పేజీలు

31, డిసెంబర్ 2009, గురువారం

కొత్త సంవత్సరం - కొత్త రాష్ట్రం

కొత్త సంవత్సరం వస్తోంది కొత్త రాష్ట్రపు హామీతో...

ఇంకేం! కొత్త రాష్ట్రం వస్తే అంతా శుభమే. ప్రతి ఇంటి గుమ్మం ముందూ పాల ప్యాకెట్ లాగ ప్రతి రోజూ ఉద్యోగాలకు రమ్మంటూ అప్పాయింట్ మెంట్ ఆర్డర్లు వచ్చి పడతాయి. చదువుతో సంబంధం లేదు. అర్హతలు అసలు చూడరు. నువ్వు కొత్త రాష్ట్రానికి చెందిన వాడవా కాదా అన్నది నిరూపిస్తే చాలు. ఇళ్ళ స్థలాలు గాని , ఇళ్ళు గాని నానో కారు కంటే కారు చవక అయిపోతాయి . రైతులకు కావలసినంత ఉచిత విద్యుత్ , కావలిసినన్ని నీళ్ళు .

హీరోలకు మా యాస ఎందుకు పెట్టరు? అని ఒక పెద్దాయన సినిమా వోళ్ళని నిలదీశాడు. ఆయన కోరిక ప్రకారమే సినిమా మొత్తాన్నీ అదే యాసలో తీస్తారు. బతుకమ్మ పండక్కి రిలీజయిన ఆ సినిమాలో పాటలు కూడా అదే యాసలో ఉంటాయి.
''బంగారి కోడి పెట్ట అచ్చెనండి
పోరి ఏ పోరి ఏ పోరి
చెంగావి సీరె కట్టు సూసుకొండ్రి
ఏ పోరి ఏ పోరి ఏ పోరి ...''
ఇలాంటి పాటలు గల్లి గల్లీలో చెవులు చిల్లులు పడేంత సౌండ్ తో వినపడుతుంటాయి.
(మజాక్ల అన్న భాయ్! మాఫ్ సేయండ్రి. )
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

25, డిసెంబర్ 2009, శుక్రవారం

మీడియాకు ఇది పండుగ సీజన్!

గత కొన్నాళ్లుగా మీడియా వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఏమీ లేదే అనుకునేలోపు వై .యస్. ఆకస్మిక మరణం. ఆ తర్వాత ముఖ్యమంత్రి సీటు చుట్టూ తిరిగాయి కెమెరాలు . ఇంతలో జనాన్ని ముంచిన వరదలు మీడియాకు మాత్రం వరాలే ఇచ్చాయి. మన టీవీ-9 ఛానల్ బాగా ముందుకెళ్ళి 'కదలిరండి మనుషులయితే' అంటూ రోడ్డు మీదికి వచ్చి మరీ సమాజాన్ని కదిలించే ప్రయత్నం చేసింది. వరదలు అయిపోయాయో లేదో గనులు కంపించాయి. ఇక ఇప్పుడు తెలంగాణా ఉద్యమం చానెళ్ళ కరువు తీర్చడమే కాదు ఏకంగా గోదాములే నింపి పండుగ చేసుకోమ్మంటోంది.

కొన్నాళ్ళ క్రితం తెలంగాణా కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ 'నా కొడుకు తగలబడి పోతుంటే మీడియా వాళ్ళు ఒక వేడుకను చిత్రీకరించడానికన్నట్లు కెమెరాలు గురిపెట్టారు కానీ ఒక్కరు కూడా రక్షించడానికి ముందుకు రాలేదు ' అంటూ కన్నీళ్ళ పర్యంతమైంది అతని తల్లి. అక్కడ మానవత్వాన్ని మరచి మరీ విధినిర్వహణ చేసింది మీడియా. ఆ కర్తవ్యపాలన ఫలితంగా మర్నాడు ఫుల్ పేజీలలో కనపడిన దృశ్యాలను చూసి అనేక హృదయాలు భగ్గుమన్నాయి. ఆ భగభగలను మళ్ళీ కవర్ చేసి వేడి వార్తలను మిర్చి బజ్జీల్లా అమ్మాయి , సారీ! రేపటి మెరుగైన సమాజం కోసం పంచాయి.మీడియా ఏది చేసినా రేపటి సమాజం కోసమే తప్ప ఈనాటి సమాజం కోసం కాదన్నది మనం గ్రహించాలి.

చిన్నప్పుడు భూతద్దం అంటే భూతాల్ని చూపెడుతుందేమో అని అనుకునేవాడిని. మన వార్తా చానెళ్ళు అలాంటి భూతద్ధాలే . ఇవి వచ్చాక అనేక విషయ భూతాల్ని , బోనస్ గా బూతుని కూడా పిల్లా పాపలతో కలిసి చూసే భాగ్యం మనకు కలిగింది. రోజూ ఊళ్ళో మా వాళ్ళ దగ్గరనుంచి ఫోన్లు వస్తున్నాయి. హైదరాబాద్ తగలబడి పోతుందని , ఇక్కడ ఆంధ్రోల్లని తరిమి కొడుతున్నారని వాళ్ళ టీవి భూతం చెప్పిందంట. ఎ క్షణం ఏమవుతుందో అని వాళ్ళు భయపడుతున్నారు.

విషయాన్ని గోరంతలు కొండంతలు చేయడం వరకు పర్వాలేదు. తెలంగాణా రాకపోతే నువ్వేం చేస్తావు ? సమైక్య ఆంధ్ర ప్రకటించక పొతే నువ్వేం చేస్తావు? అని ప్రశ్నిస్తుంటే 'ఏదో ఒకటి చేయి లేకపోతే కనీసం చేస్తానని చెప్పు చాలు , నిప్పు మేము రాజేస్తం , లేకపోతే మాకు రేటింగ్స్ ఎలా వస్తాయి?' అని గద్దించి అడుగుతున్నట్లు ఉంటుంది. ప్రతి ఒక్కడిని స్టూడియోకి పిలిచేసి వాడిని స్పాట్లో రెచ్చ గొట్టేసి ఏదో ఒకటి మాట్లాడించడం దాన్ని ఆజ్యం లాగ వాడుకోవడం , ఆ వచ్చిన వాడు కూడా సమాజానికి తనే ఏకైక ప్రతినిధిని అని ఊహించేసుకొని ఒర్లడం, దాన్ని మళ్ళీ భూతద్దం పెద్దదిగా చూపడం...ఇదంతా చూసి జనం భయాలకు లేదా విద్వేషాలకు గురికావడం ... అసలు ఒకప్పుడు చచ్చు , పుచ్చు మానవ సంబంధాల సీరియల్లతోనే మనం ఏమయిపోతమో అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చానెళ్ళ కన్నా ఎక్కువైపోయిన పార్టీ నగారాలు ఐ మీన్ వార్తా చానల్లు మరీ ప్రమాదకరంగా మారాయి. అయ్యా! ఉన్నది ఉన్నట్టు చూపిస్తే అది వార్తే అవుతుంది. అది చాలు. సీరియల్సు క్రియేట్ చేసి వార్తలుగా అందించకండి . ఎందుకంటే నా బోటి సామాన్యులు అవి వార్తలు అని పొరబడే ప్రమాదం ఉంది. ప్లీజ్ ! రేపటి మెరుగయిన సమాజం కోసం.

23, డిసెంబర్ 2009, బుధవారం

మాధురీ దీక్షిత్


ఐశ్వర్యా రాయ్


చదవండి! చదివించండి!!

హైదరాబాదులోని నెక్లస్ రోడ్లో ఇరవై నాల్గవ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. మొన్న ఆదివారం భార్యాపిల్లలతో వెళ్ళాను. ప్రతిసంవత్సరం తప్పనిసరిగా వెళ్తాం మేము.
బుక్ ఫెయిర్ అనగానే మా పెద్దాడు ఎగిరి గంతేశాడు. ఆశ్చర్యం వేసింది నాకు. ఐదవ తరగతి చదివే మా వాడికి అసలు పుస్తకాలు చదివే అలవాటు లేదు. గతంలో ఎన్నో సార్లు వాడిని ఇలాంటి ప్రదర్శనలకు తీసుకువెళ్ళి మంచి మంచి పుస్తకాలు కొనేవాడిని. ఇంటికి తెచ్చాక వాటిని ఓ మూలన పడేసేవాడు. అసలు పుస్తకం కొనాలన్నఆలోచనగాని , చదవాలన్న ఆసక్తిగాని వాడికి ఉండేది కాదు. అందుకు కారణం టీవి అన్న విషయం వేరే చెప్పక్కర లేదు. వాడికి చదవటం అన్న అలవాటును ఎలా కలిగించాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అలాంటిది ఈరోజు బుక్ ఫెయిర్ అనగానే సంతోషంగా మాతో రావడం నాకూ సంతోషం అనిపించింది. అక్కడికి వెళ్ళాక తనే కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకుని కొనుక్కున్నాడు. వాటిల్లో క్విజ్ కు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వీడిని చూసి చిన్నోడు కూడా పుస్తకం కావాలని మారాం చేసాడు. మూడేళ్ళ మా చిన్నోడికి అక్షరమాల పుస్తకాలు కొనిచ్చాం . వాడు అక్కడే ఒక కుర్చీలో కూర్చుని ఆ పుస్తకాలను తిరగేస్తుంటే రెండు మూడు కెమెరాలు , బహుశా టీవి చానెళ్ళ వారివి అయివుంటాయి, వాడిని చుట్టుముట్టి కవర్ చేసాయి. మొత్తం మీద మా పెద్దాడు పుస్తకం కోనేంత వరకు రావడం నాకు ఆనందాన్నిచ్చింది. ఇక చదవడం అంటారా! అది కూడా నెమ్మదిగా అలవాటవుతుంది .

ఈ మాత్రం దానికి అంత సంతోష పడిపోవాలా? అని అనుకునే వారు ఉండొచ్చు. మనం వేలకు వేలు తగలేసి స్కూళ్ళల్లో చేరుస్తాం. పరీక్షలకు ముందు శెలవులు పెట్టి మరీ వాళ్ళ వెంటపడి బట్టీ పట్టిస్తం. మార్కులు చూసుకుని మురిసి పోతాం. కాని పెద్దయ్యాక వాడు వ్యక్తిత్వం లేని వాడుగా, తనకెదురైన సమస్యలను పరిష్కరించుకోలేని అసమర్దుడిగా, సమర్థత ఉండీ నిరూపించుకోలేని స్థితిలో , కౌన్సేల్లింగ్ క్లాసులకు వెళ్తుంటాడు. ప్రత్యేక వాదం , మతవాదం , మూఢ నమ్మకం ... ఇలాంటి ఉన్మాదాల ప్రభావాలకి లోనై ఆందోళనలు చేస్తుంటాడు. ఎవడో వస్తే , ఏదో తెస్తే తనకు మంచి జరుగుతుందని నమ్ముతుంటాడు.

ఇలాంటి దౌర్బల్యాలకు మనిషిని దూరం చేసి తన మీద తనకు నమ్మకాన్ని పెంచేది పుస్తక జ్ఞానం. ఎన్ని పుస్తకాలు చదివితే అంత వికసిస్తుంది మనసు. అందుకని చదవండి! చదివించండి!! ముందు పుస్తక ప్రదర్శనలకి రండి!

18, డిసెంబర్ 2009, శుక్రవారం

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ...

తెలంగాణా ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం తెచ్చే సంగతి తరువాత, ఇప్పటికి మాత్రం దాని మూలంగా ప్రజారాజ్యం పార్టీ పెద్ద ఇరకాటంలో పడింది. అసలే ప్రజాభిమానాన్ని ఓట్లుగా మలచుకోలేక ఎన్నికల విజయాలకు దూరమవుతోన్న ఆ పార్టీ, వలసలను ఆపలేక అవస్థలు పడుతోన్న ఆ పార్టీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీని నడపడం ఎలా అని కింద మీద అవుతున్న పార్టీ ఇప్పుడు రెండు ప్రాంతాల గొడవల మూలంగా అడకత్తెరలో పోకచెక్క అయ్యింది. కరవమంటే కప్పకు కోపం, విడువమంటే పాముకు కోపం అన్నట్టు ఉన్న పరిస్థితుల్లో నువ్వెటు అని అడిగేసరికి నారీ నారీ నడుమ మురారి అయ్యారు చిరంజీవి. రాజకీయ అనుభవం లేనందువల్ల రెండునాల్కల ధోరణి అవలంబించలేక భోలాశంకరుడు బోల్తా పడ్డాడు. ఫలితంగా పార్టీ తెలంగాణా ప్రజల విశ్వసనీయతను కోల్పోయి వారి ఆగ్రహానికి గురయ్యింది. అటు కలకలానికి కారణమైన కాంగ్రెస్ బాగానే ఉంది. ముందు మద్దతు ఇస్తామని, ఆ తర్వాత మాట మార్చిన తెలుగుదేశం బాగానే ఉంది. లోక్సత్తా , వామపక్షాలతో సహా చిన్న పార్టీలన్నీ బాగానే ఉన్నాయి. లేనిపోని కష్టాలన్నీ ప్రజారాజ్యానికే వచ్చాయి. నిజానికి గతంలో తెలంగాణాకు అనుకూలం అని చెప్పినప్పటికీ క్రిందటి సార్వత్రిక ఎన్నికలలో గాని, నిన్నటి గ్రేటర్ ఎన్నికలలో గాని తెలంగాణా ప్రజలు ఆ పార్టీకి మెజారిటీని ఇవ్వలేదు. అలాంటప్పుడు తెలంగాణా ఫై చిరంజీవిని మీ దారి ఎటు అని అడిగే నైతిక హక్కు వారికి లేదు. ఒకవేళ అడిగినా చిరంజీవి వైఖరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పే అయినా అది పార్టీకి సంబంధించిన విషయం . మధ్యలో సినిమాలు ఏం చేసాయి? ఉద్యమం పట్ల అవగాహన లేక పోవడం అంటే ఇదే. కనీసం ఒక్క టీఆరెస్ నాయకుడైనా సినిమాల జోలికి పోవద్దని తమ వాళ్లకు చెప్పాడా? ఏది ఏమైనా ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు తెలంగాణా దెబ్బ ప్రజారాజ్యానికి తగిలింది.

17, డిసెంబర్ 2009, గురువారం

కలసి ఉంటే కలదు సుఖం

తెలుగు నేల ఎవడయ్య జాగీరు పంచమని అడిగేటందుకు? తల్లి గుండెను చీల్చి రొమ్ములు పంచుకుంటే వస్తయా పాలు? తెలంగాణా కోసం సచ్చిన తమ్ముళ్ళకు కేసిఆర్ తన ఆస్తిని పంచుతడ అడుగు? దోచుకోనేడిది గీ దొరలే తమ్మి, ఆంధ్రోడు కాదు. కొడుకులు దారి తప్పిస్తండ్రు జర పయిలం తమ్మి . మోసపోకు ఆళ్ళ మాటలు నమ్మి. కలసి ఉంటేనే కలదు సుఖం తమ్మి. ఆస్తులున్నోల్ల లొల్లి గీ తెలంగాణా ఉద్యమం. కష్టపడి బతికేటందుకు ప్రత్యేక రాష్ట్రము ఎందుకు తమ్మి, గింత పెద్ద లోకమే ఉన్నది. యాస వేరయినా మన భాష , భావం, బాధ ఒక్కటే తమ్మి.

16, డిసెంబర్ 2009, బుధవారం

అమ్మమ్మ ఊరు


ప్రేమంటే..!











ఓ పువ్వు రాలింది











బంధం
















5, డిసెంబర్ 2009, శనివారం