పేజీలు

22, మే 2019, బుధవారం

శ్రావణి, సారా, లహరి, పూజ ... ఎవరీ అమ్మాయిలు?

 
మజిలీ, చిత్రలహరి, జెర్సీ, మహర్షి... ఇవి ఈ మధ్య తెలుగులో విజయవంతమైన చలనచిత్రాలు. మహర్షి సినిమా 'విజయం' గురించి మాట్లాడితే... మిగిలిన  సినిమాలు 'ఓటమి'ని అధిగమించడం లేదా ఓటమి బాధ నుండి బయటపడటం గురించి మాట్లాడాయి. ఈ రోజుల్లో యూత్ ని ఆకట్టుకుంటేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అలాంటిది ఈ సినిమాల్లో యూత్ ని అంతగా ఆకట్టుకున్న అంశాలు ఏమున్నాయి అంటే... అవే!... గెలుపు ఓటములు.
 
అవును! నేటి యువత నిత్యం గెలుపు కోసం పోరాడుతోంది. ఇటు సమాజం కానీ.. అటు ప్రభుత్వం కానీ, రాజకీయాలు కానీ యువతను పట్టించుకోవట్లేదు. మారిన సామాజిక పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీ నేపథ్యంలో కేవలం బతకడం మాత్రమే కాదు... 'అంతకు మించి' కోరుకుంటోంది యువత. అందుకోసం తమ ఉనికిని చాటుకోడానికి, కాపాడుకోడానికి సర్వశక్తులు ఒడ్డి నిత్యం పోరాడాల్సివస్తోంది. ఇందులో ఓడిపోతున్న వారే ఎక్కువ. అందుకే మజిలీ, చిత్రలహరి, జెర్సీ చిత్రాల్లో జీవితంలోనూ, కెరీర్ లోనూ ఓడిపోయిన హీరోల్లో తమను తాము చూసుకున్నారు. ఇక మహర్షి సినిమాలో రిషిలో తమ భవిష్యత్తును చూసుకున్నారు. ఈ సినిమాలు విజయవంతం కావడానికి ఇదే కారణం. 

కానీ మన టాపిక్ అది కాదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని నానుడి. అంటే అతని విజయానికి కారణం ఆమె సహకారం అని అర్థం. అదేం కాదు.. అమ్మాయిలెప్పుడూ విజేతలైన మగాళ్ల వెనుకే పడతారు కాబట్టి ఆ సామెత వచ్చిందని జోకులు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఈ నాలుగు సినిమాల్లోని మగాళ్ల వెనుక ఉన్న ఆడవాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 

మజిలీ:


ఇందులో పూర్ణ జీవితంలో అన్షు, శ్రావణి (ఈ పాత్రను సమంత అద్భుతంగా పోషించింది) అనే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఏ మగాడి జీవితంలో అయినా తొలిప్రేమలో అన్షులాంటి అమ్మాయి ఒకరు ఉండటం కామన్. ఆ ప్రేమ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఈ రోజుల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అసలు నేటి యువతకు ప్రేమలో ఆవేశాన్ని తప్ప ఆనందాన్ని వెదుక్కునే సమయం దొరకడంలేదు. అలాంటిది ఇక్కడ పూర్ణ మాత్రం దాన్నొక కారణంగా చూపించుకుంటూ బాధ్యతా రాహిత్యంగా తిరుగుతుంటాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది శ్రావణి గురించి. భర్త ఏదైనా సాధించాలి అని తపిస్తున్నప్పుడు తాను సహకరించడం, బాధ్యత తీసుకోవడం కరెక్టే గానీ.. ఆ భర్త పనీపాటా లేకుండా తిరుగుతుంటే... ప్రేమ అన్న మాటకు, అది కూడా వన్ సైడ్ లవ్ కి... ఈరోజుల్లో అమ్మాయిలెవరైనా శ్రావణిలా కట్టుబడి ఉంటారా? అని అడిగితే సందేహమే సమాధానం. ప్రేమ పేరున అబ్బాయిలతో విచ్చలవిడిగా ఖర్చు చేయించే గడుసు అమ్మాయిలు ఉన్న ఈరోజుల్లో ఏమాత్రం సంపాదన లేని ఒకతని కోసం ఒకమ్మాయి కష్టాల్లో బతకడానికి సిద్ధపడుతుందా అన్నది నమ్మశక్యం కాదు.     
'పేదవేళ జూడు పెండ్లాము గుణమును...' అన్నాడు వేమన.  

గడనగల మగనిఁజూచిన
నడుగగడుగున మడుఁగులిడుదు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
అంటే...  స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు అన్నాడు సుమతీ శతకకారుడు. ఇది శతాబ్దాల క్రితమే...   స్త్రీలు మగాడి సంపాదన మీద ఆధారపడి వున్న రోజుల్లోనే చెప్పిన మాట. అలాంటిది తనకు తాను సంపాదించుకుంటూ ప్రతి స్త్రీ ఆర్థిక స్వతంత్రతను పొందిన ఈ రోజుల్లో సంపాదన లేని మగాడిని గౌరవించే స్త్రీ ఉంటుందనుకోవడం సినిమాటిక్.. అంతే!    

తాను ఇష్టపడ్డ మగాడి కోసం ఎంతకైనా తెగించే అమ్మాయిలను ప్రతిరోజూ పేపర్లలో చూడట్లేదా అంటే... నిజమే..  కానీ ఆ తెగింపు నచ్చిన వాడితో సుఖపడేందుకు చేస్తున్నారు తప్పితే, కష్టపడేందుకు కాదు. అందుకే శ్రావణి పాత్ర ఈరోజుల్లో ఒక ఊహా. ఆ ఊహే నిజమై, ప్రతి మగాడి వెనుక ఒక శ్రావణి ఉంటే ప్రతి మగాడు విజేతే. ప్రతి ఇల్లు స్వర్గసీమే. 

జెర్సీ: 

క్రికెటర్ గా అర్జున్ ని అభిమానించిన సారా (ఎంతో బరువైన ఈ పాత్రను శ్రద్ధా శ్రీనాథ్ పోషించి మెప్పించింది) అతన్ని ప్రేమించి, తండ్రిని ఎదిరించి మరీ పెళ్లిచేసుకుంది. కానీ అర్జున్ కొన్ని కారణాల వల్ల క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తాడు. చేయని నేరానికి అతని ఉద్యోగం కూడా పోయింది. అర్జున్ లో సారా ఏవి చూసి ఇష్టపడిందో అవిప్పుడు లేవు. క్రికెట్ స్టార్ ఇమేజి లేదు, తనను మురిపించిన చిలిపితనం లేదు, డబ్బు లేదు, సంతోషం లేదు. పెళ్లిచేసుకుంది కాబట్టి కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం ఇష్టం లేకున్నా ఉద్యోగం చేస్తోంది. ఒక అసంతృప్తికరమైన జీవితం అనుభవిస్తోన్న సారా మనస్తత్వాన్ని చాలా సహజంగా, వాస్తవికతకు దగ్గరగా చూపించారు. అర్జున్ లోని క్రికెటర్ ని చూసిందే తప్ప అతనిలోని నిజాయితీని చూడలేదు సారా. అందుకే లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోమంది. నీ ఉద్యోగం వస్తే నేను ఉద్యోగం మానేస్తాను అంది. అంటే సంపాదన నీ పనే కానీ నాది కాదు అని భావం. మజిలీలో శ్రావణికి, జెర్సీలో సారా పూర్తి భిన్నం. మొగుడి నుంచి సుఖాన్ని మాత్రమే  కోరుకున్న సారా అవి తనకు దక్కకపోయేసరికి అతన్ని అర్థం చేసుకోవడం అనవసరం అనుకుంది. డబ్బు లేదు కాబట్టి సంసారంలో సుఖం కూడా లేదనుకుంది. నేటి సగటు మహిళ మనస్తత్వానికి అచ్చమైన పాత్ర సారా. భార్య ఇలాంటిది అయినప్పుడు మగాడు సాధించడం, గెలవడం అనే పెద్ద పెద్ద మాటలు పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించి, నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఉత్తమం. ఇలాంటి సంసారాల్లో ముందు జాగ్రత్త, పొదుపు అనేవి చాలా అవసరం. 

చిత్రలహరి : 

విజయ్ కి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ, ఆ లక్ష్యం కోసం ఎంత ప్రయత్నించినా ఫెయిల్యూరే. అలాంటి లూజర్ కి లహరి (కళ్యాణి ప్రియదర్శిని) అనే అమ్మాయి ప్రేమ దక్కడం నిజంగా విజయమే. కానీ ఆ లహరి కేవలం తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆలోచించడం విజయ్ కి మరో ఫెయిల్యూర్. తనవైపు నుంచే ఆలోచించడం, తాను అనుకున్నట్టే  భాగస్వామి ఉండాలనుకోవడం ప్రేమ కాదు స్వార్థం. ఈ లహరి పాత్ర పెళ్ళయ్యాక జెర్సీ సినిమాలోని సారా అవుతుంది. మగాడు 'ఐ లవ్యూ' అని చెబితే ఇక అతను ఎప్పుడూ తనకు అనుకూలంగా నడుచుకోవాలి. తన కోసమే బతకాలి. తన సుఖం కోసం కష్టపడాలి అనుకునే అమ్మాయిలలోని సహజ స్వార్థం ఈ లహరిలో కూడా ఉంది. ప్రేమ పెళ్ళి చేసుకుని ఐదేళ్ళు తిరక్కుండా విడాకుల వరకు వెళ్ళేది లేదా మా ఆయన మారిపోయాడంటూ మరో వ్యక్తికి దగ్గరయ్యేది ఇలాంటి వాళ్ళే. వీళ్ళకు మొగుడి లక్ష్యాలతో పనిలేదు.

మహర్షి: 

నిజం చెప్పాలంటే...  ప్రేమించినన్నాల్లూ ప్రేమించి పెళ్ళి అనగానే మొహం చాటేసే రిషి పాత్రలోని విలనిజాన్ని, స్వార్థాన్ని మహర్షి సినిమా చూసిన ప్రేక్షలెవరూ గుర్తించలేదు. ప్రేక్షకుడిలో ఈ ఆలోచన వచ్చీ రాకముందే అంతకంటే ముఖ్యమైన మరో ఎమోషన్ సీన్ లోకి లాక్కెళ్ళిపోయాడు దర్శకుడు. ఈరోజుల్లో రిషిలాంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళ దృష్టిలో ప్రేమ కొంతకాలం వరకే. టైం పాస్ కొరకే. జీవితాంతం వరకు కాదు. అలాగే రిషిని ప్రేమించిన పూజ కూడా అతని  సక్సెస్ నే ప్రేమించింది. కనీసం అతని అభిప్రాయం కూడా తెలుసుకోకుండా.. అలాంటి సక్సెస్ ఫుల్ పర్సన్ ని పెళ్ళిచేసుకుని పెరట్లో  కట్టేసుకుందామనుకుంది. ఆమె స్వార్థం ఆమె చూసుకుంటే, అతని స్వార్థం అతను చూసుకున్నాడు. ఆ తర్వాత ఎవరికీ ఏదీ కానట్టు, ఎవరి జీవితం వారు చూసుకున్నారు. ఇది నేటి సమాజం తీరును ప్రతిబింబిస్తోంది. రిషి చేసింది కరెక్ట్. విజయం సాధించాలంటే   పూజలాంటి అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి.                      

ముగింపు: శ్రావణి, సారా, లహరి, పూజ... ఈ నలుగురిలో ఏ ఒక్కరిలాగో అమ్మాయిలు ఉండకూడదు. పెళ్ళికాక ముందు లహరిలా ఉండాలి. ప్రేయసిగా ఆ స్వార్థం ముద్దుగానే ఉంటుంది. పెళ్ళవుతూనే శ్రావణిలా మారిపోవాలి. ఇది కుటుంబ అభివృద్ధికి తోడ్పతుంది. పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగాక సారా పాత్రలోకి వెళ్ళిపోవాలి. పూజలా ఎప్పుడూ ఉండకూడదు. ఏమంటారు?      

                               

2 కామెంట్‌లు:

  1. పెళ్ళికాక ముందు లహరిలా ఉండాలి, పెళ్ళవుతూనే శ్రావణిలా మారిపోవాలి, పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగాక సారా పాత్రలోకి వెళ్ళిపోవాలి. పూజలా ఎప్పుడూ ఉండకూడదు.

    తనవైపు నుంచే ఆలోచించడం, తాను అనుకున్నట్టే భాగస్వామి ఉండాలనుకోవడం ప్రేమ కాదు స్వార్థం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. // "తనవైపు నుంచే ఆలోచించడం, తాను అనుకున్నట్టే భాగస్వామి ఉండాలనుకోవడం ప్రేమ కాదు స్వార్థం" //

      ఇది ఇరుపక్షాలకూ వర్తిస్తుంది కదా.‌

      తొలగించండి