అది 1999వ సంవత్సరం. దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ ప్రాంతంలో ఓ రాత్రి పబ్ లో కూర్చున్నారు కొంతమంది మిత్రులు. వారి మాటల్లో పుట్టింది 'మొవంబర్' అన్న పదం. నవంబర్ నెల పొడుగునా మీసాలను కత్తిరించకుండా పెంచి, తద్వారా మిగిలిన డబ్బులతో పాటు, మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బుల్ని స్వచ్ఛందంగా ఒక సామాజిక కార్యక్రమం కోసం దానమివ్వాలి. అదీ 'మొవంబర్' లక్ష్యం. అంతే అప్పటికప్పుడు 80 మంది సభ్యులతో 'మొవంబర్ కమిటీ' ఏర్పడింది. RSPCA అంటే 'రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ అఫ్ క్రూయల్టీ టు ఏనిమల్స్' కోసం వారంతా ప్రత్యేకమైన నినాదాలతో కూడిన టి షర్టులను అమ్మి తద్వారా పోగైన నిధిని సంస్థకు అందించారు. త్వరలోనే ఇది దేశవ్యాప్త చర్చ అయ్యింది. నవంబర్ నుంచి 'ఎన్' అనే అక్షరాన్ని తీసి 'ఎమ్' అనే అక్షరాన్ని చేర్చడానికి కారణం ఆంగ్లంలో మీసాలను 'moustache' అంటాం. అలా నవంబర్ కాస్తా 'మొవంబర్' అయ్యింది.
మొవంబర్ ఫౌండేషన్
ఇది జరిగిన కొన్నాళ్లకు 2004లో విక్టోరియా లోని మెల్బోర్న్ ప్రాంతానికి చెందిన 30 మంది మగవారితో కూడిన మరో బృందం మగవారిలో ప్రోస్టేట్ కాన్సర్ పట్ల అవగాహన కలిగించడానికి, మానసిక కృంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడుతోన్న మగవారిలో స్థయిర్యం నింపేందుకు నవంబర్ నెల 30 రోజులూ మీసాలు పెంచడమే కాకుండా పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బృందమే తరువాతి కాలంలో 'మొవంబర్ ఫౌండేషన్ చారిటీ'గా పేరుపొందింది.
కాన్సర్ అవగాహన కార్యక్రమాలను మామూలుగా నిర్వహిస్తే సరిపోతుంది కదా. మీసాలు గడ్డాలు పెంచడం దేనికి అనేగా మీ సందేహం! కాన్సర్ సోకిన వారికి అందించే రేడియేషన్ చికిత్స వల్ల వారి వెంట్రుకలు రాలిపోతాయి. రూపురేఖలు మారిపోతాయి. అందువల్ల వారికి సంఘీభావం తెలపడానికే మొవంబర్ సభ్యులు మీసాలు, గడ్డాలు పెంచుతారు. ముఖాలలో మార్పుతో పాటు సమాజంలో మార్పు కనబడాలనేది వారి సిద్ధాంతం. 'మగవారి ఆరోగ్య చిత్రాన్ని మార్చండి' ( change the face of men's health) అన్నది వారి నినాదం.



ఇందులో పాల్గొనే వారిని 'మొ బ్రోస్' (Mo Bros) అని పిలుస్తుంది మొవంబర్ ఫౌండేషన్. అన్నట్టు 'మొ సిస్టా'లు కూడా అంటే ఆడవారు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ ఏడాది ' Grow a Mo, save a Bro' అన్న నినాదంతో ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చింది MOVEMBER FOUNDATION. మగవారిలో ప్రోస్టేట్ కాన్సర్, టెస్టిక్యూలర్ కాన్సర్, మెంటల్ హెల్త్ అండ్ సూసైడ్ ప్రివెన్షన్ అన్న విషయాలపై పోరాడుతూ తోటి మగవారిని చిన్న వయసులోనే మరణించకుండా ఆపేందుకు గత 13 సంవత్సరాలుగా దాదాపు 1200 కార్యక్రమాలను చేపట్టింది మొవంబర్ ఫౌండేషన్. మీరు కూడా ఈ మొవంబర్ కార్యక్రమంలో పాల్గొనాలంటే 30 రోజుల పాటు మీసం పెంచండి, ఏదో ఒక కార్యక్రమాన్ని వ్యక్తిగతంగానో, జట్టుగానో చేపట్టి విరాళాలు పోగుచేయండి. మొవంబర్ ఫౌండేషన్ కు పంపండి. అంత చేయలేం అనుకుంటే కనీసం మొవంబర్ ఫౌండేషన్ విరాళాల కోసం అమ్ముతున్న మొవంబర్ టి షర్టులను, టోపీలను, జేబు రుమాళ్ళను కొనవచ్చు. వీటన్నిటి కంటే ముందు www. movember.com కు వెళ్లి మీ పేరు నమోదు చేసుకోండి.
ద ఇంటర్నేషనల్ మాన్ ఆఫ్ మొవంబర్

ఇకపొతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నటులు, క్రీడాకారులు ఎందరో మొవంబర్ ఫౌండేషన్ కు మద్దతునిస్తూ 'మొ బ్రోస్' గా మారారు. భారతదేశానికి సంబంధించి క్రికెటర్ రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, నటుడు రణవీర్ సింగ్ లు మొవంబర్ ఫౌండేషన్ మద్దతుదారులే.