోన్ ను కనుగొనడంతో, ఎంత దూరంలో ఉన్న మనిషితోనైనా నేరుగా మాట్లాడగలిగే వీలు కలిగింది.

అలెగ్జాండర్ గ్రాహం బెల్ కన్నా ముందు, ఆ తరవాత కూడా టెలిఫోన్ పరికరానికి తమ కృషిని, మేథస్సునూ జోడించిన వారున్నారు.  1850 నుండి 1870 వరకు టెలిఫోన్ పరికరంపై  పేటెంట్  హక్కుల కోసం చాలా  పెద్ద పోటీయే జరిగింది. అయితే చిట్టచివరకు 1876లో టెలిఫోన్ పరికరంపై పేటెంట్ హక్కులను బెల్ కు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం.. ఆ రకంగా 1876, ఆగస్ట్ 3న బెల్ చేసిన ఫోన్ కాల్  ప్రపంచపు మొదటి టెలిఫోన్ కాల్ గా గుర్తించబడింది.

ఇక భారతదేశం విషయానికి వస్తే కలకత్తా, బొంబాయి, మద్రాస్, అహమ్మదాబాద్ లలో టెలిఫోన్ ఎక్స్ చెంజీలను పెట్టేందుకు, అప్పటి 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' నుండి అనుమతి పొందిన 'ఓరియంటల్ టెలిఫోన్ కంపెనీ', 1882, జూన్ 30వ తేదీన, కలకత్తాలో స్థాపించిన 'సెంట్రల్ ఎక్స్చెంజీ' ద్వారా ఇండియాలో టెలిఫోన్ సర్వీసుల్ని ప్రారంభించింది. ఆనాడు టెలిఫోన్ సౌకర్యాన్ని అందుకోడానికి ముందుకు వచ్చిన సబ్ స్క్రైబర్ లు ఎంత మందో తెలుసా? కేవలం 92 మంది.  స్వాతంత్ర్యం వచ్చిన నాటికి  దేశంలో 7330 టెలిగ్రాఫ్, 321 టెలిఫోన్ ఎక్స్చేన్జీలు  ఉన్నాయి. అప్పటికి  టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 82,985కు చేరింది.

ఈ విధంగా బ్రిటిష్ వారు, వారి పాలనా సౌలభ్యం గురించి కానివ్వండి, లేదా అభివృద్ధిలో భాగమనండి, 19వ శతాబ్దంలోనే   పోస్టల్, టెలిగ్రాఫ్, టెలిఫోన్ వంటి సమాచార సేవలను భారత ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే వీటిలో పోస్టల్ సేవలనే ప్రజలు విరివిగా ఉపయోగించుకున్నారు. కారణం టెలిగ్రాఫ్ అనేది మిత సందేశాలకు మాత్రమే పరిమితమై పోవడం. ఇక టెలిఫోన్ సేవల ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్యులు ఈ సేవలను అందుకోలేకపోయారు. అందుబాటులోకి వచ్చిన వందేళ్ళ వరకు కూడా టెలిఫోన్ అనేది స్టేటస్ సింబల్ గానే ఉండిపోయింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చేనాటికి, అంటే 1992 నాటికి, 84 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో టెలిఫోన్ సబ్ స్క్రైబర్ల సంఖ్య కేవలం 5కోట్ల 7 లక్షలు మాత్రమే.

అప్పట్లో ఏదయినా అవసరం ఉండి, ఎవరికైనా టెలిఫోన్ నంబరు ఇవ్వాలంటే, వీధిలో ఏ ఒక్కరి దగ్గరో ఉండే టెలిఫోన్ నంబరు ఇవ్వడం, అక్కడకు ఫోనొస్తే, వాళ్ళు విసుక్కుంటూ మనల్ని పిలవడం, వేరే రాష్ట్రానికో, దేశానికో ఫోన్ చెయ్యాలంటే ఎస్టీడీ బూత్ ల దగ్గర గంటలకొద్దీ సమయాన్ని వెచ్చించడం, క్యూ లలో నిలబడి నిరీక్షించడం మనందరికీ అనుభవమే. దేశంలో ఎస్టీడీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది 1960లో. లక్నో నుంచి కాన్పూర్ కు   మొదటగా ఎస్టీడీ లైనును వేశారు.

ప్రపంచీకరణ-ఆర్థిక సంస్కరణలు-పారిశ్రామిక సరళీకరణ...          
పేద, ధనిక తేడాల్లేకుండా ఈ రోజు ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోన్ ఉందన్నా,ప్రతి ఇంట్లో వంద చానెళ్ళ కలర్ టీవీ ఉందన్నా దాని వెనుక ఒక తెలుగు తేజం కృషి ఉంది. ఆయనే మాజీ ప్రధాని, కీ.శే. పి. వి.నరసింహరావు.  తెలంగాణ  ఆత్మ గౌరవం అంటూ నినదించే తెలంగాణ వాదులు, ఈ తెలంగాణ ముద్దు బిడ్డడి గొప్పదనాన్ని  గుర్తించక పోయినా పరవాలేదు. శవరాజకీయ సంస్కృతిని జీర్ణించుకున్న నూట పాతికేళ్ళ పార్టీ ఆయన సేవలను మర్చిపోయినా పరవాలేదు, అధిష్టానాన్ని కాకా పట్టడం కోసం ఘనతనంతా రాజీవ్ గాంధీకి ఆపాదించి మాట్లాడే నేతలు పీవీ కృషిని విస్మరించినా పర్వాలేదు. కాని చేతిలో సెల్ ఫోన్ ఉన్నవారంతా ఈ సంస్కరణల సాహసిని గుర్తుంచుకుంటే చాలు. ఎందుకంటే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని గట్టెక్కించడంతో  పాటు, అంతర్జాతీయ సాంకేతిక ఫలాలను సామాన్యులకు చేరువ చెయ్యడంలో పీవీ పాత్ర  మరువలేనిది.

1991లో అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు  పీవీ నరసింహారావు. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పటి పీవీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా  ఉన్నారు. ఇద్దరూ కలిసి 1992లో ఆర్ధిక సంస్కరణలకు ఊపిరి పోశారు. ప్రపంచీకరణకూ, పారిశ్రామిక సరలీకరణకూ తలుపులు తెరిచారు. ఫలితంగా దేశంలో సాంకేతిక విప్లవం చోటు చేసుకుంది. విదేశీ పెట్టుబడులతో పాటు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం దేశంలోకి వెల్లువలా ప్రవహించింది. విదేశీ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ ఫలితంగా భారత ప్రజలకు సమాచార సాధనాలు అందుబాటు ధరలకు చేతికొచ్చాయి.

1995
...దేశ సమాచార రంగంలో నూతన శకానికి నాంది!


 పేజర్ 
మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నడుముకు ఒక అగ్గిపెట్టేలాంటి పరికరం. దాన్నుండి బీప్ బీప్ అని శబ్దం రావడం. చటుక్కున దాన్ని తీసి చూస్తే, స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యే ఒక సందేశం. దాన్ని చదువుకున్న సదరు వ్యక్తి దగ్గరలోని టెలిఫోన్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేసుకోవడం.ఆ పరికరం పేరే 'పేజర్'.  

అల గ్రాస్ అనే శాస్త్రజ్ఞుని కృషి ఫలితంగా 1950లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన పేజర్ , 1958లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 1974లో మోటోరోలా కంపెనీ పేజర్ సర్వీసులను ప్రారంభించి, ప్రపంచానికి పేజర్ ను చేరువ చేసింది. అయితే భారతీయులకు మాత్రం చాలా ఆలస్యంగా, అదీ పీవీ హయాంలో అంటే   1995లో పేజర్లు అందుబాటులోకి వచ్చాయి. అనతికాలంలోనే దేశంలో 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లను సంపాదించుకున్న పేజర్లు, 2004కల్లా దేశం నుండి మాయమై పోయాయి. కారణం సెల్ ఫోన్.


కేబుల్ టెలివిజన్ 
1884 నుంచి సాగిన పరిశోధనల ఫలితంగా, ప్రపంచానికి 1936, నవంబర్ 2న, BBC వార్తా ప్రసారం ద్వారా   పరిచయమైన టెలివిజన్, మన దేశంలో 1959 సెప్టెంబర్ 15న డిల్లీ నుంచి ప్రయోగాత్మక ప్రసారాన్ని జరుపుకుంది. ప్రజలకు మాత్రం 1965నుంచి అందుబాటులోకి వచ్చింది. అయినా చాలా సంవత్సరాల వరకూ టీవీ కూడా సంపన్న వర్గాల  స్టేటస్ సింబల్ గానే ఉండిపోయింది. మొదట్లో AIR లో భాగంగా ఉన్న టెలివిజన్ ప్రసార విభాగం 1976లో వేరయ్యింది. 1982 నుంచి దూరదర్శన్ విభాగం ద్వారా జాతీయ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అదే సంవత్సరం కలర్ టీవీ కూడా భారత్ లోకి ప్రవేశించింది. 


1965లో దేశంలో ఉన్న టీవీ సెట్లు కేవలం 41. ఉన్నది ఒకే ఒక చానెల్. అలాంటిది 1992లో ప్రసార రంగానికి పీవీ స్వేచ్చను కల్పించడంతో, కేబుల్ టీవీ వ్యవస్థ ప్రజలకు చేరువయ్యింది. స్టార్ టీవీ వంటి విదేశీ చానెళ్ళు దేశీయ ప్రసారాలను ప్రారంభించాయి. ఆ తర్వాత జీటీవీ, సన్ నెట్వర్క్ లాంటి దేశీయ  నెట్వర్క్ లు  నెలకొల్పబడ్డాయి.

ఇంటర్నెట్ 
ప్రపంచానికి 1988లో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ సర్వీసులు మనదేశ ప్రజలకు 1995, ఆగష్టు 14 నుండి అందుబాటులోకి వచ్చాయి.
1996లో రీడిఫ్.కామ్ సంస్థ ముంబాయి నగరంలో మొదటి సైబర్ కేఫ్ ను ప్రారంభించింది.
మొదటిసారిగా తన కస్టమర్లకు ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను అందించిన సంస్థ ఐ.సి.ఐ.సి.ఐ. (1997).
అప్పటివరకు గేట్ వే ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీసు (VSNL) అధీనంలో ఉన్న ఇంటర్నెట్, 1998, అక్టోబర్ 7 నుండి ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్ల చేతికొచ్చింది. ఒక్కసారిగా 200 ISPలు ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు అనుమతిని పొందాయి. దేశంలో ఇంటర్నెట్ సేవలను అందించిన మొట్టమొదటి ప్రైవేటు ISP -సత్యం ఇన్ఫో వే లిమిటెడ్ (SIFY).
షమ్మీకపూర్ 
మీకు తెలుసా? దేశంలో ఇంటర్నెట్ పేరు కూడా వినబడని రోజుల్లోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు కీ.శే. షమ్మీకపూర్ ఇంటర్నెట్ సేవలను అందుకున్నారని అంటారు. దేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్ వినియోగదారుడు ఆయనే అని, అందుకే యాహూ సంస్థను భారత్ లో ప్రారంభిస్తూ, ఆ సంస్థ అధినేత జెర్రీ యాంక్, ప్రారంభోత్సవ కార్యక్రమానికి షమ్మీ కపూర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని చెప్పుకుంటారు. 


ఇకపోతే మన సెల్ ఫోన్ కూడా భారత దేశంలోనికి అడుగుపెట్టింది 1995లోనే.


సెల్ శకం 
1995, జూలై 31వ తేదీ. కలకత్తా నగరం. అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీ.శే. జ్యోతిబసు, నాటి టెలికాం మంత్రి సుఖ్ రామ్ గారికి మొబైల్ ద్వారా ఫోన్ చేసి, దేశంలో మొబైల్ ఫోన్ సర్వీసుల్ని ప్రారంభించారు. మొదటి మొబైల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్-మోడి గ్రూప్. టెల్ స్ట్రా అనే ఆస్ట్రేలియాన్  సంస్థతో కలిసి మొబైల్ సేవలను అందించిన మోడి గ్రూప్ , అప్పట్లో నిమిషానికి 16 రూపాయల చార్జీని వసూలు చేసేది. మొదట్లో  మొబైల్ సేవలు కలకత్తా, డిల్లీ నగరాలకే పరిమితమయ్యాయి.

మీరు గమనించారా? కారణం ఏమైనా గాని, భారత దేశంలో పోస్టల్, టెలిగ్రాఫ్, టెలిఫోన్, సెల్ ఫోన్ వంటి ముఖ్యమైన  సమాచార సేవలన్నీ మొదట అందుబాటులోనికి వచ్చింది కొలకత్తా వాసులకే.

సెల్ ఫోన్ పుట్టుక 
తను కనిపెట్టిన మొబైల్ ఫోన్ తో మార్టిన్ కూపర్ 
సెల్ ఫోన్ లు  రాక ముందు రకరకాల మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండేవి. కానీ ఇవేవీ తేలికగా మోసుకు పోగలిగినవి కాదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రేడియో ఫోన్లను సైనిక అవసరాల కోసం వాడడం మొదలు పెట్టారు. అయితే వీటికి అవసరమైన విద్యుత్తు కోసం కారు లేదా మరేదయినా వాహనం యొక్క బ్యాటరీ కావలసి రావడంతో వీటిని కేవలం వాహనాలలోనే అమర్చవలసి వచ్చేది. వీటిని కార్ ఫోన్లని అనేవారు.. అలాంటి పరిస్థితులలో మోటరోలా సంస్థకు చెందిన పరిశోధకుడు మార్టిన్ కూపర్ తన బృందంతో కలిసి అనేక పరిశోధనలు చేసిన అనంతరం, ప్రపంచపు మొట్టమొదటి 'హ్యాండ్ హెల్ద్ మొబైల్ ఫోన్'ను తయారు చేసాడు. ఒక సెల్యులార్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసి, 1973, ఏప్రిల్ 3న న్యూయార్క్ నగరంలో ఒకచోటినుండి మరోచోట ఉన్న తన ప్రత్యర్థి సంస్థ బెల్ లాబ్స్ అధిపతికి మొదటి కాల్ చేసాడు. నాడు ఆ  సెల్ ఫోన్ బరువు ఒక కిలో.

ప్రపంచపు మొట్టమొదటి సెల్ ఫోన్ 
అయితే ఆ తర్వాత పదేళ్లకు గాని, మొబైల్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. మార్చి 6,1983లో మార్కెట్లోకి వచ్చిన  మొబైల్ ఫోన్  అరగంట టాక్ టైం, 20 నిమిషాల బాటరీ లైఫ్ తో వచ్చింది. బ్యాటరీ చార్జింగ్ కు  10 గంటలు పట్టేది.
వాణిజ్యపరంగా 1979లోనే  జపాన్ రాజధాని టోక్యోలో మొట్టమొదటి సెల్యులార్ నెట్ వర్క్ నెలకోల్ప బడింది. ఆ తర్వాత అదే దారిలో డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే,స్వీడన్ల లో నెట్ వర్క్ లు వెలిశాయి. ఇక 1జి నెట్వర్క్ సేవలను 1983లో న్యూయార్క్ ప్రారంభించింది. GSM స్టాండర్డ్ 2జి సేవలను 1991లో ఫిన్లాండ్ అందుబాటులోకి తెచ్చింది.

SMS 
మొదటి SMSను యు.కె.లో   1992లో కంప్యూటర్ నుండి మొబైల్ కు పంపడం జరిగింది. ఆ తర్వాత 1993లో ఫిన్లాండ్ దేశం మొబైల్ నుండి మొబైల్ కు మొదటి SMSను పంపింది.

ఎందుకింత క్రేజ్?
సెల్ ఫోన్ కంటే ముందు ఎన్ని సమాచార సాధనాలున్నా వేటికీ లేని ఆదరణ సెల్ ఫోన్ కే ఎందుకని ఆలోచిస్తే చాలా కారణాలు కనిపిస్తాయి. మొదటగా... ఇది ఎక్కడికైనా మోసుకుపోగల సాధనం. పైగా ఇది కేవలం సమాచార మార్పిడి సాధనం మాత్రమే కాదు, వినోద సాధనం కూడా. ఎఫ్.ఎం., ఎస్సెమెస్, గేమ్స్, ఇంటర్నెట్, పిక్చర్ మెసేజ్, కెమెరా, వీడియో రికార్డింగ్..ఇలా ఫోనుకు అదనంగా ఎన్నో సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.  పైగా అతి తేలికైన, చిన్నని, చౌకైన మొబైల్ పరికరాలు ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చాయి.
దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు సాంకేతికతను అభివృద్ధి  పరచుకుంటూ రకరకాల సేవలను వినియోగదారులకు అందించ సాగాయి మొబైల్ సేవా  సంస్థలు. ప్రపంచం మొదటి మొబైల్ ఫోన్ చూసి కేవలం 30 సంవత్సరాలే. ఈ లోపులోనే ఎంతటి అభివృద్ది!
ముప్పై ఏళ్లలో సెల్ రూపు రేఖల్లో ఎంత మార్పు!
1993లో ఎరిక్సన్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు ప్రవేశ పెట్టింది. 2000 సంవత్సరంలో టచ్ స్క్రీన్, 5MP కెమెరాలను సెల్ కు జోడించింది symbrian  టెక్నాలజీ. 2001లో జపాన్ వారి docomo 3జి సర్వీసును  అందుబాటులోకి తెచ్చింది. 2002లో బ్లాక్బెర్రీ ద్వారా ఈ మెయిల్ సదుపాయం, 2007లో ఐ-ఫోన్ ద్వారా HD వీడియో, 2008లో గూగుల్ వారి android వల్ల మ్యాప్ , కాలెండర్, జీ మెయిల్ , వెబ్ బ్రౌసింగ్ సదుపాయాలు... ఇలా ఎన్నో సౌకర్యాలు అతివేగంగా, అందుబాటు ధరలకే  అరచేతికి రావడం వల్ల  సెల్ ఫోన్  ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యునికి చేరువయ్యింది.

అతి సర్వత్రా వర్జయేత్...!?
మితం మీరి ఏది చేసినా అది హితం కాదు. ఇది సెల్ ఫోన్ కూ  వర్తిస్తుంది. రోజుకు 30 నిమిషాల పాటు, 10 సంవత్సరాలు సెల్ ఫోన్ వాడితే బ్రెయిన్ కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో హెచ్చరించింది. అయితే ఈ విషయంలో భిన్న వాదాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా తలనొప్పి, నిద్రలేమి, అధిక రక్తపోటు, మెదడులో కణితి వంటి సమస్యలు సెల్ ఫోన్ ఎక్కువగా వాడే వారిలో ఉంటున్నాయని పరిశోధనలు చెప్ప్తున్నాయి. దీనికి కారణం విద్యుదయస్కాంత తరంగాల వికిరణం.

మొబైల్ ఫోన్  వాడుతున్నప్పుడు వెలువడే రేడియేషన్ వల్ల చెవి,మెదడు,కన్ను వంటి  శరీర భాగాలు వేడెక్కుతాయి. రెండు సెల్ ఫోన్ల నుండి వెలువడే వికిరణాలు ఒక కోడి గుడ్డును ఉడికించ గలవని ప్రయోగాలలో నిరూపించడం జరిగింది. అంటే ఈ లెక్కన మనం ఎక్కువ సేపు మాట్లాడుతుంటే తల భాగం ఎంత వేడెక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కనుగుడ్డు వేడెక్కడం వలన కాటరాక్టు సమస్యలు ఏర్పడి, చూపు దెబ్బతింటుంది అని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. అందుకే వీలైనంత వరకు సెల్లు కబుర్లు ఆపి, అవసరం మేరకే ఫోను వాడండి. పరికరాన్ని నేరుగా చెవి దగ్గర పెట్టుకోకుండా బ్లూ టూత్ వంటి  వైర్ లెస్  పరికరాలను ఉపయోగించండి. సిగ్నల్ అందని చోట, బ్యాటరీ చార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు, వికిరణం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, ఆ సమయాలలో మాట్లాడటం తగ్గించండి. ప్రతి సెల్ ఫోన్ పరికరానికీ SAR అంటే స్పెసిఫిక్ అబ్సార్ప్షణ్ రేట్ ఎంత అనేదీ రాసుంటుంది. అది తక్కువగా ఉండే పరికరాన్నే కొనండి. పిల్లలకు మరీ అత్యవసరం అంటేనే తప్ప సెల్ ఫోన్ ఇవ్వకండి. నేరుగా మాట్లాడటం కంటే మెసేజ్ పంపడమే మేలు.

రేడియేషన్ సంగతి అటుంచితే ఫోనులో మాట్లాడుతూ, లేక చెవుల్లో స్పీకర్లు పెట్టుకుని పాటలు వింటూ రోడ్డు దాటేవారు, రైలు పట్టాలు దాటేవారు, వాహనాలు నడిపేవారు  అనేక మంది ప్రమాదాలబారిన పడటం మనం వింటూనే ఉన్నాం. జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండవలసిన సమయాలలో కూడా సెల్ ను పక్కన పెట్టకపోతే ఎలా?

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మన సెల్ ఫోన్ మీద ఉన్నన్ని సూక్ష్మ క్రిములు మరెక్కడా ఉండవంట. సెల్తో పోలిస్తే చివరికి టాయ్లెట్ బేసిన్ కూడా బెటర్ అని సైంటిస్ట్ లు అంటున్నారు. ఎం చేస్తాం మరి! సెల్ ను  కడగలేం కదా.

ఈరోజు లేటెస్ట్ సెల్ ఫోన్ కొనడం ఒక ఫ్యాషన్. సెల్ ఫోన్లో ఎఫ్.ఎం. వింటూ రోడ్డుమీద నడవడం ఒక ఫ్యాషన్. రకరకాల రింగ్ టోన్లు పెట్టుకోవడం  అభిరుచికి నిదర్శనం. మూడ్ ని తెచ్చిపెట్టేవి, తెలిపేవి కూడా ఈ రింగ్ టోన్ లే. సరే! అందుబాటులో ఉన్న టెక్నాలజీని మన ఆనందం కోసం వాడటంలో తప్పు లేదు. కాకపోతే అంతగా బానిస కావడం, పిచ్చి అన్న రీతిలో వ్యసనంగా మార్చుకోవడం  అవసరమా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. సెల్ ను కొనే ముందే మనకు దాని అవసరం ఎంత వరకు అన్నది తెలుసుకోవాలి. చాలా మంది కొనేటప్పుడు అన్ని ఫీచర్ల కోసం చూస్తారు. కానీ వాడేటప్పుడు మాత్రం ఒకటి రెండు ఫీచర్లనే ఉపయోగించుకుంటారు.

ఇక మాట్లాడటం విషయానికి వస్తే రోజులో గంటల తరబడి ఫోన్ కు అతుక్కు పోయేవారున్నారు. అవతలి వారు ఎంత అత్మీయులైనా ఒకరికి ఎదురుగా ఒకరు ఉండి, ఒకరిని ఒకరు చూసుకుంటూ, తాకుతూ, ఒకరి కళ్ళలోని భావాలను ఒకరు చదువుతూ  భావ ప్రకటనలో ఎంతో ఆనందం వుంది.ఆ ఆనందాన్ని ఈ 'ఇ' తరం మిస్సవుతుందేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా  ఫోన్ ను ఫోన్ గానే వాడితే సెల్ అనేది ఒక వరం.