పేజీలు

23, డిసెంబర్ 2009, బుధవారం

చదవండి! చదివించండి!!

హైదరాబాదులోని నెక్లస్ రోడ్లో ఇరవై నాల్గవ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. మొన్న ఆదివారం భార్యాపిల్లలతో వెళ్ళాను. ప్రతిసంవత్సరం తప్పనిసరిగా వెళ్తాం మేము.
బుక్ ఫెయిర్ అనగానే మా పెద్దాడు ఎగిరి గంతేశాడు. ఆశ్చర్యం వేసింది నాకు. ఐదవ తరగతి చదివే మా వాడికి అసలు పుస్తకాలు చదివే అలవాటు లేదు. గతంలో ఎన్నో సార్లు వాడిని ఇలాంటి ప్రదర్శనలకు తీసుకువెళ్ళి మంచి మంచి పుస్తకాలు కొనేవాడిని. ఇంటికి తెచ్చాక వాటిని ఓ మూలన పడేసేవాడు. అసలు పుస్తకం కొనాలన్నఆలోచనగాని , చదవాలన్న ఆసక్తిగాని వాడికి ఉండేది కాదు. అందుకు కారణం టీవి అన్న విషయం వేరే చెప్పక్కర లేదు. వాడికి చదవటం అన్న అలవాటును ఎలా కలిగించాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అలాంటిది ఈరోజు బుక్ ఫెయిర్ అనగానే సంతోషంగా మాతో రావడం నాకూ సంతోషం అనిపించింది. అక్కడికి వెళ్ళాక తనే కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకుని కొనుక్కున్నాడు. వాటిల్లో క్విజ్ కు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వీడిని చూసి చిన్నోడు కూడా పుస్తకం కావాలని మారాం చేసాడు. మూడేళ్ళ మా చిన్నోడికి అక్షరమాల పుస్తకాలు కొనిచ్చాం . వాడు అక్కడే ఒక కుర్చీలో కూర్చుని ఆ పుస్తకాలను తిరగేస్తుంటే రెండు మూడు కెమెరాలు , బహుశా టీవి చానెళ్ళ వారివి అయివుంటాయి, వాడిని చుట్టుముట్టి కవర్ చేసాయి. మొత్తం మీద మా పెద్దాడు పుస్తకం కోనేంత వరకు రావడం నాకు ఆనందాన్నిచ్చింది. ఇక చదవడం అంటారా! అది కూడా నెమ్మదిగా అలవాటవుతుంది .

ఈ మాత్రం దానికి అంత సంతోష పడిపోవాలా? అని అనుకునే వారు ఉండొచ్చు. మనం వేలకు వేలు తగలేసి స్కూళ్ళల్లో చేరుస్తాం. పరీక్షలకు ముందు శెలవులు పెట్టి మరీ వాళ్ళ వెంటపడి బట్టీ పట్టిస్తం. మార్కులు చూసుకుని మురిసి పోతాం. కాని పెద్దయ్యాక వాడు వ్యక్తిత్వం లేని వాడుగా, తనకెదురైన సమస్యలను పరిష్కరించుకోలేని అసమర్దుడిగా, సమర్థత ఉండీ నిరూపించుకోలేని స్థితిలో , కౌన్సేల్లింగ్ క్లాసులకు వెళ్తుంటాడు. ప్రత్యేక వాదం , మతవాదం , మూఢ నమ్మకం ... ఇలాంటి ఉన్మాదాల ప్రభావాలకి లోనై ఆందోళనలు చేస్తుంటాడు. ఎవడో వస్తే , ఏదో తెస్తే తనకు మంచి జరుగుతుందని నమ్ముతుంటాడు.

ఇలాంటి దౌర్బల్యాలకు మనిషిని దూరం చేసి తన మీద తనకు నమ్మకాన్ని పెంచేది పుస్తక జ్ఞానం. ఎన్ని పుస్తకాలు చదివితే అంత వికసిస్తుంది మనసు. అందుకని చదవండి! చదివించండి!! ముందు పుస్తక ప్రదర్శనలకి రండి!

1 కామెంట్‌: