పేజీలు

29, జులై 2015, బుధవారం

తీరని లోటంటే ఇదీ అర్థం!



ఎవరైనా చనిపోయినప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతూ.. 'ఆయన మరణం ఒక తీరని లోటు' అని అలవాటుగా అనేస్తుంటారు. ఉన్నంత కాలం జనాన్ని పీడించి, భయపెట్టి వేధించిన వాడు పోయినప్పుడు, 'పీడా విరగడై పోయిందిరా బాబు' అని జనం సంతోషిస్తుంటే వీళ్ళెంటి తీరని లోటు అంటారు అనిపించేది. ప్రజాసేవ పేరు చెప్పి కబ్జాలు చేసి, దౌర్జన్యాలు చేసి, కోట్లు కూడపెట్టి, అధికారాన్ని అడ్డంగా వాడుకుని ఎవడైనా పోతే, ఎవరికి తీరనిలోటు అనిపించేది. నిజానికి కొంతమంది పోయినప్పుడు ఆస్తి చేతికొస్తుందని ఒకడు సంతోషిస్తాడు. తను ఆశిస్తున్న పదవికి ఉన్న ఏకైక అడ్డు తొలగిపోయిందని ఒకడు సంతోషిస్తాడు. తీరని లోటు అనే ప్రకటన పైపై మాటే. రోజుకు ఎంతోమంది పోతారు. సమాజానికి ఎప్పుడూ ఏ లోటూ రాలేదు. ఎందుకంటే ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఎవడో ఒకడు ఉండనే ఉంటాడు.  
  
కానీ అబ్దుల్ కలాం పోయాడనగానే నా మనసులోనే లోటు కనిపించింది. కీర్తి తప్ప ఆస్తి మిగుల్చుకోని వ్యక్తి, గౌరవం తప్ప శాపనార్థాలు ఎదుర్కోని వ్యక్తి, శ్రేయస్సు తప్ప కీడు తలంచని వ్యక్తి చనిపోయాడు అని వినగానే నాదన్నది ఏదో పోయిందనిపించింది. దీన్నే లోటు అంటారేమో!

ఇక ఫేస్ బుక్ లో అయితే కలాం పేరు లేకుండా ఒక్క పోస్టూ కనపడలేదు. చాలామంది కవర్ పేజీలో, ప్రొఫైల్ పిక్ గా కలాం ఫొటోనే పెట్టుకున్నారు. కలాంగారి కొటేషన్లయితే కోకొల్లలు. ఆయన నిరాడంబరత, భావుకత, చుట్టూ ఉన్న మనుషుల పట్ల ఆయన చూపించిన ప్రేమ. కార్యదక్షత, శ్రమతత్వం గురించి పత్రికల్లో  ఎన్నెన్నో కథనాలు. చదువుతూ ఉంటే అద్భుతం అనిపించినవి కొన్ని. కళ్ళు చెమరింప చేసినవి మరికొన్ని. పెళ్ళి కానివాడు ఇంతమంది చిన్నారులకు సొంత తాతయినాడు. తన ఫోటోలకు ముద్దులు పెట్టించుకున్నాడు. అంత వయసు వాడు ఈ తరానికి కూడా ఆదర్శం ఎలా కాగలిగాడు! 

మన ఉపగ్రహాలను మనమే పంపించుకోడానికి కష్ట పడిన దశ నుండి.. తక్కువ ఖర్చుతో ఇతర దేశాల ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి పంపిస్తూ లక్షల కోట్లు సంపాదించే స్థాయికి మన దేశ సాంకేతికతను తీసుకువెళ్ళిన మనిషి కలాంగారు. 

ఆయన ఆస్తులేవీ సంపాదించుకోలేదు. ఆయనే దేశానికి తరగని ఆస్తయ్యాడు. అందుకే ఆయన మరణం ఒక లోటు అనిపిస్తుంది. 

                                             

28, జులై 2015, మంగళవారం

మహనీయ వ్యక్తిత్వాలు ఇలా రూపుదిద్దుకుంటాయి



అబ్దుల్ కలాం వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు. కానీ అందరూ తెలుసుకోవలసింది ఏంటంటే ఆ వ్యక్తిత్వాన్ని అలా చెక్కిన శిల్పులెవరూ అన్నది. కలాం గారు చెప్పిందే ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకుందాం. 
కలాం చిన్నతనంలో ఒకరోజు... 
కలాం వాళ్ళ అమ్మ ఓ రోజు రాత్రి ఇంట్లో అందరికీ రొట్టెలు చేసి పెట్టింది. అయితే పని ఒత్తిడిలో పడి  రొట్టెలు మాడిపోతున్న విషయం ఆమె గమనించలేదు. కూరతో సహా ఆ మాడిపోయిన రొట్టెలనే భర్తకు వడ్డించింది ఆమె. తండ్రి ఆ రొట్టెలను చూసి ఎలా స్పందిస్తాడో అని ఎదురుచూస్తున్నాడు బాల కలాం. కానీ తండ్రి ఏమీ మాట్లాడకుండా ఆ రొట్టెలను తింటూ, కలాంను పిలచి స్కూల్లో విశేషాలేంటి అని అడిగాడు. ఆ విశేషాలు ఏం చెప్పిందీ కలాంకు గుర్తులేదు కానీ... ఆ రాత్రి రొట్టెలను మాడ్చినందుకు తన తల్లి భర్తను క్షమాపణ అడిగిన విషయం, 'పిచ్చిదానా ! నాకసలు మాడిపోయిన రొట్టెలంటేనే ఇష్టం. నువ్వేం బాధపడకు' అంటూ తండ్రి అన్న మాటలు మాత్రం గుర్తుండి పోయాయి. 
ఆ తర్వాత తండ్రికి గుడ్ నైట్ చెప్పడానికి వెళ్ళిన కలాం, 'నీకు నిజంగానే మాడిపోయిన రొట్టెలు ఇష్టమా? అని తండ్రిని అడిగాడు. అప్పుడాయన కలాంను దగ్గరకు తీసుకుని 'మీ అమ్మ రోజంతా పనిచేసి చేసి అలసిపోయింది. దానివల్ల రొట్టె మాడిఉండొచ్చు. అయినా ఒకరోజు మాడిపోయిన రొట్టె తిన్నంత మాత్రాన ఏమీ అయిపోదు. రొట్టె మాడిందని కోపంతో ఏదైనా మాట్లాడితే దానివల్ల మీ అమ్మ మనసు గాయపడుతుంది కదా. దేనివల్ల ఎక్కువ నష్టం?' అని అడిగాడు. 
ఆ మాటలు అబ్దుల్ కలాం వ్యక్తిత్వం మీద చాలా ప్రభావాన్ని చూపించింది. మనం గమనించం గానీ రోజూ మన ఇళ్ళలో మనం మాట్లాడుకునే మాటలు పిల్లల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అబ్దుల్ కలాం గొప్పదనం గురించి మాట్లాడుకునే ముందు, ఆయన తండ్రి గొప్పదనాన్ని కూడా గుర్తించాలి. అదే సమయంలో మన ఇంట్లో ఉన్న బాల కలాం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో మన పాత్రను ఎలా పోషిస్తున్నామో ఆలోచించాలి.                    
           

20, జులై 2015, సోమవారం

అందాల పోగు .. ముక్కుపోగు !


పొందికైన ముక్కుకు ఒక్క లోహపు పోగు తగిలిస్తే ముఖంలోని అందమంతా అక్కడే పోగు పడుద్ది. నచ్చిన మగ హృదయాన్ని కొల్లగొట్టాలంటే, ముక్కెర పెట్టిన ముక్కే ఎర. అందుకే దాన్ని ముక్కెర అన్నారేమో. 
ఎప్పుడూ పోష్ గా కనిపించే మన హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడూ ఒక సినిమాలోనో, ఒక పాటలోనో ముక్కుకు ముక్కెరతో కనిపించి యువహృదయాలకు గిలిగింతలు పెడతారు. 
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో...  ముక్కుకు ముత్యాన్ని తగిలించి, మూతిని సున్నాలా చుట్టి..  త్రిష ఫ్లైయింగ్ కిస్ ఇచ్చే షాట్ చూసిన రసహృదయాలు దాదాపు పదేళ్ళపాటు త్రిష పేరును కలవరించాయి. 
శబ్ద్ సినిమాలో 'లో షురూ అబ్ చాహతోం కా సిల్సిలా... ' అన్న శృంగార గీతంలో ముక్కుపోగు పెట్టుకున్న ఐశ్వర్యారాయ్ హావభావాలను చూసిన వాళ్ళకు శ్వాస వేడెక్కకుండా ఉంటుందా?  

అసలు ముక్కుపోగు అనగానే దానికి బ్రాండ్ అంబాసిడర్ అనదగ్గ అమ్మాయి టెన్నీస్ స్టార్ సానియా మీర్జా. తనతోనే ఈ మధ్య అమ్మాయిల్లో ముక్కుపోగుకు క్రేజ్ ఏర్పడింది. కాన్స్ ఫెస్టివల్ లో విద్యాబాలన్, సోనం కపూర్ లాంటి వాళ్ళు ముక్కెరతో మెరిసి, ప్రపంచ ఫోటోగ్రాఫర్లను ఆకట్టుకున్నారు. సోనాక్షీ సిన్హా నుండి నయనతార, శ్రీయ, సమంతా వరకు ఒక్కో సినిమాలో ముక్కెరతో కనిపించి అందాలు చిందించిన వారే. ఇక ఐటమ్ సాంగ్స్ వద్దకు వస్తే, ఈ మధ్యే వచ్చిన బాహుబలి సినిమాలో సైతం, మన హాట్ భామలు అంతా ఈ ముక్కెరలతో మురిపించిన వారే. స్త్రీ అలంకరణలలో ముక్కెరకు అంత ప్రత్యేకత ఉంది.

సర్వాభరణాలు:  

మెడలో కంఠాభరణం, శతమాన/మంగళసూత్రం, నల్లపూసలు...  దండచేతికి వంకీ, చేతులకు గాజులు, చేతి వేళ్ళకు ఉంగరం,..  చెవులకు దిద్దులు/ కమ్మలు/ బుట్టలు, చెంపస్వరాలు/ మాటీలు...  ముక్కుకు  పుడక, అడ్డబాస..  నడుముకు వడ్డాణం...  కాళ్ళకు పట్టాలు/ కడియాలు, కాలివేళ్ళకు మట్టెలు... స్త్రీలు అలంకరించుకునే  వీటన్నిటినీ  సర్వాభరణాలు అంటాం. ఈ సర్వాభరణాల లోనూ ముక్కెరకే విశిష్ట స్థానం. అంత విశిష్టత ఎందుకంటే ముక్కు వల్లే. 
ముఖానికి కళ్ళు అందమంటారు గానీ, శృంగారానికి ముక్కందమే ముఖ్యం. ముద్దుకు ముందుకొచ్చేది ముందుగా ముక్కే. మనిషిని గుర్తుపెట్టుకోడానికీ ముక్కే కీలకం. అందుకే తెలియని వ్యక్తి అనడానికి 'ముక్కూమొహమూ తెలియని వాడు' అంటాం.      

అన్ని ముక్కులూ ఒకలా ఉండవు.. 

ఒక్కొక్క ముక్కూ ఒక్కోలా ఉంటుంది. దేని ప్రత్యేకత దానిదే. దేని అందం దానిదే. కొందరివి సన్నగా పొడుగ్గా కొసదేరి ఉంటాయి. చివర కొంచెం వంగి  ఉండే ముక్కును కోటేరేసిన ముక్కు అంటాం (కోటేరంటే నాగలి). కొన్ని చిలుక ముక్కులు. కొన్ని వెదురు బొంగులు.  కొన్ని చప్పిడి ముక్కులు. 
కొన్ని జయప్రద ముక్కులు. కొన్ని శ్రీదేవి పదహారేళ్ళ నాటి గుండ్రటి ముక్కులు. కొన్ని ఇలియానా లాంటి కత్తి ముక్కులు, కొన్ని సమంతా లాంటి పొట్టి ముక్కులు. ప్రియాంకా గాంధీ నుండి దీపికా పడుకోన్ వరకు ప్రతి ముక్కుకూ ఒక్కో ప్రత్యేకత... ఒక్కో ముక్కుకూ వేరు వేరు అభిమానులు.  


ముక్కు సాముద్రికం: 

హస్త సాముద్రికంతో చేతిని చూసి భవిష్యత్తు చెప్పినట్టే, ముక్కును చూసి విషయం చెప్పే నాసికా సాముద్రికం కూడా ఉందంట. శతావధాని  సి.వి. సుబ్బన్న గారు ముక్కు సాముద్రికాన్ని ఇలా చెప్పారు.  అయితే అమ్మాయిల గురించే చెప్పారు సుమా! 
నాసిక దీర్ఘమై భాసిల్లుచుండిన
మగువ తా గోరిన మగని బొందు,
( పొడుగైన ముక్కున్న అమ్మాయి తను కోరుకున్న వాడిని పొందుతుంది. నిజమే కదా! పొడుగు ముక్కున్న భామకు అభిమానులు ఎక్కువమంది ఉంటారు కాబట్టి, వాళ్ళలో తనకిష్టమైన వాడిని ఎంచుకోవచ్చు.)     
నాసిక వట్రువై భాసిల్లు చుండిన
సతి యాధికారిక ప్రతిభ గొఱలు,
(వట్రువు అంటే గుండ్రని ముక్కు ఉంటే వ్యవహారాలు బాగా చక్కబెడతారు. డామినేటింగ్ స్వభావం) 
నాసిక శుకరీతి భాసిల్లు చుండిన
భామిని సుఖరీతి బరిఢవిల్లు,
(శుకము అంటే చిలుక ముక్కు ఉన్న అమ్మాయి సుఖ సౌఖ్యాలను పొందుతుంది)  
నాసిక చప్పిడై భాసిల్లుచుండిన
వికటస్వభావయై సకియ బొగులు,
(చప్పిడి ముక్కున్న అమ్మాయి హాస్య స్వభావంతో అందరితో స్నేహంగా, కలుపుగోలుగా ఉంటుంది) 
ప్రాగుపార్జిత పుణ్య సౌభాగ్య యైన
లేమ నాసిక గంధపలి వలె వెలయు,
(లేమ అంటే స్త్రీ, గంధఫలి అంటే సంపెంగ. పుణ్యవతి, సౌభాగ్యవతి అయిన స్త్రీ ముక్కు, సంపెంగ పువ్వులా ఉంటుందట)   
నని చికిత్సదీర్చికొనిన యంతమాత్ర
జక్కదనమబ్బునేమొ ప్రశస్తి రాదు.   
(అలాగని షేపు మార్పించుకుంటే చూడడానికి బాగుంటుందేమో గాని ఫలితాలు మారవు)


నాసికా సౌందర్యం: 

ముక్కు అందం గురించి మాట్లాడగానే సంపెంగ పువ్వు లాంటి ముక్కు అని వర్ణిస్తారు. ఎందుకలా అంటారో తెలీదు కానీ సంపెంగ పువ్వు రేకులు రేకులుగా విచ్చుకుని ఉంటుంది. ముక్కుకూ దానికీ పోలిక ఏంటో తెలీదు. ఇలా సంపెంగ పువ్వులాంటి ముక్కు అనడమే కాదు, అలా ఎందుకంటారో దానికో కథ కూడా చెప్పారు వసుచరిత్రలో... 
నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే :
లా నన్నొల్ల దటంచు గంధ ఫలి బల్కాకం దపంబంది, యో 
షా నాసాకృతి చూచి, సర్వ సుమన స్సౌరభ్య సంవాసమై :
పూనెం ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజము నిర్వంకలన్ .
వివిధ పుష్పాల మీద వాలి మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద నా దగ్గరకెందుకు రాదు? అని తెగ బాధపడిన సంపెంగపువ్వు, ఒక మండు వేసవికాలంలో తపస్సు చేసిందట. ఆ తపస్సు ఫలితంగా..  స్త్రీయొక్క ముక్కు ఆకారాన్ని పొంది అన్ని పువ్వుల యొక్క సువాసనలకు నిలయమై ఉండు అన్నాడట దేవుడు. అలా అయితే తుమ్మెదలు నా దగ్గరకు వస్తాయా అని అడిగింది సంపెంగ.  ఒకటి కాదు, రెండు తుమ్మెదల్ని నీకు రెండుపక్కలా నిత్యం ఉండే ఏర్పాటు చేశాను అన్నాడంట దేవుడు. వెంటనే ఆ సంపెంగ స్త్రీ యొక్క ముక్కువలె జన్మనెత్తింది. మరి దాని కోరిక ఎలా తీరింది? ముక్కుకు రెండువైపులా ఉండే నల్లని కాటుక కళ్ళే ఆ తుమ్మెదలంట. ఇది వసుచరిత్రలో రామరాజభూషణుడు అని పిలువబడే భట్టుమూర్తి (రాయలవారి అష్టదిగ్గజాలలో ఒకడు) చెప్పిన ముక్కు సంగతి.  “నువ్వు పువ్వన నవ్వు జవ్వని నాసిక” అని కథానాయిక ముక్కును నువ్వు పువ్వుతో పోల్చాడు చేమకూర వేంకట కవి. 
నా మటుకు నాకు అమ్మాయి ముక్కును లిల్లీ పువ్వుతో పోల్చాలనిపిస్తుంది. సన్నగా, పొడుగ్గా, చివరల చిన్నగా విచ్చుకున్న ముక్కు పుటాలతో అందంగా ఉండే ముక్కులన్నీ నాకు లిల్లీ పువ్వులా కనిపిస్తాయి.
ఇంకో విషయం ఏంటంటే అందరూ అమ్మాయి ముక్కునే పొగడుతారు కానీ, మగవారి ముక్కుకూ అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. 

ఎన్టీఆర్ ముక్కుకు సాటి టాలీవుడ్ లో మరో ముక్కు కానరాదు. ఆయన ఏ పాత్ర ధరించినా అంతగా నప్పడానికి కారణం ఆయన ముక్కే. అమితాబ్ బచ్చన్, స్వర్గీయ రాజీవ్ గాంధీల  ముక్కులకు కూడా చాలా మంది ఆడ అభిమానులు ఉండేవారు.   
ముక్కెర విశిష్టత: 
అలంకరణ అన్నది మానవ నాగరికతలో చోటుచేసుకున్నప్పటి నుండీ ముక్కెరకు విశిష్ట స్థానం ఉంది. 'కస్తూరీ తిలకం... ' అని మొదలుపెట్టి 'నాసాగ్రే నవ మౌక్తికం...' అంటూ కృష్ణుడి రూపాన్ని పొగడుతాం. అంటే కృష్ణుడు కూడా ముక్కుకు ముత్యాన్ని అలంకారంగా పెట్టుకున్నాడంట. దీన్నిబట్టి స్త్రీలే కాదు పురుషులూ ముక్కుకు ఆభరణం ధరించేవారని తెలుస్తుంది. 
  
ఇక ముక్కెర విషయానికి వస్తే 7-8 శతాబ్దాల కాలంలో ఆది శంకరాచార్యులు తన సౌందర్యలహరిలో అమ్మవారి ముక్కెర గురించి ఒక శ్లోకంలో ఇలా వర్ణించారు.                              
అసౌ నాసావంశ - స్తుహినగిరివంశధ్వజపటి! 
త్వదీయో నేదీయః - ఫలతు ఫలమస్మాక ముచితమ్, | 
వహత్యన్త ర్ముక్తా - శ్శిశిరకర నిఁశ్వాస గళితం 
సమృద్ధ్యా య త్తాసాం - బహిరపి స ముక్తామణిధరః || - శ్లో     

అసౌ నాసా వంశ అంటే  వెదురును పోలిన ముక్కు అని అర్థం. అమ్మవారు శ్వాసిస్తున్నప్పుడు, ఆమె బయటకు వదిలే గాలి ముక్కుకు వెలుపల ఘనీభవించి ముత్యమయ్యిందంట.

చరిత్రలో ముక్కెర గురించిన ప్రస్తావనలు చాలా ఉన్నాయి. అంతేకాదు చరిత్రలో కొందరు మహానుభావుల జీవన గమనాన్ని మార్చినవి కూడా ఈ ముక్కెరలే. 
14వ శతాబ్దంలో జీవించిన  వేమన విరాగిగా మారడానికి కారణం ముక్కెరే. ఇదే శతాబ్దంలో శ్రీనివాస నాయకుడు అనే వ్యాపారి భక్త పురందర దాసుగా మారి, దాదాపు నాలుగు లక్షల సంకీర్తనలు గానం చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది ఈ ముక్కెరే. 17వ శతాబ్దంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో బెజవాడ కనకదుర్గ ముక్కెర గురించి వ్రాశారు. అంటే సృష్టి మొదలు, అంతమూ ముక్కెర తోనే ముడిపడి ఉన్నాయన్నమాట.
  

ఒకప్పుడు మన సమాజంలో ముక్కుకు ముక్కు పుడక లేని స్త్రీలు ఉండేవారు కాదు. మన మగువల సౌందర్యాభిలాష అలాంటిది. వివిధ ప్రాంతాలలో ఈ ముక్కు పోగుకు రకరకాల పేర్లు, ఆకారాలు  ఉన్నాయి.  అడ్డకమ్మ, అడ్డబాస, దోటిముక్కర, నత్తు, బులా(కి)(కు), బేసరి, ముంగర, ముక్కఱ, ముక్కుపుడక, ముక్కుపోగు, వెడల్పాటి భుర్యా (ముక్కుపోగు )...  ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా వీటిని ధరిస్తారు. ఆ మధ్యన ఇది కనుమరుగై ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటుంది.



ముక్కుపుడక ఎందుకు?  

 స్త్రీలు చాలా త్వరగా ఉద్వేగానికి లోనవుతారు. ఆ సమయంలో ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని ముక్కుపుడక గ్రహిస్తుంది. స్త్రీలు సూర్య, చంద్రుల ఆకారంతో తయరూచేసిన మక్కుపుడక ధరిస్తారు. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు కుడి, ఎడమ సుషుమ్నాలు ఆధ్యాత్మిక  శక్తిని వికసింప జేస్తాయి. వజ్రంతో తయారు చేసిన ముక్కు పుడక ధరించడంవల్ల ఉష్ణం సమతులనమౌతుందట.








ఎవరికి ఎలాంటి ముక్కు పోగు:

ముక్కుపుడక బాగుంటుంది కదా ఏదో ఒక ముక్కుపుడక కొనేసి పెట్టుకుంటే అందం అటుంచి, అమ్మోరిలా కనపడే ప్రమాదం ఉంది. ప్రతి ముక్కుకూ ముక్కెర అవసరం లేదు. జయప్రద ముక్కుకు ముక్కుపుడక అవసరమా?  కొందరికి ముక్కుపోగు నప్పితే, కొందరికి ముక్కుపుడక బాగుంటుంది. ప్రత్యేకంగా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, పండుగలప్పుడు ప్రత్యేక అలంకారంతో పాటు ముక్కెర బాగుంటుంది. ముక్కుపోగు అనేది కొందరికి అందంగా ఉంటే, ఇంకొందరికి సెక్సీగా ఉంటుంది. కాబట్టి ఎంపికకు ముందు ఒక్కోదాన్ని కొన్ని రోజులు వాడి ప్రయోగాలు చేసి చూడాలి. దేనికి ఎక్కువ కాంప్లిమెంట్లు వస్తే దాన్ని ఫిక్స్ చేసుకోడం బెటర్. సానియా లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్ ల సలహా తీసుకుంటారు. అది మామూలు ఆడపిల్లకు కుదిరేపని కాదుగా. 
     

మగని మనసుకు గుర్తు మగువ ముక్కుపుడక...   

ముక్కుపుడక మీద ఏకంగా ఓ సినిమా తీసేసి అందులో ఓ పాట ఇలా పెట్టారు. స్త్రీకి ముక్కుపుడక అనేదాన్ని ఆమె మేనమామ లేకపోతే పెళ్ళయ్యాక మొగుడే ఇవ్వాలంట. వేరేవారు ఇస్తే తీసుకోవడం తప్పంట. ఎందుకంటే ముక్కును  అందంగా చూసుకోవాలి అనుకునేవాడే ముక్కెర కొనివ్వాలి అనుకుంటాడు. ముక్కును అందంగా చూసుకోవడం అంటే ఆమెను ఇష్టపడుతున్నట్టు లెక్కేగా. అలాంటివాడి నుండి ముక్కెర తీసుకోవడం అంటే ఆమె కూడా అతన్ని ఇష్ట పడటమే. అంతుంది కథ. అందుకని మొగుడు పెళ్ళాన్ని ఎంత ఇష్టపడేదీ ముక్కుపుడకే చెప్తుంది.



శృంగారంలో ముక్కుపుడక:

ఇష్టపడ్డ మగాడు ముందు నిలచినా, లేక అతని ఆలోచనలు మనసును కమ్ముకున్నా ఆమె ఉచ్వాస, నిశ్వాసల వేగం పెరుగుతుంది. దాంతో లలన నాసికా పుటాలు అంటే స్త్రీ ముక్కుపుటాలు అప్రయత్నం గానే పెద్దవి అవుతాయి.  తీవ్ర మైన ఉత్తేజం పొందితే, ఇట్లా జరుగుతుంది. అప్పుడు ఆ ముక్కుకు ఉన్న ఆభరణం కూడా కదులుతూ, కాంతిలో మెరుస్తూ, కొత్త అందాన్ని తెస్తుంది. 
అందుకే అంటున్నా అందాల పోగు... ముక్కుపోగు అని.      










          

15, జులై 2015, బుధవారం

బాహుబలి - ది బిగినింగ్ ఈజ్ నాట్ కన్విన్సింగ్ !



బాహుబలి (ఓ కట్టప్ప కథ!) ..  

బాహుబలి సినిమా మొదటి ఐదు రోజుల్లో రూ.215కోట్లు వసూలు చేసిందంట. నిజమే అయ్యుండొచ్చు. కానీ వసూలు చేసింది సినిమా కాదు. వసూలు ఏజెంట్లు చాలా మంది ఉన్నారు. టివి మీడియా, ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, రాజమౌళి(దర్శకుడు కాబట్టి తప్పదనుకోండి), నిర్మాతలు (కోట్లు పోసాక రాబట్టుకోవాలి కదా మరి), సినీ అభిమానులు... ఇంకా చాలా మంది ఏజెంట్లు ఉన్నారు. ఒక్క అభిమానులకు తప్ప మిగిలిన వారందరికీ, ఈ రకమైన ప్రచారంతో ఎవరికి ఉండే లాభాలు వాళ్లకు ఉంటాయనుకోండి. 

ఏడాది ప్రచారం   

ఏడాది నుంచి జనం నోళ్ళలో బాహుబలి పేరు నానింది. ప్రమోషన్ ఎంతలా జరిగిందంటే.. మొదటి రోజే సినిమా చూడకపోతే తలవంపులే అన్నట్టు ఒకడు, చేతిలో బాహుబలి మొదటి రోజు టికెట్ పెట్టుకుని 'సిటీలో హయ్యస్ట్ ఇన్ఫ్లుయన్స్ ఉపయోగిస్తేనే కానీ దొరకలేదు మామా' అని గొప్పలు పోయేవాడు ఒకడు, 'ఉత్త మాటలు చెప్పడం కాదు, నాకు మా ఇద్దరు ఫ్రండ్స్ కీ టిక్కెట్లు తెచ్చివ్వు. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం' అంటూ బాయ్ ఫ్రండ్ ప్రేమకు పరీక్ష పెట్టిన అమ్మాయిలు, 'మా అబ్బాయి చంపేస్తున్నాడండీ. మనకెవరైనా బాహుబలి టికట్లు ఇప్పించగలుగుతారా?' అంటూ కొలీగ్ ని అడిగిన ఉద్యోగులు, 'మా వాడు నిన్నటి నుంచీ బాహుబలి టికట్ల కోసం థియేటర్ల వెంబడి తిరుగుతూనే ఉన్నాడు' అంటూ తమ కొడుకు ఘనకార్యం ఏదో చేసినట్టు పక్కింటావిడతో గొప్పలు చెప్పిన ఇల్లాలు ... ఇలా సినిమా విడుదల నాటికి చెప్పలేనంత మౌత్ పబ్లిసిటీ జరిగిపోయింది. దాంతో కలెక్షన్ల వర్షం కురిసింది. భారతీయ సినిమా వసూలు రికార్డులను బలంగా బద్దలుకొట్టింది బాహుబలి. 

ప్రేక్షకులేమన్నారు.. ? 

అయితే సినిమా విడుదలైన కొద్ది గంటల్లో ప్రభాస్ శివలింగానికి బదులు పెద్ద ఝండూ బామ్ బాటిల్ ను మోసుకొస్తున్న ఫోటో ఒకటి ఫేస్ బుక్ లో హల్ చల్ చేసింది. నిజమా! అంత బోరు కొట్టిందా అనుకునే లోపు, అద్భుత రేటింగ్ లను ఇస్తూ రివ్యూలు వచ్చాయి. సూపెర్బ్ అనీ, ఎపిక్ అనీ రకరకాలుగా ప్రముఖులు కామెంట్ చేశారు. రాజమౌళి సాధించాడు అనుకునే లోపు సినిమా చూసొస్తున్నా అంటూ వచ్చిన వాడు 'పరవాలేద'న్నాడు. ఇంకొకడు ఫోన్ చేసి 'ఏవరేజ్ ' అన్నాడు. 'ఒకసారి చూడొచ్చు' అని ఒకడన్నాడు. ఇదేంటి?  రివ్యూలకీ, మౌత్ టాక్ కీ ఈ తేడా ఏంటి ? సినిమా సామాన్య ప్రేక్షకుడిని, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుడిని తృప్తి పరచలేక పోయిందా? గ్రామాలలో అయితే, సినీ భాషలో చెప్పాలంటే 'సి' క్లాస్ సెంటర్లలో ప్రేక్షకులు అసలు తృప్తిపడలేదు. 
ఎందుకంటే... 

ప్రేక్షకులు అసలు తృప్తిపడలేదు. ఎందుకంటే... 

ఆదివారం ప్రసాద్ మల్టిప్లెక్స్ లో సెకండ్ షో టిక్కట్టు దక్కించుకుని దర్జాగా కూర్చున్నా. 'నేనూ బాహుబలి చూశాను' అని రేపు ఆఫీసులో చెప్పుకోవచ్చు అనుకుంటున్నా. నిజానికి డాల్బీ అట్మొస్ ఎఫెక్ట్ తో చూడాలనుకున్నా. కానీ ఆ సౌకర్యం ఒక స్క్రీన్ కే ఉంది. ఆ టిక్కట్టే కావాలంటే ఇంకో వారం ఆగాలి కాబట్టి అడ్జస్ట్ కాక తప్పలేదు. 
సెన్సార్ సర్టిఫికేట్ పడి, కృతజ్ఞతలు తెలుపుకుని బ్యానరు కనపడగానే 'బాహుబలీ' అని అరిచాడు ఓ బుడుగు. ఐదారేళ్ళ ఆ  పసివాడి ఉత్సాహానికి హాలంతా నవ్వింది. అంటే రాత్రి పదిన్నరకు చిన్న పిల్లల్నేసుకుని, ముసలాల్లని చేయి పట్టుకుని నడిపిస్తూ, అబాలగోపాలమూ తరలివచ్చిందన్న మాట. 

సినిమాలో ఆఖరు సీన్లో కట్టప్ప వెనుకనుంచి బహుబలిని కత్తితో పొడుస్తాడు. సినిమా అయిపొయింది. 'అదేంటి? సినిమా అయిపోయిందా?' అనడిగింది ఓ ఇల్లాలు. 'మిగతాదంతా రెండో పార్టులో చూపిస్తారు.' చెప్పాడు పదిహేనేళ్ళ కొడుకు. 'ఛ! ఇదేమన్నా సీరియల్లా? మూడేళ్ళు తీశారన్నావ్ ఇదేనా? నిద్రంతా పాడు... ' గొణుక్కుంటూ జనంతో ఎగ్జిట్ గేటు వైపుకు కదులుతోంది ఆ సగటు గృహిణి. ఖాళీ అయిన సీట్ల వంక చూస్తే చాలామంది అలాగే కూర్చుని ఉన్నారు. ఐ మీన్ గురక పెట్టి నిద్రపోతున్నారు. ఒకతన్ని తట్టి లేపాడు స్నేహితుడు. 'ఓర్నీ నిద్రపోయావా?' అడిగాడు. 'వార్ సీన్ మొదలైన కాసేపటికి నిద్ర పట్టేసింది బాబాయ్.' కళ్ళు నులుముకుంటూ లేచాడతను. రికార్డులను సృష్టించే లక్ష్యంతో మొదటిసారి సగటు ప్రేక్షకుడిని రాజమౌళి నిర్లక్ష్యం చేశాడా అనిపించింది.

నిజానికి 'ది బిగినింగ్' లో సినిమా మొదలయ్యింది అంతే. 

పాత్రలు, పాత్రల స్వభావాలు పరిచయమయ్యాయి. మామూలుగా అయితే ఇంటర్ వెల్ లో ట్విస్ట్ ఇచ్చి వదులుతారు. ఇక్కడ సినిమా అయిపొయింది అంతే తేడా. ' విలన్ గా రాణా అదుర్స్' అని ఎవరో బాలీవుడ్ పెద్దాయన అన్నాడు. అసలు ఇందులో రాణా విలనిజం ఏం కనిపించిందో ఆయనకు! రమ్యకృష్ణ ఏక్షన్ సూపర్బ్ అన్నారు. ఒక్క సీన్ కూడా అలా అనిపించలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది బాహుబలి కథ కాదు, కట్టప్ప కథ. సినిమా అంతా అతనే కనిపించాడు. చివరి ట్విస్ట్ కూడా అతనిమీదే ఉంది. సత్యరాజ్ పాత్ర వరకు బాగుంది. 
ఒక్క విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు డబ్బు పెట్టే నిర్మాతలు దొరక్క, తక్కువ ఖర్చులో సినిమాలు ఎలా చెయ్యొచ్చో చెబుతూ, సామాజిక మాధ్యమంలో గందరగోళం ట్వీట్ లతో కాలక్షేపం చేస్తుంటే, రాజమౌళిని నమ్మి 250 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధం కావడం గొప్పే. ఆ గొప్పదనం ఏ మాత్రం తగ్గకుండా సినిమాలో విజువల్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ అన్న ఆలోచనే ఎక్కడా రాలేదు. 
జలపాతం సన్నివేశాలు చూడాల్సిందే. హీరో జలపాతం పైకి చేరుకునే క్రమంలో వచ్చే రొమాంటిక్ సాంగ్ ను అద్భుతంగా చిత్రీకరించారు రాజమౌళి. 
ఇక రెండోది మాహిష్మతి సామ్రాజ్యం.  తెలుగు తెరపై నిజంగా అపూర్వం. 
మూడోది యుద్ధం
కథాపరంగా...  రాజ్యాధికారం ఎవరికి ఇవ్వొచ్చో తేల్చడానికి పనికొచ్చే కథాంశం. దీన్ని మరీ అంతసేపు సాగతీయక్కరలేదు. డబ్బులు పెట్టింది ఇక్కడే. సగటు ప్రేక్షకుడికి  బోరు కొట్టించిందీ ఇక్కడే. రాజమౌళికి కితాబులు దక్కిందీ ఇక్కడే. భారీ కలెక్షన్లకి కారణమూ ఇదే. అసలు రెండు భాగాలను కలిపేసి కథ రక్తికట్టాక క్లైమాక్స్ లో ఇలాంటి యుద్ధం ఉంటే సినిమా నిజంగా ఎపిక్ అయ్యుండేది. ఇప్పుడు ఇది కేవలం ఎ - పిక్ అంటే ఒక చిత్రం.. అంతే. 

రీజన్ కు అందని విషయాలు :

బాహుబలి గానీ అతని కొడుకు శివుడు గానీ అంత శక్తిమంతులు ఎలా అయ్యారు? 

ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వంలో వచ్చిన 'సీతారామ కళ్యాణం' సినిమాలో రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకలించే సన్నివేశం ఉంటుంది. అది కల్పిత సన్నివేశమే అయినా రావణాసురుడి లాంటి శక్తిశాలికి సైతం సూపర్ పవర్స్ ఇవ్వలేదు ఎన్టీఆర్. పర్వతాన్ని ఎత్తడానికి రావణుడు పడే యాతన ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ శివుడు ఒక భారీ రాతి శివలింగాన్ని భుజాన ఎత్తుకుని నీళ్ళలో దూకడం మరీ మచ్ అనిపించింది. 
తన కొడుకును కాదని, తోడికోడలు కొడుకుపై అన్నివిషయాలలోనూ రాజమాత మొగ్గు చూపడానికి కారణం ఏంటి? వాళ్ళు పెద్దయ్యాక యుద్ధానికి వెళ్ళేటప్పుడు గానీ ఎవరు ఎలాంటి వారు అన్న విషయం తేలలేదు. కానీ చిన్ననాటినుంచీ బాహుబలికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినట్టు? 
ఇకపోతే 'మరణం' అంటూ తమ సైనికులు యుద్ధభూమి నుంచి భయపడి పారిపోయి వస్తుంటే, వారిని ఉత్తేజపరచి, తిరిగి యుద్దోన్ముఖులను చేయడానికి బాహుబలి చేసిన ప్రసంగం చప్పగా ఉంది. మూడు ముక్కల్లో 'నేను చెప్పాను కాబట్టి,మీరు రెచ్చిపోండి!' అన్నట్టుగా ఉంది. యుద్ధాన్ని అంతసేపులాగి, బాహుబలి వ్యక్తిత్వాన్ని చాటే ఈ ముఖ్యమైన సన్నివేశాన్ని అంత తేలికగా ఎందుకు తీసుకున్నారో!

కొన్ని సీన్లను చాలా చక్కగా తీశారు రాజమౌళి. 

బాహుబలి పేరు వినగానే అన్నిరకాల కళాకారులు, బానిసలూ ఉత్తేజం పొందడం బాగా తీశారు. అయితే అక్కడే ప్రతినాయకుని రియాక్షన్స్ మరింత జాగ్రత్తగా తీయాల్సింది. ఎందుకంటే...  కొన్నేళ్ళ నుంచీ ఆ రాజ్యంలో ఏ పేరయితే వినబడనీయకుండా చేశాడో, ఆ పేరు ఇన్నాళ్ళకు అనుకోకుండా వినబడితే, ఒక క్రూరుడి ప్రతిస్పందన ఇంత చప్పగా ఉండదు. 
ఇక సినిమాలో హాస్యం శూన్యం. అలాంటిది ఏదయినా ఉందంటే... అది కాలకేయ సైన్యం మాట్లాడే భాష.  మాయాబజార్ లాంటి ఎపిక్ లోనూ కావలిసినంత హాస్యం ఉంది. ఈ సినిమాలో అలాంటిది ఎక్కడా లేకపోవడం సామాన్య ప్రేక్షకుడికి అసంతృప్తిని కలిగించింది.  
ఈ లోపాలన్నిటినీ రెండవ భాగం సరిచేసుకుంటుంది. ఇది తథ్యం. ఎందుకంటే ముందుంది అసలు కథ. అందులోనూ విజువల్స్ కే ప్రాధాన్యత ఇచ్చి, కథను పలుచన చేస్తే, ఇకపై ఇలాంటి చిత్రాలను, పబ్లిసిటీని జనం నమ్మరు. ఇకపై తెలుగుచిత్రాలకు ఇంత బడ్జెట్ గాని, క్రేజ్ గానీ, ఇంత స్థాయిగానీ రాదు. 
  
                                                                         
                                        
                              

9, జులై 2015, గురువారం

బాహుబలి - భళాభళి!

అపుడెపుడో 'మొఘల్ - ఎ - ఆజం' సినిమాని చూడ్డానికి, హైదరాబాద్ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని ముందురోజే నగరానికి చేరుకునే వారంట. రాత్రంతా లైన్లోనే కునికిపాట్లు పడి, తెల్లారే టికెట్టు దక్కించుకుని సినిమా చూసి పోయేవారంట. 'రోజులు మారాయి' సినిమాకు కూడా అలానే జరిగిందంటారు ఆ తరం వాళ్ళు. నా చిన్నతనంలో ఎన్టీఆర్, కృష్ణ, ఏయన్నార్ సినిమాలకు మొదటిరోజు మొదటి ఆట చూసి రావడం ఒక హీరోయిజం. ఇక చిరు సినిమాలు వచ్చేసరికి  అడ్వాన్సు బుకింగ్ సిస్టం వచ్చేసింది. అయినా మొదటి మూడు రోజుల్లో ఏదో ఒక ఆట చూడాల్సిందే. గ్యాంగ్ లీడర్, గీతాంజలి, శివ, రోజా లాంటి సినిమాలకు కొద్ది రోజుల వరకూ టిక్కెట్లు దొరక్క ఇక్కట్లు పడేవారు జనం. ఆ వైభవం కాస్తా వినోదాత్మక టీవీ చానెళ్ళ ప్రవేశంతో తెరమరుగయి పోయింది. అందునా కొత్త సినిమాలకు టెలివిజన్ రైటు అంటూ అమ్ముకోవడం మొదలయ్యాక సినిమాకు గ్లామర్ లేకుండా పోయింది. సినిమా రిలీజవుతోంది అంటే హిట్ టాక్ వస్తే చూద్దాంలే అంటున్నారు జనం. ఒకవైపు సక్సెస్ మీట్ అంటూ కన్నీళ్లు తుడుచుకునే ఏర్పాట్లు జరుగుతుండగానే, మంచి క్వాలిటీతో పైరసీ వీడియో రెడీ. అలాంటిది చాన్నాళ్ళ తర్వాత ఒక సినిమా కోసం, అదీ ఒక తెలుగు సినిమా కోసం జనం ఇంతగా ఎదురుచూడటం, అడ్వాన్సు టిక్కెట్ల కోసం బారులు తీరడం చూస్తున్నాం.  

ఇదంతా జక్కన్న దర్శకత్వ మహిమే కావచ్చు. ఒక దర్శకుడిగా మించి మార్కెటింగ్ ప్రతిభను చూపించడమూ కావచ్చు. మహామహులు పెట్టుబడి పెట్టారు కాబట్టి, సంయుక్తంగా చేపట్టిన భారీ పబ్లిసిటీ మహిమ కావచ్చు. సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి వారి నుంచి ప్రతి సినీజీవి నోటి వెంటా బాహుబలి మాటే. మేకింగ్ అంటూ మొదలుపెట్టి, ఒక్కో క్యారెక్టర్ నూ పరిచయం చేస్తూ కొన్ని, విశేషాలను బహిర్గతం చేస్తూ కొన్ని ట్రయిలర్లను విడుదల చేయడం, వాటిని సోషల్ మీడియా యువతకు చెప్పలేనంత దగ్గర చేయడం జరిగింది. ట్రయిలర్ రిలీజ్ కాగానే క్షణాల్లో యువత చేతుల్లో సర్క్యులేట్ అయ్యింది. మరి ఇంత హైప్ క్రియేట్ కావడం మంచిదేనా? 

ముందు సినిమా విశేషాలను చూద్దాం. 
  • రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రాల బడ్జెట్ రూ. 250 కోట్లు. 
  • మొదటి భాగానికే రూ.135 కోట్లు అయ్యిందని వినికిడి. కొన్ని పత్రికలు 150 కోట్లు అనికూడా రాశాయి..ఏదయినా ఇదొక చరిత్రే.     
  • దాన్ని మించిన చరిత్ర ఏంటంటే, మొదటి భాగం 162 కోట్లు బిజినెస్ చేయడం. 
  • ఇందులో థియేటర్ బిజినెస్ 125 కోట్లయితే, శాటిలైట్ హక్కులకు 36 కోట్లు, ఆడియో రైట్స్ 1 కోటి చొప్పున మొత్తం 162 కోట్లు అని  పత్రికా కథనాలు చెబుతున్నాయి.   
  • ఒక్క తెలుగు వెర్ష‌న్ కే రూ.82.30 కోట్ల బిజినెస్ చేసి ఆల్ టైం రికార్డ్ న‌మోదు చేసింది.
  • తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, మ‌ళ‌యాల భాష‌ల్లో జులై 10న ఏకంగా 4000 పై చిలుకు థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. 
  • ఎపి, తెలంగాణా రాష్ట్రాలలో 1400 వందల థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. కర్ణాటకలో 150 థియేటర్లు, కేరళలో 250 థియేటర్లలో విడుదలవుతోంది.  
  • ఇక ప్రీమియ‌ర్ షోల‌ను ఏపీ, తెలంగాణలో జూలై 9 అర్ధ‌రాత్రి ఒంటిగంట‌కే వేయ‌నున్నారు.
ఇక చిత్ర నిర్మాణ విశేషాల గురించి చెప్పుకుంటూ పొతే ఓ పుస్తకం రాయాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ మొదటికొద్దాం. మరి ఇంత హైప్ క్రియేట్ కావడం మంచిదేనా? 

కొద్ది రోజుల క్రితం '3' సినిమా కోసం ధనుష్ పాడిన 'కొలెవరి' పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. సోషల్ మీడియాలో అది సృష్టించిన సంచలనం కూడా గుర్తే కదా. చివరికి సినిమా రిలీజయ్యాక పరిస్థితి ఏమయ్యింది? దానికి, దీనికి పోలిక లేకపోవచ్చు. కానీ ప్రేక్షకుడి అంచనాలను మితిమీరిన స్థాయికి తీసుకెళ్ళాక అంతే స్థాయిలో తృప్తి పరచడం అంత వీజీ కాదు మరి. 

మరో  విషయం ఏంటంటే ఎంత మంచి కథ అయినా రెండు భాగాలకు సర్దినప్పుడు, రెండవ భాగం పలుచన కాకుండా మొదటి భాగాన్ని కాస్త సాగదీయడం జరుగుతుంది. అలాంటిది ఇందులో కూడా జరిగి ఉండొచ్చు. 

కేవలం విజువల్ ఎఫ్ఫెక్ట్స్ తో ఇంగ్లీష్ సినిమాలా తెలుగు సినిమాను నడపడం కష్టం. మన సినిమాలకు కథ, సెంటిమెంటు, ప్రేమ, పాటలు, యాక్షన్, గ్లామర్... ఇలా చాలా ఎఫెక్టులు ఇవ్వాలి. 

ఏది ఏమైనా ఇంకాసేపటిలో అటు బాహుబలి సినిమా భవిష్యత్తు, ఇటు భావి తెలుగు సినిమా రూపురేఖలు స్పష్టం కానున్నాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఈ చిత్ర ప్రభావం చిన్న సినిమాలపై ఎలా ఉండబోతోందో అన్నది చూడాలి. ముఖ్యంగా 'రుద్రమదేవి' సినిమాపై ఇది చాలా ప్రభావం చూపే వీలుంది.