పేజీలు

joke లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
joke లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఏప్రిల్ 2017, గురువారం

వాట్సప్ పంచ్

మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా పుణ్యమాని ముఖాముఖి మాటలకు బదులు చాటింగ్ లు, బంధుత్వ పలకరింపులకు బదులు లైకింగ్ లు, అభిరుచి వ్యక్తీకరణకు లేదా భావ ప్రకటనకు షేరింగులు అలవాటయిపోయాయి. వ్యక్తులు ఎదురుపడితే మాట్లాడటానికి తెగ మొహమాట పడిపోయి, బింకంగా సిగ్గుపడుతూ, ముడుచుకు పోయే వారు సైతం సోషల్ మీడియాలో విభిన్న ఫోజుల్లో సెల్ఫీలు పెడతారు. 'lol' అంటూ డైనమిక్ గా మాట్లాడతారు.  రాబోయే రోజుల్లో మానవ సంబంధాలు ఎలా ఉంటాయో ఊహిస్తూ ఇదే సోషల్ మీడియాలో కొన్ని జోకులు కూడా వైరల్ (వైరల్ అంటే అదేదో జబ్బు అనుకునేరు... బాగా వ్యాప్తి పొందుతోంది అని చెప్పడానికి షార్ట్ కట్ అన్నమాట) అవుతున్నాయి. అందులో ఒకటి ఇలా ఉంది. 

ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి చేరిన బంధువులు అతనితో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతని మంచిని గురించి నాలుగు మాటలు చెప్పుకోవడం పరిపాటి. అలా చెప్పుకుంటున్నప్పుడు ఇదివరకు ఎలా మాట్లాడుకునేవారో మనందరికీ అనుభవమే. కాకపోతే భవిష్యత్తులో ఎలా చెప్పుకుంటారో విందాం. 

రాబోయే రోజుల్లో ఎవరయినా పొతే ఆ వ్యక్తి గురించి కామెంట్లు ఇలా ఉంటాయి ....

  • పాపం! చాలా మంచిమనిషి. ఎపుడూ ఆన్ లైన్ లో ఉండేవాడు.. నిన్న రాత్రి గూడా పేస్ బుక్ లో మా చిన్నోడి ఫోటో పెడితే లైక్ కొట్టాడు. ఇంతలో ఏంటో ఇలా.   
  • ఎంత మర్యాదస్తుడని... !  ఇంటికి ఎవరన్నా అతిథి రాగానే, “మీ మొబైల్ ఛార్జింగ్ లో పెట్టమంటారా..?” అని అడిగేవాడు. 
  • అంతేనా “Wi-fi పాస్ వర్డ్ ఇమ్మంటారా..?” అని అడిగిమరీ ఇచ్చేవాడు. 
  • అందరి పోస్టులకు లైక్ లు కొట్టేవాడు..
  • కరెంట్ లేకున్నా ఛార్జింగ్ తగ్గకుండా పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసేవాడు..
  • అతను చేసే కామెంట్స్ ఎంత హుందాగా ఉండేవని... 
  • పాపం రోజు ప్రొఫైల్ ఫోటో మార్చేవాడు..
  • జీవితాంతం ఒకే అకౌంట్  మీద బ్రతికాడు..

22, సెప్టెంబర్ 2016, గురువారం

వాట్సప్ పంచ్



నిను వీడని నీడను నేనే... !  


ఒక మారుమూల అందమైన ప్రదేశానికి పని మీద వెళ్ళిన ఒకతను అప్పుడే హోటల్లో దిగాడు. భార్య కూడా ఆ ప్రదేశం చూస్తే బాగుండు అనుకున్నాడు. ఎలాగూ కొద్ది రోజులుగా ఇద్దరికీ కీచులాటలతో మనసు చికాకుగా ఉంది. ఈ ఊరికి వచ్చేటప్పుడు కూడా ఒకరినొకరు అరచుకున్నారు. ఈ సమయంలో ఇలాంటి చోట ఇద్దరం గడిపితే చికాకులు తొలగిపోతాయి. మనసులు ప్రేమతో రీఛార్జ్ అవుతాయి. సంసారంలో మళ్ళీ నూతన ఉత్తేజం కలుగుతుంది. 

కానీ ఎలా? ఫోన్ చేసి రమ్మంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాననే అంటుంది. అందుకని మరుసటి రోజే ఆమె అక్కడుండేలా టిక్కట్ల దగ్గర్నుంచి అన్ని ఏర్పాట్లు భార్యను అడక్కుండానే చేసేశాడు. ఆ తర్వాత కూడా ఫోను చెయ్యకుండా భార్యను ఇంకా సర్ ప్రైజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో  ఇదే విషయాన్నీ ఆమెకు మెయిల్ పెట్టాడు. అయితే ఆ ఎగ్జైట్ మెంట్ లో భార్య మెయిల్ అడ్రెస్ ను తప్పుగా టైప్ చేశాడు. 

కట్ చేస్తే...  

ఒకామె భర్త అకస్మాత్తుగా చనిపోయాడు. భర్త అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికి తిరిగి వచ్చిన ఆమె మెయిల్ బాక్స్ తెరచి ఎవరెవరి నుంచి సంతాప సందేశాలు వచ్చాయో చూద్దామనుకుంది. పరధ్యానంగా మొదటి మెయిల్ తెరచి చదివింది. దాన్ని చదువుతూనే స్పృహ తప్పి కింద పడిపోయింది. శబ్దం విని ఆ గదిలోకి పరుగున వచ్చిన ఆమె కొడుకు కంప్యూటర్ ఆన్ లో ఉండటం, మెయిల్ కూడా తెరచి ఉండటంతో విషయం తెలుసుకుందామని చదివాడు. అందులో ఇలా ఉంది...      
''నా ప్రియమైన శ్రీమతికి... 
ఎలా ఉన్నావు?  నాకు తెలుసు ఈ సమయంలో నా దగ్గర నుంచి మెయిల్ అనగానే నువ్వు ఆశ్చర్యపోతావు. నేనిప్పుడే ఇక్కడకు చేరుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ కంప్యూటర్లు కూడా ఉన్నాయి. పైగా మీ వాళ్ళకు మెయిల్ చేసుకునే వాళ్ళు చేసుకోండి అని కూడా మాకు వీళ్ళు ఆఫర్ ఇస్తూ వై ఫై పాస్ వర్డ్ చెప్పారు. పిల్లలెలా ఉన్నారు? ఇదో కొత్త లోకంలా ఉంది. కానీ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒంటరిగా ఉండటం నా వల్ల కావట్లేదు. అందుకే నిన్ను కూడా ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశాను. ప్రియా! రేపు ఈ వేళకు నువ్వు ఇక్కడ... ఈ కొత్త లోకంలో నాతో పాటు ఉంటావు. పిల్లల గురించి బెంగపడకు. మీ అమ్మ ఉందిగా చూసుకుంటుంది. ఆలస్యం చేయకు వచ్చేసేయ్. నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను.'' 

20, జులై 2016, బుధవారం

వాట్సప్ పంచ్ (తనదాకా వస్తే గానీ... )

తనదాకా వస్తే గానీ...    
 
టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోసామి ఒక రైతును ఇంటర్వ్యూ చేస్తున్నాడు. 

అర్నబ్: మీ మేకలకు ఏం మేపుతారు?

రైతు: ఏ మేకకు? తెల్లదానికా? నల్ల మేకకా?

అర్నబ్ : తెల్ల మేకకు ఏం పెడతారు?

రైతు: పచ్చగడ్డి 

అర్నబ్ : మరి నల్ల మేకకు?

రైతు : దానికి కూడా పచ్చగడ్డే పెడతాను. 

అర్నబ్ : మేకలను ఎక్కడ కట్టేస్తారు?

రైతు : తెల్ల మేకనా? నల్ల మేకనా?

అర్నబ్ : తెల్ల మేకను ఎక్కడ కడతారు? 

రైతు : షెడ్డులో

అర్నబ్ : అయితే నల్ల మేకను బయట కట్టేస్తారన్నమాట 

రైతు : కాదు. నల్లమేకను కూడా షెడ్డులోనే కట్టేస్తా. 

అర్నబ్ : రోజూ మేకలను శుభ్రం చేస్తారా?

రైతు : ఆ చేస్తాంగా. 

అర్నబ్ : ఎలా శుభ్రం చేస్తారు ?

రైతు : తెల్ల మేకనా ? నల్ల మేకనా ?

అర్నబ్ : ముందు తెల్ల మేక గురించి చెప్పండి 

రైతు : నీళ్ళతో కడుగుతా. 

అర్నబ్ : మరి నల్ల మేకని?

రైతు : దాన్ని కూడా నీళ్లతోనే కడుగుతా.

అర్నబ్ కు చిర్రెత్తుకొచ్చింది. తానొక జర్నలిస్టునని, చేస్తున్నది లైవ్ ప్రోగ్రామని కూడా మర్చిపోయాడు.
 
అర్నబ్ : ఒరే తెలివితక్కువ సన్నాసి! రెండింటికీ ఒకే జవాబు చెబుతున్నప్పుడు, ప్రతి ప్రశ్నకీ నల్లదా, తెల్లదా అని ఎందుకు అడుగుతున్నవురా?  

రైతు : ఎందుకంటే తెల్ల మేక నాది. 

అర్నబ్ : ఓహో అదా సంగతి. మరి నల్ల మేక ఎవరిది?

రైతు : నల్ల మేక కూడా నాదే. 

అర్నబ్ కళ్ళుతిరిగి పడిపోయాడు. రైతు లేచెళ్ళి అర్నబ్ మొహం మీద నీళ్ళు చల్లి లేపి...  
''ఇప్పుడు అర్థం అయ్యిందా? మీరు టీవీల్లో చెప్పిన విషయమే పది సార్లు, రకరకాలుగా చెప్పి మమ్మల్ని ఎలా విసిగిస్తున్నారో! అందుకే నీకీ ట్విస్ట్ ఇచ్చా.'' అన్నాడు. అంతే!  ప్రత్యర్థుల మీదికి నోరేసుకు పడిపోయే అర్నబ్ కు మాట పెగల్లేదు.                       
   
               

3, మే 2016, మంగళవారం

వాట్సప్ పంచ్

వాట్సప్ పంచ్

ఓ పెద్దాయన హెయిర్ కటింగ్ సెలూన్ కు వెళ్ళాడు.  ఆయనకు అప్పటికే తలమీది వెంట్రుకలన్నీ రాలిపోయి కేవలం 8 వెంట్రుకలు మిగిలాయి. 'వీటిని ఏం చెయ్యమంటారు... కత్తిరించాలా, లెక్క పెట్టాలా ?' వెటకారంగా అడిగాడు బార్బర్. 'కాదోయ్! రంగేయాలి.' తాపీగా చెప్పాడు పెద్దాయన. 'తలలు బోడులైన తలపులు బోడులా' అన్న సామెత గుర్తుకు రావట్లేదూ?!
          

30, డిసెంబర్ 2015, బుధవారం

వాట్సప్ పంచ్ ( రాంబాబు -సోంబాబు)

వాట్సప్ పంచ్  ( రాంబాబు -సోంబాబు) 
  
1
కిరాయి హంతకులైన రాంబాబు, సోంబాబులు ఇద్దరూ ఒక  కారుకు బాంబు ఫిక్స్ చేస్తున్నారు. రాంబాబు ఫిక్స్ చేస్తుండగా సోంబాబు వాడికి సహాయం చేస్తూ అడిగాడు.. 
''ఒక వేళ మనం ఫిక్స్ చేస్తున్నప్పుడే ఈ బాంబు  పేలిపోతే ఏం చేస్తావు?''
''మరేం పర్వాలేదు. నా దగ్గర ఇంకోటి ఉంది''  రాంబాబు సమాధానం.  

2
రాంబాబు: ''కారు కొన్నావంట. ఏ కారు?''
సోంబాబు: ''పేరూ... ఊహు గుర్తుకురావట్లేదు... మొత్తానికి టీతో స్టార్ట్ అవుతుంది''
రాంబాబు: ''వావ్! టీతో స్టార్ట్ అవుతుందంటే.. సూపర్ కారు కొన్నావు. మిగతా కార్లన్నీ పెట్రోల్ పోస్తే గాని స్టార్టవ్వవు.''

3
రాంబాబుకు ఆఫీసులో మొదటి రోజు. రాత్రి పది గంటల వరకూ పని చేస్తున్న రాంబాబును చూసి మేనేజర్ చాలా ముచ్చట పడ్డాడు. వెళ్లి పలకరిద్దామనుకున్నాడు గానీ అతని ఏకాగ్రత చూసి చెడగొట్టడం ఇష్టం లేక ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారి ఆఫీసుకు వచ్చేసరికి రాంబాబు ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి ''గుడ్! రాంబాబు. నీలా రాత్రింబవల్లు పని చేసేవారంటే నాకు చాలా ఇష్టం. ఇంతకూ రాత్రంతా ఏం చేశావు? ''  
'' ఏంలేదు సర్! నాకిచ్చిన కంప్యూటర్ కీ బోర్డులో ఎబిసిడీలన్నీ ఒక ఆర్డర్లో లేవు. రాత్రంతా కూర్చుని సరి చేశా.'' 

4
ఒక మ్యూజియంకు వెళ్ళిన సోంబాబు అక్కడున్న ఒక మట్టి గిన్నెను పట్టుకు చూస్తుంటే కిందపడి అది కాస్తా పగిలిపోయింది. పరుగెత్తుకు వచ్చిన క్యూరేటర్ ''ఎంత పని చేశావయ్యా! అది 5000 ఏళ్ళనాటి పాత్ర. దాని విలువెంతో తెలుసా?'' అన్నాడు. 
''ఓసి అంత పాతదా? ఇంకా నయం కొత్త గిన్నె అనుకుని హడలి చచ్చా. '' అన్నాడు సోంబాబు. 

5
ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగితే చూడ్డానికి వెళ్ళాడు రాంబాబు. అతనికి దగ్గరలో ఒకతను భోరున ఏడుస్తుంటే జాలేసింది. వెళ్ళి ఓదార్చాలనుకున్నాడు. ''ఊరుకోండి''
''ఏడవకుండా ఎలా ఉండను సార్? ప్రమాదంలో నా చెయ్యి పోయింది.'' అంటూ మళ్ళీ ఏడుపు అందుకున్నాడు ఆ క్షతగాత్రుడు. 
''భలేవారే. చెయ్యి కోసమే మీరింతలా ఏడుస్తున్నారు. అతన్ని చూడండి. ఏకంగా తలే తెగిపడింది. అయినా అసలు ఏడవట్లేదు చూడండి?''  
టక్కున ఏడుపాగిపోయింది.    

22, డిసెంబర్ 2015, మంగళవారం

వాట్సప్ పంచ్

                                                                                                                     కొరడా దెబ్బలు 

ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 50 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు. వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా, శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు. “ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు. కాబట్టి మీకు శిక్ష విధించబోయే ముందుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంది” అన్నాడు. మొదటగా అమెరికన్ వంతు వచ్చింది. అతను కొద్దిసేపు ఆలోచించి తన వీపుకు ఒక దిండును కట్టమన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ­ అది ఇరవై దెబ్బలకే చినిగిపోయింది. మిగతా దెబ్బలు పూర్తయ్యేసరికి రక్తం కారి గాయాలయ్యాయి. తరువాత పాకిస్థానీ వంతు వచ్చింది. తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు. అతని దురదృష్టం కొద్దీ అదికానీ అవి ముప్పైదెబ్బల వరకే నిలబడ్డాయి. ఆ తర్వాత వీపు విమానం మోత మోగింది.   
చివరగా భారతీయుడి వంతు వచ్చింది. అతను ఏమీ అనకముందే షేక్ “మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు” అన్నాడు. 
“మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నా మొదటి కోరిక ఏంటంటే నాకు యాభై కాదు నూరు కొరడాదెబ్బలు కావాలి” అన్నాడు. 
ఆశ్చర్యపోయిన షేక్ “చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా ­ కనిపిస్తున్నావు. ఎంతయినా భారతీయుడివి కదా. సరే! నీ రెండో కోరిక ఏమిటి?” అడిగాడు.
“ఆ పాకిస్థాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.” అన్నాడు భారతీయుడు.  

19, నవంబర్ 2015, గురువారం

వాట్సప్ పంచ్ - భారతీయుడు

 

భారతదేశం గురించి అధ్యయనం చేసి రమ్మని కొన్ని  ఏలియన్ లను భూమ్మీదకి పంపించారు గ్రహాంతర వాసులు. భారతీయుల సామాజిక లక్షణాలపై అధ్యయనం చేసిన ఒక ఏలియన్ తన నివేదికను ఇలా గమ్మత్తుగా ఇచ్చింది. 

(గమనిక: ఇది కేవలం నవ్వుకోడానికే సుమా! ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వాట్సప్ ను తిట్టుకోండి. ఎందుకంటే ఇది వాట్సప్ లో సర్క్యులేట్ అవుతోంది మరి. నేను కేవలం అనువాదకుడిని మాత్రమే )   

1. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వ్యక్తి వచ్చాడు. వాళ్ళను చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ముంబైలో అంతే. ముంబైలో అంతే        
2. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వ్యక్తి వచ్చాడు. వారిద్దరికీ సర్ది చెప్పబోయాడు. మొదటి ఇద్దరూ ఏకమై మూడోవాడిని చితక్కొట్టారు. ఇది చెన్నై సంగతి.     
3. ఇద్దరు కొట్టుకుంటున్నారు. అక్కడే ఉన్న ఇంట్లోంచి మూడో వ్యక్తి వచ్చాడు. ''ఏయ్! నా ఇంటి ముందు ఏంట్రా గొడవ. అవతలికి పొండి!'' అని అరిచి మళ్ళీ తలుపేసుకున్నాడు.  సాఫ్ట్ వేర్ సంస్థలు, రాత్రి ఉద్యోగాలు కదా! నమ్మ బెంగుళూరు.         
4. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వ్యక్తి బీరు బాటిళ్ళ కేసుతో వచ్చాడు. ముగ్గురూ కూర్చుని బాగా తాగారు. ఒకరిని ఒకరు బాగా తిట్టుకున్నారు. తర్వాత స్నేహితుల్లా కలిసిపోయి ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిందంటే మీరు గోవాలో ఉన్నట్టు. 
5. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆగారు. ఫోన్లు బయటికి తీశారు. ఎవడి స్నేహితులను వాడు పిలుచుకున్నాడు. కట్ చేస్తే 50 మంది కొట్టుకుంటున్నారు. అంటే మీరు స్నేహానికి ప్రాణమిచ్చే పంజాబ్ లో ఉన్నారన్నమాట.                
6. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వాడు వచ్చి ఇద్దరినీ కాల్చిపడేశాడు. ఇలాంటి సంస్కృతి బీహార్ సొంతం. 
7. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మూడో వాడు వచ్చి వాళ్ళ కులాల గురించి ఆరా తీశాడు. తన కులం వాడితో చేయికలిపి, వేరే కులం వాడ్ని చావబాదాడు. ఆంధ్రా వాళ్ళకు మరీ ఇంత కులాభిమానమా!? ఏమో మరి.       
కొసమెరుపు:  ఇద్దరు కొట్టుకుంటున్నారు. వారి గొడవను చూడడానికి జనం పోగయ్యారు. ఒకడు తాపీగా వచ్చి అక్కడికక్కడ టీ కొట్టు తెరిచాడు. కేరళానా మజాకా!    

10, సెప్టెంబర్ 2015, గురువారం

వాట్సప్ పంచ్ 8

                                                                           ఎవరు పేద?

బాగా డబ్బున్న మారాజు ఒకరు, తన కొడుకుకు పేదరికం అంటే ఏమిటో తెలియచెప్పాలని పల్లెలకు తీసుకుపోయాడు. కొద్ది రోజులు తిరిగొచ్చాక కొడుకును అడిగాడు ''పేదరికం అంటే అర్థమైందా'' అని. అర్థమైందన్నాడు కొడుకు. ఏమర్థయ్యిందో చెప్పమన్నాడు.

కాపలా కాసేందుకు మన దగ్గర ఓకే కుక్క ఉంటే వాళ్ళ దగ్గర అరడజను కుక్కలున్నాయి.
ఈదులాడేందుకు మనకు ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటే వాళ్ళ దగ్గర పెద్ద నదే ఉంది.
మన దగ్గర బల్బులున్నాయ్. వాళ్ళకు నక్షత్ర కాంతులున్నాయ్.
మన ఇల్లు కొన్ని గజాల స్థలంలో ఉంటే, వాళ్ళ దగ్గర ఎకరాల కొద్దీ విశాలమైన భూమి ఉంది.
మనం తినేదాన్ని షాపులో కొనుక్కోవాలి, వాళ్ళు అప్పటికప్పుడు కోసుకుని, వండుకుని తాజా కూరలు తింటారు.
నేను ఆడుకోవాలంటే నాకు కంప్యూటరే దిక్కు, వాళ్ళ పిల్లలకు చాలా మంది స్నేహితులున్నారు. నా స్నేహితులంతా పేస్ బుక్ లో ఉండే ఫేక్ అక్కౌంట్ గాళ్ళు. వాళ్ళకు నిజమైన స్నేహితులున్నారు.
మనకు డబ్బుంటేనే సంతోషం. ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు కాబట్టి వాళ్లకు డబ్బుతో పనిలేదు.
వాళ్ళ తండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. కలిసి ఆడతారు, పాడతారు. మన డబ్బున్నోళ్ళకి అంత టైముండదు.  
....

కొడుకలా చెప్పుకుపోతోంటే తండ్రి నోట మాటరాలేదు. చివరికి కొడుకన్నాడు.
''థాంక్స్ నాన్నా! ఈ టూర్ వల్ల మనమెంత పేదరికంలో ఉన్నామో నాకు బాగా అర్థమైంది''      
   
               
   
                

5, ఆగస్టు 2015, బుధవారం

వాట్సప్ పంచ్ - 7

ఇంతింతై వటుడింతై... 

ఒక పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొన్నారు. 'దానికి సంబంధించిన ఫోటోలు  కావాలనుకున్న విద్యార్థులు కాపీకి 10 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు అని నోటీసు పంపండి' అని ప్రిన్సిపాల్ తో చెప్పాడు చైర్మన్. 'అలాగే సర్ !' అనేసి బయటకు వచ్చిన ప్రిన్సిపాల్ నోటీసు తయారుచేయకుండా టీచర్లను పిలచి 'కాపీ ఒక్కింటికి 20 రూపాయలు తెమ్మని చెప్పండి' అని నోటిమాటగా చెప్పాడు. 'ఓకే సర్' అని మూకుమ్మడిగా బయటకు వచ్చిన టీచర్లందరూ క్యాంటీన్లో సమావేశమయ్యారు. అనంతరం కాపీకి 40 రూపాయలు తీసుకురావల్సిందిగా ప్రతి క్లాసులో చెప్పబడింది. 

'నాలుగు రూపాయలు చేసే ఫోటో కాపీకి 30 రూపాయలంట. దారుణం కదరా.' 
'ప్రిన్సిపాలే నొక్కేస్తున్నాడురా' 
'ఆయన మంచోడే. ఇదంతా మన టీచర్ల మూకుమ్మడి దోపిడీ' 
'ఎయ్ అందరూ దొంగలే మామా' 
... 
ప్లే గ్రౌండ్లో చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోయారు.  

'మమ్మీ ఒక్కో కాపీకి 100 రూపాయలంట' ఇంట్లో అమ్మకు చెప్పాడు విద్యార్థి. 
'ఏవండీ! కాపీకి 200 రూపాయలంట' భర్తతో చెప్పింది భార్య.  

(ప్రభుత్వాలు ఏ చిన్న పని చేపట్టినా టెండరు కోట్ల రూపాయల్లో ఎందుకుంటుందో ఇప్పుడు తెలిసింది కదా. ఎవరి లెక్కలు వారివి, ఎవరి నొక్కుడు వారిది. ఎవరికి వారు నాదెంత కాస్తే కదా అనుకుంటాడు. అదికాస్తా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి ప్రజలను పాతాళానికి అణచేస్తోంది.)                                      

4, ఆగస్టు 2015, మంగళవారం

వాట్సప్ పంచ్ - 6

లంచ్ బ్రేక్ లో ఏదైనా హోటల్ లో భోంచేద్దామని ఆఫీసు నుంచి బయటకు బయలుదేరాడు మేనేజర్. వరండాలో ఆఫీసు క్లర్క్, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ లు కనిపించేసరికి తనతో పాటు రమ్మన్నాడు. బీచ్ పక్కనే ఉండటంతో సరదాగా నడిచి వెళ్తున్నారు. అలా వెళ్తుంటే మేనేజర్ కాలికి ఒక పాత దీపం లాంటిది తగిలింది. ఆలీబాబా అద్భుత దీపం అని అరిచారు మిగిలిన ఇద్దరూ. 
'అయితే దీన్ని రుద్ది, కోర్కెలు తీర్చే భూతం వస్తుందేమో చూద్దాం' అన్నాడు మేనేజర్. ఆత్రంతో ఆగలేక మేనేజరుతో పాటు మిగిలిన ఇద్దరూ కూడా రుద్దారు. నిజంగానే భూతం బయటకు వచ్చింది. 'అయ్యలారా! దీపం రుద్ది నన్ను ఎవరైతే పిలిచారో, వారు కోరిన మూడు కోరికలను నేను తీర్చగలను. కానీ మీరు ముగ్గురూ ఒకేసారి రుద్ది నన్ను పిలిచారు కాబట్టి, ఒక్కొక్కరికీ ఒక్కొక్క కోరిక మాత్రమే  తీర్చగలను. చెప్పండి ఏమి మీ కోరిక' అని మూడు తలలు తెచ్చుకుని ముగ్గురినీ చూస్తూ అడిగింది. ముందు నేనంటే నేనంటూ ఎగబడ్డారు క్లర్కూ, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ లు.
 'మీ కోరికలు తీర్చకుండా నేను వెళ్ళలేనుగా అలాంటప్పుడు ఎందుకు తొందర? ముందు మీరు చెప్పండి' అంటూ క్లర్కును అడిగింది భూతం. 
'మాహిష్మతి రాజ్యంలోని కోటలో అవంతికతో రొమాంటిక్ గా గడపాలి' అన్నాడు క్లర్కు. 'అలాగే' అంది భూతం. వెంటనే అక్కడ నుంచి మాయమయ్యాడు క్లర్కు. 
'ఇప్పుడు మీ కోరిక.' మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ ను అడిగింది భూతం. 
'పారిస్ లోని పార్క్ హయత్ లో ఇంపీరియల్ సూట్ బుక్ చేసుకుని జురాసిక్ వరల్డ్ హీరొయిన్ డల్లాస్ హోవార్డ్ తో బెడ్ షేర్ చేసుకోవాలి' అన్నాడు రిప్. అలాగే అని భూతం అనడం రిప్ అదృశ్యం కావడం రెప్పపాటులో జరిగిపోయింది. 
'ఇప్పుడు మీ కోరిక చెప్పండి ఆర్యా!' మేనేజర్ ని అడిగింది భూతం. 
అప్పటికే కుతకుతలాడుతున్నాడు మేనేజర్. ' క్లర్కు, రిప్.. ఇద్దరూ ఇంకో క్షణంలో నా ముందుండాలి' అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టుగా. 
      
        
'       
            

28, మార్చి 2015, శనివారం

వాట్సప్ పంచ్


ఏది అసలైన భాగ్యం? 

అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని.

దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. నలభై ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాబ్భై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.

అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. 'శహభాష్' అంటూ లక్ష్మీపతిని అభినందించారు.

అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, 'నేను వెళ్తున్నా' అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.
'ఎవరది ?' అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.
'నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా' ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.
'అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా!' కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.
'అవును!' ప్రతిధ్వనించింది ఆత్మ
'వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.
'అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట. ఆ పొట్ట చూడు బానలాగా ఎలా ఉబ్బిపోయిందో. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం ? నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాసస్థలం. నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకూ సమస్యలే. నాకు రక్షణ లేదు. సుఖం లేదు.
అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు .. డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా? నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు. ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తుకుతెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేనుండలేను వెళ్తున్నా!'
ఆ రాత్రి తాను కూడబెట్టిన లక్ష్మిని ఇక్కడే వదిలిపెట్టి, లక్ష్మీపతి స్వర్గానికో, నరకానికో మొత్తానికి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది. దాంతో ఈ రోజు, ఈ క్షణాన్ని ఆనందించడం మరచిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?                                     

18, మార్చి 2015, బుధవారం

వాట్సప్ పంచ్

4
                                                                          'అమర' ప్రేమికులు 
వారానికోసారి డేటింగ్ చేసుకుని మరీ ఒకరినొకరు గాఢంగా ప్రేమను ఇచ్చి పుచ్చేసుకున్నారు, అదే ప్రేమించుకున్నారు కలియుగ రాధ, కృష్ణలు. ఆ ప్రేమ గాఢత ఇద్దరి ఇళ్ళలోనూ పొగ పెట్టింది. ఎవరికి వాళ్ళు తమ పిల్లలకి క్లాసులు పీకారు.
మరుసటి రోజు ప్రేమికులు ఇద్దరూ కష్టంగా కలుసుకున్నారు. ఇక తాము కలిసి బ్రతకడం అసాధ్యం అని అర్థమైంది వాళ్ళిద్దరికీ. కాబట్టి కలిసి మరణించి వారి ప్రేమను అమరం చేద్దామనుకున్నారు.
ఆ మరుసటి రోజు అనుకున్న ప్రకారం సూసైడ్ పాయింట్ చేరుకున్నారు. తాము దూకపోయే లోయలోకి చూసేసరికి ఇద్దరికీ కళ్ళు తిరిగాయి. అయినా వారి సంకల్పం చెక్కుచెదరలేదు. ఒకరిని ఒకరు చివరిసారిగా చూసుకున్నారు. 'వచ్చే జన్మలో నువ్వు నా దానివే' అన్నాడు కృష్ణ. 
'వీల్లేదు' అరిచింది రాధ. అయోమయంగా చూశాడు కృష్ణ.
'ఏడేడు జన్మలకూ నేను నీ దాన్నే' అంది రాధ.
'పద! ఒకరి చేతులు మరొకరు పట్టుకుని దూకుదాం' అన్నాడు కృష్ణ.
'వద్దు! నీ చేతి స్పర్శకు నాలో బతకాలనే ఆశ పుట్టొచ్చు. ఈ ప్రోగ్రాం ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్సిల్ కావడానికి వీల్లేదు.' అంది రాధ.
'సరే! మూడంకెలు లెక్క పెడతాను. మూడు అనేసరికి ఒకేసారి సెకను తేడా చేయకుండా దూకేద్దాం' అన్నాడు కృష్ణ.

ఒకటి ... రెండు ... మూడు

కృష్ణ దూకేసాడు. రాధ మాత్రం పైనే ఉండిపోయింది.
లోయలోకి చూస్తూ 'సారీ కృష్ణ నన్ను క్షమించు. అలాగని మన ప్రేమకు అన్యాయం చెయ్యను.  నీ జ్ఞాపకాలలో మన ప్రేమను బతికించుకుంటాను.' అంటూ గాలిలో ఫల్టీలు కొడుతూ కిందికి పడిపోతున్న కృష్ణను జాలిగా చూడసాగింది.

ఇంతలో కృష్ణ వీపున ఉన్న పారాచ్యూట్ తెరచుకుంది.
'ఇందాకటి నుంచీ దాన్ని బ్యాక్ ప్యాక్ అనుకున్నా. పారాచ్యూట్ అన్నమాట.'  ఆశ్చర్యపోయింది రాధ.
'అమర' ప్రేమికులు కదా!
      
                            

16, మార్చి 2015, సోమవారం

వాట్సప్ పంచ్



3

పరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు. మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు   రాసినా  ఎందుకిలా జరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే రుజువు చేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు. ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివి వినిపించమన్నారు జడ్జి గారు. అవి ఇలా ఉన్నాయి:
ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు ?
జవాబు : అతను పాల్గొన్న చివరి యుద్ధంలో
ప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడ సంతకం చేశారు ?
జవాబు : పేజీ చివరన 
ప్రశ్న : మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు ?
జవాబు : ఆయన పుట్టిన రోజున
ప్రశ్న : భార్యా భర్తల మధ్య విడాకులకు ప్రధాన కారణం ఏంటి ?
జవాబు : పెళ్ళి
ప్రశ్న : ఆరు మామిడి పళ్ళను ఎనిమిది మందికి సమానంగా ఎలా పంచుతావు ?
జవాబు : మాంగో షేక్ చేసి
ప్రశ్న :  గంగా ఫ్లోస్ ఇన్ విచ్ స్టేట్ ?
జవాబు : లిక్విడ్ స్టేట్
ప్రశ్న : భారతదేశంలో ఎక్కువ మంచు పడే చోటు ?  
జవాబు : మందు గ్లాసులో
ప్రశ్న : హిందూ చట్టం రెండవ వివాహాన్ని ఎందుకు అంగీకరించదు ?
జవాబు : భారతీయ చట్టం లోని ఆర్టికల్ 20 (2) ప్రకారం ఒక మనిషి చేసిన
ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించకూడదు   

2, మార్చి 2015, సోమవారం

వాట్సప్ పంచ్

 2

'సార్ ! మా ఆవిడ కనిపించట్లేదు' పోలీస్ స్టేషన్లో  ఎస్ ఐ కి కంప్లైంట్ చేశాడు మొగుడు.   
ఎస్ ఐ : చెప్పండి! మీ ఆవిడ ఎప్పట్నుంచి మిస్సింగ్
మొగుడు : నిన్న షాపింగ్ కోసం బయటికి వెళ్ళింది. మళ్ళీ రాలేదు.
ఎస్. ఐ . : ఆవిడ ఎత్తు ఎంత చెప్పండి
మొగుడు : యావరేజ్ అనుకుంటా సర్.
ఎస్ ఐ : ఆరోగ్యం బాగుందా ?
మొగుడు : బాగానే ఉందనుకుంటా
ఎస్ ఐ : ఆవిడ కళ్ళ రంగు ?
మొగుడు : ఎప్పుడూ గమనించలేదు సర్
ఎస్ ఐ : జుట్టు రంగు ?
మొగుడు : ఒక్కో సీజన్లో ఒకలా ఉంటుంది
ఎస్ ఐ : ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు? అప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా ?
మొగుడు : ఉన్నాను సర్! కాకపోతే చీరలో వెళ్ళిందా, పంజాబీ డ్రెస్ లో వెళ్ళిందా సరిగా చూడలేదు .
ఎస్ ఐ : షాపింగ్ కు ఎలా వెళ్లారు ? ఐ మీన్ ఏదైనా వెహికల్ ?
మొగుడు : అవును సర్ ! కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది
ఎస్ ఐ : కారు రంగు ?
మొగుడు : బ్లాక్ కలర్ ఆడి ఎ 8 విత్ సూపర్ చార్జ్ డ్ 3. 0 లీటర్, వి 6 ఇంజన్ జనరేటింగ్ 333 హెచ్ పి , ఎయిట్ - స్పీడ్ టిప్ట్రోనిక్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ విత్ మాన్యువల్ మోడ్. ఎల్ ఇ డి హెడ్ లైట్స్. ఎడమ వైపు  ఫ్రంట్ డోర్ మీద సన్నగా 3 సెంటీ మీటర్ల స్క్రాచ్ ఇంకా... 
గడాగడా చెప్పేసి ఏడవడం మొదలెట్టాడు మొగుడు.
ఆ ఏడుపు చూసి కరిగిపోయిన ఎస్ ఐ,''ఊరుకోండి సర్ ! ఎలాగైనా మీ కారును వెదికి పట్టుకునే పూచీ నాది '' అన్నాడు ఆ మొగుడిని అనునయిస్తూ.