పేజీలు

1, నవంబర్ 2014, శనివారం

మా తెలుగు తల్లికి మల్లెపూదండ వేసేదెప్పుడు !?

దాదాపు 60 సంవత్సరాలుగా నవంబరు 1న రాష్ట్రావతరణ ఉత్సవాలు తెలుగునాట ఘనంగా జరిగేవి. మా తెలుగుతల్లికి మల్లెపూదండ అన్న శంకరంబాడి సుందరాచార్య రచించిన రాష్ట్రీయ గేయాన్నీ, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అన్న వేములపల్లి శ్రీకృష్ణ గీతాన్నీ వాడవాడలా విని పులకరించేది ప్రతి తెలుగు హృదయం. కానీ ఈసారి (2014, నవంబరు 1న )  ఆ సంబరాలు లేవు.    

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం అమలులోకి వచ్చిన జూన్ 2 వ తేదీని రాష్ట్ర ఆవిర్భావ దినంగా పరిగణిస్తూ అవతరణ ఉత్సవాలను ఆ రోజునే నిర్వహించాలని తీర్మానించుకుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణాలేంటో తెలీదు కాని తెలుగువారికిది సబబుగా అన్పించట్లేదు.  ఎందుకంటే  ఆ తేదీన తెలుగు జాతి ముక్కలయ్యింది. ముఖ్యంగా ప్రతి సీమాంద్రుడు రాజకీయ చదరంగపు బల్లపై ఓడిపోయిన పావులా బిక్కసచ్చి నిలబడ్డాడు. ఒక ఆత్మీయ బంధం తెగి విలవిలలాడాడు.  అలాంటి తేదీన ఉత్సవం ఎలా చేసుకుంటాడు?

ఆవిర్భావం అన్నా అవతరణ అన్నా పుట్టుక అన్న అర్థం వస్తుంది. ఈ కోణంలో ఆలోచిస్తే తెలంగాణకు కూడా విమోచన దినం (సెప్టెంబర్ 17) ఉంటుంది కాని ఆవిర్భావ దినం ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు విడివిడిగా ఉన్న ఈ రెండు ప్రాంతాలు  1956లో ఒక్కటై తిరిగి 2014 జూన్ 2న వేరయ్యాయి అంతే!  దీన్ని పిలిస్తే 'తెలంగాణ  వేర్పాటు దినం' గా పిలవాలి. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఈ తేదీతో అసలే సంబంధమూ లేదు. ఎందుకో తెలియాలంటే ఒక్కసారి తెలుగు రాష్ట్ర ఆవిర్భావం ఎలా జరిగిందనేది తెలుసుకోవాలి.

తెలుగువారికి ఒక ప్రత్యేక ప్రాంతం కావాలన్న కోరిక 1911 నాటిది. దక్షిణ భారతదేశంలో తెలుగువారు నివసించే ప్రాంతాలన్నిటినీ కలిపి 'అఖిలాంధ్ర రాష్ట్ర పటం' అని తయారు చేసుకున్నారు నాటి నాయకులు కొందరు. ఆ తర్వాత 1912లో కృష్ణ , గోదావరి జిల్లాల ప్రముఖులు మొదటిసారిగా ఆంద్ర రాష్ట్ర ఏర్పాటు గురించి తీర్మానం తయారు చేసుకున్నారు. 1913 మే నెల 6న గుంటూరు జిల్లా, బాపట్లలో కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలో మొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. అందులో ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదన పరిశీలించడానికి ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు.

ఆ తర్వాత 1917 వరకూ ప్రతి యేడూ ఈ సభలు జరుగుతూ వచ్చాయి. మద్రాసు రాష్ట్రంలోని 11 తెలుగు జిల్లాలు కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడాలని తీర్మానాలు జరిగాయి. అప్పటినుంచి భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు అటు కాంగ్రెస్ కమిటీకి, ఇటు నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూ ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. అవి తిరస్కరింపబడుతూనే వచ్చాయి. ఎలాగయితేనేం 1918లో బాల గంగాధర్ తిలక్ మద్దతుతో ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. అంటే రాజకీయంగా తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది.   తెలుగు వారికిది తోలి విజయంగా చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే మద్రాసుతో తెగతెంపులు చేసుకునేందుకు, కోస్తా వారితో కలిసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేందుకు రాయలసీమ ప్రజలు  అభ్యంతరాలు వ్యక్తపరుస్తూ వచ్చారు. వారిని కలుపుకు పోడానికి ఒక ఒప్పందం చేసుకోవలసి వచ్చింది. రాష్ట్రం ఏర్పడితే నదీజలాలు ఇతర వాటాలు ఎ రకంగా ఉండాలో నిర్ణయించుకుంటూ నవంబరు 16, 1932న శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు.

ఎన్నో అభ్యర్థనలు, తీర్మానాల తర్వాత  నూతన రాజ్యాంగంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పొందుపరుస్తామని 1947, ఆగష్టు 14 న నెహ్రూ చెప్పారు అయితే స్వాతంత్ర్యం వచ్చాక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. కమిటీల మీద కమిటీలు వేయడం,  అవి వ్యతిరేక నివేదికలు ఇవ్వడం మామూలయి పోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించమని 1948లో ధార్ కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా వ్యతిరేక నివేదికలే ఇచ్చింది. తెలుగువారి ఆకాంక్షలకు కాంగ్రెస్ అధిష్టానం ఏనాడూ విలువనివ్వలేదనడానికి ఇదే  నిదర్శనం. 

ప్రత్యేక రాష్ట్రం కావాలని రేపల్లెకు చెందిన  గొల్లపూడి సీతారామశాస్త్రి అనే  గాంధేయవాది  1951 ఆగష్టు లో  నిరాహారదీక్ష చేశారు. అయితే నెహ్రు చతురత వల్ల, వినోబా భావే దౌత్యం వల్ల  ఆయన  35 రోజులకే దీక్షను విరమించారు. మళ్ళీ ఓ కమిటీ, అది కూడా అదే పల్లవి.

ఈ లోగా 1952లో  దేశవ్యాప్తంగా  మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. మద్రాసు అసెంబ్లీలో తెలుగువారికి 140 సీట్లవరకు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ కు దక్కింది కేవలం 43 మాత్రమే. ఈ విధంగా తమ ప్రత్యేక  రాష్ట్ర కాంక్షను నాటి కాంగ్రెస్ పార్టీకి, ఇంకా చెప్పాలంటే నెహ్రూకు  ప్రగాఢంగా  చెప్పారు తెలుగువారు. మద్రాసులో మొత్తంగా కాంగ్రెస్ కు 152 సీట్లు వస్తే, కాంగ్రెసేతర కమ్యూనిస్ట్ పార్టీల వంటివన్నీ కలిసి యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ గా ఏర్పడ్డాయి. వాటి బలం 164. నాయకుడు టంగుటూరి ప్రకాశం. ఆయన అప్పటికే కాంగ్రెస్ ను వ్యతిరేకించి ప్రజాపార్టీని స్థాపించాడు. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోలేక పోవడంతో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. మద్రాసు ముఖ్యమంత్రిగా సి. రాజగోపాలాచారి నియమించబడ్డారు.

కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టును చేపట్టి కృష్ణా జలాలను తమిళనాడుకు తరలించాలని ప్రయత్నిచారు రాజగోపాలాచారి. తెలుగువారు రగిలిపోయారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ జ్వాలకు ఇది ఆజ్యం పోసినట్టయింది.         

ఇక లాభం లేదనుకున్న పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. 52 రోజుల తర్వాత డిసెంబరు 15న  అమరులయ్యారు. ఆయన ప్రాణత్యాగం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తెలుగువారందరినీ ఉద్యమాలకు పురికొల్పింది. అప్పటివరకు తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఆంధ్రుల సామ్రాజ్యవాదంగా అభివర్ణించి అయిష్టతను చూపిన నెహ్రూకు మెట్టు దిగక తప్పలేదు. 1952, డిసెంబరు 19న మద్రాసును విభజించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని పార్లమెంటులో ప్రకటించారు. ఫలితంగా 1953, అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా , 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం  ఆవిర్భవించింది. విజయనగరం(1979), ప్రకాశం(1970) జిల్లాలు తర్వాత ఏర్పడ్డాయి.

కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావదినం అక్టోబర్ 1 న జరగడం సమంజసం. ఎందుకంటే నాడు ఎల్ ఎస్ మిశ్రా కమిషన్ సూచించిన విధంగా భౌగోళికంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్  (కాస్త అటు ఇటుగా)                      
లేదా యధాప్రకారం నవంబర్ 1 న అయినా జరపవచ్చు. ఎందుకంటే అటు సీమాన్ధ్రులు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలోనే ఇటు తెలంగాణ లోనూ ప్రత్యేక తెలుగు రాష్ట్ర కాంక్ష రగిలింది. ఉర్దూ అధికార భాషగా ఉన్న నిజాము ప్రభుత్వంలో తెలుగు ప్రజలు తమ భాషను కాపాడుకోడానికి, గౌరవింపబడడానికి ఆరాటపడేవారు. 1921 నవంబరులో జరిగిన ఒక సమావేశంలో అల్లంపల్లి వెంకట రామారావు అనే ఆయన తెలుగులో మాట్లాడితే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ పౌరుషంతోనే మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు వంటి వారి నేతృత్వంలో ఆంధ్ర జన సంఘం స్థాప్పించబడింది.  అటు తెలంగాణ విముక్తి పోరాటంతో సమాంతరంగా తెలుగువారందరికీ ఒక రాష్ట్రం కావాలంటూ విశాలాంధ్ర కాంక్ష కూడా ప్రబలుతూ వచ్చింది. 1952 లో జరిగిన సాధారణ ఎన్నికలలో విశాలాంధ్రను సమర్ధించిన కమ్యూనిస్టులు, ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ కంటే బాగా పుంజుకున్నారు. ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోనూ, అటు మద్రాసు రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఎదురయ్యేసరికి కాంగ్రెస్ కూడా విశాలాంధ్ర పాటందుకుంది. ఫలితంగా రాష్ట్రాల పుర్విభజన చట్టం (ఎస్సార్సీ ) ఏర్పడి సయ్యద్ ఫజల్ అలీ సూచనల ప్రకారం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇది తెలుగుజాతి పూర్తి విజయం.

కాబట్టి జూన్ 2 అనేది కేవలం రెండు ప్రాంతాల విభజన తేదీ మాత్రమే. ఆంధ్రులకు గానీ, తెలంగాణా వారికి గానీ అవిర్భావదినం కాబోదు.