పేజీలు

24, సెప్టెంబర్ 2015, గురువారం

శ్రీమంతుడు ఏమన్నాడు ?

'

శ్రీమంతుడు ఏమన్నాడు?

అనగానే మహేష్ బాబు గురించి ఏదో చెప్పబోతున్నానని  అని మీలో చాలా మంది అనుకుని ఉంటారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సినిమా అంతగా అందరికీ నచ్చేసింది. అదీగాక మహేష్ బాబు కూడా చూడ్డానికి రాకుమారుడిలా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక కుర్రకారు అయితే నిన్నటివరకూ మూలన పడేసిన సైకిళ్ళను బయటికి తీసి, రిపేర్లు చేయించుకుని మరీ రోడ్లపై తిరిగేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమంటే  సినిమాను ఒకటికి నాలుగు సార్లు చూసిన వాళ్ళు కూడా శ్రీమంతుడు ఏమన్నాడో ఆలోచించట్లేదు. అదే శ్రీమంతుడికీ మనకూ ఉన్న తేడా. 

శ్రీమంతుడు ఏమన్నాడో చెప్పడానికి ముందు మీకొక కథ చెప్తాను. సుందర్ పిచాయ్ తెలుసుకదా. అదేనండీ ప్రోడక్ట్ చీఫ్ అండ్ డిసిగ్నెటెడ్ సీఈఓ ఆఫ్ గూగుల్ గా ఈ మధ్యనే నియమితుడైన మన భారతీయుడు సుందర్ పిచాయ్ గురించే నేను చెప్తున్నాను. 

ఒకసారి సుందర్ పిచాయ్  స్నేహితులతో కలిసి  ఒక హోటల్ లో  కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు. ఎవరి సరదాల్లో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన  ఒక బొద్దింక ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకామె మీదకు ఎగిరింది. అంతే! హోటల్ దద్దరిల్లేలా అరిచి, గోల చేసి, ఎగిరి..  ఎలాగైతేనేం బొద్దింకను విదిల్చి కొట్టింది. అది కాస్తా వెళ్లి రెండో అమ్మాయి మీద పడింది. ఆవిడ కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టింది. ఆ గందరగోళం లోనే దాన్ని విదిల్చేసరికి అది వెళ్ళి ఒక సర్వర్ మీద పడింది. అతను చాలా ప్రశాంతంగా ఆ బొద్దింకను పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు విసిరేశాడు. 

ఈ సంఘటన విన్నాక మీకేమనిపించింది? ఒక పది సెకన్లు ఆలోచించి మీకు ఏదో ఒకటి అనిపించాక ఇది చదవండి. 

మీలాగే ఈ దృశ్యాన్ని చూసిన సుందర్ పిచాయ్ కు కూడా కొన్ని ఆలోచనలు వచ్చాయి. మనకొచ్చిన ఆలోచనలకు, అతని ఆలోచనలకు తేడా ఏమిటో అతని మాటల్లోనే తెలుసుకుందాం. 

'' కాఫీ తాగుతూ జరిగిందంతా చూసిన నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ గందరగోళం అంతటికీ కారణం ఏమిటి? ఆ అమ్మాయిలు అంత హిస్టీరిక్ గా మారిపోడానికి కారణం ఏమిటి? బొద్దింకా? అలా అయితే ఆ సర్వర్ మీద పడింది కూడా అదే బొద్దింక కదా! అతనెందుకు వీళ్ళలా డిస్టర్బ్ కాలేదు? 

అంటే కారణం బొద్దింక కాదు. బొద్దింక వలన కలిగిన ఇబ్బందిని  ఆ ఇద్దరమ్మాయిలూ ఒకలా, అతనొకలా  స్వీకరించారు. అప్పుడు నాకర్థమైంది... ఇంట్లో మా నాన్న లేదా ఆఫీసులో బాస్ లేదా భార్య నా మీద అరిచినప్పుడు నాకు కలిగే చిరాకుకు కారణం ఏంటో? దానికి కారణం వాళ్ళ అరుపులు కాదు. వాళ్ళ అరుపుల వల్ల నాలో చిరాకు పుట్టకుండా నన్ను నేను అదుపు చేసుకోలేక పోతున్నాను. 

రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే నాకు కలిగే అసహనానికి కారణం ట్రాఫిక్ కాదు, అలాంటి పరిస్థితిలో అసహనానికి గురవ్వకుండా నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నానన్న మాట.  
సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరువల్లే జీవితం గందరగోళంగా తయారవుతోంది. బొద్దింక ఘటన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే... 

సమస్యల పట్ల స్పందించడం కన్నా, సమస్యను అధిగమించడం ముఖ్యం. బొద్దింక రూపంలో వచ్చిన సమస్యకు ఆ అమ్మాయిలు అతిగా స్పందించారు. కానీ ఆ సర్వర్ స్పందించకుండా, సమస్యను అధిగమించాడు. 

స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో కూడుకుని ఉంటాయి. సమస్యను అధిగమించడం అనేది మాత్రం ఆలోచనలతో కూడుకుని ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే జీవితం అందంగా అనిపిస్తుంది. 

ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని కాదు. తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులన్నిటి పట్లా అతను సరైన వైఖరితో ఉన్నాడని అర్థం.''  

చదివారుగా సుందర్ పిచాయ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో. మరి బొద్దింక సంఘటన వినగానే  మీరు కూడా ఇలాగే ఆలోచించారా?   కాదు కదా. అందుకే అతను ప్రఖ్యాత గూగుల్ సంస్థలో అంత పెద్ద పదవిని పొందగలిగాడు. 

ఇప్పుడు శ్రీమంతుడు దగ్గరికి వద్దాం... 

శ్రీమంతుడు సినిమా చూసొచ్చాక ఇంట్లో అమ్మా నాన్నతో పోట్లాడి మరీ సైకిల్ కొనిపించుకున్న వారు మనలో ఉన్నారు. ఇప్పటికే సైకిల్ ఉన్నా, దాన్ని మించిన బైక్ లూ, కార్లూ ఇంట్లో ఉన్నా  మహేష్ బాబు వాడిన సైకిల్ లాంటిదే కావాలని పట్టుబట్టి కొనిపించుకున్న శ్రీమంతుడి బిడ్డలూ మనలో ఉన్నారు. శ్రుతి హసన్ లాంటి అమ్మాయి దొరికితే ప్రేమించాలని సైకిల్ వేసుకుని గర్ల్స్ హాస్టళ్ళ చుట్టూ తిరుగుతున్న పోకిరీలూ మనలోనే ఉన్నారు.  శ్రీమంతుడు సినిమా చూసి మనం నేర్చుకున్నది ఇంతే. మనం ఆలోచించింది ఇంతే. మరి శ్రీమంతుడు అదే చెప్పాడా? శ్రీమంతుడు సినిమాకీ, సుందర్ పిచాయ్ చెప్పిన బొద్దింక కథకీ లింకేంటి? 

ఇంతకీ శ్రీమంతుడు ఏం చెప్పాడు? 

అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించమన్నాడు. తండ్రి నానారకాలుగా కష్టపడి సంపాదిస్తే, బైక్ రేసులు, కారు రేసులు పెట్టుకుని ఘోరంగా చచ్చిన శ్రీమంతుల కొడుకులను చూశాం. అవే రేసుల్లో రోడ్డు మీద పోయే అమాయకుల ప్రాణాలను బలిగొన్న దగుల్బాజీగాల్లనూ చూశాం. డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు చేస్తూ స్నేహితులతో జులాయి తిరుగుళ్ళు తిరిగే వాళ్ళనూ చూశాం. డబ్బు పడేసి రోజుకో అమ్మాయితో తిరిగే వాళ్ళనూ చూసాం. వీళ్ళంతా మహేష్ బాబులా  శ్రీమంతుల బిడ్డలే. మరి సినిమా శ్రీమంతుడికి వీళ్ళకూ తేడా ఏమిటంటే .. ఆలోచనా విధానం.  

అందరిలా తండ్రి ఆస్తిని పదింతలు చేయాలనో, లేదంటే  అందరికంటే పది రెట్లు ఎక్కువ అనుభవించాలనో అతను ఆలోచించలేదు. ఆస్తిలో వాటా కోసం పోటీపడలేదు. వీలైనంత త్వరగా ఆస్తి మొత్తం మీద హక్కును సాధించాలని ఆత్రుత పడలేదు. అతను కూడా తండ్రి ఆస్తిని ఖర్చు పెట్టాడు. కానీ నలుగురిని సంతోషంగా ఉంచడానికి ఖర్చు పెట్టాడు. 'మేము మా ఫ్రండ్స్ అందరికీ మందు తాపితే, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నట్టే కదా' అని తిక్కగా ఆలోచించకండి. సంతోషం అంటే రేపటి మీద భరోసా. సంతోషం అంటే కష్టాలను పంచుకోడం. సంతోషం అంటే మనకున్నది ఇతరులతో పంచుకోవడం. సినిమా మొదటి సీన్లోనే తండ్రీ కొడుకుల మధ్య సంబాషణ పెట్టి హీరో ఆలోచన విధానం ఎలాంటిదో చెప్పాడు దర్శకుడు. 

ఇలాంటి సినిమా తీసే దర్శకుడి ఆలోచన విభిన్నం. ఇలాంటి సినిమాలో నటించడమే కాకుండా, నిర్మాణంలో కూడా పాల్గొనాలని మహేష్ బాబుకు అనిపించడం విభిన్నం. ఇలా విభిన్నంగా ఆలోచించారు కాబట్టే వారు విజయం సాధించారు. మంచి వసూళ్లు రాబట్టి అసలైన శ్రీమంతులయ్యారు. సినిమా విడుదలయ్యాక గ్రామాల దత్తత తీసుకుంటున్న వారందరినీ శ్రీమంతుడు అనే పిలుస్తున్నారు. దర్శకుడు కొరటాల శివకు రూ.50 లక్షల విలువచేసే ఆడి కారును బహుమతిగా ఇచ్చారంట మహేష్ బాబు దంపతులు.       

మిమ్మల్ని కూడా అందరిలా కాకుండా వారిలా  విభిన్నంగా ఆలోచించమని చెప్పాడు శ్రీమంతుడు.  విభిన్నం అంటే సైకిల్లేసుకుని తిరగడం కాదు. సుందర్ పిచాయ్ లా విభిన్నంగా ఆలోచించండి.                                      

                                             
    

            

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి