పేజీలు

3, ఆగస్టు 2015, సోమవారం

వీళ్ళు మారాలంటే ప్రజలు మారాలి!



ఒక నియోజకవర్గంలో ఓటు వేసేందుకు అర్హత ఉన్నవారు 100 మంది ఉన్నారనుకుంటే, అందులో ఓటరు జాబితాలో పేరున్న వారు 80 మంది ఉంటారు. పోలింగ్ శాతం 60 అనుకుంటే  ఆ 80 మందిలో ఓటేసిన వారు 48 మంది అన్నమాట. గెలుపొందిన అభ్యర్థి లేదా పార్టీకి మళ్ళీ 60 శాతం ఓట్లుపడి విజయ ఢంకా మ్రోగించింది అనుకుంటే ఆ 48 మందిలో 28-29 మంది ఆ అభ్యర్థికి ఒటేశారన్న మాట. అంటే 100 మంది ఓటర్లలో ఒక ముప్పై మంది మాత్రమే బలపరిచిన అభ్యర్థి 100 మంది ఓటర్లకు, అంతకు మించిన జనాభాకు ప్రతినిధిగా చెలామణి అవుతాడన్నమాట. దీన్నే మనం ప్రజా'స్వామ్యం' అంటున్నాం. 
ఇది రాజ్యాంగ రచనలో లోపం కాదు. రాజ్యాంగ అమలులో లోపం. ఓటుకు అర్హత ఉన్న వందకు వంద మందీ ఓటింగులో పాల్గొన్నప్పటి సంగతి గురించి రాజ్యాంగం చెప్పింది. కానీ అమలులోకి వచ్చేసరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటును ఇవ్వడంలో ప్రభుత్వాలు, ఎన్నికల సంఘాలూ విఫలం అవుతున్నాయి. అదే విధంగా ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనేలా చేయడంలోనూ ఈ వ్యవస్థలు శ్రద్ధ చూపడం లేదు. అందువల్ల 70 మంది నుండి మద్దతు సాధించలేని వ్యక్తికూడా 30 మంది మద్దతుతో విజేతగా నిలుస్తున్నాడు. ఈ ముప్పై మందిపై  కూడా డబ్బు, మద్యం, రిగ్గింగ్  ప్రభావాలు ఎంతవరకు ఉంటాయో అభ్యర్థులకు బాగా ఎరుక. 

ఇక తెలంగాణా విషయానికి వస్తే... 

3.63 కోట్ల జనాభా ఉన్న మన తెలంగాణాలో ఓటర్లు 2.82 కోట్ల మంది ఉన్నారంట. 2014 సాధారణ ఎన్నికలలో 73శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అంటే దాదాపు 2 కోట్ల 6 లక్షల మంది ఓటు చేస్తే, అందులో మళ్ళీ తెరాస పార్టీకి  64.7 శాతం ఓట్లే పడ్డాయి. అంటే  మొత్తం 3కోట్ల 63 లక్షల మందిలో 1 కోటి 33 లక్షల మంది మాత్రమే తెరాస కావాలనుకున్నారు.
ఓటర్లు 2.82 కోట్ల మందేగా 3.63 లక్షల మందిని ఎలా లెక్కలోకి తీసుకుంటారు అని మీకు సందేహం రావచ్చు. నిజమే!... కానీ మిగిలిన వారిలో ఓటు హక్కు ఉన్నా ఓటరు జాబితాలో పేరులేని వాళ్ళు ఉండొచ్చుగా. అదేం కాదు మిగిలిన వాళ్ళంతా మైనరు బాలలే అనుకున్నా వారి అభిప్రాయాలను కూడా పరిగణన లోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే...  తెలంగాణా కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారు వెయ్యిమంది అని, ఇంకా ఎక్కువ మంది అనిచెప్పి, మనం తెలంగాణా తెచ్చుకున్నాం. ఆత్మహత్య చేసుకున్నవారిలో  మైనర్లు కూడా  ఉన్నారు. వారి ఆకాంక్షలను పరిగణించి తెలంగాణా ఇచ్చినప్పుడు, గెలుపు నిర్ణయంలో కూడా వారి ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని నా వాదన. అందుకే జనాభా మొత్తాన్ని పరిగణన లోకి తీసుకోవడం జరిగింది . ఈ రకంగా చూస్తే తెలంగాణ లోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబమే గులాబీ రంగుది.

ఇంతకూ విషయం ఏంటంటే... 

మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గురించే  ఇదంతా చెప్పుకోవలిసి వచ్చింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న (రాజీనామా చేసేశారంట లెండి... కాకపోతే ఆమోదించబడలేదు) సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్నటి 2014 ఎన్నికల ప్రకారం 2,20,969 మంది ఓటర్లు ఉంటే 56.45% ఓట్లు పోలయ్యాయి. అంటే 1,24,737 మంది ఓటేశారు. వాటిల్లో తలసానికి 56,475 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 25.55 శాతం ఓట్లతో ఆయన గెలిచారు. దీనర్థం నియోజకవర్గంలోని ప్రతి నలుగురిలో ఒక్కరే ఆయన ప్రాతినిథ్యం కావాలనుకున్నారు. వీళ్ళల్లో తెలుగుదేశం పార్టీని చూసి ఎంత మంది ఓటేశారు, తలసానిని చూసి ఎంతమంది ఓటేశారు అన్నది పక్కన పెడితే... ఏ పార్టీ తరపున పోటీ చేసినా నెగ్గుకు రాగలనన్నది మంత్రిగారి ధీమా.  పార్టీని అడ్డం పెట్టుకుని గెలిచేవారు కాదు, పార్టీని గెలిపించే బలమైన అభ్యర్థులే కావాలని కెసిఆర్ కూడా అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా అలాంటి బలమైన అభ్యర్థిగా పరిగణించారు కాబట్టే పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. ఒకవేళ మళ్ళీ పోటీ అంటూ వస్తే తలసానికి ఉన్న వ్యక్తిగత బలం 56,475 ఓట్లు, అదే ఎన్నికలలో తెరాస పార్టీకి వచ్చిన 29,014 ఓట్లు కలిపి ఈసారి 90 వేల ఓట్లు గెలుచుకుంటామని ఇటు తలసాని, అటు కెసిఆర్ భావిస్తున్నారేమో అనిపిస్తోంది. మంచిదేగా 2,20,969  ఓట్లలో 90 వేల ఓట్లతో గెలవడం ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయడమే!
అయితే ఆలస్యం దేనికో అర్థం కాదు. రాజీనామా ఇచ్చానని తలసాని అంటారు. మరి ఇస్తే స్పీకర్ కు దాన్ని ఆమోదం చేయడంలో అభ్యంతరం ఏమిటి? కెసిఆర్ చెప్పందే ఆ పని చేయడం స్పీకర్ కు కష్టం అనుకుంటే కెసిఆరే ఆమోదించమని చెప్పొచ్చుకదా! అసలు నా సత్తా చూపించుకున్నాకే మంత్రి పదవి తీసుకుంటా అని తలసానే పదవికి రాజీనామా చెయ్యొచ్చుగా.  వీటిల్లో ఏదీ జరగదు. ఎందుకంటే అటు కెసిఆర్ కు గానీ, ఇటు తలసానికి గానీ తమ మీద తమకు నమ్మకం లేదు. అసలు తెరాసకు గ్రేటర్ లో తన భవిష్యత్తు ఏమిటో స్పష్టత లేదు. ఉంటే గ్రేటర్ ఎన్నికలే జరిగేవి. 
అయితే ఈ లోపు తలసాని మాత్రం కెసిఆర్ కరుణ, మెప్పు పొందడానికి చాలా చేస్తున్నారు. సినిమావాళ్ళతో మీటింగు పెట్టి, 'కెసిఆర్ తో మంచిగా ఉండకపోతే మీకు కష్టాలు తప్పవు' అని హెచ్చరించడం దగ్గర నుంచి 'చంద్రబాబును మెడ పట్టి జైల్లోకి తోస్తాం' అనడం వరకు తనకు ఓటేసిన ప్రజలు ఆశ్చర్యపోయేలా మాట్లాడారు. 
అలాగే నగరంలో బాగా పట్టున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సైతం తెరాసలో చేర్పించేందుకు స్వయంగా రాయభారం నడుపుతున్నారు. 
వాళ్ళంతట వాళ్ళు పార్టీలు మారడం, పదవులు ఎక్కేయ్యడం, ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా మాట్లాడటం... అంతా వాళ్ళిష్టమేనా అని తలసాని నియోజకవర్గంలో ఓటర్లు అనుకోవచ్చు. ఒకసారి ఒటేశాక మీకు మాట్లాడే హక్కెక్కడుంది. అసలు మీరు ఆయనకు ఓటేసిన ఒక్కరా? ఒటేయని ముగ్గురిలో ఒక్కరా? మీకో విషయం తెలుసా! ఇప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ తలసానే గెలిచినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రజలు పదేళ్ళకోసారి మాత్రమే మారతారు.         
             
       
    
                  
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి