పేజీలు

25, ఏప్రిల్ 2019, గురువారం

వాట్సప్ పంచ్

ఒకమ్మాయి దేవుడితో ఇలా అంది. 
''దేవుడా! నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. నేను బాగా చదువుకున్నాను.  స్వతంత్రంగా బతకగలను. అన్ని పనులు స్వయంగా చేసుకోగలను. అలాంటప్పుడు నాకు మొగుడితో పనేంటి? కానీ మా అమ్మానాన్నలు పెళ్ళి చేసుకోమని చంపేస్తున్నారు. దేవుడా నువ్వే చెప్పు. నేనిప్పుడు ఏం చేయాలి?

దేవుడు పలికాడు:  చూడమ్మా! నా సృష్టిలో అద్భుతానివి నువ్వు. అందులో ఏ సందేహమూ లేదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒక్కోసారి నీవల్ల తప్పులు జరగొచ్చు. నువ్వు ఓడిపోవొచ్చు. అప్పుడు నువ్వు ఎవర్ని తిడతావు. నిన్ను నువ్వు తిట్టుకుంటావా?

అమ్మాయి : నో! నేనొప్పుకోను. 

దేవుడు: అందుకే నీకో మొగుడు కావాలమ్మా. 

అది విన్న అబ్బాయి దేవుడిని అడిగాడు. 
స్వామీ ఏమిటీ స్త్రీ పక్షపాతం? ఆవిడ చేసే తప్పులకు నేను నిందలు మోయాలా? సరే! మోస్తాను. మరి నేను ఓడిపోతే ఎవర్ని తిట్టాలి? 

దేవుడు : పిచ్చివాడా! నీకు అన్యాయం చేస్తానా? ఆమెకు కోపం వస్తే తిట్టడానికి నువ్వు ఒక్కడివే ఉంటావు. కానీ నువ్వు ఓడిపోయి.. నీకు కోపం వస్తే... విద్యా వ్యవస్థను తిట్టొచ్చు, న్యాయవ్యవస్థను తిట్టొచ్చు, రాజకీయ నాయకుల్ని తిట్టొచ్చు, అధికారుల్ని తిట్టొచ్చు, పోలీసుల్ని తిట్టొచ్చు, సినిమావాళ్ళను తిట్టొచ్చు, ప్రాంతాన్ని తిట్టొచ్చు, దేశాన్ని తిట్టొచ్చు, గాంధీని, నెహ్రూని.. అంతవరకూ ఎందుకు నన్ను ఇంకా తిట్టొచ్చు. ఒక్క నీ భార్యను తప్ప.

24, ఏప్రిల్ 2019, బుధవారం

మళ్ళీ మళ్ళీ గో గో గోవా!

గోవా...
ఎన్నిసార్లు వెళ్ళినా సొంతం చేసుకోడానికి మరో అనుభవం మిగిలే ఉందనిపించే ఓ కొత్త లోకం. దేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలన్నీ ఒకవైపు. గోవా ఒక్కటి ఒకవైపు. మిగిలిన చోట్ల కళ్ళతో చూసి అనుభూతుల్ని మనసు నిండా నింపుకుంటాం. గోవాలో మనసును కొత్త అనుభవాలతో రిఫ్రెష్ చేసుకుంటాం. జీవితాన్ని రీఛార్జ్ చేసుకుంటాం.

గోవా పటం 
గోవా అంటే ఒక నగరమో, ఒక ప్రదేశమో కాదు. ఒక రాష్ట్రం. దేశంలో రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. 1987 మే 30న భారతదేశంలో 25వ రాష్ట్రంగా ఏర్పాటయింది. ఈ రాష్ట్రంలో ఉన్నవి రెండే రెండు జిల్లాలు. ఒకటి ఉత్తర గోవా. దీనికి పనజి జిల్లా కేంద్రం. మరొకటి దక్షిణ గోవా. దీనికి మార్గోవా జిల్లా కేంద్రం. పార్లమెంటులో గోవా నుండి రెండు లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానము ఉన్నాయి. గోవా అసెంబ్లీలో 40 మంది సభ్యులున్నారు.  ఇదీ గోవా రాజకీయ సమాచారం.

మిగతా విషయాలకు వస్తే... చిన్న రాష్ట్రమే అయినా గోవాలో ఐదు నదులు ప్రవహిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి మాండవి, జువారి నదులు. గోవా ప్రజల తాగునీటికి, రవాణా వసతికి ఈ నదులే ఆధారం.

ఎలా వెళ్ళాలి? 


గోవా వెళ్ళాలంటే విజయవాడ నుంచి వాస్కోడగామాకు అమరావతి ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ నుంచి ప్రతి గురువారం వీక్లీ ఎక్స్ ప్రెస్, కాచిగూడ నుంచి వారంలో నాలుగు రోజులు మరో ఎక్స్ ప్రెస్ ఉన్నాయి. గోవాలోని మడ్ గాం, వాస్కోడగామా రైల్వే స్టేషన్లకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రెండూ బీచ్ లకు దగ్గర్లోనే ఉంటాయి. వాస్కోడగామా రైల్వే స్టేషన్ చివరిది.
దూద్ సాగర్ జలపాతం 
ముఖ్యంగా రైలు ప్రయాణం అయితే గోవా సరిహద్దు స్టేషన్లయిన  లొండా రైల్వే స్టేషన్ తర్వాత వచ్చే దూద్ సాగర్ జలపాతం, ఆ తర్వాత వచ్చే  దాదాపు 20 సొరంగాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. గోవా-కర్ణాటక సరిహద్దులోని మండోవి నదిపై ఉన్న దూద్‌సాగర్‌ జలపాతం అద్భుతమైన ప్రకృతి దృశ్యం. రైలులో కాకుండా మిగిలిన మార్గాల్లో గోవా  వెళ్ళేవారు ప్రత్యేకించి ఒక రోజు కేటాయించి జలపాతం చూసేందుకు రావాల్సి ఉంటుంది.       

ఇకపోతే హైదరాబాద్ నుంచి గోవాకు వోల్వో బస్సు కూడా ఉంది. విమాన సర్వీసులు చెప్పక్కర లేదు. హైదరాబాద్ నుంచి గంటన్నరలో గోవాకు చేరుస్తాయి. జాగ్రత్తగా బుక్ చేసుకుంటే రూ.16,000లలో నలుగురు సభ్యులున్న కుటుంబం ఫ్లైట్ లో గోవాకు వెళ్ళిరావచ్చు. ఒక్కోసారి ఇవే టిక్కెట్లు రూ.45 వేల వరకూ పలుకుతాయి. ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. గోవా ఎయిర్ పోర్ట్ పేరు 'డబోలిం'.     


ఆంగ్రియా క్రూయిజ్ 
ఆంగ్రియా క్రూయిజ్ :
ఇంకాస్త ఎంజాయ్ చేయాలనుకునేవారు. ముంబయి వెళ్ళి అక్కడి నుండి గోవాకు సముద్రం మీదుగా ఓడలో వెళ్ళొచ్చు. చుట్టూ తిరిగి రావడం ఏంటి పిచ్చా? అని అనుకోకండి. ముంబయి - గోవా మధ్య రాకపోకలు సాగించే ఈ ఓడ పేరు ఆంగ్రియా. భారత్‌లోనే మొట్టమొదటి లగ్జరీ షిప్‌ ఇదే. రోజు విడిచి రోజు ముంబయి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా గోవాకు చేరుతుంది.


ఆంగ్రియాలో 104 గదులు ఉంటాయి. వీటిని డార్మిటరీ, డీలక్స్‌, లగ్జరీ వంటి మొత్తం ఎనిమిది కేటగిరీలుగా విభజించారు. ప్రపంచస్థాయి వంటకాలు అందించే రెండు రెస్టారెంట్లతో పాటు ఆరు బార్లు, ఒక విలాసవంతమైన స్విమ్మింగ్‌పూల్‌, స్పా, పబ్‌ వంటి సౌకర్యాలు ఈ ఓడలో ఉన్నాయి. ఇక టికెట్‌ ధర విషయానికొస్తే మనం ఎంచుకునే గది కేటగిరీని బట్టి సుమారు రూ.4,300 నుంచి నుంచి రూ.7,650 వరకు ఉంటుంది. ఈ ధరలోనే స్నాక్స్‌, డిన్నర్‌, టిఫిన్ లు ఇస్తారు.
ఆంగ్రియా క్రూయిజ్ లోని గది 
      

గోవాలో తిరగడం ఎలా?  

ఇక గోవాలో దిగాక టాక్సీలే గతి. ఎందుకంటే గోవాలో ప్రైవేటు ఆపరేటర్లు నడిపే బస్సులు మాత్రమే ప్రధాన రవాణా సౌకర్యం. ప్రభుత్వ రంగంలో ఉన్న కదంబ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషను ముఖ్యమైన రూట్లలో మాత్రమే బస్సులు నడుపుతుంది. ఎక్కువ మంది పౌరులు తమ ప్రయాణాలకు స్వంత వాహనాలనే వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాల వినియోగం ఎక్కువ. ఆటోలు ఉన్నప్పటికీ ఎక్కడపడితే అక్కడ దొరకవు. ముఖ్యమైన పాయింట్లలోనే దొరుకుతాయి. పైగా చార్జీలు ఎక్కువ.

టూరిస్టు ప్యాకేజీలు నార్త్ గోవా, సౌత్ గోవా అని రెండే ప్యాకేజీలు ఉంటాయి. టాక్సీ వాళ్ళు తీసుకువెళ్తారు. అయితే వాళ్ళు చూపించినవే చూడాలి. వీటికంటే ఒక ద్విచక్ర వాహనం అద్దెకు తీసుకుంటే ఉత్తమం. ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపించాలి. అద్దె రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. కారు కూడా అద్దెకు దొరుకుతుంది. పెట్రోల్ మనదే. గూగుల్ ఉందిగాబట్టి దారులు తెలియవు కదా అని భయపడక్కరలేదు. ట్రాఫిక్ సమస్యలు అసలుండవు. కాస్తంత ఎండ ఎక్కువ అయినా రైడింగ్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కొన్ని ఏజెన్సీలు బస్ లలో గోవా అంతటా తిప్పుతారు. రోజుకు మనిషికి రూ.400 ఉంటుంది. మనకు ఇష్టమైన చోట దిగి అక్కడే ఎంతసేపైనా ఉండొచ్చు. అది చూడటం అయిపోయాక ప్రతి అరగంటకూ వచ్చే ఇంకో బస్సులో ఎక్కొచ్చు. ఏ వాహనం బుక్ చేసుకున్నా గోవా అంతటా ఒకటే ధరలు ఉంటాయి. అక్కడి ట్రావెలింగ్ సంఘాలు అన్నీ ఒక్కమాటమీదే ఉంటాయి. కాబట్టి మోసాలకు తావులేదు. అలాగని చవక కూడా కాదు. ఓలా, ఉబెర్ లాంటి సంస్థలను గోవాలో అడుగుపెట్టనియ్యలేదు ఇక్కడి ట్రావెలింగ్ సంఘాలు. అంత బలమైనవి ఈ వ్యవస్థలు.

డోనా పాలాలో  మేము బస చేసిన హోటల్ గది నుండి
కనిపించిన ప్రకృతి సోయగం 
గోవా హోటళ్ళు:  

గోవాలో ఉండటానికి హోటళ్ళకు కొదవలేదు. రోజుకు రూ.800 నుంచి రూ.5,000ల ధరలో గదులు దొరుకుతాయి. ఆపై కూడా మీఇష్టం. గోవాలో కనీసం ఒక నాలుగు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకోండి. కొంతమంది పర్యాటకులు ఇక్కడ నెలల కొద్దీ ఉంటారు. అలా ఉండి ఇక్కడే స్థిరపడిపోయిన విదేశీ యాత్రికులు కూడా ఉన్నారు. గోవా ప్రత్యేకత అదే. 
డోనా పాలా నుండి కనిపిస్తున్న ఒక హోటల్ 

గోవా అంటేనే బీచ్‌లు: 

125 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న గోవాలో అరంబోల్, వాగటర్, అంజున, బాగా, కాలాంగుట్, కండోలిం, సిన్క్విరిం,  మిరమార్, డోనాపాలా బీచ్‌లు ఉత్తరం వైపున ఉంటాయి. కోల్వా, కావలోసియం, మోబార్, పాలోలెం బీచ్‌లు దక్షిణగోవాలో ఉంటాయి.
పాలొలెం బీచ్ లో విదేశీ యాత్రికులు ఎక్కువ 
మనం మన ఊర్లో వేసుకునే డ్రెస్సులు పక్కన పెట్టండి. బీచ్ ల బయట చవకగా దొరికే తేలికయిన టీ షర్టులు, షార్ట్ లు, టోపీలతో కొత్తగా కనిపించండి. మీరెలా డ్రెసప్ అయినా అక్కడ మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఎవరి ఎంజాయ్ మెంట్ వారిది. ఇలాంటి స్వేచ్ఛ మీకు ఏ పర్యాటక ప్రదేశంలోనూ దొరకదు. గోవాలో ఎండలు బాగా ఉంటాయి. నెత్తిన టోపీ, కళ్ళకు చలువజోళ్ళు, చేతిలో నీళ్ళ సీసా మర్చిపోకండి.           



కొలంగూట్ బీచ్ 
గోవాలో ఫలానా బీచ్ కు వెళ్ళమని సలహా ఇవ్వలేం. ఎందుకంటే దేని ప్రత్యేకత దానిదే. అయితే బాగా బీచ్, కాలాంగుట్, అంజున బీచ్, కోల్వా, పాలోలెం బీచ్ లకు తప్పనిసరిగా వెళ్ళాలి. ''ఎన్ని బీచ్ లని చూస్తాం.. ఎక్కడైనా అదే ఇసుక, అదే సముద్రం కదా'' అని కొంతమంది అంటారు. వాళ్ళకు ఓపిక లేదని అర్థం. లేదా అనుభవించే తీరిక లేదని అర్థం. ప్రతి బీచ్ కు ఒక ప్రత్యేక స్వరూపం ఉంటుంది. భౌగోళికంగా కావచ్చు. సాంస్కృతికంగా కావచ్చు. సామాజికంగా కావచ్చు. అలాగే క్రైం రేట్ పరంగా కూడా కావచ్చు. మంచితో పాటు చెడు చూడటం కూడా ఒక అనుభవమే.   
పాలోలెం బీచ్ 
                                  పాలోలెమ్ బీచ్ లో సముద్రజలాలు స్వచ్ఛంగా ఉంటాయి. అన్నిటినీ మించి రద్దీ తక్కువగా ఉండి ప్రశాంతంగా ఉంటుంది. దగ్గరలోనే మంకీ ఐలాండ్, కోటిగో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ఈ బీచ్ నుంచే ప్రత్యేక బోట్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు.

ఉత్తర గోవాలో  కాలాంగుట్ బీచ్, బాగా బీచ్ లు రద్దీగా ఉండి సందడిగా ఉంటాయి. ఇదే వరుసలో కొండల మధ్య ఉంటుంది అంజునా బీచ్. ఈ బీచ్ ప్రకృతి అందాలకు నెలవు. 
డోనా పాలా విగ్రహాలు 

డోనా పాలా అనే ప్రేమికుల జంట ప్రేమకోసం ప్రాణాలు తీసుకున్న ప్రదేశం డోనాపాలా బీచ్. ఇక్కడున్న వ్యూ పాయింట్ నుంచి మంచి దృశ్యాలను ఫోటోలు తీసుకోవచ్చు. 

గోవా అంటే సముద్ర కెరటాల్లో ఆడుకోవడమే కాదు. సముద్ర జలాల్లో సాహస విన్యాసాలు అంటే అడ్వెంచర్ స్పోర్ట్స్‌ కూడా ప్రత్యేకమే. కండోలిం, బాగా, వాగటర్ బీచ్‌లలో జెట్‌ స్కీయింగ్‌, అంజునా, వాగటర్ బీచ్‌లలో పారాసైలింగ్, వాస్కో సమీపంలోని గ్రాండ్‌ ఐలాండ్‌ లో స్కూబా డైవింగ్ లు చేసుకోవచ్చు.


గ్రాండ్ ఐలాండ్ వద్ద స్కూబా డైవింగ్ 
స్కూబా డైవింగ్ చేయాలంటే దాదాపు ఒక రోజంతా పడుతుంది. ముందుగా బుక్ చేసుకుంటే ఉదయాన్నే రెండు మూడు గంటలపాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత డైవింగ్ కు తీసుకువెళ్తారు. టికెట్టు ఒక్కరికి రూ.2,500- రూ.4,000లు ఉన్నప్పటికీ స్కూబా డైవింగ్ తో పొందే అనుభూతితో పోలిస్తే ఈ ధర గిట్టుబాటే.

మందు - విందు  


ఇక గోవా అనగానే అందరూ అనుకునేది మందు కొట్టడం. గోవాలో మందు చవకే కాదు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆడామగా అన్న తేడా లేకుండా మద్యం సేవిస్తుంటారు. ఇక్కడలాగా అక్కడ మందు కొట్టే అమ్మాయిలను వింతగా చూడరు. అయితే షాపులో కొంటేనే చవక. బార్లలో తాగితే ఇక్కడికి అక్కడికీ ధరలో పెద్ద తేడా ఉండదు. బీచ్ లలో బయటి నుంచి తెచ్చుకున్న మద్యం తాగనివ్వరు. బీచ్ లో ఉండే హోటళ్ళలోనే కొనుక్కోవాలి. ఈ హోటళ్ళను 'శాక్' (shack) అంటారు.
బాగా బీచ్ లోని ఓ శాక్ 
ప్రతి శాక్ ఎదుట పొడవాటి బల్లలు వేసి ఉంటాయి. ప్రతి బల్లకు ఒక గొడుగు నీడగా ఉంటుంది. ఆ బల్లపై పడుకుని మందు కొడుతూ, ఒడ్డుకు ఉరికొచ్చే కెరటాలను చూడటం, స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టే పిల్లల్ని చూడటం మంచి అనుభూతి. కుర్రకారుని ఆకర్షించే అంశాలు మరెన్నో ఉంటాయి. కావాలంటే ఒక రెండువందల రూపాయలు ఇచ్చి ఒంటిని మసాజ్ చేయించుకోవచ్చు. మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఒళ్ళు మర్దనా చేస్తారు. 


మద్యంతో పాటు మీరు కోరుకున్న రుచికరమైన ఆహారం కూడా బీచ్ లలో దొరుకుతుంది. ఈ బల్లల విషయంలో మీకో సంగతి చెప్పాలి. మామూలుగా ఈ బల్లలపై పడుకోడానికి గంటకు వంద రూపాయల చొప్పున వసూలు చేస్తారు. అలా కాకుండా మీ శాక్ లోనే తింటాం, తాగుతాం అంటే అద్దె లేకుండా బల్లల్ని ఇస్తారు. ఇక్కడ దొరికే కింగ్ బీర్ రుచే వేరు. 
 

ఆహారం:  

ఆహారం విషయానికి వస్తే... చికెన్, రొయ్య, చేప కూరలు మన ఊళ్ళో ఎలాగూ తింటాం. అవి కాకుండా కాస్త వెరైటీగా గోవాలో సీఫుడ్ ప్రయత్నించవచ్చు. కింగ్ ఫిష్, షార్క్, రాక్ ఫిష్, టూనా చేపల వేపుడు లేదా కూరను రుచి చూడాల్సిందే. వీటిని ఆర్డర్ ఇచ్చేముందు మనకు పచ్చి చేపను తెచ్చి చూపిస్తారు. దాని సైజును బట్టి రేటు ఉంటుంది. హోటల్ ను బట్టి, సైజును బట్టి రూ.600-2,000ల వరకు ఉంటుంది. అలాగే పొంఫ్రెట్, కింగ్ క్రాబ్, లోబ్ స్టర్ లను కూడా ప్రయత్నించండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి.
ట్యూనా చేప వేపుడు 


లోబ్ స్టర్ వేపుడు 
ఆర్డర్ ఇచ్చే ముందే దాని ధర తెలుసుకోండి. బిల్లు ఇస్తున్నారా లేదా చెక్ చేయండి. ఇవేవీ చూసుకోకుండా ఆర్డర్ చేసేసి తినేసాక రూ. 2,000లు అయ్యే బిల్లు రూ.8,000లు అయినా ఆశ్చర్యపడక్కరలేదు. బీచ్ లలో మోసాలు ఈ రకంగా ఉంటాయి. ముఖ్యంగా బీచ్ లో మనం అడుగుపెడుతూనే మన దగ్గరకు వచ్చి శాక్ కు దారిచూపే వారిని అట్టే నమ్మకండి. బయట హోటళ్లతో పోలిస్తే బీచ్ లలో ఉండే శాక్ లలో ధరలు కాస్త ఎక్కువే ఉంటాయి. కానీ రుచి చూసాక ఈ మాత్రం ఖర్చు పెట్టకపొతే ఎలా? అనిపిస్తుంది. 


గోవాలో దొరికే నాన్ వెజ్ భోజనం  

బీచ్ బయట ఉండే చిన్న హోటళ్ళలో కూడా రూ.120 నుంచి 180 వరకు కోడి, చేప కూరలతో నాణ్యమైన రుచికరమైన భోజనం దొరుకుతుంది. అభిరుచి అన్నది ఉండాలే కానీ తినడానికి, తాగడానికి గోవాను మించింది లేదు.         
గోవా నుండి వచ్చేటప్పుడు మనతో పాటు మద్యం బాటిళ్ళు తెచ్చుకోవచ్చు. విమానంలో వచ్చే పనైతే ఒక్కొక్కరూ 5 లీటర్లు అంటే సుమారు 6-7 బాటిళ్ళు తెచ్చుకోవచ్చు, బస్సులోనో, రైలు లోనో అయితే ఒక్కొక్కరూ రెండు బాటిళ్ళకు మించి తీసుకురాకూడదు. ప్రతి కొనుగోలుకు బిల్లు రాయించుకుని ఎక్కడైనా చెకింగ్ అయితే ఆ బిల్లును చూపించాలి. కాజు ఫెన్నీ, టకీలా, వైన్ లు తెచ్చుకోవడం మరువొద్దు.


కేసినో ఓడ 
ఇక గోవాలో నైట్ లైఫ్ మరపురాని అనుభూతి. టిటో స్ట్రీట్ అని బాగా బీచ్ కు దగ్గరలో ఒక వీధి ఉంది. అక్కడ టిటో క్లబ్ తో పాటు చాలా క్లబ్బులు ఉన్నాయి. అలాగే బాగా, అంజునా, వాగటర్, కోలన్ గుట్ బీచ్ ల దగ్గర కూడా కొన్ని నైట్ క్లబ్ లు ఉన్నాయి. సుమారు రూ.2,000ల వరకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. ధరను బట్టి అనేక బ్రాండ్ ల మద్యం సరఫరా చేస్తారు. అదిరిపోయే డీజేతో తెల్లవారుజాము వరకూ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఇదంతా హైదరాబాద్ వంటి నగరాల్లో మామూలే కదా అనేవారు సముద్రం బ్యాక్‌వాటర్‌లో భారీ ఓడల్లో ఏర్పాటు చేసిన కేసినోలకు వెళ్ళండి. పనజిలో డెల్టిన్ రాయలే, కేసినో ప్రైడ్... మజోర్డా బీచ్ లోని ట్రెజర్ కేసినోలాంటివి అనేకం ఉంటాయి. కేసినో అంటే ఒక రకమైన జూదశాల అన్నమాట.


ఇదే జూదశాల 
కానీ ఇక్కడికి కుటుంబం అంతా వెళ్లొచ్చు. కాకపోతే 21 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే కేసినోలోకి ప్రవేశం. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా కేర్‌ సెంటర్లుంటాయి. సముద్రం, మాండవి నదులలోనే కాకుండా ఒడ్డున కూడా మరెన్నో కేసినోలు ఉన్నాయి. ఒకరికి రూ.1500 నుంచి రూ.8,000 వరకు తీసుకుంటారు. అందుకు తగ్గట్టే భారీ బఫేలు, స్నాక్స్, రకరకాల బ్రాండ్ల మద్యం సరఫరా చేస్తారు. హద్దుల్లేకుండా ఎంజాయ్ చెయ్యొచ్చు. అలాగే కేసినోలో పందెం కాయడానికి కొన్ని కాయిన్స్ టిక్కెట్టుతో పాటు ఇస్తారు. ఇంకా ఆడాలంటే కాయిన్స్ కొనుక్కోవాలి. డబ్బు గెలుచుకుంటే ఆనందం. పోగొట్టుకుంటే ఒక మంచి  అనుభవం. ఈ క్యాసినోలకు వెళ్లేముందు మనకంటూ ఒక వాహనం ఉంటే మంచిది. బోరు కొట్టినప్పుడు హోటల్ కు వచ్చేయవచ్చు. ముందే చెప్పాను కదా. గోవాలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదు. ఇక రాత్రుళ్ళయితే అంతే. భద్రత పరంగా గోవా సురక్షితమైనదే. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా.


ఆర్పొర దగ్గర ప్రతి శనివారం జరిగే నైట్ బజార్ 
గోవాలోని బాగా, అంజునా బీచ్ ల మధ్య ఆర్పోరా అని ఒకచోటు ఉంది. అక్కడ ప్రతి శనివారం నైట్ బజార్ ఉంటుంది. అలాగే అంజునా బీచ్ లో ప్రతి బుధవారం రాత్రి అంజునా ఫ్లీ మార్కెట్ ఉంటుంది. మామూలు సంతలాగా ఉండే ఈ నైట్ బజార్ల ప్రత్యేకత ఏంటంటే గోవా సంస్కృతి ఇక్కడ సందడి చేస్తుంది. ఆటలు, పాటలు, డాన్సులు ఎన్నో ఉంటాయి. వాళ్ళతో మీరు కూడా డాన్స్ చేయొచ్చు. మంచి పాటలు పాడొచ్చు. బేరం ఆడగలిగితే తక్కువ ధరకే మంచి వస్తువులు కొనుక్కోవచ్చు. గోవాకు వెళ్తే ఈ నైట్ బజార్ కు తప్పకుండా వెళ్ళాల్సిందే. మంచి షాపింగ్ అనుభవాన్ని మూటకట్టుకు తెచ్చుకోవాల్సిందే.

ఇక గోవాలో చూడదగ్గ ప్రదేశాల విషయానికి వద్దాం.... 

బామ్ జీసస్‌ బాసిలికా చర్చి: 

బామ్ జీసస్‌ బాసిలికా చర్చి
గోవాలో తప్పక చూడాల్సింది బామ్ జీసస్‌ బాసిలికా చర్చి. పాత గోవాలో గోవా రాజధాని పనజికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బామ్ జీసస్ అంటే  బాల ఏసు అని అర్థం. ఈ కేథలిక్‌ చర్చిని 1605లో కట్టారు. గోవాలోని సుప్రసిద్ధ క్రైస్తవ మత గురువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ఈ చర్చిలోనే ఉంది. ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహాన్ని బహిరంగ ప్రదర్శనకు ఉంచుతారు. అలా తీసినప్పుడల్లా ఆ మత గురువు దేహానికి గోళ్ళు. వెంట్రుకలు పెరగడం చూస్తామని భక్తుల నమ్మకం. చర్చి ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ చర్చికి ఎదురుగా గోవా  స్టేట్ మ్యూజియం ఉంటుంది.

డాల్పిన్ స్పాట్ :

సిన్క్వురియం బీచ్ నుండి ఒక్కొక్కరికీ రూ.300 తీసుకుని పడవలో సముద్రం లోపలికి తీసుకువెళ్తారు. దాన్ని డాల్పిన్ స్పాట్ అంటారు. మీ అదృష్టం బాగుంటే మీ పడవ చుట్టూ డాల్పిన్ లు ఎగురుతూ కనబడొచ్చు. డాల్పిన్ లు కనబడక పోయినా పడవ ప్రయాణం మాత్రం కాస్తంత భయంగా, అంతకన్నా ఎక్కువ సరదాగా, థ్రిల్లింగ్ గా ఉంటుంది.
డాల్పిన్ స్పాట్ 
సముద్రం మీది నుంచి దగ్గరలో ఉన్న చిన్న గుట్టలాంటి ప్రదేశంలో ఒక రాజమహల్ లాంటిది కనిపిస్తుంది. అది గోవాలో పేరుబడ్డ డాన్..  బాస్కో ఇల్లు అని పడవ నడిపేవారు చెపుతారు.

అగోడ కోట:     

అగోడ కోట తాలూకు లైట్ హౌస్ 
సిన్క్వురియం బీచ్, కండోలిం బీచ్ లను వేరు చేస్తూ అగోడ కోట ఉంటుంది. పోర్చుగీసు వారు నిర్మించుకున్న ఈ ఎర్రటి కోట సాయంత్రం వేళల్లో బాగుంటుంది. అలాగే వాగటర్ బీచ్ దగ్గరలో ఉన్న ఛపోరా కోట కూడా చూడదగిందే. మాపూసా పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోటలో సినిమా షూటింగ్ లు ఎక్కువగా జరుగుతాయి. కోటకు దిగువన సెయింట్ జెరోమ్ చర్చిని తప్పక సందర్శించండి.


గోవా స్పైస్ గార్డెన్:

ఐస్ క్రీంలలో వాడే వెనిలా
ఈ తీగ నుంచే వస్తుంది  
మున్నార్, సిమ్లా వంటి ప్రదేశాల్లోనే కాదు గోవాలోనూ స్పైస్ గార్డెన్ లను చూడొచ్చు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాల చెట్లను చూడటమే కాకుండా  వాటిని కొనుక్కోవచ్చు. భోజనంతో కలిపి ఒక్కొక్కరికీ రూ.400 ఎంట్రీ టికెట్ ఉంటుంది.  






శాంత దుర్గ దేవాలయం 

గోవాలో చెప్పుకోదగ్గ దేవాలయాలు కూడా ఉన్నాయి. మారుతి గుడి, మహాలక్ష్మి గుడి, మహాదేవ గుడి, శాంతదుర్గ గుడి, మంగేశి గుడి వీటిల్లో ప్రముఖమైనవి. మహాదేవ గుడి చుట్టూ ప్రకృతి బాగుంటుంది. 
మంగేష్ దేవాలయం 



గోవాలో క్రూయిజ్‌ విహారం:

పనజిలోని కదంబ బస్ టెర్మినస్ ను చూసుకుని అక్కడికి కిలోమీటరు దూరంలో పాత పనజి రోడ్డులో మాండవి నదిపై ఉన్న శాంటా మోనికా బోట్ జెట్టి దగ్గరకు వెళ్తే రివర్ క్రూయిజ్‌ ఎక్కొచ్చు. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయాన సుమారు గంట పాటు మాండవి నదిపై మిరామర్ బీచ్ పాయింట్ వరకు ఉండే ట్రిప్ చాలా బాగుంటుంది. క్రూయిజ్‌ డెక్‌ పైన స్థానిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కొక్కరికీ టికెట్ రూ.300లు. అయితే దీని కోసం సీజన్ ను బట్టి ఒక్కోసారి గంట, రెండు గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది.
మాండవి నదిపై సూర్యాస్తమయ వేళ 
 ప్రతి బుధవారం, శనివారం రాత్రి 8:45 నుండి 10:45 వరకు డిన్నర్ క్రూయిజ్ ట్రిప్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరికీ రూ. 650లు. పన్నెండేళ్ళ లోపు పిల్లలకు రూ.300లు. రోజంతా తిరగాలంటే కూడా ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు తిరిగి రావచ్చు. 


గోవాలో సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రం కూడా తప్పకుండా చూడతగినది. ఇంకా చూడాలంటే గోవాలో చాలా ఉన్నాయి. వాక్స్ మ్యూజియం, ఆక్వేరియం హౌస్ లు చిన్న పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. 
మైనపు మెస్సీతో ఓ ఫోటో 
   

అన్నీ అయ్యాక పనజిలోని ప్రభుత్వ నిర్వహణలో ఉండే దుకాణాలలో మద్యం, సుగంధ ద్రవ్యాలు కొనుక్కోవడం మరువకండి. 



ఫెన్నీ:

గోవాలో కాజు ఫెన్నీ, కోకోనట్ ఫెన్నీ అని రకరకాల ఫెన్నీ వివిధ ధరల్లో దొరుకుతుంది. ఇది అక్కడి ప్రత్యేక మత్తుపానీయం. కాజు ఫెన్నీని జీడి మామిడితో తయారు చేస్తారు. ఫెన్నీ తయారు చేయడం గోవాలో ఒక కుటీర పరిశ్రమలాంటిది. ఈ ఫెన్నీని జలుబు వంటి వాటికి ఒక ఔషధంలా కూడా వాడతారు స్థానికులు.           



సాగరతీరం... సంధ్యాసమయం  
మరో విషయం ఏమంటే గోవాలో రాత్రి సందడి అంతా పర్యాటకులదే. అక్కడ నివసించే ప్రజలు మాత్రం సాయంత్రం ఆరు గంటలకల్లా కార్యాలయాల నుంచి ఇళ్ళకు చేరుకుంటారు. అంతకన్నా ఆలస్యం అయితే ఇళ్ళకు వెళ్లేందుకు సంస్థ వాహనాలను సమకూరుస్తుంది. ప్యాకేజీల మీద సైట్ సీయింగ్ కు తీసుకువెళ్ళే టాక్సీలు కూడా ఆరు గంటల కల్లా మిమ్మల్ని మీ హోటల్ దగ్గర దింపేస్తాయి. వాళ్ళ జీవన శైలి అలాంటిది. డబ్బు కోసం పరుగులు తీయరు.


మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...  పర్యాటకుల రక్షణార్థం గోవా ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సముద్రంలోకి వెళ్ళే పర్యాటకులకు ముందే హెచ్చరికలు చేస్తూ ప్రమాదకరమైన ప్రదేశాలలో జెండాలు పాతి ఉంచుతారు. గస్తీ సిబ్బంది అందరినీ గమనిస్తూ ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే రక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. మనం వారు చెప్పినట్టు వింటే సురక్షితంగా గోవా పర్యటన ముగించుకు రావచ్చు.                 


రాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న ఒక శాక్ 
మొత్తం మీద గోవా అంటే అందమైన బీచ్ లు, నైట్ క్లబ్ లు, క్రూయిజ్ లు, కేసినోలు, వాటర్ స్పోర్ట్స్... ఇంకా చెప్పాలంటే పోర్చుగీసు కాలానికి తీసుకెళ్ళే సంస్కృతి, అందమైన ఇళ్ళు, చర్చిలు, రణగొణ ధ్వనుల్లేని రోడ్లు, స్వచ్ఛంగా ఉండే ప్రకృతి... ఆనందం, అనుభవం తప్ప మరొకటి లేని ప్రపంచం. ఒకసారి వెళ్ళొస్తే మీరే అంటారు. 'మళ్ళీ మళ్ళీ గో గో గోవా' అని.