పేజీలు

13, జూన్ 2012, బుధవారం

రోటి,కపడా ఔర్ మొబైల్..!


'జియే తో జియే కైసే, బిన్ ఆప్ కే ...
లగ్ తా నహి దిల్ కహీ, బిన్ ఆప్ కే ...
కైసే కహూ, బినా తెరే జిందగీ యే క్యా హోగీ...'

ఒకరికి ఒకరు దూరమైన ప్రేయసి ప్రియులు, ఒకరిని తలచుకుని ఒకరు పాడుకునే పాట ఇది. కాని, ఈ రోజుల్లో ఇదే పాట ఎవరైనా పాడుతుంటే వారి సెల్ ఫోన్ కనపడటం లేదని అర్థం.

'రోటి, కపడా ఔర్ మకాన్ ' అనేది ఒకప్పుడు మన నాయకుల నోట బాగా నానిన మాట. అయితే ఈ రోజు భారత దేశంలో పేదలకు కావలసిన కనీస అవసరాల ప్రాధాన్యత మారింది. రోటీ (కూడు) , కపడా (గుడ్డ) తర్వాతి స్థానం మకాన్ (గూడు) కాకుండా మొబైల్ ఫోన్ అయ్యింది. చెట్టు కింద, ఫుట్ పాత్ పైన, మునిసిపాలిటీ పైపుల్లో... ఇలా ఎక్కడ నివాసం ఉన్నా, ఏ పని చేస్తున్నా చేతిలో మొబైల్ ఉండాల్సిందే.

మనిషి సంఘజీవి. సంఘటితంగా జీవించాలంటే... తోటి మనిషితో సంబంధాలు ఏర్పరుచుకోవాలి. భావ వ్యక్తీకరణకు  సమాచార మార్పిడి జరగాలి. అందుకే ఈ సమాచార సాధనాలకు ఇంత ప్రాథాన్యత. భారతదేశ జనాభా 121 కోట్లయితే, అందులో సెల్ ఫోన్ వినియోగదారులు దాదాపు 92 కోట్ల మంది. అంటే మార్చి 2012 నాటి ఈ లెక్కల ప్రకారం దేశంలోని 76% మంది ప్రజలు సెల్ ఫోన్ వాడుతున్నారన్నమాట. మానవ నాగరికత ఆరంభం నుండి కూడా మనిషి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాడు. అందుకు ఎన్నో మార్గాలను, సాధనాలను ఉపయోగించుకున్నాడు. అయితే ఈ స్థాయిలో మాత్రం ఏ సమాచార సాధనాన్నీ వాడలేదు మనం. ఎందుకని? సెల్ ఫోన్ ప్రత్యేకత ఏంటి? తెలుసుకోవాలంటే అంతకు ముందున్న సమాచార సాధనాల గురించి కాస్త తెలుసుకోవాలి.

సమాచార సాధనాల సమాచారం 
ఒకప్పుడు దూరంగా ఉన్నవారితో సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలంటే ప్రత్యేకంగా ఒక దూతను పంపే వారు. పావురాయి వంటి పక్షులతో కూడా సమాచారాన్ని చేరవేసేవారని విన్నాం. 'కాకి చేత కబురు పెట్టు చాలు' అన్న జాతీయం దీనిమూలన్గానే వచ్చింది. ఆ తర్వాత పోస్టల్ నెట్ వర్క్ ఏర్పాటయింది.

ప్రియమైన నీకు... 
 'ప్రియమైన...' అంటూ మొదలుపెట్టి, 'ఇట్లు, మీ...' అంటూ ముగిస్తూ రాసుకున్న లేఖలు మనుష్యుల మధ్య సంబంధాలని, ప్రేమలని ఎంతో కాలం మోసాయి.  క్రీ.శ. 1774లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 'కంపెనీ డాట్' పేరిట భారత దేశంలో మొదటిసారిగా  తపాలా సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అదే సంవత్సరం  ఏప్రిల్ 1న కలకత్తాలో దేశంలోని మొట్టమొదటి జి.పి.ఓ. ప్రారంభించబడింది. నాటి నుంచి దాదాపు రెండు వందల ఇరవై ఏళ్ళ పాటు ఉత్తరాలు పల్లెపల్లెకు రెక్కలు కట్టుకుని ఎగిరెళ్ళుతూ పెత్తనాలు చేశాయి. ఆత్మీయుల గురించిన క్షేమసమాచారం, పెళ్లి కుదిరందనో,మనవడు పుట్టాడనో చెప్పే శుభవార్తలు, ఉద్యోగం వచ్చిందన్న తీపి కబురు, ప్రేమలేఖలు,విరహబాధలు... ఇలా ఎన్నిటినో మోసుకొచ్చే ఉత్తరాలను అందించే పొస్టుమేన్ ప్రతి ఇంటికీ ఒక ఆత్మీయుడు అప్పట్లో.


స్టార్ట్ ఇమ్మీడియట్లీ ...   
ఇంటి తలుపు తట్టి 'టెలిగ్రాం' అనగానే , ఆ ఇంట్లో వాళ్లకు గుండెలు జారి పోయేవి. టెలిగ్రాంలో 'ఫలానా వాళ్ళు సీరియస్. స్టార్ట్ ఇమ్మీడియట్లీ' అన్న సందేశాలే ఎక్కువగా ఉండేవి. సీరియస్ అని టెలిగ్రాం వచ్చిందంటే, ఆ ఫలానా వాళ్ళు టపా కట్టేసారని అర్థమన్న మాట. అందుకే టెలిగ్రాం వచ్చిందంటే అంత భయపడేవాళ్ళు.

ఈ టెలిగ్రాఫ్ విధానాన్ని కనుగొన్నది శ్యామ్యూల్ మోర్స్  అనే అమెరికన్.1835లో ఎలెక్ట్రో మాగ్నటిక్ టెలిగ్రాఫ్ పరికరాన్ని, అలాగే దాని ద్వారా సందేశాన్ని పంపించడానికి 'డాష్ అండ్ డాట్' (గీతలు మరియు చుక్కలు )లతో కూడిన ఒక కోడ్ ను కూడా రూపొందించాడు మోర్స్. ఈ టెలిగ్రాఫ్ పరికరం ద్వారా 1838, జనవరి 11న ప్రపంచంలో మొట్టమొదటి టెలిగ్రాఫ్ సందేశం పంపబడింది. ఆ తర్వాత ఏడేళ్లకు అంటే 1845 నుండి ప్రజలందరికి  అందుబాటులోకి వచ్చింది టెలిగ్రాం సౌకర్యం.

మన భారత దేశంలో కలకత్తా నుండి డైమండ్ హార్బర్ వరకు మొదటి టెలిగ్రాఫ్ లైన్ వేయబడింది. అయితే అది బ్రిటిష్ ఈస్టిండియా వారి ప్రయోజనాలకే  పరిమితమయ్యింది.  ఆ తర్వాత 1853లో కలకత్తా నుండి ఆగ్రాకు టెలిగ్రాఫ్ లైన్ వేసాక ప్రజలకు టెలిగ్రాం సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. 1902లో వైర్ లెస్ టెలిగ్రాఫ్ సిస్టం అమలులోకి వచ్చింది.

బూచాడమ్మా బూచాడు... బుల్లి పెట్టెలో ఉన్నాడు...
మొదట చేతి రాతల (పోస్టల్ ) ద్వారా, ఆ తర్వాత కోడ్ (టెలిగ్రాఫ్ ) ద్వారా అందుకున్న సందేశాలను, 1870లలో బెల్ మహాశయుడు టెలిఫోన్ ను కనుగొనడంతో, ఎంత దూరంలో ఉన్న మనిషితోనైనా నేరుగా మాట్లాడగలిగే వీలు కలిగింది.

అలెగ్జాండర్ గ్రాహం బెల్ కన్నా ముందు, ఆ తరవాత కూడా టెలిఫోన్ పరికరానికి తమ కృషిని, మేథస్సునూ జోడించిన వారున్నారు.  1850 నుండి 1870 వరకు టెలిఫోన్ పరికరంపై  పేటెంట్  హక్కుల కోసం చాలా  పెద్ద పోటీయే జరిగింది. అయితే చిట్టచివరకు 1876లో టెలిఫోన్ పరికరంపై పేటెంట్ హక్కులను బెల్ కు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం.. ఆ రకంగా 1876, ఆగస్ట్ 3న బెల్ చేసిన ఫోన్ కాల్  ప్రపంచపు మొదటి టెలిఫోన్ కాల్ గా గుర్తించబడింది.

ఇక భారతదేశం విషయానికి వస్తే కలకత్తా, బొంబాయి, మద్రాస్, అహమ్మదాబాద్ లలో టెలిఫోన్ ఎక్స్ చెంజీలను పెట్టేందుకు, అప్పటి 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' నుండి అనుమతి పొందిన 'ఓరియంటల్ టెలిఫోన్ కంపెనీ', 1882, జూన్ 30వ తేదీన, కలకత్తాలో స్థాపించిన 'సెంట్రల్ ఎక్స్చెంజీ' ద్వారా ఇండియాలో టెలిఫోన్ సర్వీసుల్ని ప్రారంభించింది. ఆనాడు టెలిఫోన్ సౌకర్యాన్ని అందుకోడానికి ముందుకు వచ్చిన సబ్ స్క్రైబర్ లు ఎంత మందో తెలుసా? కేవలం 92 మంది.  స్వాతంత్ర్యం వచ్చిన నాటికి  దేశంలో 7330 టెలిగ్రాఫ్, 321 టెలిఫోన్ ఎక్స్చేన్జీలు  ఉన్నాయి. అప్పటికి  టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 82,985కు చేరింది.

ఈ విధంగా బ్రిటిష్ వారు, వారి పాలనా సౌలభ్యం గురించి కానివ్వండి, లేదా అభివృద్ధిలో భాగమనండి, 19వ శతాబ్దంలోనే   పోస్టల్, టెలిగ్రాఫ్, టెలిఫోన్ వంటి సమాచార సేవలను భారత ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే వీటిలో పోస్టల్ సేవలనే ప్రజలు విరివిగా ఉపయోగించుకున్నారు. కారణం టెలిగ్రాఫ్ అనేది మిత సందేశాలకు మాత్రమే పరిమితమై పోవడం. ఇక టెలిఫోన్ సేవల ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్యులు ఈ సేవలను అందుకోలేకపోయారు. అందుబాటులోకి వచ్చిన వందేళ్ళ వరకు కూడా టెలిఫోన్ అనేది స్టేటస్ సింబల్ గానే ఉండిపోయింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చేనాటికి, అంటే 1992 నాటికి, 84 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో టెలిఫోన్ సబ్ స్క్రైబర్ల సంఖ్య కేవలం 5కోట్ల 7 లక్షలు మాత్రమే.

అప్పట్లో ఏదయినా అవసరం ఉండి, ఎవరికైనా టెలిఫోన్ నంబరు ఇవ్వాలంటే, వీధిలో ఏ ఒక్కరి దగ్గరో ఉండే టెలిఫోన్ నంబరు ఇవ్వడం, అక్కడకు ఫోనొస్తే, వాళ్ళు విసుక్కుంటూ మనల్ని పిలవడం, వేరే రాష్ట్రానికో, దేశానికో ఫోన్ చెయ్యాలంటే ఎస్టీడీ బూత్ ల దగ్గర గంటలకొద్దీ సమయాన్ని వెచ్చించడం, క్యూ లలో నిలబడి నిరీక్షించడం మనందరికీ అనుభవమే. దేశంలో ఎస్టీడీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది 1960లో. లక్నో నుంచి కాన్పూర్ కు   మొదటగా ఎస్టీడీ లైనును వేశారు.

ప్రపంచీకరణ-ఆర్థిక సంస్కరణలు-పారిశ్రామిక సరళీకరణ...          
పేద, ధనిక తేడాల్లేకుండా ఈ రోజు ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోన్ ఉందన్నా,ప్రతి ఇంట్లో వంద చానెళ్ళ కలర్ టీవీ ఉందన్నా దాని వెనుక ఒక తెలుగు తేజం కృషి ఉంది. ఆయనే మాజీ ప్రధాని, కీ.శే. పి. వి.నరసింహరావు.  తెలంగాణ  ఆత్మ గౌరవం అంటూ నినదించే తెలంగాణ వాదులు, ఈ తెలంగాణ ముద్దు బిడ్డడి గొప్పదనాన్ని  గుర్తించక పోయినా పరవాలేదు. శవరాజకీయ సంస్కృతిని జీర్ణించుకున్న నూట పాతికేళ్ళ పార్టీ ఆయన సేవలను మర్చిపోయినా పరవాలేదు, అధిష్టానాన్ని కాకా పట్టడం కోసం ఘనతనంతా రాజీవ్ గాంధీకి ఆపాదించి మాట్లాడే నేతలు పీవీ కృషిని విస్మరించినా పర్వాలేదు. కాని చేతిలో సెల్ ఫోన్ ఉన్నవారంతా ఈ సంస్కరణల సాహసిని గుర్తుంచుకుంటే చాలు. ఎందుకంటే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని గట్టెక్కించడంతో  పాటు, అంతర్జాతీయ సాంకేతిక ఫలాలను సామాన్యులకు చేరువ చెయ్యడంలో పీవీ పాత్ర  మరువలేనిది.

1991లో అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు  పీవీ నరసింహారావు. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పటి పీవీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా  ఉన్నారు. ఇద్దరూ కలిసి 1992లో ఆర్ధిక సంస్కరణలకు ఊపిరి పోశారు. ప్రపంచీకరణకూ, పారిశ్రామిక సరలీకరణకూ తలుపులు తెరిచారు. ఫలితంగా దేశంలో సాంకేతిక విప్లవం చోటు చేసుకుంది. విదేశీ పెట్టుబడులతో పాటు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం దేశంలోకి వెల్లువలా ప్రవహించింది. విదేశీ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ ఫలితంగా భారత ప్రజలకు సమాచార సాధనాలు అందుబాటు ధరలకు చేతికొచ్చాయి.

1995
...దేశ సమాచార రంగంలో నూతన శకానికి నాంది!


 పేజర్ 
మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నడుముకు ఒక అగ్గిపెట్టేలాంటి పరికరం. దాన్నుండి బీప్ బీప్ అని శబ్దం రావడం. చటుక్కున దాన్ని తీసి చూస్తే, స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యే ఒక సందేశం. దాన్ని చదువుకున్న సదరు వ్యక్తి దగ్గరలోని టెలిఫోన్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేసుకోవడం.ఆ పరికరం పేరే 'పేజర్'.  

అల గ్రాస్ అనే శాస్త్రజ్ఞుని కృషి ఫలితంగా 1950లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన పేజర్ , 1958లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 1974లో మోటోరోలా కంపెనీ పేజర్ సర్వీసులను ప్రారంభించి, ప్రపంచానికి పేజర్ ను చేరువ చేసింది. అయితే భారతీయులకు మాత్రం చాలా ఆలస్యంగా, అదీ పీవీ హయాంలో అంటే   1995లో పేజర్లు అందుబాటులోకి వచ్చాయి. అనతికాలంలోనే దేశంలో 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లను సంపాదించుకున్న పేజర్లు, 2004కల్లా దేశం నుండి మాయమై పోయాయి. కారణం సెల్ ఫోన్.


కేబుల్ టెలివిజన్ 
1884 నుంచి సాగిన పరిశోధనల ఫలితంగా, ప్రపంచానికి 1936, నవంబర్ 2న, BBC వార్తా ప్రసారం ద్వారా   పరిచయమైన టెలివిజన్, మన దేశంలో 1959 సెప్టెంబర్ 15న డిల్లీ నుంచి ప్రయోగాత్మక ప్రసారాన్ని జరుపుకుంది. ప్రజలకు మాత్రం 1965నుంచి అందుబాటులోకి వచ్చింది. అయినా చాలా సంవత్సరాల వరకూ టీవీ కూడా సంపన్న వర్గాల  స్టేటస్ సింబల్ గానే ఉండిపోయింది. మొదట్లో AIR లో భాగంగా ఉన్న టెలివిజన్ ప్రసార విభాగం 1976లో వేరయ్యింది. 1982 నుంచి దూరదర్శన్ విభాగం ద్వారా జాతీయ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అదే సంవత్సరం కలర్ టీవీ కూడా భారత్ లోకి ప్రవేశించింది. 


1965లో దేశంలో ఉన్న టీవీ సెట్లు కేవలం 41. ఉన్నది ఒకే ఒక చానెల్. అలాంటిది 1992లో ప్రసార రంగానికి పీవీ స్వేచ్చను కల్పించడంతో, కేబుల్ టీవీ వ్యవస్థ ప్రజలకు చేరువయ్యింది. స్టార్ టీవీ వంటి విదేశీ చానెళ్ళు దేశీయ ప్రసారాలను ప్రారంభించాయి. ఆ తర్వాత జీటీవీ, సన్ నెట్వర్క్ లాంటి దేశీయ  నెట్వర్క్ లు  నెలకొల్పబడ్డాయి.

ఇంటర్నెట్ 
ప్రపంచానికి 1988లో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ సర్వీసులు మనదేశ ప్రజలకు 1995, ఆగష్టు 14 నుండి అందుబాటులోకి వచ్చాయి.
1996లో రీడిఫ్.కామ్ సంస్థ ముంబాయి నగరంలో మొదటి సైబర్ కేఫ్ ను ప్రారంభించింది.
మొదటిసారిగా తన కస్టమర్లకు ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను అందించిన సంస్థ ఐ.సి.ఐ.సి.ఐ. (1997).
అప్పటివరకు గేట్ వే ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీసు (VSNL) అధీనంలో ఉన్న ఇంటర్నెట్, 1998, అక్టోబర్ 7 నుండి ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్ల చేతికొచ్చింది. ఒక్కసారిగా 200 ISPలు ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు అనుమతిని పొందాయి. దేశంలో ఇంటర్నెట్ సేవలను అందించిన మొట్టమొదటి ప్రైవేటు ISP -సత్యం ఇన్ఫో వే లిమిటెడ్ (SIFY).
షమ్మీకపూర్ 
మీకు తెలుసా? దేశంలో ఇంటర్నెట్ పేరు కూడా వినబడని రోజుల్లోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు కీ.శే. షమ్మీకపూర్ ఇంటర్నెట్ సేవలను అందుకున్నారని అంటారు. దేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్ వినియోగదారుడు ఆయనే అని, అందుకే యాహూ సంస్థను భారత్ లో ప్రారంభిస్తూ, ఆ సంస్థ అధినేత జెర్రీ యాంక్, ప్రారంభోత్సవ కార్యక్రమానికి షమ్మీ కపూర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని చెప్పుకుంటారు. 


ఇకపోతే మన సెల్ ఫోన్ కూడా భారత దేశంలోనికి అడుగుపెట్టింది 1995లోనే.


సెల్ శకం 
1995, జూలై 31వ తేదీ. కలకత్తా నగరం. అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీ.శే. జ్యోతిబసు, నాటి టెలికాం మంత్రి సుఖ్ రామ్ గారికి మొబైల్ ద్వారా ఫోన్ చేసి, దేశంలో మొబైల్ ఫోన్ సర్వీసుల్ని ప్రారంభించారు. మొదటి మొబైల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్-మోడి గ్రూప్. టెల్ స్ట్రా అనే ఆస్ట్రేలియాన్  సంస్థతో కలిసి మొబైల్ సేవలను అందించిన మోడి గ్రూప్ , అప్పట్లో నిమిషానికి 16 రూపాయల చార్జీని వసూలు చేసేది. మొదట్లో  మొబైల్ సేవలు కలకత్తా, డిల్లీ నగరాలకే పరిమితమయ్యాయి.

మీరు గమనించారా? కారణం ఏమైనా గాని, భారత దేశంలో పోస్టల్, టెలిగ్రాఫ్, టెలిఫోన్, సెల్ ఫోన్ వంటి ముఖ్యమైన  సమాచార సేవలన్నీ మొదట అందుబాటులోనికి వచ్చింది కొలకత్తా వాసులకే.

సెల్ ఫోన్ పుట్టుక 
తను కనిపెట్టిన మొబైల్ ఫోన్ తో మార్టిన్ కూపర్ 
సెల్ ఫోన్ లు  రాక ముందు రకరకాల మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండేవి. కానీ ఇవేవీ తేలికగా మోసుకు పోగలిగినవి కాదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రేడియో ఫోన్లను సైనిక అవసరాల కోసం వాడడం మొదలు పెట్టారు. అయితే వీటికి అవసరమైన విద్యుత్తు కోసం కారు లేదా మరేదయినా వాహనం యొక్క బ్యాటరీ కావలసి రావడంతో వీటిని కేవలం వాహనాలలోనే అమర్చవలసి వచ్చేది. వీటిని కార్ ఫోన్లని అనేవారు.. అలాంటి పరిస్థితులలో మోటరోలా సంస్థకు చెందిన పరిశోధకుడు మార్టిన్ కూపర్ తన బృందంతో కలిసి అనేక పరిశోధనలు చేసిన అనంతరం, ప్రపంచపు మొట్టమొదటి 'హ్యాండ్ హెల్ద్ మొబైల్ ఫోన్'ను తయారు చేసాడు. ఒక సెల్యులార్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసి, 1973, ఏప్రిల్ 3న న్యూయార్క్ నగరంలో ఒకచోటినుండి మరోచోట ఉన్న తన ప్రత్యర్థి సంస్థ బెల్ లాబ్స్ అధిపతికి మొదటి కాల్ చేసాడు. నాడు ఆ  సెల్ ఫోన్ బరువు ఒక కిలో.

ప్రపంచపు మొట్టమొదటి సెల్ ఫోన్ 
అయితే ఆ తర్వాత పదేళ్లకు గాని, మొబైల్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. మార్చి 6,1983లో మార్కెట్లోకి వచ్చిన  మొబైల్ ఫోన్  అరగంట టాక్ టైం, 20 నిమిషాల బాటరీ లైఫ్ తో వచ్చింది. బ్యాటరీ చార్జింగ్ కు  10 గంటలు పట్టేది.
వాణిజ్యపరంగా 1979లోనే  జపాన్ రాజధాని టోక్యోలో మొట్టమొదటి సెల్యులార్ నెట్ వర్క్ నెలకోల్ప బడింది. ఆ తర్వాత అదే దారిలో డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే,స్వీడన్ల లో నెట్ వర్క్ లు వెలిశాయి. ఇక 1జి నెట్వర్క్ సేవలను 1983లో న్యూయార్క్ ప్రారంభించింది. GSM స్టాండర్డ్ 2జి సేవలను 1991లో ఫిన్లాండ్ అందుబాటులోకి తెచ్చింది.

SMS 
మొదటి SMSను యు.కె.లో   1992లో కంప్యూటర్ నుండి మొబైల్ కు పంపడం జరిగింది. ఆ తర్వాత 1993లో ఫిన్లాండ్ దేశం మొబైల్ నుండి మొబైల్ కు మొదటి SMSను పంపింది.

ఎందుకింత క్రేజ్?
సెల్ ఫోన్ కంటే ముందు ఎన్ని సమాచార సాధనాలున్నా వేటికీ లేని ఆదరణ సెల్ ఫోన్ కే ఎందుకని ఆలోచిస్తే చాలా కారణాలు కనిపిస్తాయి. మొదటగా... ఇది ఎక్కడికైనా మోసుకుపోగల సాధనం. పైగా ఇది కేవలం సమాచార మార్పిడి సాధనం మాత్రమే కాదు, వినోద సాధనం కూడా. ఎఫ్.ఎం., ఎస్సెమెస్, గేమ్స్, ఇంటర్నెట్, పిక్చర్ మెసేజ్, కెమెరా, వీడియో రికార్డింగ్..ఇలా ఫోనుకు అదనంగా ఎన్నో సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.  పైగా అతి తేలికైన, చిన్నని, చౌకైన మొబైల్ పరికరాలు ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చాయి.
దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు సాంకేతికతను అభివృద్ధి  పరచుకుంటూ రకరకాల సేవలను వినియోగదారులకు అందించ సాగాయి మొబైల్ సేవా  సంస్థలు. ప్రపంచం మొదటి మొబైల్ ఫోన్ చూసి కేవలం 30 సంవత్సరాలే. ఈ లోపులోనే ఎంతటి అభివృద్ది!
ముప్పై ఏళ్లలో సెల్ రూపు రేఖల్లో ఎంత మార్పు!
1993లో ఎరిక్సన్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు ప్రవేశ పెట్టింది. 2000 సంవత్సరంలో టచ్ స్క్రీన్, 5MP కెమెరాలను సెల్ కు జోడించింది symbrian  టెక్నాలజీ. 2001లో జపాన్ వారి docomo 3జి సర్వీసును  అందుబాటులోకి తెచ్చింది. 2002లో బ్లాక్బెర్రీ ద్వారా ఈ మెయిల్ సదుపాయం, 2007లో ఐ-ఫోన్ ద్వారా HD వీడియో, 2008లో గూగుల్ వారి android వల్ల మ్యాప్ , కాలెండర్, జీ మెయిల్ , వెబ్ బ్రౌసింగ్ సదుపాయాలు... ఇలా ఎన్నో సౌకర్యాలు అతివేగంగా, అందుబాటు ధరలకే  అరచేతికి రావడం వల్ల  సెల్ ఫోన్  ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యునికి చేరువయ్యింది.

అతి సర్వత్రా వర్జయేత్...!?
మితం మీరి ఏది చేసినా అది హితం కాదు. ఇది సెల్ ఫోన్ కూ  వర్తిస్తుంది. రోజుకు 30 నిమిషాల పాటు, 10 సంవత్సరాలు సెల్ ఫోన్ వాడితే బ్రెయిన్ కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో హెచ్చరించింది. అయితే ఈ విషయంలో భిన్న వాదాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా తలనొప్పి, నిద్రలేమి, అధిక రక్తపోటు, మెదడులో కణితి వంటి సమస్యలు సెల్ ఫోన్ ఎక్కువగా వాడే వారిలో ఉంటున్నాయని పరిశోధనలు చెప్ప్తున్నాయి. దీనికి కారణం విద్యుదయస్కాంత తరంగాల వికిరణం.

మొబైల్ ఫోన్  వాడుతున్నప్పుడు వెలువడే రేడియేషన్ వల్ల చెవి,మెదడు,కన్ను వంటి  శరీర భాగాలు వేడెక్కుతాయి. రెండు సెల్ ఫోన్ల నుండి వెలువడే వికిరణాలు ఒక కోడి గుడ్డును ఉడికించ గలవని ప్రయోగాలలో నిరూపించడం జరిగింది. అంటే ఈ లెక్కన మనం ఎక్కువ సేపు మాట్లాడుతుంటే తల భాగం ఎంత వేడెక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కనుగుడ్డు వేడెక్కడం వలన కాటరాక్టు సమస్యలు ఏర్పడి, చూపు దెబ్బతింటుంది అని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. అందుకే వీలైనంత వరకు సెల్లు కబుర్లు ఆపి, అవసరం మేరకే ఫోను వాడండి. పరికరాన్ని నేరుగా చెవి దగ్గర పెట్టుకోకుండా బ్లూ టూత్ వంటి  వైర్ లెస్  పరికరాలను ఉపయోగించండి. సిగ్నల్ అందని చోట, బ్యాటరీ చార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు, వికిరణం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, ఆ సమయాలలో మాట్లాడటం తగ్గించండి. ప్రతి సెల్ ఫోన్ పరికరానికీ SAR అంటే స్పెసిఫిక్ అబ్సార్ప్షణ్ రేట్ ఎంత అనేదీ రాసుంటుంది. అది తక్కువగా ఉండే పరికరాన్నే కొనండి. పిల్లలకు మరీ అత్యవసరం అంటేనే తప్ప సెల్ ఫోన్ ఇవ్వకండి. నేరుగా మాట్లాడటం కంటే మెసేజ్ పంపడమే మేలు.

రేడియేషన్ సంగతి అటుంచితే ఫోనులో మాట్లాడుతూ, లేక చెవుల్లో స్పీకర్లు పెట్టుకుని పాటలు వింటూ రోడ్డు దాటేవారు, రైలు పట్టాలు దాటేవారు, వాహనాలు నడిపేవారు  అనేక మంది ప్రమాదాలబారిన పడటం మనం వింటూనే ఉన్నాం. జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండవలసిన సమయాలలో కూడా సెల్ ను పక్కన పెట్టకపోతే ఎలా?

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మన సెల్ ఫోన్ మీద ఉన్నన్ని సూక్ష్మ క్రిములు మరెక్కడా ఉండవంట. సెల్తో పోలిస్తే చివరికి టాయ్లెట్ బేసిన్ కూడా బెటర్ అని సైంటిస్ట్ లు అంటున్నారు. ఎం చేస్తాం మరి! సెల్ ను  కడగలేం కదా.

ఈరోజు లేటెస్ట్ సెల్ ఫోన్ కొనడం ఒక ఫ్యాషన్. సెల్ ఫోన్లో ఎఫ్.ఎం. వింటూ రోడ్డుమీద నడవడం ఒక ఫ్యాషన్. రకరకాల రింగ్ టోన్లు పెట్టుకోవడం  అభిరుచికి నిదర్శనం. మూడ్ ని తెచ్చిపెట్టేవి, తెలిపేవి కూడా ఈ రింగ్ టోన్ లే. సరే! అందుబాటులో ఉన్న టెక్నాలజీని మన ఆనందం కోసం వాడటంలో తప్పు లేదు. కాకపోతే అంతగా బానిస కావడం, పిచ్చి అన్న రీతిలో వ్యసనంగా మార్చుకోవడం  అవసరమా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. సెల్ ను కొనే ముందే మనకు దాని అవసరం ఎంత వరకు అన్నది తెలుసుకోవాలి. చాలా మంది కొనేటప్పుడు అన్ని ఫీచర్ల కోసం చూస్తారు. కానీ వాడేటప్పుడు మాత్రం ఒకటి రెండు ఫీచర్లనే ఉపయోగించుకుంటారు.

ఇక మాట్లాడటం విషయానికి వస్తే రోజులో గంటల తరబడి ఫోన్ కు అతుక్కు పోయేవారున్నారు. అవతలి వారు ఎంత అత్మీయులైనా ఒకరికి ఎదురుగా ఒకరు ఉండి, ఒకరిని ఒకరు చూసుకుంటూ, తాకుతూ, ఒకరి కళ్ళలోని భావాలను ఒకరు చదువుతూ  భావ ప్రకటనలో ఎంతో ఆనందం వుంది.ఆ ఆనందాన్ని ఈ 'ఇ' తరం మిస్సవుతుందేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా  ఫోన్ ను ఫోన్ గానే వాడితే సెల్ అనేది ఒక వరం.












6, మార్చి 2012, మంగళవారం

రైలు చార్జీలు పెంచాల్సిందేనా?


గత ఎనిమిదేళ్లుగా రైలు చార్జీలు పెంచలేదు కాబట్టి ఈసారి పెంచాల్సిందేనని, లేకపోతే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి రైల్వే శాఖ దగ్గర నిధులు ఉండవని గౌరవ పార్లమెంటు సభ్యులు ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చారట. రైల్వే మంత్రి దినేష్ త్రివేది అధ్యక్షతన సోమవారం డిల్లీలో జరిగిన సంప్రదింపుల కమిటి సమావేశంలో పాల్గొన్న వారంతా ఈ తీర్మానం చేసాని వార్తలు. అందులో మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా ఉన్నారా లేదా అన్న ప్రశ్న పక్కన పెడితే, పార్లమెంటులో మన ఎంపీల సంఖ్యా తక్కువేమీ కాదు. ఇంకా చెప్పాలంటే కేంద్రంలో మన మద్దతుతోనే ప్రభుత్వం నిర్భయంగా పాలన కొనసాగిస్తోంది. అయినా ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో మన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. మనమడిగిన రైళ్ళూ ఇవ్వరు. కొత్త రైలు మార్గాల అభివృద్ధికి నిధులూ ఇవ్వరు. అయినా మనం చాలా వినయంగా తలాడించి వచ్చేస్తాం. కనీసం రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి ఒక గరీభి రధ్ వేయమని కూడా అడగం. ప్రస్తుతం రెండేరెండు గరీభి రథ్ లు , ఒకటి బెంగళూరుకి, ఇంకొకటి వైజాగుకి ఉన్నాయి. ఇతర రాష్ట్రాలను కలుపుతూ మరో గరీబ్ రథ్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక రైల్వే వారు ప్రయాణీకులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మాట్లాడుకుందాం. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి తెస్తామని, తెచ్చామని అనడం, మనం వినడం తప్పిస్తే, మనకెక్కడా నాణ్యమైన , రుచ్చికరమనిన తిండి దొరకనే దొరకదు. నీళ్ళ కాఫీ, చల్లబడిన టిఫినీలు, చప్పగా ఉండే బిర్యానీలు, అట్ట ముక్కల్లాంటి పూరీలు... ఇది రైల్వే స్టేషన్లో గాని, రైలులో గాని మనకు దొరికే ఆహారం. దీని మీద కంప్లైంట్ చేసే అధికారం కూడా లేదు. టాయిలెట్ పంపు నీళ్ళతో కాఫీ చేయడాన్ని, ఫోటోలతో సహా ఫేసుబుక్లో పెడితే చూసి తరించాం.
ఇక రిజర్వేషన్ చేయించుకుని రైలేక్కితే, రాత్రి వేళ కొన్ని గంటలు తప్పా మిగిలిన అన్ని సమయాల్లోనూ కాళ్ళ దగ్గర ఒకరు, నెత్తి దగ్గర ఒకరు ఎవరెవరో కూర్చుంటారు. వారిని మనం ఏమీ అనలేం. గొడవయితే ఎవరికీ కంప్లైంట్ చెయ్యలేం. సర్దుకు పోవాల్సిందే. వాళ్ళదీ తప్పు లేదు. ఎందుకంటే రైలుకు ముందొకటి, వెనుక ఒకటి పేరుకు మాత్రంగా రెండు జనరల్ భోగీలు ఉంటాయి. ప్రయాణీకుల రద్దీ ఆ రూట్లో ఎలా ఉంటుందో అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా సాధారణ బోగీలు వేయాలనే ఆలోచన ఎవరికీ రాదు. ఎందుకంటే మన ఎంపీలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ క్లాస్ లో పాస్ మీద ఉచిత ప్రయాణం చేస్తుంటారు కాబట్టి, వాళ్లకి ఈ కష్టాలు తెలీవు.
చేతిలో చిన్న పిల్లలను ఎత్తుకుని, మరో చేత్తో సామాను మోసుకుంటూ ఆడా, మగా అన్న తేడా లేకుండా ప్రయాణం చేస్తున్న ఆడపడుచుల గురించి ఎవరాలోచిస్తారు? ఒకసారి ఏ గోదావరి ఎక్ష్ప్రెస్స్ లోనో జనరల్ భోగీలో ప్రయాణించి చూస్తే తెలుస్తుంది. టాయిలెట్లో సైతం ముగ్గురు ఆడవాళ్ళు నిల్చొని ప్రయాణం చేస్తున్న దుస్థితి. డబ్బులిచ్చీ సౌకర్యాలకు నోచుకోక పోవడం అంటే ఇదే . ఇది అన్యాయమా, మోసమా...? రైల్వే వారే చెప్పాలి.
ముందు సౌకర్యాల మీద ద్రుష్టి పెట్టండి. డిమాండుకు తగ్గ రైళ్ళను వేయండి. ప్రతి రైలుకు డబ్బులు కురిపించే రిజర్వేషన్ బోగీలను తగ్గించైనా సరే జనరల్ బోగీలను పెంచండి. భద్రత కల్పించండి. సమయపాలన పాటించండి. అప్పుడు గౌరవ ఎంపీ గారు సెలవిచ్చినట్టుగా ప్రయాణీకులు చార్జీలు పెంచినా భరిస్తారు.

27, ఫిబ్రవరి 2012, సోమవారం

కమణీయం ఆ శిల్ప కళా సౌందర్యం















రుద్రేశ్వరుడు
ఆలయ ప్రాంగణం లోని ఒక మండపం
ఆలయంలోని పై కప్పు లోని భాగం
ఆలయం వెలుపల వినాయకుడు
నాగకన్య
అప్సరస



ఆలయ గోపురం

గత శివరాత్రి రోజున వరంగల్ జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళాను. ఆ రోజున లింగ దర్శనం చేసుకోవడం ఒక పుణ్య కార్యమైతే, అదే సందర్భంలో ఒక అద్భుత శిల్పకళా సంపదను చూడటం అదృష్టం. వరంగల్ నుంచి డెభై కిలోమీటర్ల దూరంలో, ఏటూరు నాగారం వెళ్ళే దారిలో, పాలంపేట గ్రామంలో ఉంది ఈ రామప్ప దేవాలయం. మేడారం జాతరకు వెళ్ళాలన్నా ఈ మార్గంలోనే వెళ్ళాలి.
శివరాత్రి కాబట్టి కాస్త హడావిడి కనిపించింది. గుడికి వెళ్ళే దారిలో కొన్ని దుకాణాలు కూడా వెలిసాయి. మామూలు రోజుల్లో ఎ హడావిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో, గత వైభవం గంభీరంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు, రుద్రేశ్వరుడు కైలాసం నుంచి రామేశ్వరానికి వెళ్తూ, దారిలో నందీశ్వరునితో సహా విశ్రమిస్తున్నట్టు ఉంటుంది.
రామప్ప దేవాలయ దర్శనం భక్తులకు, సౌందర్య ఆరాధకులకు ఏకకాలంలో తృప్తినిస్తుంది. అణువణువునా సౌందర్యాన్ని కూరి ఆరడుగుల ఎతైన నక్షత్రాకారపు పీఠంపై చెక్కిన ఆలయాన్ని అలా చూసి వచ్చేస్తే సరిపోదు. కాస్తంత తీరిక చేసుకుని నింపాదిగా , ఓపిగ్గా, ప్రతి మూలను, ప్రతి కోణం నుంచి చూడాలి. ఒకదాని వెంట ఒకటిగా పరుగెత్తే ఏనుగుల వరస, నాగకన్య, అప్సరసల వయ్యారపు భంగిమలు, కాపలాదారులుగా ఉన్న వినాయకులు, ప్రత్యేకంగా ఒక మండపంలో సర్వాలంక్రుతుడై కొలువు తీరిన నందీశ్వరుడు... ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. శిలను మైనపు ముద్దను మలచినట్టుగా మలచి ఇలాంటి అపురూప కళాఖండాలను తీర్చి దిద్దిన శిల్పులకు నాయకత్వం వహించి ఒక సామ్రాజ్య చరిత్రను అజరామరం చేసిన రామప్ప పేరును గుడికి, గుడిలో ఉన్న లింగేశ్వరుడికి కూడా పెట్టడంలో అతిశయోక్తి లేదు.

16, ఏప్రిల్ 2011, శనివారం

ధనం మూలం ఇదం జగత్!


'కోరికలే బాధలన్నిటికీ మూలం'

బోధి వృక్షం క్రింద అయిన జ్ఞానోదయంతో బుద్ధుడు చెప్పిన మాట ఇది. కాని మనిషిగా పుట్టాక కోరికలు లేకుండా
బ్రతకడం సాధ్యమయ్యే పనేనా? అందుకే 'నాది అనే మమతేరా బాధకు మూలం' అంటూనే 'ఏదీ లేదనుకుంటే అంతా శూన్యం' అని కూడా అన్నాడు ఒక సినీ కవి. ఆ శూన్యం అనేది జీవితంలో ఏర్పడకుండా ఉండాలంటే ప్రతి మనిషికి కొన్ని కోరికలు తప్పనిసరిగా ఉండాలి. కాకపోతే ఆ కోరికలకు హద్దులు నిర్ణయించడం, వాటిని నెరవేర్చుకునేందుకు ఉత్తమ మార్గాలను అనుసరించడం అనే విషయాలను మర్చిపోతే మాత్రం అనర్ధాలే జరుగుతాయి. మనబోటి సామాన్యులకు ఈ విషయం తెలీదు కాబట్టి, ఈ అమృత వాక్కులను మనం బాబాల నోట విని ఆచరించడానికి ప్రయత్నిస్తాం.
అయితే ఇంతమంది బాబాలున్న ఈ దేశంలో ప్రస్తుతం
ఇన్ని అనర్థాలు ఎందుకు జరుగుతున్నాయి అని అమాయక భక్తులు ఎవరయినా అడగవచ్చు! అన్నిటినీ మించిన అనర్థం... దేవుడిలాంటి సత్య సాయిబాబా విషయంలోనే జరగడం ఏంటని ఇంకా అమాయకులు ఎవరైనా హాశ్చర్య పోవచ్చు. 'కలికాలం !' అంటూ నేరాన్ని కాలం మీద నెట్టేసి, ఓసారి లెంపలేసుకుని, ఎవరి పనుల్లో వారు పడిపోవచ్చు. కాని ఈ అనర్థాలు మన మానాన మనల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తేనే కదా! తిండి గింజల దగ్గర నుండి పెట్రోలు వరకు, వొళ్ళు దాచుకునే బట్ట నుండి తలదాచుకునే ఇల్లు వరకు ...ఇలా ఏది కొనాలన్నా ఆకాశాన్ని అంటే ధరలు, జీతం పెంచమంటే లాభాలేవీ అని ఖాళీ చేతులు చూపించే యాజమాన్యాలు, బరువులూ-బాధ్యతలు, పెళ్ళిళ్ళు-పేరంటాళ్ళు ...ఇలా డబ్బుతో ముడిపడిన ప్రతీదీ ఈ అనర్థాలను పదేపదే గుర్తుకు తెచ్చి ఎక్కడో మంట పుట్టిస్తాయి.

భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే, భూమ్మీదుండే మనిషి మాత్రం ధనం చుట్టూ తిరుగుతాడనే మాట విన్నప్పుడల్లా
'ఆ ! మన గురించి కాదులే!' అనుకుంటాం. కాని ఆ మాట మనకు వర్తించేదే. అందులో తప్పు కూడా లేదు. ఎందుకంటే మన అవసరాలూ, కోరికలన్నీ ధనంతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి, చివరికి బంధాలను పదిలంగా ఉంచుకోవాలన్నా, సమాజంలో గౌరవంగా బ్రతకాలన్నా డబ్బే కావాలి కాబట్టి .. డబ్బు కోసం ఆరాటపడటం సిగ్గుమాలినతనం ఏమాత్రం కాదు. అయితే సిగ్గు వదిలేసి సంపాదించే మనుషుల్ని చూస్తే మాత్రం ఏవగింపు కలుగుతుంది.
ఎలా సంపాదించాం అన్నది వదిలేసి, ఎంత సంపాదించాం అన్నదే చూస్తున్నారు. అందుకు వీలైన అడ్డదారులన్నీ
తొక్కుతున్నారు. ఎందుకు సంపాదించాం అన్నది ఆలోచించకుండా సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అందుకు పదవుల కోసం ఆరాటపడుతున్నారు.
వైయ్యస్ పోయేటప్పుడు ఎంత పట్టుకు పోయాడో చూసి కూడా ఆయన కుమారరత్నం కోట్లను కాపాడుకునేందుకే పాట్లు
పడుతున్నాడు. కోటి రూపాయల ఆస్తి కేవలం ఏడేళ్ళలో నాలుగు వందల కోట్లకు పైబడి ఎదిగింది అంటే ... దాదాపు లక్ష కోట్ల అక్రమ ఆర్జన ఉందన్న ఆరోపణలు ఈరోజు ఆయన ఎదుర్కుంటున్నాడు అంటే ...ఇదంతా ఎవరి డబ్బు?
తమిళనాడు రాజా వారు ఒక లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశానికి పెద్ద బొక్క పెట్టారు. ఈ అవినీతి ఆరోపణల నుంచి
ద్రుష్టి మరల్చడానికి అధికార పార్టీ ఆడిన నాటకమే 'అన్నా హజారే' ఉద్యమం. లేకపోతె రాంగోపాల్ వర్మలాంటి ప్రముఖులకు కూడా తెలీని ఒక సామాజిక కార్యకర్త ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం ఏంటి? దానికి యువత (కార్పోరేట్ యువత- వీరి వెనుక బడా పారిశ్రామిక వేత్తలు ఉన్నారండోయ్! ) ఇంతగా స్పందించడం ఏంటి? కేవలం మూడే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దిగి రావడం ఏంటి? అసలీ ఉద్యమానికి ఇంత పబ్లిసిటీ ఏంటి? ఆలోచించ తగిన విషయం అవునా ? కాదా?
అన్నా హజారే ఉద్యమానికి వచ్చిన స్పందన పదేళ్ళ నుంచీ నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ మహిళ 'చాను షర్మిల' దీక్షకు ఎందుకు రాలేదు? అవినీతిపై ప్రజలకు ఉన్న ఆగ్రహమే హజారే దీక్ష సఫలం కావడానికి కారణమా? అసలు
రాజకీయ అండ లేకుండా ఏ ఉద్యమం అయినా విజయవంతం అవుతుందా?
ఇక మరో అనర్థం ... సత్య సాయిబాబా ఏమయ్యాడో తెలీని పరిస్థితి రాష్ట్రంలో ఉండటం.
ఒక ట్రస్ట్ లక్షన్నర కోట్లు సంపాదించే దాకా ప్రభుత్వాలు ఏం చేసాయి?
ఒక వ్యక్తిని (సత్య సాయి అన్న విషయం పక్కన పెడదాం) కొంత మంది వ్యక్తులు దాచేసి , అతని గురించి ఏ విషయమూ
ఎవరికీ తెలియనివ్వక పోతుంటే చట్టం ఏం చేస్తుంది? అందులోను లక్షలాది మందికి ఆరాద్యుడైన సాయి అతను.
సరే! అసలు ఈ అనర్థానికి కారణం ఏంటి?
లక్షన్నర కోట్లు ట్రస్ట్ లో పోగు పడేదాకా బాబా ఏ కార్యక్రమాలూ చేయకుండా ఎందుకున్నారు? వచ్చిన డబ్బును
వచ్చినట్టు ప్రజల కోసం ఖర్చు పెడితే బాబాకు ఈ అవస్థ పట్టేదా?
ఇంత డబ్బును ఎందుకు దాచుకున్నట్టు? ఆయనకు కూడా ధన వ్యామోహం ఉందా?
అసలు ఇంత డబ్బు భక్తులే ఇచ్చారా?
మరి మథర్ థెరిస్సా దగ్గర ఇంత డబ్బు ఎందుకు లేకుండా పోయింది? మథర్ థెరిస్సా సేవల కన్నా బాబా మాయలే
గోప్పవనా? ఆమెకు దూరంగా నే ఉన్న రాజకీయ నాయకులు బాబాను మాత్రం ఎందుకు తరచూ దర్శించుకునే వారు?...ఇలా లక్షన్నర కోట్ల ప్రశ్నలు. లీలగా దొరుకుతున్న జవాబు ఏంటంటే ...
బాబాలు కూడా మనుషులే . వారూ కోరికలకు, వ్యామోహాలకు అతీతులు ఏమాత్రం కాదు. భక్తులారా! మీ నమ్మకం
విలువ లక్షన్నర కోట్లు. అదే నమ్మకం మీమీద మీరు పెంచుకుంటే ...ఎంత సంపాదించే వారో!? ఆలోచించండి.
సత్య సాయి ఇలా చావు బతుకుల మద్య ఉంటె , ఆయన ఆశీర్వాదాలు అందుకున్న గాయని చిత్ర కూతురు ఓ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయింది. ఎక్కడ దేవుని మహిమ?


11, మార్చి 2011, శుక్రవారం

పదండి ముందుకు ...పదండి త్రోసుకు...

పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!దారి పొడుగునా విధ్వంసం సృష్టిస్తూ,మహనీయులను అవమానిస్తూ,సంస్కర్తలను చీత్కరిస్తూ,మేధావులపై దాడి చేస్తూ...పెళ పెళ పెళ పెళ విగ్రహాలు కూల్చుతూ...పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
శ్రీశ్రీ యెవ్వడు ? నాడు (1969)సమైఖ్య నినాదం ఇచ్చిన వాడు,శతాబ్ది కవి ఐతేనేమి! ఆతడు
తెలంగాణా ద్రోహి.
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
అన్న గురజాడ ఎవ్వడు?సంస్కర్త అయితే ఏంది గొప్ప?వాడు సీమాంద్రుడు.

చందమామ రావే
జాబిల్లి రావే యని
సంస్కృతికి గోరుముద్దలు తినిపించిన
సంకీర్తనాచార్యుడు,బ్రహ్మమొక్కటే ,పర బ్రహ్మమొక్కటే యని
నాడే సర్వమానవ సమానత్వాన్ని
ప్రభోదించిన వాడు, అయితేనేమి?వాడు సీమాంధ్ర దేవుడైన
తిరుమల రాయడిని కీర్తించిన వాడు
అన్నమయ్యను కూల్చాలె.పదండి ముందుకు,  పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
పేరులోనే రాయలని పెట్టుకుండు.
'
దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నడు గాని తెలంగాణ మాట్లాడిండా? లే !కూల్చండ్రి వాణ్ని. ఆది కవి నన్నయ్య , అయితే ఏంది?తెలుగు రాసిండు కాని తెలంగాణలో రాసిండా?గాడేందుకు మనకు కూల్చండ్రి.
ఏడకెళ్ళి వచ్చిండు, కాటన్
తన - పర, ప్రాంతీయ భేదాలు
ఎరుగని అపర భగీరధుడు.అయితేనేమి ఎరుగకుండానే
ఆంధ్రులకు మేలు (పాపం) చేసిన సీమాంద్రుడు.
గీడెవ్వడు! సిద్ధేంద్ర యోగంట...కూచిపూడి నేర్పిండ? చల్ తీయ్ !జాషువా అని దళిత రచయిత
పొలిటికల్ లీడరయితే లొల్లి సేస్తరు గాని ,రచయిత అయితే దళితుడైన గాని
అడిగే వారుండరు. ఇది ఆంద్ర గబ్బిలం.కూల్చండ్రి.ఈడేవ్వడో సి. ఆర్ . రెడ్డి
మీటింగ్ల మీదికి రాల్లేస్తే
'
రాజకీయాల్లో రాతియుగం ప్రవేశ పెడుతున్నారు'అని అన్నడు. మనది గాంధీ నాయకత్వమా ?లే ...! కేసీయార్ నాయకత్వం.అసెంబ్లీ లోనే 'కొట్టండి రా వాడ్ని' అని
జేపీని కొట్టించిన కేటీయార్ నాయకత్వం మనది.ఇదేమన్న దండి మార్చా ? కాదు! మిలియన్ మార్చ్ !పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
త్రిపురనేని రామస్వామి చౌదరి
పేరులోని చౌదరిని తీసేసుకున్న వాడు,'
'
విల విల యేడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండ...జీవ రహితంబగు బొమ్మకు (దేవుడికి) ఇండ్లు వాకిండ్లు,పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల ...' అని
మనుషులకు తప్ప రాతి బొమ్మకు నాడే
విలువనియ్యని హేతువాది, వీనికేందుకు విగ్రహం?కూల్చండ్రి. బ్రహ్మ నాయుడు వీడు, నేడు
ప్రతి అవకాశ వాది చేసే సహపంక్తి భోజనం నాడే చేసిన
సమభావ వాది . అయితేనేమి పల్నాటి వాడు
కూల్చండ్రి వాణ్ని.పదండి ముందుకు,పదండి త్రోసుకు,పోదాం పోదాం పైపైకి!
మిలియన్ మార్చ్ పుణ్యమా అని పై మహానీయులందరినీ మరోసారి స్మరించుకునే సందర్భం ఎదురయ్యింది. కోదండరామ్ నాయకత్వానికి జేజేలు.


8, మార్చి 2011, మంగళవారం

నిజంగా సగమేనా...?


తరతరాలుగా ఆమె అడుగుతూ వచ్చింది సగమే. ఎందులో సగమో ఆమెకే తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆకాశంలో సగంఅంది సమాజం. అందని ఆకాశంలో కాదు, అంది వచ్చే అవకాశంలో సగం కావాలని పోరాడింది నిన్నటి తరం. ఫలితంగాఈరోజు నింగి నుంచి నేల దాకా ఆమె అన్నింటా ఉంది. చదువుకుంటోంది, ఉద్యోగం చేస్తోంది, రచనలు చేస్తోంది, రాజకీయాలను నడుపుతోంది, సంస్థలను దిగ్విజయంగా నిర్వహిస్తోంది, సంఘ సేవ చేస్తోంది... ఇంకా ఎన్నో చేస్తోంది.
సగమే కాదు ఇంకా ఎక్కువే సాధించింది ఆమె.
అయితే మగవాడి మనసులో మాత్రం సగం స్థానాన్ని సాధించలేక పోతుంది. ఫలితంగానే ప్రేమ పేరిట వేధింపులు, దాడులు, హత్యలు, అఘాయిత్యాలు. పని చేసే చోట నుంచి రోడ్డుపై తిరిగే దాకా సాధింపులు. రాష్ట్ర గవర్నరు బంగాళానుంచి స్వామీజీ ఏకాంత మందిరం వరకు ఆమె విలాస వస్తువే అయ్యింది. ఆమె వ్యక్తిగత జీవితం న్యూస్ చాన్నెల్లసేన్సేషనే అయ్యింది. ఇంకా ఈనాటికీ ఇంట్లో అందరికీ వండి పెట్టే బాద్యత నుండి ఆమెకు విముక్తి కలగలేదు. బయటకువెళ్ళే పెళ్ళాం మీద మొగుడికి అనుమానం కలగడం మామూలు విషయమే అయ్యింది.
సమాజం సగం అవకాశాలను ఇచ్చి ఆమె సామర్థ్యాలను వాడుకుంటుంది తప్ప తగిన గౌరవాన్ని ఇస్తుందా అంటే లేదనేచెప్పాలి. సమాజానికే కాదు ప్రభుత్వానికే ఆమె మీద గౌరవం లేదు. ఉంటే ఆయేషా కేసు ఎప్పుడో పరిష్కరించబడేది. మహిళను గౌరవించే, రక్షణ కల్పించే చట్టాలు లేక కాదు. అటు చట్టాల మీద కాని, ఇటు మహిళల పట్ల కాని గౌరవం లేని నాయకులు ఉండడం మూలంగానే ఈ దురవస్థ.
నిజానికి సాధికారత కోసం, స్వాతంత్ర్యం కోసం ఆమె చేసిన పోరాటమే, ఆమె సాధించిన గెలుపే ఆమె పాలిట శాపంఅయ్యింది. తన ఇష్ట ప్రకారం తను దేన్నయినా పొందే అధికారం తనకు ఉంది. అందుకే ఆమె తనకు ఇష్టమైన వాడ్నిప్రేమిస్తుంది. ఇష్టమైన వాడ్ని పెల్లిచేసుకుంటుంది. ఇష్టమైన వాడితో సుఖ పడుతుంది. అయితే ఈ స్వేచ్చనే సమాజంఅపార్థం చేసుకుంటుంది. కారణం మగాడు ఇంకా ఆమెను తనతో సమానంగా చూడలేక పోవడమే. తన మనసులోఆమెకు సగం ఇవ్వకపోవడమే.
ఆమె స్వేచ్చను గౌరవించే రోజు రావాలి. ఆమె ఇష్టాన్ని అంగీకరించే రోజు రావాలి. ఆమె కోరికలను అర్థం చేసుకునే రోజురావాలి. ఆమె కష్టాన్ని పంచుకునే రోజు రావాలి. మహిళాదినోత్సవ సందర్భంగా ఇది నా ఆకాంక్ష.