పేజీలు

8, ఆగస్టు 2013, గురువారం

తెలిసీ పలికిన విలువేగా...!

'పేదరికం...  ఒక మానసిక స్థితి మాత్రమే '
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యపై స్పందిస్తూ 'పేదలను అవమానించారు' అంటూ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ యువరాజును తెగ విమర్శిస్తోంది. పత్రికలు కూడా అదో విడ్డూరం అన్నట్టు విస్తుపోతున్నాయి.  అలా విమర్శించే ముందు అతనే సందర్భంలో ఆ మాట అన్నాడో కూడా పట్టించుకోవట్లేదు. అయినదానికీ కానిదానికీ రాద్ధాంతం చేయడమే రాజకీయం కాబట్టి, ప్రతిపక్షాలు వాటికి అవసరం అయినంత మేరకే ఆలోచిస్తాయి. ఏదో ఒకటి జరిగితే దాన్ని సంచలనం చేయడమే పత్రికల పని.

పేదరికాన్ని స్వయం శక్తితో  అధిగమించిన స్వయం సహాయక సంఘాల గురించి ప్రస్తావిస్తూ, 'ఆత్మవిశ్వాసంతో తమంతట తాముగా  పేదరికం నుండి బయటపడే ప్రయత్నం చేయనంతవరకూ, ఏ ప్రభుత్వం ఏం చేసినా ప్రయోజనం ఉండద'ని అర్థం వచ్చేలా అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ఇలా మాట్లాడం  తప్పే. అయితే ఆ తప్పు  వల్ల కాంగ్రెస్ పార్టీకి ముప్పు. రాహుల్ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు. అంతే కానీ దేశానికి, ప్రజలకు, పేదలకు మాత్రం కనువిప్పు కలిగించే మాటలవి. ఎంతో పరిణితితో కూడిన, నిజాయితీ కలిగిన , సంస్కర్త మాట్లాడినట్లుగా ఉంది. ముఖ్యంగా జనాకర్షక పథకాలకు పెట్టిన పేరు కాంగ్రెస్. అందునా నగదు బదిలీ వంటి ప్రత్యక్ష ప్రయోజనాల ఆలోచన చేసిన రాహుల్ నోటి వెంట ఈ మాట రావడం విస్మయం కలిగించేదే. అయినా స్వాగతించ తగిన పరిణామం. 

గత 65 సంవత్సారాల నుంచి ఇప్పటివరకు  పేదల పేరు చెప్పి బొక్కసం ఖాళీ చేస్తూ, వీధి నాయకుల నుంచి దేశ నాయకుల వరకు అందరూ ప్రజాధనం బొక్కి  బొజ్జలు పెంచారే తప్ప, పేదోడి డొక్క నిండలేదు. పేదల బ్రతుకులు మారనూలేదు. నానాటికీ పేదలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. నిజానికి పేదల కోసం ప్రభుత్వాలు ఇళ్ళు కట్టిస్తున్నాయి. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఏ మార్కెట్లోనూ దొరకనంత తక్కువ రేటుకు బియ్యం మరియు వంట సరకులు ... ఇలా ఒక్కో లబ్ది దారుడికి సుమారుగా నెలకు 300 రూపాయలు(మన ముఖ్యమంత్రిగారి తాజా లెక్కల ప్రకారమే 230 రూపాయలు)  అందిస్తున్నాయి. అయినా 8.46 కోట్ల జనాభా కలిగిన మన రాష్ట్రంలో  2. 3 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వ ప్రకటనలు చెబుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2. 08 కోట్ల  కుటుంబాలు మాత్రమే ఉంటే తెల్ల కార్డులున్న కుటుంబాలు 2. 3 కోట్లు ఉండటం గణిత శాస్త్రానికే సవాలు విసిరే అంశం.  ప్రభుత్వ ఖజానా నుండి బయటికి వచ్చే సంక్షేమ నిధులు లబ్దిదారుడిని చేరే లోపు మంచు గడ్డలా కరుగుతూ కరుగుతూ  ఎంత మంది నాయకుల, అధికారుల ధనదాహాన్ని తీరుస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఖరీదయిన స్కార్పియో వాహనంలో వచ్చి, తెల్ల కార్డును చూపించి ఆరోగ్య శ్రీ కింద కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుకుంటున్న వైనం గురించి పత్రికలలో చదివి కూడా అసలైన పేదను గుర్తించే ఏ ప్రయత్నమూ, ఏ ప్రభుత్వమూ చేయదు. ఎందుకంటే ఆ కార్డులతో ప్రయోజనం పొందే వాళ్ళల్లో పార్టీ నాయకులూ,   వారి అనుచరగణమే  ఎక్కువ. వారికి ఆ ప్రయోజనాలు అందకపోతే పార్టీని మట్టి కరిపించేస్తారు. అందుకే...  వారిని మేపే నిరంతర ప్రక్రియలో భాగంగానే ఇలాంటి పేదల పథకాలను ఎప్పటికప్పుడు వినూత్నంగా  తమ ఎన్నికల అజెండాలో చేరుస్తుంటాయి రాజకీయ పార్టీలు. అంతే కానీ నిజంగా పేదలను ఉద్ధరించే లక్ష్యం ఏ పార్టీకీ లేదు. 

 చాన్నాళ్ళ క్రితం గుడిపాటి వెంకటాచలం తన రచనల్లో ఒక చోట ఇలా రాస్తే, చదివినట్టు గుర్తు. ''కడుపు నిండా తిని, తాంబూలం నములుతూ పేదోడి ఆకలి కష్టాల గురించి తమ రచనల్లో తెగ రాసేస్తుంటారు రచయితలు. నిరుపేద జీవితం చాలా దుర్భరమైనదని అనిపించేలా  వర్ణిస్తారు. సానుభూతిని కురిపించేస్తారు.  నిజానికి మనం అనుకుంటున్నంత దుర్భరంగా ఉండదు పేదోళ్ళ జీవితం. శ్రమించి పనిచేయడం వాళ్ళకి కష్టం అనిపించదు. ఉన్నంతలోనే ఆనందాన్ని వెదుక్కుంటూ, మరొకరి సాయం ఆశించకుండా ఆత్మగౌరవంతో బ్రతకడం వాళ్లకి  తెలిసినంతగా వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళకి తెలియదు.''

ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది కూడా అదే. రోజుకు ఇంత సంపాదించే వాడు, నెలకు ఇంత ఖర్చు చేసేవాడు పేదవాడు  అనే లెక్కలన్నీ భౌతికపరమైన అంశాలు మాత్రమే. సంతృప్తితో కూడిన మానసిక స్థితిని పొందనంత వరకూ, వాడు పేద కిందే లెక్క. కోట్ల ఆస్తి ఉండి కూడా డబ్బు కోసం నానాగడ్డి కరిచే వాడు,  సలక్షణమైన ఉద్యోగం చేస్తూ కూడా పై ఆదాయం ఆశించేవాడు ఎప్పటికీ నిరుపేద కింద లెక్కే.  రాహుల్ చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం. పేదరికం అన్నది ఒక మానసిక స్థితి. ఆ స్థితి నుంచి బయటపడాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం ఉండాలి. ప్రతి పేదకూ కావలసింది అదే.  గాలివాటుగా కాకుండా   కాబోయే ప్రధాని అభ్యర్థిగా ఒక స్పష్టమైన దృక్పథం ఉండి ఈ మాటను అని ఉంటే... రాహుల్ గాంధీని ప్రధానిగా ఆహ్వానించ వచ్చు.              

8 కామెంట్‌లు:

  1. ఒక స్పష్టమైన దృక్పథం ఉండి ఈ మాటను అని ఉంటే... రాహుల్ గాంధీని ప్రధానిగా ఆహ్వానించ వచ్చు

    ఈ మధ్య బానిసత్వానికి పీక్స్ చూసాను భయ్యా.... గ్రేట్.. ఆహ్వానిద్ధాం ఈయన, ఈయన మనవడు .... ఇలా అంతా వారే... నువ్వొద్ధు నేనొద్ధు మనలొంచి ఎవ్వడూ వద్దు అదే కుటుంబం అదే బానిసత్వం అర్హతలన్నీ ఉన్నాయని ఒబామానో బ్రిటన్ యువరాజునొ మన ప్రధానిని చెస్తే ఇంకా బెటర్ ఏమో..... వాళ్ళు కాస్త స్వాభిమానం ఉన్నవారే..... ఆహ్వానిద్ధాం స్విజ్జ్ బ్యాకుల్లో నింపిన టంక సాల నిండలేదట నీ ట్యాక్స్ తొ నింపు.

    40 యేళ్ళ కుటుంబ పాలనలొ అవినీతి ని కంట్రోల్ చేయలేక ఇప్పుడు ఈయన వచ్చి రచయితలు రాసిన ఘాట్టీ డయిలాగులు పేలితే మురిసిపోతున్నారు .... ఇతర దేశాల్లో నాయకులు నైతికతని నింపడానికి పాటుపడితే వీరి కుటుంబం జనాన్ని దిగజార్చుట్కి ప్రయత్నించి గరీబీ హటావొ అనే మాటని 65 య్రళ్ళుగా కంటిన్యూ చేస్తున్నరు .... ఈ సినిమాడయిలాగులు బాగా ఉపకరిస్తున్నాయిలె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరసింహ గారూ,
      వారసత్వం కాకపొతే మతతత్వం. ఏదో ఒక తత్వానికి బానిసలుగా బతకక తప్పనప్పుడు గుడ్డిలో మెల్ల అనుకోవటం మంచిది కదా. రాజకీయాల్లొకి మీరో నేనో రావాలంటే కోట్లు కూడబెట్టాలి. అలా కూడబెట్టాలంటే న్యాయబద్దం, చట్టబద్దం అని రెండు మార్గాలున్నాయి. న్యాయబద్దంగా అసాధ్యం భయ్యా. చట్టబద్దంగా అంటే మళ్ళీ రాజకీయ నాయకుల అండ కావాలి. నోటు లేకుండా ఓటెయ్యని జనాలున్నంతవరకు, తాయిలాలు ప్రకటించకుండా పోటీకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నంత వరకు ఈ బానిసత్వం తప్పదు. ఇక్కడ నాకు నచ్చింది ఏమిటంటే, పేదరికాన్ని నిర్మూలిస్తానంటూ పాచి వాగ్దానం చేయకుండా 'నాయనలారా,బాగుపడాలనే యావ నీకుండాలి గానీ, నిన్ను ఏ నాయకుడూ బాగు చేయలేడు ' అని నిజాయితీగా చెప్పాడు.

      తొలగించండి
  2. Then why should Rahul "GANDHI" wants to become Prime Minister ?
    Why his mother didn't go to Itali after death of his husband.. and continuing President of Congress party. Even she doesn't know boarder of India.. and how many states in India.. It is our fate...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rahul or Sonia... any member from that family is just an icon. Such as brand name. Without these icons Congress can not be stable. When there is no stability no question of ruling. It is not the fault of Rahul or Sonia.

      తొలగించండి
  3. వారసత్వం కాకపొతే మతతత్వం. ఏదో ఒక తత్వానికి బానిసలుగా బతకక తప్పనప్పుడు గుడ్డిలో మెల్ల అనుకోవటం మంచిది కదా. రాజకీయాల్లొకి మీరో నేనో రావాలంటే కోట్లు కూడబెట్టాలి. అలా కూడబెట్టాలంటే న్యాయబద్దం, చట్టబద్దం అని రెండు మార్గాలున్నాయి. న్యాయబద్దంగా అసాధ్యం భయ్యా. చట్టబద్దంగా అంటే మళ్ళీ రాజకీయ నాయకుల అండ కావాలి. నోటు లేకుండా ఓటెయ్యని జనాలున్నంతవరకు, తాయిలాలు ప్రకటించకుండా పోటీకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నంత వరకు ఈ బానిసత్వం తప్పదు.
    ---all these opinions are completely wrong. Only an ignorant and politically blind person will write such nonsense. You have not enough wisdom to write on serious things.

    రిప్లయితొలగించండి
  4. పేదరికం ఆయన గారు చెప్పినట్టు మానసికం ఆదు. సంపాదించాలనే యావ అందరికీ ఉంది కదా అని జన్మ్ దామాషాని బట్టి రిజర్వ్ బాంక్ నోట్లు ముద్రించలేదు కదా. చెలామణి లో ఉన్న 100 రూపాయల్లో 80 రూపాయలు కంగ్రెసు వాళ్ళూ వాళ్ళ అస్మదీయులూ నొక్కేస్తుంటే ఆ మిగతా 20 రూపాయల్నీ యెంతమంది పంచుకోవాలి?దాన్ని ఆపలేక ఇలా సుభాషితాలు చెప్తున్నాడు!

    రిప్లయితొలగించండి
  5. చంద్ర మోహన్ గారికి క్షమాపణలు. నేను మొదటి కామెంటులో ఇంగ్లిషులో రాసిన భాగం లో చాలా కఠినమైన భాష వాడాను.ప్రచురించు బటన్ నొక్కేసాక లేఖినిలో మళ్ళీ చదువుతున్నఫ్ఫుదు అనిపించింది. ఇంత హార్డ్ గా ఉన్న కామెంతుని ప్రచురిచరేమోలే అనుకున్నా.ప్రచురించారు, థాంక్స్.ఆ ఒక్క పాయింటుతోనే మీరు ముగ్ధులైపోయి అసలు విషయాన్ని గమనించలేదు.దాని వివరిస్తూ రెందో కామెంటు వేసాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి గారూ,
      భావాలను వ్యతిరేకించే సమయంలో భావోద్వేగాలను ఎలా బహిర్గతం చేస్తున్నామో ఒక్కోసారి గమనించం. ఇందులో క్షమించేంత తప్పేం లేదు. ఇకపొతే ఉచిత తాయిలాల జోలికి పోకుండా ఎలక్షన్లకు పోలేమని నిన్నో, మొన్నో పార్టీలన్నీ కుండబద్దలు కొట్టినట్టు ఏకగ్రీవంగా చెప్పాయని వార్తల్లో చదివాను. పైగా అది వాళ్ళ హక్కు అని కూడా వాదించారు. పార్టీలు మారవు. పేదలు ఉచితం గురించి ఎదురుచూసినన్నాళ్ళూ నాయకుల దోపిడీ కూడా ఆగదు.

      తొలగించండి