పేజీలు

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నా సిమ్లా పర్యటన

('టింబర్ ట్రయల్ ' తర్వాత...)

టింబర్ ట్రయల్ నుంచి మద్యాహ్నం 12 గంటల సమయంలో సిమ్లాకు బయలుదేరాం.

హర్యానాలోని అంబాలా నగరం నుంచి ఇండో - టిబెటన్ సరిహద్దులో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని ఖాబ్ అనే గ్రామం వరకు కల్క, సిమ్లాల మీదుగా వెళ్తుంది 459 కి.మీ.ల పొడవున ఉన్న 22 వ నంబర్ జాతీయ రహదారి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లా, డిల్లీ నుంచి 365కి.మీ.లు. చండీఘర్ నుంచి 115 కి.మీ.ల దూరంలో ఉంది.

దారిలోనే కసౌల్ అనే మరో హిల్ స్టేషన్ ఉంది. కాకపోతే మనం వెళ్ళే దారి నుండి ఎడమ వైపుకు 35కి.మీ.లు లోపలికి వెళ్లి అక్కడ కసౌల్ లోయలను చూసి , మళ్ళీ అదే దారిలో వెనక్కు రావాలి. వెళ్దామని అనుకున్నాం. కాని అప్పటికే మా అమ్మకు మోషన్ సిక్నెస్ (ట్రావెల్ సిక్నెస్ లేదా కినేటోసిస్) వల్ల వాంతులవుతుండటంతో పాటు, మా కారు డ్రైవర్ కూడా 'అక్కడ చూసేందుకు ఏమీ లేవు సర్, అలాంటి లోయలు దారి వెంబడి చాలా కనిపిస్తాయి.' అంటూ మమ్మల్ని వెనక్కులాగాడంతో కసౌల్ ను చూడకుండా నేరుగా సిమ్లాకే వెళ్లసాగాం. నిజానికి ఒకటి రెండు రోజులు విడిది చేసేందుకు కసౌల్ చాలా బాగుంటుంది.

అలాగే దారిలో సోలన్ జిల్లా లోని సోలన్ నగరం మీదుగా వెళ్ళేటప్పుడు అత్యంత మనోహరమైన లోయలు కనిపిస్తాయి. రోడ్డు ప్రయాణమైనా, రైలు ప్రయాణమైనా ఈ లోయల సోయగాలను చూస్తూ వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి మరో 70 కి.మీ.లు ఉంటుంది సిమ్లా. టింబర్ ట్రయల్ దాటిన తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ వాతావరణం చల్లబడుతూ ఆహ్లాదంగా మారింది. మూడున్నర గంటలకు సిమ్లా చేరుకొని మా డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్లో దిగేటప్పటికి చలి ప్రారంభమైంది.

మేమిలా హోటళ్ళలో కాకుండా గెస్ట్ హౌస్లో దిగడం మా డ్రైవరుకు నచ్చలేదు. ఎందుకంటే సాధారణంగా ఇలా వచ్చే టూరిస్టులను హోటల్కు తీసుకువెడితే వాళ్లకు కమీషన్ దక్కడంతో పాటు వారు ఉండేందుకు ఒక రూమును ఇస్తారు. అందులోనే రెస్టారెంట్ ఉంటె భోజనం కూడా ఫ్రీగా పెడతారు. కాని మేము ప్రయాణం ఆసాంతం మా సొంత ఏర్పాట్లు చేసుకోవడం వల్ల అతనికి కూడా సొంత ఖర్చులు చేయక తప్పలేదు. దీని ఎఫెక్ట్ మా జర్నీ మొత్తం మీదా ప్రభావం చూపింది. అందుకే వీలైనంత వరకు రైలు లేదా బస్సు వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ద్వారానే వెళ్ళడం మంచిది. లేదా ఎక్కడికక్కడ ప్యాకేజీలుగా మాట్లాడుకున్నా పరవాలేదు. ఇలా కాకుండా సొంత వాహనాలను అరేంజ్ చేసుకుంటే మోసాలకే ఎక్కువ ఆస్కారం. మనకు ప్రతీ చిన్న ప్రదేశాన్నీ ఆగి చూడాలనిపిస్తుంది. కాని డ్రైవర్లకు అంత ఓపిక ఉండదు. పైగా వాళ్ళు ప్రతి రోజూ చూసే ప్రదేశాలు కాబట్టి మనకున్నంత ఉత్సుకత వాళ్లకు ఉండదు. ఏది ఏమైనా మమ్మల్ని గెస్ట్ హౌస్ దగ్గర దింపిన తర్వాత మా తివారి , అదే మా డ్రైవర్ కనబడకుండా పోయాడు. కనీసం ఫోను కూడా లిఫ్ట్ చేయలేదు.

రూముకు వెళ్ళగానే మా అమ్మను డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళాలనుకున్నాం. అయితే ఇక్కడ హైదరాబాద్లోలా సిమ్లాలో వీధికో క్లినిక్ లేదు. హాస్పిటల్కు వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అంత దూరం ఆమె రాలేననడంతో మేమే వెళ్లి టాబ్లెట్లు కొనుక్కొచ్చి ఇచ్చాం. స్నానాలవీ చేసి సాయంత్రం నేను , మా ఆవిడ, మా పెద్దాడు అలా నడచుకుంటూ బయటకు వెళ్ళాం.

(మిగతా 'కుఫ్రీ' లేబుల్తో... )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి