పేజీలు

ప్రేమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రేమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, నవంబర్ 2013, శుక్రవారం

ప్రతి మదిలోని తెహల్కా ... ఈ ప్రేమలేఖ!

                                                                      ప్రియమైన నీకు, నేను వ్రాయునది...
'నేను' అంటే 'నువ్వెవరు?' అని ప్రశ్నించవని నాకు తెలుసు. ఎందుకంటే నేనీ మనుషుల మధ్య ఎప్పటినుంచో ఉంటున్నా, నా ఉనికిని తొలిసారిగా గుర్తించింది నువ్వే. నేను అనబడే నాకున్న లక్షణాల్నీ, అవలక్షణాల్నీ రూపించి చూపించిందీ, అనుమతించి స్వాగతించింది నువ్వే. ఎటొచ్చీ చిక్కంతా ఏంటంటే అంతటితో నీ పని అయిపోయినట్టుగా నువ్వు గమ్మున ఉండిపోయావు. గుండె వాకిట వరకూ స్వాగతించిన నువ్వు, నీ హృదయాంతరాల లోనికి ఆహ్వానించవెందుకో! మన మధ్య ఉన్నదేంటని అడిగితే 'జస్ట్ కొలీగ్స్' అంటావు. అంతేనా అన్నట్టు దిగులుగా కనిపిస్తే 'యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్' అంటావు. అంతకంటే ఎక్కువ కాదా అన్నట్టు నిరాశగా చూస్తే, ఏమీ తెలీనట్టు 'ఏమైంది అలా ఉన్నావు?' అని అడుగుతావు.  మనం ఒకరినొకరు చూసుకున్న మొదటి క్షణంలోనే నువ్వన్నావ్, 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది' అని. నాక్కూడా అలాగే అనిపించింది. అంటే విడివడని బంధమేదో మన మధ్య ముడివడబోతోందని సూచనేమో అది.
అసలీ లేఖ రాయడం ఎందుకంటే రాత్రి నువ్వు నా కలలోకి వచ్చావు. గదిలో నేనడుగు పెట్టేసరికి నువ్వొక కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నావు. మానిటర్ మీద ఒక హృదయం బొమ్మ. ఎంతో ఏకాగ్రతతో దానికి మెరుగులు దిద్దుతున్నావు. ఆ హృదయం నాదే అని గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు నాకు. తీరిగ్గా, ఓపిగ్గా, నీకు నచ్చినట్టుగా మలచుకుంటూ... నా హృదయాన్ని తదేకంగా చూస్తూ, నీ కళ్ళనిండా వెలుగును నింపు కుంటున్నావు. ఈ హృదయం ఇక నాదే, నా స్వంతమే అన్నట్టుగా నీ పెదవులపై విజయ దరహాసం. అది నేను గమనించేలోగా, నా ఉనికి నీకు తెలిసిపోయి, నీ గుట్టు నేను పసిగట్టాననే తత్తరబాటుతో, కోపం నటిస్తూ... విసురుగా ఏదో బటన్ నొక్కేసరికి ఏకంగా కంప్యూటరే పేలిపోయింది. గది నిండా చెల్లాచెదురుగా పడివున్న నా హృదయపు తునకలు. వాటిని నీ హై హీల్స్ చెప్పులతో పక్కకి తోసేస్తూ విసవిసా నడచి బయటకు వెళ్లిపోతుంటే, వెనుకనుంచి నీ ఎతైన పిరుదుల లాస్యాన్నీ, నునుపైన నీ నకుము మడతలో మెరిసి మాయమవుతున్న కాంతిని చూసి చెదరిన నా హృదయం బాధగా నిట్టూర్చింది.
అప్పుడో వెలుగు. ఏంటా అని చూస్తే బ్రహ్మ దేవుడు. నన్ను సానుభూతితో చూస్తూ ''పిచ్చివాడా! ఈ పాటి విరహానికే నీకంత బాధగా ఉంటే, మనసు పెట్టి అపురూపంగా  నేను మలచిన ఆ రూపాన్ని భూమ్మీదకు పంపాల్సిన విధిని నిర్వర్తించే సమయంలో ఆ శాశ్వత విరహానికి నేనెంత బాధపడి ఉంటానో ఊహించు'' అన్నాడు. అప్పుడు చూశాను ఆయన ఎనిమిది కళ్ళలోనూ 27 ఏళ్ల విరహం నింపిన నైరాశ్యపు నీడల్ని. ఆయన అంతర్ధానంతో మెలకువ వచ్చి, మళ్ళీ నిద్ర పట్టలేదు. రాత్రంతా నీ తలపుల వేదనే.
ప్రతి రోజూ ఆఫీసుకు రాగానే నీ జాడ కోసమే వెదుకుతాను.  నువ్వు కనిపిస్తే గాని ఆ రోజుకు పని చేసే శక్తి సమకూరదు నాకు. సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్తూ 'బై బై' అంటూ చేతుల్ని తిప్పుతూ వీడ్కోలు చెపుతున్నపుడు,
నీ చూపులలో చిక్కుపడిన నా చూపులు క్షణకాలపు పరిష్వంగనలో ఆదమరిచి ఉండగా, నిర్దయగా నీ చూపుల్ని వెనక్కి లాగేసుకుని నువ్వు వెళ్లిపోతుంటే, నీ వెంటే పరుగులిడి, నువ్వు కనుమరుగైన చోట కాసేపటి వరకు అలాగే నిలబడి, నీరసంగా వెనక్కి తిరిగి వచ్చి, నా కళ్ళలోని చీకటి కుహరాల్లోకి చేరి సొమ్మసిల్లిపోతాయి.
చాలా సార్లు నువ్వన్నావు, ''రాత్రి నీ గురించి ఆలోచించాను'' అని. అలోచించి నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావో మాత్రం చెప్పవు. మొదట్లో దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత ఉండేది. కాని ఇప్పుడు నీ నిర్ణయం తెలుసుకోవడం మీది ఆసక్తి కన్నా, 'నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు' అన్న నిజమే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది.
ఎప్పుడైనా కన్నార్పకుండా నిన్నే చూస్తున్నప్పుడు, 'ఏంటలా చూస్తున్నావ'ని అడుగుతావు. ఏం లేదని అనగానే 'పిచ్చి' అంటూ గలగలా నవ్వేస్తావు. ఒక మనోహర దృశ్యాన్ని చూస్తున్నట్టుగా నవ్వుతున్న నిన్ను చూస్తుంటే, చటుక్కున నవ్వును ఆపి, నా కళ్ళలో కళ్ళు పెట్టి నిశ్శబ్దంగా రెండు క్షణాలు చూసి, చూపుల్ని నేలమీదికి వాల్చేస్తావు. మౌనంగా ఉండిపోతావు. ఆ క్షణాల్లో నీ పెదవుల వణకు, నీ పొడవాటి ముక్కు చివరన అదరుతున్న ముక్కుపుటాలు, శ్వాస ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెలమీది అవయవాలలో కదలికలు... ఇలా అన్నిటినీ గుర్తిస్తాయి నా చూపులు. ఆ సంకేతాల అర్థాన్ని తెలుసుకున్న రక్తం వేడెక్కి పరవళ్ళు తొక్కుతూ, నా నరనరాల్లో తీపి బాధని నింపుతుంది. ఆ వెంటనే ఒక్క ఉదుటున లేచి వెళ్ళిపోతూ నాలుగడుగులు వేసి, వెనక్కి తిరిగి నువ్వు చూసే చూపు ... 'హా!!!'  ఎందుకింత బాధ? ఎంతకాలం మోయాలీ బరువును? మనకు మనమే బందీలుగా ఉండటం ఎందుకు? చెప్పు! ఒక్క మాట. ''నువ్వు నాకు కావాలి.'' అని చెప్పు. పోనీ... "నేను నీకు కావాలా?" అని అడుగు. కాలాన్ని నమ్మకు. అది ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చేస్తుందో తెలీదు. ఈ లేఖ నీ మౌనాన్ని భంగపరుస్తుందని ఆశిస్తూ...
నీ
నేను

(ఇలా లేఖలు రాసుకోవడం ఇప్పుడు లేకపోవచ్చు. పొట్టి సందేశాలు (SMS) పంపుకునే ఈ ఫాస్ట్ జనరేషన్ సైతం ఇలాంటి సాగతీత ప్రణయ బాధను అనుభవిస్తోంది. ప్రతి ఆఫీసులోనూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక జంట ఇలా అవ్యక్త అనుబంధంతో వేగిపోతూ ఉంటుంది. వారిద్దరూ అవివాహితులు కావచ్చు. లేదా ఇద్దరిలో ఒకరికి పెళ్లై ఉండవచ్చు. లేదా ఇద్దరూ పెళ్ళయిన వాళ్ళు కావచ్చు. ఎటూ తేలని ఈ బంధం కొన్నాళ్ళ తర్వాత అక్రమసంబంధంగా జనం నోళ్ళలో నానడం జరగవచ్చు. లేదా తెహల్కా మాదిరిగా పనిచేసే చోట లైంగిక వేధింపుల కేసుగా మీడియాకు సంబరం చేయొచ్చు.  లేదా వీళ్ళు ఉద్యోగ రీత్యా విడిపోయి దూరం కాగానే ఒకరికొకరు జ్ఞాపకాలుగా మిగిలిపోవచ్చు.  ఏది ఏమయినా ఇదంతా సహజం. అవడానికి అది ఆఫీసు లవ్ అయినా అది వ్యక్తిగతం అని మర్చిపోవద్దు.  ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే వరకూ బయటపడక పోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఎందుకంటే రెండువైపులా ఉండే ప్రేమలో నాన్చుడు ఉండదు. వ్యవహారం సాగుతుందంటే అది వన్ సైడ్ అని అర్థం.  ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం అమృతం కిందే లెక్క.)       

20, ఏప్రిల్ 2010, మంగళవారం

గుర్తుకొస్తున్నావు!

గుర్తుకొస్తున్నావు.
బాగా గుర్తుకొస్తున్నావు.
నిన్ను మర్చిపోవాలనుకున్న కొద్దీ గుర్తుకు వస్తున్నావు.
అసలు గుర్తుకు రావడం ఏంటి? మర్చిపోతేనే కదా గుర్తుకు రావడం అనేది ఉంటుంది. ఇది గుర్తుకు రావడం కాదు. మర్చిపోలేక పోవడం.
'అసలు నన్నెందుకు మర్చిపోవాలి?' అని నువ్వు నన్ను అడిగితే బాగుండు అనిపిస్తుంది. 'నన్ను ప్రేమిస్తున్నావా?' అనిఅడిగితే బాగుండు అనిపిస్తుంది. నువ్వేదీ అడగవు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు. నీ కోసం నా మనసు పడే బాధ నీకుఅర్థం కాక కాదు. అక్కర లేక. అందుకే విలవిల లాడుతున్న నన్ను చూస్తూ కూర్చుంటావు తప్ప ఏమైందని అడగవు. నేనూ చెప్పను. ఇది అహంకారం కాదు. నీ మీద ప్రేమే. నీకు అక్కరలేని వాటిని నిన్ను బతిమిలాడో, కన్వీన్స్ చేసో నీకుఎందుకు అంటగట్టాలి? నేనేమి సేల్స్ మాన్ని కాదు. ప్రేమికుడిని. నా ప్రేమ నీకు విలువైనదిగా అనిపించాలి. అరుదైనవరంలా అనిపించాలి. నీకు కావాలనిపించే అర్హతలు నేను పొందాలి. అపుడు నువ్వే అడుగుతావు. 'నన్నుప్రేమిస్తున్నావా?' అని.
అవన్నీ జరగాలంటే ముందు నిన్ను మర్చి పోవాలి. అందుకే ప్రయత్నం. నీకు తెలుసా? ఎవరో ఒక అనుభవశాలి ఇలాచెప్పాడు "సంతోషం అయినా ప్రేమ అయినా - మనం వాటి వెనకాల పరుగేత్తినంత కాలం దొరకవు. మనం ఆదమరపుగా ఉన్నపుడు సీతాకోక చిలుకలా మన భుజం మీదికి వచ్చి వాలతాయి.''
అందుకే నిన్ను నా మనసు దరి దాపుల్లోకి రానివ్వకూడదని అనుకుంటున్నాను. అయినా వదలవుగా నువ్వు. నీముఖంలోకి చూస్తే నన్ను నేను మర్చిపోతాననే భయం. అందుకే నువ్వు నాకు ఎదురు పడకూడదు అనుకుంటాను. నీమాట వింటే మంత్రంలా నా మనసును కట్టిపడేస్తుందని భయం. నీకు దూరంగా ఉంటేనే నీ మాయ లోంచి నాకు విముక్తి. అందుకే దూరం ఇల్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు దగ్గరవ్వాలని అనుకునేదాకా దూరంకొనసాగాలి. నా ప్రేమ సీతాకోక చిలుకవు నువ్వు. నీ అంతట నువ్వే నా మనసు తోటలోకి వచ్చి వాలాలి. అప్పటికి దాకానీ లోకంలో నువ్వు హాయిగా, స్వేచ్చగా ఉండు. నీ సుఖాన్ని కోరుకోవడం కంటే ప్రేమకు పరమార్థం ఏముంది చెప్పు! నీకోసం తపించడంలో నాకు ఆనందం ఉంది. నీకోసం కలవరించడంలో నాకు మనశ్శాంతి ఉంది. నిన్ను ప్రేమిస్తూ ఉండటం నాకు ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. అసలు నిన్ను కలవడం అన్నది నేను గర్విస్తోన్న విషయం. చూసావా! ఇలా రాస్తూ రాస్తూ మళ్ళీ నీ మాయలో పడి ఎక్కడికో వెళ్లిపోతున్నా. ఇదే ప్రేమ మహిమ. కాదు నీ మహిమ. నువ్వు కలవక పోతే అసలు నాలో ఈ ప్రేమ ఎలా పుట్టేది?

19, ఏప్రిల్ 2010, సోమవారం

ప్రేమ - ఆక్సిజన్

మనందరికీ తెలుసు - మనం గాలి పీల్చుకుని బ్రతుకుతున్నామని. మనలో చాలా మందికి తెలుసు - మన ప్రాణాధారం ఆక్సిజన్ అని, కొన్ని క్షణాలు అది అందక పోతే ప్రాణం నిలువదని. కాని రోజుకు ఎన్నిసార్లు మనం ఆక్సిజన్ గురించిమాట్లాడుకుంటాం? ఎన్నిసార్లు దానికి కృతజ్ఞతలు చెప్పాం? ఎంతగా దానికి గుర్తింపునిస్తున్నాం? డబ్బు గురించి కలవరించినంతగా ఆక్సిజన్ గురించి తలచుకుంటామా? అలా అని ఆక్సిజన్ అనేది లేదనిగాని, దాని అవసరం లేదనిగాని ఎవరైనా అనగలరా?
ప్రేమ కూడా అలాంటిదే. మనసుకు ఆక్సిజన్ లాంటిది. జీవితానికి వెలుగు లాంటిది. తెలిసో తెలీకో దాని ఆధారంగానే మనందరం బ్రతుకుతున్నాం. కాకపోతే దాని ప్రాధాన్యతని గుర్తించడం లేదు అంతే. జీవితంలో ప్రతిక్షణం అవసరమైన ప్రేమను కేవలం టీనేజి వయసుకే పరిమితం చేసి ఆ వయసులో ఉండే ఆకర్షననే ప్రేమ అంటున్నాం. దాని ఆధారంగానే సినిమాలు తీసేస్తున్నాం. ఇంతేనా ప్రేమ గురించి మనం తెలుసుకుంది? జీవితంలో ఏ వయసులో అయినా ప్రేమ గురించి మాట్లాడుకోవచ్చని , ప్రేమకు లోనవడంలో తప్పు లేదని, అది సహజం అనీ ఎంద్కుకు తెలుసుకోం? తీరిక లేకా? తెలీకా?

ప్రేమ ప్రాధాన్యత తెలుసుకుంటే తెలియని ఒంటరితనంతో..ఏదో లోటుతో.. నిస్సారంగా, బ్రతుకును యంత్రంలా నెట్టుకొస్తూ.. తనలో తాను తెలియని అసంతృప్తితో రగిలిపోతూ... మనసులో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నించే ఒక ఇల్లాలిని అర్థం చేసుకోవచ్చు కదా. టీనేజి వయసులో పక్క దారులు తొక్కే పిల్లల్ని అర్థం చేసుకోవచ్చుకదా. మలివయసులో ప్రాధాన్యతను కోల్పోయి, నిరాదరణకు గురయిన పెద్దవాళ్ళను అర్థం చేసుకోవచ్చు కదా.

ప్రేమ గురించి తెలుసుకుందాం. ప్రేమ గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో ప్రేమ ఎక్కడుందో, ఏస్థాయిలో ఉందో తెలుసుకుందాం. ప్రేమను ఇద్దాం. ప్రేమను తీసుకుందాం.

18, ఫిబ్రవరి 2010, గురువారం

ప్రేమ - ఒక అద్భుత శక్తి

కొన్నేళ్ళ క్రిందట నా జీవితంలో నా అనుభవానికి వచ్చిన సంఘటన !
నేనామెను ప్రేమించాను. కాని ఆ విషయం ఆమెతో చెప్పలేను. కారణం మా స్నేహం చెడిపోతుందేమోనన్న bహయం. 'నిన్ను ప్రేమించాను' అని చెప్పడం ఈ సమాజంలో నేరం ఎందుకు అవుతుందో , అందుకు భయమెందుకో నాకు ఇప్పటికి తెలీలేదు. అది అత్యంత సహజమని ఎందుకు అనుకోరో ! ప్రేమ పేరుతో జరిగే ఇన్ని అనర్థాలకు మూలం ప్రేమ అంటేనే తప్పు అన్న భావన అని నా అభిప్రాయం.

నా అభిప్రాయాలేలా ఉన్నా ప్రేమన్నది ఇద్దరి ఇష్టాలకు, అభిరుచులకు , అభిప్రాయాలకు సంబంధించిన విషయం కాబట్టి , అవతలి వారి ఫీలింగ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే కాబట్టి నా ప్రేమ విషయం తనకు అప్పటికి చెప్పలేదు. ఇలాంటి సందర్భంలో ప్రేమన్నది కాలం పరిష్కరించేదాక వ్యక్తిగత బాధగా మిగిలి ఉంటుంది. లోలోన లావాలా మనసును దహించివేస్తూ ఉంటుంది.

ఆ సమయంలో ఒక రోజు... శ్రీరామ నవమి .

ఆఫీసుకు సెలవిచ్చారు. నేను మాత్రం పని వుండి ఆ రోజు ఆఫీసుకు వచ్చాను. అంతకు ముందు రోజు తను ఆఫీసుకు రాలేదు. అంటే తనను చూసి అప్పటికే ముప్పయి ఆరు గంటలు అయి పోయింది. ప్రేమ ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఎడబాటు ఎంత బాధగా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ రోజు తనని చూడాలని చాలా గాడంగా మనసు కోరుతోంది. కాని ఎలా? తన ఇల్లు ఎక్కడో తెలిసినా వెళ్ళలేను. తను ఆఫీసుకు వచ్చే చాన్స్ లేదు . మరెలా? తనను చూడాలి . ఈరోజే చూడాలి. చూడలేనా? నా ప్రేమకు అంత శక్తి లేదా? తనను నాకు ఎలాగైనా చూపించలేదా? యస్ ! నేను చూడగలను. ఇది నా ప్రేమకు పరీక్ష అనుకున్నాను.

బిల్డింగ్ పైకి వెళ్లాను. తన ఇల్లు ఉన్న వైపుకు తిరిగి మనసులో గట్టిగా 'తనని చూడాలి ' అనుకున్నాను. మళ్లీ మళ్ళీ అనుకున్నాను. కిందికి వచ్చాను. నా కొలీగ్ సినిమాకు వెళ్దామా అన్నాడు. ఆశ్చర్య పోయాను. ఎందుకంటే అంత క్రితం నేను అడిగితే తను రానన్నాడు. ఇంతలో అతని మనసెలా మారిందో తెలీదు.

అక్కడ తన ఇంట్లో...

వాళ్ళ అన్నయ్య సినిమాకు వెళ్దామా అని ఆమెను కొద్దిసేపటి క్రితం అడిగాడు. ఆమె రానని చెప్పింది. అతను తన ఫ్రండ్ దగ్గరికి బయలుదేర పోతుంటే ఆమె వెళ్లి సినిమాకు వెల్దామంది. కాని అప్పటికి సమయం దాటి పోయింది. అయినా వెళ్దామని పట్టుబట్టింది.

ఇక్కడ నా ఫ్రండ్ కూడా పట్టు పట్టాడు. బయలుదేరాం. అప్పుడే నాకనిపించింది. ఈరోజు తనని నేను చూడబోతున్నానని. స్కయ్లేన్ థియేటర్ లో ఒక పాత ఇంగ్లీష్ సినిమాకు వెళ్ళాం . టిక్కట్లు అయిపోయాయి. తిరిగి వచ్చేస్తోంటే ఒకతను వచ్చి రెండు టిక్కట్లు ఉన్నాయి కావాలా అని అడిగాడు. అప్పటికే సినిమా మొదలయ్యి చాలసేపయ్యింది. నా ఫ్రండ్ వద్దన్నాడు. కాని నేనే పట్టు పట్టి తీసుకున్నాను. ఎందుకంటే తను ఈ సినిమాకి వచ్చిందన్న సంకేతాలు నా మనసుకు అందుతున్నాయి. తను లోపలే ఉందని నా నమ్మకం. టికట్లు తీసుకుని లోపలి వెళ్లి కూర్చున్నాం. నా కళ్ళు ఆమెనే వెదుకుతున్నాయి. ఫ్రండ్ అడిగాడు ఏం చూస్తున్నావని? చెబితే నవ్వాడు. ఇంటర్వల్ లో అంతా చూసాను. ఎక్కడా ఆమె కనబడలేదు. కాని నాకు నమ్మకం. తన ఉనికి నాకు తెలుస్తోంది. అయితే ఎక్కడ?

సినిమా పూర్తయ్యింది. అందరూ లేచి వెళ్లి పోతున్నారు. నేను వెదుకుతూనే ఉన్నాను. దాదాపు హాలు మొత్తం ఖాళీ అయ్యే దశలో తను కనిపించింది. ఆరు వరసల అవతల కూర్చుంది ఆమె.

ఇదంతా చదివాక ఇదొక అద్భుతం అని అనిపించక పోవచ్చు. అనుకోకుండా జరిగిన సంఘటనలా అనిపించవచ్చు . కాని ఆ దశలో నాకది అత్భుతంలానే అనిపించింది. ప్రేమకు లేదంటే మనసుకు ఏదో దివ్య శక్తి ఉందనే అనిపించింది. టేలిపతి అంటామే ..అలాంటిది ప్రేమలో కచ్చితంగా వర్కవుట్ అవుతుందని నా నమ్మకం.

30, జనవరి 2010, శనివారం

ప్రేమ - ఒక సాహసం !

ఎంతోమంది ఎన్నో సాహసాలు చేస్తుంటారు . కొన్ని సాహసాలకు ప్రాణం పెట్టుబడి. కొన్ని సాహసాలకు జీవితం పెట్టుబడి. ప్రాణాన్ని ,జీవితాన్ని - రెంటినీ మూట కట్టి , నీ గుప్పెట్లో పెడుతూ నేను చెప్పే మాటే 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' .

ప్రేమను ఇస్తున్నాను అంటే అదేమీ వస్తువు కాదు పూవులా ఇచ్చేందుకు . ప్రేమను ఇవ్వడం అంటే సర్వాన్నీ ఇవ్వడం . ఇవ్వడం అనేది ఎప్పటికైనా సాహసమే కదా! అలా ఇవ్వగలమని నమ్మకం ఏర్పడినప్పుడే ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తున్నాని చెప్పగలరు. స్వార్ధపరులు , పిరికివాళ్ళు, ఇతరుల కోసం బ్రతకలేని కుంచిత మనస్కులు ప్రేమిస్తున్నానని చెప్పలేరు .
ప్రేమను ఇవ్వడం అంటే కేవలం ఇవ్వడమే. ఇందులో తిరిగి తీసుకోవాలనడం కానీ, ఏదో ఆశించడం కాని ఉండదు. ప్రతిఫలం ఆశిస్తే ఇవ్వడంలో అర్థం ఏముంది? ఏదీ ఆశించకండా ఇవ్వడం అన్నది ఎంత సాహసం కదా! అందుకే ప్రేమ - ఒక సాహసం. ఏ ప్రేమలోనూ రెండు వైపుల నుంచీ ఇవ్వడం అనేది ఉండదు.

తీరా ఇంత సాహసంతో ఇస్తానన్నాక అవతలి వారు అక్కరలేదంటే ..?

దాని గురించి నీకెందుకు? ఇవ్వడానికి సిద్ధపడటమే నీ వంతు. తీసుకోవడం , తీసుకోకపోవడం అవతలివారి ఇష్టం. వారికున్నఅవసరం. అంతే! దాంతో నీకు నిమిత్తం లేదు. చాలా కష్టమైన పని కదా. అందుకే అంటున్నా! ప్రేమ - ఒక సాహసం!