పేజీలు

20, సెప్టెంబర్ 2014, శనివారం

చక్కనయ్యా చందమామా... ఎక్కడున్నావు... ?


''మొన్న పున్నమి రాతిరి  
నీ ఒడిని నిద్దుర పోతిమి 
తెల్లవారి లేచి చూచి 
తెల్లబోయాము... ఘొల్లుమన్నాము... ''
భార్యాబిడ్డల్ని వదిలేసి ఉద్యోగ సంపాదనలో ఊరూరా, రోడ్లు పట్టి తిరుగుతున్న తండ్రి ఒకచోట. తమని వదిలేసి వెళ్ళిపోయిన నాన్న మీది బెంగతో తల్లడిల్లుతూ, అన్ని దిక్కులా వెతుకుతూ, దిక్కుతోచక రోడ్డున వెళుతున్న  పిల్లలు మరోచోట. తండ్రిని వెదుకుతున్న ఆ  పిల్లల నోట వచ్చే పాట ఇది. అపుడాయన హావభావాలు చూసి, అయ్యో పాపం! ఆయనకేదయినా ఉద్యోగం దొరికితే బాగుండు అనుకుంటూ చెమర్చిన కళ్ళతో చూశాను.   సినిమా పేరు భార్యాబిడ్డలు. 
'ఆకులు పోకలు ఇవ్వద్దూ ... నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ...' అంటూ అదే సినిమాలోని హుషారు పాటని నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు అల్లరి చేస్తూ పాడుకున్నా. 

ఆ తర్వాత 'రైతు కుటుంబం' 
జిల్లాయిలే జిల్లాయిలే...  అంటూ కాంచనతో ఆయన కవ్వింపు పాట. 

గాంధీ పుట్టిన దేశమా ఇది? నెహ్రు కోరిన సంఘమా ఇది?... పవిత్రబంధం సినిమాలో ఆయన సంఘాన్ని నిలదీస్తే, అదే పాటని స్కూల్లో ఆవేశంగా పాడి చప్పట్లు కొట్టించుకున్నా. 

మంచి రోజులోచ్చాయ్, దత్తపుత్రుడు, దసరాబుల్లోడు ... అదేంటో చిన్నప్పుడు అన్నీ ఆయన సినిమాలే చూసాం. ఎందుకంటే మా ఇరుగుపొరుగు అమ్మలక్కలంతా ఆయన అభిమానులు. విడుదలైన ఆయన సినిమాలన్నిటికీ వాళ్ళు వెళ్తూ అమ్మను పిలిచే వాళ్ళు. అమ్మ కొంగు పట్టుకుని నేనూ వెళ్ళాను. 

విశాఖపట్నం, కాకినాడ నగరాలనుంచి విజయవాడకు వచ్చింది మా కుటుంబం. మరుసటి రోజు వీధిలో పరిచయం చేసుకున్న నాలుగో తరగతి వోడు అడిగాడు. 'నువ్వు ఏ పార్టీ' అని. పార్టీ అంటే అప్పుడే రెండో తరగతి పాసయిన నాకు అర్థం కాలేదు. 
'అదే ఎన్టీయారా ఏయన్నారా? నువ్వు ఎవరి పార్టీ?' 
'వాళ్ళెవరు?'   
'వాళ్ళు తెలీదా?' సినిమా పేర్ల సాయంతో చెప్పారు వాళ్ళు. 
' ఓసి వాళ్ళేనా! రామారావ్, నాగేస్వర్రావులను అలా కూడా పిలుస్తారా? అయితే ఇంకా డౌట్ ఏంటి? నేను ఏయన్నార్ పార్టీ' అన్నాను.   
' యే ... ఏయన్నార్ పార్టీనా? మీ హీరోకి అసలు ఫైట్ చేయడమే రాదు.' ఎగతాళి చేశారు.  
'ఫైట్లు రాకపోతేనేం ప్రేమించడం వచ్చు.' అన్నాను.

అవును! అప్పటికే ప్రేమనగర్ సినిమాను చూసి ఉన్నాను. తేట తేట తెనుగులా అంటూ హీరోయిన్ వంక ఒకలా చూస్తుంటే ఆవిడెంత సిగ్గుపడిందో! లవర్ బాయ్ గా ఆయనకెంత పేరో! సెక్రటరీ సినిమా చూస్తున్నప్పుడు మా వెనుక కూర్చున్న ఆడవాళ్లు ''వాడు చూడే. ఆ చూపు చూడు. అది చాలే.'' అయన గురించి ఇలాంటి కామెంట్స్ ఆ రోజుల్లోనే విన్నాను. హీరొయిన్ కీ తనకీ ఇగో ప్రొబ్లెమ్స్. దగ్గరవ్వాలనుకున్నప్పుడల్లా దూరంగా నెట్టే ఆవిడ పనులకు, ప్రవర్తనకు, మాటలకు, అపార్థాలకు ఆమెను ఏదో చేసేయ్యాలన్నంత కోపం. కానీ ఏమీ చెయ్యలేనంత ప్రేమ. ఆ సమయంలో ఆమె వంక మాట్లాడకుండా ఓ లుక్కు. ఈ పేరాడు భావాలనీ ఆయన ఒక్క చూపులో పలికించేవాడు. ఇక్కడ వాణిశ్రీ గారి గురించి కూడా చెప్పుకోవాలి. అలాంటి పాత్రలకు అమెకెంత పేరో! వారిద్దరిదీ ఎంత మంచి జోడీ!

'మీ ఏయన్నారుకు ప్రేమించడం కూడా రాదు. ఫెయిలయ్యి మందు కొడతాడు.' అన్నాడు నాలుగోతరగతి వాడు.
'మా వాడు మందు కొట్టినట్టు మీ వాడు కొట్టగలడా? ప్రేమనగర్ చూడు.' అన్నాన్నేను.

దేవదాసు సినిమా పోస్టర్ మీద అక్కినేని స్టిల్ నన్ను చాలా రోజులు వెన్నాడింది. చిందర వందరగా ఉన్న ఉంగరాల జుట్టు నుదిటిన వేలాడుతుండగా, మత్తెక్కిన కళ్ళతో, పీక్కుపోయిన ముఖంతో, చేతిలో మందు గ్లాసుతో ఉండేదా స్టిల్లు.  ఆ సినిమాని పెద్దయ్యాక ఎప్పుడో ఇంటర్ చదువుతున్నప్పుడు చూడగలిగాను. కొన్ని సినిమాలంతే. వాటిని మళ్ళీ తీయలేరు. ప్రేమలో ఓడినోడు మందు కొడుతూ తిరుగుతాడనే భ్రమ సమాజంలో కలిగిందంటే అది దేవదాసు వల్లే. తనను కాదన్న ఆడదాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి అలా మందు కొట్టి దేవదాసు స్టైల్లో కనిపించే వారు అప్పటి యువత. అంటే చివరికి నేను కూడా దేవదాసు లాగే చస్తాను అని బెదిరించడం అన్నమాట. వర్కవుట్ అయ్యిందీ లేనిదీ నాకు తెలీదు. ఆ సినిమా ప్రభావం సమాజంపై అంతగా ఉండింది ఆ రోజుల్లో. అదంతా అక్కినేని వల్లే. అందుకోసం తాగుడు ఫ్యాషన్ కాదు, నేను తాగుబోతూనే కాదు అని ఎన్ని సార్లు చెప్పుకోవలసి వచ్చిందో ఆయనకి.

బాటసారి సినిమా గురించి చెప్పుకోకూడదు. చూసి ఊరుకోవాలి. ఎందుకంటే ఎవరికి వారికి ఒక అవ్యక్తానుభూతిని విడివిడిగా మిగిల్చే సినిమా అది. అక్కినేని ఉత్తమ చిత్రాల్లో అది మొదటిదనే చెప్తాన్నేను.

'మా ఎన్టీవోడు రాముడు, కృష్ణుడు. దేవుడంటే మా వోడే. మీ నాగ్గాడు చేయగలడా?' ఇంకో యాంగిల్లో నన్ను ఓడించడానికి చూశాడు నాలుగో తరగతోడు.

విజయవాడలో ప్రజలకు సామాజిక, రాజకీయ చైతన్యంతో పాటు సినిమా పిచ్చి కూడా ఎక్కువే. అది సినిమా వాణిజ్యకేంద్రం. అక్కడి ప్రజల తీర్పు సినిమా భవిష్యత్తును నిర్ణయించేంత కచ్చితం. నా చిన్నతనంలో ప్రతీ వోడు ఎన్టీవోడి పార్టీ లేదంటే నాగ్గాడి పార్టీ. ఇవి ఆ మహానటులకు ప్రేమగా వారు పెట్టుకున్న పేర్లు. అప్పుడప్పుడూ వాళ్ళ వాళ్ళ వెండితెర వేల్పుల మహిమల గురించి వాదనలు శ్రుతిమించి కొట్లాటల వరకూ వెళ్ళేవి. ఎంతగా అంటే గాల్లోకి సోడాబుడ్లు లేచి పేలేంతగా. అలా సినీ వినీలాకాశాన్ని సూర్యుడు, చంద్రుడూ పంచుకున్నట్టు పంచుకున్నారు వాళ్ళిద్దరూ. మిగిలిన వాళ్ళంతా స్టార్లు అంటే చుక్కలన్నమాట. సూపర్ స్టార్, రెబెల్ స్టార్, మెగా స్టార్ ఏవైనా అవి చుక్కలే. సూర్య చంద్రుల్లో సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు అంటే స్వభావ రీత్యా చంద్రుడు ఎయన్నారే. ఎన్టీయార్ సూర్యుడే.
  

'మీ వోడు దేవుడైతే మా వోడు భక్తుడు.' తగ్గలేదు నేను.

అవును మరి. భక్తుడు లేకుండా దేవుడున్నాడా? ఏయన్నార్ నాస్తికుడంటే నమ్మబుద్ధి కాదు. విప్రనారాయణ, బుద్ధిమంతుడు, భక్త తుకారాం, చక్రధారి ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో భక్తుడిగా నటించి ఎందరినో తన భక్తులుగా చేసుకున్నాడు. ఆ అరమోడ్పు కళ్ళు, ప్రశాంత వదనం, భేషజం లేని చిరునవ్వు. భక్తితో అంత సాత్వికత అప్రయత్నంగానే వచ్చేస్తుంది. కానీ ఈ విషయం నాస్తికుడైన ఎయన్నారుకు ఎలా తెలుసు?! ఎలా అంటే ఆయన చదువుకోకపోయినా ఇంగ్లీషులో మాట్లాడలేదా. అలాగే ఇది కూడా.  చేసే పని పట్ల నిబద్ధత ఉంటె అన్నీ అవే తెలుస్తాయి.

సీతా రామయ్య గారి మనవరాలు - ఇంటిని విడిచి వెళ్ళిన కొడుకు తర్వాతెప్పుడో తను రాకుండా మనవరాలిని పంపాడు. అది సరే, ఓ ఊత కర్రను కూడా కానుకగా పంపాడు. ఇంకా కోపం వచ్చింది ఆ తండ్రికి.  దాన్ని ముట్టుకోలేదు. ఆ తరవాత తెలిసింది, కొడుకు కనరాని లోకాలకు వెళ్లిపోయాడని. ఒక్కసారిగా కుప్పకూలిపోతుండగా ఆ ఊతకర్రనే ఆసరాగా తీసుకోవలసి వచ్చింది. అలాంటి హృదయవిదారక సన్నివేశంలో ఆయన పలికించించిన భావాలు తలచుకుంటేనే కళ్ళు చెమర్చుతాయి. ఎందుకో తెలీదు ఆ ముఖంలో బాధ, చూసే వారి గుండెల్ని పిండేస్తుంది.  బాధ తాలూకు బరువును ఆయన మరింత పెంచుతాడు. బాధే సౌఖ్యమన్న భావాన్నీ అందులోనే చూపిస్తాడు.

ఆయన నటనా జీవితం ఎంత పరిపూర్ణమైనదో, ఆయన వ్యక్తిగత జీవితమూ అంత నిండైనది. కేవలం పిల్లలకు తెలుగు సంస్క్రతి, తెలుగు భాష అందించడానికి ఆయన మద్రాసు నుండి హైదరాబాదుకు మకాం మార్చారంటే కుటుంబానికి, సొంత ప్రాంతానికి ఎంత విలువను ఇచ్చాడో తెలుస్తుంది. హీరోగా క్షణం తీరికలేకుండా ఉన్న వేళ, అవకాశాలు వెల్లువెత్తుతున్న వేళ అయన తీసుకున్న నిర్ణయం చాలా సాహసంతో కూడుకున్నది. తన మీద తనకు ఎంత నమ్మకం!? అలాగే నిర్మాతలంతా అయన కోసం ప్రయాసపడి ఇక్కడికే వచ్చి సినిమాలు తీశారు. కొన్నాళ్ళకు చిత్ర పరిశ్రమ అంతా ఆయన వెంటే తరలివచ్చింది. జమాజెట్టీల వంటి వారినే కూరలో కరివేపాకులా తీసిపడేసే సినీ లోకంలో ఒక నటుడి కోసం పరిశ్రమే కదిలి వచ్చిందంటే అదొక రికార్డు కాదా. ఆయన స్టామినా ఏంటో వేరే చెప్పాలా. క్రమబద్ధమైన జీవితం, నిలకడైన ప్రయాణం, నిరాడంబరత, నిరంతర శ్రమ అన్నీ ఆయన విజయానికి సోపానాలు. నిండైన జీవితానికి నిదర్శనాలు.                   


ఆయన నూరేళ్ళూ మన మధ్యే ఉంటాడని అనుకున్నారంతా. సిన్మాలు చేయకపోయినా వైభవోపేతమైన తెలుగు సినీ చరిత్రకు ఆయనొక సజీవ సాక్ష్యంగా కనబడేవారాయన.  ఆయన చనిపోయినప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనిపించలేదు. ఒక శకం ముగిసిందనిపించింది. నా చిన్ననాటి స్మృతులను ఎవరో నా నుంచి లాక్కెళ్ళి పోయినట్టు అనిపించింది. అందుకే ఆనాటి పాట మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది.

చక్కనయ్యా చందమామ ... ఎక్కడున్నావు ...

ఆయన లేకుండా జరుగుతున్న మొదటి అక్కినేని జయంతి ఇది. ఈ సందర్భంగా ఆయన స్మృతికి నివాళి ఇది.                                          
   
                   

17, సెప్టెంబర్ 2014, బుధవారం

దీపికకు కోపం వచ్చింది!



దీపిక అంటే మన బాలీవుడ్  నటీమణి దీపికా పడుకోన్. కోపం ఎందుకు సినిమాల్లేవా అంటే ఎందుకు లేవు, హిట్ల మీద హిట్లు కొట్టేస్తూ ప్రస్తుతం బాలీవుడ్ ని మహారాణిలా ఎలేస్తోంది దీపిక. మరి ఇంకా ఎందుకు కోపం? మీడియా వాళ్ళేమైనా ఎవరితో అయినా లింకు పెట్టేశారా అంటే అది ఆమెకు మామూలే. ఏది మామూలు అని మళ్ళీ అడక్కండి. బాయ్ ఫ్రెండ్స్ ని తరచూ మార్చినట్టు మీడియా ఎప్పటికప్పుడు రాయక పోతే హీరోయిన్లకు, ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లకు తమ డిమాండ్ తగ్గిపోయిందేమో అని డౌటొచ్చేస్తది. మరెందుకు కోపం వచ్చింది అంటే కారణం ఇది. 
సినిమాలో కాకుండా బయట మరేదో సందర్భంలో దీపిక తన వక్షోజాలు బహిర్గతం అయ్యేలా వస్త్రాలను ధరించి కనబడిందట. ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా అనే  ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రిక, 'దీపిక బాలీవుడ్ లో కాకుండా బయట కూడా ఇలా ప్రదర్శిస్తోంది ' అన్నట్టుగా కామెంట్ రాసి జనాల మీదికి వదిలేసింది. (అంటే సినిమాలో ప్రదర్శిస్తే తప్పు లేదని ఆ పత్రిక అభిప్రాయమా? లేక బయట కూడా ఈ ఖర్మ ఏంటని బాధా?) అది చూసి దీపికకు కోపం వచ్చింది. 'స్త్రీలను గౌరవించడం రానప్పుడు మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదు' అంటూ ట్వీట్ గా దులిపేసింది. అంతటితో ఊరుకోలేదు. 'అవును! నేను ఆడదాన్ని. నాకు వక్షోజాలు ఉన్నాయి. మీకేంటి సమస్య?' అంటూ బోల్డ్ గా తిరగబడింది.  ఈ స్టైలు చూసి జనాలు ముగ్దులై పోయారు. ఆహా! ఏమడిగింది అని అంటూ ఆమెకు మద్దతుగా ట్వీట్లు రాసారు. హీరో షారూఖ్ ఖాన్ కూడా ఆమెకు అండగా నిలిచాడు. చివరకు సదరు పత్రిక ఆ వార్తను డిలీట్ చేసేసింది. ఇంకేం కథ ముగిసిందిగా. అయిపోయిన పెళ్ళికి బాజాలు అన్నట్టు ఇప్పుడీ బ్లాగుడేందుకు అనంటారు అవునా? ఇది అయిపోయిన కథ కాదు. నడుస్తున్న చరిత్ర. అందుకని దీపికను అడగాల్సిన విషయాలు కొన్నున్నాయి. 

                                                                                             
 మహిళా సాధికారత గురించి ఆవిడకు ఏం తెలుసు?
ఈ రకమైన వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏంటి? వివక్షతకు తావు లేకుండా సామాజిక వనరులు, అవకాశాలు, అధికారాలను అందుకోడానికి అర్హతలను సంపాదించుకునే అవకాశాన్ని మహిళకు ఇవ్వడమే 'సహా అధికారం'. అంతేగాని ఇలాంటి ప్రదర్శనకు సాధికారతకు సంబంధం లేదు. మీ మాటలు  విన్న అమ్మాయిలు సాధికారత అంటే ఇదేనేమో అనుకుని మిమ్మల్ని అనుసరిస్తే వాళ్ళ గతేం కాను. మీకేం? మీరు ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే కారులో వెళ్తారు. అంగరక్షకులను పెట్టుకుంటారు. ఇంకా కావాలంటే ఫ్రండ్స్ ఉండనే ఉంటారు. ఏం జరిగినా షారుఖ్ లాంటి వాళ్ళు మీకు బాసటగా నిలుస్తారు. కానీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఒక మధ్యతరగతి అమ్మాయి ఇలా బయటకు రావాలంటే ఆమె రోడ్డు చివర వరకూ వెళ్లి ఆటో ఎక్కాలి. ఆఫీసుకు వెళ్లి అందరి మధ్యా గడపాలి. ధన మదాంధులు, అధికార మదాంధులు ... ఇలా సాహిత్యపరంగా అంధులని పిలవబడే డేగ కళ్ళ నుంచి తప్పించుకు తిరగడం సాధ్యమా?
ఒక్క మాటకు సమాధానం చెప్పండి. సినిమాల్లో మీ అంగాంగ ప్రదర్శన ఎందుకోసం? ఫంక్షన్ లలో కూడా ఆ ప్రదర్శన ఎందుకు? పబ్లిసిటీ కోసమేగా? మీరు సినిమా నటులతే మాత్రం అందాల ప్రదర్శన చెయ్యాలని రూలుందా? చెన్నై ఎక్స్ ప్రెస్ ను జనం చూడలేదా?

శ్వేతాబసుకు మీ మద్దతు తెలిపారు అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆమె గురించి మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం ఆ దారిలో వెళ్తే తప్పేంటి అన్నారు. బొత్తిగా సామాజిక బాధ్యత లేదా మీకు? వ్యక్తిగతంగా ఎవరు ఎవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఆమె చేస్తున్నది వ్యాపారం. అంటే అది సామాజిక సమస్య అయ్యింది. వ్యాపారంలో డబ్బు ఉంటుంది. బ్రోకర్లు ఉంటారు. తమ క్లయింట్లకు కొత్త రుచులు చూపించడానికి ఇష్టపడి వచ్చే అమ్మాయిలనే కాదు. అమాయకపు పిల్లల్ని కూడా బలవంతంగా ఆ వృత్తి లోకి దింపడం జరుగుతుంది. మీలాంటి ఇలాంటి ప్రశ్నలు వేసి గొప్ప అనుకుంటారు. కానీ ఆ మాటలు ఒక సామాన్యమైన ఆడపిల్లని ఎంతగా ప్రభావితం చేస్తాయో మీకు తెలుసా? మీ డబ్బున్న వాళ్ళ బలుపుని, విచ్చలవిడి సంస్కృతిని పేద, మధ్య తరగతి పై ఎందుకు రుద్దుతారు? 

మీకు ఉన్నాయి కదా అని ప్రదర్శించడమేనా? 
సమస్య ఏంటి అని అడిగారు కదా! అలా మిమ్మల్ని చూసిన వాళ్ళు అందుబాటులో ఉన్న మరో పిల్లలో మిమ్మల్ని చూసుకుంటున్నారు. అదీ ఖర్మ. ఒక రాజకీయ నాయకుడి ఆన్ లైన్ అక్కౌంట్ కి లక్ష లైకులు వస్తే ఎక్కువ. అలాంటిది రెండు హిట్ సినిమాలు కూడా లేని హీరోయిన్ కి మాత్రం ఇరవై, ముప్పై లక్షల లైకులా? వాళ్ళంతా మీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళా? మీ అందాలు నచ్చిన వాళ్ళా? ఆలోచించండి.           

అయ్యా షారూక్ మహాశయా!
అమీర్ ఖాన్ నగ్నంగా కనిపిస్తే అది ప్రతిభ అనిపించుకోదు అన్న నీకు దీపిక ఎలా కనిపించినా తప్పులేదా? ఏమిటీ హిపోక్రసీ?
                                                                                           
   

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

పాపం! శ్వేతాబసు!!

      పన్నెండేళ్ళ క్రితం అంటే 2002లో 'మక్డీ' అనే హిందీ చిత్రం చూశాం. మక్డీ అంటే సాలీడు అన్నమాట. ఒక పల్లెటూరులో ఒకానొక పాడుబడిన ఇల్లు. ఆ ఇంటి గేటు దాటి లోపలి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. ఆ ఇంట్లో మంత్రగత్తె ఉందని, ఆవిడే అందరినీ మాయం చేసేస్తుందని పుకార్లు. తన చెల్లెలి కోసం అలాంటి ఇంట్లోకి వెళ్తుంది ఒక తెలివైన పదేళ్ళ పాప. తన చెల్లెలిని రక్షించుకోవడమే కాకుండా ఆ ఇంటి రహస్యాన్ని, మంత్రగత్తె మోసాన్నీ బట్టబయలు చేసి ఊరి వారందరితో వహ్వా అనిపించుకుంటుంది ఆ పాప. మంత్రగత్తెగా షబానా అజ్మి నటించగా చున్ని, మున్నీ అనే కవల అక్కాచెల్లెళ్ల పాత్రల్లో శ్వేతా ప్రసాద్ అనే బాలనటి నటించింది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన మక్డీ చిత్రంలో శ్వేత నటనకు అందరూ ముగ్ధులయ్యారు. చున్నీ పాత్రలో ఎంత అల్లరిగా కనిపించిందో , మున్నీ పాత్రలో అంత అమాయకంగానూ నటించి మెప్పించింది.  2003 జాతీయ చిత్ర పురస్కారాలలో శ్వేతకు ఉత్తమ బాలనటి అవార్డు కూడా వచ్చింది. అయితే ఆ సినిమాలో ఎంతో తెలివిగా సాలీడు (మంత్రగత్తె) పనిపట్టిన శ్వేత, నిజజీవితంలో మాత్రం సినిమా ప్రపంచం అనే సాలెగూటిలో చిక్కి బయటపడలేక పోతోంది.

నేటి జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టిన శ్వేతాబసు ప్రసాద్ తల్లి బెంగాలీ, తండ్రి బీహారీ. మక్డీ సినిమాలో నటించేటప్పటికి శ్వేత పదకొండేళ్ళ అమ్మాయి. నటిగా ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అందరూ అనుకునేలా తన ప్రతిభను నిరూపించుకున్న శ్వేత ఆ తర్వాత ఇక్బాల్ అనే సినిమాలోనూ, కొన్ని హిందీ సీరియళ్లలోనూ నటించింది. ఉన్నట్టుండి 'కొత్త బంగారులోకం' అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా ప్రత్యక్షం అయ్యింది.  'ఎ.. క్క.. డ ?' అంటూ అక్షరాలను విడదీస్తూ పలికే ఆ టీనేజి అమ్మాయి పాత్ర యువతను బాగా ఆకట్టుకుంది.  ఆ సినిమా కమర్షియల్ గా కూడా విజయవంతం అయింది.  ఇంకేం ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్ల కోసం వెదుకులాడే మన నిర్మాతలకి కొత్త బంగారం దొరికిందని అనుకున్నారంతా. కానీ అదేం విచిత్రమో తెలీదుకానీ అవకాశాలను అందిపుచ్చుకునే రేసులో శ్వేత వెనుకబడింది. దానికి తోడు బాగా లావెక్కడం, ఆ తరవాత వచ్చిన ఒకటి రెండు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో నిర్మాతలెవరూ ఆమె వైపు చూడలేదు. ప్రేక్షకులు కూడా శ్వేతను మర్చిపోయారు. చివరికి ఐటెం సాంగులకు కూడా ఒప్పుకుని చేయడం మొదలుపెట్టింది కానీ అవి కూడా ఆదరణకు నోచుకోలేదు. సీన్ కట్ చేస్తే వ్యభిచారం చేస్తోందని పుకార్లు.  నిజమా అనుకుని ఆశ్చర్యపోయి అంతటితో మర్చిపోయారు జనం. మళ్ళీ ఇదిగో ఇప్పుడిలా వార్తలు.

గత రెండు రోజుల నుంచి వార్తా పత్రికలు, వెబ్ మీడియా, సామాజిక వెబ్ సైట్ లు, టీవీ చానెళ్ళు అన్నింటా శ్వేతాబసు గురించే రాతలు, మోతలు. గతంలో ఆమెపై ఇలాంటి కథనాలు ప్రసారం చేసిన ఒక టీవీ చానెలే స్టింగ్ ఆపరేషన్ ద్వారా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించిందని ఒక వార్త. పోలీసులు మామూలుగా చేసిన రైడింగ్ లో అనుకోకుండా   దొరికిందని ఇంకో వార్త. అదేం కాదు పక్కా సమాచారంతో మేమే రైడింగ్ చేశాం అని పోలీసు కథనాలు మరో పక్క. రెడ్ హ్యాండెడ్ అంటే విటుడు కూడా ఉండాలి కదా! దానిమీద కూడా భిన్నమైన కథనాలు. ఎవరో ఒక పారిశ్రామిక వేత్త కమ్ రాజకీయ నాయకుడితో ఉండగా పట్టుపడిందని, అయితే ఆ వ్యక్తి తన పలుకుబడి ఉపయోగించి తన పేరు బయటికి రాకుండా చూసుకున్నాడని మొదట్లో వచ్చిన వార్త. ఇంతలోనే పోలీసులు కథ మార్చి మేం చేసిన ఆపరేషన్ లో విటుడిగా మా వాడే నటించాడు అని చెప్పారు.

సరే ఏదో జరిగింది. శ్వేత వ్యభిచారమే చేస్తోందని అనుకుందాం. అదే నిజం అయినప్పుడు ఆమె పేరును మరీ అంతగా బయట పెట్టాల్సిన అవసరం ఏముంది? రోజుకు లక్ష అని మీరే చెప్తున్నారు. అంటే ఆమెతో గడిపే వారంతా పెద్ద(డబ్బు) మనుషులే అని వేరే చెప్పక్కర్లేదు. మరి వారి పేర్లెందుకు బయటపెట్టరు? డబ్బున్న వారితో చట్టానికి ఏమిటీ లాలూచి? రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తల ప్రమేయం లేకుండానే ఇలాంటి వ్యాపారాలు సాగుతున్నాయా? అన్నవి సామాన్యుల మదిలో మెదిలే ప్రశ్నలు.

పోలీసుల సంగతి పక్కన పెడితే హీరోయిన్ల చుట్టూ తిరిగి స్టింగ్ ఆపరేషన్ లు చేసి పలానా హీరోయిన్ ఈ వ్యాపారం చేస్తోంది అని ఊదరగొట్టే మీడియా, అదే పని రాజకీయ నాయకులతోనో, పారిశ్రామికవేత్తలతోనో చెయ్యొచ్చుగా. అది చెయ్యరు. ఒకవేళ అలా చేసినా పేరు బయటరాకుండా ఉండటానికి బేరాలు కుదుర్చుకుంటారు. మగాడి విషయం వచ్చేసరికి అలా, ఆడదాని విషయం వచ్చే సరికి రేటింగ్స్ పెంచుకునే ముడి సరుకుల్లా కనిపిస్తారు వీళ్ళ కంటికి. నిండా పాతికేళ్ళు నిండని ఒక అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంటే, దాని వెనుక ఉన్న సామాజిక కారణాలేంటో పరిశోధించడం మాని కనీస జాలి అన్నది లేకుండా ఆ వార్తను పదే పదే చూపించి ఆ అమ్మాయి బతుకును మరింత బుగ్గిపాలు చెయ్యడం జర్నలిజం అనిపించుకుంటుందా? అసలు సమాజంలో జరుగుతున్న ఇలాంటివి చూపించేటప్పుడు వాటిని మన పిల్లలూ చూస్తారని గానీ, వాళ్ళూ ఇదే సమాజంలో పెరుగుతున్నారని గానీ ఈ చానెళ్ళ వాళ్ళు మర్చిపోతారెందుకో!   

ఇది అవకాశాల్లేని సినిమా హీరోయిన్ లు మాత్రమే చేస్తున్న పని కాదు. డబ్బు అవసరమై, విలాసాలకు మరిగి తేలిగ్గా సంపాదించే ఆలోచనలు ఉన్న అమ్మాయిలలో  చాలామంది ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారన్న కథనాలు, వార్తలు వింటూనే ఉన్నాం. తల్లి దండ్రులకు ఇందులో చాలా బాధ్యత ఉంది. అటు అబ్బాయిలున్న వారైనా, అమ్మాయిలున్న వారైనా విలువల గురించి తమ పిల్లలకి చెప్పాలి. డబ్బు ఖర్చు పెట్టే విధానంపై కన్నేసి ఉంచాలి.  అవసరాల మేరకే ఖర్చు చెయ్యడం అన్నది చిన్నప్పటినుంచే నేర్పాలి. ఈ అలవాటు శ్వేతాబసుకు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పివుంటే, వాళ్ళు కూడా కూతురు సంపాదన ఏ రకంగా అయినా ఇంతకు పదింతలు ఉండాలని ఆశపడి ఉండకపోతే ఆ అమ్మాయి ఇలా ఈనాడు వార్తల్లో ఉండక పోయేదేమో!

                                                 

6, ఆగస్టు 2014, బుధవారం

తనివి తీరలేదు

















ఇన్నాళ్ళు ఉద్యమాలు నడిపించి, ఉద్యమ ఫలాలను అధికారం రూపేణా ఆరగిస్తున్నా కెసిఆర్ కు ఇంకా కొట్లాట తనివి తీరలేదు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో భాగంగా జయశంకర్ సారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కెసిఆర్ చేసిన ప్రసంగం ఈ ముచ్చటే చెబుతోంది. తెలంగాణ సిద్ధాంత కర్త జయంతి కాబట్టి తెలంగాణ ప్రజలలో స్ఫూర్తి నింపే మాటలు మాట్లాడాల్సిందే. అయితే అవి భవిష్యత్ కార్యాచరణల గురించి ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ కూడా మేమింకా ఆంధ్రోళ్ళ మీద కొట్లాడతం అనుడే బాగాలేదు.  కొట్లాడనీకి తెలంగాణ సమస్యలు మస్తున్నయ్. నిన్న గాక మొన్న విద్యుత్ కోతలపై రైతులు కొట్లాడితే, ఆళ్ళ మీదికి పోలీసోల్లు కొట్లాడనీకి పోయిన్రు. ఒక వైపు సిటీల్ల గూడా కరెంటు కోతలున్నయ్. ఇంకో దిక్కు రుణాల రీషెడ్యూల్ విషయంలో ఆర్బీఐతో లొల్లి ఉండనే ఉంది. మరో దిక్కు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లొల్లి సుప్రీం దాకా వెళ్లి నెత్తిన మొట్టికాయలు వేయించుకునే వరకు వచ్చెనాయె. ఇవన్నీ ఉండగా ఆంధ్రోనితోని లొల్లి ముచ్చట దేనికి? ప్రజల ఆలోచనలను సమస్యల నుండి ప్రక్కదారి పట్టించుడే అని అనిపిస్తాంది.

మా తెలంగాణలో యూనివర్సిటీ పేరు మార్చుకుంటే నీ ఏడుపేంది అంటన్నవ్. 'ఆ యూనివర్సిటీ అందరం కలిసున్నప్పుడు,  అందరం కట్టిన పన్నుల లెక్కలోంచి పైసలు దీసి కట్టిన యూనివర్సిటీ కదా. నీ ఒక్కనిదే అన్నట్టు నీకిష్టమైన పేరు పెడితే ఎలా? నీకంత సంబరముంటే ఇక మీదట తెలంగాణలో ఉండే ప్రజలు కట్టే పన్నులు పెట్టి  కొత్తగా ఏమైనా కట్టుకో, ఆటికి నీ ఇష్టమొచ్చిన పేరు పెట్టుకో ' అని ఆంధ్రోళ్లు అనరా?  మీ విగ్రహాలను మీరు తీస్కపోండి అన్నడు సారు. 'సరే మా విగ్రహాలతో పాటు మేం కట్టించిన వన్నీ, అభివృద్ది చేసినవన్నీ మాకిచ్చెయ్ తీస్కపోతం' అని వాళ్ళంటే ఏం చెప్తం? తెలంగాణలో విద్యుత్ కష్టాలు చంద్రబాబు వల్లే అన్నడు సారు. మాకేవో సమస్యలు ఉండి మా ప్లాంట్లలో ఉత్పత్తి ఆగిపోతే మధ్యలో నీ ఏడుపెంది అని అల్లంటే మనకెట్లుంటది?

మీ పిల్లల ఫీజులు మీరే కట్టుకొండి అంటున్నరు.  ఎనకటికి కాళోజి సారు 'క్విట్ తెలంగాణ' అంటే జయశంకరు సారు ఏం చెప్పిండు? 'ఆ మాట తప్పు. ఈడకొచ్చి స్థిరపడినోల్లందరూ మనోల్లే' అన్నడు కదా! యాదికి లేదా కెసిఆర్ సారూ? ఆయన తెలంగాణను ప్రేమించిండు కానీ, ఆంధ్రోల్లను గానీ, మలెవల్లను గానీ ద్వేషించలే. అట్ల సెయ్యమని ఎన్నడూ చెప్పను గూడా చెప్పలే. మరి ఆయన పుట్టిన రోజు నాడు ఇవేం మాటలు సారూ?


      

2, ఆగస్టు 2014, శనివారం

స్నేహమా వందనం!


















స్నేహమా నీకు వందనం!

నాకు అల్లరి నేర్పినందుకు
నాకు నవ్వు నేర్పినందుకు
కొత్త కొత్త ఆటలు ఆడించి
నాకు మొదటి గెలుపు రుచి చూపించినందుకు

కొండలు గుట్టలు ఎక్కించి,
చెట్టూ పుట్టా తిప్పించి,
నీరూ నిప్పుతో చెలగాటమాడించి,
నాతో సాహసాలు చేయించినందుకు
ప్రమాదంతో పరిచయం చేయించినందుకు

చదువులో నాతో పోటీ పడి
నన్ను ముందుకు పరుగెత్తించినందుకు

స్వచ్చమైనదే అయినా, స్నేహంలోనూ
మంచీ చెడులు ఉన్నాయని చెప్పినందుకు

నాకు దురలవాట్లను నేర్పిన నువ్వే
నన్ను హెచ్చరించి మానిపించినందుకు

నాలో మంచినీ, చెడునీ పాలు నీళ్ళలా విడదీసి
చూపినందుకు, నా అద్దానివై నిలచినందుకు

నాకంటూ ఒక ప్రపంచం ఉందని అనిపించేలా
నా చుట్టూ నిలిచినందుకు

ప్రేమ అని నేననుకుంటే,
కాదు స్నేహం అని  నా మార్గాన్ని మార్చినందుకు


ఎప్పటికప్పుడు కొత్త స్నేహానికి తావిస్తూ
నన్ను వదలి నీవు వెళ్ళినందుకు,
వెళ్తూ నీ జ్ఞాపకాలను నాకు వదలినందుకు

నేను రెండుగా విడిపోయి జీవిస్తున్నానా
అన్నంత చనువుగా నాతో తిరిగినందుకు
స్నేహమా నీకు వందనం! 

నా స్నేహితులందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు!




27, జూన్ 2014, శుక్రవారం

నవభారత నిర్మాత పీవీ నరసింహరావు



        భారత రాజకీయ నాయకులలో మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించబడి, అంతే సమానంగా విస్మరించబడిన
వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు. పేద, ధనిక అన్న తేడా లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందంటే, కిరాణా దుకాణం నుంచి సాఫ్ట్ వేర్ సంస్థల వరకు కనీసం ఒక కంప్యూటర్ లేకుండా పని జరగడం లేదంటే,
దానికి కారణం, నిస్సందేహంగా పివి నరసింహారావే. కేవలం పాముల్ని ఆడించే దేశంగానే ప్రపంచ ప్రజలకి తెలిసిన
భారత దేశాన్ని ఐ టి హబ్ గా, తిరుగులేని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దింది ఈ పాములపర్తి నరసింహారావే. ఇంకా చెప్పాలంటే
దేశానికి రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చింది 1947లో అయితే, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది 1991లో , అంటే పీవీ ప్రధాని అయ్యాకే.

విప్లవ యోధుడు పివి :

ఈ తెలుగు బిడ్డ పుట్టింది తెలంగాణ గడ్డ మీదే. 1921 జూన్ 28న నాటి హైదరాబాదు రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో పుట్టిన  పీవీ, నాగపూర్ యూనివర్సిటీ  న్యాయవాద పట్టా పుచ్చుకున్నాడు . తనకు వరుసకు అన్న అయ్యే పాములపర్తి సదాశివరావుతో కలిసి 'జయ-విజయ' అన్న కలం పేరుతో నాటి కాకతీయ పత్రికలో వ్యాసాలు రాసేవారు. అనంతరం నాటి ఉద్యమాలకు ఆకర్షితుడై నిజాం కు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం కూడా చేశానని, తమ మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు  ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే తాము మాత్రం సైన్యం కురిస్తున్న బుల్లెట్ల వర్షం నుండి తప్పించుకుంటూ, ప్రాణరక్షణకై  పరుగులుదీస్తూ ఒక అడవిలో తలదాచుకున్నట్టు తన స్వీయ చరిత్ర గురించి రాసుకున్నారాయన. 

ఇందిర విధేయుడు :

స్వాతంత్ర్యం తరువాత జాతీయ కాంగ్రెస్ లో చేరిన పివి, ఇందిర విధేయుడిగా పేరు పడ్డాడు. 1969 లో కాంగ్రెస్ లో చీలిక వచ్చినప్పుడు కూడా అయన ఇందిరనే అంటిపెట్టుకుని ఉన్నాడు. 1970 లో భూదానోద్యమ బాధ్యతను పూర్తిగా ఆయనకు అప్పచెప్పింది ఇందిరమ్మ. ఆ ఉద్యమ నేపథ్యంలో ఆయన తన వారసత్వ భూములను సైతం జాతికి ఇచ్చేసాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతటి విధేయుడే ఆ తర్వాత గాంధీ- నెహ్రూ కుటుంబ వారసత్వపాలనను  బహిరంగానే వ్యతిరేకించి కాంగ్రెస్ నాయకులంతా ' ఎంత ధైర్యం' అంటూ  నోటి మీద వేలేసుకునేలా చేశారు.  ఆ రకంగా వాఖ్యానించి కూడా కాంగ్రెస్ లోనే కొనసాగ గలిగిన మొదటి ధీశాలి పీవీనే.

దేశ ప్రధాని పీవీ  :

13 భాషల్లో ప్రావీణ్యం, సామాజిక, రాజకీయ, ఆర్థిక  విషయాలలో  అద్భుత మేధాశక్తితో పాటు కష్టపడే తత్వం ఉన్న పీవీని  అనేక పదవులు అయాచితంగానే  వరించాయి . ఒకానొక దశలో జ్ఞానీ జైల్ సింగ్ తర్వాత రాష్ట్రపతి పదవికి జరిగిన రేసులో కూడా పీవీ పేరు వినవచ్చింది.  ఆ పదవులన్నీ రావడానికి కారణం, ఆయన ఇందిర కుటుంబానికి సన్నిహితుడు కావడమే అని కొందరు కాంగ్రెస్ వాదుల అభిప్రాయం. బహుషా ఆయన ప్రధానిగా కాకపోయినట్లయితే  ఆ అభిప్రాయం అలాగే ఉండిపోయేదేమో!

నాటి రాజకీయ పరిణామాల వల్లే కాని, ఆయనకున్న ఇతర సాహిత్యపరమైన వ్యాపకాల వల్లే కాని,  1991 నాటికి పీవీ దాదాపు రాజకీయరంగ విరమణకు దగ్గరలో ఉన్నారు.  మరోవైపు ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ అప్పటికీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. అనేక అభియోగాల మధ్య కూరుకుపోయిన పార్టీ, మళ్ళీ అధికారం కోసం రాజీవ్ అధ్యక్షతన పోరాడుతోంది. కానీ అంతలోనే రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం, దేశమంతా చెలరేగిన సానుభూతి పవనాలు, కాంగ్రెస్ ఘన విజయం ... అనీ చకచకా జరిగిపోయాయి. రాజకీయ పగ్గాలు చేపట్టేందుకు సోనియా సుముఖంగా లేకపోవడం వల్ల ప్రధాని పదవికి నెహ్రూ కుటుంబేతర నాయకుల్లో పోటీ ఏర్పడింది. శరద్ పవార్ గట్టి పోటీని ఇచ్చినప్పటికీ,  సహజంగానే అన్ని అర్హతలతో పాటు, మృదుస్వభావి, సౌమ్యుడు అన్న పేరున్న పీవీ నరసింహరావును ప్రధాని పదవి వరించింది. ఆ వెంటనే
పార్లమెంటు సభ్యత్వ అర్హత కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని నంధ్యాల పార్లమెంటు నియోజకవర్గం నుండి ఉపఎన్నికలో  పోటీచేశారు. తమ రాష్ట్రం నుండి ఒక తెలుగువాడు, అది కూడా ఉత్తరాది ఆధిపత్యాన్నీ నిలువరిస్తూ ఒక దక్షిణాది నాయకుడు,  తొలిసారిగా నెహ్రూ కుటుంబేతర వ్యక్తి భారతదేశ ప్రధాని కాబోతున్నాడన్న అభిమానంతో తెలుగు ప్రజలు ఆయన్ని 5. 8 లక్షల ఆధిక్యంతో గెలిపించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ  పోటీ నుంచి విరమించింది. అంతటి ఆధిక్యం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా చోటు చేసుకుంది.

 దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం :

పీవీ ప్రధాని అయ్యేనాటికి కేవలం 2. 3 % వృద్ధిరేటుతో  దేశ ఆర్థిక స్థితి దారుణస్థాయిలో ఉంది.  ఎంత దారుణం అంటే దేశ అవసరాల కోసం 47 టన్నుల బంగారాన్ని తాకట్టుపెట్టి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి అప్పు తెచ్చుకోవలిసి వచ్చింది. వీటన్నిటికీ కారణం అప్పటిదాకా ప్రభుత్వాలు అనుసరించిన ఓటు బ్యాంకు పోకడలు. అనవసర సబ్సిడీలు.  సంస్థలన్నిటినీ జాతీయం చేసుకుపోయేసరికి పని అనేది రాజకీయం అయ్యింది. ఉత్పాదకత తగ్గింది.  సరిగ్గా ఆ సమయంలో పగ్గాలు చేపట్టిన పీవీ ప్రముఖ ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని ఆయనకు సర్వాధికారాలను, పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఫలితంగానే ఐ టి అన్నది భారతదేశంలోకి కాలు మోపింది. టెలికాం సంస్థలు తమ సాంకేతిక నెట్వర్క్ ను భారత్ కూ విస్తరింపచేశాయి. పలు దేశీయ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పని సంస్కృతి అభివృద్ధికరంగా మారింది. నాణ్యతలో, సేవలలో పోటీ తత్వం పెరిగింది. ఒకప్పుడు మన దేశం నుండి ఇతర దేశాలకు తరలిపోయిన మేథో సంపత్తి, పారిశ్రామిక వర్గాలు తిరిగి స్వదేశానికి రావడం (రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ ) మొదలయ్యింది. పీవీ, మన్మోహన్ అనే ఇద్దరు మేధావుల కలయిక మొత్తం దేశ గతినే మార్చేసింది. కొద్ది రోజుల్లోనే భారతదేశం ఆర్థిక సంక్షోభం నుండి తేరుకుని అనతికాలంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. అందుకే మేధావులు అంటారు దేశానికి ఆర్థిక స్వతత్ర్యాన్ని తెచ్చింది పీవీ నరసింహారావు అని.

ముందు దేశం, ఆ తర్వాతే పార్టీ:

పీవీ ఏది చేసినా మొదటి ప్రాధాన్యత దేశ అభ్యున్నతికే ఇచ్చారు. ఆ తర్వాతే పార్టీ అన్నారు. అదే కాంగ్రెస్ వారికి మంటపుట్టించింది. ముఖ్యంగా సోనియా గాంధీకి. ప్రతి విషయం తనకు చెప్పే చేయాలని ఆమె, తెలియని విషయాలు చెప్పి ప్రయోజనం ఏంటి అన్నట్టు ఈయన, మధ్యలో చెంచాగాళ్ళ ఎగదోపుడు మాటలు.... ఇవన్నీ కలిసి పీవీకి కాంగ్రెస్ లోనే శత్రువులను పెంచాయి. పార్టీకి దూరం చేశాయి. ఆ ద్వేషాలు, దూరాలు ఆయన చనిపోయేవరకూ తరగలేదు. పైగా ఆయనకు మరిన్ని అపవాదులు ఆపాదించారు. ఇక మీడియా అయితే పార్టీనే పట్టించుకోని ఆయనను మేమెందుకు పట్టించుకోవాలని అనుకుంది. ఆయన బ్రతికుండగానే చనిపోయారని వార్తలు రాసేదాకా నిర్లక్ష్యం చూపింది. చనిపోయిన తర్వాతా ఆయనపై ప్రతీకారం తీర్చుకునే నీచ స్థాయికి దిగజారింది కాంగ్రెస్.

పార్టీని పట్టించుకోకుండా ముందుకెళ్ళాడు కాబట్టే పీవీకి ఆ అవస్థ అనుకున్నాడేమో, మన మన్మోహన్ సింగ్ గారు పార్టీ చెప్పినట్టు నడుచుకుని అపఖ్యాతిని మూట కట్టుకున్నారు. ఆ రకంగా చూస్తే పీవీ అనుసరించిన పంథానే సరి. అలా చేయగల సత్తా ఒక తెలుగు బిడ్డకే సాధ్యమేమో!     

తెలంగాణ రాష్ట్ర పండుగగా పీవీ జయంతి :

పీవీ చనిపోయినప్పుడు జరిగినవన్నీ చూసి కాంగ్రెస్ ను ఈసడించుకోని తెలుగు వాడు ఉండడేమో. ఉంటె వాడు తెలుగువాడు కాదనుకోవాలి, ఇంకా చెప్పాలంటే చేసిన మేలు మరచి పోయే కృతఘ్నుడు అని అనుకోవాలి. వై ఎస్ ఆర్ సరే కాంగ్రెస్ మనిషి, కాని తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే కెసిఆర్ కు ఏమయ్యింది? అని అనుకున్నా ఆనాడు.
కానీ ఇప్పుడు పీవీ జయంతిని రాష్ట్ర పండుగగా చెయ్యడం, తెలంగాణ రాజకీయ రాజధాని వరంగల్ లో పీవీ విగ్రహాన్ని నెలకొల్పడం చూస్తుంటే 'వాహ్ ! కెసిఆర్' అనిపించింది. ఆలోచన ఆయనదైనా, మరెవరిదైనా అభినందించతగినది. ఆనందించతగినది. పీవీని గౌరవించడం అంటే తెలుగు జాతిని గౌరవించుకోవడం.
                                                    







      

     

29, నవంబర్ 2013, శుక్రవారం

ప్రతి మదిలోని తెహల్కా ... ఈ ప్రేమలేఖ!

                                                                      ప్రియమైన నీకు, నేను వ్రాయునది...
'నేను' అంటే 'నువ్వెవరు?' అని ప్రశ్నించవని నాకు తెలుసు. ఎందుకంటే నేనీ మనుషుల మధ్య ఎప్పటినుంచో ఉంటున్నా, నా ఉనికిని తొలిసారిగా గుర్తించింది నువ్వే. నేను అనబడే నాకున్న లక్షణాల్నీ, అవలక్షణాల్నీ రూపించి చూపించిందీ, అనుమతించి స్వాగతించింది నువ్వే. ఎటొచ్చీ చిక్కంతా ఏంటంటే అంతటితో నీ పని అయిపోయినట్టుగా నువ్వు గమ్మున ఉండిపోయావు. గుండె వాకిట వరకూ స్వాగతించిన నువ్వు, నీ హృదయాంతరాల లోనికి ఆహ్వానించవెందుకో! మన మధ్య ఉన్నదేంటని అడిగితే 'జస్ట్ కొలీగ్స్' అంటావు. అంతేనా అన్నట్టు దిగులుగా కనిపిస్తే 'యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్' అంటావు. అంతకంటే ఎక్కువ కాదా అన్నట్టు నిరాశగా చూస్తే, ఏమీ తెలీనట్టు 'ఏమైంది అలా ఉన్నావు?' అని అడుగుతావు.  మనం ఒకరినొకరు చూసుకున్న మొదటి క్షణంలోనే నువ్వన్నావ్, 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది' అని. నాక్కూడా అలాగే అనిపించింది. అంటే విడివడని బంధమేదో మన మధ్య ముడివడబోతోందని సూచనేమో అది.
అసలీ లేఖ రాయడం ఎందుకంటే రాత్రి నువ్వు నా కలలోకి వచ్చావు. గదిలో నేనడుగు పెట్టేసరికి నువ్వొక కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నావు. మానిటర్ మీద ఒక హృదయం బొమ్మ. ఎంతో ఏకాగ్రతతో దానికి మెరుగులు దిద్దుతున్నావు. ఆ హృదయం నాదే అని గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు నాకు. తీరిగ్గా, ఓపిగ్గా, నీకు నచ్చినట్టుగా మలచుకుంటూ... నా హృదయాన్ని తదేకంగా చూస్తూ, నీ కళ్ళనిండా వెలుగును నింపు కుంటున్నావు. ఈ హృదయం ఇక నాదే, నా స్వంతమే అన్నట్టుగా నీ పెదవులపై విజయ దరహాసం. అది నేను గమనించేలోగా, నా ఉనికి నీకు తెలిసిపోయి, నీ గుట్టు నేను పసిగట్టాననే తత్తరబాటుతో, కోపం నటిస్తూ... విసురుగా ఏదో బటన్ నొక్కేసరికి ఏకంగా కంప్యూటరే పేలిపోయింది. గది నిండా చెల్లాచెదురుగా పడివున్న నా హృదయపు తునకలు. వాటిని నీ హై హీల్స్ చెప్పులతో పక్కకి తోసేస్తూ విసవిసా నడచి బయటకు వెళ్లిపోతుంటే, వెనుకనుంచి నీ ఎతైన పిరుదుల లాస్యాన్నీ, నునుపైన నీ నకుము మడతలో మెరిసి మాయమవుతున్న కాంతిని చూసి చెదరిన నా హృదయం బాధగా నిట్టూర్చింది.
అప్పుడో వెలుగు. ఏంటా అని చూస్తే బ్రహ్మ దేవుడు. నన్ను సానుభూతితో చూస్తూ ''పిచ్చివాడా! ఈ పాటి విరహానికే నీకంత బాధగా ఉంటే, మనసు పెట్టి అపురూపంగా  నేను మలచిన ఆ రూపాన్ని భూమ్మీదకు పంపాల్సిన విధిని నిర్వర్తించే సమయంలో ఆ శాశ్వత విరహానికి నేనెంత బాధపడి ఉంటానో ఊహించు'' అన్నాడు. అప్పుడు చూశాను ఆయన ఎనిమిది కళ్ళలోనూ 27 ఏళ్ల విరహం నింపిన నైరాశ్యపు నీడల్ని. ఆయన అంతర్ధానంతో మెలకువ వచ్చి, మళ్ళీ నిద్ర పట్టలేదు. రాత్రంతా నీ తలపుల వేదనే.
ప్రతి రోజూ ఆఫీసుకు రాగానే నీ జాడ కోసమే వెదుకుతాను.  నువ్వు కనిపిస్తే గాని ఆ రోజుకు పని చేసే శక్తి సమకూరదు నాకు. సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్తూ 'బై బై' అంటూ చేతుల్ని తిప్పుతూ వీడ్కోలు చెపుతున్నపుడు,
నీ చూపులలో చిక్కుపడిన నా చూపులు క్షణకాలపు పరిష్వంగనలో ఆదమరిచి ఉండగా, నిర్దయగా నీ చూపుల్ని వెనక్కి లాగేసుకుని నువ్వు వెళ్లిపోతుంటే, నీ వెంటే పరుగులిడి, నువ్వు కనుమరుగైన చోట కాసేపటి వరకు అలాగే నిలబడి, నీరసంగా వెనక్కి తిరిగి వచ్చి, నా కళ్ళలోని చీకటి కుహరాల్లోకి చేరి సొమ్మసిల్లిపోతాయి.
చాలా సార్లు నువ్వన్నావు, ''రాత్రి నీ గురించి ఆలోచించాను'' అని. అలోచించి నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావో మాత్రం చెప్పవు. మొదట్లో దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత ఉండేది. కాని ఇప్పుడు నీ నిర్ణయం తెలుసుకోవడం మీది ఆసక్తి కన్నా, 'నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు' అన్న నిజమే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది.
ఎప్పుడైనా కన్నార్పకుండా నిన్నే చూస్తున్నప్పుడు, 'ఏంటలా చూస్తున్నావ'ని అడుగుతావు. ఏం లేదని అనగానే 'పిచ్చి' అంటూ గలగలా నవ్వేస్తావు. ఒక మనోహర దృశ్యాన్ని చూస్తున్నట్టుగా నవ్వుతున్న నిన్ను చూస్తుంటే, చటుక్కున నవ్వును ఆపి, నా కళ్ళలో కళ్ళు పెట్టి నిశ్శబ్దంగా రెండు క్షణాలు చూసి, చూపుల్ని నేలమీదికి వాల్చేస్తావు. మౌనంగా ఉండిపోతావు. ఆ క్షణాల్లో నీ పెదవుల వణకు, నీ పొడవాటి ముక్కు చివరన అదరుతున్న ముక్కుపుటాలు, శ్వాస ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెలమీది అవయవాలలో కదలికలు... ఇలా అన్నిటినీ గుర్తిస్తాయి నా చూపులు. ఆ సంకేతాల అర్థాన్ని తెలుసుకున్న రక్తం వేడెక్కి పరవళ్ళు తొక్కుతూ, నా నరనరాల్లో తీపి బాధని నింపుతుంది. ఆ వెంటనే ఒక్క ఉదుటున లేచి వెళ్ళిపోతూ నాలుగడుగులు వేసి, వెనక్కి తిరిగి నువ్వు చూసే చూపు ... 'హా!!!'  ఎందుకింత బాధ? ఎంతకాలం మోయాలీ బరువును? మనకు మనమే బందీలుగా ఉండటం ఎందుకు? చెప్పు! ఒక్క మాట. ''నువ్వు నాకు కావాలి.'' అని చెప్పు. పోనీ... "నేను నీకు కావాలా?" అని అడుగు. కాలాన్ని నమ్మకు. అది ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చేస్తుందో తెలీదు. ఈ లేఖ నీ మౌనాన్ని భంగపరుస్తుందని ఆశిస్తూ...
నీ
నేను

(ఇలా లేఖలు రాసుకోవడం ఇప్పుడు లేకపోవచ్చు. పొట్టి సందేశాలు (SMS) పంపుకునే ఈ ఫాస్ట్ జనరేషన్ సైతం ఇలాంటి సాగతీత ప్రణయ బాధను అనుభవిస్తోంది. ప్రతి ఆఫీసులోనూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక జంట ఇలా అవ్యక్త అనుబంధంతో వేగిపోతూ ఉంటుంది. వారిద్దరూ అవివాహితులు కావచ్చు. లేదా ఇద్దరిలో ఒకరికి పెళ్లై ఉండవచ్చు. లేదా ఇద్దరూ పెళ్ళయిన వాళ్ళు కావచ్చు. ఎటూ తేలని ఈ బంధం కొన్నాళ్ళ తర్వాత అక్రమసంబంధంగా జనం నోళ్ళలో నానడం జరగవచ్చు. లేదా తెహల్కా మాదిరిగా పనిచేసే చోట లైంగిక వేధింపుల కేసుగా మీడియాకు సంబరం చేయొచ్చు.  లేదా వీళ్ళు ఉద్యోగ రీత్యా విడిపోయి దూరం కాగానే ఒకరికొకరు జ్ఞాపకాలుగా మిగిలిపోవచ్చు.  ఏది ఏమయినా ఇదంతా సహజం. అవడానికి అది ఆఫీసు లవ్ అయినా అది వ్యక్తిగతం అని మర్చిపోవద్దు.  ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే వరకూ బయటపడక పోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఎందుకంటే రెండువైపులా ఉండే ప్రేమలో నాన్చుడు ఉండదు. వ్యవహారం సాగుతుందంటే అది వన్ సైడ్ అని అర్థం.  ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం అమృతం కిందే లెక్క.)       

8, ఆగస్టు 2013, గురువారం

తెలిసీ పలికిన విలువేగా...!

'పేదరికం...  ఒక మానసిక స్థితి మాత్రమే '
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యపై స్పందిస్తూ 'పేదలను అవమానించారు' అంటూ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ యువరాజును తెగ విమర్శిస్తోంది. పత్రికలు కూడా అదో విడ్డూరం అన్నట్టు విస్తుపోతున్నాయి.  అలా విమర్శించే ముందు అతనే సందర్భంలో ఆ మాట అన్నాడో కూడా పట్టించుకోవట్లేదు. అయినదానికీ కానిదానికీ రాద్ధాంతం చేయడమే రాజకీయం కాబట్టి, ప్రతిపక్షాలు వాటికి అవసరం అయినంత మేరకే ఆలోచిస్తాయి. ఏదో ఒకటి జరిగితే దాన్ని సంచలనం చేయడమే పత్రికల పని.

పేదరికాన్ని స్వయం శక్తితో  అధిగమించిన స్వయం సహాయక సంఘాల గురించి ప్రస్తావిస్తూ, 'ఆత్మవిశ్వాసంతో తమంతట తాముగా  పేదరికం నుండి బయటపడే ప్రయత్నం చేయనంతవరకూ, ఏ ప్రభుత్వం ఏం చేసినా ప్రయోజనం ఉండద'ని అర్థం వచ్చేలా అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ఇలా మాట్లాడం  తప్పే. అయితే ఆ తప్పు  వల్ల కాంగ్రెస్ పార్టీకి ముప్పు. రాహుల్ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు. అంతే కానీ దేశానికి, ప్రజలకు, పేదలకు మాత్రం కనువిప్పు కలిగించే మాటలవి. ఎంతో పరిణితితో కూడిన, నిజాయితీ కలిగిన , సంస్కర్త మాట్లాడినట్లుగా ఉంది. ముఖ్యంగా జనాకర్షక పథకాలకు పెట్టిన పేరు కాంగ్రెస్. అందునా నగదు బదిలీ వంటి ప్రత్యక్ష ప్రయోజనాల ఆలోచన చేసిన రాహుల్ నోటి వెంట ఈ మాట రావడం విస్మయం కలిగించేదే. అయినా స్వాగతించ తగిన పరిణామం. 

గత 65 సంవత్సారాల నుంచి ఇప్పటివరకు  పేదల పేరు చెప్పి బొక్కసం ఖాళీ చేస్తూ, వీధి నాయకుల నుంచి దేశ నాయకుల వరకు అందరూ ప్రజాధనం బొక్కి  బొజ్జలు పెంచారే తప్ప, పేదోడి డొక్క నిండలేదు. పేదల బ్రతుకులు మారనూలేదు. నానాటికీ పేదలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. నిజానికి పేదల కోసం ప్రభుత్వాలు ఇళ్ళు కట్టిస్తున్నాయి. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఏ మార్కెట్లోనూ దొరకనంత తక్కువ రేటుకు బియ్యం మరియు వంట సరకులు ... ఇలా ఒక్కో లబ్ది దారుడికి సుమారుగా నెలకు 300 రూపాయలు(మన ముఖ్యమంత్రిగారి తాజా లెక్కల ప్రకారమే 230 రూపాయలు)  అందిస్తున్నాయి. అయినా 8.46 కోట్ల జనాభా కలిగిన మన రాష్ట్రంలో  2. 3 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వ ప్రకటనలు చెబుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2. 08 కోట్ల  కుటుంబాలు మాత్రమే ఉంటే తెల్ల కార్డులున్న కుటుంబాలు 2. 3 కోట్లు ఉండటం గణిత శాస్త్రానికే సవాలు విసిరే అంశం.  ప్రభుత్వ ఖజానా నుండి బయటికి వచ్చే సంక్షేమ నిధులు లబ్దిదారుడిని చేరే లోపు మంచు గడ్డలా కరుగుతూ కరుగుతూ  ఎంత మంది నాయకుల, అధికారుల ధనదాహాన్ని తీరుస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఖరీదయిన స్కార్పియో వాహనంలో వచ్చి, తెల్ల కార్డును చూపించి ఆరోగ్య శ్రీ కింద కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుకుంటున్న వైనం గురించి పత్రికలలో చదివి కూడా అసలైన పేదను గుర్తించే ఏ ప్రయత్నమూ, ఏ ప్రభుత్వమూ చేయదు. ఎందుకంటే ఆ కార్డులతో ప్రయోజనం పొందే వాళ్ళల్లో పార్టీ నాయకులూ,   వారి అనుచరగణమే  ఎక్కువ. వారికి ఆ ప్రయోజనాలు అందకపోతే పార్టీని మట్టి కరిపించేస్తారు. అందుకే...  వారిని మేపే నిరంతర ప్రక్రియలో భాగంగానే ఇలాంటి పేదల పథకాలను ఎప్పటికప్పుడు వినూత్నంగా  తమ ఎన్నికల అజెండాలో చేరుస్తుంటాయి రాజకీయ పార్టీలు. అంతే కానీ నిజంగా పేదలను ఉద్ధరించే లక్ష్యం ఏ పార్టీకీ లేదు. 

 చాన్నాళ్ళ క్రితం గుడిపాటి వెంకటాచలం తన రచనల్లో ఒక చోట ఇలా రాస్తే, చదివినట్టు గుర్తు. ''కడుపు నిండా తిని, తాంబూలం నములుతూ పేదోడి ఆకలి కష్టాల గురించి తమ రచనల్లో తెగ రాసేస్తుంటారు రచయితలు. నిరుపేద జీవితం చాలా దుర్భరమైనదని అనిపించేలా  వర్ణిస్తారు. సానుభూతిని కురిపించేస్తారు.  నిజానికి మనం అనుకుంటున్నంత దుర్భరంగా ఉండదు పేదోళ్ళ జీవితం. శ్రమించి పనిచేయడం వాళ్ళకి కష్టం అనిపించదు. ఉన్నంతలోనే ఆనందాన్ని వెదుక్కుంటూ, మరొకరి సాయం ఆశించకుండా ఆత్మగౌరవంతో బ్రతకడం వాళ్లకి  తెలిసినంతగా వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళకి తెలియదు.''

ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది కూడా అదే. రోజుకు ఇంత సంపాదించే వాడు, నెలకు ఇంత ఖర్చు చేసేవాడు పేదవాడు  అనే లెక్కలన్నీ భౌతికపరమైన అంశాలు మాత్రమే. సంతృప్తితో కూడిన మానసిక స్థితిని పొందనంత వరకూ, వాడు పేద కిందే లెక్క. కోట్ల ఆస్తి ఉండి కూడా డబ్బు కోసం నానాగడ్డి కరిచే వాడు,  సలక్షణమైన ఉద్యోగం చేస్తూ కూడా పై ఆదాయం ఆశించేవాడు ఎప్పటికీ నిరుపేద కింద లెక్కే.  రాహుల్ చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం. పేదరికం అన్నది ఒక మానసిక స్థితి. ఆ స్థితి నుంచి బయటపడాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం ఉండాలి. ప్రతి పేదకూ కావలసింది అదే.  గాలివాటుగా కాకుండా   కాబోయే ప్రధాని అభ్యర్థిగా ఒక స్పష్టమైన దృక్పథం ఉండి ఈ మాటను అని ఉంటే... రాహుల్ గాంధీని ప్రధానిగా ఆహ్వానించ వచ్చు.              

4, ఏప్రిల్ 2013, గురువారం

కర్మభూమి నుండి జన్మభూమికి... వేంచేస్తోన్న 'లలితా'రాణి

సినీతారలకు ప్రజాసేవ చేయాలనిపించడం మన అదృష్టం. 
ఎందుకంటే అప్పటివరకూ అందనంత ఎత్తులో ఉండే తారలు, రాజకీయాలలోకి వచ్చినప్పటినుంచీ నుంచి నేల మీద, అదీ మన మధ్యే  ఉంటారన్నమాట. మొబైల్ ఫ్యానులూ, ఎయిర్ కూలర్ల మధ్య, గ్లామర్ గొడుగు నీడలో ఉంటూ, పండ్ల రసాలతో నోరుతడుపుకుంటూ ఎండకన్ను ఎరగరేమో అన్నంత సుకుమారంగా గడిపిన వెండితెర వేలుపులు, మండుటెండల్లో ప్రజలు నడిచే సాధారణ బాటల్లో నడుస్తారు. అప్పటివరకు మన ఇంటి గోడ మీద క్యాలెండరులో వేలాడుతూ మన్మథ బాణాలు సంధించి, సమరం చేసిన దేవతలు, ఏకంగా మన ఇళ్ళల్లోకి నడిచొచ్చి మన లోగిళ్ళను పావనం చేస్తారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని ఇంద్ర కుమార్తెలా వీళ్ళంతా అమృతం తాగి బతుకుతారేమో అని అనుకుంటూ ఉండగనే, మనలని ఆశ్చర్యపరుస్తూ మనం తినే కంచాల్లోనే మనం తినే పెరుగు ముద్దనే ఆబగా, లాగేసుకుని మరీ తింటారు. అలా కష్టపడుతున్న ఆ దేవుళ్ళను చూసి మన మనసు కరిగి, ఓట్ల వర్షం కురిపిస్తాం. అంతే! మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంతవరకు ఆ దేవుళ్ళు, దేవతలు మనకు కనబడరు. ఉంగరం దొరకబుచ్చుకున్న వెంటనే స్వర్గానికి చెక్కేసిన ఇంద్రజలా, వీళ్ళూ వాళ్ళ వాళ్ళ లోకాలకు తిరిగెల్లిపోతారు. క్యూలో కొట్టుకు సచ్చి, లేదంటే బ్లాకులో బోలెడన్ని డబ్బులు తగలేసి టికట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళాక సినిమా చెత్తగుంటే ఏం చెయ్య గలుగుతున్నాం? ఎవరిని అడుగుతున్నాం? మరో సినిమా విడుదలయ్యేంత వరకూ ఎదురుచూడట్లేదా? ఇదీ అంతే! అసలు విషయానికి వస్తే...

పదునాలుగేళ్ళ వయసులో భూమికోసం(1976) చిత్రం ద్వారా జయప్రదగా వెండితెర అరంగేట్రం చేసిన రాజమండ్రికి చెందిన నాట్యకళాకారిణి లలితా రాణి, జయప్రదంగా  300పై చిలుకు చిత్రాలలో నటించారు.   దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలలో నటించి ఇటు దక్షిణాది ప్రేక్షకులను, హిందీ, బెంగాలీ చిత్రాల ద్వారా అటు ఉత్తరాది ప్రేక్షకులను తన అందచందాలతో ఉర్రూతలూగించారు. ప్రతిభతో రాణించి సమకాలీన గ్లామర్ నటీమణులకు  గట్టిపోటీనిచ్చారు. సినీరంగంలో ఉండగానే పెళ్ళిచేసుకుని జయప్రద నహతా అయ్యారు.  అంతవరకూ  బాగానే ఉంది. కళాసేవ పూర్తయ్యాక సహజంగానే ప్రజాసేవ చేయాలనిపించింది రాణిగారికి. అంటే జయప్రదగా సుప్రసిద్దురాలైన లలితారాణి గారికి.  అదే సమయంలో ఎన్టీ రామారావు గారి ఆహ్వానం అందడం,ఆయన స్ఫూర్తితో సినీజీవితాన్ని త్యాగం చేసి తెలుగు దేశం పార్టీలో చేరిపోవడం చకచకా జరిగి పోయాయి.

ఇక్కడ త్యాగం అనగానే అప్పటివరకూ సంపాదించినదంతా ధారపోస్తారని అమాయకంగా అనుకునేరు. త్యాగం అంటే... ఇకపై సినిమాల్లో వచ్చే సంపాదనని వదులుకోవడం అన్నమాట. 'అసలు ఇక్కడ అవకాశాలు తగ్గాక కదా అటు వెళ్ళేది' అని గడుసుగా అనకండి. అది త్యాగం... అంతే!  ఇలా వీరి త్యాగంతో, పార్టీలో అసలు త్యాగాలు మొదలవుతాయి. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడిపడగానే, అప్పటివరకూ పార్టీని నమ్ముకుని ఉన్న అసలయిన నాయకులు వాళ్ళ పదవులనీ, అవకాశాలనీ త్యాగం చేసి, ఈ రాలి పడ్డ తారలకి  చోటివ్వాలి. గౌరవం ఇవ్వాలి. వారి వెంట జెండా మోసుకుంటూ తిరగాలి. అందుకే కొన్నాళ్ళు  వాడుకున్నాక, అంటే పార్టీకి సేవలను చేయనిచ్చాక ఇలాంటి వాళ్ళందరినీ ఢిల్లీకి పంపించేస్తుంటాయి పార్టీలు.

ఆ క్రమంలోనే జయప్రద కూడా  ఢిల్లీ వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలో కలకలం రేగడంతో భవిష్యత్తును బేరీజు వేసుకుని చంద్రబాబు వెన్నంటి ఉన్నా, ఎందుకనో అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ లోపు  ఢిల్లీ రాజకీయ పరిచయాలు కలసివచ్చి లలితా రాణి కాస్తా రాంపూర్ కి రాణి అయ్యింది. ''ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి అయితే, ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి''  అంటూ అక్కడి ఓటర్లను ఆకట్టుకుంది.

తారాజువ్వ నింగిలోకి దూసుకుపోతున్నంత సేపూ నేల గురించి ఆలోచించదు. పవరు తగ్గాక తిరిగి నేల వైపు చూస్తుంది. అలాగే ఇప్పుడు జయప్రద చూపు ఆంధ్రప్రదేశ్ పైకి మళ్ళింది. కర్మభూమి నుంచి జన్మభూమికి వస్తానని, స్వరాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని అంటోంది. ఆమె సేవలను అందుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నదీ లేనిదీ ఎన్నికలప్పుడు తేలిపోతుంది. అయితే ఆమె సేవలను ఏ పార్టీ వాడుకుంటుంది అనేది మాత్రం ఆమెకే తెలీడం లేదు. ఎందుకయినా మంచిదని నాలుగు స్టేట్మెంట్లు నాలుగు రకాలుగా వినిపించి, తన పురాగమన తేదీని కూడా ప్రకటించి రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఆఫర్ ఇచ్చారు రాణి గారు. ఇప్పుడు రాణి గారికి ప్రజాసేవ చేసే నిమిత్తం ఒక సీటు కావాలి. రాజమండ్రి అయితే మరీ మంచిది. అయితే ఈ రాలిపడే తారాజువ్వ  తమ నెత్తిన ఎక్కడ పడుతుందో అని, అన్ని పార్టీల నాయకులూ బెంబేలెత్తి పోతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి సీటును ఆశిస్తున్న వారంతా ఎలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుందో అని నీరుగారి పోతున్నారు. మిగతా సిత్రాన్ని రాష్ట్ర రాజకీయ తెరపై సూడండి.