పేజీలు

25, డిసెంబర్ 2009, శుక్రవారం

మీడియాకు ఇది పండుగ సీజన్!

గత కొన్నాళ్లుగా మీడియా వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఏమీ లేదే అనుకునేలోపు వై .యస్. ఆకస్మిక మరణం. ఆ తర్వాత ముఖ్యమంత్రి సీటు చుట్టూ తిరిగాయి కెమెరాలు . ఇంతలో జనాన్ని ముంచిన వరదలు మీడియాకు మాత్రం వరాలే ఇచ్చాయి. మన టీవీ-9 ఛానల్ బాగా ముందుకెళ్ళి 'కదలిరండి మనుషులయితే' అంటూ రోడ్డు మీదికి వచ్చి మరీ సమాజాన్ని కదిలించే ప్రయత్నం చేసింది. వరదలు అయిపోయాయో లేదో గనులు కంపించాయి. ఇక ఇప్పుడు తెలంగాణా ఉద్యమం చానెళ్ళ కరువు తీర్చడమే కాదు ఏకంగా గోదాములే నింపి పండుగ చేసుకోమ్మంటోంది.

కొన్నాళ్ళ క్రితం తెలంగాణా కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ 'నా కొడుకు తగలబడి పోతుంటే మీడియా వాళ్ళు ఒక వేడుకను చిత్రీకరించడానికన్నట్లు కెమెరాలు గురిపెట్టారు కానీ ఒక్కరు కూడా రక్షించడానికి ముందుకు రాలేదు ' అంటూ కన్నీళ్ళ పర్యంతమైంది అతని తల్లి. అక్కడ మానవత్వాన్ని మరచి మరీ విధినిర్వహణ చేసింది మీడియా. ఆ కర్తవ్యపాలన ఫలితంగా మర్నాడు ఫుల్ పేజీలలో కనపడిన దృశ్యాలను చూసి అనేక హృదయాలు భగ్గుమన్నాయి. ఆ భగభగలను మళ్ళీ కవర్ చేసి వేడి వార్తలను మిర్చి బజ్జీల్లా అమ్మాయి , సారీ! రేపటి మెరుగైన సమాజం కోసం పంచాయి.మీడియా ఏది చేసినా రేపటి సమాజం కోసమే తప్ప ఈనాటి సమాజం కోసం కాదన్నది మనం గ్రహించాలి.

చిన్నప్పుడు భూతద్దం అంటే భూతాల్ని చూపెడుతుందేమో అని అనుకునేవాడిని. మన వార్తా చానెళ్ళు అలాంటి భూతద్ధాలే . ఇవి వచ్చాక అనేక విషయ భూతాల్ని , బోనస్ గా బూతుని కూడా పిల్లా పాపలతో కలిసి చూసే భాగ్యం మనకు కలిగింది. రోజూ ఊళ్ళో మా వాళ్ళ దగ్గరనుంచి ఫోన్లు వస్తున్నాయి. హైదరాబాద్ తగలబడి పోతుందని , ఇక్కడ ఆంధ్రోల్లని తరిమి కొడుతున్నారని వాళ్ళ టీవి భూతం చెప్పిందంట. ఎ క్షణం ఏమవుతుందో అని వాళ్ళు భయపడుతున్నారు.

విషయాన్ని గోరంతలు కొండంతలు చేయడం వరకు పర్వాలేదు. తెలంగాణా రాకపోతే నువ్వేం చేస్తావు ? సమైక్య ఆంధ్ర ప్రకటించక పొతే నువ్వేం చేస్తావు? అని ప్రశ్నిస్తుంటే 'ఏదో ఒకటి చేయి లేకపోతే కనీసం చేస్తానని చెప్పు చాలు , నిప్పు మేము రాజేస్తం , లేకపోతే మాకు రేటింగ్స్ ఎలా వస్తాయి?' అని గద్దించి అడుగుతున్నట్లు ఉంటుంది. ప్రతి ఒక్కడిని స్టూడియోకి పిలిచేసి వాడిని స్పాట్లో రెచ్చ గొట్టేసి ఏదో ఒకటి మాట్లాడించడం దాన్ని ఆజ్యం లాగ వాడుకోవడం , ఆ వచ్చిన వాడు కూడా సమాజానికి తనే ఏకైక ప్రతినిధిని అని ఊహించేసుకొని ఒర్లడం, దాన్ని మళ్ళీ భూతద్దం పెద్దదిగా చూపడం...ఇదంతా చూసి జనం భయాలకు లేదా విద్వేషాలకు గురికావడం ... అసలు ఒకప్పుడు చచ్చు , పుచ్చు మానవ సంబంధాల సీరియల్లతోనే మనం ఏమయిపోతమో అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చానెళ్ళ కన్నా ఎక్కువైపోయిన పార్టీ నగారాలు ఐ మీన్ వార్తా చానల్లు మరీ ప్రమాదకరంగా మారాయి. అయ్యా! ఉన్నది ఉన్నట్టు చూపిస్తే అది వార్తే అవుతుంది. అది చాలు. సీరియల్సు క్రియేట్ చేసి వార్తలుగా అందించకండి . ఎందుకంటే నా బోటి సామాన్యులు అవి వార్తలు అని పొరబడే ప్రమాదం ఉంది. ప్లీజ్ ! రేపటి మెరుగయిన సమాజం కోసం.

7 కామెంట్‌లు:

  1. నిజమే!!!

    న్యూస్ స్టుడియోల్లో చర్చా కార్యక్రమం పేరు తో జరిగే సంత, వీధి కుళాయిల దగ్గర కొట్టుకొనే దృశ్యం తలపింపజేస్తూ ఉంటుంది. న్యూస్ చానల్స్ వారు, ఎంత సేపు ఆ పార్టీ ప్రతినిధులు వారి వారి గొంతులు వినిపించే అవకాశం కల్పిస్తారే తప్ప, అసలు, ప్రజలేమనుకుంటున్నారో వినిపించే దిక్కు ఉండదు అక్కడ. అక్కడున్న సీనియర్ జర్నలిస్టులు(అని చెప్పుకునేవారు), వీరి ధాటికి భయపడి నోరెత్తరు.

    ఇక, అసెంబ్లీ ముందు యునివర్సిటీ ల ముందు జరిగే భాగోతం భీభత్సంగా చూపించేస్తూ ఉంటారు. కెమెరా ముందు రాగానే ప్రతొక్కడు హీరోలా ఫీల్ అవుతు, సమాజోద్ధరణ కార్యాన్ని, భారాన్ని తనొక్కడే మోస్తున్నట్లు ఖబడ్దార్ అంటూ హుంకరింపులొకటి..

    అసలు జరుగుతున్న నష్టం కన్నా, మీడియా చేస్తున్న ప్రచారం వల్ల రగులుతున్న రావణ కాష్టమే ఎక్కువగా ఉంది. మూకుమ్మడి గా ఈ చానల్స్ అన్నిటిని బాన్ చేసి పారెయ్యాలి, ఈ గొడవలు సద్దు మణిగే దాకా..

    అసలు టి.వి చానల్స్ కి సమాజం పట్ల బాధ్యత ఏమయినా ఉందా అన్న అనుమానం వస్తోంది. సినిమాలకి సెన్సార్ బోర్డ్ ఉన్నట్టు టి.వి. చానల్స్ కు కూడా నియంత్రణా యంత్రాంగం ఉండాలి.

    SN

    రిప్లయితొలగించండి
  2. 'ఏదో ఒకటి చేయి లేకపోతే కనీసం చేస్తానని చెప్పు చాలు , నిప్పు మేము రాజేస్తం , లేకపోతే మాకు రేటింగ్స్ ఎలా వస్తాయి?

    Loved it.

    రిప్లయితొలగించండి
  3. Well written reflecting the feelings of many. Present media is thinking that they are Almighty (Irwing Wallace fame). Instead of reporting news, they are striving to create news and sell it.

    What we are seeing is not media, especially electronic media, which is an extreme example of commercialisation of news.

    We have been lamenting about commercialisation of Education, Art etc. But most dangerous to society is commercialisation of news.

    రిప్లయితొలగించండి