

వెలుగు దారాలు వాకిట జారకముందే... మగ్గం మీద వీరు
చద్దిబువ్వ కడుపున పడక పోయినా... నడిచే యంత్రాలు వీరు
తరాల నుండీ అదే నేత... గంటల కొద్దీ ఒకే చోట
తరాలు మారినా అదే వెత... కష్టం తప్ప, లేదు వేరే ముచ్చట
కుదించుకు పోతున్నా ఒంటి నరాలు... సాగుతూ అల్లుకుపోతాయి నూలు దారాలు
కుదేలవుతున్నా కుటుంబాలు... బలంగా అద్దుకుంటాయి మెరిసే రంగులు
కష్టాల అష్ట దిగ్బంధనంలో, తనకు తానే బందీ అయిన కండె తాను
నెరవేరని తన స్వప్నాలను, కళాత్మకంగా వస్త్రంపై తీర్చిదిద్దే గడసరి కవి తాను
రాజులను మెప్పించారు.. ప్రధానులను మెప్పించారు
అయినా అదృష్ట దేవత మెప్పు పొందలేకపోయారు
వయసంతా మగ్గిపోతోంది మగ్గం పైనే
మనసంతా మసకబారుతోంది తీరని బాధ్యతలతోనే
నేతన్నా అని పిలవడం కాదు, తమ్ముళ్ళమై అన్నను ఆదుకుందాం
వారంలో ఒకరోజు చేనేతను మనసారా హత్తుకుందాం
నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.