పేజీలు

8, జనవరి 2015, గురువారం

నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు!


'నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు' - ఓ ఒంటరి ఆవేదన. 
'నా భార్య నన్నర్థం చేసుకోవట్లేదు' - ఓ భర్త విసుగు. 
'నా మాట లెక్క చేయడే ?' -  కొడుకు గురించి ఓ తండ్రి ఫిర్యాదు. 
'నన్ను నా తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు' - టీనేజి కుర్రాడి అలక. 
'నా ప్రేమను తను అర్థం చేసుకోవట్లేదు' - ఏకపక్ష ప్రేమికుడి తపన. 
'నేనెంత కష్టపడి పనిచేసినా మా బాస్ నన్ను గుర్తించట్లేదు.' - ఎదుగు బొదుగూ లేని ఓ ఉద్యోగి మూగవేదన. 

మనం అర్థం చేసుకుంటే...
వాఖ్యలు, సందర్భాలూ వేరే అయినా, వీరిలో ప్రతి ఒక్కరి బాధ ఒక్కటే. -  వారు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. దానికి కారణం తను కాకుండా ఎదుటి వ్యక్తుల్లో ఎవరో ఒకరని వాళ్ళ బాధ. 
 
నిజమే! మనం సామాజిక జీవులం. మనం ఏం చెయ్యాలన్నా మన చుట్టూ ఉన్న వారి ప్రమేయం ఉండాలి. ఆమోదం ఉండాలి. సహకారం ఉండాలి. ఎంత ధీమాగా ఒంటరి పయనానికి తెగించినా కొన్ని అడుగుల తర్వాత మరి కొన్ని అడుగులు జత కలవాల్సిందే. అందుకే ఇతరులు మనల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 

మరి అలా జరగనప్పుడు ఏం చెయ్యాలి? 

ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. 
అసలు మనల్ని అర్థం చేసుకోవలసిన అవసరం అవతలి వాళ్ళకేముంది?
నిజమే! మనం మన వైపు నుండి ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి ఆలోచించడం సహజం కదా! మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేయాలంటే, మీ అవసరం వాళ్లకు ఉందా అని ఆలోచించండి. వాళ్లకు కావలసిన అర్హతలు మీ దగ్గర ఏమున్నాయో చెక్ చేసుకోండి. ఎందుకంటే అవసరం లేనిదే ఎవరూ ఏ పనీ చేయరు! ఎంత సొంత వారైనా మిమ్మల్ని అర్థం చేసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. 
 
సరే! వాళ్ళకు మన అవసరం లేదని తేలిపోయింది. 
మరిప్పుడు ఎలా? నా కర్మ ఇంతే  అనుకుందామా?  కానేకాదు. ఇప్పుడిలా ప్రశ్నించుకోండి. 
మనకు వాళ్ళ అవసరం నిజంగా ఉందా?
ఇదికూడా నిజమే. ఒక్కోసారి మనం అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అవతలి వారికి  వారి అర్హతలకు మించిన స్థానాన్ని ఇచ్చి బాధపడిపోతుంటాం. ఉదాహరణకు ఒక సంస్థలో నీకు గుర్తింపు లేకపోతే మరో సంస్థను వెదుక్కోవచ్చు. ఒకరు నిన్ను తిరస్కరిస్తే మరొకరు నిన్ను ఆదరించవచ్చు. అయితే అన్ని సందర్భాలలోనూ అందరినీ ఒదులుకోలేము కదా! కూతురినో, భర్తనో  అలా వదిలేసుకుంటామా. ఒక్కోసారి ప్రేమించిన వాళ్ళను కూడా ఒదులుకోలేకపోవచ్చు. అప్పుడేం చేద్దాం ?   

ఇంకేం చేస్తాం, మన ఫిర్యాదును వెనక్కి తీసుకుందాం. వెనక్కి అంటే వ్యాకరణం మార్చి చదువుదాం. 
నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు 
దీన్నే మరోలా చదువుదాం 
నేను ఎవరికీ అర్థం కావట్లేదు 
ఎలా ఉంది? మొదటి దాంట్లో నిన్ను అర్థం చేసుకోలేక పోవడం ఎదుటివారి తప్పు అన్నట్టుగా ఉంది. రెండో దాంట్లో తప్పు నీలోనే ఉంది. అవును. మనకు సంబంధించిన ప్రతి సమస్యకూ చాలావరకు మన దగ్గరే పరిష్కారాలు ఉంటాయి. ఇదీ అంతే. నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అంటే దానర్థం నువ్వు ఎవరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నావని. 

ఇప్పుడు రెండే దారులు. 
ఒకటి నువ్వు మారాలి. అంటే ... నీ వైపు నుంచి కాకుండా అవతలి వైపు నుంచి ఆలోచించాలి. నీలో లోపాలున్నాయి అనిపిస్తే సరిదిద్దుకోవాలి. 
ఇక రెండోది. నిన్ను నువ్వు సరిగా చూపించుకోవాలి.  నువ్వేంటన్నది కొత్తగా నిరూపించుకోవాలి. నీ అభిప్రాయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయాలి. సరిగా అంటే ఎలా అనేది సందర్భాన్ని బట్టి నువ్వే ఆలోచించుకోవాలి. వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఈ నైపుణ్యాలు ఉంటేనే మనం లోకానికి కనబడతాం. సమాజం మనల్ని గుర్తిస్తుంది.                     .                   

             
       
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి