పేజీలు

2, మే 2020, శనివారం

ఓ మనిషీ... నీ గుండెను తడిమి చూడు!


కొత్త కొత్త ఆవిష్కరణల కోసం 
కొత్త కొత్త అనుభవాల కోసం
సంపాదన కోసం , సంసారం కోసం    
మనసును మత్తెక్కించే క్షణాల కోసం...

తూటా వేగంతో పరుగులు పెడుతున్న నన్ను 
ఆపిన వింత ఆకారాన్ని చూసి అలవాటుగా 
'హలో' అంటూ చేయి కలపబోయాను. 
అది మాత్రం చేతులు జోడించి 
'నమస్కారం' అని సంస్కారం నేర్పింది 
అది దొర్లుకుంటూ ఆలా వెళ్ళిపోతుంటే 
దాని ముందు భూగోళమే చిన్నదైపోయింది

కంటికి కనిపించని మాయలాంటి 'అది' 
వామనుడంత విశ్వరూపమై 
నా అహం మీద మూడో అడుగు పెట్టింది
నా చుట్టూ, నా ఇంటి గోడలనే కాపలా పెట్టి 
నన్ను బందీని చేసింది 

నేను ఇప్పుడే సరిగా ఆలోచిస్తున్నాను 
సాటిమనిషి ఇన్నాళ్ళూ నాకు ఏమిచ్చాడో తెలుస్తోంది 
నా కుటుంబానికి నేనేమిచ్చానో తెలుస్తోంది 
ఖాకీ కరకుదనం, తెల్లకోటు దర్పం మాటున 
కనిపించని వృత్తి'ధర్మం' తెలిసొస్తోంది
మంచుతో కడిగినట్టు ప్రకృతి మలినం 
లేకుండా స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది 

ఇదే సమయంలో...  
సొంతూరు బాటలో నడిచీ నడిచీ 
ప్రాణాలొదిలిన ఓ చిట్టితల్లి..
సమాజానికి, కరోనాకు పరీక్షపెట్టి 
కరుణకలిగిన వారెవ్వరని ప్రశ్నించింది. 
పళ్ళెం, గరిట పట్టుకుని ఓ పేదరాలు  
గణగణ మంటే దేశభక్తి అని మురిసిపోయా. 
'నా ఆకలి సంగతేంటి' అని ప్రశ్నిస్తోందని 
ఆలస్యంగా అర్థమైంది 

కరోనాకు నువ్వింకా భయపడుతున్నావా? 
అది నీకు ఏది ముఖ్యమో చెప్పేందుకు వచ్చింది
మానవత్వం అన్న ఒక్క ముక్కను చేతబట్టి 
దేశాలను, నగరాలను, ఇంటింటినీ తట్టి 
చిరునామా అడుగుతోంది

మానవత్వపు జాడ ఉందేమో! 
ఓ మనిషీ... నీ గుండెను తడిమి చూడు!   

2 కామెంట్‌లు: