పేజీలు

27, ఫిబ్రవరి 2013, బుధవారం

సత్కారమా? అవమానమా?... ఆలోచించుకోడానికి 'ఆస్కార'మిది!

'లైఫ్ అఫ్ పై' చిత్రం నాలుగు ఆస్కార్ అవార్డులు కొట్టేసిందనేసరికి భారత మీడియా తెగ సంబరపడిపోయింది. ఆ నాలుగు అవార్డులూ దక్కించుకున్న వాళ్ళల్లో మన భారతీయులెవరూ లేరు. మరెందుకింత ఉత్సాహం అంటే ఆ సినిమాకీ భారత దేశానికీ చాలా సంబంధం ఉందంట. కథ - పాండిచేరికి చెందిన ఒక భారతీయ కుటుంబానికి  సంబంధించినది.  నటీనటులు- ముఖ్యపాత్రధారి సూరజ్ శర్మ దగ్గరనుంచి టబు, ఆదిల్ హుస్సేన్, ఇర్ఫాన్ ఖాన్ ... ఇలా అందరూ మనవాళ్ళే . ఇక అందరినీ మురిపించి, మైమరపింప చేసిన 'రిచర్డ్ పార్కర్' అనే పులిరాజు మన బెంగాలీ బాబే. ఆ బెంగాలీ పులికి డిజిటల్ రూపాన్నిచ్చి, ప్రాణం పోసిన వాళ్ళల్లో మన తెలుగు కుర్రాళ్ళు ఉన్నారంట. అవును! హైదరాబాదులోని రిథమ్ & హూస్ స్టూడియోస్ ఈ చిత్రానికి అద్భుతమైన యానిమేషన్ ను అందించింది. ఆ ఘనత అంతా ఆ సంస్థలో పనిచేస్తున్న తెలుగు వాళ్ళ సృజాత్మకతకే దక్కుతుంది.
ఈ విషయాలను కాసేపు పక్కన పెడదాం. మన దేశానికి చెందిన మహాత్ముని గురించి సినిమా తీస్తే, దానికి 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. మన ముంబై మురికివాడల నేపథ్యంలో తీసిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడీ పై.  అంటే మన సంస్కృతి, మన చరిత్ర, మన జీవన విధానం అంతగా ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి అన్నమాట.   

పై హిందువుగా పుట్టినా కైస్తవ, మహమ్మదీయ మతాల సారాన్ని వంటపట్టించుకున్నవాడు. భారత దేశంలో ఉన్న లౌకిక సమాజానికి ఇది అద్దం పట్టింది. అలాగే తండ్రి బోధించిన తార్కిక తత్వం కూడా పై ని ఆలోచింప చేస్తుంది.   అందువల్లే సర్వస్వాన్ని పోగొట్టుకుని, బ్రతకడానికి క్షణక్షణం పోరాడవలసిన క్లిష్ట పరిస్థితులను కూడా తట్టుకుని, 227 రోజులు నడిసముద్రంలో, జీవనపోరాటం చేయగలిగాడు పై. అది కూడా పదహారేళ్ళ పిన్న వయసులో.  మన దేశంలో సామాన్యులే ధీరోదాత్త హీరోలు. అదే విదేశీయులను అంతగా ఆకట్టుకుంటుంది. అమీర్ ఖాన్ నిర్మించిన లగాన్ కూడా ఆస్కార్ బరిలో నిలబడి హోరాహోరీ పోరాడ గలగడానికి కారణం కూడా అదే. 

మన జానపద కథలకు గాని, మహాభారత, రామాయణ ఇతిహాసాలకు గాని, భారత దేశ చరిత్రకు గాని మరే ఇతర దేశాలు కనీసం పోల్చుకోలేనంత ఘనత ఉంది. అయినా ఈ దేశం విదేశీయులను ఆకర్షించినంతగా, స్వదేశీయులను ఎందుకు ఆకర్షించదనే నా ప్రశ్న. ఎంతసేపూ ఒక భాషలో ఆదరణ పొందిన కాపీ కథలనే, ఇంకో భాషలోకి  తర్జుమా చేసుకోవడం,  ఒక సినిమాలో పేరు తెచ్చుకున్న వాళ్ళ ఇంటి చుట్టూనే బారులు తీరడం, ఇన్ని కోట్లు ఖర్చు చేసాం అంటూ బాకాలు ఊదడం, ఆడియో కార్యక్రమాలు, జైత్రయాత్రలు, గత వైభవాన్ని తవ్వుకునే సంభాషణలు, తప్పనిసరి పాటలు, పోరాట సన్నివేశాలు, ఏ మాత్రం ఆసక్తి పుట్టించని కథా కథనాలు... ఇదేనా మన సినిమా?

మన భారతీయ ప్రతిభను ప్రపంచమంతా 'వాడుకుంటుంటే' మనమేం చేస్తున్నట్టు? ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకుంటూ 'సూరజ్! ఎక్కడున్నావ్?' అంటూ అంగ్ లీ, పై పాత్రధారి సూరజ్ శర్మను గుర్తుచేసుకున్నాడంటే, అతని మనసులో 'ఈ విజయానికి కారణం నువ్వే' అన్న భావన ఉందన్నమాట. అలాంటప్పుడు అతను ఉత్తమ నటుడి విభాగంలో ఎందుకు నామినేట్ కాబడలేదో అంతుబట్టని విషయం. 

అయినా ఆస్కార్ అవార్డుల కోసం మనం అర్రులు చాచే కంటే, ఆ అవార్డులే మనల్ని వెదుక్కుంటూ వచ్చేలా మనం చిత్రాలను తీయలేమా? మరి ఒక్కో సినిమాకి ఇన్నేసి కోట్లు ఖర్చు పెట్టి ఎవర్ని ఉద్ధరిస్తున్నట్టు. హీరో గారి ఇమేజికి, హీరోయిన్ గారి గ్లామర్ కీ అన్ని కోట్లు సమర్పించి, పనికిమాలిన కథను తీసుకొచ్చి జనం నెత్తిన రుద్దడమే విజయం అనుకుందామా? అదే మన అభిరుచి అని  చంకలు గుద్దుకుందామా? కాస్త ఆలోచిద్దాం! ఇంతకూ మీరు 'లైఫ్ అఫ్ పై' సినిమాని చూశారా? తప్పక చూడండి! మీ పిల్లలకు కూడా తప్పక చూపించండి.  అవార్డులోచ్చాయని కాదు,  బతుకువిలువ తెలుసుకోడానికి.                                  

1 కామెంట్‌:

  1. >> "అలాంటప్పుడు అతను ఉత్తమ నటుడి విభాగంలో ఎందుకు నామినేట్ కాబడలేదో అంతుబట్టని విషయం"

    అతనికన్నా ఉత్తమంగా నటించినవాళ్లు వేరే సినిమాల్లో ఉన్నారు కాబట్టి.

    పై పటేల్‌గా సూరజ్ అవసరమ్మేరా నటించి మెప్పించాడు కానీ లింకన్‌గా డానియెల్ డే లూయిస్, సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్‌లో బ్రాడ్‌లీ కూపర్ ఇంకా బాగా చేశారు మరి.

    రిప్లయితొలగించండి