పేజీలు

16, ఏప్రిల్ 2011, శనివారం

ధనం మూలం ఇదం జగత్!


'కోరికలే బాధలన్నిటికీ మూలం'

బోధి వృక్షం క్రింద అయిన జ్ఞానోదయంతో బుద్ధుడు చెప్పిన మాట ఇది. కాని మనిషిగా పుట్టాక కోరికలు లేకుండా
బ్రతకడం సాధ్యమయ్యే పనేనా? అందుకే 'నాది అనే మమతేరా బాధకు మూలం' అంటూనే 'ఏదీ లేదనుకుంటే అంతా శూన్యం' అని కూడా అన్నాడు ఒక సినీ కవి. శూన్యం అనేది జీవితంలో ఏర్పడకుండా ఉండాలంటే ప్రతి మనిషికి కొన్ని కోరికలు తప్పనిసరిగా ఉండాలి. కాకపోతే కోరికలకు హద్దులు నిర్ణయించడం, వాటిని నెరవేర్చుకునేందుకు ఉత్తమ మార్గాలను అనుసరించడం అనే విషయాలను మర్చిపోతే మాత్రం అనర్ధాలే జరుగుతాయి. మనబోటి సామాన్యులకు విషయం తెలీదు కాబట్టి, అమృత వాక్కులను మనం బాబాల నోట విని ఆచరించడానికి ప్రయత్నిస్తాం.
అయితే ఇంతమంది బాబాలున్న దేశంలో ప్రస్తుతం
ఇన్ని అనర్థాలు ఎందుకు జరుగుతున్నాయి అని అమాయక భక్తులు ఎవరయినా అడగవచ్చు! అన్నిటినీ మించిన అనర్థం... దేవుడిలాంటి సత్య సాయిబాబా విషయంలోనే జరగడం ఏంటని ఇంకా అమాయకులు ఎవరైనా హాశ్చర్య పోవచ్చు. 'కలికాలం !' అంటూ నేరాన్ని కాలం మీద నెట్టేసి, ఓసారి లెంపలేసుకుని, ఎవరి పనుల్లో వారు పడిపోవచ్చు. కాని అనర్థాలు మన మానాన మనల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తేనే కదా! తిండి గింజల దగ్గర నుండి పెట్రోలు వరకు, వొళ్ళు దాచుకునే బట్ట నుండి తలదాచుకునే ఇల్లు వరకు ...ఇలా ఏది కొనాలన్నా ఆకాశాన్ని అంటే ధరలు, జీతం పెంచమంటే లాభాలేవీ అని ఖాళీ చేతులు చూపించే యాజమాన్యాలు, బరువులూ-బాధ్యతలు, పెళ్ళిళ్ళు-పేరంటాళ్ళు ...ఇలా డబ్బుతో ముడిపడిన ప్రతీదీ అనర్థాలను పదేపదే గుర్తుకు తెచ్చి ఎక్కడో మంట పుట్టిస్తాయి.

భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే, భూమ్మీదుండే మనిషి మాత్రం ధనం చుట్టూ తిరుగుతాడనే మాట విన్నప్పుడల్లా
' ! మన గురించి కాదులే!' అనుకుంటాం. కాని మాట మనకు వర్తించేదే. అందులో తప్పు కూడా లేదు. ఎందుకంటే మన అవసరాలూ, కోరికలన్నీ ధనంతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి, చివరికి బంధాలను పదిలంగా ఉంచుకోవాలన్నా, సమాజంలో గౌరవంగా బ్రతకాలన్నా డబ్బే కావాలి కాబట్టి .. డబ్బు కోసం ఆరాటపడటం సిగ్గుమాలినతనం ఏమాత్రం కాదు. అయితే సిగ్గు వదిలేసి సంపాదించే మనుషుల్ని చూస్తే మాత్రం ఏవగింపు కలుగుతుంది.
ఎలా సంపాదించాం అన్నది వదిలేసి, ఎంత సంపాదించాం అన్నదే చూస్తున్నారు. అందుకు వీలైన అడ్డదారులన్నీ
తొక్కుతున్నారు. ఎందుకు సంపాదించాం అన్నది ఆలోచించకుండా సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అందుకు పదవుల కోసం ఆరాటపడుతున్నారు.
వైయ్యస్ పోయేటప్పుడు ఎంత పట్టుకు పోయాడో చూసి కూడా ఆయన కుమారరత్నం కోట్లను కాపాడుకునేందుకే పాట్లు
పడుతున్నాడు. కోటి రూపాయల ఆస్తి కేవలం ఏడేళ్ళలో నాలుగు వందల కోట్లకు పైబడి ఎదిగింది అంటే ... దాదాపు లక్ష కోట్ల అక్రమ ఆర్జన ఉందన్న ఆరోపణలు ఈరోజు ఆయన ఎదుర్కుంటున్నాడు అంటే ...ఇదంతా ఎవరి డబ్బు?
తమిళనాడు రాజా వారు ఒక లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశానికి పెద్ద బొక్క పెట్టారు. అవినీతి ఆరోపణల నుంచి
ద్రుష్టి మరల్చడానికి అధికార పార్టీ ఆడిన నాటకమే 'అన్నా హజారే' ఉద్యమం. లేకపోతె రాంగోపాల్ వర్మలాంటి ప్రముఖులకు కూడా తెలీని ఒక సామాజిక కార్యకర్త ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం ఏంటి? దానికి యువత (కార్పోరేట్ యువత- వీరి వెనుక బడా పారిశ్రామిక వేత్తలు ఉన్నారండోయ్! ) ఇంతగా స్పందించడం ఏంటి? కేవలం మూడే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దిగి రావడం ఏంటి? అసలీ ఉద్యమానికి ఇంత పబ్లిసిటీ ఏంటి? ఆలోచించ తగిన విషయం అవునా ? కాదా?
అన్నా హజారే ఉద్యమానికి వచ్చిన స్పందన పదేళ్ళ నుంచీ నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ మహిళ 'చాను షర్మిల' దీక్షకు ఎందుకు రాలేదు? అవినీతిపై ప్రజలకు ఉన్న ఆగ్రహమే హజారే దీక్ష సఫలం కావడానికి కారణమా? అసలు
రాజకీయ అండ లేకుండా ఉద్యమం అయినా విజయవంతం అవుతుందా?
ఇక మరో అనర్థం ... సత్య సాయిబాబా ఏమయ్యాడో తెలీని పరిస్థితి రాష్ట్రంలో ఉండటం.
ఒక ట్రస్ట్ లక్షన్నర కోట్లు సంపాదించే దాకా ప్రభుత్వాలు ఏం చేసాయి?
ఒక వ్యక్తిని (సత్య సాయి అన్న విషయం పక్కన పెడదాం) కొంత మంది వ్యక్తులు దాచేసి , అతని గురించి విషయమూ
ఎవరికీ తెలియనివ్వక పోతుంటే చట్టం ఏం చేస్తుంది? అందులోను లక్షలాది మందికి ఆరాద్యుడైన సాయి అతను.
సరే! అసలు అనర్థానికి కారణం ఏంటి?
లక్షన్నర కోట్లు ట్రస్ట్ లో పోగు పడేదాకా బాబా కార్యక్రమాలూ చేయకుండా ఎందుకున్నారు? వచ్చిన డబ్బును
వచ్చినట్టు ప్రజల కోసం ఖర్చు పెడితే బాబాకు అవస్థ పట్టేదా?
ఇంత డబ్బును ఎందుకు దాచుకున్నట్టు? ఆయనకు కూడా ధన వ్యామోహం ఉందా?
అసలు ఇంత డబ్బు భక్తులే ఇచ్చారా?
మరి మథర్ థెరిస్సా దగ్గర ఇంత డబ్బు ఎందుకు లేకుండా పోయింది? మథర్ థెరిస్సా సేవల కన్నా బాబా మాయలే
గోప్పవనా? ఆమెకు దూరంగా నే ఉన్న రాజకీయ నాయకులు బాబాను మాత్రం ఎందుకు తరచూ దర్శించుకునే వారు?...ఇలా లక్షన్నర కోట్ల ప్రశ్నలు. లీలగా దొరుకుతున్న జవాబు ఏంటంటే ...
బాబాలు కూడా మనుషులే . వారూ కోరికలకు, వ్యామోహాలకు అతీతులు ఏమాత్రం కాదు. భక్తులారా! మీ నమ్మకం
విలువ లక్షన్నర కోట్లు. అదే నమ్మకం మీమీద మీరు పెంచుకుంటే ...ఎంత సంపాదించే వారో!? ఆలోచించండి.
సత్య సాయి ఇలా చావు బతుకుల మద్య ఉంటె , ఆయన ఆశీర్వాదాలు అందుకున్న గాయని చిత్ర కూతురు ఓ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయింది. ఎక్కడ దేవుని మహిమ?