పేజీలు

కమల్ హాసన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కమల్ హాసన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జనవరి 2013, బుధవారం

వ్యధ నిండిన హృదయంతో ...

దేశంలో కొందరికే భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందా? అందరికీ ఉండదా?
ఉండదనే అనిపిస్తుంది ఈ మధ్య జరుగుతున్న సంఘటనల గురించి వింటే. బాల్ థాకరే మరణించినప్పుడు ఇద్దరు యువతులు తమ అభిప్రాయాలను సోషల్ నెట్ వర్కులో పంచుకున్నందుకు వారిని అరెస్టు చేయడంతో పాటు, వారి ఇళ్ళపై దుండగులు దాడి చేసే వరకు వెళ్ళింది. కారణం ఆ రాష్ట్రంలో శివసేన ఒక బలమైన రాజకీయ శక్తి .

అలాగే ఇప్పుడు తమిళనాట జయలలిత కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.  విశ్వరూపం సినిమా కోసం కమల్ తన సృజనాత్మక శక్తితో పాటు, ఆర్థికంగా తనకున్న శక్తినంతా పణంగా పెట్టాడు. అందులో ఏదీ వృధా కాలేదన్న విషయం సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. అంత బాగా ఉంది సినిమా. ఇలాంటి సినిమా తీసి భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి  చాటిచెప్పిన కమల్ హాసన్ను మనమందరం అభినందించాలి. కాని దురదృష్టవశాత్తూ అలా జరగడంలేదు. ఆయనపై కత్తి కట్టినట్టు జయలలిత పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ సినిమా విడుదలను అడ్డుకుంటోంది. కోర్టు తీర్పులను సైతం సవాలు చేస్తోంది. మరోవైపు ఆ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లపై దాడులు జరుగుతున్నాయి. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని వేరే చెప్పనక్కరలేదు.

వ్యధ నిండిన హృదయంతో (ఎద నిండిన హృదయంతో ... అన్న క్యాప్షన్తో విశ్వరూపం పోస్టర్లు వెలిశాయి.) కమల్ హాసన్ మీడియా ముందుకు వచ్చి కంట తడి పెట్టారు. సొంత గడ్డపై తాను ఎదుర్కొంటున్న కష్టాలను పాత్రికేయులతో పంచుకున్నారు. ఆయన చేసిన తప్పేంటి? ఉన్నదున్నట్టు  చూపిస్తూ ఒక సినిమాను నిర్మించడమా? అయినా అందులో భారతీయ ముస్లింలను కించపరిచే ఎలాంటి దృశ్యాలూ లేవు. ఒక వేళ ఉంటే ఆ కత్తిరింపు ఏదో సెన్సార్ బోర్డు చేసున్డాలి. ఇంకా అభ్యంతరాలుంటే ఆయా సన్నివేశాలను తొలగించమని సామరస్య ధోరణిలో అడగవచ్చు. అలా కాకుండా ఏకంగా సినిమానే నిషేధిస్తే నిర్మాతగా ఆయనేం కావాలి. ఇక్కడ సానుభూతితో  అనడంలేదు. భావప్రకటనా స్వేచ్ఛ ఆయనకు లేదా అని ప్రశ్నిస్తున్నా.

ఎన్నాళ్ళీ లౌకిక సన్నాయి నొక్కులు? ఎవరి ప్రయోజనాల కోసం? రాజకీయ లబ్ధి ఉంటె చాలా? దానికోసం ఎంత ఘోరానికైనా సిద్ధపడతారా? ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనే చత్రపతి శివాజీ, పృధ్వీరాజ్ చౌహాన్ వంటి వీర గాధలను తెరకెక్కించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు  చివరికి మహాత్మా గాంధీ జీవితచరిత్రను సైతం పరాయి దేశం వాళ్ళే తెరకెక్కించ వలసివచ్చింది. ఎందుకీ దురవస్థ? ఎన్నాళ్ళీ సంకెళ్ళు? ఇలాంటి పరిస్తితుల్లో హొమ్ మంత్రి షిండే  చేసిన వాఖ్యలు కొంత ఆశావహంగా ఉన్నాయి. ఆయనే కాదు ఈ దశలో భారతీయ చలనచిత్రరంగం మొత్తం కమల్ హాసన్ కు  అండగా నిలవాల్సిన అవసరం ఉంది. చిత్రం కోసం మాత్రమే కాదు. మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా!

దర్శకుడిగా, నటుడిగా కమల్ 'విశ్వరూపం'

ప్రతీదీ వివాదమౌతున్న ఈరోజుల్లో కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన విశ్వరూపం సినిమా కూడా అనేక వివాదాలను ఎదుర్కొంటూ వచ్చింది. థియేటర్లతో పాటు డీటిహెచ్ ప్రసారానికీ అనుమతించడం ఒక వివాదానికి దారితీస్తే, ముస్లింలకు వ్యతిరేకంగా చిత్రకథ ఉందంటూ మరో వివాదం. ఈ నేపథ్యంలో తమిళనాట విడుదలకు నోచుకోని ఈ చిత్రం తెలుగునాట మాత్రం విడుదలైంది.అదీ ఆచితూచీ కొన్ని థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించినా, మాట్లాడినా సహించలేని పరిస్థితులు, కళారంగాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రతీదీ రాజకీయ ప్రయోజన కోణంలో ఆలోచించే సమాజంలో ఇకపై ఇలాంటి ప్రయోగాలను మరెవ్వరూ చేసి చేతులు కాల్చుకోరేమో! ఆరు పాటలు, ఐదు పోరాటాలు, అందాల ఆరపోతల చిత్రాలే ఇక మనకు గతి.

ఇక విశ్వరూపం చిత్రం విషయానికి వస్తే, కమల్ పట్ల ఉన్న భారీ అంచనాలతో ప్రేక్షకులు కూడా భారీగానే థియేటర్లకు వచ్చారు. వారిలో చాలామందికి నచ్చని (పట్టని) కథాంశం కావడంతో ఆదిలోనే నిరాశతో కూడిన ఎన్నో నిట్టూర్పులు. అదే సమయంలో కాస్తోకూస్తో హాలీవుడ్ సినిమాలు చూసిన ప్రేక్షకులు మాత్రం కన్నార్పకుండా కమల్ వెంట తన్మయత్వంతో పరుగులు తీశారు. రెండున్నర గంటలు దాటినా, ఇంకా చూడడానికి ప్రేక్షకుడు సిద్ధంగా  ఉంటాడు. అలాంటి సమయంలో టక్కున ముగుస్తుంది సినిమా. విషయం ఏంటంటే, ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండోభాగం కూడా మరోచిత్రంగా రానుందని చివర్లో చెప్పారు. ఇది కూడా కొంతమందిని నిరాశపరుస్తుంది. ఏది ఏమైనా మన భారతీయ చలనచిత్ర పరిశ్రమ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించగలిగే చిత్రం.

కథాంశానికి వస్తే, అమెరికాలో ప్రముఖ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో డాక్టరుగా పనిచేస్తున్న నిరుపమ (పూజా కుమార్ మాథుర్ ) తన బాస్ తో (అక్రమ)సంబంధాన్ని కలిగిఉంటుంది. (భారతీయ చిత్రం కాబట్టి దీన్ని మరీ లోతుగా తీసుకువెల్లకుండా, ప్రారంభదశలోనే  పక్కదారిపట్టించారు). ఈ విషయం బయటపడితే తన తప్పును కప్పిపుచ్చుకోడానికి వీలుగా ఉంటుందన్న ఉపాయంతో, భర్తకు కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయేమో ఆరాతీయడానికి ఒక డిటెక్టివ్ ను నియమిస్తుంది నిరుపమ.  కథక్ కళాకారుడైన ఆమె భర్త (కమల్ హాసన్) ఇంటిపట్టునే ఉంటూ ఔత్సాహికులకు కథక్  నేర్పుతుంటాడు. ఇలాఉండగా ఒకరోజు నిరుపమ భర్తను అనుసరిస్తూ  వెళ్ళిన  డిటెక్టివ్, తప్పుదారిపట్టి ఒక  వేర్ హౌస్ లోకి అక్రమంగా ప్రవేశించబోతాడు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది.

అల్ ఖైదా పోరాటాలకు సంబంధించిన కథ. జీహాదీలకు ఇచ్చే శిక్షణ, వారి జీవనవిధానం, కుటుంబ నేపథ్యాలు, కరడుకట్టిన మతవాదం, అమలుచేసే శిక్షలు... ఇలాంటి అంశాలపై ఎంతో లోతైన పరిశోధనలు చేశారనిపిస్తుంది. ఆఫ్ఘన్ పర్వతపానువుల్లో చిత్రీకరించబడిన యుద్ధ దృశ్యాలు అద్భుతం. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోవు. స్పృశించిన సన్నివేశాలు సున్నితమైనవి. అయినా వాస్తవానికి దగ్గరగా,మనసుకు హత్తుకునేలా చూపించారు.  హింసాత్మక దృశ్యాలు ఉన్నప్పటికీ కథకు అనుగుణంగానే, అవసరంమేరకే  ఉన్నాయి. ఒకే ఒక పాట. మరో పాట బ్యాక్ డ్రాప్లో వస్తూంటుంది. కథక్ నేర్పుతూ సాగే ఆ ఒక్క పాటనూ అద్భుతంగా చిత్రీకరించారు. దిల్ తో పాగల్ హై, దేవదాస్ వంటి హిందీ చిత్రాలకు పనిచేసిన  పండిట్ బిర్జూ మహారాజ్ ఈ పాటకు నృత్య దర్శకత్వం చేశారు. కథక్ నాట్యాచార్యునిగా కమల్ చూపిన హావభావాలు మనోహరం. ఇదే పాత్ర మరో పాత్రగా రూపాంతరం చెందే క్రమంలో ఒక ఫైట్ ఉంటుంది. కుర్ర హీరోలు కూడా అంత ఎనర్జీతో చేయలేరేమో! ఈ ఒక్క సీన్ చాలు దర్శకుడిగా, నటుడిగా కమల్ విశ్వరూపాన్ని చాటడానికి.

హిందీలోని ఎన్నో హిట్ చిత్రాలకు, తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి సంగీతం అందించిన శంకర్-ఎహసాన్ -లాయ్ త్రయం ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

చివరగా చెప్పేదేంటంటే ఇది తప్పకచూడాల్సిన సినిమా. అది కూడా థియేటర్లో.