పేజీలు

1, మార్చి 2015, ఆదివారం

వాట్సప్ పంచ్

1

వృద్ధాశ్రమం నుంచి కొడుక్కి ఫోనొచ్చింది. ఆశ్రమంలో ఉన్న అమ్మకు చివరి ఘడియలు దగ్గర పడ్డాయని, ఆఖరి సారిగా కొడుకును కలవాలని కోరుతుందని ఆ పిలుపు సారాంశం. ఆఖరి చూపులు అని కచ్చితంగా చెపుతున్నారు కాబట్టి, ఎలాగోలా తీరిక చేసుకుని తల్లి దగ్గరకు వెళ్ళాడు కొడుకు.
తల్లి నిజంగానే ఆఖరిక్షణాల్లో ఉంది. ఎంతైనా తల్లి కదా, మనసు కరిగిందేమో ! 'అమ్మా, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉందా? అని అడిగాడు.
'అవును నాయనా! నిన్ను పిలిచింది కూడా అందుకే. ఈ ఆశ్రమంలో ఇన్నాళ్ళూ గాలాడక ఉక్కబోతతో, వేడిని భరించలేక పోయేవాళ్ళం. కొన్ని ఫ్యాన్లు తెప్పించి పెట్టు నాయనా?' అంది తల్లి.
'అంతేనా అమ్మా' అడిగాడు కొడుకు.
'ఒక ఫ్రిడ్జ్ కూడా తెప్పించు నాయనా. పొద్దున్న ఎప్పుడో వండిన కూరలు నిలువ చేసుకోడానికి ఫ్రిడ్జ్ లేకపోవడంతో రాత్రికి పాడై పోయేవి. ఆ కూరలతో తినలేక వారంలో రెండు మూడు రాత్రులు పస్తులతో పడుకునేదాన్ని.'
'ఫ్యాన్లు, ఫ్రిడ్జ్... చాలా అమ్మా?'
'మంచి బెడ్డు, టీవీ, గీజర్,
 ఇంకా... '
'ఆగాగు. నిన్ను చూస్తే చివరి ఘడియల్లో ఉన్నావు. కానీ నీ కోరికలు చూస్తే కొత్త కాపురానికి కావలిసిన జాబితా చదువుతున్నావు. అయినా ఇన్నాళ్ళూ నీకిన్ని కష్టాలు ఉన్నాయని ఎప్పుడూ చెప్పలేదు. అలాంటిది ఇప్పుడెందుకు చెపుతున్నావు?' అర్థంకాక అడిగాడు కొడుకు.
'చూడునాయనా!  నేను చిన్నప్పటినుంచీ కష్టాలకు అలవాటుపడినదాన్ని కాబట్టి ఇవన్నీ నాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ రేపో మాపో నీ కొడుకులు నిన్నిక్కడి పంపిస్తే, నువ్వు వీటన్నిటినీ భరించలేవు. అంత సుకుమారంగా పెంచాము నిన్ను. అందుకే తల్లిగా ముందే జాగ్రత్తపడమని చెప్తున్నా'  అని కనుమూసింది తల్లి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి