పేజీలు

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

లెటర్స్ టు లవ్

కొన్నాళ్ల క్రిందట... కాదు కాదు కొన్నేళ్ల క్రిందట... 

వార్తాపత్రికలో ఒక అమ్మాయి ఫోటో చూసాను. పాతకాలపు స్త్రీత్వాన్ని ఆ కాలపు దుస్తుల్లోనే మూటకట్టి తెచ్చి సముద్రపు ఒడ్డున కూరబెట్టినట్టు ఉంది ఆమె. మొహం చూస్తే చిన్నతనపు అల్లరి మానేసి, బుద్ధిగా లోకాన్ని చదవడానికి కూర్చున్న కాలేజీ పిల్లలా ఉంది. మొత్తానికి పాత, కొత్తల యుద్ధంలో ఎగురుతున్న జెండాలా ఉంది.  తీరా చూస్తే ఆ పిల్ల ఒక పుస్తకం కూడా రాసేసింది అని ఆర్టికల్ చదివాక తెలిసింది. పుస్తకం పేరు 'లెటర్స్ టు లవ్'...  ఆ అమ్మాయి పేరు కడలి సత్యనారాయణ. ఆ పుస్తకం కవర్ పేజీ మీద కూడా అదే ఫోటో ఉంది. పుస్తకం వెంటనే చదవాలనే ఆసక్తి పెరిగింది.  

నేను పుస్తకాలు చదవడం మానేసి ఏళ్లవుతోంది. అయినా సరే ప్రతి ఏడాది బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్లి పుస్తకాలు కొంటూ ఉంటాను. ఏనాటికైనా వాటిని చదువుతాననే ఆశ. బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్లి 'లెటర్స్ టు లవ్' కావాలన్నాను. స్టాక్ అయిపోయింది సార్. మూడు రోజుల తర్వాత రండి అన్నారు. ఇంత  డిమాండ్ ఏంటని ఆశ్చర్యపోయాను. తర్వాత వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో చెప్పి తెప్పించుకున్నా. 


ప్రేమకు ప్రేమలేఖలు... 

చలం పుస్తకాల్లో నేను చదివిన మొదటి పుస్తకం 'ప్రేమలేఖలు'. ఆ తర్వాత ఆయన సాహిత్యాన్ని వదల్లేక పోయాను. అటువంటి నాకు ఈ ప్రేమలేఖ నచ్చుతుందా? అనుకున్నా.  కానీ ఈ తరం ప్రేమను ఎలా అర్థం చేసుకున్నదో  తెలుసుకోవాలనిపించింది. అందుకే పుస్తకం చదవడానికి నిర్ణయించుకున్నా. కానీ ఎప్పటి మాదిరిగానే, మిగతా పుస్తకాల దొంతరలో ఈ పుస్తకం కూడా నా లైబ్రరీలో అలంకార వస్తువులా ఉండిపోయింది ఇన్నాళ్లూ. ఎలాగైతేనేం ఈ మధ్య చదవడం కుదిరింది. నాకు బాగా నచ్చింది. ఈ అమ్మాయి మామూలుది కాదు. పేరుకు తగ్గట్టే కడలి. 


'లెటర్స్ టు లవ్'  పుస్తకం చదివాక అందులో నాకు బాగా నచ్చిన భావాలను, కడలి రాతలను నలుగురితో పంచుకోవాలనిపించింది. అందుకే వాటిని ఇక్కడ ఉంచుతున్నా. పుస్తకంలో ఒక్కో శీర్షిక కింద ఒక్కో లేఖ ఉంటుంది. ఆ శీర్షికలను కూడా ఇక్కడ ఇచ్చాను.                
  
  


Chalam's kind of evening

మన చలం అంటాడు - అప్పుడే ఏడ్చి నవ్వే ఆడవాళ్ళ మొహాలు ఎంత అందంగా ఉంటాయంటే, వర్షం కురిసి వెలిసాక కాసే నీరెండంత అందంగా ఉంటాయని. అచ్చు అలాగే నీరెండ కాస్తోంది. 

Waiting...

ఎంత పిచ్చిది ఈ మనసు! భలే మొండిది కూడాను. ఏదో వైపు నుంచి దరిచేరే ప్రేమని, ప్రేమే కాదంటుంది. తాను కోరుకున్నవైపు నుంచి వస్తేనే ప్రేమంటుంది. అలా వచ్చి పడే ప్రేమని ఒప్పుకోగలిగితే ప్రపంచం అంతా ప్రేమమయం అయిపోదు!     

Clouds pass

సన్నని జల్లు ఒంటిపైన కురుస్తున్నా, పక్షులు అలా చినుకు స్పర్శని మోస్తూ ఎలా ఎగురుతూ పోతాయో, అలా ప్రేమజల్లు మన పైన నిరంతరం కురుస్తూ తన ఉనికిని  గుర్తు చేస్తూ ఉంటే బావుండు. మనుషులమనీ, ప్రేమకే పుట్టామనీ, ప్రేమ కోసమే బతకాలనీ, చినుకు పడిన ప్రతిసారీ వెన్నుతట్టి వాన గుర్తుచేస్తేనైనా ప్రేమకీ వికృత రూపం రాకుండా ఉండేది 

మట్టి తాకి మలినమయ్యే వరదలున్నాయిగానీ, నేలనంటనంత వరకు వాననీరంతా స్వఛ్ఛమేగా. ప్రేమ పుట్టుక వానజల్లు లాంటిదే కానీ ఇరుకు మనసుల మధ్య ఇమడలేక మరకగా మారినట్టుంది  

The Sea and a Butterfly 

ఎంతమందో తీరాన కూర్చొని ప్రేమిస్తుంటారు గానీ నాతో బతకడం కష్టం. నేనూ  బతకనివ్వనులే.    

The last letter

నన్ను దేవత అని ఎలా అంటావు? నిజంగానే ఇష్టంతో గుడిలో ఉండే దేవతలున్నారా? నువ్వన్నట్టు వాళ్ళకి చీరెలు, సారెలు అంటగట్టి ఆ గదికి అంకితం చేసారు ఈ జనాలు. 

Love happens under trees, You know?

ప్రేమలో ఉండటం ఎంత కష్టంగా మారిన రోజులివి! ప్రేమలో పడటం, లేవడం పనిగా మారిపోయిన తరం ఇది. ఇలాంటి రోజుల్లో ఆకాశాన్ని చూడటం, సూర్యుడు, చంద్రుడి రాకపోకలని గమనించి, ప్రేమించడం. వాళ్ళ కిరణాలతో కబుర్లాడటం, వానజల్లులతో స్నేహం, రాత్రులతో ప్రేమలేఖలు, మనుషుల్లో మనిషి తడి వెదుక్కుంటూ పోయే గుణం ఉండటం అంటే బతకడమేగా. బతుకుతున్నామంటే ప్రేమించకుండా ఎలా ఉంటాం?

Okay! I'll leave now...     

ఈ మొత్తం ప్రపంచంలో నాకు నేనంటేనే ఇష్టం, నేనంటేనే ప్రేమ. భరించలేనంత ప్రేమ. ఇప్పుడా ప్రేమలో నువ్వెక్కడ కలిసిపోతావో అని భయంగా ఉంది. ఇప్పుడా ప్రేమే నువ్వుగా ఎక్కడ కనిపిస్తావో అని గుబులుగా ఉంది. 

Just Imagine       

ఈ ఊహల్లో నా ఊపిరి బరువెక్కడం నాకే మహా నచ్చుతోంది.    

ప్రేమ తెలియని వాళ్ళంటారు... గగుర్పాటు భయపడినప్పుడే వస్తుందని. కానీ వెంట్రుకలు నిక్కబొడుచుకోడం ఇప్పుడు ఇలా (ప్రేమ భాగస్వామితో ఉన్నప్పుడు) కూడా జరగొచ్చు. నరాల్లో వేడుకలవడం, ఊపిరి రంగులు పీల్చడం, ఊహల్లో పువ్వు నవ్వులు నవ్వడం... ఇవన్నీ జరుగుతాయని నేననుకోలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి.  

Love is Freedom

ప్రేమంటే కట్టిపడేసుకోవడం అనే భ్రమలో నిన్ను కోల్పోవడం కన్నా, ప్రేమంటే స్వేఛ్చ అనే నిజంలో ప్రేమించడం వేరు 

This is not happening!

ప్రేమ ఎన్ని అగాధాలనైనా భరించగలదు అంటాంగానీ కానేకాదు. కొద్దిపాటి ఎల్యూడ్ చేయడమో, ఇగ్నోర్ చేయడమో, ఓవర్ లుక్ చేయడమో జరిగినా మెల్లిమెల్లిగా గోడల పెచ్చులు పగిలినట్టు పగులుతూ పోతుంది 


This is what I wanna right about 


సిగ్గుని ఓ మూలకి నెట్టి చెప్తున్నాను పిల్లడా ! నువ్వు విను. నువ్వు పిలిస్తే మేని వీణని మునిపంటితో మీటినట్టు ఉంటుంది. పెదాల మీద చక్కెర పలుకులంటించి అణువణువుకి చిటికెడు ముద్దులిచ్చుకుంటూ పోయినట్టు, ఒళ్ళంతా చక్కెర పాకం ఊరినట్టు, ఊరీ ఊరీ పంచదార ఊబిగా మారినట్టు, తనువంతా తీపి వాసన. 

కాయమంతా చీమలు ముసిరినట్టు మళ్ళీ రకరకాలుగా పిలుస్తూ నువ్వే, సుతారంగా కుట్టి నొప్పి పుట్టిస్తావు. ఆ పైనేమో బుగ్గలు దాటి, పెదవులు మీటి, మెడ వంపుల మీదుగా అరవిరిసిన పువ్వులన్నిటినీ కోసుకుంటూ, సూరీడు కనని నిధి చేరగానే ఎర్రతనమంత మత్తుగా మారి కనుకొనల్లో నుండి ఆనంద జలపాతం పారుతుంది. 

సొరంగ సిరులను దోచే దొంగాడికి శ్వాసందక తల పైకెత్తి ఊపిరి పీల్చుకున్నట్టు, ఒక నిమిషం సముద్ర తీరాన సేద తీరుతావు. వదులులు బిగువులవుతాయి. బిగువులు ముడులవుతాయి. మళ్ళీ ముడులను పొరలు పొరలుగా విప్పుకుంటూ నువ్వే, నీ జ్వాలే. 

జన్మాంతం పొందే ఆనందాన్ని పదాలలో ఇమడ్చలేక ఒదిలేస్తున్న నిస్సహాయ స్థితి నాది. అసంపూర్ణిత మాటలివి. 

Sky told me a story

ఈ ఆకాశం ఎంత గడుసుదో కదా! మనిద్దరి గడుసుదనం కలిపినంత గడుసుది. ఎన్నెన్ని వేషాలు వేసి నాకు నిన్ను చూపుతుంది. 


నేలనంబాడే నెలల పిల్లాడినీ  
అప్పుడే నిక్కర్లు వేసుకు సైకిల్ తొక్కే బుడ్డోడినీ  
నూనూగు మీసాల పాల బుగ్గలోడినీ
పుస్తకాలు మోసుగు తిరిగే చదువరినీ 
పిడికిలి బిగించి నినాదమయ్యే యువకుడినీ 
కంగారుగా పరుగెత్తే కొత్త ఉద్యోగినీ 
తాపీగా పేపర్ చదివే నడివయస్కుడినీ  
తల నెరసి బోసినవ్వులు నవ్వే నిత్య యవ్వనుడినీ 


ఇంతమందిని ఒక్కొక్కరిగా చూపుతుంది. ఇంతమందిలోనూ నిన్నే పట్టి పట్టి చూపిస్తుంది. 

Love found me this time 


ఎన్ని రోజులైంది నిన్ను చూసి. మూడు సంవత్సరాల ముందు నిన్ను మొదటిసారి చూసినప్పుడు గుండెలో ఎలా సీతాకోకచిలుకలు అల్లరి చేశాయో అలాగే అల్లరి చేసాయి.    
  

Never go back to something that broke you


ఆ పావుగంటలో నీ కళ్ళు ఈ మూడు సంవత్సరాలు నువ్వు నన్ను ఎంతగా కోల్పోయావో చెప్తుంటే, నా కళ్ళు మాత్రం ఈ మూడు సంవత్సరాలు నేనెంత బండరాతిగా మారిపోయానో చెప్తుంటాయి 

kisses

కొన్నిసార్లు నీ నవ్వులని నేను నా నడుము మీద అనుభవిస్తుంటాను. కొన్నిసార్లు చెవి వెనుక చిరుగాలిలా ఫీల్ అవుతాను. ... నువ్వు కనురెప్పలెత్తిన ప్రతిసారీ రెప్పలతో పాటే బట్టలు విప్పేసినట్టు ఉంటుంది.    
  
---------------------

నా కథ నచ్చిందంటే నేను కూడా నచ్చి ఉంటాను.
 
ఇంటర్ మీడియట్ లవ్ లో - ఫిజికల్ ప్రెజెన్స్ మాటర్స్                         

                             
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి