పేజీలు

30, జనవరి 2013, బుధవారం

దర్శకుడిగా, నటుడిగా కమల్ 'విశ్వరూపం'

ప్రతీదీ వివాదమౌతున్న ఈరోజుల్లో కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన విశ్వరూపం సినిమా కూడా అనేక వివాదాలను ఎదుర్కొంటూ వచ్చింది. థియేటర్లతో పాటు డీటిహెచ్ ప్రసారానికీ అనుమతించడం ఒక వివాదానికి దారితీస్తే, ముస్లింలకు వ్యతిరేకంగా చిత్రకథ ఉందంటూ మరో వివాదం. ఈ నేపథ్యంలో తమిళనాట విడుదలకు నోచుకోని ఈ చిత్రం తెలుగునాట మాత్రం విడుదలైంది.అదీ ఆచితూచీ కొన్ని థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించినా, మాట్లాడినా సహించలేని పరిస్థితులు, కళారంగాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రతీదీ రాజకీయ ప్రయోజన కోణంలో ఆలోచించే సమాజంలో ఇకపై ఇలాంటి ప్రయోగాలను మరెవ్వరూ చేసి చేతులు కాల్చుకోరేమో! ఆరు పాటలు, ఐదు పోరాటాలు, అందాల ఆరపోతల చిత్రాలే ఇక మనకు గతి.

ఇక విశ్వరూపం చిత్రం విషయానికి వస్తే, కమల్ పట్ల ఉన్న భారీ అంచనాలతో ప్రేక్షకులు కూడా భారీగానే థియేటర్లకు వచ్చారు. వారిలో చాలామందికి నచ్చని (పట్టని) కథాంశం కావడంతో ఆదిలోనే నిరాశతో కూడిన ఎన్నో నిట్టూర్పులు. అదే సమయంలో కాస్తోకూస్తో హాలీవుడ్ సినిమాలు చూసిన ప్రేక్షకులు మాత్రం కన్నార్పకుండా కమల్ వెంట తన్మయత్వంతో పరుగులు తీశారు. రెండున్నర గంటలు దాటినా, ఇంకా చూడడానికి ప్రేక్షకుడు సిద్ధంగా  ఉంటాడు. అలాంటి సమయంలో టక్కున ముగుస్తుంది సినిమా. విషయం ఏంటంటే, ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండోభాగం కూడా మరోచిత్రంగా రానుందని చివర్లో చెప్పారు. ఇది కూడా కొంతమందిని నిరాశపరుస్తుంది. ఏది ఏమైనా మన భారతీయ చలనచిత్ర పరిశ్రమ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించగలిగే చిత్రం.

కథాంశానికి వస్తే, అమెరికాలో ప్రముఖ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో డాక్టరుగా పనిచేస్తున్న నిరుపమ (పూజా కుమార్ మాథుర్ ) తన బాస్ తో (అక్రమ)సంబంధాన్ని కలిగిఉంటుంది. (భారతీయ చిత్రం కాబట్టి దీన్ని మరీ లోతుగా తీసుకువెల్లకుండా, ప్రారంభదశలోనే  పక్కదారిపట్టించారు). ఈ విషయం బయటపడితే తన తప్పును కప్పిపుచ్చుకోడానికి వీలుగా ఉంటుందన్న ఉపాయంతో, భర్తకు కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయేమో ఆరాతీయడానికి ఒక డిటెక్టివ్ ను నియమిస్తుంది నిరుపమ.  కథక్ కళాకారుడైన ఆమె భర్త (కమల్ హాసన్) ఇంటిపట్టునే ఉంటూ ఔత్సాహికులకు కథక్  నేర్పుతుంటాడు. ఇలాఉండగా ఒకరోజు నిరుపమ భర్తను అనుసరిస్తూ  వెళ్ళిన  డిటెక్టివ్, తప్పుదారిపట్టి ఒక  వేర్ హౌస్ లోకి అక్రమంగా ప్రవేశించబోతాడు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది.

అల్ ఖైదా పోరాటాలకు సంబంధించిన కథ. జీహాదీలకు ఇచ్చే శిక్షణ, వారి జీవనవిధానం, కుటుంబ నేపథ్యాలు, కరడుకట్టిన మతవాదం, అమలుచేసే శిక్షలు... ఇలాంటి అంశాలపై ఎంతో లోతైన పరిశోధనలు చేశారనిపిస్తుంది. ఆఫ్ఘన్ పర్వతపానువుల్లో చిత్రీకరించబడిన యుద్ధ దృశ్యాలు అద్భుతం. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోవు. స్పృశించిన సన్నివేశాలు సున్నితమైనవి. అయినా వాస్తవానికి దగ్గరగా,మనసుకు హత్తుకునేలా చూపించారు.  హింసాత్మక దృశ్యాలు ఉన్నప్పటికీ కథకు అనుగుణంగానే, అవసరంమేరకే  ఉన్నాయి. ఒకే ఒక పాట. మరో పాట బ్యాక్ డ్రాప్లో వస్తూంటుంది. కథక్ నేర్పుతూ సాగే ఆ ఒక్క పాటనూ అద్భుతంగా చిత్రీకరించారు. దిల్ తో పాగల్ హై, దేవదాస్ వంటి హిందీ చిత్రాలకు పనిచేసిన  పండిట్ బిర్జూ మహారాజ్ ఈ పాటకు నృత్య దర్శకత్వం చేశారు. కథక్ నాట్యాచార్యునిగా కమల్ చూపిన హావభావాలు మనోహరం. ఇదే పాత్ర మరో పాత్రగా రూపాంతరం చెందే క్రమంలో ఒక ఫైట్ ఉంటుంది. కుర్ర హీరోలు కూడా అంత ఎనర్జీతో చేయలేరేమో! ఈ ఒక్క సీన్ చాలు దర్శకుడిగా, నటుడిగా కమల్ విశ్వరూపాన్ని చాటడానికి.

హిందీలోని ఎన్నో హిట్ చిత్రాలకు, తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి సంగీతం అందించిన శంకర్-ఎహసాన్ -లాయ్ త్రయం ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

చివరగా చెప్పేదేంటంటే ఇది తప్పకచూడాల్సిన సినిమా. అది కూడా థియేటర్లో.

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి