పేజీలు

18, డిసెంబర్ 2009, శుక్రవారం

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ...

తెలంగాణా ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం తెచ్చే సంగతి తరువాత, ఇప్పటికి మాత్రం దాని మూలంగా ప్రజారాజ్యం పార్టీ పెద్ద ఇరకాటంలో పడింది. అసలే ప్రజాభిమానాన్ని ఓట్లుగా మలచుకోలేక ఎన్నికల విజయాలకు దూరమవుతోన్న ఆ పార్టీ, వలసలను ఆపలేక అవస్థలు పడుతోన్న ఆ పార్టీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీని నడపడం ఎలా అని కింద మీద అవుతున్న పార్టీ ఇప్పుడు రెండు ప్రాంతాల గొడవల మూలంగా అడకత్తెరలో పోకచెక్క అయ్యింది. కరవమంటే కప్పకు కోపం, విడువమంటే పాముకు కోపం అన్నట్టు ఉన్న పరిస్థితుల్లో నువ్వెటు అని అడిగేసరికి నారీ నారీ నడుమ మురారి అయ్యారు చిరంజీవి. రాజకీయ అనుభవం లేనందువల్ల రెండునాల్కల ధోరణి అవలంబించలేక భోలాశంకరుడు బోల్తా పడ్డాడు. ఫలితంగా పార్టీ తెలంగాణా ప్రజల విశ్వసనీయతను కోల్పోయి వారి ఆగ్రహానికి గురయ్యింది. అటు కలకలానికి కారణమైన కాంగ్రెస్ బాగానే ఉంది. ముందు మద్దతు ఇస్తామని, ఆ తర్వాత మాట మార్చిన తెలుగుదేశం బాగానే ఉంది. లోక్సత్తా , వామపక్షాలతో సహా చిన్న పార్టీలన్నీ బాగానే ఉన్నాయి. లేనిపోని కష్టాలన్నీ ప్రజారాజ్యానికే వచ్చాయి. నిజానికి గతంలో తెలంగాణాకు అనుకూలం అని చెప్పినప్పటికీ క్రిందటి సార్వత్రిక ఎన్నికలలో గాని, నిన్నటి గ్రేటర్ ఎన్నికలలో గాని తెలంగాణా ప్రజలు ఆ పార్టీకి మెజారిటీని ఇవ్వలేదు. అలాంటప్పుడు తెలంగాణా ఫై చిరంజీవిని మీ దారి ఎటు అని అడిగే నైతిక హక్కు వారికి లేదు. ఒకవేళ అడిగినా చిరంజీవి వైఖరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పే అయినా అది పార్టీకి సంబంధించిన విషయం . మధ్యలో సినిమాలు ఏం చేసాయి? ఉద్యమం పట్ల అవగాహన లేక పోవడం అంటే ఇదే. కనీసం ఒక్క టీఆరెస్ నాయకుడైనా సినిమాల జోలికి పోవద్దని తమ వాళ్లకు చెప్పాడా? ఏది ఏమైనా ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు తెలంగాణా దెబ్బ ప్రజారాజ్యానికి తగిలింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి