
పారిస్ లో అరకు కాఫీ స్టోర్:
మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా నిర్మాణ సంస్థ చైర్మన్ మాగంటి రాజేంద్రప్రసాద్ లు పారిస్ లో అరకు కాఫీ మొదటి స్టోర్ ప్రారంభం అయ్యేందుకు కారణమయ్యారు. ఎందుకంటే ఈ సంస్థల ఆధ్వర్యంలో అరకు ప్రాంతంలో 20,000 ఎకరాలలో కాఫీ పంట సాగవుతోంది. ఈ సంస్థలే అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్ ను తెచ్చిపెట్టాయి. ఐదు వేరియెంట్లలో అమ్ముడుపోయే అరకు కాఫీ ధర పారిస్ లో కిలో రూ.7,000లు అంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతుంది కదా!
![]() |
పారిస్ లో అరకు కాఫీ స్టోర్ |
బ్రిటీషోడు ముందే గుర్తించాడు...
మన్నెం గిరిజనులకు ఉపాధి మార్గం చూపాలన్న ఆలోచనతో బ్రిటిష్ అధికారులు కాఫీ పంటను ప్రోత్సహించారు. మట్టి మహత్యమో, నీటి స్వభావమో తెలియదుకానీ తెల్లదొరలు ఆ రుచికి, కమ్మదనానికి ఫిదా అయిపోయారు. కాఫీ గింజల్ని మూటగట్టి ఓడలకు ఎక్కించారు. ఆ రోజుల్లో యూరప్‌లోని సంపన్న కుటుంబాలకు పొద్దున్నే కప్పు నిండా అరకు కాఫీని ఆస్వాదించడం ఓ ఉత్తమాభిరుచి కింద లెక్క. కానీ ఆ తర్వాత పట్టించుకునే పాలకులు లేక చల్లారిపోయిన కాఫీలా అరకు పేరు మూలనపడిపోయింది. మళ్లీ ఇప్పుడు పునర్వైభవం మొదలైంది.చంద్రబాబుతో పునర్వైభవం:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ‘నేను అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాను’ అని స్వచ్ఛందంగా ప్రకటించారు. 2016 జనవరి నెలలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో అతిథులు, గవర్నర్, కేంద్రమంత్రులకు దగ్గరుండి మరీ అరకు కాఫీ రుచి చూపించారు. ఫిబ్రవరిలో జరిగిన ఐఎఫ్ఆర్లో ప్రధానికి కూడా కాఫీ రుచి చూపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా వచ్చే అతిథులకు గిఫ్ట్ ప్యాక్‌గా అరకు కాఫీనే ఇవ్వడం మొదలు పెట్టారు. విశాఖ ఏజెన్సీలో పండుతున్న ‘అరబికా’ కాఫీ 2009-10 సంవత్సరం నుంచి వరుసగా ఐదుసార్లు ‘ఫైన్ కప్ ఆఫ్ కాఫీ’ అవార్డును సొంతం చేసుకుందంటే అరకు కాఫీ మహిమెంతో తెలుసుకోవచ్చు.జియో ట్యాగ్ కోసం టగ్ ఆఫ్ వార్:
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. విశాఖ జిల్లా అరకు లోయలో పండే 'అరకు ఆర్గానిక్ కాఫీ' విషయమై భౌగోళిక విశిష్ట గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ - GI) మాకు చెందాలంటే మాకు చెందాలని అటు కేంద్ర కాఫీ బోర్డు, ఇటు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (GCC) రచ్చకెక్కాయి.నిజానికి అరకు కాఫీకి జిఐ ఇవ్వాలంటూ 2016 ఏప్రిల్ లోనే చెన్నైలోని జిఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకుంది. ఇదే విషయమై 2018, జనవరి ఒకటో తేదీన కేంద్ర కాఫీ బోర్డు దరఖాస్తు చేసింది. ఈ అరకు కాఫీ ఒరిస్సాలో సైతం పండుతుండగా ఏపీ గిరిజన సహకార సమాఖ్యకు జిఐ ఎలా ఇస్తారంటూ కేంద్ర కాఫీ బోర్డు వాదిస్తోంది.
''జిఐ ట్యాగ్ కోసం మేము ముందుగా దరఖాస్తు చేసుకున్నాం. దీనిపై తమ సిఫారసును అందచేయాలని జీఐ రిజిస్ట్రీ దరఖాస్తు ప్రతిపాదనను కాఫీ బోర్డుకు పంపించింది. మద్దతు పలకాల్సిన కాఫీ బోర్డు కాస్తా ప్లేటు ఫిరాయించి తానే జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయడం విడ్డూరమని, తమ హక్కుల కోసం మేం న్యాయపోరాటం చేస్తాం. లాభాపేక్ష లేకుండా గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వ సహకార సంస్థ మాది.'' అని జీసీసీ అంటోంది. మరి ఈ అద్భుతమైన కాఫీపై గుర్తింపు ఎవరికి సొంతమవుతుందో రాబోయే రోజుల్లో తేలుతుంది.
