నీ ఒడిని నిద్దుర పోతిమి
తెల్లవారి లేచి చూచి
తెల్లబోయాము... ఘొల్లుమన్నాము... ''
భార్యాబిడ్డల్ని వదిలేసి ఉద్యోగ సంపాదనలో ఊరూరా, రోడ్లు పట్టి తిరుగుతున్న తండ్రి ఒకచోట. తమని వదిలేసి వెళ్ళిపోయిన నాన్న మీది బెంగతో తల్లడిల్లుతూ, అన్ని దిక్కులా వెతుకుతూ, దిక్కుతోచక రోడ్డున వెళుతున్న పిల్లలు మరోచోట. తండ్రిని వెదుకుతున్న ఆ పిల్లల నోట వచ్చే పాట ఇది. అపుడాయన హావభావాలు చూసి, అయ్యో పాపం! ఆయనకేదయినా ఉద్యోగం దొరికితే బాగుండు అనుకుంటూ చెమర్చిన కళ్ళతో చూశాను. సినిమా పేరు భార్యాబిడ్డలు.
'ఆకులు పోకలు ఇవ్వద్దూ ... నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ...' అంటూ అదే సినిమాలోని హుషారు పాటని నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు అల్లరి చేస్తూ పాడుకున్నా.
ఆ తర్వాత 'రైతు కుటుంబం'
జిల్లాయిలే జిల్లాయిలే... అంటూ కాంచనతో ఆయన కవ్వింపు పాట.
గాంధీ పుట్టిన దేశమా ఇది? నెహ్రు కోరిన సంఘమా ఇది?... పవిత్రబంధం సినిమాలో ఆయన సంఘాన్ని నిలదీస్తే, అదే పాటని స్కూల్లో ఆవేశంగా పాడి చప్పట్లు కొట్టించుకున్నా.
మంచి రోజులోచ్చాయ్, దత్తపుత్రుడు, దసరాబుల్లోడు ... అదేంటో చిన్నప్పుడు అన్నీ ఆయన సినిమాలే చూసాం. ఎందుకంటే మా ఇరుగుపొరుగు అమ్మలక్కలంతా ఆయన అభిమానులు. విడుదలైన ఆయన సినిమాలన్నిటికీ వాళ్ళు వెళ్తూ అమ్మను పిలిచే వాళ్ళు. అమ్మ కొంగు పట్టుకుని నేనూ వెళ్ళాను.
విశాఖపట్నం, కాకినాడ నగరాలనుంచి విజయవాడకు వచ్చింది మా కుటుంబం. మరుసటి రోజు వీధిలో పరిచయం చేసుకున్న నాలుగో తరగతి వోడు అడిగాడు. 'నువ్వు ఏ పార్టీ' అని. పార్టీ అంటే అప్పుడే రెండో తరగతి పాసయిన నాకు అర్థం కాలేదు.
'అదే ఎన్టీయారా ఏయన్నారా? నువ్వు ఎవరి పార్టీ?'
'వాళ్ళెవరు?'
'వాళ్ళు తెలీదా?' సినిమా పేర్ల సాయంతో చెప్పారు వాళ్ళు.
' ఓసి వాళ్ళేనా! రామారావ్, నాగేస్వర్రావులను అలా కూడా పిలుస్తారా? అయితే ఇంకా డౌట్ ఏంటి? నేను ఏయన్నార్ పార్టీ' అన్నాను.
' యే ... ఏయన్నార్ పార్టీనా? మీ హీరోకి అసలు ఫైట్ చేయడమే రాదు.' ఎగతాళి చేశారు.
'ఫైట్లు రాకపోతేనేం ప్రేమించడం వచ్చు.' అన్నాను.
అవును! అప్పటికే ప్రేమనగర్ సినిమాను చూసి ఉన్నాను. తేట తేట తెనుగులా అంటూ హీరోయిన్ వంక ఒకలా చూస్తుంటే ఆవిడెంత సిగ్గుపడిందో! లవర్ బాయ్ గా ఆయనకెంత పేరో! సెక్రటరీ సినిమా చూస్తున్నప్పుడు మా వెనుక కూర్చున్న ఆడవాళ్లు ''వాడు చూడే. ఆ చూపు చూడు. అది చాలే.'' అయన గురించి ఇలాంటి కామెంట్స్ ఆ రోజుల్లోనే విన్నాను. హీరొయిన్ కీ తనకీ ఇగో ప్రొబ్లెమ్స్. దగ్గరవ్వాలనుకున్నప్పుడల్లా దూరంగా నెట్టే ఆవిడ పనులకు, ప్రవర్తనకు, మాటలకు, అపార్థాలకు ఆమెను ఏదో చేసేయ్యాలన్నంత కోపం. కానీ ఏమీ చెయ్యలేనంత ప్రేమ. ఆ సమయంలో ఆమె వంక మాట్లాడకుండా ఓ లుక్కు. ఈ పేరాడు భావాలనీ ఆయన ఒక్క చూపులో పలికించేవాడు. ఇక్కడ వాణిశ్రీ గారి గురించి కూడా చెప్పుకోవాలి. అలాంటి పాత్రలకు అమెకెంత పేరో! వారిద్దరిదీ ఎంత మంచి జోడీ!
'మీ ఏయన్నారుకు ప్రేమించడం కూడా రాదు. ఫెయిలయ్యి మందు కొడతాడు.' అన్నాడు నాలుగోతరగతి వాడు.
'మా వాడు మందు కొట్టినట్టు మీ వాడు కొట్టగలడా? ప్రేమనగర్ చూడు.' అన్నాన్నేను.
.jpg)
బాటసారి సినిమా గురించి చెప్పుకోకూడదు. చూసి ఊరుకోవాలి. ఎందుకంటే ఎవరికి వారికి ఒక అవ్యక్తానుభూతిని విడివిడిగా మిగిల్చే సినిమా అది. అక్కినేని ఉత్తమ చిత్రాల్లో అది మొదటిదనే చెప్తాన్నేను.
'మా ఎన్టీవోడు రాముడు, కృష్ణుడు. దేవుడంటే మా వోడే. మీ నాగ్గాడు చేయగలడా?' ఇంకో యాంగిల్లో నన్ను ఓడించడానికి చూశాడు నాలుగో తరగతోడు.
విజయవాడలో ప్రజలకు సామాజిక, రాజకీయ చైతన్యంతో పాటు సినిమా పిచ్చి కూడా ఎక్కువే. అది సినిమా వాణిజ్యకేంద్రం. అక్కడి ప్రజల తీర్పు సినిమా భవిష్యత్తును నిర్ణయించేంత కచ్చితం. నా చిన్నతనంలో ప్రతీ వోడు ఎన్టీవోడి పార్టీ లేదంటే నాగ్గాడి పార్టీ. ఇవి ఆ మహానటులకు ప్రేమగా వారు పెట్టుకున్న పేర్లు. అప్పుడప్పుడూ వాళ్ళ వాళ్ళ వెండితెర వేల్పుల మహిమల గురించి వాదనలు శ్రుతిమించి కొట్లాటల వరకూ వెళ్ళేవి. ఎంతగా అంటే గాల్లోకి సోడాబుడ్లు లేచి పేలేంతగా. అలా సినీ వినీలాకాశాన్ని సూర్యుడు, చంద్రుడూ పంచుకున్నట్టు పంచుకున్నారు వాళ్ళిద్దరూ. మిగిలిన వాళ్ళంతా స్టార్లు అంటే చుక్కలన్నమాట. సూపర్ స్టార్, రెబెల్ స్టార్, మెగా స్టార్ ఏవైనా అవి చుక్కలే. సూర్య చంద్రుల్లో సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు అంటే స్వభావ రీత్యా చంద్రుడు ఎయన్నారే. ఎన్టీయార్ సూర్యుడే.
'మీ వోడు దేవుడైతే మా వోడు భక్తుడు.' తగ్గలేదు నేను.

సీతా రామయ్య గారి మనవరాలు - ఇంటిని విడిచి వెళ్ళిన కొడుకు తర్వాతెప్పుడో తను రాకుండా మనవరాలిని పంపాడు. అది సరే, ఓ ఊత కర్రను కూడా కానుకగా పంపాడు. ఇంకా కోపం వచ్చింది ఆ తండ్రికి. దాన్ని ముట్టుకోలేదు. ఆ తరవాత తెలిసింది, కొడుకు కనరాని లోకాలకు వెళ్లిపోయాడని. ఒక్కసారిగా కుప్పకూలిపోతుండగా ఆ ఊతకర్రనే ఆసరాగా తీసుకోవలసి వచ్చింది. అలాంటి హృదయవిదారక సన్నివేశంలో ఆయన పలికించించిన భావాలు తలచుకుంటేనే కళ్ళు చెమర్చుతాయి. ఎందుకో తెలీదు ఆ ముఖంలో బాధ, చూసే వారి గుండెల్ని పిండేస్తుంది. బాధ తాలూకు బరువును ఆయన మరింత పెంచుతాడు. బాధే సౌఖ్యమన్న భావాన్నీ అందులోనే చూపిస్తాడు.
ఆయన నటనా జీవితం ఎంత పరిపూర్ణమైనదో, ఆయన వ్యక్తిగత జీవితమూ అంత నిండైనది. కేవలం పిల్లలకు తెలుగు సంస్క్రతి, తెలుగు భాష అందించడానికి ఆయన మద్రాసు నుండి హైదరాబాదుకు మకాం మార్చారంటే కుటుంబానికి, సొంత ప్రాంతానికి ఎంత విలువను ఇచ్చాడో తెలుస్తుంది. హీరోగా క్షణం తీరికలేకుండా ఉన్న వేళ, అవకాశాలు వెల్లువెత్తుతున్న వేళ అయన తీసుకున్న నిర్ణయం చాలా సాహసంతో కూడుకున్నది. తన మీద తనకు ఎంత నమ్మకం!? అలాగే నిర్మాతలంతా అయన కోసం ప్రయాసపడి ఇక్కడికే వచ్చి సినిమాలు తీశారు. కొన్నాళ్ళకు చిత్ర పరిశ్రమ అంతా ఆయన వెంటే తరలివచ్చింది. జమాజెట్టీల వంటి వారినే కూరలో కరివేపాకులా తీసిపడేసే సినీ లోకంలో ఒక నటుడి కోసం పరిశ్రమే కదిలి వచ్చిందంటే అదొక రికార్డు కాదా. ఆయన స్టామినా ఏంటో వేరే చెప్పాలా. క్రమబద్ధమైన జీవితం, నిలకడైన ప్రయాణం, నిరాడంబరత, నిరంతర శ్రమ అన్నీ ఆయన విజయానికి సోపానాలు. నిండైన జీవితానికి నిదర్శనాలు.
ఆయన నూరేళ్ళూ మన మధ్యే ఉంటాడని అనుకున్నారంతా. సిన్మాలు చేయకపోయినా వైభవోపేతమైన తెలుగు సినీ చరిత్రకు ఆయనొక సజీవ సాక్ష్యంగా కనబడేవారాయన. ఆయన చనిపోయినప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనిపించలేదు. ఒక శకం ముగిసిందనిపించింది. నా చిన్ననాటి స్మృతులను ఎవరో నా నుంచి లాక్కెళ్ళి పోయినట్టు అనిపించింది. అందుకే ఆనాటి పాట మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది.
ఆయన లేకుండా జరుగుతున్న మొదటి అక్కినేని జయంతి ఇది. ఈ సందర్భంగా ఆయన స్మృతికి నివాళి ఇది.