
ఇన్నాళ్ళు ఉద్యమాలు నడిపించి, ఉద్యమ ఫలాలను అధికారం రూపేణా ఆరగిస్తున్నా కెసిఆర్ కు ఇంకా కొట్లాట తనివి తీరలేదు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో భాగంగా జయశంకర్ సారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కెసిఆర్ చేసిన ప్రసంగం ఈ ముచ్చటే చెబుతోంది. తెలంగాణ సిద్ధాంత కర్త జయంతి కాబట్టి తెలంగాణ ప్రజలలో స్ఫూర్తి నింపే మాటలు మాట్లాడాల్సిందే. అయితే అవి భవిష్యత్ కార్యాచరణల గురించి ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ కూడా మేమింకా ఆంధ్రోళ్ళ మీద కొట్లాడతం అనుడే బాగాలేదు. కొట్లాడనీకి తెలంగాణ సమస్యలు మస్తున్నయ్. నిన్న గాక మొన్న విద్యుత్ కోతలపై రైతులు కొట్లాడితే, ఆళ్ళ మీదికి పోలీసోల్లు కొట్లాడనీకి పోయిన్రు. ఒక వైపు సిటీల్ల గూడా కరెంటు కోతలున్నయ్. ఇంకో దిక్కు రుణాల రీషెడ్యూల్ విషయంలో ఆర్బీఐతో లొల్లి ఉండనే ఉంది. మరో దిక్కు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లొల్లి సుప్రీం దాకా వెళ్లి నెత్తిన మొట్టికాయలు వేయించుకునే వరకు వచ్చెనాయె. ఇవన్నీ ఉండగా ఆంధ్రోనితోని లొల్లి ముచ్చట దేనికి? ప్రజల ఆలోచనలను సమస్యల నుండి ప్రక్కదారి పట్టించుడే అని అనిపిస్తాంది.
మా తెలంగాణలో యూనివర్సిటీ పేరు మార్చుకుంటే నీ ఏడుపేంది అంటన్నవ్. 'ఆ యూనివర్సిటీ అందరం కలిసున్నప్పుడు, అందరం కట్టిన పన్నుల లెక్కలోంచి పైసలు దీసి కట్టిన యూనివర్సిటీ కదా. నీ ఒక్కనిదే అన్నట్టు నీకిష్టమైన పేరు పెడితే ఎలా? నీకంత సంబరముంటే ఇక మీదట తెలంగాణలో ఉండే ప్రజలు కట్టే పన్నులు పెట్టి కొత్తగా ఏమైనా కట్టుకో, ఆటికి నీ ఇష్టమొచ్చిన పేరు పెట్టుకో ' అని ఆంధ్రోళ్లు అనరా? మీ విగ్రహాలను మీరు తీస్కపోండి అన్నడు సారు. 'సరే మా విగ్రహాలతో పాటు మేం కట్టించిన వన్నీ, అభివృద్ది చేసినవన్నీ మాకిచ్చెయ్ తీస్కపోతం' అని వాళ్ళంటే ఏం చెప్తం? తెలంగాణలో విద్యుత్ కష్టాలు చంద్రబాబు వల్లే అన్నడు సారు. మాకేవో సమస్యలు ఉండి మా ప్లాంట్లలో ఉత్పత్తి ఆగిపోతే మధ్యలో నీ ఏడుపెంది అని అల్లంటే మనకెట్లుంటది?
మీ పిల్లల ఫీజులు మీరే కట్టుకొండి అంటున్నరు. ఎనకటికి కాళోజి సారు 'క్విట్ తెలంగాణ' అంటే జయశంకరు సారు ఏం చెప్పిండు? 'ఆ మాట తప్పు. ఈడకొచ్చి స్థిరపడినోల్లందరూ మనోల్లే' అన్నడు కదా! యాదికి లేదా కెసిఆర్ సారూ? ఆయన తెలంగాణను ప్రేమించిండు కానీ, ఆంధ్రోల్లను గానీ, మలెవల్లను గానీ ద్వేషించలే. అట్ల సెయ్యమని ఎన్నడూ చెప్పను గూడా చెప్పలే. మరి ఆయన పుట్టిన రోజు నాడు ఇవేం మాటలు సారూ?