పేజీలు

7, ఆగస్టు 2018, మంగళవారం

చేనేతను మనసారా హత్తుకుందాంభారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన స్వదేశీ ఉద్యమం 1905, ఆగష్టు 7న ప్రారంభమైంది. విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి భారతీయులంతా స్వదేశీ వస్త్రాలను తమకు తామే తయారుచేసుకోవడం ప్రారంభించారు. ఆ రకంగా దేశ స్వాతంత్య్ర సమరానికి ఊపిరి... దేశ సంస్కృతికి ప్రతీకగా నూలు వడికే రాట్నం నిలిచింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగష్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 
తెలుగు రాష్ట్రాలలో చేనేత వస్త్రాల విషయానికి వస్తే... తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని పోచంపల్లి,  మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట్,  గద్వాల్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని  ధర్మవరం,  తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ,  నెల్లూరు జిల్లాలో ఉన్న వెంకటగిరి ప్రాంతాలలో నేసిన చీరెలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందుతున్నాయి.  ధర్మవరం పెళ్లి పట్టు చీరలు, పోచంపల్లి ఇకత్ ఫ్యాబ్రిక్,  వెంకటగిరి కాటన్ శారీస్,  రాజమాత చీరలు.. వేటికవే ప్రత్యేకం. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాధీ కళావైభవాన్ని ప్రశంసిస్తూ యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ ఓ వ్యాసం కూడా రాశారంటే తెలుగు వారి చేనేత వైభవం, నైపుణ్యం, ప్రాభవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  పొందూరు ధోవతితో పాటు   పుత్తూరు లుంగీ కూడా అంతే ప్రసిద్ధి.  

చాలా దేశాల్లో సుమారు 200 సంవత్సరాల క్రితమే చేనేత పరిశ్రమ అంతరించిపోయింది. అలాంటిది మన దేశంలో ఇంకా ఆ హస్తకళను సజీవంగా ఉంచుకున్నాం. ఎందుకంటే ఒక్క పద్మశాలీలే కాకుండా రెండు తెలుగురాష్ట్రాల్లో 18 ఉపకులాల వారు చేనేత వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు.  చీరాల, మంగళగిరి, పెడన, మచిలీపట్నం, వెంకటగిరి, మాధవరం, గద్వాల, సిద్దిపేట, సిరిసిల్ల.   పోచంపల్లి, నారాయణపేట మొదలైన ప్రాంతాలలో చేనేత పరిశ్రమ రాజకీయాలకు అర్థంకాని, ప్రభుత్వాలకు పట్టని ఒక జీవన వేదం.  పవర్ లూమ్స్, షటిల్ మగ్గాలు, స్పిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ మిల్లులు, ఎయిర్ జెట్ వంటి మగ్గాల రాకతో చేనేత బతుకు సమరం చేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన నేతన్నకో నూలుపోగు చందాన రాశానీ ఈ చిన్న కవిత. 

వెలుగు దారాలు వాకిట జారకముందే...  మగ్గం మీద వీరు 
చద్దిబువ్వ కడుపున పడక పోయినా... నడిచే యంత్రాలు వీరు

తరాల నుండీ అదే నేత...  గంటల కొద్దీ ఒకే చోట 
తరాలు మారినా అదే వెత... కష్టం తప్ప, లేదు వేరే ముచ్చట 

కుదించుకు పోతున్నా ఒంటి నరాలు... సాగుతూ అల్లుకుపోతాయి నూలు దారాలు
కుదేలవుతున్నా కుటుంబాలు...  బలంగా అద్దుకుంటాయి మెరిసే రంగులు 

కష్టాల అష్ట దిగ్బంధనంలో, తనకు తానే బందీ అయిన కండె తాను 
నెరవేరని తన స్వప్నాలను, కళాత్మకంగా వస్త్రంపై తీర్చిదిద్దే గడసరి కవి తాను 

రాజులను మెప్పించారు.. ప్రధానులను మెప్పించారు 
అయినా అదృష్ట దేవత మెప్పు పొందలేకపోయారు

వయసంతా మగ్గిపోతోంది మగ్గం పైనే 
మనసంతా మసకబారుతోంది తీరని బాధ్యతలతోనే 

నేతన్నా అని పిలవడం కాదు, తమ్ముళ్ళమై అన్నను ఆదుకుందాం 
వారంలో ఒకరోజు చేనేతను మనసారా హత్తుకుందాంనేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.  


         

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి