సినిమా చూడాలంటే మల్టిప్లెక్స్... నెలవారీ సరకులు కొనాలంటే షాపింగ్ మాల్... భోజనం మాల్ లోనే... పిల్లల ఆటలు మాల్ లోనే. ఇదీ ఇప్పటి మధ్య తరగతి మానసిక స్థితి. సెలవు రోజొస్తే చాలు అలా ఒక మాల్ కు ఉదయాన్నే వెళ్ళి ఒక సినిమా చూసేసి, తర్వాత అక్కడే ఉన్న ఫుడ్ కోర్టులో తినేసి, పక్కనే ఉన్న ప్లే ఏరియాలో పిల్లల్ని కాసేపు ఆడించేసి, ఇంటికి వచ్చేస్తూ అదే మాల్ లో షాపింగ్ చేసేసి రావడం ఇప్పుడు సాధారణం అయిపొయింది. ఇవన్నీ వరుసపెట్టి చేయడం ఒక హోదా. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలకు అదొక హక్కయిపోయింది. "వారం అంతా కష్టపడుతున్నాం. ఆదివారం కాస్త రిలాక్స్ అవడంలో తప్పేంటి?" అని వాదిస్తారు. ఖర్చు కదా అంటే... "కష్టపడి సంపాదించేది దేనికి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం?" అంటారు. సరిగ్గా ఈ మనస్తత్వమే కార్పొరేట్ దోపిడీకి ఆస్కారమిస్తోంది.
దోపిడీ అంటే సాధారణంగా కొట్టి, భయపెట్టి దోచుకుంటారు. కానీ ఇక్కడ ఎంట్రీ లోనే నమస్కారం పెట్టి, నవ్వుతూ దోపిడీ చేస్తారు. అదే ఈ మాల్స్ స్పెషాలిటీ. ఎంట్రీలో మీ వెంట తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ ని పక్కనే అట్టిపెట్టేసుకోవడంతో దోపిడీ మొదలవుతుంది. అంటే మీకు దాహం వేస్తే లోపల మంచినీళ్ళు కొనుక్కు తాగాలన్నమాట. రూ.20ల వాటర్ బాటిల్ లోపల రూ.50 ఉంటుంది. గ్లాసు పెప్సీ లేదా కోక్ ధర రూ. 200 పైనే. పాప్ కార్న్ రూ.250. రెండు సమోసాల ఖరీదు రూ.113లు. ఇది థియేటర్ లోని క్యాంటీన్ దోపిడీ. సినిమా ఇంటర్వెల్ లోని ఈ దోపిడీ కానిచ్చేసుకున్నాక ఫుడ్ కోర్టులోకి స్టైల్ గా వెళతాం కదా. అక్కడ ఏదీ తినాలన్నా ముందు ఒక వెయ్యో రెండు వేలో వేసి ప్రీ పెయిడ్ కార్డు తీసుకోవాలి. క్యాష్ తీసుకొని అమ్మొచ్చుకదా అంటే కుదరదంట.
ఫుడ్ కోర్టులో బ్రాండ్ పేరుతో ఆహార పదార్థాలన్నీ రెట్టింపు ధరకు కొనుక్కుని తింటాం. రుచి, శుచి, నాణ్యత... ఇలాంటివన్నీ మనమేం పట్టించుకోము. చుట్టూ మనలాంటి అమాయకులు చేసే సందడిని చూస్తూ నోట్లోకి తోసేసుకుంటాం. ఇలాంటి వంటకాలనే మనకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్ లో కనక వడ్డిస్తే... అబ్బో ఎన్ని పేర్లు పెడతామో! సరే... భోజనం అయిపొయింది. కార్డులో నలభయ్యో యాభయ్యో మిగిలాయనుకోండి. దాన్ని క్యాష్ చేసుకుందామంటే కుదరదు. పోనీ ఏదన్నా కొనుక్కుందామన్నా ఆ ధరలో ఏదీ రాదు. కౌంటర్ లో అడిగితే.. "ఆ డబ్బులు ఎక్కడికీ పోవుసార్, ఈసారి వచ్చినప్పుడు మీరు ప్రీ పెయిడ్ చేస్తారు కదా అందులో ఇవి కూడా కలుస్తాయి" అంటాడు. నిజమే కదా కంగారెందుకు అనుకుంటాం మనం. దీని వెనుకే పెద్ద మోసం ఉంది. మీరు మళ్ళీ ఓ నెల తర్వాతగానీ మాల్ కి వెళ్ళరు. వెళ్ళినా ఇదే మాల్ కి వెళ్తారన్న గ్యారెంటీ లేదు. వచ్చినా ఆరోజు మీరు ఈ కార్డు తీసుకురావడం మర్చిపోవచ్చు. అంటే మీ సొమ్ము నలభయ్యో యాభయ్యో ఫుడ్ కోర్టు నిర్వాహకుడి దగ్గర నెలలపాటు ఉండి పోతుంది. ఇలా రోజుకు కొన్ని వందల మంది, నెలకు కొన్ని వేలమంది సొమ్మంతా లక్షల్లో అతని దగ్గర ఉండిపోతుంది. వడ్డీ పైసా కూడా చెల్లించనవసరం లేకుండా ఎంత ధనాన్ని సేకరిస్తున్నాడో చూసారా?
ఆ తర్వాత ప్లే ఏరియాకు వెళ్తే అక్కడ రెట్టింపు దోపిడీ. మామూలుగానే అక్కడ కూడా ప్రీ పెయిడ్ కార్డు తీసుకుంటారు. ఐదొందలో వెయ్యో వేసి పిల్లలతో ఆటలు ఆడిస్తారు. ఫుడ్ కోర్టు మాదిరిగానే ఇక్కడ కూడా కార్డులో చివరికి ఇరవయ్యో ముప్పయ్యో మిగిలిపోతాయి. అయితే ఇక్కడ మరో దోపిడీ అదనం. ఏమంటే మీరు కార్డులో వంద రూపాయలు వేయించారనుకోండి అందులో 65 -69 రూపాయలకు మాత్రమే ఆడగలరు. మిగిలిన డబ్బు హుష్ కాకి. పోనీ కార్డు తీసుకున్నప్పుడు ప్రాసెస్ ఫీజు కింద మొదటిసారి అలా తీసుకుంటారేమో అంటే... కాదంట మీరు కార్డులో డబ్బులు వేయించిన ప్రతీసారీ దాదాపు 30 శాతం డబ్బులు ఎగిరిపోతాయి. చూశారా ఎంత దోపిడీనో!
ఇక సరుకులు కొన్నాక ప్లాస్టిక్ సంచుల విషయం మరో దోపిడీ. వాళ్ళ బ్రాండింగ్ తో సంచులు ముద్రించి. ఆ సంచుల్ని మోసుకెళ్ళే దారంతా మనతోనే ప్రచారం చేయిస్తారు. విచిత్రం ఏమంటే వాడి ప్రచారం కోసం మనమే ఐదో పదో ఎదురిచ్చి కౌంటర్ దగ్గర సంచులు కొనుక్కోవడం. వాడి తెలివి చూసారా?
అయితే ఈ దోపిడీని గుర్తించిన వాళ్ళు లేకపోలేదు. దోపిడీపై పోరాడిన వాళ్ళు లేకపోలేదు. పోరాటంలో గెలిచిన వాళ్ళు లేకపోలేదు.
![]() |
విజయ్ గోపాల్, సామాజిక కార్యకర్త |
అలాగే ప్లాస్టిక్ సంచులు, సినిమా క్యాంటీన్ అమ్మకాలు వంటి వాటి విషయంలో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడిక ఫుడ్ కోర్టులు, ప్లే ఏరియాలలో ప్రీ పెయిడ్ కార్డుల మోసాల పై కూడా పోరాడాల్సిన అవసరం ఉంది.
CM GARU THE FACTS YOU QUOTED WERE 100% CORRECT.
రిప్లయితొలగించండిBUT YOU HAVE MENTIONED THAT ESPECIALLY WORKING LADIES FEELS A RIGHT TO GO TO MALLS IN WEEKEND HOLIDAYS, THAT I DONT AGREE.
మన్నించండి సప్నగారు! నేను ఎవరినీ తప్పు పట్టడంలేదు. జరుగుతున్నది ఇది అని చెప్పానంతే.
తొలగించండిమోసమేరా జీవితం
రిప్లయితొలగించండిమోసమేరా శాశ్వతం
మోసమేరా ఉన్నది
మోసపోవుట మనవిధి!
బాగుంది మీ'మోసం'!
తొలగించండిwhat you have written is 100 % correct.
రిప్లయితొలగించండికృతజ్ఞతలు అజ్ఞాత గారు
తొలగించండిఅంత నవ్వుతూ ఏం ఉండరులెండి. తుమ్మల్లో పొద్దు గుంకినట్లు మొహం పెట్టుకునే వాళ్ళు, నిర్లక్ష్యంగా / అహంకారంగా మాట్లాడే వాళ్ళు, అంత డబ్బు గుంజుతూ కూడా మనకేదో ఫేవర్ చేస్తున్నట్లు వ్యవహరించే వాళ్ళు ...... ఈ రకపు స్టాఫ్ కూడా తగులుతూనే ఉంటారు. అందుకే అటువంటి చోట్లకు .... నేను వెళ్ళను. జనాలకు నా సలహా కూడా అదే .... ఈ రకపు దోపిడీ చేస్తున్న వ్యాపారులను మాల్స్ ను boycott చెయ్యండి, వాళ్ళంతట వాళ్ళు మారరు కాబట్టి ఈ నిజాయితీ లేని వ్యాపారాలను కొంతకాలం జనాలందరూ ప్రోత్సహించడం మానేస్తే వాళ్ళేమన్నా మారతారేమో? ఎందుకంటే వాళ్ళ ఆదాయానికి దెబ్బ కొట్టే పని చెయ్యకుండా మనం ఎన్ని వ్యాసాలు వ్రాసుకున్నా కంఠశోషే అవుతుంది. కానీ మాల్స్ కు మహారాజ పోషకులైన ఈ తరం ... ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగుల కుటుంబాలు ... మన మాట వినిపించుకోరు లెండి.
రిప్లయితొలగించండికారీ బాగ్ ల మాటకొస్తే మన సంచీని మన కూడా తీసుకెళ్ళడం ఉత్తమం. ఒక వేళ ఆ షాప్ వాళ్ళ బాగ్ కొనుక్కోవలసి వస్తే ఆ బాగ్ ని లోపల్నుంచి బయటకు తిరగేసి వాడితే ఆ షాపుకు మన ద్వారా మన డబ్బుతో పబ్లిసిటీ జరగడం కాస్తైనా తగ్గించామనే తృప్తి మిగులుతుందా అనిపిస్తోంది. నేనెప్పుడూ ప్రయత్నించ లేదు, వెళ్ళను కాబట్టి.
మీరన్న ప్రీ-పెయిడ్ కార్డ్ లు, ఇ-వాలెట్ లు, మనీ ల ధోరణి / దోపిడీ మరీ ఎక్కువైపోతోంది. ఉదాహరణకు : : కూరగాయలమ్ముకునే “బిగ్ బాస్కెట్” కూడా ఇదే పద్ధతి ఈమధ్య మొదలెట్టింది .... మన డబ్బు వాళ్ళ దగ్గర సోకాల్డ్ వాలెట్ లో పెట్టుంచాలట. ఏమిటీ తమాషా? ఇటువంటి వాటి మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెయ్యడానికి వీలవుతుందేమో కనుక్కోవాలి ..... మీరు చెప్పిన విజయ్ గోపాల్ గారిని సంప్రదిద్దాం, మీకు తెలిస్తే వారి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా? (కానీ పార్కింగ్ ఫీజుల వసూళ్ళ మీద ఆయన పోరాడి సాధించిన విజయం తాత్కాలికమై పోయిందా?? ఎందుకంటే చాలా చోట్ల ఆ దోపిడీ మళ్ళీ కొనసాగుతూనే ఉన్నట్లుంది).
మీరు మంచి అంశం మీద బ్లాగ్ పోస్ట్ వ్రాశారు. దీన్నే ఏదన్నా వార్తాపత్రికకు కూడా పంపించి చూడరాదా? వాళ్ళు గనక ప్రచురిస్తే మరింత మంది చదివే అవకాశాలు పెరుగుతాయి. దాని వల్ల జనాల్లో కాస్తైనా చైతన్యం వస్తుందేమో?
మీరు చెప్పింది అక్షరాలా నిజం, విన్నకోట నరసింహారావుగారు. విజయగోపాల్ గారి ఫోన్ నెంబరు దొరకలేదు గానీ వారి పోస్టల్ అడ్రెస్ ఉంది. Address: 12-13-1085/72, 3rd Floor, St # 11, Shirdi Sai Colony, Tarnaka, Secunderbad, 500017.
రిప్లయితొలగించండిథాంక్స్.
తొలగించండిపట్టపగలే నిలువు దోపిడీ ఇది. పార్కింగ్ విషయం లో నా అనుభవం మేరకు, మనం ఏదైనా వస్తువు కొన్నట్లుగా రశీదు చూపిస్తే, పార్కింగ్ ఫీ వసూలు చెయ్యటం లేదు కొన్ని మాల్స్ లో. వాటర్ బాటిల్ విషయం లో నేనొకసారి ఒక మాల్ లో గొడవ పెట్టుకుని, మేనేజర్ ని పిలిపించి, వేసవి లో నీళ్ళు పట్టుకెళ్ళనివ్వక పోవడం దారుణం అని వాదించాను. చాలా అసహ్యం వేసింది వాళ్ళ మీద. పిల్లలు, వృద్ధులూ అనే తేడా కూడా లేదు వాళ్ళకి. అఫ్‌కోర్స్, అది వాళ్ళ డ్యూటీ అని సరిపెట్టుకోలేకపోయాను. ఈ మధ్య సూపర్ మార్కెట్లకి కూడా పోకూడదని నిర్ణయించుకున్నాను. ప్రతీ కష్టమర్ ని దొంగ లా చూసే వాళ్ళ చూపంటే పరమ రోత. బ్యాగులు వెదకటం, వాటికి కేబుల్ టై లాంటిది వెయ్యడం...అస్సలు నచ్చలేదు నాకు.
రిప్లయితొలగించండినిజమే మాధవ్ గారు. మీలా ప్రశ్నించేవాళ్ళు ఇప్పుడిప్పుడే ఎక్కువవుతున్నారు. ఫలితం కూడా కొన్ని చోట్ల కనిపిస్తోంది. ఈ విషయాల్లో ప్రభుత్వాలు కాస్త చొరవ తీసుకోవాలి
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి