పేజీలు

1, నవంబర్ 2014, శనివారం

మా తెలుగు తల్లికి మల్లెపూదండ వేసేదెప్పుడు !?

దాదాపు 60 సంవత్సరాలుగా నవంబరు 1న రాష్ట్రావతరణ ఉత్సవాలు తెలుగునాట ఘనంగా జరిగేవి. మా తెలుగుతల్లికి మల్లెపూదండ అన్న శంకరంబాడి సుందరాచార్య రచించిన రాష్ట్రీయ గేయాన్నీ, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అన్న వేములపల్లి శ్రీకృష్ణ గీతాన్నీ వాడవాడలా విని పులకరించేది ప్రతి తెలుగు హృదయం. కానీ ఈసారి (2014, నవంబరు 1న )  ఆ సంబరాలు లేవు.    

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం అమలులోకి వచ్చిన జూన్ 2 వ తేదీని రాష్ట్ర ఆవిర్భావ దినంగా పరిగణిస్తూ అవతరణ ఉత్సవాలను ఆ రోజునే నిర్వహించాలని తీర్మానించుకుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణాలేంటో తెలీదు కాని తెలుగువారికిది సబబుగా అన్పించట్లేదు.  ఎందుకంటే  ఆ తేదీన తెలుగు జాతి ముక్కలయ్యింది. ముఖ్యంగా ప్రతి సీమాంద్రుడు రాజకీయ చదరంగపు బల్లపై ఓడిపోయిన పావులా బిక్కసచ్చి నిలబడ్డాడు. ఒక ఆత్మీయ బంధం తెగి విలవిలలాడాడు.  అలాంటి తేదీన ఉత్సవం ఎలా చేసుకుంటాడు?

ఆవిర్భావం అన్నా అవతరణ అన్నా పుట్టుక అన్న అర్థం వస్తుంది. ఈ కోణంలో ఆలోచిస్తే తెలంగాణకు కూడా విమోచన దినం (సెప్టెంబర్ 17) ఉంటుంది కాని ఆవిర్భావ దినం ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు విడివిడిగా ఉన్న ఈ రెండు ప్రాంతాలు  1956లో ఒక్కటై తిరిగి 2014 జూన్ 2న వేరయ్యాయి అంతే!  దీన్ని పిలిస్తే 'తెలంగాణ  వేర్పాటు దినం' గా పిలవాలి. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఈ తేదీతో అసలే సంబంధమూ లేదు. ఎందుకో తెలియాలంటే ఒక్కసారి తెలుగు రాష్ట్ర ఆవిర్భావం ఎలా జరిగిందనేది తెలుసుకోవాలి.

తెలుగువారికి ఒక ప్రత్యేక ప్రాంతం కావాలన్న కోరిక 1911 నాటిది. దక్షిణ భారతదేశంలో తెలుగువారు నివసించే ప్రాంతాలన్నిటినీ కలిపి 'అఖిలాంధ్ర రాష్ట్ర పటం' అని తయారు చేసుకున్నారు నాటి నాయకులు కొందరు. ఆ తర్వాత 1912లో కృష్ణ , గోదావరి జిల్లాల ప్రముఖులు మొదటిసారిగా ఆంద్ర రాష్ట్ర ఏర్పాటు గురించి తీర్మానం తయారు చేసుకున్నారు. 1913 మే నెల 6న గుంటూరు జిల్లా, బాపట్లలో కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలో మొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. అందులో ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదన పరిశీలించడానికి ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు.

ఆ తర్వాత 1917 వరకూ ప్రతి యేడూ ఈ సభలు జరుగుతూ వచ్చాయి. మద్రాసు రాష్ట్రంలోని 11 తెలుగు జిల్లాలు కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడాలని తీర్మానాలు జరిగాయి. అప్పటినుంచి భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు అటు కాంగ్రెస్ కమిటీకి, ఇటు నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూ ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. అవి తిరస్కరింపబడుతూనే వచ్చాయి. ఎలాగయితేనేం 1918లో బాల గంగాధర్ తిలక్ మద్దతుతో ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. అంటే రాజకీయంగా తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది.   తెలుగు వారికిది తోలి విజయంగా చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే మద్రాసుతో తెగతెంపులు చేసుకునేందుకు, కోస్తా వారితో కలిసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేందుకు రాయలసీమ ప్రజలు  అభ్యంతరాలు వ్యక్తపరుస్తూ వచ్చారు. వారిని కలుపుకు పోడానికి ఒక ఒప్పందం చేసుకోవలసి వచ్చింది. రాష్ట్రం ఏర్పడితే నదీజలాలు ఇతర వాటాలు ఎ రకంగా ఉండాలో నిర్ణయించుకుంటూ నవంబరు 16, 1932న శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు.

ఎన్నో అభ్యర్థనలు, తీర్మానాల తర్వాత  నూతన రాజ్యాంగంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పొందుపరుస్తామని 1947, ఆగష్టు 14 న నెహ్రూ చెప్పారు అయితే స్వాతంత్ర్యం వచ్చాక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. కమిటీల మీద కమిటీలు వేయడం,  అవి వ్యతిరేక నివేదికలు ఇవ్వడం మామూలయి పోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించమని 1948లో ధార్ కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా వ్యతిరేక నివేదికలే ఇచ్చింది. తెలుగువారి ఆకాంక్షలకు కాంగ్రెస్ అధిష్టానం ఏనాడూ విలువనివ్వలేదనడానికి ఇదే  నిదర్శనం. 

ప్రత్యేక రాష్ట్రం కావాలని రేపల్లెకు చెందిన  గొల్లపూడి సీతారామశాస్త్రి అనే  గాంధేయవాది  1951 ఆగష్టు లో  నిరాహారదీక్ష చేశారు. అయితే నెహ్రు చతురత వల్ల, వినోబా భావే దౌత్యం వల్ల  ఆయన  35 రోజులకే దీక్షను విరమించారు. మళ్ళీ ఓ కమిటీ, అది కూడా అదే పల్లవి.

ఈ లోగా 1952లో  దేశవ్యాప్తంగా  మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. మద్రాసు అసెంబ్లీలో తెలుగువారికి 140 సీట్లవరకు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ కు దక్కింది కేవలం 43 మాత్రమే. ఈ విధంగా తమ ప్రత్యేక  రాష్ట్ర కాంక్షను నాటి కాంగ్రెస్ పార్టీకి, ఇంకా చెప్పాలంటే నెహ్రూకు  ప్రగాఢంగా  చెప్పారు తెలుగువారు. మద్రాసులో మొత్తంగా కాంగ్రెస్ కు 152 సీట్లు వస్తే, కాంగ్రెసేతర కమ్యూనిస్ట్ పార్టీల వంటివన్నీ కలిసి యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ గా ఏర్పడ్డాయి. వాటి బలం 164. నాయకుడు టంగుటూరి ప్రకాశం. ఆయన అప్పటికే కాంగ్రెస్ ను వ్యతిరేకించి ప్రజాపార్టీని స్థాపించాడు. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోలేక పోవడంతో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. మద్రాసు ముఖ్యమంత్రిగా సి. రాజగోపాలాచారి నియమించబడ్డారు.

కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టును చేపట్టి కృష్ణా జలాలను తమిళనాడుకు తరలించాలని ప్రయత్నిచారు రాజగోపాలాచారి. తెలుగువారు రగిలిపోయారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ జ్వాలకు ఇది ఆజ్యం పోసినట్టయింది.         

ఇక లాభం లేదనుకున్న పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. 52 రోజుల తర్వాత డిసెంబరు 15న  అమరులయ్యారు. ఆయన ప్రాణత్యాగం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తెలుగువారందరినీ ఉద్యమాలకు పురికొల్పింది. అప్పటివరకు తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఆంధ్రుల సామ్రాజ్యవాదంగా అభివర్ణించి అయిష్టతను చూపిన నెహ్రూకు మెట్టు దిగక తప్పలేదు. 1952, డిసెంబరు 19న మద్రాసును విభజించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని పార్లమెంటులో ప్రకటించారు. ఫలితంగా 1953, అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా , 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం  ఆవిర్భవించింది. విజయనగరం(1979), ప్రకాశం(1970) జిల్లాలు తర్వాత ఏర్పడ్డాయి.

కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావదినం అక్టోబర్ 1 న జరగడం సమంజసం. ఎందుకంటే నాడు ఎల్ ఎస్ మిశ్రా కమిషన్ సూచించిన విధంగా భౌగోళికంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్  (కాస్త అటు ఇటుగా)                      
లేదా యధాప్రకారం నవంబర్ 1 న అయినా జరపవచ్చు. ఎందుకంటే అటు సీమాన్ధ్రులు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలోనే ఇటు తెలంగాణ లోనూ ప్రత్యేక తెలుగు రాష్ట్ర కాంక్ష రగిలింది. ఉర్దూ అధికార భాషగా ఉన్న నిజాము ప్రభుత్వంలో తెలుగు ప్రజలు తమ భాషను కాపాడుకోడానికి, గౌరవింపబడడానికి ఆరాటపడేవారు. 1921 నవంబరులో జరిగిన ఒక సమావేశంలో అల్లంపల్లి వెంకట రామారావు అనే ఆయన తెలుగులో మాట్లాడితే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ పౌరుషంతోనే మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు వంటి వారి నేతృత్వంలో ఆంధ్ర జన సంఘం స్థాప్పించబడింది.  అటు తెలంగాణ విముక్తి పోరాటంతో సమాంతరంగా తెలుగువారందరికీ ఒక రాష్ట్రం కావాలంటూ విశాలాంధ్ర కాంక్ష కూడా ప్రబలుతూ వచ్చింది. 1952 లో జరిగిన సాధారణ ఎన్నికలలో విశాలాంధ్రను సమర్ధించిన కమ్యూనిస్టులు, ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ కంటే బాగా పుంజుకున్నారు. ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోనూ, అటు మద్రాసు రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఎదురయ్యేసరికి కాంగ్రెస్ కూడా విశాలాంధ్ర పాటందుకుంది. ఫలితంగా రాష్ట్రాల పుర్విభజన చట్టం (ఎస్సార్సీ ) ఏర్పడి సయ్యద్ ఫజల్ అలీ సూచనల ప్రకారం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇది తెలుగుజాతి పూర్తి విజయం.

కాబట్టి జూన్ 2 అనేది కేవలం రెండు ప్రాంతాల విభజన తేదీ మాత్రమే. ఆంధ్రులకు గానీ, తెలంగాణా వారికి గానీ అవిర్భావదినం కాబోదు.
         
  

22, అక్టోబర్ 2014, బుధవారం

ప్రకృతి మీద తొలి తిరుగుబాటు యత్నం దీపావళి!

ప్రతి నెలా అమావాస్య నాడు కనీసం చంద్రుడిని కూడా లేకుండా చేసి జగమంతా  చీకటిని నింపుతున్న ప్రకృతికి ఒక్క రోజైనా సమాధానం చెప్పాలనుకున్నారు మనుషులు. వెలుగులను అందరికీ పంచాలనే స్వార్థరహిత తలంపుతో ప్రతి ఒక్కరూ తన ఇంటిలోనే కాకుండా వీధుల్లోనూ దీపాలు పెట్టారు. సంఘటితంగా భూమి పైనే చుక్కల్ని పరిచారు. పున్నమిని తలపించింది ఆ రేయి. అదే దీపావళి. నిస్వార్థ బుద్ధికీ, సంఘటిత శక్తికీ ప్రతీక ఈ పండుగ. ఈ రెండూ మనతో ఉంటే మన ఇంటే కాదు, జగమంతా నిత్య దీపావళి. మిత్రులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
       

20, సెప్టెంబర్ 2014, శనివారం

చక్కనయ్యా చందమామా... ఎక్కడున్నావు... ?


''మొన్న పున్నమి రాతిరి  
నీ ఒడిని నిద్దుర పోతిమి 
తెల్లవారి లేచి చూచి 
తెల్లబోయాము... ఘొల్లుమన్నాము... ''
భార్యాబిడ్డల్ని వదిలేసి ఉద్యోగ సంపాదనలో ఊరూరా, రోడ్లు పట్టి తిరుగుతున్న తండ్రి ఒకచోట. తమని వదిలేసి వెళ్ళిపోయిన నాన్న మీది బెంగతో తల్లడిల్లుతూ, అన్ని దిక్కులా వెతుకుతూ, దిక్కుతోచక రోడ్డున వెళుతున్న  పిల్లలు మరోచోట. తండ్రిని వెదుకుతున్న ఆ  పిల్లల నోట వచ్చే పాట ఇది. అపుడాయన హావభావాలు చూసి, అయ్యో పాపం! ఆయనకేదయినా ఉద్యోగం దొరికితే బాగుండు అనుకుంటూ చెమర్చిన కళ్ళతో చూశాను.   సినిమా పేరు భార్యాబిడ్డలు. 
'ఆకులు పోకలు ఇవ్వద్దూ ... నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ...' అంటూ అదే సినిమాలోని హుషారు పాటని నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు అల్లరి చేస్తూ పాడుకున్నా. 

ఆ తర్వాత 'రైతు కుటుంబం' 
జిల్లాయిలే జిల్లాయిలే...  అంటూ కాంచనతో ఆయన కవ్వింపు పాట. 

గాంధీ పుట్టిన దేశమా ఇది? నెహ్రు కోరిన సంఘమా ఇది?... పవిత్రబంధం సినిమాలో ఆయన సంఘాన్ని నిలదీస్తే, అదే పాటని స్కూల్లో ఆవేశంగా పాడి చప్పట్లు కొట్టించుకున్నా. 

మంచి రోజులోచ్చాయ్, దత్తపుత్రుడు, దసరాబుల్లోడు ... అదేంటో చిన్నప్పుడు అన్నీ ఆయన సినిమాలే చూసాం. ఎందుకంటే మా ఇరుగుపొరుగు అమ్మలక్కలంతా ఆయన అభిమానులు. విడుదలైన ఆయన సినిమాలన్నిటికీ వాళ్ళు వెళ్తూ అమ్మను పిలిచే వాళ్ళు. అమ్మ కొంగు పట్టుకుని నేనూ వెళ్ళాను. 

విశాఖపట్నం, కాకినాడ నగరాలనుంచి విజయవాడకు వచ్చింది మా కుటుంబం. మరుసటి రోజు వీధిలో పరిచయం చేసుకున్న నాలుగో తరగతి వోడు అడిగాడు. 'నువ్వు ఏ పార్టీ' అని. పార్టీ అంటే అప్పుడే రెండో తరగతి పాసయిన నాకు అర్థం కాలేదు. 
'అదే ఎన్టీయారా ఏయన్నారా? నువ్వు ఎవరి పార్టీ?' 
'వాళ్ళెవరు?'   
'వాళ్ళు తెలీదా?' సినిమా పేర్ల సాయంతో చెప్పారు వాళ్ళు. 
' ఓసి వాళ్ళేనా! రామారావ్, నాగేస్వర్రావులను అలా కూడా పిలుస్తారా? అయితే ఇంకా డౌట్ ఏంటి? నేను ఏయన్నార్ పార్టీ' అన్నాను.   
' యే ... ఏయన్నార్ పార్టీనా? మీ హీరోకి అసలు ఫైట్ చేయడమే రాదు.' ఎగతాళి చేశారు.  
'ఫైట్లు రాకపోతేనేం ప్రేమించడం వచ్చు.' అన్నాను.

అవును! అప్పటికే ప్రేమనగర్ సినిమాను చూసి ఉన్నాను. తేట తేట తెనుగులా అంటూ హీరోయిన్ వంక ఒకలా చూస్తుంటే ఆవిడెంత సిగ్గుపడిందో! లవర్ బాయ్ గా ఆయనకెంత పేరో! సెక్రటరీ సినిమా చూస్తున్నప్పుడు మా వెనుక కూర్చున్న ఆడవాళ్లు ''వాడు చూడే. ఆ చూపు చూడు. అది చాలే.'' అయన గురించి ఇలాంటి కామెంట్స్ ఆ రోజుల్లోనే విన్నాను. హీరొయిన్ కీ తనకీ ఇగో ప్రొబ్లెమ్స్. దగ్గరవ్వాలనుకున్నప్పుడల్లా దూరంగా నెట్టే ఆవిడ పనులకు, ప్రవర్తనకు, మాటలకు, అపార్థాలకు ఆమెను ఏదో చేసేయ్యాలన్నంత కోపం. కానీ ఏమీ చెయ్యలేనంత ప్రేమ. ఆ సమయంలో ఆమె వంక మాట్లాడకుండా ఓ లుక్కు. ఈ పేరాడు భావాలనీ ఆయన ఒక్క చూపులో పలికించేవాడు. ఇక్కడ వాణిశ్రీ గారి గురించి కూడా చెప్పుకోవాలి. అలాంటి పాత్రలకు అమెకెంత పేరో! వారిద్దరిదీ ఎంత మంచి జోడీ!

'మీ ఏయన్నారుకు ప్రేమించడం కూడా రాదు. ఫెయిలయ్యి మందు కొడతాడు.' అన్నాడు నాలుగోతరగతి వాడు.
'మా వాడు మందు కొట్టినట్టు మీ వాడు కొట్టగలడా? ప్రేమనగర్ చూడు.' అన్నాన్నేను.

దేవదాసు సినిమా పోస్టర్ మీద అక్కినేని స్టిల్ నన్ను చాలా రోజులు వెన్నాడింది. చిందర వందరగా ఉన్న ఉంగరాల జుట్టు నుదిటిన వేలాడుతుండగా, మత్తెక్కిన కళ్ళతో, పీక్కుపోయిన ముఖంతో, చేతిలో మందు గ్లాసుతో ఉండేదా స్టిల్లు.  ఆ సినిమాని పెద్దయ్యాక ఎప్పుడో ఇంటర్ చదువుతున్నప్పుడు చూడగలిగాను. కొన్ని సినిమాలంతే. వాటిని మళ్ళీ తీయలేరు. ప్రేమలో ఓడినోడు మందు కొడుతూ తిరుగుతాడనే భ్రమ సమాజంలో కలిగిందంటే అది దేవదాసు వల్లే. తనను కాదన్న ఆడదాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి అలా మందు కొట్టి దేవదాసు స్టైల్లో కనిపించే వారు అప్పటి యువత. అంటే చివరికి నేను కూడా దేవదాసు లాగే చస్తాను అని బెదిరించడం అన్నమాట. వర్కవుట్ అయ్యిందీ లేనిదీ నాకు తెలీదు. ఆ సినిమా ప్రభావం సమాజంపై అంతగా ఉండింది ఆ రోజుల్లో. అదంతా అక్కినేని వల్లే. అందుకోసం తాగుడు ఫ్యాషన్ కాదు, నేను తాగుబోతూనే కాదు అని ఎన్ని సార్లు చెప్పుకోవలసి వచ్చిందో ఆయనకి.

బాటసారి సినిమా గురించి చెప్పుకోకూడదు. చూసి ఊరుకోవాలి. ఎందుకంటే ఎవరికి వారికి ఒక అవ్యక్తానుభూతిని విడివిడిగా మిగిల్చే సినిమా అది. అక్కినేని ఉత్తమ చిత్రాల్లో అది మొదటిదనే చెప్తాన్నేను.

'మా ఎన్టీవోడు రాముడు, కృష్ణుడు. దేవుడంటే మా వోడే. మీ నాగ్గాడు చేయగలడా?' ఇంకో యాంగిల్లో నన్ను ఓడించడానికి చూశాడు నాలుగో తరగతోడు.

విజయవాడలో ప్రజలకు సామాజిక, రాజకీయ చైతన్యంతో పాటు సినిమా పిచ్చి కూడా ఎక్కువే. అది సినిమా వాణిజ్యకేంద్రం. అక్కడి ప్రజల తీర్పు సినిమా భవిష్యత్తును నిర్ణయించేంత కచ్చితం. నా చిన్నతనంలో ప్రతీ వోడు ఎన్టీవోడి పార్టీ లేదంటే నాగ్గాడి పార్టీ. ఇవి ఆ మహానటులకు ప్రేమగా వారు పెట్టుకున్న పేర్లు. అప్పుడప్పుడూ వాళ్ళ వాళ్ళ వెండితెర వేల్పుల మహిమల గురించి వాదనలు శ్రుతిమించి కొట్లాటల వరకూ వెళ్ళేవి. ఎంతగా అంటే గాల్లోకి సోడాబుడ్లు లేచి పేలేంతగా. అలా సినీ వినీలాకాశాన్ని సూర్యుడు, చంద్రుడూ పంచుకున్నట్టు పంచుకున్నారు వాళ్ళిద్దరూ. మిగిలిన వాళ్ళంతా స్టార్లు అంటే చుక్కలన్నమాట. సూపర్ స్టార్, రెబెల్ స్టార్, మెగా స్టార్ ఏవైనా అవి చుక్కలే. సూర్య చంద్రుల్లో సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు అంటే స్వభావ రీత్యా చంద్రుడు ఎయన్నారే. ఎన్టీయార్ సూర్యుడే.
  

'మీ వోడు దేవుడైతే మా వోడు భక్తుడు.' తగ్గలేదు నేను.

అవును మరి. భక్తుడు లేకుండా దేవుడున్నాడా? ఏయన్నార్ నాస్తికుడంటే నమ్మబుద్ధి కాదు. విప్రనారాయణ, బుద్ధిమంతుడు, భక్త తుకారాం, చక్రధారి ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో భక్తుడిగా నటించి ఎందరినో తన భక్తులుగా చేసుకున్నాడు. ఆ అరమోడ్పు కళ్ళు, ప్రశాంత వదనం, భేషజం లేని చిరునవ్వు. భక్తితో అంత సాత్వికత అప్రయత్నంగానే వచ్చేస్తుంది. కానీ ఈ విషయం నాస్తికుడైన ఎయన్నారుకు ఎలా తెలుసు?! ఎలా అంటే ఆయన చదువుకోకపోయినా ఇంగ్లీషులో మాట్లాడలేదా. అలాగే ఇది కూడా.  చేసే పని పట్ల నిబద్ధత ఉంటె అన్నీ అవే తెలుస్తాయి.

సీతా రామయ్య గారి మనవరాలు - ఇంటిని విడిచి వెళ్ళిన కొడుకు తర్వాతెప్పుడో తను రాకుండా మనవరాలిని పంపాడు. అది సరే, ఓ ఊత కర్రను కూడా కానుకగా పంపాడు. ఇంకా కోపం వచ్చింది ఆ తండ్రికి.  దాన్ని ముట్టుకోలేదు. ఆ తరవాత తెలిసింది, కొడుకు కనరాని లోకాలకు వెళ్లిపోయాడని. ఒక్కసారిగా కుప్పకూలిపోతుండగా ఆ ఊతకర్రనే ఆసరాగా తీసుకోవలసి వచ్చింది. అలాంటి హృదయవిదారక సన్నివేశంలో ఆయన పలికించించిన భావాలు తలచుకుంటేనే కళ్ళు చెమర్చుతాయి. ఎందుకో తెలీదు ఆ ముఖంలో బాధ, చూసే వారి గుండెల్ని పిండేస్తుంది.  బాధ తాలూకు బరువును ఆయన మరింత పెంచుతాడు. బాధే సౌఖ్యమన్న భావాన్నీ అందులోనే చూపిస్తాడు.

ఆయన నటనా జీవితం ఎంత పరిపూర్ణమైనదో, ఆయన వ్యక్తిగత జీవితమూ అంత నిండైనది. కేవలం పిల్లలకు తెలుగు సంస్క్రతి, తెలుగు భాష అందించడానికి ఆయన మద్రాసు నుండి హైదరాబాదుకు మకాం మార్చారంటే కుటుంబానికి, సొంత ప్రాంతానికి ఎంత విలువను ఇచ్చాడో తెలుస్తుంది. హీరోగా క్షణం తీరికలేకుండా ఉన్న వేళ, అవకాశాలు వెల్లువెత్తుతున్న వేళ అయన తీసుకున్న నిర్ణయం చాలా సాహసంతో కూడుకున్నది. తన మీద తనకు ఎంత నమ్మకం!? అలాగే నిర్మాతలంతా అయన కోసం ప్రయాసపడి ఇక్కడికే వచ్చి సినిమాలు తీశారు. కొన్నాళ్ళకు చిత్ర పరిశ్రమ అంతా ఆయన వెంటే తరలివచ్చింది. జమాజెట్టీల వంటి వారినే కూరలో కరివేపాకులా తీసిపడేసే సినీ లోకంలో ఒక నటుడి కోసం పరిశ్రమే కదిలి వచ్చిందంటే అదొక రికార్డు కాదా. ఆయన స్టామినా ఏంటో వేరే చెప్పాలా. క్రమబద్ధమైన జీవితం, నిలకడైన ప్రయాణం, నిరాడంబరత, నిరంతర శ్రమ అన్నీ ఆయన విజయానికి సోపానాలు. నిండైన జీవితానికి నిదర్శనాలు.                   


ఆయన నూరేళ్ళూ మన మధ్యే ఉంటాడని అనుకున్నారంతా. సిన్మాలు చేయకపోయినా వైభవోపేతమైన తెలుగు సినీ చరిత్రకు ఆయనొక సజీవ సాక్ష్యంగా కనబడేవారాయన.  ఆయన చనిపోయినప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనిపించలేదు. ఒక శకం ముగిసిందనిపించింది. నా చిన్ననాటి స్మృతులను ఎవరో నా నుంచి లాక్కెళ్ళి పోయినట్టు అనిపించింది. అందుకే ఆనాటి పాట మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది.

చక్కనయ్యా చందమామ ... ఎక్కడున్నావు ...

ఆయన లేకుండా జరుగుతున్న మొదటి అక్కినేని జయంతి ఇది. ఈ సందర్భంగా ఆయన స్మృతికి నివాళి ఇది.                                          
   
                   

17, సెప్టెంబర్ 2014, బుధవారం

దీపికకు కోపం వచ్చింది!



దీపిక అంటే మన బాలీవుడ్  నటీమణి దీపికా పడుకోన్. కోపం ఎందుకు సినిమాల్లేవా అంటే ఎందుకు లేవు, హిట్ల మీద హిట్లు కొట్టేస్తూ ప్రస్తుతం బాలీవుడ్ ని మహారాణిలా ఎలేస్తోంది దీపిక. మరి ఇంకా ఎందుకు కోపం? మీడియా వాళ్ళేమైనా ఎవరితో అయినా లింకు పెట్టేశారా అంటే అది ఆమెకు మామూలే. ఏది మామూలు అని మళ్ళీ అడక్కండి. బాయ్ ఫ్రెండ్స్ ని తరచూ మార్చినట్టు మీడియా ఎప్పటికప్పుడు రాయక పోతే హీరోయిన్లకు, ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లకు తమ డిమాండ్ తగ్గిపోయిందేమో అని డౌటొచ్చేస్తది. మరెందుకు కోపం వచ్చింది అంటే కారణం ఇది. 
సినిమాలో కాకుండా బయట మరేదో సందర్భంలో దీపిక తన వక్షోజాలు బహిర్గతం అయ్యేలా వస్త్రాలను ధరించి కనబడిందట. ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా అనే  ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రిక, 'దీపిక బాలీవుడ్ లో కాకుండా బయట కూడా ఇలా ప్రదర్శిస్తోంది ' అన్నట్టుగా కామెంట్ రాసి జనాల మీదికి వదిలేసింది. (అంటే సినిమాలో ప్రదర్శిస్తే తప్పు లేదని ఆ పత్రిక అభిప్రాయమా? లేక బయట కూడా ఈ ఖర్మ ఏంటని బాధా?) అది చూసి దీపికకు కోపం వచ్చింది. 'స్త్రీలను గౌరవించడం రానప్పుడు మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదు' అంటూ ట్వీట్ గా దులిపేసింది. అంతటితో ఊరుకోలేదు. 'అవును! నేను ఆడదాన్ని. నాకు వక్షోజాలు ఉన్నాయి. మీకేంటి సమస్య?' అంటూ బోల్డ్ గా తిరగబడింది.  ఈ స్టైలు చూసి జనాలు ముగ్దులై పోయారు. ఆహా! ఏమడిగింది అని అంటూ ఆమెకు మద్దతుగా ట్వీట్లు రాసారు. హీరో షారూఖ్ ఖాన్ కూడా ఆమెకు అండగా నిలిచాడు. చివరకు సదరు పత్రిక ఆ వార్తను డిలీట్ చేసేసింది. ఇంకేం కథ ముగిసిందిగా. అయిపోయిన పెళ్ళికి బాజాలు అన్నట్టు ఇప్పుడీ బ్లాగుడేందుకు అనంటారు అవునా? ఇది అయిపోయిన కథ కాదు. నడుస్తున్న చరిత్ర. అందుకని దీపికను అడగాల్సిన విషయాలు కొన్నున్నాయి. 

                                                                                             
 మహిళా సాధికారత గురించి ఆవిడకు ఏం తెలుసు?
ఈ రకమైన వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏంటి? వివక్షతకు తావు లేకుండా సామాజిక వనరులు, అవకాశాలు, అధికారాలను అందుకోడానికి అర్హతలను సంపాదించుకునే అవకాశాన్ని మహిళకు ఇవ్వడమే 'సహా అధికారం'. అంతేగాని ఇలాంటి ప్రదర్శనకు సాధికారతకు సంబంధం లేదు. మీ మాటలు  విన్న అమ్మాయిలు సాధికారత అంటే ఇదేనేమో అనుకుని మిమ్మల్ని అనుసరిస్తే వాళ్ళ గతేం కాను. మీకేం? మీరు ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే కారులో వెళ్తారు. అంగరక్షకులను పెట్టుకుంటారు. ఇంకా కావాలంటే ఫ్రండ్స్ ఉండనే ఉంటారు. ఏం జరిగినా షారుఖ్ లాంటి వాళ్ళు మీకు బాసటగా నిలుస్తారు. కానీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఒక మధ్యతరగతి అమ్మాయి ఇలా బయటకు రావాలంటే ఆమె రోడ్డు చివర వరకూ వెళ్లి ఆటో ఎక్కాలి. ఆఫీసుకు వెళ్లి అందరి మధ్యా గడపాలి. ధన మదాంధులు, అధికార మదాంధులు ... ఇలా సాహిత్యపరంగా అంధులని పిలవబడే డేగ కళ్ళ నుంచి తప్పించుకు తిరగడం సాధ్యమా?
ఒక్క మాటకు సమాధానం చెప్పండి. సినిమాల్లో మీ అంగాంగ ప్రదర్శన ఎందుకోసం? ఫంక్షన్ లలో కూడా ఆ ప్రదర్శన ఎందుకు? పబ్లిసిటీ కోసమేగా? మీరు సినిమా నటులతే మాత్రం అందాల ప్రదర్శన చెయ్యాలని రూలుందా? చెన్నై ఎక్స్ ప్రెస్ ను జనం చూడలేదా?

శ్వేతాబసుకు మీ మద్దతు తెలిపారు అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆమె గురించి మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం ఆ దారిలో వెళ్తే తప్పేంటి అన్నారు. బొత్తిగా సామాజిక బాధ్యత లేదా మీకు? వ్యక్తిగతంగా ఎవరు ఎవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఆమె చేస్తున్నది వ్యాపారం. అంటే అది సామాజిక సమస్య అయ్యింది. వ్యాపారంలో డబ్బు ఉంటుంది. బ్రోకర్లు ఉంటారు. తమ క్లయింట్లకు కొత్త రుచులు చూపించడానికి ఇష్టపడి వచ్చే అమ్మాయిలనే కాదు. అమాయకపు పిల్లల్ని కూడా బలవంతంగా ఆ వృత్తి లోకి దింపడం జరుగుతుంది. మీలాంటి ఇలాంటి ప్రశ్నలు వేసి గొప్ప అనుకుంటారు. కానీ ఆ మాటలు ఒక సామాన్యమైన ఆడపిల్లని ఎంతగా ప్రభావితం చేస్తాయో మీకు తెలుసా? మీ డబ్బున్న వాళ్ళ బలుపుని, విచ్చలవిడి సంస్కృతిని పేద, మధ్య తరగతి పై ఎందుకు రుద్దుతారు? 

మీకు ఉన్నాయి కదా అని ప్రదర్శించడమేనా? 
సమస్య ఏంటి అని అడిగారు కదా! అలా మిమ్మల్ని చూసిన వాళ్ళు అందుబాటులో ఉన్న మరో పిల్లలో మిమ్మల్ని చూసుకుంటున్నారు. అదీ ఖర్మ. ఒక రాజకీయ నాయకుడి ఆన్ లైన్ అక్కౌంట్ కి లక్ష లైకులు వస్తే ఎక్కువ. అలాంటిది రెండు హిట్ సినిమాలు కూడా లేని హీరోయిన్ కి మాత్రం ఇరవై, ముప్పై లక్షల లైకులా? వాళ్ళంతా మీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళా? మీ అందాలు నచ్చిన వాళ్ళా? ఆలోచించండి.           

అయ్యా షారూక్ మహాశయా!
అమీర్ ఖాన్ నగ్నంగా కనిపిస్తే అది ప్రతిభ అనిపించుకోదు అన్న నీకు దీపిక ఎలా కనిపించినా తప్పులేదా? ఏమిటీ హిపోక్రసీ?
                                                                                           
   

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

పాపం! శ్వేతాబసు!!

      పన్నెండేళ్ళ క్రితం అంటే 2002లో 'మక్డీ' అనే హిందీ చిత్రం చూశాం. మక్డీ అంటే సాలీడు అన్నమాట. ఒక పల్లెటూరులో ఒకానొక పాడుబడిన ఇల్లు. ఆ ఇంటి గేటు దాటి లోపలి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. ఆ ఇంట్లో మంత్రగత్తె ఉందని, ఆవిడే అందరినీ మాయం చేసేస్తుందని పుకార్లు. తన చెల్లెలి కోసం అలాంటి ఇంట్లోకి వెళ్తుంది ఒక తెలివైన పదేళ్ళ పాప. తన చెల్లెలిని రక్షించుకోవడమే కాకుండా ఆ ఇంటి రహస్యాన్ని, మంత్రగత్తె మోసాన్నీ బట్టబయలు చేసి ఊరి వారందరితో వహ్వా అనిపించుకుంటుంది ఆ పాప. మంత్రగత్తెగా షబానా అజ్మి నటించగా చున్ని, మున్నీ అనే కవల అక్కాచెల్లెళ్ల పాత్రల్లో శ్వేతా ప్రసాద్ అనే బాలనటి నటించింది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన మక్డీ చిత్రంలో శ్వేత నటనకు అందరూ ముగ్ధులయ్యారు. చున్నీ పాత్రలో ఎంత అల్లరిగా కనిపించిందో , మున్నీ పాత్రలో అంత అమాయకంగానూ నటించి మెప్పించింది.  2003 జాతీయ చిత్ర పురస్కారాలలో శ్వేతకు ఉత్తమ బాలనటి అవార్డు కూడా వచ్చింది. అయితే ఆ సినిమాలో ఎంతో తెలివిగా సాలీడు (మంత్రగత్తె) పనిపట్టిన శ్వేత, నిజజీవితంలో మాత్రం సినిమా ప్రపంచం అనే సాలెగూటిలో చిక్కి బయటపడలేక పోతోంది.

నేటి జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టిన శ్వేతాబసు ప్రసాద్ తల్లి బెంగాలీ, తండ్రి బీహారీ. మక్డీ సినిమాలో నటించేటప్పటికి శ్వేత పదకొండేళ్ళ అమ్మాయి. నటిగా ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అందరూ అనుకునేలా తన ప్రతిభను నిరూపించుకున్న శ్వేత ఆ తర్వాత ఇక్బాల్ అనే సినిమాలోనూ, కొన్ని హిందీ సీరియళ్లలోనూ నటించింది. ఉన్నట్టుండి 'కొత్త బంగారులోకం' అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా ప్రత్యక్షం అయ్యింది.  'ఎ.. క్క.. డ ?' అంటూ అక్షరాలను విడదీస్తూ పలికే ఆ టీనేజి అమ్మాయి పాత్ర యువతను బాగా ఆకట్టుకుంది.  ఆ సినిమా కమర్షియల్ గా కూడా విజయవంతం అయింది.  ఇంకేం ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్ల కోసం వెదుకులాడే మన నిర్మాతలకి కొత్త బంగారం దొరికిందని అనుకున్నారంతా. కానీ అదేం విచిత్రమో తెలీదుకానీ అవకాశాలను అందిపుచ్చుకునే రేసులో శ్వేత వెనుకబడింది. దానికి తోడు బాగా లావెక్కడం, ఆ తరవాత వచ్చిన ఒకటి రెండు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో నిర్మాతలెవరూ ఆమె వైపు చూడలేదు. ప్రేక్షకులు కూడా శ్వేతను మర్చిపోయారు. చివరికి ఐటెం సాంగులకు కూడా ఒప్పుకుని చేయడం మొదలుపెట్టింది కానీ అవి కూడా ఆదరణకు నోచుకోలేదు. సీన్ కట్ చేస్తే వ్యభిచారం చేస్తోందని పుకార్లు.  నిజమా అనుకుని ఆశ్చర్యపోయి అంతటితో మర్చిపోయారు జనం. మళ్ళీ ఇదిగో ఇప్పుడిలా వార్తలు.

గత రెండు రోజుల నుంచి వార్తా పత్రికలు, వెబ్ మీడియా, సామాజిక వెబ్ సైట్ లు, టీవీ చానెళ్ళు అన్నింటా శ్వేతాబసు గురించే రాతలు, మోతలు. గతంలో ఆమెపై ఇలాంటి కథనాలు ప్రసారం చేసిన ఒక టీవీ చానెలే స్టింగ్ ఆపరేషన్ ద్వారా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించిందని ఒక వార్త. పోలీసులు మామూలుగా చేసిన రైడింగ్ లో అనుకోకుండా   దొరికిందని ఇంకో వార్త. అదేం కాదు పక్కా సమాచారంతో మేమే రైడింగ్ చేశాం అని పోలీసు కథనాలు మరో పక్క. రెడ్ హ్యాండెడ్ అంటే విటుడు కూడా ఉండాలి కదా! దానిమీద కూడా భిన్నమైన కథనాలు. ఎవరో ఒక పారిశ్రామిక వేత్త కమ్ రాజకీయ నాయకుడితో ఉండగా పట్టుపడిందని, అయితే ఆ వ్యక్తి తన పలుకుబడి ఉపయోగించి తన పేరు బయటికి రాకుండా చూసుకున్నాడని మొదట్లో వచ్చిన వార్త. ఇంతలోనే పోలీసులు కథ మార్చి మేం చేసిన ఆపరేషన్ లో విటుడిగా మా వాడే నటించాడు అని చెప్పారు.

సరే ఏదో జరిగింది. శ్వేత వ్యభిచారమే చేస్తోందని అనుకుందాం. అదే నిజం అయినప్పుడు ఆమె పేరును మరీ అంతగా బయట పెట్టాల్సిన అవసరం ఏముంది? రోజుకు లక్ష అని మీరే చెప్తున్నారు. అంటే ఆమెతో గడిపే వారంతా పెద్ద(డబ్బు) మనుషులే అని వేరే చెప్పక్కర్లేదు. మరి వారి పేర్లెందుకు బయటపెట్టరు? డబ్బున్న వారితో చట్టానికి ఏమిటీ లాలూచి? రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తల ప్రమేయం లేకుండానే ఇలాంటి వ్యాపారాలు సాగుతున్నాయా? అన్నవి సామాన్యుల మదిలో మెదిలే ప్రశ్నలు.

పోలీసుల సంగతి పక్కన పెడితే హీరోయిన్ల చుట్టూ తిరిగి స్టింగ్ ఆపరేషన్ లు చేసి పలానా హీరోయిన్ ఈ వ్యాపారం చేస్తోంది అని ఊదరగొట్టే మీడియా, అదే పని రాజకీయ నాయకులతోనో, పారిశ్రామికవేత్తలతోనో చెయ్యొచ్చుగా. అది చెయ్యరు. ఒకవేళ అలా చేసినా పేరు బయటరాకుండా ఉండటానికి బేరాలు కుదుర్చుకుంటారు. మగాడి విషయం వచ్చేసరికి అలా, ఆడదాని విషయం వచ్చే సరికి రేటింగ్స్ పెంచుకునే ముడి సరుకుల్లా కనిపిస్తారు వీళ్ళ కంటికి. నిండా పాతికేళ్ళు నిండని ఒక అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంటే, దాని వెనుక ఉన్న సామాజిక కారణాలేంటో పరిశోధించడం మాని కనీస జాలి అన్నది లేకుండా ఆ వార్తను పదే పదే చూపించి ఆ అమ్మాయి బతుకును మరింత బుగ్గిపాలు చెయ్యడం జర్నలిజం అనిపించుకుంటుందా? అసలు సమాజంలో జరుగుతున్న ఇలాంటివి చూపించేటప్పుడు వాటిని మన పిల్లలూ చూస్తారని గానీ, వాళ్ళూ ఇదే సమాజంలో పెరుగుతున్నారని గానీ ఈ చానెళ్ళ వాళ్ళు మర్చిపోతారెందుకో!   

ఇది అవకాశాల్లేని సినిమా హీరోయిన్ లు మాత్రమే చేస్తున్న పని కాదు. డబ్బు అవసరమై, విలాసాలకు మరిగి తేలిగ్గా సంపాదించే ఆలోచనలు ఉన్న అమ్మాయిలలో  చాలామంది ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారన్న కథనాలు, వార్తలు వింటూనే ఉన్నాం. తల్లి దండ్రులకు ఇందులో చాలా బాధ్యత ఉంది. అటు అబ్బాయిలున్న వారైనా, అమ్మాయిలున్న వారైనా విలువల గురించి తమ పిల్లలకి చెప్పాలి. డబ్బు ఖర్చు పెట్టే విధానంపై కన్నేసి ఉంచాలి.  అవసరాల మేరకే ఖర్చు చెయ్యడం అన్నది చిన్నప్పటినుంచే నేర్పాలి. ఈ అలవాటు శ్వేతాబసుకు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పివుంటే, వాళ్ళు కూడా కూతురు సంపాదన ఏ రకంగా అయినా ఇంతకు పదింతలు ఉండాలని ఆశపడి ఉండకపోతే ఆ అమ్మాయి ఇలా ఈనాడు వార్తల్లో ఉండక పోయేదేమో!

                                                 

6, ఆగస్టు 2014, బుధవారం

తనివి తీరలేదు

















ఇన్నాళ్ళు ఉద్యమాలు నడిపించి, ఉద్యమ ఫలాలను అధికారం రూపేణా ఆరగిస్తున్నా కెసిఆర్ కు ఇంకా కొట్లాట తనివి తీరలేదు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో భాగంగా జయశంకర్ సారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కెసిఆర్ చేసిన ప్రసంగం ఈ ముచ్చటే చెబుతోంది. తెలంగాణ సిద్ధాంత కర్త జయంతి కాబట్టి తెలంగాణ ప్రజలలో స్ఫూర్తి నింపే మాటలు మాట్లాడాల్సిందే. అయితే అవి భవిష్యత్ కార్యాచరణల గురించి ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ కూడా మేమింకా ఆంధ్రోళ్ళ మీద కొట్లాడతం అనుడే బాగాలేదు.  కొట్లాడనీకి తెలంగాణ సమస్యలు మస్తున్నయ్. నిన్న గాక మొన్న విద్యుత్ కోతలపై రైతులు కొట్లాడితే, ఆళ్ళ మీదికి పోలీసోల్లు కొట్లాడనీకి పోయిన్రు. ఒక వైపు సిటీల్ల గూడా కరెంటు కోతలున్నయ్. ఇంకో దిక్కు రుణాల రీషెడ్యూల్ విషయంలో ఆర్బీఐతో లొల్లి ఉండనే ఉంది. మరో దిక్కు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లొల్లి సుప్రీం దాకా వెళ్లి నెత్తిన మొట్టికాయలు వేయించుకునే వరకు వచ్చెనాయె. ఇవన్నీ ఉండగా ఆంధ్రోనితోని లొల్లి ముచ్చట దేనికి? ప్రజల ఆలోచనలను సమస్యల నుండి ప్రక్కదారి పట్టించుడే అని అనిపిస్తాంది.

మా తెలంగాణలో యూనివర్సిటీ పేరు మార్చుకుంటే నీ ఏడుపేంది అంటన్నవ్. 'ఆ యూనివర్సిటీ అందరం కలిసున్నప్పుడు,  అందరం కట్టిన పన్నుల లెక్కలోంచి పైసలు దీసి కట్టిన యూనివర్సిటీ కదా. నీ ఒక్కనిదే అన్నట్టు నీకిష్టమైన పేరు పెడితే ఎలా? నీకంత సంబరముంటే ఇక మీదట తెలంగాణలో ఉండే ప్రజలు కట్టే పన్నులు పెట్టి  కొత్తగా ఏమైనా కట్టుకో, ఆటికి నీ ఇష్టమొచ్చిన పేరు పెట్టుకో ' అని ఆంధ్రోళ్లు అనరా?  మీ విగ్రహాలను మీరు తీస్కపోండి అన్నడు సారు. 'సరే మా విగ్రహాలతో పాటు మేం కట్టించిన వన్నీ, అభివృద్ది చేసినవన్నీ మాకిచ్చెయ్ తీస్కపోతం' అని వాళ్ళంటే ఏం చెప్తం? తెలంగాణలో విద్యుత్ కష్టాలు చంద్రబాబు వల్లే అన్నడు సారు. మాకేవో సమస్యలు ఉండి మా ప్లాంట్లలో ఉత్పత్తి ఆగిపోతే మధ్యలో నీ ఏడుపెంది అని అల్లంటే మనకెట్లుంటది?

మీ పిల్లల ఫీజులు మీరే కట్టుకొండి అంటున్నరు.  ఎనకటికి కాళోజి సారు 'క్విట్ తెలంగాణ' అంటే జయశంకరు సారు ఏం చెప్పిండు? 'ఆ మాట తప్పు. ఈడకొచ్చి స్థిరపడినోల్లందరూ మనోల్లే' అన్నడు కదా! యాదికి లేదా కెసిఆర్ సారూ? ఆయన తెలంగాణను ప్రేమించిండు కానీ, ఆంధ్రోల్లను గానీ, మలెవల్లను గానీ ద్వేషించలే. అట్ల సెయ్యమని ఎన్నడూ చెప్పను గూడా చెప్పలే. మరి ఆయన పుట్టిన రోజు నాడు ఇవేం మాటలు సారూ?


      

2, ఆగస్టు 2014, శనివారం

స్నేహమా వందనం!


















స్నేహమా నీకు వందనం!

నాకు అల్లరి నేర్పినందుకు
నాకు నవ్వు నేర్పినందుకు
కొత్త కొత్త ఆటలు ఆడించి
నాకు మొదటి గెలుపు రుచి చూపించినందుకు

కొండలు గుట్టలు ఎక్కించి,
చెట్టూ పుట్టా తిప్పించి,
నీరూ నిప్పుతో చెలగాటమాడించి,
నాతో సాహసాలు చేయించినందుకు
ప్రమాదంతో పరిచయం చేయించినందుకు

చదువులో నాతో పోటీ పడి
నన్ను ముందుకు పరుగెత్తించినందుకు

స్వచ్చమైనదే అయినా, స్నేహంలోనూ
మంచీ చెడులు ఉన్నాయని చెప్పినందుకు

నాకు దురలవాట్లను నేర్పిన నువ్వే
నన్ను హెచ్చరించి మానిపించినందుకు

నాలో మంచినీ, చెడునీ పాలు నీళ్ళలా విడదీసి
చూపినందుకు, నా అద్దానివై నిలచినందుకు

నాకంటూ ఒక ప్రపంచం ఉందని అనిపించేలా
నా చుట్టూ నిలిచినందుకు

ప్రేమ అని నేననుకుంటే,
కాదు స్నేహం అని  నా మార్గాన్ని మార్చినందుకు


ఎప్పటికప్పుడు కొత్త స్నేహానికి తావిస్తూ
నన్ను వదలి నీవు వెళ్ళినందుకు,
వెళ్తూ నీ జ్ఞాపకాలను నాకు వదలినందుకు

నేను రెండుగా విడిపోయి జీవిస్తున్నానా
అన్నంత చనువుగా నాతో తిరిగినందుకు
స్నేహమా నీకు వందనం! 

నా స్నేహితులందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు!




27, జూన్ 2014, శుక్రవారం

నవభారత నిర్మాత పీవీ నరసింహరావు



        భారత రాజకీయ నాయకులలో మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించబడి, అంతే సమానంగా విస్మరించబడిన
వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు. పేద, ధనిక అన్న తేడా లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందంటే, కిరాణా దుకాణం నుంచి సాఫ్ట్ వేర్ సంస్థల వరకు కనీసం ఒక కంప్యూటర్ లేకుండా పని జరగడం లేదంటే,
దానికి కారణం, నిస్సందేహంగా పివి నరసింహారావే. కేవలం పాముల్ని ఆడించే దేశంగానే ప్రపంచ ప్రజలకి తెలిసిన
భారత దేశాన్ని ఐ టి హబ్ గా, తిరుగులేని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దింది ఈ పాములపర్తి నరసింహారావే. ఇంకా చెప్పాలంటే
దేశానికి రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చింది 1947లో అయితే, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది 1991లో , అంటే పీవీ ప్రధాని అయ్యాకే.

విప్లవ యోధుడు పివి :

ఈ తెలుగు బిడ్డ పుట్టింది తెలంగాణ గడ్డ మీదే. 1921 జూన్ 28న నాటి హైదరాబాదు రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో పుట్టిన  పీవీ, నాగపూర్ యూనివర్సిటీ  న్యాయవాద పట్టా పుచ్చుకున్నాడు . తనకు వరుసకు అన్న అయ్యే పాములపర్తి సదాశివరావుతో కలిసి 'జయ-విజయ' అన్న కలం పేరుతో నాటి కాకతీయ పత్రికలో వ్యాసాలు రాసేవారు. అనంతరం నాటి ఉద్యమాలకు ఆకర్షితుడై నిజాం కు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం కూడా చేశానని, తమ మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు  ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే తాము మాత్రం సైన్యం కురిస్తున్న బుల్లెట్ల వర్షం నుండి తప్పించుకుంటూ, ప్రాణరక్షణకై  పరుగులుదీస్తూ ఒక అడవిలో తలదాచుకున్నట్టు తన స్వీయ చరిత్ర గురించి రాసుకున్నారాయన. 

ఇందిర విధేయుడు :

స్వాతంత్ర్యం తరువాత జాతీయ కాంగ్రెస్ లో చేరిన పివి, ఇందిర విధేయుడిగా పేరు పడ్డాడు. 1969 లో కాంగ్రెస్ లో చీలిక వచ్చినప్పుడు కూడా అయన ఇందిరనే అంటిపెట్టుకుని ఉన్నాడు. 1970 లో భూదానోద్యమ బాధ్యతను పూర్తిగా ఆయనకు అప్పచెప్పింది ఇందిరమ్మ. ఆ ఉద్యమ నేపథ్యంలో ఆయన తన వారసత్వ భూములను సైతం జాతికి ఇచ్చేసాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతటి విధేయుడే ఆ తర్వాత గాంధీ- నెహ్రూ కుటుంబ వారసత్వపాలనను  బహిరంగానే వ్యతిరేకించి కాంగ్రెస్ నాయకులంతా ' ఎంత ధైర్యం' అంటూ  నోటి మీద వేలేసుకునేలా చేశారు.  ఆ రకంగా వాఖ్యానించి కూడా కాంగ్రెస్ లోనే కొనసాగ గలిగిన మొదటి ధీశాలి పీవీనే.

దేశ ప్రధాని పీవీ  :

13 భాషల్లో ప్రావీణ్యం, సామాజిక, రాజకీయ, ఆర్థిక  విషయాలలో  అద్భుత మేధాశక్తితో పాటు కష్టపడే తత్వం ఉన్న పీవీని  అనేక పదవులు అయాచితంగానే  వరించాయి . ఒకానొక దశలో జ్ఞానీ జైల్ సింగ్ తర్వాత రాష్ట్రపతి పదవికి జరిగిన రేసులో కూడా పీవీ పేరు వినవచ్చింది.  ఆ పదవులన్నీ రావడానికి కారణం, ఆయన ఇందిర కుటుంబానికి సన్నిహితుడు కావడమే అని కొందరు కాంగ్రెస్ వాదుల అభిప్రాయం. బహుషా ఆయన ప్రధానిగా కాకపోయినట్లయితే  ఆ అభిప్రాయం అలాగే ఉండిపోయేదేమో!

నాటి రాజకీయ పరిణామాల వల్లే కాని, ఆయనకున్న ఇతర సాహిత్యపరమైన వ్యాపకాల వల్లే కాని,  1991 నాటికి పీవీ దాదాపు రాజకీయరంగ విరమణకు దగ్గరలో ఉన్నారు.  మరోవైపు ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ అప్పటికీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. అనేక అభియోగాల మధ్య కూరుకుపోయిన పార్టీ, మళ్ళీ అధికారం కోసం రాజీవ్ అధ్యక్షతన పోరాడుతోంది. కానీ అంతలోనే రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం, దేశమంతా చెలరేగిన సానుభూతి పవనాలు, కాంగ్రెస్ ఘన విజయం ... అనీ చకచకా జరిగిపోయాయి. రాజకీయ పగ్గాలు చేపట్టేందుకు సోనియా సుముఖంగా లేకపోవడం వల్ల ప్రధాని పదవికి నెహ్రూ కుటుంబేతర నాయకుల్లో పోటీ ఏర్పడింది. శరద్ పవార్ గట్టి పోటీని ఇచ్చినప్పటికీ,  సహజంగానే అన్ని అర్హతలతో పాటు, మృదుస్వభావి, సౌమ్యుడు అన్న పేరున్న పీవీ నరసింహరావును ప్రధాని పదవి వరించింది. ఆ వెంటనే
పార్లమెంటు సభ్యత్వ అర్హత కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని నంధ్యాల పార్లమెంటు నియోజకవర్గం నుండి ఉపఎన్నికలో  పోటీచేశారు. తమ రాష్ట్రం నుండి ఒక తెలుగువాడు, అది కూడా ఉత్తరాది ఆధిపత్యాన్నీ నిలువరిస్తూ ఒక దక్షిణాది నాయకుడు,  తొలిసారిగా నెహ్రూ కుటుంబేతర వ్యక్తి భారతదేశ ప్రధాని కాబోతున్నాడన్న అభిమానంతో తెలుగు ప్రజలు ఆయన్ని 5. 8 లక్షల ఆధిక్యంతో గెలిపించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ  పోటీ నుంచి విరమించింది. అంతటి ఆధిక్యం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా చోటు చేసుకుంది.

 దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం :

పీవీ ప్రధాని అయ్యేనాటికి కేవలం 2. 3 % వృద్ధిరేటుతో  దేశ ఆర్థిక స్థితి దారుణస్థాయిలో ఉంది.  ఎంత దారుణం అంటే దేశ అవసరాల కోసం 47 టన్నుల బంగారాన్ని తాకట్టుపెట్టి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి అప్పు తెచ్చుకోవలిసి వచ్చింది. వీటన్నిటికీ కారణం అప్పటిదాకా ప్రభుత్వాలు అనుసరించిన ఓటు బ్యాంకు పోకడలు. అనవసర సబ్సిడీలు.  సంస్థలన్నిటినీ జాతీయం చేసుకుపోయేసరికి పని అనేది రాజకీయం అయ్యింది. ఉత్పాదకత తగ్గింది.  సరిగ్గా ఆ సమయంలో పగ్గాలు చేపట్టిన పీవీ ప్రముఖ ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని ఆయనకు సర్వాధికారాలను, పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఫలితంగానే ఐ టి అన్నది భారతదేశంలోకి కాలు మోపింది. టెలికాం సంస్థలు తమ సాంకేతిక నెట్వర్క్ ను భారత్ కూ విస్తరింపచేశాయి. పలు దేశీయ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పని సంస్కృతి అభివృద్ధికరంగా మారింది. నాణ్యతలో, సేవలలో పోటీ తత్వం పెరిగింది. ఒకప్పుడు మన దేశం నుండి ఇతర దేశాలకు తరలిపోయిన మేథో సంపత్తి, పారిశ్రామిక వర్గాలు తిరిగి స్వదేశానికి రావడం (రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ ) మొదలయ్యింది. పీవీ, మన్మోహన్ అనే ఇద్దరు మేధావుల కలయిక మొత్తం దేశ గతినే మార్చేసింది. కొద్ది రోజుల్లోనే భారతదేశం ఆర్థిక సంక్షోభం నుండి తేరుకుని అనతికాలంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. అందుకే మేధావులు అంటారు దేశానికి ఆర్థిక స్వతత్ర్యాన్ని తెచ్చింది పీవీ నరసింహారావు అని.

ముందు దేశం, ఆ తర్వాతే పార్టీ:

పీవీ ఏది చేసినా మొదటి ప్రాధాన్యత దేశ అభ్యున్నతికే ఇచ్చారు. ఆ తర్వాతే పార్టీ అన్నారు. అదే కాంగ్రెస్ వారికి మంటపుట్టించింది. ముఖ్యంగా సోనియా గాంధీకి. ప్రతి విషయం తనకు చెప్పే చేయాలని ఆమె, తెలియని విషయాలు చెప్పి ప్రయోజనం ఏంటి అన్నట్టు ఈయన, మధ్యలో చెంచాగాళ్ళ ఎగదోపుడు మాటలు.... ఇవన్నీ కలిసి పీవీకి కాంగ్రెస్ లోనే శత్రువులను పెంచాయి. పార్టీకి దూరం చేశాయి. ఆ ద్వేషాలు, దూరాలు ఆయన చనిపోయేవరకూ తరగలేదు. పైగా ఆయనకు మరిన్ని అపవాదులు ఆపాదించారు. ఇక మీడియా అయితే పార్టీనే పట్టించుకోని ఆయనను మేమెందుకు పట్టించుకోవాలని అనుకుంది. ఆయన బ్రతికుండగానే చనిపోయారని వార్తలు రాసేదాకా నిర్లక్ష్యం చూపింది. చనిపోయిన తర్వాతా ఆయనపై ప్రతీకారం తీర్చుకునే నీచ స్థాయికి దిగజారింది కాంగ్రెస్.

పార్టీని పట్టించుకోకుండా ముందుకెళ్ళాడు కాబట్టే పీవీకి ఆ అవస్థ అనుకున్నాడేమో, మన మన్మోహన్ సింగ్ గారు పార్టీ చెప్పినట్టు నడుచుకుని అపఖ్యాతిని మూట కట్టుకున్నారు. ఆ రకంగా చూస్తే పీవీ అనుసరించిన పంథానే సరి. అలా చేయగల సత్తా ఒక తెలుగు బిడ్డకే సాధ్యమేమో!     

తెలంగాణ రాష్ట్ర పండుగగా పీవీ జయంతి :

పీవీ చనిపోయినప్పుడు జరిగినవన్నీ చూసి కాంగ్రెస్ ను ఈసడించుకోని తెలుగు వాడు ఉండడేమో. ఉంటె వాడు తెలుగువాడు కాదనుకోవాలి, ఇంకా చెప్పాలంటే చేసిన మేలు మరచి పోయే కృతఘ్నుడు అని అనుకోవాలి. వై ఎస్ ఆర్ సరే కాంగ్రెస్ మనిషి, కాని తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే కెసిఆర్ కు ఏమయ్యింది? అని అనుకున్నా ఆనాడు.
కానీ ఇప్పుడు పీవీ జయంతిని రాష్ట్ర పండుగగా చెయ్యడం, తెలంగాణ రాజకీయ రాజధాని వరంగల్ లో పీవీ విగ్రహాన్ని నెలకొల్పడం చూస్తుంటే 'వాహ్ ! కెసిఆర్' అనిపించింది. ఆలోచన ఆయనదైనా, మరెవరిదైనా అభినందించతగినది. ఆనందించతగినది. పీవీని గౌరవించడం అంటే తెలుగు జాతిని గౌరవించుకోవడం.