పేజీలు

22, మే 2019, బుధవారం

శ్రావణి, సారా, లహరి, పూజ ... ఎవరీ అమ్మాయిలు?

 
మజిలీ, చిత్రలహరి, జెర్సీ, మహర్షి... ఇవి ఈ మధ్య తెలుగులో విజయవంతమైన చలనచిత్రాలు. మహర్షి సినిమా 'విజయం' గురించి మాట్లాడితే... మిగిలిన  సినిమాలు 'ఓటమి'ని అధిగమించడం లేదా ఓటమి బాధ నుండి బయటపడటం గురించి మాట్లాడాయి. ఈ రోజుల్లో యూత్ ని ఆకట్టుకుంటేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అలాంటిది ఈ సినిమాల్లో యూత్ ని అంతగా ఆకట్టుకున్న అంశాలు ఏమున్నాయి అంటే... అవే!... గెలుపు ఓటములు.
 
అవును! నేటి యువత నిత్యం గెలుపు కోసం పోరాడుతోంది. ఇటు సమాజం కానీ.. అటు ప్రభుత్వం కానీ, రాజకీయాలు కానీ యువతను పట్టించుకోవట్లేదు. మారిన సామాజిక పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీ నేపథ్యంలో కేవలం బతకడం మాత్రమే కాదు... 'అంతకు మించి' కోరుకుంటోంది యువత. అందుకోసం తమ ఉనికిని చాటుకోడానికి, కాపాడుకోడానికి సర్వశక్తులు ఒడ్డి నిత్యం పోరాడాల్సివస్తోంది. ఇందులో ఓడిపోతున్న వారే ఎక్కువ. అందుకే మజిలీ, చిత్రలహరి, జెర్సీ చిత్రాల్లో జీవితంలోనూ, కెరీర్ లోనూ ఓడిపోయిన హీరోల్లో తమను తాము చూసుకున్నారు. ఇక మహర్షి సినిమాలో రిషిలో తమ భవిష్యత్తును చూసుకున్నారు. ఈ సినిమాలు విజయవంతం కావడానికి ఇదే కారణం. 

కానీ మన టాపిక్ అది కాదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని నానుడి. అంటే అతని విజయానికి కారణం ఆమె సహకారం అని అర్థం. అదేం కాదు.. అమ్మాయిలెప్పుడూ విజేతలైన మగాళ్ల వెనుకే పడతారు కాబట్టి ఆ సామెత వచ్చిందని జోకులు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఈ నాలుగు సినిమాల్లోని మగాళ్ల వెనుక ఉన్న ఆడవాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 

మజిలీ:


ఇందులో పూర్ణ జీవితంలో అన్షు, శ్రావణి (ఈ పాత్రను సమంత అద్భుతంగా పోషించింది) అనే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఏ మగాడి జీవితంలో అయినా తొలిప్రేమలో అన్షులాంటి అమ్మాయి ఒకరు ఉండటం కామన్. ఆ ప్రేమ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఈ రోజుల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అసలు నేటి యువతకు ప్రేమలో ఆవేశాన్ని తప్ప ఆనందాన్ని వెదుక్కునే సమయం దొరకడంలేదు. అలాంటిది ఇక్కడ పూర్ణ మాత్రం దాన్నొక కారణంగా చూపించుకుంటూ బాధ్యతా రాహిత్యంగా తిరుగుతుంటాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది శ్రావణి గురించి. భర్త ఏదైనా సాధించాలి అని తపిస్తున్నప్పుడు తాను సహకరించడం, బాధ్యత తీసుకోవడం కరెక్టే గానీ.. ఆ భర్త పనీపాటా లేకుండా తిరుగుతుంటే... ప్రేమ అన్న మాటకు, అది కూడా వన్ సైడ్ లవ్ కి... ఈరోజుల్లో అమ్మాయిలెవరైనా శ్రావణిలా కట్టుబడి ఉంటారా? అని అడిగితే సందేహమే సమాధానం. ప్రేమ పేరున అబ్బాయిలతో విచ్చలవిడిగా ఖర్చు చేయించే గడుసు అమ్మాయిలు ఉన్న ఈరోజుల్లో ఏమాత్రం సంపాదన లేని ఒకతని కోసం ఒకమ్మాయి కష్టాల్లో బతకడానికి సిద్ధపడుతుందా అన్నది నమ్మశక్యం కాదు.     
'పేదవేళ జూడు పెండ్లాము గుణమును...' అన్నాడు వేమన.  

గడనగల మగనిఁజూచిన
నడుగగడుగున మడుఁగులిడుదు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
అంటే...  స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు అన్నాడు సుమతీ శతకకారుడు. ఇది శతాబ్దాల క్రితమే...   స్త్రీలు మగాడి సంపాదన మీద ఆధారపడి వున్న రోజుల్లోనే చెప్పిన మాట. అలాంటిది తనకు తాను సంపాదించుకుంటూ ప్రతి స్త్రీ ఆర్థిక స్వతంత్రతను పొందిన ఈ రోజుల్లో సంపాదన లేని మగాడిని గౌరవించే స్త్రీ ఉంటుందనుకోవడం సినిమాటిక్.. అంతే!    

తాను ఇష్టపడ్డ మగాడి కోసం ఎంతకైనా తెగించే అమ్మాయిలను ప్రతిరోజూ పేపర్లలో చూడట్లేదా అంటే... నిజమే..  కానీ ఆ తెగింపు నచ్చిన వాడితో సుఖపడేందుకు చేస్తున్నారు తప్పితే, కష్టపడేందుకు కాదు. అందుకే శ్రావణి పాత్ర ఈరోజుల్లో ఒక ఊహా. ఆ ఊహే నిజమై, ప్రతి మగాడి వెనుక ఒక శ్రావణి ఉంటే ప్రతి మగాడు విజేతే. ప్రతి ఇల్లు స్వర్గసీమే. 

జెర్సీ: 

క్రికెటర్ గా అర్జున్ ని అభిమానించిన సారా (ఎంతో బరువైన ఈ పాత్రను శ్రద్ధా శ్రీనాథ్ పోషించి మెప్పించింది) అతన్ని ప్రేమించి, తండ్రిని ఎదిరించి మరీ పెళ్లిచేసుకుంది. కానీ అర్జున్ కొన్ని కారణాల వల్ల క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తాడు. చేయని నేరానికి అతని ఉద్యోగం కూడా పోయింది. అర్జున్ లో సారా ఏవి చూసి ఇష్టపడిందో అవిప్పుడు లేవు. క్రికెట్ స్టార్ ఇమేజి లేదు, తనను మురిపించిన చిలిపితనం లేదు, డబ్బు లేదు, సంతోషం లేదు. పెళ్లిచేసుకుంది కాబట్టి కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం ఇష్టం లేకున్నా ఉద్యోగం చేస్తోంది. ఒక అసంతృప్తికరమైన జీవితం అనుభవిస్తోన్న సారా మనస్తత్వాన్ని చాలా సహజంగా, వాస్తవికతకు దగ్గరగా చూపించారు. అర్జున్ లోని క్రికెటర్ ని చూసిందే తప్ప అతనిలోని నిజాయితీని చూడలేదు సారా. అందుకే లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోమంది. నీ ఉద్యోగం వస్తే నేను ఉద్యోగం మానేస్తాను అంది. అంటే సంపాదన నీ పనే కానీ నాది కాదు అని భావం. మజిలీలో శ్రావణికి, జెర్సీలో సారా పూర్తి భిన్నం. మొగుడి నుంచి సుఖాన్ని మాత్రమే  కోరుకున్న సారా అవి తనకు దక్కకపోయేసరికి అతన్ని అర్థం చేసుకోవడం అనవసరం అనుకుంది. డబ్బు లేదు కాబట్టి సంసారంలో సుఖం కూడా లేదనుకుంది. నేటి సగటు మహిళ మనస్తత్వానికి అచ్చమైన పాత్ర సారా. భార్య ఇలాంటిది అయినప్పుడు మగాడు సాధించడం, గెలవడం అనే పెద్ద పెద్ద మాటలు పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించి, నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఉత్తమం. ఇలాంటి సంసారాల్లో ముందు జాగ్రత్త, పొదుపు అనేవి చాలా అవసరం. 

చిత్రలహరి : 

విజయ్ కి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ, ఆ లక్ష్యం కోసం ఎంత ప్రయత్నించినా ఫెయిల్యూరే. అలాంటి లూజర్ కి లహరి (కళ్యాణి ప్రియదర్శిని) అనే అమ్మాయి ప్రేమ దక్కడం నిజంగా విజయమే. కానీ ఆ లహరి కేవలం తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆలోచించడం విజయ్ కి మరో ఫెయిల్యూర్. తనవైపు నుంచే ఆలోచించడం, తాను అనుకున్నట్టే  భాగస్వామి ఉండాలనుకోవడం ప్రేమ కాదు స్వార్థం. ఈ లహరి పాత్ర పెళ్ళయ్యాక జెర్సీ సినిమాలోని సారా అవుతుంది. మగాడు 'ఐ లవ్యూ' అని చెబితే ఇక అతను ఎప్పుడూ తనకు అనుకూలంగా నడుచుకోవాలి. తన కోసమే బతకాలి. తన సుఖం కోసం కష్టపడాలి అనుకునే అమ్మాయిలలోని సహజ స్వార్థం ఈ లహరిలో కూడా ఉంది. ప్రేమ పెళ్ళి చేసుకుని ఐదేళ్ళు తిరక్కుండా విడాకుల వరకు వెళ్ళేది లేదా మా ఆయన మారిపోయాడంటూ మరో వ్యక్తికి దగ్గరయ్యేది ఇలాంటి వాళ్ళే. వీళ్ళకు మొగుడి లక్ష్యాలతో పనిలేదు.

మహర్షి: 

నిజం చెప్పాలంటే...  ప్రేమించినన్నాల్లూ ప్రేమించి పెళ్ళి అనగానే మొహం చాటేసే రిషి పాత్రలోని విలనిజాన్ని, స్వార్థాన్ని మహర్షి సినిమా చూసిన ప్రేక్షలెవరూ గుర్తించలేదు. ప్రేక్షకుడిలో ఈ ఆలోచన వచ్చీ రాకముందే అంతకంటే ముఖ్యమైన మరో ఎమోషన్ సీన్ లోకి లాక్కెళ్ళిపోయాడు దర్శకుడు. ఈరోజుల్లో రిషిలాంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళ దృష్టిలో ప్రేమ కొంతకాలం వరకే. టైం పాస్ కొరకే. జీవితాంతం వరకు కాదు. అలాగే రిషిని ప్రేమించిన పూజ కూడా అతని  సక్సెస్ నే ప్రేమించింది. కనీసం అతని అభిప్రాయం కూడా తెలుసుకోకుండా.. అలాంటి సక్సెస్ ఫుల్ పర్సన్ ని పెళ్ళిచేసుకుని పెరట్లో  కట్టేసుకుందామనుకుంది. ఆమె స్వార్థం ఆమె చూసుకుంటే, అతని స్వార్థం అతను చూసుకున్నాడు. ఆ తర్వాత ఎవరికీ ఏదీ కానట్టు, ఎవరి జీవితం వారు చూసుకున్నారు. ఇది నేటి సమాజం తీరును ప్రతిబింబిస్తోంది. రిషి చేసింది కరెక్ట్. విజయం సాధించాలంటే   పూజలాంటి అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి.                      

ముగింపు: శ్రావణి, సారా, లహరి, పూజ... ఈ నలుగురిలో ఏ ఒక్కరిలాగో అమ్మాయిలు ఉండకూడదు. పెళ్ళికాక ముందు లహరిలా ఉండాలి. ప్రేయసిగా ఆ స్వార్థం ముద్దుగానే ఉంటుంది. పెళ్ళవుతూనే శ్రావణిలా మారిపోవాలి. ఇది కుటుంబ అభివృద్ధికి తోడ్పతుంది. పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగాక సారా పాత్రలోకి వెళ్ళిపోవాలి. పూజలా ఎప్పుడూ ఉండకూడదు. ఏమంటారు?      

                               

11, మే 2019, శనివారం

అమ్మకు వందనం


తల్లిని గౌరవించడానికో, ఆమె ప్రాధాన్యం గుర్తించడానికో ఏడాదికో రోజు పెట్టుకోవడం ఏమిటి? మిగతా రోజుల్లో తల్లి.. తల్లి కాదా అంటూ కొంతమంది ఆగ్రహిస్తుంటారు. ఏ వ్రతం చేసినా, ఏ పని తలపెట్టినా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం, తలచుకుంటాం. అయినా ఏడాదికోసారి వినాయక చవితి జరుపుకోవడం దేనికి? అసలు నిత్యం దేవుడిని తలచుకునే మనం పండుగ రోజున ఫలానా దేవుడిని పూజించడం దేనికి? దేనికంటే... ఏ పనినైనా సామూహికంగా చేయడం వలన అదొక సంప్రదాయం అవుతుంది. ఒక సంస్కృతి అవుతుంది. అలాగే అంతర్జాతీయ మాతృ దినోత్సవం కూడా. 


నిత్యం మనకు అమ్మ అందించే ప్రేమను, సేవను మరొక్కసారి సామాజికంగా గుర్తుచేసుకుని, అమ్మ ప్రాధాన్యాన్ని సమాజానికి తెలియచేయడం కోసం ఈ మదర్స్ డే. దీనివల్ల అమ్మకు ఒరిగేది ఏమీలేదు. తాను ఎంతో ఇష్టంగా నెరవేర్చే బాధ్యతను... బరువుతో పోల్చి...  మోసినందుకు పతకాలిస్తామంటే అమ్మ నవ్వుతుంది. అందుకని మదర్స్ డే అమ్మ కోసం కాదు. అమ్మ స్థానాన్ని గౌరవించడం కోసం. 

చెప్పాలంటే అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని మరింత బాధ్యతాయుతంగా, మరింత ఉదృతంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యవ్వనభారంతో కన్నుమిన్ను కానరాక అనుకోకుండా తల్లయిపోయి వద్దనుకున్నా ఒడిలో కొచ్చిన బిడ్డని అమానుషంగా నడిరోడ్డున ఏ చెత్త కుప్పలోనో, ముళ్ళ పొదల్లోనో విసిరేసే యువతికి, తాను విసిరేసింది ఒక రక్తమాంసాల ముద్దను కాదని తెలియాలి. ప్రియుడితో కలిసి ఉండేందుకు అడ్డొస్తున్నారని పిల్లలని కడతేర్చే తల్లికి అమ్మతనం అంటే ఏమిటో తెలిసిరావాలి. ప్రియుడి కోసం భర్తను చంపి, జైలుపాలయ్యే మహిళకు పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచన రావాలి. పంతాలు, పట్టింపులతో కాపురాన్ని కాదనుకుని విడాకులకు పరుగెత్తే ముందు పిల్లల మనసులపై అవి చూపించే ప్రభావం ఏమిటో అర్థం కావాలి. ఇవన్నీ తెలిసిరావాలంటే పిల్లల కోసం అపూర్వ త్యాగాలు చేసిన అమ్మ కథలను సమాజం వినాలి. అందుకైనా మాతృ దినోత్సవం జరుపుకోవాలి. 

దేశమేదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా...  దేవుడు ఉన్నా లేకున్నా 'మాతృత్వం' ఉంది. జీవకోటికి ఇది ప్రకృతి ఇచ్చిన మహోత్తరమైన వరం. ఆ వరానికి ప్రతిరూపమే ప్రతి ఇంటా కొలువుదీరిన 'అమ్మ'. కన్ననాటి నుండి కనుమూసే వరకు తన బిడ్డల సంరక్షణ, పోషణ, శిక్షణ బాధ్యతలను 
ఇష్టంగా మోస్తూ, సమాజ వికాసానికి, మానవజాతి మనుగడకు ఆధారంగా నిలిచే శక్తి స్వరూపిణి 'అమ్మ'.
ఇండోనేషియాలో అమ్మకు పాదపూజ 
అమ్మకు పాదపూజ చేస్తే స్వర్గానికి వెళ్తామని ఇండోనేషియా ప్రజలు నమ్ముతారు. అలాంటి నమ్మకాలు మన సమాజంలోనూ ఏర్పడాలి. 


మదర్స్ డే రోజున చాలా ఛానెళ్లలో హీరోయిన్స్..  వాళ్ళ అమ్మల గురించి చెప్పే కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి. దాని బదులు కూలి పనికి బిడ్డను చంకన పెట్టుకు వెళ్ళి, అక్కడ ఏ చెట్టుకో చీరను ఊయలగా కట్టి అందులో బిడ్డను ఉంచి... పనిచేస్తూ పదేపదే ఆ ఊయల వంక చూసే తల్లి గురించి ఎందుకు చెప్పరు? ఎందరో బిడ్డల్ని తల్లుల నుంచి వేరుచేసి...  వారిని బిక్షాటన కోసం ఉపయోగిస్తున్న మాఫియా గురించి ఎందుకు చెప్పరు? అన్ని ప్రైవేటు సంస్థలూ మెటర్నిటీ లీవులు ఇస్తున్నాయా లేదా ఎందుకు చర్చించరు? నేటి పరుగుల ప్రపంచంలో తల్లికి బిడ్డల బాధ్యతతో పాటు చాలావరకు కుటుంబ పోషణ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవి మాతృత్వంపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి? అమ్మ సంతృప్తిగా ఉంటుందా? పురాణ పురుషుల గురించి చెప్పి తల్లి జిజియాబాయి బాల  శివాజీని వీరునిగా, ధర్మవర్తనుడిగా తీర్చి దిద్దింది. మరి టీవీలు, సెల్ ఫోను గేములు వచ్చిన ఈ తరంలో పిల్లలకు నేటి తల్లి ఏం నేర్పిస్తుంది? అసలు తల్లీ బిడ్డల అనుబంధంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇలాంటివన్నీ మదర్స్ డే రోజున అయినా చర్చకు రావాలి. తల్లిని పూజించడం తర్వాత... ముందు తల్లికి ఉన్న సమస్యలను కనుక్కోవాలి కదా. ఆమె మనోభావాలను అర్థం చేసుకోవాలి కదా! 
                          
ఏపీ బడుల్లో అమ్మకు వందనం 
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 'అమ్మకు వందనం' అనే కార్యక్రమాన్ని పెట్టి బడుల్లో పిల్లల చేత తల్లుల కాళ్ళు కడిగించి, పూజించే సంస్కృతిని అలవాటు చేస్తోంది. ఇది హర్షణీయం. 

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ వందనం.                                         

7, మే 2019, మంగళవారం

ఇక్కడ నవ్వుతూ దోపిడీ చేస్తారు!


సినిమా చూడాలంటే మల్టిప్లెక్స్... నెలవారీ సరకులు కొనాలంటే షాపింగ్ మాల్... భోజనం మాల్ లోనే... పిల్లల ఆటలు మాల్ లోనే. ఇదీ ఇప్పటి మధ్య తరగతి మానసిక స్థితి. సెలవు రోజొస్తే చాలు అలా ఒక మాల్ కు ఉదయాన్నే వెళ్ళి ఒక సినిమా చూసేసి, తర్వాత అక్కడే ఉన్న ఫుడ్ కోర్టులో తినేసి, పక్కనే ఉన్న ప్లే ఏరియాలో పిల్లల్ని కాసేపు ఆడించేసి, ఇంటికి వచ్చేస్తూ అదే మాల్ లో షాపింగ్ చేసేసి రావడం ఇప్పుడు సాధారణం అయిపొయింది. ఇవన్నీ వరుసపెట్టి చేయడం ఒక హోదా. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలకు అదొక హక్కయిపోయింది. "వారం అంతా కష్టపడుతున్నాం. ఆదివారం కాస్త రిలాక్స్ అవడంలో తప్పేంటి?" అని వాదిస్తారు. ఖర్చు కదా అంటే... "కష్టపడి సంపాదించేది దేనికి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం?" అంటారు. సరిగ్గా ఈ మనస్తత్వమే కార్పొరేట్ దోపిడీకి ఆస్కారమిస్తోంది. 

దోపిడీ అంటే సాధారణంగా కొట్టి, భయపెట్టి దోచుకుంటారు. కానీ ఇక్కడ ఎంట్రీ లోనే  నమస్కారం పెట్టి, నవ్వుతూ దోపిడీ చేస్తారు. అదే ఈ మాల్స్ స్పెషాలిటీ. ఎంట్రీలో  మీ వెంట తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ ని పక్కనే అట్టిపెట్టేసుకోవడంతో దోపిడీ మొదలవుతుంది. అంటే మీకు దాహం వేస్తే లోపల మంచినీళ్ళు కొనుక్కు తాగాలన్నమాట. రూ.20ల వాటర్ బాటిల్ లోపల రూ.50 ఉంటుంది. గ్లాసు పెప్సీ లేదా కోక్ ధర రూ. 200 పైనే. పాప్ కార్న్ రూ.250. రెండు సమోసాల ఖరీదు రూ.113లు. ఇది థియేటర్ లోని క్యాంటీన్ దోపిడీ. సినిమా ఇంటర్వెల్ లోని ఈ దోపిడీ కానిచ్చేసుకున్నాక ఫుడ్ కోర్టులోకి స్టైల్ గా వెళతాం కదా. అక్కడ ఏదీ తినాలన్నా ముందు ఒక వెయ్యో రెండు వేలో వేసి ప్రీ పెయిడ్ కార్డు తీసుకోవాలి. క్యాష్ తీసుకొని అమ్మొచ్చుకదా అంటే కుదరదంట. 

 దీనికో కారణం ఉంది. ఆ ఫుడ్ కోర్ట్ మొత్తం ఒకరి అజమాయిషీలో ఉంటుంది. అందులో స్టాల్స్ పెట్టుకునే వారు వారి అమ్మకాల్లో ఇంత శాతం చొప్పున ఫుడ్ కోర్ట్ నిర్వాహకుడికి ఇవ్వాలి. మరి ఒక్కో స్టాల్ లో ఎంత అమ్మకం అయ్యిందీ లెక్క కచ్చితంగా తెలియాలి కదా. అందుకనే అన్ని స్టాళ్ళకూ కలిపి ఒకే ప్రీ పెయిడ్ కార్డు చెల్లుబాటయ్యే విధానం తెచ్చారు. వాళ్ళ సౌలభ్యం బాగానే ఉంది. కానీ ఇందులో జరిగే దోపిడీ ఎలాంటిదో చెప్పుకుందాం. 

ఫుడ్ కోర్టులో బ్రాండ్ పేరుతో ఆహార పదార్థాలన్నీ రెట్టింపు ధరకు కొనుక్కుని తింటాం. రుచి, శుచి, నాణ్యత...  ఇలాంటివన్నీ మనమేం పట్టించుకోము. చుట్టూ మనలాంటి అమాయకులు చేసే సందడిని చూస్తూ నోట్లోకి తోసేసుకుంటాం. ఇలాంటి వంటకాలనే మనకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్ లో కనక వడ్డిస్తే... అబ్బో ఎన్ని పేర్లు పెడతామో! సరే... భోజనం అయిపొయింది. కార్డులో నలభయ్యో యాభయ్యో మిగిలాయనుకోండి. దాన్ని క్యాష్ చేసుకుందామంటే కుదరదు. పోనీ ఏదన్నా కొనుక్కుందామన్నా ఆ ధరలో ఏదీ రాదు. కౌంటర్ లో అడిగితే.. "ఆ డబ్బులు ఎక్కడికీ పోవుసార్, ఈసారి వచ్చినప్పుడు మీరు ప్రీ పెయిడ్ చేస్తారు కదా అందులో ఇవి కూడా కలుస్తాయి" అంటాడు. నిజమే కదా కంగారెందుకు అనుకుంటాం మనం. దీని వెనుకే పెద్ద మోసం ఉంది. మీరు మళ్ళీ ఓ నెల తర్వాతగానీ మాల్ కి వెళ్ళరు. వెళ్ళినా ఇదే మాల్ కి వెళ్తారన్న గ్యారెంటీ లేదు. వచ్చినా ఆరోజు మీరు ఈ కార్డు తీసుకురావడం మర్చిపోవచ్చు. అంటే మీ సొమ్ము  నలభయ్యో యాభయ్యో ఫుడ్ కోర్టు నిర్వాహకుడి దగ్గర నెలలపాటు ఉండి పోతుంది. ఇలా రోజుకు కొన్ని వందల మంది, నెలకు కొన్ని వేలమంది సొమ్మంతా లక్షల్లో అతని దగ్గర ఉండిపోతుంది. వడ్డీ పైసా కూడా చెల్లించనవసరం లేకుండా ఎంత ధనాన్ని సేకరిస్తున్నాడో చూసారా? 

ఆ తర్వాత ప్లే ఏరియాకు వెళ్తే అక్కడ రెట్టింపు దోపిడీ. మామూలుగానే అక్కడ కూడా ప్రీ పెయిడ్ కార్డు తీసుకుంటారు. ఐదొందలో వెయ్యో వేసి పిల్లలతో ఆటలు ఆడిస్తారు. ఫుడ్ కోర్టు మాదిరిగానే ఇక్కడ కూడా కార్డులో చివరికి  ఇరవయ్యో ముప్పయ్యో మిగిలిపోతాయి. అయితే ఇక్కడ మరో దోపిడీ అదనం. ఏమంటే మీరు కార్డులో వంద రూపాయలు వేయించారనుకోండి అందులో 65 -69 రూపాయలకు మాత్రమే ఆడగలరు. మిగిలిన డబ్బు హుష్ కాకి. పోనీ కార్డు తీసుకున్నప్పుడు ప్రాసెస్ ఫీజు కింద మొదటిసారి అలా తీసుకుంటారేమో అంటే... కాదంట మీరు కార్డులో డబ్బులు వేయించిన ప్రతీసారీ దాదాపు 30 శాతం డబ్బులు ఎగిరిపోతాయి. చూశారా ఎంత దోపిడీనో! 

అక్కడనుంచి షాపింగ్ మాల్ కి వస్తారు. ఈ దోపిడీ ఎలా ఉంటుందో ఒక నిదర్శనం చూద్దాం. కొద్ది రోజుల క్రితం తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ 15 ప్రత్యేక టీంలను ఏర్పాటుచేసి నగరంలోని 15 షాపింగ్ మాల్స్ పై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులో అనేక మోసాలు బయటపడ్డాయి.  షాపింగ్ మాల్స్ నిర్వాహకులు  తూకం వేసే మిషన్లను ట్యాంపరింగ్ చేసినట్టు తేలింది. కొన్ని వస్తువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు తేలింది. దీంతో ఒకే రోజు షాపింగ్ మాల్స్ పై 105 కేసులు నమోదయ్యాయి. ఆఫర్లని, ఉచితం అని ఆశపడి మాల్స్ కి వెళితే ఇలాగే నష్టపోతాం. 
ఇక సరుకులు కొన్నాక ప్లాస్టిక్ సంచుల విషయం మరో దోపిడీ. వాళ్ళ బ్రాండింగ్ తో సంచులు ముద్రించి. ఆ సంచుల్ని మోసుకెళ్ళే దారంతా మనతోనే ప్రచారం చేయిస్తారు. విచిత్రం ఏమంటే వాడి ప్రచారం కోసం మనమే ఐదో పదో ఎదురిచ్చి కౌంటర్ దగ్గర సంచులు కొనుక్కోవడం. వాడి తెలివి చూసారా?     
      
అయితే ఈ దోపిడీని గుర్తించిన వాళ్ళు లేకపోలేదు. దోపిడీపై పోరాడిన వాళ్ళు లేకపోలేదు. పోరాటంలో గెలిచిన వాళ్ళు లేకపోలేదు.                        

విజయ్ గోపాల్, సామాజిక కార్యకర్త  
విజయ్ గోపాల్... ఒక సామాజిక కార్యకర్త. ఫోరమ్ ఎగైనెస్ట్ కరప్షన్ అనే ఎన్జీఓ సంస్థకు  వ్యవస్థాపక అధ్యక్షుడు. అక్రమ పార్కింగ్ ఫీజు వసూళ్ళపై ఫోరమ్ సుజనా మాల్, ఇన్ ఆర్బిట్ మాల్, మహేశ్వరీ పరమేశ్వరి వంటి మాల్స్, మల్టీప్లెక్స్ లపై కేసు వేశారు. ఈయన పోరాట ఫలితంగా మల్టిప్లెక్స్, షాపింగ్ మాల్స్ లలో 2018 ఏప్రిల్ 1 నుండి పార్కింగ్ ఫీజు రద్దయింది. లేకపోతే ఇదివరకు ఈ పార్కింగ్ దగ్గర ఆఖరి దోపిడీ జరిగేది. గంటకింతని ముక్కుపిండి పార్కింగ్ ఫీజు వసూలు చేసి పంపించేవారు. 


అలాగే ప్లాస్టిక్ సంచులు, సినిమా క్యాంటీన్ అమ్మకాలు వంటి వాటి విషయంలో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడిక ఫుడ్ కోర్టులు, ప్లే ఏరియాలలో ప్రీ పెయిడ్ కార్డుల మోసాల పై కూడా పోరాడాల్సిన అవసరం ఉంది.