పేజీలు

11, మే 2019, శనివారం

అమ్మకు వందనం


తల్లిని గౌరవించడానికో, ఆమె ప్రాధాన్యం గుర్తించడానికో ఏడాదికో రోజు పెట్టుకోవడం ఏమిటి? మిగతా రోజుల్లో తల్లి.. తల్లి కాదా అంటూ కొంతమంది ఆగ్రహిస్తుంటారు. ఏ వ్రతం చేసినా, ఏ పని తలపెట్టినా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం, తలచుకుంటాం. అయినా ఏడాదికోసారి వినాయక చవితి జరుపుకోవడం దేనికి? అసలు నిత్యం దేవుడిని తలచుకునే మనం పండుగ రోజున ఫలానా దేవుడిని పూజించడం దేనికి? దేనికంటే... ఏ పనినైనా సామూహికంగా చేయడం వలన అదొక సంప్రదాయం అవుతుంది. ఒక సంస్కృతి అవుతుంది. అలాగే అంతర్జాతీయ మాతృ దినోత్సవం కూడా. 


నిత్యం మనకు అమ్మ అందించే ప్రేమను, సేవను మరొక్కసారి సామాజికంగా గుర్తుచేసుకుని, అమ్మ ప్రాధాన్యాన్ని సమాజానికి తెలియచేయడం కోసం ఈ మదర్స్ డే. దీనివల్ల అమ్మకు ఒరిగేది ఏమీలేదు. తాను ఎంతో ఇష్టంగా నెరవేర్చే బాధ్యతను... బరువుతో పోల్చి...  మోసినందుకు పతకాలిస్తామంటే అమ్మ నవ్వుతుంది. అందుకని మదర్స్ డే అమ్మ కోసం కాదు. అమ్మ స్థానాన్ని గౌరవించడం కోసం. 

చెప్పాలంటే అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని మరింత బాధ్యతాయుతంగా, మరింత ఉదృతంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యవ్వనభారంతో కన్నుమిన్ను కానరాక అనుకోకుండా తల్లయిపోయి వద్దనుకున్నా ఒడిలో కొచ్చిన బిడ్డని అమానుషంగా నడిరోడ్డున ఏ చెత్త కుప్పలోనో, ముళ్ళ పొదల్లోనో విసిరేసే యువతికి, తాను విసిరేసింది ఒక రక్తమాంసాల ముద్దను కాదని తెలియాలి. ప్రియుడితో కలిసి ఉండేందుకు అడ్డొస్తున్నారని పిల్లలని కడతేర్చే తల్లికి అమ్మతనం అంటే ఏమిటో తెలిసిరావాలి. ప్రియుడి కోసం భర్తను చంపి, జైలుపాలయ్యే మహిళకు పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచన రావాలి. పంతాలు, పట్టింపులతో కాపురాన్ని కాదనుకుని విడాకులకు పరుగెత్తే ముందు పిల్లల మనసులపై అవి చూపించే ప్రభావం ఏమిటో అర్థం కావాలి. ఇవన్నీ తెలిసిరావాలంటే పిల్లల కోసం అపూర్వ త్యాగాలు చేసిన అమ్మ కథలను సమాజం వినాలి. అందుకైనా మాతృ దినోత్సవం జరుపుకోవాలి. 

దేశమేదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా...  దేవుడు ఉన్నా లేకున్నా 'మాతృత్వం' ఉంది. జీవకోటికి ఇది ప్రకృతి ఇచ్చిన మహోత్తరమైన వరం. ఆ వరానికి ప్రతిరూపమే ప్రతి ఇంటా కొలువుదీరిన 'అమ్మ'. కన్ననాటి నుండి కనుమూసే వరకు తన బిడ్డల సంరక్షణ, పోషణ, శిక్షణ బాధ్యతలను 
ఇష్టంగా మోస్తూ, సమాజ వికాసానికి, మానవజాతి మనుగడకు ఆధారంగా నిలిచే శక్తి స్వరూపిణి 'అమ్మ'.
ఇండోనేషియాలో అమ్మకు పాదపూజ 
అమ్మకు పాదపూజ చేస్తే స్వర్గానికి వెళ్తామని ఇండోనేషియా ప్రజలు నమ్ముతారు. అలాంటి నమ్మకాలు మన సమాజంలోనూ ఏర్పడాలి. 


మదర్స్ డే రోజున చాలా ఛానెళ్లలో హీరోయిన్స్..  వాళ్ళ అమ్మల గురించి చెప్పే కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి. దాని బదులు కూలి పనికి బిడ్డను చంకన పెట్టుకు వెళ్ళి, అక్కడ ఏ చెట్టుకో చీరను ఊయలగా కట్టి అందులో బిడ్డను ఉంచి... పనిచేస్తూ పదేపదే ఆ ఊయల వంక చూసే తల్లి గురించి ఎందుకు చెప్పరు? ఎందరో బిడ్డల్ని తల్లుల నుంచి వేరుచేసి...  వారిని బిక్షాటన కోసం ఉపయోగిస్తున్న మాఫియా గురించి ఎందుకు చెప్పరు? అన్ని ప్రైవేటు సంస్థలూ మెటర్నిటీ లీవులు ఇస్తున్నాయా లేదా ఎందుకు చర్చించరు? నేటి పరుగుల ప్రపంచంలో తల్లికి బిడ్డల బాధ్యతతో పాటు చాలావరకు కుటుంబ పోషణ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవి మాతృత్వంపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి? అమ్మ సంతృప్తిగా ఉంటుందా? పురాణ పురుషుల గురించి చెప్పి తల్లి జిజియాబాయి బాల  శివాజీని వీరునిగా, ధర్మవర్తనుడిగా తీర్చి దిద్దింది. మరి టీవీలు, సెల్ ఫోను గేములు వచ్చిన ఈ తరంలో పిల్లలకు నేటి తల్లి ఏం నేర్పిస్తుంది? అసలు తల్లీ బిడ్డల అనుబంధంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇలాంటివన్నీ మదర్స్ డే రోజున అయినా చర్చకు రావాలి. తల్లిని పూజించడం తర్వాత... ముందు తల్లికి ఉన్న సమస్యలను కనుక్కోవాలి కదా. ఆమె మనోభావాలను అర్థం చేసుకోవాలి కదా! 
                          
ఏపీ బడుల్లో అమ్మకు వందనం 
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 'అమ్మకు వందనం' అనే కార్యక్రమాన్ని పెట్టి బడుల్లో పిల్లల చేత తల్లుల కాళ్ళు కడిగించి, పూజించే సంస్కృతిని అలవాటు చేస్తోంది. ఇది హర్షణీయం. 

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ వందనం.                                         

2 కామెంట్‌లు:

  1. తనువిచ్చి కన్నట్టి తల్లిని కాదని

    రాతి బొమ్మకు మ్రొక్కు ఖ్యాతి మనది

    చన్నిచ్చి కడుపార చాకిన తల్లికి

    వెన్నిచ్చి వదిలించు విద్య మనది

    తొలి యొజ్జయి యెరుక దెలిపిన తల్లిని

    మోస పుచ్చెడు గొప్ప బుధ్ధి మనది

    సంతానమే తన సర్వస్వ మను తల్లి

    తమకు భారమ్మను తలపు మనది



    బిడ్డలకు వాండ్ల పెండ్లాలు బిడ్డలకును

    ఊడిగము చేసి యోపిక లూడి కూడ

    బ్రతికినన్నాళ్ళు చాకిరీ బ్రతుకు బ్రతుకు

    తల్లి కాదరణ కరువు ధరణి మీద .

    రిప్లయితొలగించండి
  2. తనువిచ్చి కన్నట్టి తల్లిని కాదని
    రాతి బొమ్మకు మ్రొక్కు ఖ్యాతి మనది
    ....
    తొలి యొజ్జయి యెరుక దెలిపిన తల్లిని
    మోస పుచ్చెడు గొప్ప బుధ్ధి మనది
    ...
    రాజారావుగారు, అద్భుత కవితతో అపురూప భావనను అందించారు. కృతజ్ఞతలండి!

    రిప్లయితొలగించండి