

ప్రభుత్వాలకి డబ్బున్న పెద్దలంటే మరీ మరీ ప్రేమ. పేదలకు ఉచితంగా భూములిచ్చినట్టే, డబ్బులున్న పేదలకు కూడా ప్రభుత్వం అతి ఖరీదైన భూముల్ని కారు చవకగా , ఒక్కోసారి అప్పనంగా అప్పగించేస్తుంది. పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉద్యోగాలు ... అని ఇలా అనేక కారణాలు చెప్పి రాయతీలిస్తుంది.
అటు పేదలకు, ఇటు ధనికులకూ కూడా ఈ ఉదార పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి డబ్బునిచ్చేది మాత్రం మధ్య తరగతి ప్రజలు. వాళ్ళకు పరువే ముఖ్యం. నియమాలను అతిక్రమించడం వాళ్లకు తెలీదు. చట్టం అంటే గౌరవం. పోలీసంటే భయమ్. అందుకే పస్తులుండి అయినా పన్నులు కడతారు. అద్దె ఇంట్లో ఉంటూ కూడా ఆదాయపు పన్ను కడతారు. ప్రతి పైసాకు లెక్క చెప్తారు. అయినా ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు వాళ్ళు లెక్క లోకి రారు.
పన్నులు పెరిగినా, ధరలు పెరిగినా, చార్గీలు పెరిగినా ఏ రాయితీ లేకపోవడం మూలంగా అన్ని భారాలను చచ్చినట్టు మోసే మధ్య తరగతి వాడంటే అందరికీ లోకువే. అందుకే ఇల్లు హక్కు అనేది వీళ్ళకు వర్తించదు. ఆరోగ్య పథకాలు వర్తించవు. విద్య ఉద్యోగాలలో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. ఆ మాటకొస్తే వీళ్ళు జనాభా లెక్కల్లోనూ ఉండరు. ఎలాగంటారా? ఉదాహరణకు మన రాష్ట్ర జనాభా 8. 46 కోట్లు. మన రాష్ట్రంలో ఉన్న తెల్ల కార్డులు 2. 3 కోట్లు. అంటే 2. 3 కోట్ల నిరుపేద కుటుంబాలలో, ఇంటికి కనీసం నలుగురు చొప్పున నిరుపేదలే 8. 12 కోట్ల మంది ఉన్నారన్న మాట. ( మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత ఈ అరవై ఏళ్ళలో సాధించిన ఘనత ఇదే ) మిగిలినవాళ్ళు కచ్చితంగా మిలియనీర్లే. నీకెలా తెల్సని అడుగుతారేమో! రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రముఖులు, రాజకీయ నాయకులు, వీరి సేవలో నిత్యం తరించే అయ్యాఎస్ లు... ఇలా లెక్కేస్తే, నా లెక్క సరిపోతుంది. ఇక మధ్యతరగతి వాళ్ళెక్కడ ఉన్నారు చెప్పండి? అందుకే మన ప్రభుత్వాలు ఈ మిధ్యాతరగతి గురించి ఏమీ ఆలోచించవు. మొన్నటికి మొన్న... ఆదాయపు పన్ను పరిమితిని పెంచమని అడిగితే, మన ఆర్థిక మంత్రి చిదంబరం గారు కొంపలు మునిగి పోతాయన్నంత భావాన్ని ఒలికించారు. ఆయనకూ తెలుసు. పైనోడు ఖర్చులు చూపించి తప్పుకుంటాడు. కిందోడు లెక్కే చూపించడు. ఇక బొక్కసాన్ని నింపేది మధ్యోడే. పరిమితి పెంచేసి వాడికి వెసులుబాటునిస్తే మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా? లక్ష కోట్ల కుంభకోణాలకి ఆస్కారమివ్వడం ఎలా?
పేదోడి దగ్గర ఓటు ఉంది. అది అధికారాన్ని ఇస్తుంది. పెద్దోడి దగ్గర నోటు ఉంది. అది ఓటును కొనుక్కోడానికి, అధికారంలో కోట్లు కూడేసు కోడానికీ వ్యక్తిగతంగా పనికొస్తుంది. అంచేత రాజకీయాలన్నీ పేదోడిని మచ్చిక చేసుకోడానికి, పెద్దోడిని ప్రసన్నం చేసుకోడానికి చూస్తాయి. మధ్య తరగతోడు అటు ఓటేయడానికి రాడు. ఇటు డైరెక్ట్ గా నోటు ఇవ్వడు. అందుకే వాడికి ఎలాంటి హక్కూ ఉండదు. నిత్యం సమస్యల సమరంలో కొట్టుకుసచ్చే మధ్యతరగతి వాడు విడిగా ఉద్యమాలు చెయ్యగలడా? అది కూడా చాతకాదు కాబట్టే ఇంత అలుసు.
అయ్యా! గౌరవనీయమైన పాలకులూ! ప్రజాసేవలో పునీతమవుతున్న నాయకులూ! అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అన్న సామెత ఉంది కాబట్టి అడుగుతున్నాం. పేదోడు అడగకపోయినా వరాలు కురిపిస్తారు. పెద్దోడు అడగగానే ఆఘమేఘాల మీద పనిచేసి పెడతారు. అలాగే మధ్య తరగతోడి మీదా కాస్త దయచూపండి. త్రిశంకు స్వర్గం లాంటి బతుకులను కాస్త దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళూ మనుషులేనని... సారీ! ఓటర్లేనని గుర్తుంచుకోండి. వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోండి. వాళ్ళకూ తలదాచుకునేందుకు నీడ కావాలి. ఆ ఇళ్ళ గురించీ ఆలోచించండి.కనీసం ఇంటి స్థలమైనా ఇవ్వండి. ధరల గురించి ఆలోచించండి. మధ్య తరగతి పించన్ల గురించీ ఆలోచించండి. వారికీ సామాజిక భద్రత ఇవ్వండి. అయ్యా! మధ్య తరగతిని రక్షించండి!